పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

October 28, 2009

తప్పెవరిది?

గత రెండురోజులుగా ప్రసారమాధ్యమాలలో మైదుకూరు స్కూలులో తెలుగు మాట్లాడినందుకు ఇద్దరు పిల్లలకు ఉపాధ్యాయులు వేసిన శిక్ష  ఓ పెద్ద చర్చాంశనీయమయింది.  మన టి.వి చానళ్లకి మరో పండగ.  ఈ రోజు ఉదయం నుండి ఏ చానలు తిప్పినా  దీనిమీదే చర్చ.  వీళ్లు ఇప్పుడే కళ్లు తెరిచారో లేక వేరే సంచలనాత్మక వార్తలు ఏమీ లేక దీనిమీద పడ్డారో అర్థం కావటం లేదు. అసలు పిల్లలు ఎలాంటి తప్పు చేసినా ఇలా మెడలో బోర్డులు వేలాడదీయటం తప్పు.....మనం స్పందించాల్సింది దానికి...మనం ముందుగా ఖండించాల్సింది ఇలాంటి శిక్షలని.  ఆ పంతుళ్ల మెడలకి "ఇక ఇలాంటి పని చేయను" అన్న బోర్డు తగిలించి ఊరంతా తిప్పాలి.....అదే వారికి సరయిన శిక్ష..

నిజానికి స్కూలులో ఇంగ్లీషులోనే మాట్లాడాలని పిల్లలని నిర్భందించటం, మాట్లాడకపోతే శిక్షలు వేయటం కొత్త విషయం ఏం కాదు.  గత  10-15 ఏళ్ల నుండీ  హైదరాబాదులో ఇలాంటి ఆంక్షలు చాలా స్కూళ్లల్లో ఉన్నాయి.  లేని స్కూళ్లని వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. అది ఇప్పుడు చిన్న చిన్న ఊర్లకి కూడా పాకింది.  మేము చదువుకునే రోజులలో అంటే 30 ఏళ్ల క్రితం కూడా మిషనరీ స్కూల్సులో తెలుగులో మాట్లాడితే ఫైన్ ఉండేది. ఎండలో నిలబెట్టటం. బెంచీలు ఎక్కించటం, మోకాళ్లమీద కూర్చోపెట్టటం, కొండకచో కొట్టటం కూడా చేస్తుంటారు.  తమ పిల్లలు తెలుగులో మాట్లడటం తక్కువతనమనుకునే తల్లిదండ్రులున్నంత కాలం మన తెలుగుకి....మన పిల్లలకి ఇలాంటి దుర్గతి తప్పదు. స్కూలులో తెలుగు ఎక్కువగా మాట్లాడుతున్నారని స్కూలులు మార్చే తల్లిదండ్రులున్నప్పుడు వాళ్ల దగ్గర డబ్బులు దండుకుంటున్న స్కూళ్ల  యాజమాన్యాలు ఇలా చేయక మరి ఎలా చేస్తాయి? మార్పు రావల్సింది తల్లిదండ్రుల్లో.....ఇంగ్లీషు రాకపోతే తమ పిల్లలు జీవితంలో పైకి రాలేరు..వాళ్లకి భవిష్యత్తు లేదు అన్న భావన నుండి మనం బయటకు వచ్చినప్పుడే ఈ ఝాడ్యం వదిలేది. 

మొన్న బజారులో ఓ తెలిసినామె కనపడితే కుశల ప్రశ్నలు అయ్యాక మీ బాబు ఇదివరకటి స్కూలేగా అన్నా! లేదండి పోయిన సంవత్సరం మార్చాం అంది.  అదేంటండి ఆ స్కూలు బాగుంటుందన్నారు కదా, బాగా ఆటలు అవీ ఆడిస్తారు, పిల్లల మీద ఒత్తిడి ఉండదు కదండీ అంటే........ఆవిడ ప్రతిస్పందన........అన్నీ బాగానే ఉన్నాయి కానీండి.... అక్కడ క్లాసు బయట పిల్లలు తెలుగులో ఎక్కువగా మాట్లాడతారండి అందుకని మార్చాం అంది. అదీ ప్రస్తుత పరిస్థితి.  మామూలుగా మన తెలుగువారం ఏదైనా బాధ కలిగినప్పుడో, దెబ్బ తగిలినపుడో అమ్మా అనో అబ్బా అనో అంటాం..అది అసంకల్పిత చర్య......కానీ  ఇంగ్లీషు పిచ్చి ఉన్న మన ఆధునిక తల్లిదండ్రులు ఉన్నారే ......వాళ్లు పిల్లలు బాధ కూడా తెలుగులో పడకూడదనుకుంటారు..పడ్డప్పుడు అమ్మ బదులు మమ్మీ అనాలనుకుంటారు....అలా అంటేనే తమ పిల్లలకి ఇంగ్లీషు బాగా వచ్చినట్లన్నమాట!  అమ్మలు బ్రతికున్న శవాలు అయిపోయారన్నమాట!

