పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

June 11, 2008

మన భరతం పట్టే భాగ్యనగరం ఆటోలు

డిజిటల్ అయిననేమిలే---
హైదరాబాదులో ఆటో చార్జీలు మళ్ళీ పెరిగాయి. ఇది అధికారిక పెరుగుదల. అనధికారంగా పెట్రోలు రేట్లు పెరిగిన ప్రతిసారి వీళ్ళు చార్జీలు పెంచేస్తూనే ఉంటారు. అదేమంటే పెట్రోలు రేటు పెరిగింది కదా అంటారు. ఆటో మినిమం చార్జి ఇప్పటివరకు 10 రూపాయలు, కానీ ఆ పది రూపాయలకి మనం ఎక్కడికీ వెళ్ళలేము. ఒక కిలోమీటరు, రెండు కిలోమీటర్ల దూరానికి కూడా కనీసం ముప్పై నలభై చెల్లించుకోవాల్సిందే. 5 కి.మీ లోపు అసలు మీటరే వేయరు. దూరం ఎక్కువ అయినా ఒక్కోసారి మీటరు మీద రామంటారు, అదేమంటే ట్రాఫిక్కు టైము కదా టైము ఎక్కువ పట్టుద్ది అంటారు.

డిజిటల్ మీటర్లు ప్రవేశపెట్టటానికి వీళ్ళు ఎంత అడ్డు చెప్పారో అందరికి తెలిసిన విషయమే--అందుకు ముఖ్య కారణం వాటిని టాంపరింగ్ చేయటం కుదరదని (నిజమేనని నమ్మిన మనం పిచ్చివాళ్ళం), కానీ వాటిని కూడా ఎంత చక్కగా టాంపరింగ్ చేయవచ్చో మన హైదరాబాదు ఆటో వాళ్ళ దగ్గర నేర్చుకోవచ్చు.

గత 20 రోజులలో రెండుసార్లు ఆటో వాళ్ళ దోపిడీకి ప్రత్యక్షంగా బలయ్యాను. ఒకసారి అమీరుపేట నుండి హిమాయత్‌నగర్ వెళ్ళటానికి 43 రూపాయలు అయ్యింది, అదే దూరం తిరిగి వచ్చేటప్పుడు 56 రూపాయలు అయ్యింది, మళ్ళీ రెండూ డిజిటల్ మీటర్లే, దీని భావమేమి తిరుమలేశా!!!

వారం క్రితం సికింద్రాబాదు రైల్వే స్టేషన్లో దిగి ఇంటికి రావటానికి ఆటో దగ్గరికి వెళితే ప్రతి వాడు- పెట్రోలు చార్జిలు పెరిగాయి, మీటరు మీద రాము, కూకట్‌పల్లి అంటే 150 అవుద్ది అనే వాళ్ళే, ఇక రెండో మాట లేదు. చివరికి ఒకతను మీటరు మీద 10 ఇస్తే వస్తానన్నాడు. మీటరు 89 అయ్యింది--ఈ మద్య కాలంలో నేను చూసిన కాస్త ఖచ్చితమైన ఆటో ఇదేనేమో. అంతకు ముందు పదిహేను రోజుల క్రితం ఊరు వెళ్ళేటప్పుడు ఇదే దూరానికి 140 రూపాయలు అయ్యింది--ఇక్కడ కూడ రెండూ డిజిటల్ మీటర్లే. నిజానికి వచ్చేటప్పుడు బోయగూడలో దిగి వచ్చాం కాబట్టి కొంచం దూరం కూడా ఎక్కువే. దూరం పెరిగిన చార్జీలు తగ్గునన్నమాట :) (విలోమానుపాతం).

ఒకసారి రాత్రి పూట 8-9 గంటల మధ్య ఆటో ఎక్కాం, మధ్యలో పెట్రోలు కోసం అని నడి రోడ్డు మీద ఆటో ఆపి తీరిగ్గా నడుచుకుంటూ వెళ్లి పెట్రోలు తెచ్చి పోసుకుని పది తరువాత ఇంటికి చేర్చి ఒకటిన్నర రెట్లు డబ్బులు గుంజాలని చూసాడు. మేము ఇవ్వలేదనుకోండి. హైదరాబాదుకి కొత్తవాళ్ళు, నోట్లో నాలుక లేని వాళ్ళయితే చచ్చినట్లు వాళ్ళడిగినంత సమర్పించుకోవలసిందే.

హైదరాబాదులో ట్రాఫిక్కు సమస్యకి సగం కారణం ఈ ఆటోల వాళ్ళే. ఒక్కొక సారి రోడ్డు దాటాలంటే ఈ ఆటోలను చూసి ఎంత భయంవేస్తుందో. రోడ్డు దాటదాం అనుకుంటుండగా రయ్యిమని వచ్చి ఆటోని దాదాపు మన కాళ్ళ మీదకి ఎక్కించినట్లే ఆపేసి ఆటో కావాలా, బోయినపల్లి, ESI అంటూ అరుస్తూ ఉంటారు.

ఇలాంటివి అనుభవం అయినప్పుడు ఛ్ఛ అసలు ఈ ఆటోలు ఎక్కకూడదు అనుకుంటా, కానీ తప్పదు, ఏం చేస్తాం.

3 వ్యాఖ్యలు:

వికటకవి June 12, 2008 at 9:51 PM  

ఉంటే నీతన్నా ఉండాలి, లేదా చట్టం అన్న భయమన్నా ఉండాలి. మంచి చదువుంటే ఈ రెండూ ఉంటాయి. చదువులో మంచి చదువు, చెడు చదువు ఉంటాయా అనేరు. చదువుకొని చెడిపోయినవాళ్ళది చెడిపోయిన చదువని అర్ధం, మన రాజకీయ నాయకుల్లాగా :-)

చిన్నమయ్య June 13, 2008 at 12:31 AM  

బహుకాలానంతర బ్లాగ్దర్శనం.
ఎక్కడయినా, ఏ దేశమైనా - ఇంచుమించు టేక్సీలూ, ఆటోల వాళ్లతో ప్రయాణీకుల వెతలు ఈ తీరునే వుంటాయనుకుంటాను.
క్రిక్కిరిసిన పట్టణాలూ, అందరికీ అనువుగాని రవాణా సౌకర్యాలు వెరసి ఆటోవాళ్ల జులుముకి కారణాలు. ఆటొవాడితో రచ్చ చేసి గెలిచినా, భంగ పడ్డ సందర్భాలూ కద్దు. దీనికి పూర్తి స్థాయి పరిష్కారం వుంటుందనుకోను. దీని సమస్యగా కాక, "జీవిత సత్యం (!)" గా స్వీకరిస్తే, కొంత ఉపశమనం.

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP