దీపాలు ఆర్పెయ్యండి---ఇదెక్కడి గొడవండి బాబు
జూన్ 15, 2008 సమయం రాత్రి 7:29:57
మూడు, రెండు, ఒకటి.......ఇక ఒక గంట పాటు మీ ఇంట్లో దీపాలు ఆర్పెయ్యండి. ఆరుబయటో డాబా మీదో కూర్చుని మీ పిల్లా పాపలతో కబుర్లు చెప్పుకోండి.
ఈ మద్య ఎక్కడ చూసినా ఈ దీపాలు ఆర్పే గోలే, దానితో పాటు చక్కటి విశ్లేషణలు. దీనికి ఇంతటి ప్రాచుర్యాన్ని కల్పించిన కొత్తపాళీ గారికి అభినందనలు.
ఈ బత్తి బందులు, ఈ విశ్లేషణలు, ఒక రోజుకో, ఒక గంటకో పరిమితం కాకూడదు. మనది గుంపు మనస్తత్వం. ఏదో ఎదుటి వాళ్ళు చెప్పారనో, వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం కూడా చేద్దామనో ఆ ఒక్క రోజుకి దీపాలు ఆర్పే వాళ్ళే ఎక్కువ. ఒక గంట పాటు దీపాలు ఆర్పటం మూలాన సమస్య పరిష్కారం అయిపోదు. ముందు కావల్సింది ప్రజలలో ఈ సమస్య గురించిన అవగాహన, అది లేని నాడు ఎన్ని బత్తి బందులు చేసినా ఉపయోగం శూన్యం. జూన్ 15 తరువాత ఎంతమంది ఈ విషయాన్ని గుర్తుంచుకుంటారు అన్నది కోటి రూపాయల ప్రశ్న. ఈ global warming (భూతాపం) మూలాన ఇప్పటికిప్పుడు మనకు వచ్చిపడే నష్టం ఏమి లేదు, వందల ఏళ్ళ తరువాత కాని దాని ప్రభావం కనపడదు, కానీ అది తగ్గించాలంటే ఇప్పటినుండే ప్రయత్నాలు చేయాలి కదా అని మన వాళ్ళ భావన. ఆశయం మంచిదే కాని అది ఎంతవరకు ఫలితాల్ని ఇస్తుందో వేచి చూడాలి. అసలంటూ ముందు అడుగు పడితే కదా పరుగు మొదలయ్యేది.
హైదరాబాద్ వాతావరణం ఈ అయిదారు సంవత్సరాలలో ఎంత మారి పోయిందో , బయటకు అడుగు పెట్టాలంటేనే భయం వేస్తుంది. ఇది ఇలానే కొనసాగితే? మొన్న మే లో కూడా ఒకసారి హైదరాబాద్ అన్‌ప్లగ్ అంటూ ఒక కార్యక్రమం జరిగింది. దానికి ముఖ్య అతిథులు ఇలియానా, కారుణ్య, శేఖర్ కమ్ముల, దినాజ్, పుల్లెల గోపిచంద్ లాంటి స్టార్స్. ఇలాంటి కార్యక్రమాలకి అలాంటి వాళ్ళు అవసరమా?? పైగా కార్యక్రమం జరిగింది శిల్పారామంలో. వాళ్ళు అక్కడికి రావటానికి ఎన్ని కార్లు వాడి ఉంటారు? అక్కడ ఏర్పాట్లకి ఎంత విద్యుత్తు వృథా చేసి ఉంటారు? పైగా కారుణ్య లైవ్ షో, దానికి ఎంత విద్యుత్తు ఖర్చు అయ్యి ఉంటుంది??ఇక హైదరాబాద్ జనాలు ఒక గంట అన్‌ప్లగ్ చేసి ఏంటి ఉపయోగం?? ?ఇలాంటి కార్యక్రమాలు మీడియాలో ప్రచారానికే కాని వాటివల్ల ఈసుమంత అయినా ఉపయోగం ఉంటుందా?
అసలే ఇక్కడ రోజుకి గంటనుండి ఏడు గంటల వరకు కరెంటు కోత అది చాలక ఇంకా ఈ దీపాలు ఆర్పటం కూడానా అనే వాళ్ళు కూడా ఉన్నారు. దీపాలు ఆర్పటం ఒక్కటే కాదు, మనకు వీలైనంతలో, మనకు చాతనయన రీతిలో పర్యావరణ పరిరక్షణకు నడుం కట్టాలి, అది మన జీవితంలో ఒక అంతర్భాగంగా ఉండాలి. నిజానికి ఇది ఒక inter linked process, ఏదో ఒక రోజు ఒక గంట దీపాలు ఆర్పినంత మాత్రాన తీరే సమస్య కాదు. ముందు మన ఇంటి నుండే మనం సంస్కరణలు మొదలుపెట్టాలి. సంస్కరణలంటే మనమేం బరువులు మొయ్యక్కరలేదు, త్యాగాలు చేసేయ్యక్కరలేదు, కొంచం అవగాహన, కాస్త జాగ్రత్త ఉంటే చాలు. కొన్ని నీటి బిందువులు చేరి సముద్రం అయినట్లు మనం తీసుకునే కొన్ని చిన్ని చిన్ని జాగ్రత్తలే మనకు మన పుడమి తల్లికి శ్రీరామ రక్ష. ఒక యూనిట్ విద్యుత్ ఆదా చేస్తే నాలుగు యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసినట్లే.