ఇంగ్లీషులో మాట్లాడితేనే పిల్లలు జీవితంలో పైకి వస్తారు అనుకునే మనస్తత్వం మనకున్నంత కాలం ఇలాంటివి మామూలే. ఓ రెండు రోజులు గోల చేస్తాం..చర్చలు..వాదనలు..ప్రతివాదనలు..ఆవేశాలు..రక్తం ఉడికిపోవటాలు ....మరిగిపోవటాలు....ఊకదంపుడు ఉపన్యాసాలు..అన్నీ మామూలే.......మూడో నాడు షరా మళ్లీ ఇంగ్లీషు మామూలే.. మళ్లీ ఈ ఊసే ఎవరూ ఎత్తరు.  భాషా శాస్త్రవేత్తలు ఎప్పడో మొత్తుకున్నారు.....ముందు మాతృభాష సరిగ్గా వస్తే మిగతా భాషలు నేర్చుకోవటం చాలా సులువు అని......కానీ మనం ఇపుడు తెలుగు రాకపోతే మాత్రం ఏం ఇంగ్లీషు వస్తే చాలనుకుంటున్నాము. నర్సరీలో ఉన్న మన పిల్లకాయ..ముద్దుముద్దుగా ఏ ఫర్ ఆపిల్ అంటుంటే ...అబ్బో ఇంగ్లీషు ఎంత చక్కగా మాట్లాడుతుందో అని మురిసిపోతాం. చందమామ రావే ..జాబిల్లి రావే.. స్థానంలో ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టారు వచ్చేసింది....చిట్టి చిలకమ్మని.... జానీ జానీ మింగేసాడు..మన అమ్మ భాష మనకి పరాయి అయిపోయింది!

టపటపా నాలుగు ఇంగ్లీషు ముక్కలు మాట్లాడనివాడు మన దృష్టిలో మనిషే కాదు..అలాంటి పిల్లలకు భవిష్యత్తే లేదు అని జాలిపడిపోతుంటాం.  మన పిల్లలు ఇంగ్లీషు మీడియంలో చదవాలనుకోవటం తప్పు కాదు, మంచి ఇంగ్లీషు మాట్లాడాలనుకోవటం తప్పు కాదు...కానీ ఇంగ్లీషే తాగాలి, ఇంగ్లీషే తినాలి, ఇంగ్లీషుతోనే బ్రతుకంతా ఉంది అనుకోవటమే తప్పు! తెలుగెందుకు ఇంగ్లీషులోనే అభివృద్ధి అంతా ఉంది అనుకోవటమే తప్పు. మన పక్కనున్న చైనా వాళ్లు ఏ ఇంగ్లీషు నేర్చుకుని ఇంతగా అభివృద్ధి చెందారు? 

ఇక్కడ అసలు నవ్వొచ్చే (ఏడవలేకే లేండి) విషయమేమిటంటే ఈ ఇంగ్లీషు స్కూళ్లలో చదివే అధిక శాతం పిల్లలు మాట్లాడే ఇంగ్లీషు వింటే ఇంగ్లీషు సరిగ్గా రాని నేనే చాలా నయం అనిపిస్తుంది. ఓ గ్రామరు ఉండదు, ఓ వ్యాక్య నిర్మాణం సరిగ్గా ఉండదు..ఓ..యా..లే తప్ప అందులో భాషే ఉండదు.  ఇలాంటి ఇంగ్లీషు వస్తే ఎంత రాకపోతే ఎంత? ఓ విషయం ఇచ్చి ఓ పది వ్యాక్యాలలో చిన్న వ్యాసం వ్రాయమనండి. స్పెల్లింగు తప్పులు లేకుండా ఒక్క వ్యాక్యం కూడా ఉండదు. అందరూ ఇంతే అనను కాని చాలావరకు ఇంతే.  ఈ ఇంగ్లీషు మీద మరోసారి మాట్లాడుకుందాం.

మైదుకూరులో స్కూలు మూసేయించుతారంట..ఎన్ని స్కూళ్ళని అలా మూసేయించుతారు..తల్లిడండ్రులు ఇష్టపడే కదా తమ పిల్లలని ఇంగ్లీషు మీడియం స్కూళ్లకి పంపుతుంది. మన ఇళ్లల్లో ఎంతమందిమి పిల్లలకి చక్కటి తెలుగు నేర్పుతున్నామో, ఎంతమందిమి పిల్లలతో పూర్తిగా తెలుగులోనే మాట్లాడుతున్నామో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుందాం.  మన పిల్లలు ఎంతమంది తెలుగు అక్షరాలు అన్నీ గుర్తుపట్టగలరు?..తప్పులు లేకుండా ఎన్ని గుణింతాలు వ్రాయగలరు? ఎన్ని అంకెలు చెప్పగలరు?..వారాలేంటో అవి ఎన్నో ఎంతమందికి తెలుసు?  అసలు జనవరి.......ఫిబ్రవరే కాదు తెలుగు సంవత్సరాలు కూడా ఉన్నాయని ఎంతమంది పిల్లలకి తెలుసు??మారాల్సింది మనం.

తల్లిదండ్రులూ ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి--తప్పెవరిది??


26 వ్యాఖ్యలు:

భావన October 28, 2009 at 8:06 AM  

చాలా బాగా రాసేరు ఆ స్కూల్ మూయించితే ఏమి వస్తుంది మన బుర్రల్లో వున్న బూజు తీసెయ్యాలి కాని. జీవితం లో డబ్బు సంపాదనే ముఖ్యం ఇంక ఏది చేసినా అంతిమ గమ్యం అదే అనే మౌలికమైన ఆలోచన మారితే తప్ప మీరు చెప్పినవి ఏవి సాధ్య పడవనుకుంటా. బాగా చెప్పేరు..

విశ్వ ప్రేమికుడు October 28, 2009 at 8:46 AM  

బాగా చెప్పారు. అసలు మారవలసింది మనమే..
మితిమీరిన ఇంగ్లీషు పిచ్చి వదుల్చుకోవాలి ప్రతీఒక్కరూ...

నేస్తం October 28, 2009 at 9:20 AM  

బాగా చెప్పారు, ఇంగ్లీష్ అనేది ఈ రోజుల్లో తప్పని సరిగా నేర్చుకోవలసిన భాషే.కాదనను ..కానీ మరీ మితి మీరి తల్లిదండ్రులు వేసే వేషాలే బాధనిపిస్తుంది.నేను గమనించినది ఏంటంటే ఒకవేళ యే తల్లిదండ్రి అయినా తమ పిల్లలతో తెలుగు మాట్లాడారంటే ,లేదా పిల్లలు తెలుగులో మాట్లాడినా అదేదో అంటరాని వారిని చూసినట్లు ఈసడించి చూస్తున్నారు మిగిలిన హైటేక్కు తల్లిదండ్రులు ..దాని వల్ల కూడా పిల్లలపై ఒత్తిడి తెచ్చెస్తున్నారు మాములు వాళ్ళు కూడా.. పిల్లలకెలాగో మనలాంటి తీయని భాల్యం ఇవ్వలేకపోతున్నాం.. కనీసం వారికి నచ్చిన భాషలో కూడా మాట్లాడనివ్వలేకపోతున్నాం..తప్పు మనలోనే ఉంది..ముందు మనం మారాలి.

sunita October 28, 2009 at 9:32 AM  

ఇన్ని పోకిళ్ళు పొయ్యే ఆ స్కూలు వాళ్ళు సరి ఐన ఇంగిలీషు ఎలానూ నేర్పరు. ఫీల్ గుడ్ ఫాక్టర్ లాగా మేము ఇంగిలీష్ నేర్పటంలో ఎంత స్ట్రిక్టో చూడమని ఈ వేషాలు, ఆ తల్లితండ్రులు కూడా సంతోషించి అడ్మిషన్స్ పెంచుతారు. కావాలంటే గమనించి చూడండి వచ్చే సంవత్సరం వీళ్ళు ఇదే విషయం ప్రాపగాండా చేసుకుంటారు.

భాస్కర రామిరెడ్డి October 28, 2009 at 9:46 AM  

దీనికి పూర్తి బాధ్యత తల్లిదండ్రులదే. అందులో నేనూ ఒకణ్ణి.

సుజాత వేల్పూరి October 28, 2009 at 9:55 AM  

ఇంగ్లీషు నేర్చుకోవాల్సిందే! ఒక భాషగా! ఒక జీవితంగా కాదు!

ఎందుకంటే మన పిల్లలు ఇంజనీరింగ్ కాలేజీలో చదవాలి, మంచి ఉద్యోగాలు చేయాలి అనే కోరికతో ఇంజనీరింగ్ లు, మెడిసిన్లూ చదివిస్తూ మరో పక్క ఇంగ్లీషుని ద్వేషించటం ఐరనీ! కానీ పాపం ఏం చేస్తాం? ప్రపంచంలోని అన్ని సబ్జెక్టులూ ముఖ్యంగా ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి చదువుల్లో (అవి యూనివర్సల్ కాబట్టి) ఇంగ్లీషులోనే ఉంటాయాయె!

ఇంగ్లీషుని ఒక భాషగా, సబ్జెక్ట్ నేర్చుకునే మాధ్యమగా మాత్రమే నేర్చుకోవాలి! అంతకు మించి జీవితంలో ప్రముఖ స్థానం దానికివ్వడానికి వీల్లేదు.ఇది ప్రతి స్కూల్లోనూ ఒక నియంగా పెట్టాల్సిందే! తల్లిదండ్రుల కోరికలతో పని లేకుండా!

స్కూళ్ళలో మాతృభాషలో మాట్లాడితే నేరంగా పరిగణించడమే పెద్ద నేరం! ఇలాంటి అనాగరికమైన పద్ధతులు అమల్లో ఉన్న స్కూళ్ళు ఎన్నైనా సరే మూయించాల్సిందే! అప్పుడే మిగతా స్కూళ్ళు కాస్త దార్లో ఉంటాయి. ఎంత వరకూ నమ్మొచ్చంటారా?

యాసిడ్ పోసిన వాడికి ఉరిశిక్ష వేస్తే మిగతా పోకిరీలకు బుద్ధొస్తుందని నమ్మిన ఈ సమాజంలో ఇది కూడా నమ్మాల్సిందే!

మా పాప క్లాసులో తెలుగు ను రెండో భాషగా తీసుకుంది మా పాపతో కలిపి ముగ్గురు! (220 మంది పిల్లలు గల నా 5 సెక్షన్లలో కలిపి!)

ప్రభుత్వ పాఠశాల్లో చదివించే ధైర్యం ఇవాళ ఎవరికీ లేదు. ఉన్న ప్రైవేట్ పాఠశాల్లో ఇంగ్లీష్ మీడియం కాకుండా తెలుగు మీడియం ఉన్న పాఠశాలు నాకైతే ఎక్కడా కనపడలేదు. ప్రైవేట్ స్కూళ్ళలో కూడా తప్పకుండా స్థానిక మాతృభాష మీడియం ఉండాలనే నిబంధన తప్పకుండా ఉండాలి. ఎవరికిష్టమైన మాధ్యమంలో వాళ్ళు చదువుకునే స్వేచ్ఛ ఉండాలి.

ప్రైవేట్ పాఠశాల మీద కొరడా ఝళిపించే అధికారం, హక్కు ప్రభుత్వానికి తప్పకుండా ఉండాలి!

ఓ రెండు రోజులు గోల చేస్తాం..చర్చలు..వాదనలు..ప్రతివాదనలు..ఆవేశాలు..రక్తం ఉడికిపోవటాలు ....మరిగిపోవటాలు....ఊకదంపుడు ఉపన్యాసాలు..అన్నీ మామూలే.......మూడో నాడు షరా మళ్లీ ఇంగ్లీషు మామూలే...ఇది మాత్రం బాగా చెప్పారు. ఏం చేద్దాం చెప్పండి? సగటు మనుషులం కదా! సమస్య తలెత్తినపుడు ఇలా మాట్లాడేసుకుని తల్లిదండ్రులే మారాలని ఆత్మవిమర్శ చేసుకుని కన్వీనియెంట్ గా మర్చిపోవడానికి అలవాటు పడ్డ సగటు మనుషులం!

మార్పు అనేది ఒక్కరితో కూడా మొదలు కావొచ్చనే విషయం మీద నమ్మకం లేని వాళ్లం!

రమణ October 28, 2009 at 10:25 AM  

బాగా చెప్పారు. తప్పు మన ప్రజలందరిదీ.

తృష్ణ October 28, 2009 at 10:49 AM  

చాలా బాగా చెప్పారు. ఈ విషయం నిన్న ఏదో బ్లాగ్ లొ ఫొటోతో సహా వేసారు.."ఐ డోంట్ స్పీక్ టెల్గు.." అని టైటిల్ పెట్టి. బ్లాగ్ పేరు గుర్తులేదు..

రాయాల్సినవన్నీ సుజాత గారు రాసేసారు...
ఆసక్తి ఉమ్తే ఇక్కడ ఒక లుక్ వేయండి..
http://trishnaventa.blogspot.com/2009/08/blog-post_29.html

కొత్త టెంప్లేట్ ఇదే చూడటం నేను..బాగుందండీ...వేరే సైట్లోకి వచ్చేసానా అనుకున్నా ఒక్క క్షణమ్...

Anonymous,  October 28, 2009 at 11:01 AM  

వరూధినిగారు , నేను మీతో 90% ఏకీభవిస్తున్నను. ఆ మిగతా పది ఎందుకు వ్యతిరేకం అంటే ...... ఈ విషయాన్ని ఇలా మీడియా ప్రజలు హైలెట్ చెయ్యటం వల్ల( కనీసం మరో విషయం దొరికేదాక అయిన) ఆ స్కూల్ మూసేయటం వల్ల, తాత్కాలికంగానే అయినా ' ఇలా ఇష్టం వచ్చినట్టూ ప్రవర్తిస్తే ఊరకే చూస్తూ వూరుకోరు ' అనే భయం ప్రైవేటు స్కూల్ యాజమాన్యానికి, ఉపాధ్యాయులకి కలుగుతుందికదా!

సుజాత వేల్పూరి October 28, 2009 at 11:22 AM  

నా కీ బోర్డులో సమస్య వల్ల నా ముందరి వ్యాఖ్యలో బోలెడు తప్పులు దొర్లినందుకు చింతిస్తున్నానండీ వరూధిని గారూ!

Padmarpita October 28, 2009 at 11:51 AM  

బాగా చెప్పారు. అసలు మారవలసింది మనమే..

మురళి October 28, 2009 at 11:59 AM  

నిజమేనండీ.. తప్పు మనలోనే ఉంది.. ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళ లో ఇంగ్లీష్ గురించి మీరు చెప్పింది నిజం.. పదో తరగతి అయ్యేసరికి పిల్లలకి అటు తెలుగూ ఇటు ఇంగ్లీషూ కూడా పూర్తిగా రావడం లేదు.. ఉభయ భ్రష్టత్వం అన్నమాట.. జరిగిన సంఘటనా వల్ల ఒక చిన్న కదలిక వచ్చింది.. దీనివల్ల కొన్నైనా మంచి నిర్ణయాలు జరుగుతాయని ఆశిద్దాం..

Ruth October 28, 2009 at 1:02 PM  

చాలా మంచి విశ్లేషణ! అందరూ స్కూలు వాళ్ళని దుమ్మెత్తిపోయడమే గాని, వాళ్ళు ఎందుకు అలా చేయవలసి వచ్చింది అని ఆలోచించారా? పిల్లల తల్లిదండ్రులే ఇలాంటివాటిని ప్రోత్సహిస్తున్నప్పుడు ఎవరిని ఏమని ఏం లాభం? మనకు తెలుగు వద్దు, ఇంగ్లీషే ముద్దు.
సుజాత గారు అన్నట్టు: మా పాప క్లాసులో తెలుగు ను రెండో భాషగా తీసుకుంది మా పాపతో కలిపి ముగ్గురు! (220 మంది పిల్లలు గల నా 5 సెక్షన్లలో కలిపి!) ఎంత ఘోరం? 220 మందిలో ముగ్గురు అంటె 1.4 శాతం కన్నా తక్కువ. అంటె, మిగతా 217 మందికీ అసలు తెలుగు వద్దే వద్దు ???
ఇంకో విషయం అన్నారు: ప్రైవేట్ స్కూళ్ళలో కూడా తప్పకుండా స్థానిక మాతృభాష మీడియం ఉండాలనే నిబంధన తప్పకుండా ఉండాలి. కాని ఎంతమంది తమ పిల్లల్ని తెలుగు మాధ్యమం లో చదివించడానికి ఇష్టపడుతున్నారు? అస్సలు ఇక్కడ వున్న వాళ్ళళ్ళో ఎంతమంది రెడీ గా ఉన్నారు తమ పిల్లల్ని తెలుగు మాధ్యమం లో చదివించడానికి? అసలు పిల్లలే లేనప్పుడు ప్రైవేట్ స్కూళ్ళలో కూడా తప్పకుండా స్థానిక మాతృభాష మీడియం ఉండి ఏం లాభం? అసలు ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నదే డబ్బు సంపాదన కోసం, వాళ్ళెందుకు చేస్తారు నష్టాలు వచ్చే పనులు?
ఏంటో చెప్పుకుంటే చాలా ఉన్నాయి. ఇవన్నీ ఆలోచింపజేసేలా బ్లాగ్ రాసినందుకు ధన్యవాదాలు.

Unknown October 28, 2009 at 2:08 PM  
This comment has been removed by the author.
Unknown October 28, 2009 at 2:09 PM  

ఇంకో రెండు రొజులలో మనం కూడా మర్చిపోతాం ఈ విషయాన్ని
ఇది మన తీరు

సిరిసిరిమువ్వ October 28, 2009 at 7:22 PM  

@భావన, సాద్యపడదని ఊరుకుందామా! మన ప్రయత్నం మనం చేద్దాం. సంఘంలో మనమూ ఓ భాగమే! మార్పు మననుండే రావాలి.
@విశ్వప్రేమికుడు గారూ, ధన్యవాదాలండి. ఈ ఇంగ్లీషు పిచ్చికి చదువుకున్నవాళ్లు చదువుకోనివాళ్లు, పట్నవాసులు, పల్లెటూరువాసులు అన్న తేడా ఏం లేదండి..అందరిదీ ఒకటే బాట... ఇంగ్లీషు బాట. మా వాచ్‌మాన్ పిల్లలు మమ్మీ డాడీ తప్ప అమ్మ, నాన్న అని పిలవరు. మేమంతా వాళ్లకి ఆంటీలం అంకుళ్లం....అంతలా పాతుకుపోయింది ఇంగ్లీషు!
@నేస్తం, నిజమండి..ఇంగ్లీషు మాట్లాడకపోతే మనకి కల్చరు లేనట్టే!
@సునీత గారూ, అలా కూడా చేస్తారంటారా? ఏమో చెయ్యావచ్చు..మనం చూడావచ్చు..
@భారారె.."అందులో నేనూ ఒకణ్ణి"...మీరు కనీసం దానిని గుర్తించారు..సంతోషం..అది గుర్తించకుండా అదేదో గొప్పగా ఫీల్ అయ్యేవాళ్లే ఎక్కువండి ఇక్కడ.

సిరిసిరిమువ్వ October 28, 2009 at 7:50 PM  

@సుజాత గారూ, "ఇంగ్లీషు నేర్చుకోవాల్సిందే! ఒక భాషగా! ఒక జీవితంగా కాదు!"..చక్కగా చెప్పారు.

"మన పిల్లలు ఇంజనీరింగ్ కాలేజీలో చదవాలి, మంచి ఉద్యోగాలు చేయాలి అనే కోరికతో ఇంజనీరింగ్ లు, మెడిసిన్లూ చదివిస్తూ మరో పక్క ఇంగ్లీషుని ద్వేషించటం ఐరనీ!".....ఇంగ్లీషుని ద్వేషించనక్కర్లేదు..తెలుగుని ప్రేమిద్దాం.

"ఇంగ్లీషుని ఒక భాషగా, సబ్జెక్ట్ నేర్చుకునే మాధ్యమంగా మాత్రమే నేర్చుకోవాలి" ... అవును....అసలు చదువుకి వ్యావహారిక భాషకి ముడిపెట్టటమే మన దౌర్భాగ్యం.

"ప్రైవేట్ స్కూళ్ళలో కూడా తప్పకుండా స్థానిక మాతృభాష మీడియం ఉండాలనే నిబంధన తప్పకుండా ఉండాలి. ఎవరికిష్టమైన మాధ్యమంలో వాళ్ళు చదువుకునే స్వేచ్ఛ ఉండాలి".. ..... ఇది అమలు కావాలంటే మన విద్యావిధానంలో సమూల మార్పులు రావాలి. పోటీ పరీక్షలన్నీ తెలుగులో కూడా పెట్టాలి..తెలుగులో వ్రాసేవాళ్లకి అదనపు మార్కులు ఇవ్వాలి...ఉద్యోగాల్లో (కనీసం రాష్ట్రప్రభుత్వ ఉద్యోగాలల్లో) తెలుగు వ్రాయటం చదవటం వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలి..అన్ని పుస్తకాలు తెలుగు భాషలో కూడా లభ్యమవ్వాలి..ఇవన్నీ చేసిననాడు తెలుగు మాధ్యమానికి మనం అనుకునే వైభవం వస్తుంది..

"ప్రైవేట్ పాఠశాల మీద కొరడా ఝళిపించే అధికారం, హక్కు ప్రభుత్వానికి తప్పకుండా ఉండాలి!"
ఇక్కడ అసలు లోపించిందే ప్రభుత్వ చిత్తశుద్ధి..రాష్ట్రంలో ప్రతి పాఠశాలలో ఖచ్చితంగా తెలుగు ఒక సబ్జెక్టుగా (తెలుగు మాధ్యమం కన్నా ముందు ఇది అమలు కావాలి) ఉండాల్సిందే అన్న నియమాన్ని ముందు మన ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలుచేస్తే పరిస్థితి కొంతన్నా మెరుగవుతుంది..ఇప్పటిలా తరగతి మొత్తం మీద ముగ్గురో నలుగురో తెలుగు తీసుకునేవాళ్లని చూసి మనం బాధపడే పరిస్థితులు ఉండవు.

ఇక చివరిగా తల్లిదండ్రులం ప్రతి ఒక్కరం ఖచ్చితంగా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిందే..బడి సంగతి వదిలెయ్యండి..ఇంట్లో ఎంతమందిమి పిల్లలకి తెలుగు నేర్పటానికి ప్రయత్నిస్తున్నాం..అందుకే మార్పు మనలోనే రావాలి..మన ఇంటినుండే రావాలి..మార్పు అనేది ఒక్కరితోనే మొదలవుతుందని నమ్మేవాళ్లల్లో నేను మొదటిదాన్ని:)

సిరిసిరిమువ్వ October 28, 2009 at 7:56 PM  

@వెంకటరమణ గారూ, ధన్యవాదాలండి.

@ తృష్ణ గారూ, ధన్యవాదాలు. మీ ఆ టపా చదివానండి, బాగా వ్రాసారు. అది చదివినప్పుడు నాకు మేము మా పాపకి తెలుగు అక్షరాలు నేర్పిన వైనం గుర్తుకొచ్చింది. నా బ్లాగు టెంప్లేటు మార్చి చాలా రోజులయ్యిందండి.

@లలిత గారూ, మీరన్నట్లు అలాంటి భయం కలిగితే మంచిదేనండి. కానీ నాకయితే నమ్మకం లేదు.

సిరిసిరిమువ్వ October 28, 2009 at 8:03 PM  

@పద్మార్పిత, మురళి ధన్యవాదాలు.

@Ruth గారూ, అవునండి..ఈ రోజులలో ఎవరికీ తెలుగు అక్కర్లేదు. తెలుగు మాధ్యమం కన్నా ముందు అసలు రాష్ట్రంలోని ప్రతి పాఠశాలలో ప్రతి విద్యార్థి తెలుగు ఒక సబ్జెక్టుగా చదవాలన్న నియమం కఠినంగా అమలు చేయ్యాలి.

@నెల్లూరి గారూ, అదేకదండి మన స్వభావం:)

జయ October 28, 2009 at 9:06 PM  

సిరిమువ్వ గారు, చాలా రోజుల తరువాత వొచ్హినా, ఒక మంచి విషయం గురించి చర్చించారు. మీరు చెప్పిన అంశాలన్నీ తప్పకుండా గమనించాల్సినవే. చాలా బాగా వివరించారు.

భావన October 28, 2009 at 10:48 PM  

@సిరిసిరి మువ్వ: వూరుకుందామని కాదండి. మూల కారణాన్ని అర్ధం చేసుకుని ఆ తరువాత మీరందరు చెప్పినవి ప్రయత్నిస్తే ఫలితం వుంటుంది అని నా భావం. భాష బావాన్ని వ్యక్తీకరించటం కంటే ప్రాధాన్యత లేదు అలా వ్యక్తీకరిస్తున్నంత వరకు ఏ భాష ఐతే ఏమి అనుకుంటున్నాము మనం, ఆ వ్యక్తీకరణ ఇంగ్లీష్ ఐతె మనం సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ కదా అనుకుంటున్నాము ఇక్కడ సక్సెస్ అనే దాన్ని కేవలం డబ్బు తో కొలుస్తున్నాము, ఆ భావన తగ్గితే కాని ఇవి అన్ని చెయ్యలేము అన్నానండి, సరిగా చెప్పినట్లు లేను.

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం October 28, 2009 at 11:25 PM  

ఈ రోగానికి చికిత్స వేఱే ఉంది. అది ఈ ఉన్న వ్యవస్థలో, ఇలాంటి పాలకులతో లభించదు. దానికొక భిన్నమైన సిద్ధాంతం, ఒక భిన్నమైన లక్షణాలు గల అధినాయకుడు, ఒక భిన్నమైన వ్యవస్థ, ఒక భిన్నమైన రాజ్యాంగం కావాలి.

ఇక్కడ కొందఱనుకుంటున్నట్లు ఇంగ్లీషు ఈ దేశానికేమీ అవసరం లేదు. అది లేకపోయినా ఇక్కడ ఏదీ ఆగదు. ఇంగ్లీషు లేకపోయినా దేశం హాయిగా బతుకుతుంది. (అసలు అది లేకపోతేనే బతుకుతుంది కూడా) బహుకొద్దిమంది ఆధికారవంతులూ, ధనవంతులూ సిండికేట్ గా ఏకమై దాన్ని బలవంతంగా అన్ని రంగాల్లోను రుద్ది మనందఱి చేతా చదివిస్తున్నారు.

వేణూశ్రీకాంత్ October 29, 2009 at 1:25 PM  

మంచి పాయింట్ చెప్పారు సిరిసిరిమువ్వ గారు. ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో మాతృభాష మాట్లాడ కూడదు అనే నియమం చాలా ఏళ్ళ నుండీ ఉంది. కానీ దాన్ని అమలు పరచడానికి విధించిన శిక్ష మాత్రం హేయం.

భిన్నసంస్కృతుల నుండి వచ్చిన వ్యక్తులు పనిచేసే ఆఫీసుల్లో కూడా మాతృభాష కన్నా అందరికీ అర్ధమయ్యే ఆగ్లం లో మాట్లాడాలి అన్నది ఒక బేసిక్ ఎటికేట్.

దేశమంతా ఒకే భాష మాట్లాడే చోట ఆంగ్లం లేకుండా దేశం బతకచ్చేమో కానీ ఇన్ని రకాల భాష లు ఉన్న మనదేశం లో అది అసాధ్యం. ఒకవేళ ఏ హిందీ నో మాట్లాడాలి అని ప్రతిపాదించి ప్రయత్నించినా చాలా వంతు ప్రజలకి అది పరాయిభాషే కదా.. అపుడు ఆంగ్లమైతే ఏమిటి హిందీ అయితే ఏమిటి. అదీకాక ప్రపంచం అంతా ఒకే కుటీరమవుతున్నపుడు అందరికీ అర్ధమయ్యే ఒక భాష ఉండటం మేలు కదా..

సిరిసిరిమువ్వ October 29, 2009 at 7:33 PM  

@జయ గారూ, ధన్యవాదాలు.

@భావన, అలా అంటారా, అయితే సరే ఇప్పుడు అర్థమయింది:)

@తాడేపల్లి గారు, మీరు చెప్పినవన్నీ జరిగేవేనంటారా?

@వేణు గారూ, నిజమే మీరన్నట్లు ఆఫీసుల్లో తప్పదు, అందరికీ అర్థమయ్యే భాష ఉండాలి, నిజమే కాని దానిని అంతవరకే ఉండనివ్వాలి..అది మన ఇంట్లోకి రాకూడదు.

Rajendra Devarapalli October 29, 2009 at 11:54 PM  

ఇక్కడో కామెంటు రాద్దామనుకుని మొదలుపెడితే ఇదిగో ఇలా టపా అవుతుంది
http://vizagdaily.info/?p=2260

గీతాచార్య October 30, 2009 at 11:28 AM  

As of now ditto Sujatha gari comment is what I can say. If anything more, I'l post evening. :-) But all this discussion is trash. Thatz my personal opinion. You need not agree with me.

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP