పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

December 28, 2009

బ్లాగు పుస్తకంలో నెమలీక--అభినందన మందారమాల

"నా అక్షరాలు ప్రజా శక్తులవహించే విజయ ఐరావతాలు కాదు..వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలూ కాదు"

వెన్నెల్లో ఆడుకొనే ఆడపిల్లలే అందంగా ఉంటారా? తనమానాన తన పని చేసుకొని వెళ్ళే ఆడపిల్లలు అంతకంటే అందంగా ఉంటారు..........

అయినా ఇవంటే నాకు ఇష్టం.. ఎందుకంటే ఇవి 'నా' అక్షరాలు కాబట్టి. ....

ఎవరి అక్షరాలంటే వాళ్లకి ఇష్టమే.....కానీ మన అక్షరాలని ఇష్టపడే పాఠకులు ఎంతమంది ఉంటారు?

నెమలీక అంటే ఇష్టపడని పిల్లలు ఉంటారా?  అలానే నెమలికన్నుని ఇష్టపడని తెలుగు బ్లాగర్లు ఉంటారా?

చడీ చప్పుడు కాకుండా 2009 జనవరిలో బ్లాగు వ్రాయటం మొదలుపెట్టి....ఇంతింతై.......వటుడింతై అన్నట్టు  అలవోకగా ద్విశత టపాలు పూర్తి చేసుకున్న నెమలికన్ను బ్లాగు గురించి నేను చెప్పబోవటం సాహసమే! రాసిలోనే కాదు వాసిలో కూడా మెచ్చదగ్గ తెలుగు బ్లాగుల్లో ఆయనది కూడా ఒకటి.

చిన్నప్పుడు నెమలీకని పుస్తకాలల్లో దాచి పెట్టి దానికి కొబ్బరిమట్టల మధ్య ఉండే నాచు తెచ్చిపెట్టి ఆ ఈక పిల్లలు పెడుతుందని ఎదురుచూసేవాళ్లం..గుర్తుందా...ఇలాంటి ఆనాటి మన బాల్య  జ్ఞాపకాలని ఎన్నిటినో మన కళ్ళముందు సాక్షాత్కరింపచేసి..ఒక్కసారి మనల్ని మన బాల్యంలోకి తీసుకుపోయి మనస్సుని అక్కడే వదిలి వచ్చేటట్లు చేసే రచనలు ఆయన సొంతం.

బ్లాగు ప్రారంభించిన కొద్దికాలంలోనే  ఈనాడులో ఆయన బ్లాగు గురించిన పరిచయం వచ్చింది.  ఆరునెలల్లో వంద టపాలు..  ఏ టపాకి ఆ టపా విన్నూత్నమే.. బ్లాగుల్లో దీన్ని  ఓ రిఫరెన్సు బ్లాగు అనవచ్చేమో.  సాహితీప్రియులకి మంచి విందుభోజనం మురళి గారి బ్లాగు. తెలుగులో వచ్చిన ఏ కథ గురించి అయినా నవల గురించి అయినా ఆయన దగ్గర సమాచారం దొరుకుతుందనుకుంటాను. ఒక్కసారి ఆయన దగ్గర ఉన్న  పుస్తకాలు చూడాలి అని అనుకోని తెలుగు బ్లాగర్లు ఉండరేమో!  ఇప్పటికే చాలామంది బ్లాగర్ల దృష్టి మురళిగారి గ్రంధాలయం మీద పడ్డట్టు.....గ్రంధచౌర్యానికి పథకాలు వేస్తున్నట్టు అభిజ్ఞవర్గాల భోగట్టా..మురళి గారూ జాగ్రత్త!

ఓ సినిమా గురించి చెప్పినా....ఓ నవల గురించి చెప్పినా.....ఓ కథ గురించి చెప్పినా.....నాటకాల గురించి చెప్పినా  సాధికారికంగా చెప్పగల మురళి గారు తను స్వయంగా  ఓ మంచి కథకులు.  సరళమైన భాష, వివరణాత్మకమయిన శైలి, సూటిగా చెప్పగల నేర్పు ఆయన సొంతం.  మొన్న మొన్ననే పొద్దులో ఆయన మొదటి కథ  పొడిచింది. అయినా అది మొదటి కథేంటి?....నాకయితే ఆయన బ్లాగు టపాలన్నీ కథలే.

 పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారు కదా..ఆలానే మన మురళి గారు కూడా తన మూడో ఏటే రచనా రంగంలోకి అడుగు పెట్టారట.  ఆ చమత్కృతి  ఏంటో ఆయన మాటల్లోనే చదవండి.  పూర్వాశ్రమంలో ఆయన రేడియో రచనలు కూడా చేసారు.  నాటకాల గురించి మాట్లాడేవాళ్లు ఈ రోజుల్లో అరుదుగా కనిపిస్తారు.....బ్లాగుల్లో అది మరింత అరుదు.  నేను తెలుగు బ్లాగుల్లో నాటకాల గురించి మొదటిసారిగా చదివింది మురళి గారి బ్లాగులోనే.  అన్నట్టు 'అనగనగా ఆకాశం ఉంది.. ఆకాశంలో మేఘం ఉంది.. మేఘం వెనుక రాగం ఉంది.....పాట మురళి గారే వ్రాసారంట! .  ఆయన సాహిత్య పిపాస ఎలాంటిదంటే ఒకటి కాదు రెండు కాదు....ఏకంగా 18 ఏళ్లు వెతికి వెతికి మరీ ఓ పుస్తకాన్ని సొంతం చేసుకున్నారట!

ఎప్పటెప్పటివో..పదిపదిహేనేళ్లనాటివి...... వార్తాపత్రికల్లో పడ్డ అలనాటి ఆణిముత్యాల లాంటి కథలు జాగ్రత్తగా దాచిపెట్టి మనకు వినిపిస్తుంటారు.  అలా  ఎన్ని కథలు  పరిచయం చేసారో చూడండి. తిలక్, వివినమూర్తి, భానుమతి, ముళ్ళపూడి, శ్రీరమణ, డా.సోమరాజు సుశీల, కేతు విశ్వనాథ రెడ్డి, బీనాదేవి, వంశీ.. లాంటి రచయతల మంచి మంచి కథల గురించి  ఇక్కడ  చదువుకోవచ్చు.  మురళి గారికి వంశీ అంటే ఓ ప్రత్యేక అభిమానం..వాళ్ల గోదావరి జిల్లా వాడయినందుకేమో....... ఎంత అభిమానం అంటే ఆయనతో ఫోనులో మాట్లాడి ఆ ఉద్వేగాన్ని....ఆ ఆనందాన్ని మనతో ఎంచక్కా పంచుకున్నారో ఇక్కడ.

సాధారణంగా పుస్తక పఠనం మీద ఆసక్తి ఉన్నవాళ్లకి సినిమాల మీద కూడా ఆసక్తి మెండుగానే ఉంటుంది.  మురళి గారి సినిమా అనురక్తికి ఆయన  సినిమాల మీద వ్రాసిన కబుర్లే   నిదర్శనం.  ఆయన  సినిమాల మీద చక్కటి చిక్కటి విశ్లేషణలు చేస్తుంటారు.  నవతరంగంలో  కూడా ఆయన వ్యాసాలు వచ్చాయి.  అసలు ఆయన ముందు నవతరంగంలో వ్యాసాలు వ్రాస్తూ అలా అలా బ్లాగు మొదలుపెట్టారు.  కాకపోతే ఎక్కువగా కొత్త సినిమాల (80ల తరువాత సినిమాలు ) గురించే ఉంటాయి.  అప్పుడప్పుడు ఆపాత మధురాల గురించి కూడా చెప్తే బాగుంటుంది!

ఆయనకి సినిమాలు చూసే  విషయంలో ఎంత గుండె ధైర్యం..సాహసం అంటే సుమనోహరుడి ఉషాపరిణయాన్ని నిర్భయంగా చూసొచ్చి నిర్భీతితో మనకి ఆ సినిమా గురించి చెప్పేంత!  ఇన్సూరెన్సు పాలసీలు, రావాల్సిన, తీర్చాల్సిన బాకీల వివరాలన్నీ ఓ పుస్తకంలో వివరంగా రాసి పెడతారంట లేండి..అదీ ఆయన ధైర్యం.

తను వ్రాసే అమ్మ చెప్పిన కబుర్లు అయితే నాకు మరీ మరీ ఇష్టం.  అవి ఆయనకి వాళ్లమ్మ చెప్పిన కబుర్లే అయినా మనకు మన అమ్మ చెప్తున్నట్లే ఉంటాయి.  "ఒలప్పో బెండకాయి కూరొండీసినావంటే..".   అంటూ వాళ్ల పిన్ని పాడిన జముకుల కథ.....వాళ్ల అమ్మమ్మ బిస్సీ కబుర్లు,...సత్తెమ్మ సత్యభామగా  మారి  చెరువుమీద నడిచే ప్రహసనం.....గోవిందరావు జమిందారు గురించి,  టాంపండు లీలలు.......కొంపముంచిన కుంటె గేదె.....అయ్యప్పనాయుడు..హరిశ్చంద్ర వేషం......అబ్బో వాళ్ల అమ్మగారు ఆయనకి ఎన్నెన్ని కబుర్లు చెప్పారో. ... ఎంత అదృష్టవంతులో మురళి గారు మీరు..

ఇక ఆయన జ్ఞాపకాలలోకి వెళ్ళామంటే ఒక పట్టాన బయటకి రాలేము.  అవి చదువుతున్నప్పుడు నిక్కరేసుకున్న చిన్న మురళి మన కళ్ల ముందు మెదులుతాడు.  మనం కూడా మన చిన్ననాటి జ్ఞాపకాలలోకి వెళ్ళిపోతాం.   ఈతపళ్ళు-ముంజెల బండి, పోలిస్వర్గం , తిప్పుడు పొట్లాం, మొగ్గల చీరలు,  మల్లికాసులు,  వాళ్ల సుబ్బమ్మగారి నీళ్ళావకాయ..... ఎన్నెన్ని జ్ఞాపకాలో! 

మురళి గారికి వాళ్ల బామ్మ గారంటే కాస్త కోపం అనుకుంటాను. పాపం పెద్దావిడిని ఎన్ని ఇబ్బందులు పెట్టేవారో .....అంతేనా వాళ్ల తాతయ్య చేత చివాట్లు కూడా పెట్టించేవారు.  ఇంతకీ పెద్దాయ్యాక అయినా తేలు కుడితే ఎలా ఉంటుందో  తెలిసిందా మురళి గారూ?

అందరిని హడలగొట్టే మురళి గారికి వాళ్ల నాన్నగారంటే మాత్రం మహా హడలు సుమండి.  పాపం ఆయన పదమూడో ఎక్కం కష్టాలు  పగవాడికి కూడా వద్దు అనిపిస్తాయి.  కత్తిరించిన జుట్టు మళ్ళీ తన తలమీద అతికించమని వాళ్ల మంగలి సత్యాన్ని   పీడిస్తుంటే ..వాళ్ల నాన్నగారొచ్చి నిద్రగన్నేరు కొమ్మతో వీపుమీద కధాకళి ఆడేసారట....... ఇవన్నీ మన కళ్లముందు జరిగినట్లే వర్ణిస్తారు.  ఈ జ్ఞాపకాల టపాలు చదువుతుంటే నాకు నాయిని మిట్టూరోడి కథలు గుర్తుకొస్తాయి.

మురళి గారి శైలి చదువుతుంటే నాకు అక్కడక్కడ ప్రళయ కావేరి కథలు..మా పసలపూడి కథలు  గుర్తుకొస్తాయి.  కుదిరితే ఓ కప్పు కాఫీ అంటూ కాఫీ కబుర్లు అయినా , తన బ్లాగులోని విషయ చౌర్యం గురించి కాపీ కబుర్లు అయినా..... మరే కబుర్లయినా  కళాత్మకంగా వ్రాయటం ఆయనకే చెల్లు.   చెయ్యి విరిగినట్టుంది అంటూ బ్లాగుల్లో వ్యాఖ్యల పెట్టె  పాత్ర గురించి..అది పనిచేయకపోతే వచ్చే ఇబ్బందుల గురించి  ఎలా చెప్పారో చూడండి.  అదే చేత్తో ఆషాఢమాసం గురించి అల్లరల్లరిగానూ చెప్పగలరు. 

కథలు...నవలలు....నాటికల  గురించే కాదు తన చుట్టూ ఉండే మనుషుల  గురించి కూడా కథ చెప్పినట్టే ఆసక్తికరంగా చెప్తారు.  కష్టం, బాధ్యత, మనసు, స్నేహం..లాంటి వాటి మీద  వ్యక్తిత్వవికాస తరగతులకి పనికొచ్చే మంచి విశ్లేషణాత్మక వ్యాసాలూ వ్రాయగలరు.  ఇన్ని రకాల వైవిధ్య రచనలతో పాటు బ్లాగు పరిచయాలు  కూడా చేసే మురళి గారి బ్లాగు గురించి ఎంత చెప్పినా అది అసంపూర్ణమే!

ఇక చివరిగా మురళి గారి బ్లాగుకే ప్రత్యేకమయిన ఓ విభాగం ఉంది..అదే నాయికల పరిచయం.  మధురవాణి నుంచి కజు వరకు ..... ప్రముఖ నవలల్లోని నాయికల గురించి అద్భుతంగా విశ్లేషిస్తూ పరిచయం చేస్తుంటారు.  పుస్తక పరిచయాలు సర్వసాధారణమే..కానీ బ్లాగుల్లో ఇలా అచ్చంగా నవలా నాయికల పరిచయాలు ఓ వైవిధ్యమే!

గోదావరి అంటే అమిత ఇష్టపడే ఈ గోదారబ్బాయి బ్లాగులో గోదావరి గురించిన ప్రస్తావనలు ఎక్కువగానే ఉంటాయి.   మన నేల, మన నీరు, మన పల్లె, మన కొండా కోనా...ఈ మన అనుకోవటంలో ఉండే ఆనందం..ఆ అనుభూతి ఈ మన బ్లాగు చదవటంలో కూడా ఉంటుంది.

మురళి గారు రెండువందల టపాలు పూర్తిచేసిన సందర్భంగా అభినందనలు తెలుపుతూ.... ఆయన నుండి శతాధిక టపాలు కోరుకుంటూ....

ఆయన ఎన్ని చేతులతో ఎన్ని కీబోర్డులతో వ్రాస్తారో నాకు తెలియదు కాని టపటపా టపాలు రాలిపోతుంటాయి...అందుచేత నేనీ టపా ప్రచురించే సమయానికి ఆయన రెండువందల టపాలు దాటేస్తే తప్పు నాది  కాదు!!

Read more...

December 20, 2009

మహామహుల రాకతో కళకళలాడిన పుస్తక ప్రదర్శన

 శనివారం (19/12/09) పుస్తక ప్రదర్శనలో ముఖ్యమయిన కార్యక్రమం వాక్ ఫర్ బుక్సు.  ఆ సందర్భంగా  చాలామంది ప్రముఖులని చూసే అవకాశం కలిగింది.

చుక్కా రామయ్య గారు (ప్రముఖ విద్యావేత్త), పరుచూరి వెంకటేశ్వరరావు గారు (సినీ రచయిత), దేవానంద్ (ఐ.ఏ.ఎస్ ఆఫీసరు), జెన్నీ (సినీ నటులు, రచయిత), తెలకపల్లి రవి గారు (జర్నలిస్టు, టి.వి విశ్లేషకులు), రవిప్రకాష్ (టి.వి 9), చొక్కాపు వెంకటరమణ (మెజీషియను మరియు రచయిత) మొదలగువారు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.  నడక తరువాత వీరి ప్రసంగాలు కొనసాగాయి.....అవి నేను వినలేదనుకోండి.

 ఈ కార్యక్రమంలో బ్లాగర్ల తరుపున మరియు e-తెలుగు తరుపున పి.ఎస్.ఎం లక్ష్మి,  సతీషు కుమారు యనమండ్ర, నామాల నాగమురళీధర్, ఇనగంటి రవిచంద్ర, రాజశేఖరుని విజయ శర్మ, శిరీషు కుమార్, శివ చెరువు, సి.బి.రావు, శ్రీనివాస కుమారు, వరూధిని మరియు పుస్తకం వారి తరుపున పూర్ణిమ, అరుణ పప్పు పాల్గొన్నారు.  చాలామంది చిన్న పిల్లలు విచిత్ర వేషధారణలతో .....పుస్తకం నోరు తెరవని మహావక్త,  చదవండి....చదివించండి అన్న ప్లకార్డులతో  అలరించారు.

అక్కడికి వచ్చిన ప్రముఖులకు e-తెలుగు సభ్యులు పనిలో పనిగా e-తెలుగు గురించి, బ్లాగుల గురించి ..... పుస్తకం వారు పుస్తకం సైటు గురించి వివరించి కరపత్రాలు పంచిపెట్టారు.

సరే ఇక ఆ కార్యక్రమం అయిపోయాక e-తెలుగు స్టాలుకి వెళితే అక్కడ ఊహించని అంతర్జాల ప్రముఖులు ఎదురయ్యారు.  పరుచూరి శ్రీనివాసు గారు, అక్కిరాజు భట్టిప్రోలు గారు కనిపించారు. అక్కిరాజు గారి ఫోటో వారి బ్లాగులో ఉంది కాబట్టి ఆయన్ని తేలికగానే గుర్తు పట్టాను.  అక్కిరాజు గారితో పాటు వారి అమ్మాయి భావన కూడా వచ్చింది.   నిన్న e-తెలుగు స్టాలుకి బ్లాగర్లు కూడా చాలామంది వచ్చారు. చివరిదాకా సందర్శకులతో సందడి సందడిగా ఉన్న స్టాలు ఇదేనేమో!  చివరిలో ఊహించని విధంగా రచయిత్రి మరియు బ్లాగరు అయిన చంద్రలత గారు ఓ మెరుపులా అక్కడ ప్రత్యక్షమయ్యారు.  అనుకోకుండా  ఆమెని కలవటం చాలా ఆనందం అనిపించింది.

నిన్న e-తెలుగు స్టాలుకి వచ్చిన బ్లాగర్లు

ఇంకా ఎవరయినా వచ్చారేమో......వారి పేర్లు ఇక్కడ లేకపోతే అన్యదా భావించకండి.
e-తెలుగు స్టాలు నిర్వహణలో అహర్నిశలు శ్రమిస్తున్న కశ్యప్ గారికి నా ప్రత్యేక అభినందనలు.  అలానే తనకి చేదోడుగా ఉంటూ తోడ్పాటు అందిస్తున్న సతీషు కుమారు యనమండ్ర, నామాల నాగమురళీధర్, చక్రవర్తి గార్లకు జేజేలు మరియు అభినందనలు.  మిగతా రోజుల్లో కూడా  బ్లాగర్లు తమకు వీలయన రోజుల్లో వచ్చి స్టాలు నిర్వహణలో సహాయపడగలరని ఆశిస్తున్నాను. నిన్న పి.ఎస్.ఎం. లక్ష్మి గారు చాలాసేపు స్టాలు నిర్వహణలో తోడ్పాటు అందించి వచ్చిన సందర్శకులకు అన్నీ వివరించారు.  ఆమెకి కూడా అభినందనలు.

ఆదివారం పుస్తక ప్రదర్శనకి వెళ్లే బ్లాగర్లకి ఓ అద్భుత అవకాశం.....బ్లాగర్లు A4 సైజులో వారి బ్లాగు పేరు గానీ స్క్రీన్ షాట్ గానీ తీసుకు వచ్చి స్టాలు వద్ద ప్రదర్శించుకోవచ్చు.

ఇక చివరిగా పనిలో పనిగా కొన్నంటే కొన్నే  పుస్తకాలు కొన్నాను.  అందులో ముఖ్యమయినది (ఇం)కోతి కొమ్మచ్చి...(ముళ్ళపూడి వారి  కోతికొమ్మచ్చి రెండవ భాగం)......మొన్న శుక్రవారమే విడుదలయిందట! దాంతోపాటు చాలామంది బ్లాగు మిత్రులు మీరు చదవ్వాల్సిందే అని మరీ మరీ చెప్పిన యండమూరి అంతర్ముఖం కూడా కొన్నాను.  ఇంకా సోమరాజు సుశీల గారి దీపశిఖ తీసుకున్నాను. ఇవి కాక ఇంకో ఐదు పుస్తకాలు కొన్నాను.

తెలుగు పుస్తకాలు చదవండి, చదివించండి.

Read more...

December 18, 2009

రండోయ్......రారండోయ్

హైదరాబాదు అనగానే అందరికి గుర్తుకొచ్చేది..జనవరిలో జరిగే ఎగ్జిబిషను ..దాంతోపాటు గత నాలుగయిదు సంవత్సరాలుగా అంతే ప్రాచుర్యాన్ని పొందుతున్న మరో ప్రదర్శన హైదరాబాదు పుస్తక ప్రదర్శన.  మరి ఈ సారి పుస్తక ప్రదర్శనకి ఎంతమంది బ్లాగర్లు వస్తున్నారు?  అక్కడ e-తెలుగు స్టాలు కూడా ఏర్పాటు చేసారు.  ఆసక్తి... ఉత్సాహం ఉన్న బ్లాగర్లు, బ్లాగేతరులు e-తెలుగు స్టాలుకి వచ్చి అంతర్జాలంలో తెలుగు గురించి, వికీపిడియా గురించి, బ్లాగుల గురించి, అంతర్జాల పత్రికల గురించి తెలుసుకోవచ్చు.......వీటి గురించి తెలిసినవాళ్లు అక్కడకి వచ్చే సందర్శకులకి వీటి గురించి వివరించవచ్చు. వలంటీర్లుగా రాదలుచుకున్న వాళ్లు కశ్యప్ (9396533666) (9030365266) గారిని కాని, దూర్వాసుల పద్మనాభం గారిని కాని సంప్రదించవచ్చు.

శనివారం (19/12/09) సాయంత్రం ఐదు గంటలకి వాక్ ఫర్ బుక్సు కార్యక్రమం కూడా ఉంది.  ఉత్సాహవంతులు ఇందులో పాల్గొనవచ్చు.  దీన్ని కేంద్ర మానవవనరుల శాఖ సహాయ మంత్రి  దగ్గుపాటి పురందరేశ్వరి గారు ప్రారంభిస్తారు.  


శనివారం (19 వ తేది),  ఆదివారం (20 వ తేది),  మరియు సోమవారం (21 వ తేది) మహిళా బ్లాగర్లు ఎవరయినా రాదలుచుకుంటే రావచ్చు.

తెలుగు పుస్తకాలు చదవండి, చదివించండి


Read more...

December 16, 2009

నేనిక్కడ-నువ్వెక్కడ?

నువ్వూ నేనూ చివరిసారిగా కలిసింది ఎప్పుడు?......నా పెళ్లిలోనా?
20 సంవత్సరాల సుదీర్ఘ కాలం.....
ఏ సీమలో ఉన్నావో .....ఎలా ఉన్నావో
కుశలమేనా......నీకు కుశలమేనా
అనుకుంటూ ఇన్నాళ్లూ అన్వేషణలు

పిల్లలెంత మందో?
ఎలా ఉంటారో?
నీలాగా పాడతారా?
నీ అంత సుకుమారంగానూ ఉంటారా?
నీలాగా బద్దకం ఎక్కువా?
జవాబు దొరకని ప్రశ్నలు.....మరుగునపడ్డ జ్ఞాపకాలు

ఎప్పటికయినా కలుస్తాం అన్న ఆశ
ఇక ఎప్పటికీ కలవమేమో అన్న నిరాశ
నిరాశని భగ్నం చేస్తూ....గుండెలని మీటుతూ
జాలంలో తళుక్కున మెరిసిన నీ ఫోటో
ఇప్పటికీ అదే రూపం......నీదైన అదే చిరునవ్వు

 నెమలి నాట్యం....కోకిల పాట
సందెపొద్దుల్లో సంపెంగ నవ్వులు
అమ్మ దొంగలు.....నీలి మబ్బులు
వెన్నెల రాత్రులు.....ఆరుబయట విహారాలు
నువ్వు పాడిన పాటలు......మనం చూసిన సినిమాలు

యమునా ఎందుకే నీవు.......ఇంత నలుపెక్కినావు
అంటూ మనం చేసిన డాన్సు
క్రీస్తు జననం అంటూ
మనం వేసిన గొర్రెల కాపరి వేషాలు
చివరి నిమిషపు చదువులు.....నైటవుట్ ప్రాజెక్టులు

అలల్లా జ్ఞాపకాలు
ఒకదాని వెంట ఒకటి
ఒకదానిపై మరొకటి
అలుపన్నదే లేక
ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే
మునుగుతూ తేలుతూ

ఆనాటి ఆ స్నేహమానంద గీతం
ఆ జ్ఞాపకాలన్ని మధురాతి మధురం....

12/12/09 న వ్రాసినది. (20 సంవత్సరాల తరువాత ఇక దొరకదేమో  అనుకున్న ఓ ప్రియసఖి ఆచూకీ దొరికిన సందర్భంగా )

Read more...

December 10, 2009

ఇక మేమూ ప్రవాసాంధ్రులమే!!

ఏంటో ఇన్నాళ్లు తెలంగాణా వచ్చేది కాదులే అని గుండెల మీద చెయ్యేసుకుని కూర్చున్నాం.  తెలంగాణా వచ్చేసినట్టే అని ఓ పక్క తెలంగాణా ప్రజలు ఉత్సవాలు చేసేసుకుంటున్నారు..ఇంకొక పక్కేమో కోస్తా, రాయలసీమ వాళ్లు సమైక్యాంధ్ర అంటూ రోడ్లెక్కుతున్నారు. ఎప్పటికి తేలేనో ఈ విభజనలు....పునర్విభజనలు. అదేంటో నాకయితే ఈ విభజన గొడవలో ఎవరి వాదన విన్నా సమంజసంగానే అనిపిస్తుంది..ఇంతకీ నేనెటు వైపు!! అదే తేల్చుకోలేకుండా ఉన్నాను.

ఇంకొన్నేళ్లల్లో మేము కూడా ప్రవాసాంధ్రులం అయిపోతామన్నమాట.  ఇకపై అన్ని ప్రవాసాంధ్ర సంఘాలలో మేము కూడా సభ్యులమన్నమాట!  మున్ముందు హైదరాబాదు ప్రవాసాంధ్రుల సంఘం అనో, TAH (Telugu Association of Hyderabad) అనో , TAT (Telugu Association of Telangana) అనో ....AAH (Andhra Association of Hyderabad) అనో ..మరోటనో.......సంఘాలు పెడితే అందులో మేము కూడా సభ్యులమే!!.

ఇప్పుడు నా సమస్య ఏంటంటే..ఒకవేళ తెలంగాణా వస్తే గిస్తే....మేము....  అంటే గత 20-30 సంవత్సరాలుగా తెలంగాణాలో ఉన్నవాళ్లం....ఏ రాష్ట్రానికి చెందుతాం......పుట్టి పెరిగిన ఆంధ్రాకా?.....లేక స్థిరపడ్ద తెలంగాణాకా? సరే మేము ఆంధ్రాకే చెందుతామనుకుంటే మరి ఇక్కడే పుట్టి పెరిగిన మా పిల్లలో.....వాళ్ళు తెలంగాణా బిడ్డలా?  హత్తెరికి అయితే మా ఇంట్లో సగం మందిమి ఆంధ్రా.... సగం మందిమి తెలంగాణా అన్నమాట..భలే..భలే...సరే పుట్టిన గడ్డ మీద మమకారంతో అక్కడికే వెళ్లిపోదామా అంటే అక్కడ మా పిల్లలు నాన్ లోకల్ అయిపోతారు..మరి కింకర్తవ్యం??

తెలంగాణా ఇస్తే అటువైపు ప్రత్యేక రాయలసీమ ఇవ్వాలంట...ఇటు వైపు ఉత్తర కోస్తా ఇవ్వాలంట...మరి నట్టనడుమనున్న ఆంధ్రప్రదేశ్‌కి గుండెకాయలాంటి కృష్ణ, గుంటూరు ఏమయిపోవాలంటారు? ఒక్కో జిల్లాని ఒక్కో రాష్ట్రంగా చేస్తే సరి..మళ్లీ మళ్లీ దీక్షలు లేకుండా.....ప్రాణాలు పోకుండా!......ఓ పనయిపోతుంది!!

ఏంటో ఓ కుటుంబంలో అన్నదమ్ములు విడిపోయేటప్పుడు అందరి అభిప్రాయాలు అడిగి అందరికి అమోదయోగ్యంగా ఆస్తుల విభజన చేసుకుని విడిపోతారు.....మరి  ఇప్పటివరకు ఈ విషయంలో మనలాంటి సామాన్య ప్రజల అభిప్రాయాన్ని ఎవ్వరయినా అడిగారా?

అసలు ప్రత్యేక రాష్ట్రం వస్తే ఎవరికి లాభం.  సామాన్యులకి ఒరిగేదేమన్నా ఉందా?  పెరిగిన ఉప్పులు పప్పుల రేట్లు ఏమయినా తగ్గుతాయా?

 ఈ గొడవలేమో కాని మా పిల్లలు ఊళ్లో చిక్కుకు పోయారు.  నిన్నటి దాక ఇక్కడ గొడవలు, కాలేజీలకి సెలవలని అక్కడున్నారు..సరే ఈ రోజుతో గొడవలు అయి పోయాయి, రేపటినుండి కాలేజిలు మొదలు కదా అని బయలుదేరి రమ్మంటే ఇప్పుడు అక్కడ గొడవలు.

Read more...

December 2, 2009

వీడుకోలే వేదికయినా....

నిన్ను ఇంట్లో నుండి సాగనంపేటప్పుడు అనుకోలేదు
నీ దూరం నన్నింతగా బాధిస్తుందని
ఒకటా రెండా 18 సంవత్సరాలు
మాతో కలిసి మెలిసి వున్నావు
మాలో ఒకరివై పోయావు.
నిన్నెంత ప్రాణంగా చూసుకున్నాను
అందుకేనేమో నాకు ఇంత బాధ
నేను తప్ప ఇంకెవరు నీ మీద చేయి వేయకూడదనుకునేదాన్ని
ఎవరైనా నీ మీద చేయి వేస్తే
నా ప్రాణం పోయినట్లుండేది
వాళ్ల చేతులు ఎలా ఉన్నాయో
అవి అంటుకుని నువ్వెక్కడ మాసిపోతావో అని నా ప్రాణం కొట్టుకునేది
నీ మీద సర్వం సర్వాధికారం నాదే అనుకునేదాన్ని
నీ మీద ఈగ కూడ వాలనిచ్చేదాన్ని కాదు
నువ్వు కూడా నాతో అంతే విశ్వాసంగా వున్నావు.
నీ మీద ఎంత భారం వేసినా ఎప్పుడూ పన్నెత్తు మాట అనలేదు
ఓపికగా భరించావు
అలాంటి నిన్ను నేనెలా దూరం చేసుకున్నాను!
నేనెళ్లిపోతాను అని నువ్వెప్పుడూ అనలేదు
నేనే నీకు వయస్సు అయిపోయిందని
మా భారం మోయలేకపోతున్నావని
మాకు సరిగా సేవలు చేయలేకపోతున్నావని
నిన్ను నిర్థాక్షిణ్యంగా మెడ పట్టుకు గెంటేసాను
ఎంత కఠినాత్మురాలినో కదూ!
ఇప్పటికీ కళ్లముందు నువ్వే మెదులుతున్నావు
పచ్చటి నీ రూపు...చల్లటి నీ మనస్సు...
ఇప్పుడెక్కడున్నావో!
ఏ శిధిలాల క్రింద మగ్గిపోతున్నావో!

******************************************************************************

ఏంటో 18 సంవత్సరాలు మా ఇంట్లో మాతో పాటు సహజీవనం చేసిన మా ఐసు పెట్టెని (ఫ్రిజ్జు) ఆ మధ్య ఇంకో ఐసుపెట్టెతో మార్పిడి పథకం కింద సాగనంపి ఓ వారం రోజులు పడ్డ దిగులులో నుండి వెలువడ్డ ఓ చిన్నపాటి ఆవేదన. ప్రాణం లేని వస్తువులే అయినా కొన్నిటితో చిక్కటి అనుబంధాలు పెనవేసుకుంటాం. అవి దూరం అయినప్పుడు ఏదో సర్వం కోల్పోయినట్టుగా ఉంటుంది.

Read more...

December 1, 2009

ఆనందమానందమాయెనే---నా సెల్లు పాడయి పోయినే!!

ఏమి హాయిలే హలా!! అహ.....ఏమి హాయిలే హలా!!

సెల్లు ఉంది ఎందుకు బ్యాగులో దాచుకోనా.....ఎత్తవే అన్న అదిలింపులు లేవు..

గడప దాటటం భయం......ఎక్కడున్నావు......ఎంతసేపట్లో వస్తావు.......ఇంత లేటు అయ్యిందేం ...అన్న ప్రశ్నల జడివానలు లేవు..

నెల రోజులనుండి ప్రాణానికి ఎంత హాయిగా ఉందో!

అసలు విషయమేమిటంటే.....నా సెల్లుఫోనుకి చీడ (వైరస్సు) పట్టింది..దాంతో దాన్ని ఓ మూలకి విసిరేసాను..

ఏంటో ఇన్నినాళ్లు నేను కోల్పోయిన నా స్వాతంత్రం అంతా తిరిగొచ్చేసిన భావన కలుగుతుంది..

నిజమండీ బాబు.....ఈ సెల్లుతో నాకు అన్నీ ఇన్నీ తిప్పలు కావు..

అసలు నాకు మొదలు సెల్లే అవసరంలేదు..ఏదో అలనాడు ఆఫీసుకి పోయి ఉద్యోగం వెలగబెట్టే రోజులలో.....ఎప్పుడయినా పిల్లలు ఇంటికి ముందుగా వచ్చేస్తే సెల్లులో కబురు పంపితే ఇంటికి వచ్చి వాలొచ్చని కొనుక్కున్నాను..కానీ అదే నా మెడకి రోకలిబండలా చుట్టుకుంటుందనుకోలేదు..

ఆ సెల్లు చేత్తో పట్టుకు తిరగాలంటే నాకయితే ఏదో కొండంత భారం మోస్తున్నట్టు ఉంటుంది..

పోనీ మెడలో తగిలించుకోవాలంటే.....అలా మెడలో వేసుకున్న వాళ్లని చూస్తే నాకు మూర్చ రోగులు మెడలో వేసుకు తిరిగే పలకలు గుర్తుకొస్తాయి (ఇది నా భావన అంతే......దయచేసి వేరుగా అర్థం చేసుకోకండి). అందుకే అది ఎప్పుడూ బ్యాగులోనే ఉంటుంది..మరి అది బ్యాగులో ఉంటే తొందరగా వినపడదు కదా! ఇక మా ఇంటాయన విసుర్లు అన్నీ ఇన్నీ కావు...సెల్లు ఎత్తని దానికి ఆ సెల్లు ఎందుకూ అంటూ.. ...(మరే నాదీ అదే ప్రశ్న..అసలు నాకు సెల్లు ఎందుకు?)

నా దృష్టిలో సెల్లు అంటే ఏదో అత్యవసరానికి వాడుకోవటానికే కాని అలంకారానికి కాదు. ప్రతివాళ్ల చెవుల దగ్గర ఈ సెల్లులు చూసీ చూసీ నాకు అవి అంటే ఎంత విముఖత వచ్చేసిందో!

ఏంటో ఏదో చెప్పబోయి ఏదో చెప్పేస్తున్నా..ఆనందం ఎక్కువయినా మాటలు దొరకవు కదా!!

నిజానికి నేను కొనుక్కున్న మొదటి సెల్లుని అప్పుడెప్పుడో మా మరిది పెళ్లిలో ఎవరో లేపేసారు....అహా పోయిందిలే అని సంతోషించా....అది పోయిన నెల తిరగకుండానే మా ఇంకొక మరిది అమెరికా నుండి మా పాపకి ఓ సెల్లు కొనుక్కొచ్చాడు....అప్పటికి మా పాపకి ఇంకా 18 నిండలేదు కాబట్టీను....18 నిండకముందు పిల్లలు సెల్లు వాడటం నా నియమాలకు వ్యతిరేకం కనకానూ.....ఇంకో సెల్లు కొనటం ఎందుకు దండగ అనీనూ....నేను ఆ సెల్లు వాడుకోవటం మొదలుపెట్టా....అమ్మయ్య......ఇప్పుడు దానికి కూడా రోజులు నిండాయి. మొన్నామధ్య మా అబ్బాయి దాన్లో బ్లూ టూతో రెడ్డు టూతో ఏదో ఉంటుంది కదా..దాన్ని కెలికినట్టున్నాడు..దెబ్బకి దానికి తెగులు పట్టుకుంది...ఇక దాని నోరు నొక్కేసి పక్కన పడేసా!

సెల్లు పాడయ్యాక మొదటిసారిగా మొన్నో రోజు ఊరు వెళ్లా....

సెల్లు లేని ప్రయాణం ఎంతా ఆహ్లాదంగా ఉందో!

ఊరు బయలుదేరతానా..గుమ్మంలోనుండి కాలు బయటపెట్టకముందే మొదలవుతుంది ఈ సెల్లాయణం...

అటునుండి..మా నాన్న........అన్నయ్య

ఇటునుండి మా ఇంటాయన!

బయలుదేరావా?
ఆటోలో వస్తున్నావా? మీ ఆయన దింపుతున్నాడా?
స్టేషను చేరావా?
ట్రెయిను కరెక్టు టైమేనా? కనుక్కున్నావా?
ఏ ప్లాటుఫారమో కనుక్కున్నావా?
ఎక్కావా?
ఎక్కడి దాకా వచ్చావు?
ఎక్కడున్నావు?
ఇంకా నడికుడేనా?
ఫోను ఎత్తవే?
మీ అన్నయ్యకి ఫోను చేసావా స్టేషనుకి రమ్మని?
ఇంకా ఎంత సేపట్లో గుంటూరు చేరతావు?
నల్లపాడు దాటగానే నాకు ఫోను చెయ్యి
దిగావా?
మీ అన్నయ్య కనపడ్డాడా?
ఇంటికి చేరారా?


* .....
* .....
* .
* .
* .
* .
* .
* .
* .
* .
* .
*

మళ్ళీ తిరిగి వచ్చే వరకు ఆ సెల్లు అలా మోగుతూనే ఉంటుంది..అసలు ఊరికి ఎందుకొచ్చానురా భగవంతుడా అనుకుంటా!

సరే ఇక పిల్లలతో వెళితే అదో ప్రత్యేకం..పిల్లలని తీసుకెళ్లకుండా వెళితే అది మరో రామాయణం..వెరసి ఈ సెల్లుఫోను కనిపెట్టిన వాడెవడురా బాబూ అని తలపట్టుకునే పరిస్థితి.

ఇక ఎప్పుడైనా ఇంట్లోనుండి అలా బజారుకి బయలుదేరతానా...నా వెనకే సెల్లు మోత కూడా బయలుదేరుతుంది. నేనేమో సామాన్యంగా ఆటో ఎక్కను.....బస్సే ఎక్కుతాను. ఆ బస్సు మోతలో సెల్లు మాట్లాడాలంటే నాకు మహా చిరాకు....అది మోగినా నాకు వినపడదు.....వినపడినా ఎత్తను. అసలు నీకు సెల్లు ఎందుకు అని మరలా క్లాసు మొదలు:)). అయినా బయటకి వెళ్ళినవాళ్లం అక్కడే ఉండిపోతామా! నాలుగు పనులూ చేసుకు రావాలా! అర్థం చేసుకోరూ!

మా పెళ్ళయిన కొత్తలో ఇంటినుండి ఊరికి బయలుదేరుతుంటే.....వెళ్ళగానే ఓ ఉత్తరం వ్రాయమ్మా అని చెప్పేవాళ్లు....

ఇక హైదరాబాదు వచ్చిన కొత్తలో .........వెళ్లగానే ఫోను చెయ్యి అనేవాళ్లు.

ఇప్పుడో......ఇంటినుండి బయలుదేరిన దగ్గరనుండి.....అడుగడుక్కీ మనం ఏ దారిన వెళుతుంది...ఎక్కడ ఆగింది....కారులో ప్రయాణమయితే ఇక చెప్పక్కర్లేదు...అన్నీ ప్రత్యక్ష ప్రసారాలే....అంత అవసరమా...ఫోనుని .ఎంత దురుపయోగం చేస్తున్నాం అనిపిస్తుంది.

వెళ్ళగానే ఓ ఉత్తరం వ్రాయమ్మా.....అని చెప్పటంలో ఉండే ఆప్యాయత.....ఈ ప్రత్యక్ష ప్రసారాలలో నాకు కనపడదు..అంతా యాత్రికం అయిపోతుంది..ఏదో కోల్పుతున్నాం అనే భావన.

ప్రస్తుతానికయితే ఈ సెల్లు లేని జీవితం నాకు హాయిగా ఉంది!

Read more...

November 16, 2009

రెక్కలు--ఓ కవితా ప్రక్రియ

వెనక్కి
తగ్గిన
బాణమే
దూసుకెళ్తుంది

వెనకడుగైనా
విజయానికి తొలిఅడుగే ......

**********************************************************

అంతులేని
అనుభవాలు
మరువలేని
అనుభూతులు

గుప్పెడంత గుండెకు
బోలెడన్ని చప్పుళ్ళు.......

********************************************************

ఎటుచూసినా
తేనె
పూసిన
కత్తులే

ప్రశ్నించేవాడెప్పుడూ
పిచ్చోడే ! ..........

*********************************************************

కోట్లు
కూడబెట్టి
కునుకులేని
బ్రతుకు

బూడిదలో
పన్నీరు ...........

********************************************************

వేలాది
సైన్యం ఓ ప్రక్క
తోడుగా
నేస్తం మరోప్రక్క

సైన్యం వెనుదిరిగినా
స్నేహం నిన్ను వీడదు...

***************************************************************

కొనుక్కున్న
సన్మానాలు
అనవసరపు
ఆర్భాటాలు

ఖాళీ డబ్బాలో
రాళ్ళమోతలు..........

**************************************************************

రెక్కలు..........ఇది ఓ కవితా ప్రక్రియ!

నేనేంటి ఈ కవిత్వం ఏంటి అనుకుంటున్నారా!!

పైన పెట్టినవి మన బ్లాగరు పద్మకళ గారు వ్రాస్తున్న "రెక్కలు" నుండి మచ్చుకి కొన్ని.
నాకు కవితలు అంతగా ఎక్కవు..అసలు చదవను కూడా. ఈ మధ్య పద్మకళగారితో మాట్లాడినప్పుడు వీటి గురించి చెప్పారు....సరే ఓ సారి చూద్దాం అని చదివాను. సరళంగా బాగున్నట్లు అనిపించాయి. వీటి గురించి విశ్లేషించేంత పరిజ్ఞానం నాకు లేదు..పాఠకులు చదివి మీ అభిప్రాయాలు పద్మకళగారి బ్లాగులో చెప్పండి.

మొదటగా వృత్తిరీత్యా టీచరు, ఇప్పుడు జర్నలిస్టు మరియు రేడియో జాకీ, ప్రవృత్తి రీత్యా కవయిత్రి అయిన పద్మకళ గారివి ఒకటి కాదు ఏడు బ్లాగులున్నాయి.

1. సాక్షిలో తను వ్రాసిన వ్యాసాల కోసం.

2. తనకు నచ్చిన ప్రముఖుల మెసేజెస్ కోసం.

3. పిల్లల స్వచ్చమైన నవ్వులు....చల్లని చూపులతో తను తీసిన చిత్రాలతో .

4. మామూలు విషయాలతో తను వ్రాసే బ్లాగు.

5. ప్రముఖ వ్యక్తులు, మార్గదర్శుల గురించి.

6. ఇంగ్లీషు పదాల ఉచ్చారణ వాటి అర్థాలతో.

7. కవితా ప్రక్రియ "రెక్కలు" కోసం.

తీరిక దొరకని ఉద్యోగాలల్లో ఉండి కూడా ఇన్ని బ్లాగులు వ్రాస్తున్నందుకు పద్మకళ గారికి అభినందనలు.

Read more...

November 2, 2009

ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం--వనభోజనాల ప్రత్యేకం

"ఆకాశాన ఆ మణిదీపాలే ముత్తైదువులుంచారు
ఈ కోనేట ఈ చిరుదివ్వెల చూసి చుక్కలనుకుంటారు"

ఎంత గొప్ప అద్భుతమయిన భావన!
కృష్ణశాస్త్రిగారికి తప్ప ఇలాంటి భావనలు ఎవరికీ రావేమో!!

"ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం"..... అంటూ కృష్ణశాస్త్రి గారు ఓ అద్భుతమయిన పాటని మనకి వదిలిపెట్టి వెళ్ళారు.  నిన్న ఆయన పుట్టినరోజు....ఈ రోజు ఆయన పాటకి సార్థకత కలిగే కార్తీక పౌర్ణమి రోజు.

మా ఇంట్లో పూజలు వ్రతాలు అంతగా అలవాటు లేవు.  మాకు తెలిసి మా అమ్మ పూజలు చేసే సందర్భాలు రెండే రెండు . ..ఒకటి వినాయకచవితి....రెండవది కార్తీక పౌర్ణమి..అందుకే ఈ రెండూ అంటే నాకు మక్కువ ఎక్కువ.  మాకు సముద్రతీరం దగ్గర అవటంచేత కార్తీక మాసంలో తప్పుకుండా ఏదో ఒకరోజు సముద్రస్నానికి వెళ్లేవాళ్లం.  మాకు బాపట్ల దగ్గర అయినా అప్పట్లో సూర్యలంక బీచ్ అంత బాగుండేది కాదు..జనసంచారం కూడా చాలా తక్కువగా ఉండేది....అందుకనే ఎప్పుడూ చీరాల ఓడరేవుకే వెళ్ళేవాళ్లం.  పొద్దున్నే చీకటితో లేచి ట్రాక్టర్ల మీద వెళ్ళి స్నానాలు చేసి అక్కడే దగ్గర్లో ఏ జీడిమామిడి తోటలోనో అమ్మవాళ్లు చేసుకొచ్చిన పులిహార...పెరుగన్నం తినేసి వచ్చేవాళ్లం.  వీలయితే కార్తీకమాసంలో  రెండు మూడు సార్లు కూడా సముద్రస్నానికి వెళ్లేవాళ్లం.

ఇక కార్తీక పౌర్ణమి రోజయితే అమ్మ ఉదయన్నే మాకు దగ్గర్లో ఉన్న శివాలయానికి వెళ్లి వత్తులు వెలిగించి వచ్చేది.  అప్పుడప్పుడు నేను కూడా వెళ్ళేదాన్ని. గుళ్ళో అందరూ తలా  ఓ పద్మం ముగ్గు వేసి దానికి పసుపు కుంకుమ వేసి ప్రమిద పెట్టి వత్తులు వెలిగించేవాళ్లు.  ఆ పద్మాలు ధగ ధగ మెరిసిపోతూ ఉండేవి, అవి ఇప్పటికీ నా కళ్లముందు అలా మెదులుతూ ఉంటాయి.  అప్పట్లో ఏంటి అందరూ పద్మాల ముగ్గే వేస్తారు ఆనుకునేదాన్ని!

అమ్మ  ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం చీకటి పడుతూ పడుతూ ఉండగానే పూజ చేసి తులసమ్మ దగ్గర పద్మాల ముగ్గు వేసి దీపం పెట్టి వత్తులు వెలిగించేది . ఆ రోజు సాయంత్రం అన్నాలు కూడా అమ్మ....ఆమ్మ వాళ్లతో పాటు పెందలాడే  తినేసేవాళ్లం.  మా ఆమ్మ వాళ్లిల్లు మా ఇంటి ఎదురుగానే.....ఎక్కువగా కార్తీక పౌర్ణమి రోజు అందరం కలిసి వాళ్లింట్లో బావి పక్కనే తులసమ్మ దగ్గర కూర్చుని భోజనాలు చేసేవాళ్లం.

అమ్మవాళ్ళు ఈ రోజు చేసే వంటలలో ప్రధానమయినది నేతి బీరకాయ పచ్చడి.  ఈ రోజుల్లో మా ఊరిలో ఎవరి ఇంట్లో చూసినా ..ఎవరి వాముల మీద (ఇప్పుడు వాములు లేవులేండి), చావిళ్ళ మీద చూసినా నేతి బీరకాయలు విపరీతంగా కనపడతాయి.  మా ఇళ్లల్లో కార్తీకమాసపు వనభోజనాలలో ఈ పచ్చడి లేకుండా భోజనం ఉండదు.  అదేం విచిత్రమో ఈ హైదరాబాదులో నాకు ఇంతవరకు ఎక్కడా నేతి బీరకాయలు కనపడల.  ఇప్పటికీ వీటిని ఇంటి దగ్గరనుండి తెచ్చుకోవటమో తెప్పించుకోవటమో చేస్తాం! మరి ఇవాళ కార్తీకపౌర్ణమి సందర్భంగా మీ అందరికి ఆ పచ్చడి రుచి చూపిస్తాను.  ఇది చెయ్యటం చాలా తేలిక.   నేతి బీరకాయలు  కావాలని మాత్రం అడగకండేం!


ప్రవాసాంధ్రులకి:  నేతి బీరకాయని  సిల్క్  స్క్వాష్ (silk squash),  చైనీస్ ఓక్రా (chineese okra) అని అంటారట....మరి మీ ఇండియన్ స్టోరులో కూడా దొరుకుతుందేమో  ప్రయత్నించండి.

కావలసిన పదార్థాలు
నేతి బీరకాయ................ఒకటి
చింతపండు......చిన్న ఉసిరికాయంత
పచ్చిమిరపకాయలు.........ఆరు
నూనె............రెండు చిన్న చెంచాలు
ఉప్పు.............రుచికి సరిపడా
చిన్నుల్లిపాయ (వెల్లుల్లిపాయ) రెబ్బలు......నాలుగు
జీలకర్ర.......... ఒక చిన్న చెంచా
కొత్తిమీర..........చిన్న కట్ట
కరివేపాకు........రెండు రెబ్బలు

నేతి బీరకాయలకి తోలు బీరకాయ తోలు లాగా కాకుండా చాలా నునుపుగా ఉంటుంది.  వీటికి తోలు తియ్యక్కరలేదు.  కాయని  బాగా శుభ్రంగా కడిగి ముక్కలు చేసుకోవాలి.  బాండీలో రెండు చెంచాల  నూనె వేసి అది కాగాక పచ్చిమిరపకాయలు వేసి వేయించి తీసుకోవాలి.  తరువాత బీరకాయ ముక్కలు వేసి వాటిలో నీరు పోయేంతవరకు వేయించుకోవాలి.  వేగాక ఈ ముక్కల్లో కాస్త చింతపండు పెట్టుకోవాలి.  ముక్కలు చల్లారాక ముందుగా పచ్చిమిరపకాయలు, ఉప్పు, చింతపండు రోట్లో వేసి మెత్తగా నూరుకోవాలి.  (రోలు లేనివాళ్లు మిక్సీలో ఒక్కసారి తిప్పండి).  తరువాత నేతి బీరకాయ ముక్కలు వేసి నూరుకోవాలి.  ఈ పచ్చడి మరీ మెత్తగా ఉంటే బాగుండదు.  మిక్సీలో అయితే ఒక్కసారి తిప్పీ తిప్పనట్టు తిప్పితే సరిపోతుంది.  బీరకాయ పచ్చడి లాంటివి మిక్సీలో వేస్తే వాటి రుచే పోతుంది....రోటి పచ్చడి రోటి పచ్చడే..మిక్సీ పచ్చడి మిక్సీ పచ్చడే!! చివరగా కొత్తిమీర, కరివేపాకు, చిన్నుల్లిపాయ, జీలకర్ర వేసి ఒక్కసారి కచ్చాపచ్చాగా  నూరుకుని పచ్చట్లో కలుపుకుంటే నేతిబీరకాయ పచ్చడి సిద్ధం.

అసలు రోటిపచ్చళ్ల రుచి చివరగా వేసే జీలకర్ర, కరివేపాకు, చిన్నుల్లిపాయలతోటే వస్తుంది. చిన్నుల్లిపాయ వాడని వాళ్లు దానిని వాడకున్నా బాగానే ఉంటుంది.

ఈ పచ్చడిలో కావాలనుకుంటే ఇష్టమయినవాళ్లు నువ్వులు వేసుకోవచ్చు.  ముందుగా బాండీలో నూనె లేకుండా రెండు చెంచాల నువ్వులు వేసి కొంచం వేయించి పచ్చిమిరపకాయలతో పాటు నూరుకోవటమే.  పచ్చిమిరపకాయల బదులు ఎండుమిరపకాయలు కూడా వాడవచ్చు. ఇష్టమయినవాళ్ళు చివరగా ఎండుమిరపకాయలు, మినపపప్పు, శనగపప్పు, ఆవాలతో తిరగమోత పెట్టుకోవచ్చు.

వేడి వేడి అన్నంలో పప్పు, నెయ్యితో పాటు ఈ పచ్చడి వేసుకు తింటే అధరహో! అన్నంలోకే కాదు చపాతీలలోకి కూడా బాగుంటుంది.

మరి వంటలు సిద్ధం, మితృలంతా బంతిలో కూర్చుంటే ఇక వడ్డిస్తాం.


Read more...

October 28, 2009

తప్పెవరిది?

గత రెండురోజులుగా ప్రసారమాధ్యమాలలో మైదుకూరు స్కూలులో తెలుగు మాట్లాడినందుకు ఇద్దరు పిల్లలకు ఉపాధ్యాయులు వేసిన శిక్ష  ఓ పెద్ద చర్చాంశనీయమయింది.  మన టి.వి చానళ్లకి మరో పండగ.  ఈ రోజు ఉదయం నుండి ఏ చానలు తిప్పినా  దీనిమీదే చర్చ.  వీళ్లు ఇప్పుడే కళ్లు తెరిచారో లేక వేరే సంచలనాత్మక వార్తలు ఏమీ లేక దీనిమీద పడ్డారో అర్థం కావటం లేదు. అసలు పిల్లలు ఎలాంటి తప్పు చేసినా ఇలా మెడలో బోర్డులు వేలాడదీయటం తప్పు.....మనం స్పందించాల్సింది దానికి...మనం ముందుగా ఖండించాల్సింది ఇలాంటి శిక్షలని.  ఆ పంతుళ్ల మెడలకి "ఇక ఇలాంటి పని చేయను" అన్న బోర్డు తగిలించి ఊరంతా తిప్పాలి.....అదే వారికి సరయిన శిక్ష..

నిజానికి స్కూలులో ఇంగ్లీషులోనే మాట్లాడాలని పిల్లలని నిర్భందించటం, మాట్లాడకపోతే శిక్షలు వేయటం కొత్త విషయం ఏం కాదు.  గత  10-15 ఏళ్ల నుండీ  హైదరాబాదులో ఇలాంటి ఆంక్షలు చాలా స్కూళ్లల్లో ఉన్నాయి.  లేని స్కూళ్లని వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. అది ఇప్పుడు చిన్న చిన్న ఊర్లకి కూడా పాకింది.  మేము చదువుకునే రోజులలో అంటే 30 ఏళ్ల క్రితం కూడా మిషనరీ స్కూల్సులో తెలుగులో మాట్లాడితే ఫైన్ ఉండేది. ఎండలో నిలబెట్టటం. బెంచీలు ఎక్కించటం, మోకాళ్లమీద కూర్చోపెట్టటం, కొండకచో కొట్టటం కూడా చేస్తుంటారు.  తమ పిల్లలు తెలుగులో మాట్లడటం తక్కువతనమనుకునే తల్లిదండ్రులున్నంత కాలం మన తెలుగుకి....మన పిల్లలకి ఇలాంటి దుర్గతి తప్పదు. స్కూలులో తెలుగు ఎక్కువగా మాట్లాడుతున్నారని స్కూలులు మార్చే తల్లిదండ్రులున్నప్పుడు వాళ్ల దగ్గర డబ్బులు దండుకుంటున్న స్కూళ్ల  యాజమాన్యాలు ఇలా చేయక మరి ఎలా చేస్తాయి? మార్పు రావల్సింది తల్లిదండ్రుల్లో.....ఇంగ్లీషు రాకపోతే తమ పిల్లలు జీవితంలో పైకి రాలేరు..వాళ్లకి భవిష్యత్తు లేదు అన్న భావన నుండి మనం బయటకు వచ్చినప్పుడే ఈ ఝాడ్యం వదిలేది. 

మొన్న బజారులో ఓ తెలిసినామె కనపడితే కుశల ప్రశ్నలు అయ్యాక మీ బాబు ఇదివరకటి స్కూలేగా అన్నా! లేదండి పోయిన సంవత్సరం మార్చాం అంది.  అదేంటండి ఆ స్కూలు బాగుంటుందన్నారు కదా, బాగా ఆటలు అవీ ఆడిస్తారు, పిల్లల మీద ఒత్తిడి ఉండదు కదండీ అంటే........ఆవిడ ప్రతిస్పందన........అన్నీ బాగానే ఉన్నాయి కానీండి.... అక్కడ క్లాసు బయట పిల్లలు తెలుగులో ఎక్కువగా మాట్లాడతారండి అందుకని మార్చాం అంది. అదీ ప్రస్తుత పరిస్థితి.  మామూలుగా మన తెలుగువారం ఏదైనా బాధ కలిగినప్పుడో, దెబ్బ తగిలినపుడో అమ్మా అనో అబ్బా అనో అంటాం..అది అసంకల్పిత చర్య......కానీ  ఇంగ్లీషు పిచ్చి ఉన్న మన ఆధునిక తల్లిదండ్రులు ఉన్నారే ......వాళ్లు పిల్లలు బాధ కూడా తెలుగులో పడకూడదనుకుంటారు..పడ్డప్పుడు అమ్మ బదులు మమ్మీ అనాలనుకుంటారు....అలా అంటేనే తమ పిల్లలకి ఇంగ్లీషు బాగా వచ్చినట్లన్నమాట!  అమ్మలు బ్రతికున్న శవాలు అయిపోయారన్నమాట!

ఇంగ్లీషులో మాట్లాడితేనే పిల్లలు జీవితంలో పైకి వస్తారు అనుకునే మనస్తత్వం మనకున్నంత కాలం ఇలాంటివి మామూలే. ఓ రెండు రోజులు గోల చేస్తాం..చర్చలు..వాదనలు..ప్రతివాదనలు..ఆవేశాలు..రక్తం ఉడికిపోవటాలు ....మరిగిపోవటాలు....ఊకదంపుడు ఉపన్యాసాలు..అన్నీ మామూలే.......మూడో నాడు షరా మళ్లీ ఇంగ్లీషు మామూలే.. మళ్లీ ఈ ఊసే ఎవరూ ఎత్తరు.  భాషా శాస్త్రవేత్తలు ఎప్పడో మొత్తుకున్నారు.....ముందు మాతృభాష సరిగ్గా వస్తే మిగతా భాషలు నేర్చుకోవటం చాలా సులువు అని......కానీ మనం ఇపుడు తెలుగు రాకపోతే మాత్రం ఏం ఇంగ్లీషు వస్తే చాలనుకుంటున్నాము. నర్సరీలో ఉన్న మన పిల్లకాయ..ముద్దుముద్దుగా ఏ ఫర్ ఆపిల్ అంటుంటే ...అబ్బో ఇంగ్లీషు ఎంత చక్కగా మాట్లాడుతుందో అని మురిసిపోతాం. చందమామ రావే ..జాబిల్లి రావే.. స్థానంలో ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టారు వచ్చేసింది....చిట్టి చిలకమ్మని.... జానీ జానీ మింగేసాడు..మన అమ్మ భాష మనకి పరాయి అయిపోయింది!

టపటపా నాలుగు ఇంగ్లీషు ముక్కలు మాట్లాడనివాడు మన దృష్టిలో మనిషే కాదు..అలాంటి పిల్లలకు భవిష్యత్తే లేదు అని జాలిపడిపోతుంటాం.  మన పిల్లలు ఇంగ్లీషు మీడియంలో చదవాలనుకోవటం తప్పు కాదు, మంచి ఇంగ్లీషు మాట్లాడాలనుకోవటం తప్పు కాదు...కానీ ఇంగ్లీషే తాగాలి, ఇంగ్లీషే తినాలి, ఇంగ్లీషుతోనే బ్రతుకంతా ఉంది అనుకోవటమే తప్పు! తెలుగెందుకు ఇంగ్లీషులోనే అభివృద్ధి అంతా ఉంది అనుకోవటమే తప్పు. మన పక్కనున్న చైనా వాళ్లు ఏ ఇంగ్లీషు నేర్చుకుని ఇంతగా అభివృద్ధి చెందారు? 

ఇక్కడ అసలు నవ్వొచ్చే (ఏడవలేకే లేండి) విషయమేమిటంటే ఈ ఇంగ్లీషు స్కూళ్లలో చదివే అధిక శాతం పిల్లలు మాట్లాడే ఇంగ్లీషు వింటే ఇంగ్లీషు సరిగ్గా రాని నేనే చాలా నయం అనిపిస్తుంది. ఓ గ్రామరు ఉండదు, ఓ వ్యాక్య నిర్మాణం సరిగ్గా ఉండదు..ఓ..యా..లే తప్ప అందులో భాషే ఉండదు.  ఇలాంటి ఇంగ్లీషు వస్తే ఎంత రాకపోతే ఎంత? ఓ విషయం ఇచ్చి ఓ పది వ్యాక్యాలలో చిన్న వ్యాసం వ్రాయమనండి. స్పెల్లింగు తప్పులు లేకుండా ఒక్క వ్యాక్యం కూడా ఉండదు. అందరూ ఇంతే అనను కాని చాలావరకు ఇంతే.  ఈ ఇంగ్లీషు మీద మరోసారి మాట్లాడుకుందాం.

మైదుకూరులో స్కూలు మూసేయించుతారంట..ఎన్ని స్కూళ్ళని అలా మూసేయించుతారు..తల్లిడండ్రులు ఇష్టపడే కదా తమ పిల్లలని ఇంగ్లీషు మీడియం స్కూళ్లకి పంపుతుంది. మన ఇళ్లల్లో ఎంతమందిమి పిల్లలకి చక్కటి తెలుగు నేర్పుతున్నామో, ఎంతమందిమి పిల్లలతో పూర్తిగా తెలుగులోనే మాట్లాడుతున్నామో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుందాం.  మన పిల్లలు ఎంతమంది తెలుగు అక్షరాలు అన్నీ గుర్తుపట్టగలరు?..తప్పులు లేకుండా ఎన్ని గుణింతాలు వ్రాయగలరు? ఎన్ని అంకెలు చెప్పగలరు?..వారాలేంటో అవి ఎన్నో ఎంతమందికి తెలుసు?  అసలు జనవరి.......ఫిబ్రవరే కాదు తెలుగు సంవత్సరాలు కూడా ఉన్నాయని ఎంతమంది పిల్లలకి తెలుసు??మారాల్సింది మనం.

తల్లిదండ్రులూ ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి--తప్పెవరిది??


Read more...

October 2, 2009

పాండవులున్న గుట్టలట.....ఎవరయినా చూసారా?


పాండవులు అరణ్యవాసం చేసినప్పుడు,  రాముడు వనవాసం చేసినప్పుడు ఎక్కడెక్కడ తిరిగారో చెప్పటానికి మన దేశంలో బోలెడు కథలు ప్రచారంలో ఉన్నాయి.  వాళ్లు నిజంగా అక్కడ తిరిగారో లేదో తెలియదు కాని ఆ ప్రదేశాలు చూసినప్పుడు మాత్రం ఒక రకమయిన ఉద్వేగానికి లోనవుతాం.  అనుకోకుండా అలాంటి ఓ కొండకి ఈ మధ్య వెళ్ళి వచ్చాం....అదే పాండవుల గుట్టలు (పాండవుల గుహలు, పాండవుల కొండలు....ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు). పాండవులు అరణ్యవాసం చేసినప్పుడు అక్కడ ఉన్నారని కథ,  దానికి ఆనవాళ్లుగా అక్కడ కొండల మీద దశరథుడు గీసాడని చెప్పే బొమ్మలు ఇంకొన్ని చారిత్రిక ఆధారాలు ఉన్నాయి.....ఇవన్నీ నిజమా కాదా అన్నది పక్కన పెడితే.....పచ్చని చేల మధ్య ఈ కొండలు మాత్రం నిజంగా ఓ అద్భుతం. నాకు బాగా నచ్చాయి.  ఇవి వరంగల్లు జిల్లా రేగొండ మండలంలో ఉన్నాయి.


పోయిన వారాంతం వరంగల్లు జిల్లాలోని రామప్ప గుడి చూడటానికి వెళ్లి పనిలో పనిగా వీటిని కూడా చూసి వచ్చాం.  రామప్ప గుడి నుండి 24 కి.మీ దూరంలో ఈ కొండలు ఉన్నాయి.  రామప్ప నుండి ఘనపురం మీదుగా పరకాల రోడ్డులో భూపాలపల్లి క్రాసు రోడ్డు (కొత్తపల్లి) దాకా వెళ్ళాక ఎడమ వైపుకి తిరిగితే అక్కడి నుండి ఒక కి.మీ దూరంలో జూబ్లీనగర్--తిరుమల గిరి గ్రామాల మధ్య ఉన్నాయి ఈ కొండలు. ఈ కొండల్ని చూస్తే మెకన్నాస్ గోల్డు సినిమాలోని కొండలు గుర్తొస్తాయి (నేను చూసిన నాలుగయిదు ఇంగ్లీషు సినిమాలలో ఇది ఒకటి, అదీ బడాయి).

ఈ కొండలు ఓ 300-400 మీటర్ల ఎత్తు ఉండి ఉండవచ్చు.  వీటిని పూర్తిగా చూడాలంటే ఓ రోజు పడుతుంది.  ఎన్ని గుహలో.....ఎన్నెన్ని మలుపులో!  అన్నీ ప్రకృతి విచిత్రాలే!  కొండ పైకి నడవటానికి కొంతవరకు మెట్లు, సిమెంటు చేసిన దారి ఉన్నాయి. ఆ పైన ఎక్కాలంటే కాస్త కష్టమే. ఓపిక  ధైర్యం  ఉన్నవాళ్లు  ఎటునుండయినా  ఎక్కవచ్చు. ఇంకొక విషయం ఏమిటంటే వీటిని గురించి చెప్పేవాళ్లు.... దారి చూపించే వాళ్లు లేకపోతే వీటిని చూడటం మన వల్ల కాదు. వచ్చిన వాళ్లకి దారి చూపించటానికి, వాటి గురించి చెప్పటానికి ఆ కొండల దగ్గర ఓ ఇద్దరు ముసలి వ్యక్తులు ఎప్పుడూ కాచుకుని కుర్చుని ఉంటారు....వాళ్లు లేకపోతే మనం ఏమీ చూడలేము.  వాళ్లకి ఎంతో కొంత మనకు తోచినంత ఇస్తే చాలు.  ఆ వయస్సులో కూడా వాళ్లు అంత ప్రయాసపడి మనకి దారి చూపుతున్నందుకు నిజంగా అభినందనీయులు.  అది వాళ్లకి భుక్తి మార్గం కూడా.  వాళ్లు గత నలభై సంవత్సరాలనుండి ఇదే వృత్తిలో ఉన్నారట, మరియు ఈ కొండలకి ఈ మాత్రమన్నా ప్రాచుర్యం రావటానికీ,  అక్కడ ఈ మెట్ల సౌకర్యం అదీ రావటానికి వారే కారణమట! ఇంకా ఏదో చేయాలన్న తపన ఉంది వాళ్లల్లో.


మేము కొండ పైకి సుమారు రెండు కి.మీ ఎక్కి ఉంటాము.....అంటే అంతవరకే నడక దారి మెట్లు ఉన్నాయి . కొండలు విభిన్న ఆకృతులలో భలే ఉన్నాయి.  అభిమన్యుడి  రధచక్రం,  కృష్ణుడి చక్రం...ఇలా ఆకారాలని బట్టి వాటికి పేర్లు.  ఓ కొండ అయితే పడుకున్న ఒంటె ఆకారంలో ఉంది.  మధ్య మధ్య చిన్న చిన్న నీటి మడుగులు...వాటికి కుంతీ గుండం, ద్రౌపది గుండం..భరధ్వాజ గుండం..పాండవుల కోనేరు.... అని ఏవేవో పేర్లు.  ఇంకొక విషయమేమిటంటే ఇక్కడి రాళ్లు అసలు జారవు,  కొంచం గరుకుగా ఉన్నాయి.


ఓ నిఠారయిన కొండ మీద కుంతీదేవి గుడి ఉంది.  ఈ  కొండ ఎక్కటం చాలా కష్టంగా ఉంటుంది.....ఏటవాలుగా కొండ అంచు మీద ఎక్కాలి.  మధ్యలో పట్టుకోవటానికి నాలుగు చిన్న చిన్న ఇనుప రాడ్లు పాతారు.. ..ఆ రాడ్ల పక్కనే కాలు పెట్టటానికి కొంచం రాతిని చెక్కారు.  అవి కూడా ఈ మధ్యే పెట్టారట....లేకపోతే అసలు ఎక్కలేకపోదుం..ఆ కొండ అంచున ఎక్కుతూ ఒక్కసారి కిందకి చూసామంటే.....ఇక అంతే!  కాస్త భయం ఉన్నవాళ్లయితే కిందకి పడిపోతారేమో కూడా!  ఆ ముసలివాళ్లు ఇద్దరూ మాత్రం ఎంత అలవోకగా ఎక్కారో!  పైకి ఎక్కాక మాత్రం మహ ఆద్భుతంగా ఉంటుంది....ఓ గుహ.....అందులోకి మోకాళ్లమీద పాకుతూ వెళ్లాలి....అక్కడ..అప్పట్లో కుంతీదేవి పూజ చేసిన దేవుని విగ్రహాలని చెప్తారు....అవి ఉంటాయి.  పక్కన నీటి గుండం..అక్కడ నీరు ఎప్పుడూ వస్తుంటుందట.

ఇది ధర్మరాజు  పీఠం

మునీశ్వర గుహ,  ధర్మరాజు పీఠం..ఇలా కొన్ని గుహలకి పేర్లు పెట్టారు.  మునీశ్వర గుహ....ఇక్కడ భరధ్వాజ ముని తపస్సు చేసుకునేవాడట. ధర్మరాజు పీఠం...ఇక్కడ ధర్మరాజు కూర్చునేవాడట. ఇక్కడ చాలా  చల్లగా ఉంది. అక్కడే రకరకాల బొమ్మలు గీసి ఉన్నాయి...వాటిని పాండవులు గీసారని చెప్తారు. అవన్నీ కూడా ఎప్పటివో పురాతనకాలం నాటివి లాగానే ఉన్నాయి.  కొండ పైకి ఎక్కేముందు కూడా కింది నుండి చూస్తుంటే  ఒకచోట జింకల బొమ్మలు గీసి ఉంటాయి....... ధర్మరాజు ఎక్కడ ఉంటే అక్కడ అలా జింకలు బొమ్మలు గీసేవాడట!!

ఇవి పాండవులు గీసిన బొమ్మలట!

అప్పట్లో వాళ్లు రాళ్లతో గుమ్మాలు దర్వాజాలు కూడా కట్టుకున్నారట....అలాంటి ఓ ధర్వాజా  చూసాము.  మేము అన్ని కొండలు చూడలేదు.....అవన్నీ చూడాలంటే చాలా ఓపిక కావాలి....ఎక్కటం కూడా  కష్టమే.  ఈ కొండల మీద రకరకాల మెడిసినల్ ప్లాంట్సు కూడా ఉన్నాయి..పాము విషానికి విరుగుడుగా పనికొచ్చేవి..డయాబెటిస్‌ (షుగర్) వ్యాధికి వాడే ఆకులు, జమ్మి, మారేడు.. ఇలా చాలా రకాల మొక్కలు చూపించారు.

ఇదే రాతి దర్వాజా,  మాకు దారి చూపిన తాత

ప్రస్తుతానికయితే ఈ కొండల దగ్గర పర్యాటకులకు ఎలాంటి  సౌకర్యాలు లేవు.  అసలు వీటి గురించి సరయిన ప్రచారం కూడా లేదనే చెప్పవచ్చు.  వీటిని చూసాక మన చుట్టూ ఉన్న ఇలాంటి వాటిని వదిలి ఎక్కడికెక్కడికో వెళ్లి చూసి వస్తుంటాము అనిపించింది.  ఎప్పుడూ చూసే ప్రదేశాలే కాకుండా ఇలాంటి చోట్లకి వెళితే కొత్త అనుభవాలు..కొంగొత్త అనుభూతులు మన సొంతం చేసుకోవచ్చు.  పిల్లలకి కూడా మంచి హుషారుగా ఉంటుంది. హైదరాబాదులాంటి రద్దీ ప్రదేశాలనుండి ఇలాంటి వాటి దగ్గరకి వెళితే ఎంత ప్రశాంతంగా ఉంటుందో!

 ఇప్పటికయితే ఇక్కడ  పర్యాటకుల రద్దీ అసలు లేనట్టే,  ఎప్పుడయినా వస్తుంటారట.  మేమెళ్లిన రోజయితే పండగని ఎవరూ రాలేదు అని చెప్పారు.  ప్రభుత్వం శ్రద్ధ తీసుకుని వీటిని అభివృద్ధి చేస్తే మంచి పర్యాటక స్థలంగా మారుతుంది.

ఈ గుట్టలకి సంబంధించిన మరికొన్ని చిత్రాలు నా ముందుటి టపాలో చూడవచ్చు.
Read more...

September 30, 2009

ఈ చిత్రాలెక్కడివి?

ఈ  క్రింది  చిత్రాలు  ఏంటో  ఎక్కడివో  ఎవరయినా  గుర్తు పట్టగలరేమో  ప్రయత్నించండి.
Read more...

September 29, 2009

మా రామూ ఇక లేదు

మా మూడవ రామూ గురించి వ్రాసి కూడా బ్లాగులో పెట్టటానికి ఇదిగో అదిగో అనుకుంటూ బద్దకించాను. ఇంతలోనే దానికి బాగోలేదన్న వార్త,  ఆ పైన చనిపోయిందన్న వార్త!  అది చనిపోయే సమయానికి ఇంట్లో మా అమ్మ వాళ్లు కూడా లేరు.  అంతకు రెండు రోజుల ముందు నుండి దానికి కాస్త ఒంట్లో బాగుండటం లేదు, డాక్టరుకి చూపించి మందులు వాడారు, కాస్త తేరుకుందని బెంగుళూరు వెళ్ళారు....అంతలో ఈ వార్త!  వాళ్లు రేపు కాని రారు.  మా నాన్నకి ఇంకా ఈ వార్త తెలియదు. అసలే ఆయనకి దానిని అలా వదిలి పెట్టి ఊరెళ్లటం ఏమాత్రం ఇష్టం లేకపోయినా తప్పక వెళ్లారు.  రేపు వచ్చాక ఈ వార్త తెలిసి ఎలా స్పందిస్తారో అని మా అందరికి కంగారు.  మొన్న దానికి బాగోనప్పుడే పది మంది డాక్టర్లని సంప్రదించి....సరయిన డాక్టరు లేరని ఓ రోజంతా హడావిడీ చేసారు. అసలు ఈ వయస్సులో వాళ్లకి అదే పెద్ద తోడు.....దానితోనే వాళ్లకి కాస్త కాలక్షేపం.

మా చిన్నప్పుడు మా ఇంటికి వచ్చే RMP డాక్టరు గారికి ఓ పెద్ద ఆల్సేషియన్ కుక్క ఉండేది.  దాని పేరు సీజర్--అప్పటికి ఇంకా జూలియస్ సీజరు పేరు తెలియదు కాబట్టి ఇదేం పేరబ్బా అనుకునేవాళ్లం.  నేను కనుక కుక్కను పెంచుకుంటే ఏ రామూనో రాజూనో అని పేరు పెడతా గాని ఇలాంటి పిచ్చి పేర్లు పెట్టను అనుకునేదాన్ని. అలాగే మా ఇంట్లో మేము పెంచుకున్న మూడు కుక్కల పేర్లు రామూనే!

మా రెండో రామూ అలా అకస్మాత్తుగా చనిపోయాక చాలా రోజులు ఎవరం మళ్లా కుక్కని పెంచాలన్న ఆలోచన చేయలేదు. తరువాత ఎప్పుడో మా మూడో రామూ వచ్చింది మా ఇంటికి. ఇది కూడా మా మొదటి ఇద్దరి రామూలు వచ్చిన ఇంటినుండే వచ్చింది. ఇది ఎప్పుడొచ్చిందో కూడా నాకు గుర్తు లేదు..బహుశ పదిహేనేళ్లు పైనే అయి ఉంటుంది. దూరంగా ఉండటానేమో నాకు దీనితో అంత అనుబంధమూ లేదు, కాని దానికి మాత్రం మా మీద చాలా ఆభిమానం. ఇప్పటికీ ఇంటికి వెళితే ముందు ఓ  పది నిమిషాలు దాని  తల నిమరకపోతే ఊరుకోదు.  ఆ అభిమానం మా ముగ్గురి పిల్లల మీదే (అంటే ఆ ఇంటి పిల్లల మీదే)...మరలా ఇంటి అల్లుళ్ళు, కోడలు, మనవళ్లు, మనవరాలి మీద ఉండదు...నాకు ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో ఎవరు చెప్పారు దానికి మా బంధుత్వాలు అని!!

ఇది మా నాయనమ్మకి వీరాభిమాని. హచ్ ఏడ్‍లో కుక్కలాగా ఇది కూడా మా నాయనమ్మ ఎక్కడుంటే అక్కడే! అసలు వదిలేది కాదు. అప్పటికే మా నాయనమ్మ ఓపిక అయిపోవటం మూలాన ఎక్కువగా పడుకునే ఉండేది. మా నాయనమ్మ ఏనాడూ దానికి అన్నం పెట్టి ఎరగదు. దాని అన్నపానాదులు అన్నీ మా అమ్మే చూసుకునేది అయినా దానికి మా నాయనమ్మ అంటేనే ఇష్టంగా ఉండేది. ఆమెకి బాగోనప్పుడు ఆమె మంచాన్ని అసలు వదిలేది కాదు.  బయటి వాళ్లని ఎవరినీ ఆమె మీద చెయ్యి వేయనిచ్చేది కాదు..చివరికి డాక్టరుని కూడా...ముందు దానిని కట్టేసాకే డాక్టరు గారు లోపలికి వచ్చేవాళ్లు.

మామూలుగానే ముందునుండీ మా అమ్మ నాన్లకి మా ఇళ్లకి ఎవరిళ్లకి వచ్చి ఓ నాలుగు రోజులు ఉండే అలవాటు లేదు! ఎప్పుడైనా వచ్చినా ఒకటి రెండు రోజులే ఉండేది.  మా నాయనమ్మ ఉన్నంతకాలం ఆమెకి కష్టం అని వచ్చేవాళ్లు కాదు..ఇప్పుడేమో కుక్క వంక చెపుతారు..మేము లేకపోతే అది అన్నం తినదు..పాలు తాగదు అంటూ.
మా నాన్న మాతో ఉన్నట్టే దానితో కూడా యమా  స్ట్రిక్టుగా ఉంటారు. అది కూడా ఆయన ఉన్నంత సేపు ఎంత బుద్దిమంతురాలి లాగా ఉంటుందో!

బాగా తెలిసినవాళ్లు కూడా అది చూస్తూ ఉండగా మా ఇంట్లో నుండి ఏ వస్తువూ (అది వాళ్ల వస్తువు అయినా సరే) తీసుకెళ్లే సాహసం చేయరు.  అప్పటివరకు మెదలకుండా పడుకుందల్లా వాళ్లు గుమ్మం దాటేటప్పుడు ఒక్కసారిగా ఎగిరి మీద పడుతుంది.  ఎవరికయినా ఏ వస్తువయినా ఇవ్వాలంటే దాన్ని కట్టేసి అయినా ఇవ్వాలి లేదా మా  అమ్మ బయటికి వెళ్లి దానికి కనపడకుండా అయినా ఇవ్వాలి.

ఇంతగా అలవాటయిన ప్రాణి ఇక లేదంటే రేపటినుండి వాళ్లకి ఎలా ఉంటుందో!!

Read more...

September 21, 2009

అమ్మమ్మ-అల్జీమర్స్

 సెప్టెంబరు 21,  ప్రపంచ అల్జీమర్స్ రోజు

ముసలితనం కన్నా భయంకరమైన జబ్బు ఇంకొకటి  లేదట!

ప్రపంచంలో ఏ జబ్బుకయినా మందులు ఉన్నాయి, ఉపశమనం ఉంది.....కాన్సరు, ఎయిడ్సు లాంటి ప్రాణాంతక వ్యాధులను కూడా ముందుగా గుర్తించి సరైన వైద్యం అందిస్తే పూర్తిగా తగ్గించవచ్చు కానీ ఈ ముసలితనం అన్నది చికిత్స లేని జబ్బు అని  సెలవిచ్చాడు ఓ మహానుభావుడు.  మరి ఈ చికిత్స లేని జబ్బుకి తోడు ఇంకో చికిత్స లేని జబ్బు తోడయితే.......ఆ వ్యక్తి పరిస్థితేమిటి?  అదే అల్జీమర్స్.....వయస్సుతో వచ్చే మతిమరుపు రోగం.... .అది కూడా భయంకరమయిన ప్రాణాంతకమయిన  మతిమరుపు.


ప్రస్తుతం ప్రపంచంలో 65 ఏళ్ళకు పైబడిన వారిలో 5 శాతం మంది ఈ వ్యాది భారిన పడుతున్నారని ఓ అంచనా.  దీని ముఖ్య లక్షణం జ్ఞాపకశక్తి క్షీణించటం.  మతిమరుపు అన్నది మన అందరిలో కొద్దొ గొప్పో ఉంటూనే ఉంటుంది.  వయస్సు పైబడే కొద్ది అది కాస్త ఎక్కువ అవుతుంది.  కానీ ఆ ఎక్కువవటం అన్నది ఈ వ్యాధిగ్రస్థుల్లో ఎంత ఎక్కువగా ఉంటుందంటే  ఈ మతిమరుపుతో రోజురోజుకి వారి దైనందిక జీవితం దుర్లభంగా మారుతుంది.  ఏదీ గుర్తుండదు.  అన్నం తిన్నది లేనిది గుర్తుండదు.  ఇంట్లోని తన మనుషులే తనకి గుర్తుండరు.... పేర్లు గుర్తుండవు,  బంధుత్వాలు గుర్తుండవు......  జీవితంలో అనుభవాలు, అనుభూతులు ఏవీ గుర్తుండవు.

 మొదట్లో వర్తమానానికి గతానికీ  మధ్య రంగుల రాట్నం తిరుగుతూ ఉంటారు.  తరువాత తరువాత గతం, వర్తమానం ఏమీ గుర్తుండవు. అంతా అయోమయం...శూన్యం.....ఆ శూన్యంలో నుండి వచ్చే అసహనం, కోపం, చిరాకు....... స్నానం చేయటం, బట్టలు మార్చుకోవటం లాంటి దైనందిక పనులు కూడా చేసుకోలేరు.  కొన్నాళ్లకి మాట్లాడటం, వ్రాయటం, నడవటం కూడా చేయలేరు.  వారి జ్ఞాపకాలన్నీ బ్రతికుండగానే సమాధి అయిపోతాయన్నమాట!   ఇలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తి మన ఇంట్లోనే ఉంటే!!