గ్రామాలలో కన్నా పట్టణాలలో, చదువు రాని వారి కన్నా చదువుకున్న వాళ్ళతోనే భూమాతకి ఎక్కువ సమస్యలు. ఈ భూతాపానికి మూల కారణం సంపన్న దేశాలు. ప్రాశ్చాత్య సంస్కృతిని సాంప్రదాయాలని అనుకరించటం మొదలుపెట్టి తెలిసి తెలిసి మనమే మన పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాం. ప్లాస్టిక్ అన్నది మన జీవితాలలో ఒక భాగం అయిపోయింది. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వాడకమే. అదివరకు కొట్టు నుండి సరుకులు తెచ్చుకుంటే కాగితం సంచుల్లో ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అన్నిటికి ప్లాస్టిక్ సంచులే. పల్లెటూళ్ళలో కూడా వీటి వాడకం ఎక్కువయి పోయింది. ఊరు వెళితే ఊరి పొలిమేర్లలో ఇప్పుడు మనకు కనిపించేది పచ్చటి చెట్లు కాదు, నలుపు తెలుపు రంగుల ప్లాస్టిక్కు కవర్లు (మున్సిపాలిటీ వాళ్ళు ఊరి బయట పోసే చెత్తలో సింహభాగం ఈ ప్లాస్టిక్ కవర్‌లే). ఇంకొకటి ప్రతి దానికి డిస్పోజబుల్ వస్తువులు వాడటం. ఆరోగ్య రక్షణకు అవసరమయిన సిరంజిల దగ్గరనుండి తినే స్పూన్ల వరకు అన్ని డిస్పోజబుల్ . వెనకటి రోజులలో వంటకు మట్టి పాత్రలు, వడ్డించటానికి ఆకులు, తినటానికి చేతులు వాడేవాళ్ళు. ఇప్పుడు ఇంటికి ఎవరైనా నలుగురు అతిథులు వచ్చారంటే డిస్పోజబుల్ ప్లేట్లు, డిస్పోజబుల్ గ్లాసులు, డిస్పోజబుల్ స్పూన్లు, ఒక్కటేంటి సమస్తం డిస్పోజబులే, అతిధులు వెళ్ళాక మన చేతికి పని లేకుండా అన్ని చెత్తబుట్టలోకి నెట్టివేయడమే. పిల్లలకి స్కూల్‌కి లంచ్ బాక్సుల్లో ఆహార పదార్థాలు అల్యూమినియం ఫాయిల్లో చుట్టి పెట్టటం ఇప్పుడు ఒక ఫాషన్ అయిపోయింది. అదేమంటే శుభ్రత. శుభ్రత పేరుతో మనకి మనం ఎంత హాని చేసుకుంటున్నామో మనకి అర్థం కావటం లేదు. అది వరకు మాకు ఇంటినుండి ఉప్పులు, పప్పులు గుడ్డ సంచుల్లో పోసి పంపేవాళ్ళు, నేను ఆ సంచుల్ని జాగ్రత్త చేసి మరలా వెనక్కి పంపేదాన్ని. ఇప్పుడు అమెరికా నుండి దిగుమతి అయిన జిప్‌లాక్ కవర్లు వాడటం మొదలుపెట్టారు. అదేమంటే వాళ్ళు పంపుతున్నారు మేము వాడుతున్నాం అంటున్నారు.
ఇక అమెరికా నుండి మనం దిగుమతి చేసుకున్న ఇంకొక వస్తువు ఉంది---డిస్పోజబుల్ డైపర్స్. డైపర్స్ అక్కడి వాళ్ళకి అవసరం అయితే ఇక్కడి వాళ్ళకి అదొక ఫాషన్ సింబల్ అయింది. పర్యావరణానికి హాని అటుంచి మన వేడి వాతావరణంలో పిల్లలికి వాటి వల్ల ఎంత అసౌకర్యంగా ఉంటుందో చెప్పలేం. వెనకటి రోజులలో తాతయ్య నాయనమ్మల మెత్తటి పంచలు చింపి లంగోటాల్లా కుడితే పిల్లలకి ఎంత సౌకర్యంగా ఉండేదో.
ఇక కంప్యూటర్లు, కార్లు, ఎ.సిలు, ఫ్రిజ్‌లు, టి.విలు, సెల్ ఫోన్ల వాడకం గురించి చెప్పక్కరలేదు. ఇవన్ని వాడకుండా ఉండటం అసాధ్యమే కాని వీలయినంత వరకు తగ్గించుకుందాం (నేనీ మధ్య బ్లాగులు చాలా తక్కువగా రాస్తుంది ఇందుకేనండోయ్ ).
ఇందుమూలంగా ఇక్కడ వీవెన్ గారికి ఓ విన్నపం --నెలకి ఒక శనివారం, ఒక ఆదివారం కూడలి తలుపులు మూసి వేయండి. ఈ మధ్య కూడలి కబుర్ల గదులు ఎక్కువయి పోయాయి :)).
ఈ విషయం మీద ప్రతి ఒక్కరు ఇంకొకరికి అవగాహన కలిగించండి.
-జై హింద్-