అవును మా అమ్మమ్మకి ఓ మూడు నాలుగు సంవత్సరాలనుండి ఈ వ్యాధి ఉంది.  ఆమె వయస్సు 80 పైనే.  ముందు మామూలు వయస్సుతో పాటు వచ్చే మతిమరుపు అనుకున్నాం.  తరువాత తరువాత అసలు రోజూ చూసే మనుషుల్ని కూడా  గుర్తుపట్టటం మానేసింది.  నేను దాదాపు రెండు మూడురోజులకి ఒకసారి తన దగ్గరకి వెళ్లేదాన్ని.  ఒక్కో రోజు బాగానే గుర్తు పట్టేది.....ఒక్కో రోజు నువ్వెవ్వరివమ్మా అని అడిగేది.  ఏంటమ్మమ్మా నేను అంటే ఏమోనమ్మ గుర్తురావటం లేదు అని అమాయకంగా ఓ నవ్వు నవ్వేది.  మీ లక్ష్మి గారమ్మాయిని అంటే మళ్లీ కాస్త జ్ఞాపకం వస్తా!! మొదట్లో మాకు ఇదంతా కొంచం వినోదంగానే ఉండేది......తరువాత తరువాత అర్థం అయ్యింది ఈ మతిమరుపు ఎంత బాధాకరమో.  తనకే కాదు ఇంట్లో వాళ్లకి కూడా దాంతో చాలా ఇబ్బందే.

అన్నం తిన్న కాసేపటికే ఏంటి ఇవాళ నాకింకా అన్నం పెట్టలేదు పెట్టు అంటూ వచ్చి టేబులు దగ్గర కూర్చుంటుంది.   ఉండుండి గతంలోకి వెళ్లిపోతుంది...అక్కడే బ్రతికేస్తుంది.....ఇక ఆమె ఆలోచనలు అప్పటినుండి  ఇప్పటికి రావు....అక్కడే ఆగిపోతాయి.  ఆమె మేనత్తలు, మేనమామలు, ముసలమ్మలు... అన్నయ్యలు, వాళ్ల పిల్లలు....తను అప్పటి జీవితంలో ఎవరితో అయితే ఎక్కువ సన్నిహితంగా ఉందో  వాళ్లందరూ గుర్తుకొస్తారు.  వాళ్లందరూ (పోయినవాళ్లతో సహా) ఇప్పుడు తనతో ఉన్నారనుకుంటుంది.

అప్పట్లో పొద్దున్నే లేచి గొడ్ల దగ్గరికి వెళ్ళి పాలు తీయటం, వాకిట్లో నీళ్లు చల్లి ముగ్గు వేయటం.....ఇవన్నీ గుర్తుకొస్తాయి....పాలుపిండే టైము అయింది చావిడి దగ్గరికి వెళ్ళాలంటూ హడావిడిగా బయలుదేరుతుంది!  ఒక్కోరోజు అర్థరాత్రి లేచి తెల్లవారింది వాకిలి ఊడవాలి అంటూ చీపురు పట్టుకు బయలుదేరుతుంది.  ఇక మామయ్య వాళ్లు తలుపులకి తాళం వేయటం ప్రారంభించారు.  మొన్నొక రోజు ఇలానే రాత్రిపూట లేచి వాకిలి ఊడవాలి అంటూ చీపురు కోసం చీకట్లో దేవులాడుతూ పడి కాలు తుంటి విరగ్గొట్టుకుంది, దానికి ఆపరేషన్..... ఆరు వారాలు బెడ్ రెస్టు....ఎంత నరకమో!!

 ఈ మతిమరుపు అన్నది కూడా తెరలు తెరలుగా వస్తుందనుకుంటా!  అప్పటిదాకా మామూలుగా ఉందల్లా హఠాత్తుగా లేచి అమ్మాయి నేనొచ్చి చాలా సేపయిందిగా ఇక నేను మా ఇంటికి వెళతా  అంటూ బయలుదేరుతుంది.  ఎప్పుడూ ఎవరో ఒకరు కాపలా ఉండాలి.  ఎప్పుడైనా ఒకటి రెండు రోజులు వేరే ఎక్కడికయినా వెళ్ళొస్తే తనకి ఇల్లు మనుషులు అంతా కొత్తగా కొత్తగా అయోమయంగా ఉంటుంది.  బాత్రూం ఎక్కడో...వంటిల్లు ఎక్కడో....బెడ్ రూము ఎక్కడో అన్ని మర్చిపోతుంది....అన్నీ మళ్లీ అలవాటు చేయాలి.

వీళ్లతో వ్యవహరించటం కూడా చాలా కష్టమే.  ఊరికే కోపం వస్తుంది.  నువ్వు అన్నీ మర్చిపోతున్నావు అంటే మా అమ్మమ్మకి ఎంత కోపమో.  వీళ్లని పసిపిల్లలకి మల్లే  జాగ్రత్తగా చూసుకోవాలి.  వాళ్లతో వాదనలు పెట్టుకోకూడదు.  స్నేహభావంతో మెలగాలి.  వాళ్లు చేస్తామన్న పనులు చిన్నవి చిన్నవి చేయనివ్వాలి, కాకపోతే ఎవరో ఒకరి పర్యవేక్షణ ఉండాలి. 

ఇదంతా ఒక ప్రత్యేకమైన జన్యువులో లోపం వల్ల వస్తుందట. పల్లెటూర్లలో వారికంటే పట్నాలలోని వారికి ఎక్కువగా వస్తుందట. ఒంటరి జీవులకు ఇది మరీ తొందరగా వస్తుందట....ఆడవారికి మరీను. ఇది రాకుండా నివారించటానికో వచ్చాక  తగ్గించటానికో ప్రత్యేకమయిన చికిత్స కాని మందులు కాని లేవనే చెప్పొచ్చు. మన దేశంలో దీని గురించి ప్రజలలో అవగాహన కూడా తక్కువే.  ఇప్పుడు ఏవో స్క్రీనింగులు,  టెస్టులు- MMSE (Mini Mental State Exam)  వచ్చాయి....ముందుగా గుర్తించవచ్చు అంటున్నారు కాని  అవన్నీ అభివృద్ధి చెందిన దేశాల్లోనే అంతంతమాత్రంగా ఉన్నాయి.  ఇక మన దేశంలో విస్తృతంగా రావటానికి చాలా సమయం పట్టవచ్చు. మనదేశంలో కూడా వీళ్ల కోసం ఓ సొసైటీ ఉంది. 

అసలు మనిషి ఆయుర్దాయం పెరిగేకొద్ది ఇలాంటి సమస్యలు కూడా ఎక్కువవుతున్నాయి.  బుర్రకి ఎప్పుడూ ఏదో ఒక పని పెడుతుంటే ఈ జబ్బు వచ్చే అవకాశాలు తక్కువట.  అందుకే 50 దాటిన వారు పుస్తకాలు చదవటం, పజిల్సు ఎక్కువగా చేస్తుండటం లాంటివి చేస్తుండాలి అని చెపుతున్నారు శాస్త్రవేత్తలు. అసలు నన్నడిగితే రిటైర్మెంటు దగ్గరపడ్డ వాళ్లందరికి బ్లాగులు చదవటం అలవాటు చేస్తే సరి,  మేదడుకి మంచి మేత!!

    మా అమ్మమ్మ లాంటి మరెంతమందో అమ్మమ్మలకి,  తాతయ్యలకి  ఈ  టపా.


Read more...

September 3, 2009

జాతస్య మరణం ధృవమ్

"జాతస్య మరణం ధృవమ్" మరోసారి రుజువయ్యింది. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు?  నిన్నటి వరకు ఈ రాష్ట్రాన్ని శాసించిన వ్యక్తి,  తన ఎత్తులతో జిత్తులతో  రాజకీయ ప్రత్యర్థులకి గుండెల్లో రైళ్ళు పరుగెత్తించి కంటి మీద నిద్ర లేకుండా చేసిన వ్యక్తి.....ఇక లేడు. దేవుడు మా పక్షమే అని గర్వంగా చెప్పుకున్న వ్యక్తి ఎవరికీ చెప్పకుండానే ఆ దేవుడి దగ్గరకు వెళ్లిపోయాడు!

చిద్విలాసంగా చేయి ఊపుతూ ఆత్మవిశ్వాసంతో హుందాగా ఠీవిగా నడిచొచ్చే రాజశేఖరరెడ్డి ఇక లేరు అంటే నమ్మశక్యంగా లేదు.  నిజంగా రాష్ట్ర చరిత్రలో ఇది ఓ దుర్దినం.  తను ఎలాంటి వ్యక్తి అయినా ఇలాంటి అర్థంతపు చావు అది కూడా 24 గంటల తరువాత కాని ఏం జరిగిందో ..అసలు ఎలా జరిగి ఉంటుందో అంతుపట్టని అయోమయం..గుర్తుపట్టటానికి కూడా వీలులేకుండా ముక్కలు ముక్కలయిపోయిన శరీరం..ఇలాంటి చావు ఎవరకీ వద్దు అనిపించేంతటి భీభత్సం.  అనామకంగా కారడవుల్లో,  హోరు వర్షంలో,  కొండల మధ్య  మంటలకు ఆహుతి అయ్యాడంటే నమ్మశక్యంగా లేదు.  జల యజ్ఞం...జల యజ్ఞం అని తపించిన వ్యక్తి ఇలా ప్రకృతి కన్నెర్రకి గురి కావటం విచిత్రమే!

తన గుండె ధైర్యం,  స్థిరచిత్తం,  మొండితమే తనకీ చావుని తెచ్చిపెట్టాయా?  నిన్న ఈ వార్త విన్నప్పటి నుండీ కూడా నాకు పూర్తి నమ్మకం, ఎక్కడో అడవుల్లో చిక్కుకుని పోయుంటారు,  ఇప్పుడో అప్పుడో తన ట్రేడ్ మార్కు నవ్వుతో చేయి ఊపుకుంటూ క్షేమంగా తిరిగి వచ్చేస్తారని.  రాత్రి కల కూడా......రాజశేఖరరెడ్డి గారి కుడి చేతికి ఓ చిన్న దెబ్బ తగిలింది, మరేం పర్లేదు క్షేమంగా ఉన్నారని.....అంతే ఇలానే జరిగి ఉంటుందని పొద్దున లేచాక కూడా ఓ ధీమా,  ఓ నమ్మకం... కానీ కాసేపటిలోనే అంతా అయిపోయిందన్న సమాచారం.

ఒక సంఘటన జరిగాక ఏవేవో వదంతులు వస్తుంటాయి.  భద్రతాలోపాలో.....నిర్ల్యక్షమో.....కారణాలుగా చూపిస్తుంటారు.  ఇలా చేసుండాల్సింది....అలా చేసుండకూడదు అని వృధా విశ్లేషణలు జరుపుతుంటారు.  కానీ ఏం చేసినా పోయిన ప్రాణాలు తిరిగి రావు కదా!  ఇక ఆ మనిషి లేడు తిరిగరాడన్న  నిజాన్ని మనం ఇంకా జీర్ణమే చేసుకోలేదు కాని మన రాజకీయనాయకులు మాత్రం ముఖ్యమంత్రి పదవి కోసం రాజకీయ జిత్తులకు అప్పుడే తెరలు తీసారు.

ముఖ్యమంత్రి గారితో పాటు  ఆయన ముఖ్య కార్యదర్శి సుబ్రహ్మణ్యం, భద్రతాధికారి వెస్లీ,  పైలట్లు భాటియా, సత్యనారాయణ రెడ్డి గార్ల ఆత్మకు శాంతి కలగాలని అశిస్తూ.....వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియచేస్తూ!!


Read more...

August 17, 2009

ఓ వర్షాకాలం సాయంత్రంఈ నగరానికి దూరంగా .....మా ఊరికి దగ్గరగా
ఓ వర్షాకాలం సాయంత్రం
హోరు వాన.......చుట్టూ నీటితో నిండిన పొలాలు...
కనుచూపుమేరా పొలాలు.....చుట్టూ నీరే తప్ప ఇంకో ప్రాణి కన్పించని ప్రదేశం..
అక్కడక్కడా ఆ నీటిలోనుండి తొంగి చూస్తున్న అప్పుడే నాటిన చిన్ని చిన్ని వరి మొలకలు
ఆ పొలాల మధ్యనుండి ఓ తారు రోడ్డు
ఆ రోడ్డు మీద 80-90 కిలోమీటర్ల స్పీడులో వెళ్లే కారులో నేను
రోడ్డుకి ఇరువైపులా వర్షపు లయకు తాళం వేస్తూ తలలూపుతున్న చెట్లు
రోడ్డు మీద సుడులుగా ప్రవహించే నీరు.....కారు వేగానికి ఆ నీరంతా ఎగసి కారుని ముంచేస్తుంటే...
ఓహ్.. ఆ అనుభవం మాటల్లో వర్ణించలేనిది.

మొన్న రెండు రోజుల వర్షం రైతులకి ఎంతటి ఊరటను ఇచ్చిందో నాకు అంతకు రెట్టింపు అనుభూతిని మిగిల్చింది. మన ఇంటి బాల్కనీలోనో, కిటికీ పక్కనో కూర్చుని ఏ మిరపకాయ బజ్జీలో పకోడీలో తింటూ వర్షాన్ని చూస్తూ... వింటూ అనుభవించవచ్చు....వర్షంలో తడుస్తూ అనుభవించవచ్చు.....దేని అనుభూతి దానిదే....కానీ పంటపొలాల మీద ప్రకృతితో పాటు ఉంటూ వర్షాన్ని అనుభవించటం ఉందే అది మాటలలో వర్ణించలేనిది.

ఇంతకుముందు చాలాసార్లు అనుకునో అనుకోకుండానో వర్షంలో తడిచాను, వర్షాన్ని అనుభవించాను.  చిన్నప్పుడు  బడినుండి కావాలని తడుస్తూ ఇంటికొచ్చిన రోజులున్నాయి. ఊటీలో, కొడైకెనాల్‌లో వర్షంలో తడుస్తూ తిరుగాడిన అనుభూతులున్నాయి, కానీ ఆ అనుభూతులన్నిటినీ మించిన అనుభూతి మొన్నటి సాయంత్రం వర్షంలో కాకుమాను నుండి మా ఊరు చేసిన ప్రయాణం. ఈ జన్మకిది చాలు అనిపించేంతటి అనుభూతి. అసలు ఒక్క రోజులో ఎంత మార్పో. ముందు రోజు చూసిన పొలాలేనా ఇవి అనిపించేంతటి మార్పు.

ఆగష్టు 14, 2009  శుక్రవారం సాయంత్రం హైదరాబాదు నుండి గుంటూరు ప్రయాణం.
దారి పొడవునా ఈ  పాటికి సగం నాట్లు అయిపోయి పచ్చపచ్చగా కళకళలాడాల్సిన పొలాలు బీట్లువారి ఎండిపోయిన గొంతులతో ఓ వాన చుక్క కోసం చకోరపక్షిలా ఆశగా ఎదురుచూస్తున్నాయి. ముందురోజు నాలుగు చినుకులు పడ్డా అవి పొలాలు గొంతులు తడుపుకోవాటానికి కూడా  సరిపోయినట్లు లేవు. మధ్యలో నల్లగొండ దగ్గర అడుగంటా ఎండిపోయిన కృష్ణమ్మని చూస్తే రైతన్నకి ఎన్నాళ్లీ వెతలు అన్న దిగులు. చేతిలో పుస్తకం ఉన్నా కళ్ళు అక్షరాల వెంట పరుగు తీయటం మానేసి బయట పొలాల వెంట పరుగుతీసాయి.

సాయంత్రం ఆరు అయ్యేటప్పటికి ఒక్కసారిగా చల్లపడ్డ వాతావరణం...సత్తెనపల్లి చేరుతూ ఉండగా టప్..టప్ మని చేతిమీద ఓ రెండు చినుకులు....చినుకులా రాలి....నదులుగా సాగి....వరదలై పోయి....అని పాడుకుంటుండగా గుంటూరు వచ్చేసింది..అప్పటికి సన్నటి జల్లుగా మారిన వాన రాత్రి పదయ్యేటప్పటికి జోరందుకుంది. ఆ రాత్రి పంటచేలు కరువుతీరా కడుపు నిండా నీళ్లు తాగాయి.

ఆగష్టు 15, 2009  శనివారం ఉదయం గుంటూరు నుండి కాకుమాను ప్రయాణం.

ఆకాశం నిర్మలంగా ప్రశాంతంగా ఉంది. ఓ భారీ వర్షం పడి వెలిసాక ఆకాశాన్ని చూస్తే నాకెప్పుడూ ఆశ్చర్యమే. . దీన్లోనుండేనా ఇప్పటిదాకా  ఇన్ని నీళ్లు వర్షించింది అనిపిస్తుంది. ఏమీ తెలియని నంగనాచిలా ఎంత మౌనంగా ఉంటుందో!

రాత్రిపడ్డ వానతో దాహం తీర్చుకున్న పొలాల్ని చూస్తే నిన్నటికి ఈ రోజుకి ఎంత తేడా అనిపించింది! నీటితో కళకళలాడుతున్న పొలాలు. ఆ పొలాల్లో బురద నేను సిద్దం ఇక మీ ఇష్టం నాట్లు వేసుకోండంటూ తళతళలాడుతూ మెరిసిపోతూ మురిపిస్తుంది .


శనివారం మధ్యాహ్నం నుండి మళ్లీ భారీ వర్షం.  ఆ వర్షం లోనే కాకుమాను నుండి మా ఊరు ప్రయాణం.  మధ్యలో రేటూరు నుండి గోపాపురం వరకు చేలమధ్య నుండి రోడ్డు వెళ్తుంది.  ఆ జోరు వానలో  నిండా మునిగిన పొలాల మధ్య రయ్యిన కారులో వెళ్తుంటే ఎంత అద్భుతం అనిపించిందో! మాటలకందని అనుభూతి అది!పాలు తాగే పసివాడు బొజ్జ నిండాక పాలు నోట్లోనుండి ఊసేస్తూ చిలిపిగా నవ్వుతూ ఉంటాడు, అచ్చంగా అలానే అనిపించింది ఆ నిమిషంలో నీట మునిగిన పొలాలని చూస్తుంటే!


ఏదేమైనా బీటలు వారిన పొలాల్ని, ఎండిపోతున్న నారుమడుల్ని చూసుకుని గుండెల్లో బాధని కళ్లల్లో నిలుపుకుని వర్షం కోసం ఆర్తిగా ఎదురు చూస్తున్న రైతులకి కాస్తంత ఊరట ఈ వర్షాలు. ముమ్మరంగా నాట్లు మొదలయ్యాయి.  ఆ వర్షంలో తడుస్తూనే ఒక పక్క నారు పీకేవాళ్లు, ఇంకొక పక్క నాటు వేసేవాళ్లు,  పల్లెల హడావుడీ అంతా పొలాల పైనే ఉంది. నాట్లు వేసేటప్పుడు పొలాల్లో నారు కట్టలు ఎలా విసిరి వేస్తారో ఎప్పుడైనా చూసారా? నిజంగా అది ఒక కళ! గృహప్రవేశాలు, పెళ్లిళ్లు.... ఈ శుభకార్యాల హడావిడీ ఒకవైపు, నాట్ల హడావిడీ ఇంకొక వైపు.  వర్షాల  మూలాన ఈ శుభకార్యాలకి ఆటంకం అని ఎవరూ విసుక్కోలేదు. అమ్మయ్య ఇన్నాళ్టికి ఓ మంచి వర్షం పడింది ఇక నాట్లు మొదలుపెట్టవచ్చు అని అందరూ ఆనందించేవాళ్లే.
  
ఏరువాక సాగారోరన్నో చిన్నన్నా

Read more...

July 28, 2009

మా ముగ్గురు రామూలు-1

మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్లింట్లో ఓ పెద్ద కుక్క ఉండేది.  అది మామూలు కుక్కే కాని ఎత్తుగా భీకరంగా ఓ చిన్న సైజు సింహంలా చూట్టానికే భయం వేసేది.  వీధి వాకిట్లో పడుకుని ఎవర్నీ వాళ్లింటి వైపు కన్నెత్తి కూడా చూడనిచ్చేది కాదు.  దానికి పేరేం ఉండేది కాదు...పిలవాలంటే చాయ్, ఇజ్జూ అంతే :). నాకు దాన్ని చూసినప్పుడల్లా ఇంట్లో పెంచుకునే కుక్కలంటే బుల్లిగా ముద్దుగా అందంగా ఉండాలి కాని ఇదేం కుక్క దెయ్యంలా అనుకునేదాన్ని. పెంచుకుంటే అసలు బొచ్చు కుక్కల్నే పెంచుకోవాలి అనుకునేదాన్ని.

మా ఒకటో రాము
నేను ఏడో తరగతిలో ఉన్నప్పుడు అనుకుంటాను మా చుట్టాల బొచ్చు కుక్కకి (పమేరియన్) పిల్లలు పుడితే ఒకదాన్ని తెచ్చుకున్నాం. అది తెల్లటి తెలుపులో ముద్దుగా బొద్దుగా ఉండేది. దానికి మా నాయనమ్మ రాము అని పేరు పెట్టేసింది.  అప్పట్లో పొట్టేలు పున్నమ్మ సినిమాలో శ్రీప్రియ ఎంత ఫేమస్సో అందులో పొట్టేలు కూడా అంతే ఫేమస్సు.  మా నాయనమ్మ ఆ సినిమాకి... ఆ పొట్టేలుకి వీరాభిమాని .....అందుకే ఆ పేరన్నమాట! మా ఊరిలో మొదటి బొచ్చు కుక్క పిల్ల మాకే అన్న గర్వం కూడా ఉండేది మాకు!!ఇలాంటి మొదట్లు మాకు చాలానే ఉన్నాయి మరి!!!

మా ముగ్గురితో పాటు అది కూడా ఒక పిల్లలానే ఉండేది.  మాతో పాటు ఇల్లంతా పరుగులు పెట్టేది.  మా మంచాల మీదే పడుకునేది. మేము పక్కనుంటే బయటి కుక్కల మీదకి వీరావేశంతో వెళ్లేది....కయ్యానికి కాలు దువ్వేది.....మేము లేకపోతే పిల్లిలా తోక ముడుచుకుని వెనక్కి వచ్చేసేది. మా అక్కాయితో మరీ అనుబంధం ఎక్కువ దానికి. తను కాలేజినుండి వచ్చే టైముకి గేటులో కాపలా కాసేది. తరువాత తనకి పెళ్లయి బాబు పుట్టాక వాడిని ఎవరినీ అంటుకోనిచ్చేది కాదు....... మా బావ గారిని కూడా!! ఒక్క మా నాన్నంటేనే కాస్త భయపడేది. అప్పట్లో మా నాన్నకి బైకు ఉండేది.  ఊరి పొలిమేరలో  బైకు మోత వినగానె  గప్‌చుప్‌గా తన గొలుసు దగ్గరకి వెళ్లిపోయి పడుకునేది. దానికి లైఫ్‌బాయ్ సబ్బుతో స్నానం చేయించి చక్కగా దువ్వేవాళ్లం.  ఆ స్నానం చేయించిన రోజు మా ఇల్లు వళ్లు అంతా దాని జుట్టు మయంగా ఉండేది. మేము గోరింటాకు పెట్టుకుంటే దానికి కూడా నుదిటి మీద బొట్టులా పెట్టేవాళ్లం, తెల్లటి తెలుపు మీద ఆ గోరింటాకు భలే ఉండేది.  చెప్పాలంటే దాని కబుర్లు చాలానే ఉన్నాయి!

అలా దాంతో మా సహవాసం 11 సంవత్సరాలు సాగింది.  వయస్సు మీద పడి ఓ రోజు నేను లేకుండా చూసి మరీ కన్ను మూసింది.  మా నాన్న  మా అక్కాయి ఎన్ని రోజులు దాని మీద బెంగెట్టేసుకున్నారో! దాంతో ఓ నాలుగయిదు సంవత్సరాలు మళ్లా ఎవరం కుక్కను పెంచే  ఊసెత్తలేదు.  కుక్కలని పెంచటం అలవాటయ్యాక మనస్సు ఊరుకోదనుకుంటాను....

మా రెండో రాము
మా మొదటి రాము పోయిన ఓ నాలుగయిదేళ్లకి రెండో రాము వచ్చింది మా ఇంటికి. ఇది కూడా మా మొదటి రామూ వాళ్లింటినుండే వచ్చింది ..అంటే ఇది దానికి మనవడో ముదిమనవడో అన్నమాట!! అప్పుడు మా పాప పొట్టలో ఉంది. ఈ రెండో రాము బుల్లిగా భలే ముద్దుగా ఉండేది.....నాకు బాగా కాలక్షేపంగా ఉండేది దానితో.  మాకు ఇల్లు చావిడి అన్నీ కలిసే ఉంటాయి.  అప్పట్లో చావిడి నిండా గొడ్లు, వాములు, పెంట పోగు....... ఆ వాములు... పెంట పోగు నిండా ఎలుకలు, ఆ ఎలుకలు అక్కడనుండి ఇంట్లోకి వచ్చి మా అమ్మని నిద్రపోనిచ్చేవి కావు.  వాటిని నిర్మూలించటానికని మా అమ్మ ఏవేవో చేసేది. ఇంట్లో ఎలుకల బోనులు, కొన్నాళ్లకి ఎలుకలు తెలివి మీరి ఆ బోనుల్లో పడటం లేదని ఎలుకలాళ్లతో బోనులు పెట్టించేది......అవి కాక రాత్రిపూట వాముల్లో అక్కడక్కడా ఎలుకల మందు పెట్టించేది.

అప్పటికి మా రెండో  రాముకి రెండు మూడు నెలల కన్నా వయస్సు ఉండి ఉండదు.  రోజూ రాత్రి పూట పాలు తాగాక దొడ్ది మీద కాసేపు తిరిగి వచ్చేది.  ఆ రోజు కూడా అలానే తిరిగి వచ్చి నా మంచం పక్కన పడుకున్నది ఇక లేవలేదు.  మాకేం అర్థం కాలేదు అలా అకస్మాత్తుగా ఎలా చనిపోయిందా అని! ఆ రోజు సాయంత్రం పనబ్బాయి మా అమ్మ దగ్గరకి వచ్చి అక్కాయ్ వామిలో రెండు ఎలుకలు చచ్చిపోయి ఉన్నాయి అనగానే మా అమ్మకి అప్పుడు తట్టింది రాత్రి మా రామూ తిరుగుతూ వెళ్లి వామిలో పెట్టిన ఎలుకల మందు తిని ఉంటుంది అని.......ఇక మా అమ్మకి కాసేపు నోట మాట రాలేదు.  నాకయితే కొన్నాళ్లు రాత్రి పూట నిద్ర పట్టేది కాదు...... నా మంచం పక్కన అమాయకంగా నిద్రపోతున్న మా రామూనే కళ్ల ముందు మెదిలేది. దానితో ఎక్కువ రోజులు అనుబంధం లేకపోయినా మా మొదటి రాము చనిపోయినప్పటికన్నా ఇది చనిపోయినప్పుడు ఎక్కువ బాధేసింది.

రానారె గారి టపా చదివాక మా రెండో రాము గుర్తుకొచ్చి ఎక్కడో మనస్సు పొరల్లోని గాయం  రేగింది......

మా మూడో రాము గురించి మరెప్పుడైనా............

Read more...

July 16, 2009

పుస్తక ప్రచురణ

వెబ్‌లో పుస్తక ప్రచురణ గురించి పుస్తకంలో నా వ్యాసం.

Read more...

June 6, 2009

నా ఉపవాస దీక్ష

మన తెలుగు వారికి చాలా మందికి రెండు పూటలా సుష్టుగా భోజనం చేయకపోతే ఏదో వెలితిగా వుంటుంది, అందులో నేను కూడా ఒకదాన్ని (ఇంతకు ముందు ముచ్చటగా మూడుపూటలా భోంచేసేవాళ్లం  లేండి, అది వేరే విషయం). ఈ మధ్య కొంతమంది డైటింగు పేరుతో రాత్రి పూట తినకపోవటమో లేకపోతే ఓ రెండు పుల్కా ముక్కలు తినో లేదా ఓ గ్లాసుడు మజ్జిగ తాగో పడుకోవటం చేస్తున్నారు. కొంతమందికి రాత్రి పూట పుల్కాలు తిన్నా ఓ గుప్పెడన్నా పెరుగన్నం తినకపోతే నిద్ర పట్టదు, అంతగా మన పొట్ట అలవాటు పడిపోయింది అన్నానికి. నాలాంటి కొంతమందికయితే ఎప్పుడైనా ఓ పూట ఏదైనా కారణం చేత అన్నం తినకపోతే ఎంత దిగులుగా ఉంటుందో!

లంఖణం పరమౌషధం అంటారు. ఏదో రోగం వచ్చినప్పుడే కాకుండా మామూలుగా కూడా అప్పుడప్పుడు పొట్టను మాడ్చుకునే వాళ్లు ఉంటారు, దాన్నే ఉపవాసం అంటారు. ఈ ఉపవాసం కొంతమంది దేవుడి పేరుతో చేస్తే మరికొంతమంది డైటింగు పేరుతో చేస్తుంటారు. ఈ డైటింగుల్లో మరలా చాలా రకాలు-అందులో రకరకాల డైటులు, వాటి గురించి ఇంకోసారి చూద్దాం.

నేనయితే ఇప్పటివరకు ఎప్పుడూ దేవుడి పేరుతో కాని డైటింగు పేరుతో కాని ఉపవాసం ఉండలేదు. ఎప్పుడైనా ఆకలి అనిపించకపోతే ఓ పూట తినకుండా వుండటమే తెలుసు. అలాంటిది ఈ మధ్య ఊరికినే కూర్చుంటే ఓ మహత్తరమైన ఆలోచన వచ్చింది. వారంలో ఓ రోజు కఠిక ఉపవాసం చేసి పొట్టకి కాస్తంత విశ్రాంతి ఇద్దామని. కఠిక ఉపవాసం అంటే మరీ పచ్చి మంచినీళ్లు కూడా తాగకుండా అని కాదు కాని రోజంతా ఒట్టి మంచినీళ్లు తాగి ఉందాం అనుకున్నా. ఈ ఉపవాసం ఒంట్లో కొవ్వు తగ్గించుకోవటానికో ఒంటి బరువు తగ్గించుకోవటానికో కాదు ఏదో కాస్త ఆరోగ్యం కోసమే సుమీ!

సరే ఆలోచన వచ్చిందే తడవు ఇక ఆలస్యం ఎందుకని మొన్నో శనివారం ఉపవాసం ఉండాలని నిశ్చయించుకున్నా! శుక్రవారం పడుకునే ముందు ఘాట్టిగా నిర్ణయించుకున్నా రేపు మంచినీళ్లు తప్పితే ఏమీ తాగకూడదు తినకూడదు అని.  శనివారం పొద్దున్నే యధావిధిగా లేచి నా నిర్ణయాన్ని ఒకసారి సమీక్షించుకున్నా. మరీ ఒట్టి మంచినీళ్లు కాదులే మంచినీళ్లతో పాటు పళ్ల రసాలు, మజ్జిగ  (ద్రవపదార్థాలు) తీసుకోవచ్చు అని నా నిర్ణయానికి కాస్తంత వెసులుబాటు ఇచ్చుకున్నా.

లేవగానే కాస్తంత తేనె నిమ్మకాయ నీళ్లు తాగా, ఏడు గంటలకి కూరగాయల రసం తాగా.  ఎనిమిది అయ్యేటప్పటికి ఠంఘున గడియారం గంట కొట్టినట్టు పొట్టలో ఉపాహార గంట మొదలయ్యింది.  అందులోనూ ఆ రోజు ఉపాహారం పావ్ భాజి.  ఇవ్వళ్టికి ఉపవాస దీక్ష విరమించుకుని ఇంకో రోజు ఎప్పుడైనా పెట్టుకుందామా అని ఓ నిమిషం ఊగిసలాడా.  చ ఒక్క రోజు ఆకలికి ఆగలేనా అని మనసుని ఘాట్టిగా రాయి చేసుకుని తొమ్మిందింటి దాకా ఉపాహార గంట వినపడనట్టే ఉన్నా, ఇక ఆ తరువాత నా వల్ల కాలేదు, ఓ అరడజను కమలాలు గబాగబా రసం తీసుకుని తాగేసా!

పనిలో పడితే ఆకలి తెలియదంటారు కాని అంతా ఒట్టిదే-దేని దారి దానిదే. పదకొండింటికి మరలా పొట్టలో పేగుల అలజడి మొదలయ్యింది. ఒక్క రోజుకి మీరింత హడావిడీ చేయాలా అని వాటిని కాస్త కసిరా, అబ్బే నా మాట వింటేగా వాటి గొడవ వాటిదే! నేనేదో వాటికి రోజుల తరబడి తిండి పెట్టకుండా మాడ్చేస్తున్నట్టు ఒకటే గొడవ గొడవ! పొట్టలో ఎలుకలు పరిగెత్తటం అంటే ఏంటో తెలిసివచ్చింది. 12:30 కి కాస్తంత మజ్జిగతో వాటిని శాంతపరిచా. రెండయింది-నా ఆకలి రెట్టింపయ్యింది-మరోసారి నా నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాల్సి వచ్చింది. మంచి నీళ్లు ద్రవ పదార్థాలతో పాటు కాసిన్ని పళ్లు కూడా తీసుకోవచ్చు అని నా కఠోర నిర్ణయానికి ఇంకో సవరణ ఇచ్చుకుని ఓ పెద్ద అరటిపండు లాగించా!

ఇలా లాభం లేదని ఓ పుస్తకం పట్టుకుని కూర్చున్నా అలా అన్నా ఆకలి తెలియకుండా వుంటుందని (పుస్తకం పట్టుకు కూర్చుంటే నీకు నిద్రాహారాలు గుర్తు రావని ఎప్పుడో కాలం నాడు మా అమ్మ అన్న గుర్తు :). ఆ పుస్తకం వట్టికోట ఆళ్వారు స్వామి వ్రాసిన 'ప్రజల మనిషి'.  ఓ ఇరవై పేజీలు చదివా కానీ ఏం చదువుతున్నానో బుర్రకి ఎక్కడంల, అసలు పుస్తకం పేరే మర్చిపోయా!. సరే నిద్ర అన్నా పోదామని ప్రయత్నించా---ఆ నిద్రా రాదే. రోజూ అయితే హాయిగా అన్నం తినగానే ఓ పుస్తకం పట్టుకుని మంచం ఎక్కితే నా ప్రయత్నం లేకుండానే కనురెప్పలు మూతలు పడిపోతాయి, అలాంటిది ఆ రోజు మాత్రం ఎంతకీ మూతపడనన్నాయి. సరే అని లేచి కాసేపు టి.వి. ముందు కూర్చున్నా అలా అన్నా నిద్రపోవచ్చని (మామూలుగా నేను టి.వి. ముందు కూర్చుంటే కూర్చున్నపళంగా నిద్రపోతా అది ఏ సమయం అయినా సరే, అప్పుడే నిద్ర లేచినా సరే!), ఊహు నిద్ర రానంటే రానంది. పొట్ట నిండుగా ఉంటే మత్తుగా నిద్రొస్తుంది కాని ఖాళీగా వుంటే ఆవలింతలు కూడా రావన్నమాట అనుకున్నా!

ఈ లోగా టైం నాలుగయింది. ఆకలి కేకలు వేస్తుంది. సరే ఎటూ పళ్లు తినొచ్చు కదా అని ఓ నాలుగంటే నాలుగు పెద్ద పెద్ద బొప్పాయి ముక్కలు తిన్నా. హమ్మయ్య కాస్త పొట్ట శాంతించింది. ఇక ఇలా అయితే రాత్రికి కూడ  నిద్ర రాదు నిద్ర పోను అనుకుని నా ఉపవాస నిర్ణయాన్ని మరోసారి పునః పునః సమీక్షించుకుని రోజంతా ఉపవాసం కాదు ఒక్క పొద్దు ఉపవాసం ఉంటే చాలు అని గడియారం ఏడు గంటలు కొట్టగానే నాలుగు పుల్కాలు చేసుకుని వేడి వేడిగా తినేసి నా ఉపవాస దీక్షని విజయవంతంగా ముగించా.

ఇదేంటబ్బా ఎప్పుడన్నా శనివారం రాత్రిపూట పుల్కాలు చేయమంటే ఆరు శనివారాలు అడిగించుకుని ఏడో శనివారం కాని చేయని అమ్మ ఇవాళ అడగకుండానే పుల్కాలు చేసింది అని మా పిల్లలు ముక్కు మీద వేలేసుకున్నారులేండి అది వేరే విషయం.

Read more...

May 18, 2009

లోక్‌సత్తా సత్తా

హమ్మయ్య..ఓ నెల రోజుల ఎదురుచూపుల తరువాత ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. చర్చలు, వాదోపవాదాలు ముగిసాయి. మన మీడియా మాత్రం ఎన్నికల ఫలితాల మీద చర్చల్ని ఇంకా సాగతీస్తూనే ఉంది. నాకెందుకో ముందునుండీ ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ కాంగ్రెస్సే ఎలాగోలా మళ్లీ అధికారంలోకి వస్తుందనిపించింది.  రాష్ట్రంలో కాసిన్ని సీట్లు తగ్గితే చిరంజీవితో పొత్తుతో అధికారంలోకి వస్తుందనుకున్నా కాని తన స్వంత బలం మీదే అధికారంలోకి వచ్చింది. ఇది కాంగ్రెస్సు గెలుపు అనటం కన్నా మహాకూటమి ఓటమి అనవచ్చేమో.  గెలుపోటముల మధ్య తేడా ఒకే ఒక్క శాతం. కాంగ్రెస్సుకి వచ్చిన ఓట్లు 36 శాతం మాత్రమే అంటే  64 శాతం ప్రజలు కాంగ్రెస్సుని వద్దనుకుంటున్నారన్నమాట! అయినా ఈ మైనార్టీ నాయకులే మన పాలకులు, ఇదీ మన ప్రజాస్వామ్యం!

ఈ సారి కేంద్రంలో కూడా  అలకలకొలికి లెఫ్టుతో, తంపులమారి లాలూతో సంబంధం లేకుండా కాంగ్రెస్సు అధికారం చేజిక్కించుకున్నందుకు నాకయితే సంతోషంగా ఉంది. మాట్లాడితే మద్దతు ఉపసంహరించుకుంటామన్న బెదిరింపులు, ఈ పేచీకోరు పొత్తులతో ఈ ప్రభుత్వం ఎన్ని రోజులుంటుందో  అన్న చింత ఇకపై ఉండదు.

అసలు రాష్ట్రంలో ఎవరు గెలుస్తారు అన్న దాని కన్నా నేను ముందునుండి ఎదురుచూసింది లోక్‌సత్తాకి ఎన్ని ఓట్లు వస్తాయి అనే.  లోక్‌సత్తాకి వచ్చిన ఓట్ల శాతం చూస్తే నాకు చాలా సంతోషం అనిపించింది. లోక్‌సత్తాకి ఓటు వేయటం అంటే మీ ఓటు మురగపెట్టుకోవటమే అన్న వాళ్లు ఉన్నారు, హేళనగా నవ్విన వాళ్లు ఉన్నారు, అసలు లోక్‌సత్తా అభ్యర్థులకి డిపాజిట్టు అన్నా దక్కుతుందా అని చులకనగా చూసిన వాళ్లూ ఉన్నారు, ఈ సారికి మేము సాంప్రదాయకంగా ఎప్పుడూ ఓటు వేసే మా సాంప్రదాయక పార్టీకే ఓటు వేస్తాం-వచ్చేసారి లోక్‌సత్తాకి చూద్దాంలే అన్న వారూ ఉన్నారు.....కానీ ఇప్పుడు లోక్‌సత్తాకి వచ్చిన ఓట్లే మిగతా పార్టీల గెలుపోటములని ప్రభావితం చేయటంతో లోక్‌సత్తా సత్తా ఏంటో అందరికీ అర్థం అయిపోయింది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాదు పరిథిలో తెలుగుదేశానికి తీరని నష్టం తెచ్చింది లోక్‌సత్తానే!

ఏదేమైనా ఎప్పటికైనా లోక్‌సత్తా అథికారంలోకి రావటం కల్ల అంటున్నారు జనాలు. ఇక్కడ అధికారం కాదు ముఖ్యం. ప్రజల గోడుని ప్రభుత్వం దాకా తీసుకెళ్ల గలిగే నాయకులు కావాలి, అధికారం లేకపోయినా ప్రజల సమస్యలకి బాధ్యత వహించే నాయకులు కావాలి. అలాంటి నాయకులు ఒక్కళ్లున్నా చాలు. వచ్చే ఎన్నికల తరువాత ఈ ఒక్కడికి మరో నలుగురు తోడయినా చాలు.

అసలు గెలుపోటముల సంగతి ఎలా ఉన్నా ఈ EVM లు వచ్చాక ఫలితాలు త్వరత్వరగా వెలువడుతుంటే నాకయితే అస్సలు నచ్చలేదు.  ఇదివరకటి మజా లేదు.  తెల్లవారుజాము దాకా టి.వి. ముందు కూర్చుని ఓ పుస్తకం కలం తీసుకుని రాష్ట్రాల వారీగా, నియోజకవర్గాల వారీగా, అభ్యర్థుల పేర్లతో  పట్టికలు  గీసుకుని ఎవరెంత లీడింగులో ఉన్నారు, ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తున్నాయి, ఎవరెన్ని ఓట్ల తేడాతో ఓడిపోతున్నారు అని మన లెక్కలు మనం వేసుకోవటంలో ఓ ఆనందం ఉండేది.  మరుసటి రోజు సాయంత్రం దాకా కూడా కొన్ని ఫలితాలు వస్తుండేవి. ఇప్పుడేంటి అన్నం వేళకే దాదాపు అన్ని ఫలితాలు తెలిసిపోతుండే! మెజార్టీలు కూడా చూడండి ఎంత తగ్గిపోయాయో! అప్పట్లో పెద్ద పెద్ద నాయకుల మెజారిటీ లక్షల్లో ఉండేది. 10,000 కి తక్కువ మెజార్టీ చాలా తక్కువగా కనపడేది. 1999 ఎన్నికలప్పటి ఎన్నికల లెక్కల పుస్తకాలు ఇంకా మా ఇంట్లో ఉన్నాయి!

Read more...

April 16, 2009

నేను ఓటు వేసా, మరి మీరు!

సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా తొలి విడత ఎన్నికలకు పోలింగు ఈ రోజు జరుగుతుంది. మన రాష్ట్రంలో  ఉత్తర కోస్తా, తెలంగాణా ప్రాంతాల్లోని 22 పార్లమెంట్, 154 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ రోజు పోలింగు జరుగుతుంది.

మనకి మరోసారి ఓటు వేసే అవకాశం వచ్చింది. అంతా సవ్యంగా ఉంటే మళ్లీ ఐదేళ్లకి కాని మనకి ఓటు వేసే అవకాశం రాదు, అందుకే ఆలసించిన ఆశాభంగం, వెళ్లి ఓటు వేసి రండి.  నేనెప్పుడో పొద్దుట ఏడు గంటలకే వెళ్లి ఓటేసొచ్చా. ఇక ఫలితాల కోసం ఓ నెల రోజులపాటు ఎదురు చూడాలి. ఈ లోపు ఎక్కడ ఎంత శాతం ఓట్లు పోలయ్యాయి, ఓటింగు సరళి ఎలా ఉంది--ఇలాంటి విశ్లేషణలతో పత్రికలు, వార్తా చానళ్లు హోరెత్తించేస్తాయి.

ఏడు గంటలకి నేను పోలింగు బూతుకి వెళ్లేటప్పటికే జనం లైనులో నిలబడి ఉన్నారు.  పోలింగు ఏడు గంటలకి మొదలు అన్నారు కాని మా బూతులో ఏడున్నరకి కాని మొదలవలేదు. అప్పటికే జనం బాగా వచ్చారు. నాకయితే ప్రతి సారి ఓటు వేసాక ఏదో గొప్ప పని చేసామన్న సంతృప్తి కలుగుతుంది. ముందు పార్లమెంటు అభ్యర్థికి ఓటేసా, లైటు బాగానే వెలిగింది, మోత కూడా బాగానే వచ్చింది.  తరువాత అసెంబ్లీ అభ్యర్థికి ఓటు వేసా, ఈ సారి లైటు సరిగ్గా వెలగలేదు కాని మోత అయితే వచ్చింది. నాకేమో అసలు ఓటు పోలయిందా లేదా అని సందేహం. ఏంటో ఈ మెషీనులు.

నాకు మా ఊరిలో ఓటెయ్యాలని ఎంత కోరికో! ప్చ్....ఏం చేస్తాం...నాకు ఓటు హక్కు వచ్చేటప్పటికి చదువు కారణంగా ఊరికి దూరంగా ఉండి ఓటు వెయ్యలేకపోయాను. అసలు మా వాళ్లు నా పేరు ఓటర్ల లిస్టులో వ్రాయించారో లేదో కూడా నాకు తెలియదు. తరువాత ఎలక్షన్ల టైముకి పెళ్లయి మా ఊరికి దూరం అయిపోయా! ఇక ఎప్పటికీ అది తీరని కోరిక అయిపోయింది. పెళ్లయ్యాక మాత్రం ఎప్పుడు ఎన్నికలు జరిగినా నా ఓటు హక్కు వినియోగించుకుంటూనే ఉన్నాను. పోయిన సంవత్సరం ఖైరతాబాదు ఉపఎన్నికలో ఓటు వేయలేకపోయినందుకు ఎంత బాధ పడ్డానో.
                                                          
                                   మంచి మార్పు కోసం ఓటేద్దాం.

Read more...

April 13, 2009

మన ఓటు మనమే వేద్దాం

ఓటు వేయటం మన ప్రాధమిక హక్కు. . . ఓటు వేయటం మన బాధ్యత. .
ఓటు వేయకుండా రౌడీలు, గూండాలు, దుర్మార్గులు అందలం ఎక్కేస్తున్నారు అని వగచే హక్కు మనకి లేదు.
ఓటు వేయకుండా దోపిడీ రాజ్యం అయిపోయింది అని దిగాలు పడే హక్కు మనకు లేదు.
ఓటు వేయకుండా అవినీతి వేయి తలలు వేసింది అని ఆక్రోశించే హక్కు మనకు లేదు
ఓటు వేయకుండా లంచగొండితనం పెరిగిపోయింది, మామూళ్లు మామూలు అయిపోయాయి అని ఏడ్చే హక్కు మనకి లేదు.
ఓటు వేయకుండా పైరవీలు లేందే ఏ పనీ అవటం లేదు అని గగ్గోలు పెట్టే హక్కు మనకు లేదు.
ఓటు వేయకుండా నీతికి, న్యాయానికి, సమర్థతకి, ప్రతిభకి ఈ దేశంలో స్థానం లేదు అని ఘోషించే హక్కు మనకు లేదు.
ఓటు వేయకుండా రోడ్లు చండాలంగా ఉన్నాయి అని ఫిర్యాదు చేసే హక్కు మనకు లేదు.
ఓటు వేయకుండా ప్రభుత్వం మాకేం చేయట్లేదు అని నిందించే హక్కు మనకు లేదు.
ఓటు వేయకుండా మొత్తం వ్యవస్థ అంతా కుళ్లిపోయింది అని అసహ్యించుకునే హక్కు మనకు లేదు.
ఓటు వేయకుండా సమాన హక్కులు కావాలి అని ఎలుగెత్తే హక్కు స్త్రీవాదులకు లేదు.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

మన ఒక్కళ్లం ఓటు వేయనంత మాత్రాన ఏం మునిగిపోతుంది అనుకోకండి, మన ఒక్క ఓటుతో దేశం బాగుపడుతుందా అని నిర్వేదం చెందకండి. కళ్లు, కాళ్లూ లేని వాళ్లు, ముసలివాళ్లు.....కొండల్లో, ఎడారుల్లో ...ప్రయాణించి..ఓపిగ్గా వరుసలో నిలబడి ఉత్సాహంగా ఓటేస్తుంటే మనం మాత్రం ఎందుకు ఇంట్లో కూర్చోవాలి? మన ఓటు ఓ రౌడీనో గూండానో వేసే అవకాశం మనం ఎందుకు ఇవ్వాలి? మన ఓటు మనమే వేద్దాం

మీకు తెలుసా ప్రస్తుత పార్లమెంటు మరియు అసెంబ్లీ సభ్యులలో ఎక్కువ మంది పది శాతం కన్నా తక్కువ ఓట్లు తెచ్చుకున్నవారే. మరి మనందరం ఓటేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో ఒక్కసారి ఊహించండి. సమాజంలో మనం కోరుకుంటున్న మార్పు రావాలంటే ఓటు ద్వారానే అది సాథ్యం. మన రాష్ట్రంలోని ఓటర్లలో, ముఖ్యంగా హైదరాబాదులో, స్త్రీలు, యువతే ఎక్కువ శాతం ఉన్నారు. అందుకే ఎవరు గెలిస్తే నాకేంటిలే అన్న నిర్లిప్తత వీడండి. మీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల గురించి ఒక్కసారి ఆలోచించండి. మీ మనసు మాట వినండి. మీకు నచ్చిన వారికి ఓటెయ్యండి. మార్పుకి మార్గం వేయండి.

మనం ఓటు వేసే అభ్యర్థి గెలవకపోయినా పర్లేదు, అవతల వాడిని ఎంతమంది వద్దనుకుంటున్నారో తెలియటానికయినా మనం ఓటు వేయాలి.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~


ఓటు వేయటానికి ఓటరు గుర్తింపు కార్డే అక్కర్లేదు. ఈ కింది వాటిలో ఏ ఒక్కటి ఉన్నా ఓటు వేయవచ్చు.
పాసుపోర్టు.
డ్రైవింగు లైసెన్సు.
రేషన్ కార్డు.
పాన్ కార్డు.
ఫోటోతో ఉన్న ఏదైనా జాతీయ బ్యాంకు పాసు పుస్తకం లేదా పోస్టు ఆఫీసు పాసు పుస్తకం లేదా కిసాను పాసు పుస్తకం (పట్టాదారు పాసు పుస్తకం).
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులయితే ఫోటోతో ఉన్న వారి గుర్తింపు కార్డు.
ఫోటొతో ఉన్న ఎ.టి.ఎం కార్డు.

అసలు నన్నడిగితే ఓటు వేయటానికి ఓటరు గుర్తింపు కార్డు తీసుకెళ్ళకుండా ఉండటమే మంచిది, లేదంటే అందులో మన ఫోటో చూసి ఇది నువ్వు కాదు అని ఓటు వెయ్యనీయకపోయే ప్రమాదం వుంది సుమా:)

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ఓటు వేయకుండా మనకు ప్రశ్నించే హక్కు లేదు
, విమర్శించే హక్కు లేదు, నిలదీసే హక్కు లేదు, ఫిర్యాదు చేసే హక్కు లేదు.
                                              మంచి మార్పు కోసం ఓటేద్దాం

Read more...

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP