పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

December 30, 2011

మేమిందుకిలా??? పెళ్ళి ఆడపిల్ల జీవితంలో ఎన్ని మార్పులు తీసుకొస్తుందో!

 నేను చెప్పేది ఇప్పటి ఆడపిల్లల గురించి కాదు! మా తరం గురించి!

అప్పటి వరకు హాయిగా స్వేచ్చగా సీతాకోక చిలుకల్లా ఎగిరిన మేము ఒక్కసారిగా ప్యూపా దశలోకి వెళ్ళిపోతాం.

ఇల్లు..భర్త..పిల్లలు..ఇదే లోకం...అదే సర్వస్వం...

ఇల్లే కదా స్వర్గ సీమ అని పాడేసుకుంటూ  ఆ ప్యూపా దశలోనే ఉండిపోతాం.

అందులోనుండి బయట పడాలని కూడా అనుకోము!

ఇల్లు విడిచి ఒక్క రోజు ..ఒక్క గంట బయటకి వెళ్ళాలన్నా ఎన్ని ప్రతిబంధకాలో!

అమ్మాయి కాలేజీ నుండి వచ్చే టైము..అబ్బాయి ఆటలకి వెళ్లే టైము..అయ్య గారు ఆఫీసు నుండి వచ్చే టైము..మామ గారికి ఒంట్లో బాగోకపోవటమో..చుట్టాలు రావటమో..ఇలా ఏదో ఒకటి అడ్డం పడుతూనే ఉంటుంది.

ఇలా అడ్డాలు లేకుండా తిరిగే వాళ్ళు ఉన్నారనుకోండి..కానీ తక్కువ.

ఓ రెండు రోజులు ఊరెళ్ళాలంటే ఎన్ని ముందస్తు ఏర్పాట్లు చేసి వెళ్లాలో..

ఓ వారం ముందు నుండే ఏర్పాట్లు మొదలుపెట్టాలి..

మంచినీళ్ల దగ్గరనుండి. పెరుగు దాకా.అన్నీ రెడీగా పెట్టి వెళ్లాలి.

వెళ్ళాక అయ్యో ఏం ఇబ్బంది పడుతున్నారో అని మనసులో పీకులాటే...

పాలబ్బాయి వచ్చే టైం కి లేచారో లేదో...పనమ్మాయి టైం కి వచ్చిందో లేదో..

టిఫిన్ తిన్నారో ..తినకుండా పరిగెత్తారో..తలుపులు సరిగ్గా వేసారో లేదో...

పనమ్మాయిని బతిమాలుకోవాలి..నేను లేని రెండు రోజులు మానకుండా రా తల్లీ అని..

అదేంటో ఇంత చెప్పినా మనం ఊరెళ్ళిన టైం లోనే ఆ పనిపిల్లకీ ఏవో అర్జంటు పనులో.. జలుబో..జ్వరమో వచ్చేడుస్తాయి!

మనుషులం అక్కడే కాని మనస్సంతా ఇక్కడే ఉంటుంది..

ఇప్పుడంటే ఫోన్లు వచ్చాక అడుగడుక్కి మానిటరింగ్ చేస్తున్నాం కానీ మా పెళ్లయిన కొత్తలో ఫోన్లు అంతగా లేని రోజుల్లో ఉత్తరాలే ఆధారం..

ఇక ఆ ఉత్తరాల నిండా జాగ్రత్తలు..హెచ్చరికలు..ఉపదేశాలు..మాత్రమే ఉండేవి:)

ఇంతా చేసి వెళ్ళిన దగ్గరన్నా ప్రశాంతంగా ఉంటామా అంటే అదీ లేదు!

మంచాల మీద విడిచిన బట్టల కుప్పలు..సింకులో కడగని గిన్నెలు....పొయ్యి మీద మాడిన దోసెలు కళ్ల ముందు నాట్యం చేస్తుంటే ఇంకెక్కడి ప్రశాంతత!

అదే మగాళ్లకి చూడండి ఈ జంజాటాలు ఏమీ ఉండవు..ఎక్కడికంటే అక్కడికి ఝామ్మంటూ వెళ్ళిపోతారు.

ఎవరి అనుమతులూ అక్కర్లేదు..ఏ ముందస్తు ఏర్పాట్లూ చెయ్యక్కర్లేదు!

ఇంటి గురించి ఏ బెంగా..ఆలోచనలూ..ఆందోళనలూ..ఉండవు!

ఇప్పటి వాళ్లయితే మరీనూ..ఆఫీసు నుండి అటు నుండి అటే ఫ్లైట్ ఎక్కేస్తారు!

మరి నిజంగానే మేము లేకపోతే ఇళ్లల్లో జరగదా అంటే శుభ్రంగా జరిగిపోతుంది, మాకే లేనిపోని ఆరాటం.

అందరూ నా మీదే అధారపడ్డారు..నేను లేకపోతే వీళ్లకిక జీవితమే లేదు అన్న ఓ అందమైన భ్రమలో బ్రతుకుతున్నాం!

ఇప్పుడీ సోదంతా ఎందుకంటే....

మా డిగ్రీ. మరియు.పి.జి కాలేజీల వాళ్లం జనవరి ఒకటిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేసుకుందామనుకుని మొదలెట్టాం(ను).

ఆలోచన ఇంకో ఫ్రెండుది..నాది..కానీ తను ఉండేది అమెరికాలో కాబట్టి ఆ బాధ్యతంతా నేనే తలకెత్తుకున్నాను..

అందరి అడ్రస్సులు సంపాదించటం ఓ ఎత్తయితే మా జనాల్ని ఒప్పించటం ఇంకో ఎత్తయింది..

దాదాపు పాతిక సంవత్సరాల తర్వాత కలుస్తున్నాం కదా అని అందరూ ఉత్సాహంగా ఎగురుకుంటూ వస్తారనుకుని మొదలెట్టా!

మొదలెట్టాక కాని తెలియలేదు మా వాళ్ల కుటుంబ భక్తి..పతి భక్తి..పిల్లల భక్తి..

జనవరి ఒకటినా అంటూ సాగదీసిన వాళ్లే ఎక్కువ..

జనవరి ఒకటిన నేను మా ఆయనతోనే ఉండాలమ్మా అని ఒయ్యారాలొలకపోసిన వాళ్లూ...

జనవరి ఒకటిన మా అమ్మాయి దగ్గరికి వెళ్ళకపోతే ఇంకేం లేదే బాబూ..నన్ను చంపి పాతరేస్తుంది అని భయపడి పోయిన వాళ్లూ....

జనవరి ఒకటికి మా ఫామిలీస్ అన్నీ కలిసి రిసార్ట్సు కి వెళతాం..కుదరదబ్బా అన్న వాళ్లూ..(వీళ్లు కలుసుకునేది సంవత్సరానికి ఒక్కసారి జనవరి ఒకటిన మాత్రమే అట..అందరూ మళ్ళీ ఉండేది హైదరాబాదులోనే)!

హైదరాబాదులోనా..మాకు దూరం కదా.వచ్చి వెళ్ళాటానికి కనీసం మూడు రోజులన్నా కావాలి..నేను లేకపోతే మా ఇంట్లో మూడు నిమిషాలు కూడా జరగదమ్మా అని దీర్ఘాలు తీసిన వాళ్లూ..

జనవరి ఒకటి... ప్రోటోకోల్ ప్రకారం మంత్రుల్ని..కలక్టర్లని..ఎమ్మేలేలని కలవాలి కుదరదు అని ఖరాఖండిగా చెప్పిన ప్రభుత్వంలోని పెద్ద ఉద్యోగులు..

మా ఆయన జనవరి ఒకటికి ఎక్కడికన్నా వెళదామంటున్నారు... ఇప్పుడు నేను రానంటే ఆయన చిన్నబుచ్చుకుంటారు ..రానులే అన్నవాళ్ళూ..

మా అత్త గారికి ఆరోగ్యం అంత బాగుండటం లేదు..నీకు తెలుసుగా ఆవిడ్ని మేమే చూసుకోవాలి---ఈ సారికి కుదరుదులే ఏమీ అనుకోకు (ఇదేదో మా ఇంట్లో ఫంక్షన్ అయినట్టు) అని దీర్ఘాలు తీసిన వాళ్లూ..

మా ఆడపడుచు గారమ్మాయి పెళ్ళి కుదిరిందిరా..ఆ షాపింగు పనులతో బిజీగా ఉన్నా..ఇంకో సారి పెట్టినప్పుడు వస్తాలే అన్నవాళ్లూ..

అయ్యో అదే సమయానికి మా ఆయన వాళ్ల స్కూలు వంద సంవత్సరాల వేడుక..తను ఇండియా వస్తున్నారు కాబట్టి నేను రాలేను అన్నవాళ్లు..

చచ్చీ చెడీ..దేశాలన్నీ గాలించి..నెట్టులో జల్లెడ పట్టి...వాళ్లనీ వీళ్లనీ అడుక్కుని...ఓ అరవై మందివి అడ్రస్సులు  ఫోను నంబర్లు సంపాదించి అందరిని కాంటాక్టు చేసి ఎంతో ఉత్సాహంగా మొదలుపెడితే ...

ఈ కారణాలు విని  దిమ్మ తిరిగి...నా ఉత్సాహమంతా చప్పగా నీరు కారిపోయింది..

ఈ కారణాలన్నీ చూడండి..అన్నీ కుటుంబం చుట్టూ తిరిగేవే!

ఎందుకు ఇంతలా మమ్ముల్ని మేము ఈ కుటుంబ బంధాల్లో కట్టి పడేసుకుంటున్నాం?

నచ్చిన సినిమాకి తీసుకెళ్లలేదనో..తను కోరుకున్నంత మోడ్రన్ గా భర్త లేడనో..

అత్త గారితో ఓ రెండు నిమిషాలు ఎక్కువ మాట్లాడరనో..అమెరికా వెళ్ళొద్దంటున్నారనో..

ఎడాపెడా విడాకులిచ్చేస్తున్న ఈ రోజుల్లో మేమిందుకిలా ఉన్నాం?

మాకంటూ కాస్త సమయాన్ని ఎందుకు కల్పించుకోలేక పోతున్నాం?

నిజంగా పైన చెప్పినవన్నీ రాలేనంత కారణాలా?

నిజానికి కుటుంబంలో ఇలాంటి వాటికి వెళ్తామంటే వద్దనే వాళ్లు కూడా ఎవరూ ఉండరు..

మేమే అలా అలవాటు పడిపోయాం...మా చుట్టూ మేమే ఓ గిరి గీసుకున్నాం..

అది దాటి బయటకు రావటానికి ఇష్టపడం..రావటానికి ప్రయత్నమూ చెయ్యం..

ఈ ప్యూపా బతుకులే మాకిష్టం!

***********************************************************************************

సరే జనవరి ఒకటని అభ్యంతరాలు చెప్తున్నారు కదా అని కార్యక్రమం జనవరి రెండుకి మార్చినా మరలా ఏవో కారణాలు రాలేకపోతున్నందుకు..

చివరికి ఓ పాతిక మంది తేలారు వచ్చేవాళ్లు..

మేమెందుకిలా???

ఈ ప్యూపా దశ నుండి బయటపడి మళ్లీ సీతాకోక చిలుకల్లా హాయిగా ..స్వేచ్చగా ఎప్పుడు ఎగురుతామో!

Read more...

December 16, 2011

26వ హైదరాబాద్ పుస్తక ప్రదర్శన

పుస్తక ప్రియులు ఎంతగానో ఎదురు చూసే  పుస్తకాల పండగొచ్చేసింది.
 26 వ హైదరాబాదు పుస్తక ప్రదర్శన నిన్న అనగా డిసెంబరు 15 న మొదలయింది.

ఈ ప్రదర్శన  డిసెంబర్ 15 నుండి 25 వరకు నెక్లసు రోడ్డులోని పీపుల్స్ ప్లాజా లో జరుగుతుంది.

ప్రదర్శన వేళలు:
మామూలు రోజుల్లో:  మద్యాహ్నం 2  నుండి రాత్రి 8  గంటల వరకు
శని.. ఆది వారాలలో:  మద్యాహ్నం 12 నుండి రాత్రి  9 గంటల వరకు

ఇక ప్రతి సంవత్సరం లాగానే e-తెలుగు తరఫున ఒక స్టాలు, కినిగె తరుపున ఒక స్టాలు తెరిచారు.
e-తెలుగు స్టాల్ నంబరు: 2
కినిగె స్టాలు నంబరు:  190

ఈ సందర్భంగా ప్రతి రోజూ సాయంత్రం వేళలో పుస్తకావిష్కరణలు,  రచయితల సభలు, సమావేశాలు, చర్చలు , సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి.
మరిన్ని వివరాలకు ఇక్కడ చూడొచ్చు.

******************************************************************************

e-తెలుగు తరుపున కశ్యప్ గారు తెలుగు బ్లాగు గుంపు కి పంపిన సందేశం ఇక్కడ పెడుతున్నాను. ఆసక్తి ఉన్నవాళ్ళు కశ్యప్ గారిని సంప్రదించండి.

 వేలలో ఉన్న తెలుగు బ్లాగుల సందర్శకులని లక్షల్లోనికి  పెంచే దిశగా ఈ పుస్తక ప్రదర్శనలో మన కార్యక్రమాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయని ఆశిస్తున్నాం. ఎందుకంటే, పుస్తక ప్రదర్శనకి వచ్చేవారిలో చదివే ఆసక్తి ఉన్నవాళ్ళు ఎక్కవ శాతం ఉంటారు.

పుస్తక ప్రదర్శనలో e-తెలుగు స్టాల్ లో ఉండి e-తెలుగు, కంప్యూటర్ లో తెలుగు వాడకం, మరీ ముఖ్యంగా అంతర్జాలం లోని సాంఘికజాల నెలవులలో(సోషల్ నెట్వర్కింగ్ సైట్స్) తెలుగు ఉపయోగం వంటివి ప్రదర్శనకు వచ్చే వారికి వివరించేందుకు విజయవంతంగా నడుపుటకు చాలా మంది వాలంటీర్ల అవసరం ఉంది. తెలుగు బ్లాగరులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సహాయ సహకారాలను అందించాలని కోరుకుంటున్నాము . మీ సూచనలు సలహాలు అహ్వానిస్తున్నాము .

క్రింది వివరాలను e-మెయిలు ద్వారా గాని..టెలిఫోను ద్వారా గాని తెలియపరచమని కోరుతున్నాము.

పేరు:
టెలిఫోను నంబరు:
e-మెయిలు చిరునామా:
ఏ తేదీలలో ఏ సమయంలో స్టాలులో ఉండగలరో ఆ వివరాలు:

మీ అందరి సహాయ సహకారాలను ఆకాంక్షిస్తూ ,అన్ని రోజులూ ఒక్కరే ఉండలేరు కాబట్టి ఒక్కో రోజూ ఒక్కొక్కరూ వంతుల వారీగా చెయాల్సిరావచ్చు. మీకు ఏయే రోజులలో వీలవుతుందో చెప్తూ ఇక్కడ స్పందించండి. (దీనికోసం ఓ పూట మీ కార్యాలయం నుండి సెలవు తీసుకునే దిశగా కూడా ఆలోచించండి.)

మీ సహాయం మరియు తోడ్పాటు మాకు ఇప్పుడు అత్యంత ఆవశ్యకం. మీ నుండి సానుకూల స్పందనని ఆశిస్తూ...

మీ శ్రేయోభిలాషి 
కశ్యప్...9396533666

Read more...

November 20, 2011

బాపూ గీసిన దృశ్యకావ్యం--శ్రీ రామరాజ్యం
లవకుశ....

ఈ సినిమా నేను చిన్నప్పుడు ఎప్పుడో చూసాను..తర్వాత టివి లో అడపా తడపా చూసినా నాకు ప్రతి సీనూ అయితే గుర్తు లేదు. పాటలు..పద్యాలు  మాత్రం ఇప్పటికీ చెవిలో మోగుతుంటాయి.

శ్రీరామరాజ్యం...

బాపు. రమణ..బాలకృష్ణ..నయనతారలతో శ్రీరామరాజ్యం సినిమా తీస్తున్నారన్న దగ్గరనుండి..ఈ సినిమా గురించి ఓ ఆసక్తి.

బాపు....రమణల నుండి రాముడి కథ అనగానే సంపూర్ణరామాయణం గుర్తుకొస్తుంది. మరి వారి స్థాయిలోనే ఈ సినిమా కూడా తీయగలరా..చూద్దాం అనుకున్నా.

అంతే కాని లవకుశల స్థాయిలో తీయగలరా..ఈ కథకి న్యాయం చేయగలరా...పాటలు అదే రీతిలో అలరిస్తాయా అని నేనసలు ఆలోచించలేదు. 

అది అప్పటి సినిమా..ఇది ఇప్పటి సినిమా.

ఇది బాపు సినిమా అంతే!

ఇంకో సినిమాతో కానీ..ఆ నటులతో కానీ అస్సలు పోల్చకూడదన్నది నా అభిప్రాయం.

బాపూ లవకుశ సినిమా స్ఫూర్తితోటే ఈ సినిమా తీసినా దాంతో పోల్చటం సరికాదు.

ఎప్పటి సినిమా అప్పటిదే. అప్పట్లో లాగా పద్యాలు..భారీ డైలాగులతో సినిమా తీస్తే ఇప్పటి వాళ్లకి ఎక్కుతుందా?

అప్పటి లవకుశలో కూడా కొన్ని లోపాలు లేకపోలేదు..ఆ సినిమా నాలుగు సంవత్సరాలు తీసారంట.. దాంతో లవకుశలు ముందు సీనులలో పెద్దగా కనిపించారంటారు. వాళ్లు నటించిన సీనులు కలపటం కూడా ఇబ్బంది అయిందట (వికీ సౌజన్యంతో).

నయనతార సీతేంటి..బాలకృష్ణ రాముడేంటి అని నొసలు ముడిచారు..ముడుస్తూనే ఉన్నారు.

ఆ ముడిచిన నొసలు విప్పారుకునేలా..కన్నులు విచ్చుకునేలా  ఓ అద్భుత చిత్రం గీసి మనకి అందించారు బాపు. 

బాపు అంటే నటులు కనపడరు..పాత్రలే మన కళ్ళముందు మెదులుతాయి అన్న నిజాన్ని మరోసారి నిరూపించారు బాపు.

మూల కథకి భంగం కలగకుండా గ్రాఫిక్సు మొదలైన ఆధునిక సాంకేతికతని జోడించి బాపూ కుంచె నుండి జాలువారిన ఓ దృశ్య కావ్యం శ్రీరామరాజ్యం.

మూడుగంటల సినిమా మూడు నిమిషాలుగా అనిపించదనటంలో అతిశయోక్తి లేదు.

రమణ నుడికారానికి బాపూ అందంగా నగిషీలు చెక్కి రూపొందిన చిత్రం ఈ శ్రీరామరాజ్యం!

తన చివరి చిత్రం ఇంత అద్భుత చిత్రం అవుతుందని ఆ మహానుభావుడు ఊహించారో లేదో మరి.

ఈ చిత్రం చూసిన ప్రతివారికి రమణ గారు గుర్తుకొచ్చి..అయ్యో ఈ విజయాన్ని పంచుకోను బాపు గారికి పక్కన ఆయన లేరే అని మనస్సు కలుక్కుమనకపోదు.

ఈ సినిమాలో నటులందరూ వాళ్ల వాళ్ళ పాత్రలకి సంపూర్ణ న్యాయం చేసారు.

అందరికన్నా ఎక్కువ ఆకట్టుకుంది బాలరాజు (హనుమంతుడు).

లవకుశలుగా చేసిన బాల నటులు కూడా బాగా చేసారు.

పసి లవకుశలకు చెట్లకి వేసిన తీగలతో అల్లిన ఉయ్యాల నాకు మా బాగా నచ్చింది.

వాల్మీకి గా  నాగేశ్వరరావు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు..నటన.. వాచకం..అన్నిటిలో మంచి మార్కులు వేయవచ్చు.

సీనియర్ నటుడు  బాలయ్య వయస్సు మీద పడ్దా బాగానే చేసారనిపించింది.  వాచకంలో మాత్రం తేడా బాగా తెలిసింది.

ఇక రాముడిగా ఓ ఇమేజ్ ఉన్న బాలకృష్ణతో ఇలాంటి పాత్ర చేయించటం ఓ సాహసమే.

అక్కడక్కడా బాలకృష్ణ మేకప్ (ఇది కూడా క్లోస్ అప్ ల్లోనే....మిగతా దగ్గర బాగానే ఉంది) లోపాలు పక్కన పెడితే నటుడిగా ఆ పాత్రలోకి ఒదిగిపోయాడు  బాలకృష్ణ..బాపూ అలా ఒదిగించారంటే ఇంకా సముచితమేమో!

చివర చివర సీనుల్లో అయితే నాకు బాలకృష్ణ బాగా నచ్చేసాడు. ఈ సినిమా బాలకృష్ణ నటజీవితంలో ఓ మైలురాయి అవుతుంది.

 సీతని పరిత్యజంచవలసివచ్చినప్పుడు..సీతా వియోగం అప్పుడు..లవకుశలను కలిసినప్పుడు చాలా బాగా చేసాడు.

ఓ మంచి దర్శకుడి చేతిలో పడితే ఓ నటుడిలోని  మరో పార్శ్వం ఎలా వెలుగులోకి వస్తుందో కళ్లారా చూస్తాం  ఈ చిత్రంలోని  బాలకృష్ణ నటనతో!

 బాలకృష్ణ ఓ పదేళ్లు ముందు ఈ పాత్ర చేసుంటే ఇంకా  బాగుండేది అంటున్నారు కానీ....అసలు ఇప్పటికయినా ఇలాంటి పాత్ర దొరకటం తన అదృష్టం అని నేననుకుంటున్నాను. 

అందరికన్నా నటనలో ఎక్కువ మార్కులు కొట్టేసింది నయనతార.

సీత పాత్రకి తగ్గ సాత్వికత ..సౌకుమార్యం..అణువణువునా ప్రతిబింబించాయి ఈ అమ్మాయిలో. ఇంకెవరయినా ఈ పాత్రకి న్యాయం చేయలేకపోయేవాళ్ళు అనిపించేంత చక్కగా చేసింది.

ఇంకెవరైనా అయినా కూడా  బాపూ ఇలాగే మలిచి ఉండేవాళ్ళు...అందులో సందేహం లేదు.

తన ఆహార్యం కానీ...అభినయనం కానీ....మాటల్లో చెప్పలేనంత బాగున్నాయి.

సీత పాత్రకి గాత్రం అందించిన సునీతకి సగం క్రెడిట్ ఇవ్వాలి.

చాలా తక్కువ మాటల్లో సీత పాత్రని బాగా మలిచారు. ముఖ్యంగా వాల్మీకి..సీతల మధ్య ఎక్కువగా కళ్లతోనే సంభాషణ జరుగుతుంది..సీత ఆత్మ రాజమందిరానికి వెళ్ళి రాముడ్ని చూసి వచ్చాక..వాల్మీకి అడిగిన దానికి సమాధానం కళ్ళతోటే చెప్తుంది సీత..నాకయితే్ ఆ సన్నివేశం ఎంతగా నచ్చేసిందో.. అదీ బాపూ ప్రతిభ...నభూతోః న భవిష్యతిః.

పాటలు కూడా సన్నివేశానికి తగ్గట్టు ..అలతి అలతి పదాలతో వినసొంపుగా ఉన్నాయి.

కొన్ని పాటల్లో సమయాభావం వల్లేమో కొన్ని చరణాలు తీసేసారు. 

ఇళయ రాజా సంగీతం....ఆయన స్థాయిలో లేదంటున్నారు కానీ నాకయితే ఈ సినిమాకి తగ్గ స్థాయిలోనే ఉంది..బాగుంది అనిపించింది.

కంటికి ఇంపైన దర్బార్ సెట్లు..ముని కుటీరాలు.. ఆహ్లాదంగా ఉన్నాయి.

అడవి దృశ్యాలన్నీ ఎక్కువ గ్రాఫిక్సే..మా అమ్మాయికి ఇది కాస్త నచ్చలేదు.

సినిమా మొదట్లోనే ఓ డిస్క్లైమర్ పెట్టారు..ఈ సినిమా గురించి జంతువులకు కానీ పక్షులకు కానీ ఎలాంటి ఇబ్బంది కలిగించలేదు అని..మరి జీవకారుణ్య సంఘాల వాళ్లతో ఇబ్బందవుతుందనేమో అన్నీ గ్రాఫిక్సుతో లాగించేసారు.

పౌరాణిక చిత్రాలు నిర్మించటానికి భయపడే ఈ రోజుల్లో ..

పౌరాణిక పాత్రలు వేయటానికి వెతుక్కున్నా నటులు దొరకని ఈ రోజుల్లో...

పౌరాణాకాల్ని మర్చిపోతున్న మనకు..

అసలు పౌరాణికాలంటే ఏంటో తెలియని ఇప్పటి తరానికి.. 

ఓ మంచి చిత్రాన్ని అందించిన బాపూ..రమణలకి నమస్సులు.

ఇప్పటి పిల్లలకి తప్పక చూపించవలసిన సినిమా ఇది.

నచ్చని విషయాలు ఏమీ లేవా అంటే ఉన్నాయి..కానీ అవి పట్టించుకునేంత పెద్దవీ కావు..ఈ దృశ్య కావ్యాన్ని తక్కువ చేసి చూపేటంతటివీ కాదు...దిష్టి చుక్కలన్నమాట!

ఇంధ్రధనుస్సు అందాన్ని చూసి అనుభవించాలి కాని వర్ణించలేము..ఈ సినిమా అంతే..ఎవరికి వారు చూసి అనుభవించాలి.

Read more...

November 10, 2011

కార్తీక మాసం వనభోజనాలు..నేనూ నా వంటలు.. నస రస

సమయం ఉదయం 6:30..అప్పుడే మంచం మీదనుండి లేచిన నా స్వగతం.....

అబ్బో చాలా టైం అయింది..రోజు రోజుకి బద్దకంగా తయారవుతున్నాను.
పిల్లకి కాలేజీ 11 గంటలకేమో కానీ ఉదయం లేవటానికి బద్దకం వచ్చేస్తుంది.
ఇవాళ ఏం కూరలు వండాలో!
అబ్బ..వెధవ వంట..ముందు పేపరు చదివి అప్పుడు వంట సంగతి చూద్దాం.

వంట అంటే గుర్తుకొచ్చింది..ఇవాళ కార్తీక పౌర్ణమి కదా!
ఉపవాసం ఉందామా....ఉందాం..ఉందాం.
రోజంతా ఏం తినకుండా ఉండగలమా?
చూద్దాం..ఎప్పుడు ఆకలయితే అప్పుడు ఉపవాసం లేదనుకుని తినేద్దాం:)

ఉపవాసం అంటే గుర్తొచ్చింది .....
జ్యోతి గారు బ్లాగుల్లో ఇవాళ వనభోజనాలు అన్నట్టున్నారుగా....మర్చేపోయాను!
పోయిన సంవత్సరం కూడా నేను వెళ్లలేదు వనభోజనాలకి.
ఈ జ్యోతి గారు ఒకళ్ళు..చూసి చూసి పౌర్ణమి రోజు....వారం మధ్యలో పెట్టకపోతే ఏ ఆదివారమో పెట్టొచ్చుగా!
కాస్త స్థిమితంగా బోలెడు రకాలు చేసుకెళ్ళొచ్చు.
ఇప్పటికిప్పుడు స్పెషల్సు ఏం చేయాలబ్బా!
పోన్లే ఇంట్లో చేసే కూరలే పట్టు కెళదాం..
ముందుపేపరు చదివి అప్పుడు చూద్దాం ఏం చెయ్యాలో!

బీరకాయలు చాలా  ఉన్నాయి..బీరకాయ శనగపప్పు కూర వండి..బంగాళాదుంప వేపుడు చేస్తే సరి..తేలిగ్గా అయిపోతాయి..రుచికి  రుచిగా కూడా ఉంటాయి.

ఇంటి దగ్గర భోజనాలప్పుడు ఈ బీరకాయ శనగపప్పు కూర ఎక్కువగా చేస్తారు..ములక్కాయ..రాములక్కాయ వేసి వండితే ఎంత బాగుంటుందో! ములక్కాయలు లేనట్టున్నాయే..సర్లే సర్దుకుపోదాం.

అదర్రా..ఇవాళ బ్లాగు వనభోజనాలకి సింపులుగా మా ఇంట్లో చేసిన కూరలతో వచ్చేసా. 

 బీరకాయ శనగపప్పు కూరకి కావలసిన పదార్థాలు...చేసే విధానం తెలుసు కదా..

 ఇక బంగాళ దుంపల వేపుడు ఉందే..నాకు మహా ఇష్టం. కాలేజీకి లంచ్ తీసుకెళ్ళినన్ని రోజులూ..బాక్సులో బంగాళాదుంప వేపుడు.. లేకపోతే కోడి గుడ్డు పొరుటు..మరో పదార్థం పెట్టనిచ్చే దాన్ని కాను.

ఈ బంగాళాదుంప వేపుడు ఇల్లేరమ్మ వాళ్ళ నాన్న వండినట్లు వండితే  మహా రుచిగా ఉంటుంది. అసలు తలుచుకుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతాయి. ఇవాళ నేను అలాగే వండాలే!

ఇల్లేరమ్మ వాళ్ళ నాన్న ఎలా వండుతారా..వార్నీ.మీరు .ఇల్లేరమ్మ కథలు చదవలేదా..సరే వినండి..

బంగాళా దుంపలు ఉడకపెట్టి ముక్కలు చేసుకోండి. ...ఎన్ని దుంపలంటే  మీ ఇష్టం.

చిన్నారి లాగా మీ ఇంట్లో కూడా దుంపలు వలుస్తూ వలుస్తూ మింగేసేవాళ్ళుంటే ఓ నాలుగు ఎక్కువ ఉడకపెట్టుకోండి.

 చిన్నారి ఎవరా..అబ్బా..ఇల్లేరమ్మ చెల్లెలు..మధ్యలో మీకన్నీ ప్రశ్నలే!

ఇప్పుడు నాలుగు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకుని పొట్టు వలవండి.

వాటిని పెద్ద ముక్కలుగా చేసుకుని ఉప్పు, కారం, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు వేసి రోట్లో కచ్చా..పచ్చాగా దంచండి.పొయ్యి మీద బాండీ పెట్టి ఓ నాలుగయిదు పెద్ద గరిటెల నూనె పోయండి.

ఇల్లేరమ్మ వాళ్లమ్మ చెప్పినట్టు నూనె రెండు గరిటెలే పోస్తే సాయంత్రానికి కూడా దుంపలు వేగవు..వాళ్ళ నాన్న పోసినట్టు నూనె కాస్త ఎక్కువే పోయండి...ఎంత నూనె వేస్తే ఈ కూర అంత మజాగా ఉంటుంది...తొరగా అయిపోతుంది (ఈ మాట ఇల్లేరమ్మ వాళ్ళ నాన్న చెప్పాడులే).

నూనె వేడెక్కాక శనగ పప్పు, మినప పప్పు, అవాలు, జీలకర్ర, కరివేపాకుతో  తిరగమోత వేయండి.

తిరగమోత వేగాక దంచి పెట్టుకున్న ఉల్లిపాయ ముద్దవేసి బాగా వేపండి.ఉల్లిపాయ ముద్ద వేగాక బంగాళాదుంప ముక్కలు వేసి కాస్త ఉప్పు వేసి ముక్కలు బాగా ఎర్రగా అయ్యేవరకు వేపండి.
 
అంతే మజా మజాగా... ఘుమఘుమలాడే బంగాళా దుంపల వేపుడు రెడీ!
మరీ రెండు కూరలేనా అంటారా..నాకు తెలుసు మీరు అలా అంటారని.

ఇవిగో..ఇంకా ఉల్లి మినపట్టు.. మసాలా మినపట్టు..అల్లం పచ్చడి..కొబ్బరి పచ్చడితో..

 వీటితో పాటు ఉలవచారు.. మీగడ....ఆవకాయ..కమ్మటి పెరుగు.

వీటన్నటికన్నా ప్రత్యేకం.. మా అమ్మాయి చేతి గులాబ్ జాములు..ఐసు క్రీమూనూ.

గులాబ్ జాం ఐస్ క్రీముతో తింటే యమహాగా ఉంటుందట..ఓ సారి ప్రయత్నించండి.
అబ్బో చాలా అయ్యాయిగా!

అన్నీ చూసి ఆనందించండి.

ఆకలి నకనకలాడుతుంది..గుడికెళ్లొచ్చి అందరి బ్లాగుల మీద పడాలి..

నేను వచ్చేలోపు అందరూ మంచి మంచి వంటలు చేసి పెట్టండి...

Read more...

September 13, 2011

అవుటర్ రింగు రోడ్డు..మృత్యు రాదారి!

అవుటర్ రింగు రోడ్డు..ఆ రోడ్డు చూస్తే అసలు మనం హైదరాబాదు దగ్గరే ఉన్నామా అనిపిస్తుంది.  అంత పెద్ద రోడ్డు ఎవరి కోసం...ఏ ప్రయోజనాలు ఆశించి కట్టారో కాని..జనోపయోగం కోసమయితే ముమ్మాటికీ కాదు అనిపిస్తుంది.


ఆ రోడ్డు తిరిగే  ఒంపులు చూస్తే ఆ ఒంపుసొంపుల  కింద ఎన్ని జీవితాలు శిధిలమయ్యాయో....ఎంతమంది భూములు కోల్పోయిన వాళ్ళ  ఆక్రోశం అక్కడి గాలిలో వినిపిస్తుందో అనిపిస్తుంది. ఆ రోడ్డు మూలాన సర్వం కోల్పోయిన వాళ్ళు కొందరయితే..ఆ రోడ్డు మూలానే రాత్రికి రాత్రి కోట్లకి పడగలెత్తిన వాళ్ళు మరి కొందరు.

కొన్ని జంక్షన్ల దగ్గర మయసభ లాగానే ఉంటుంది..సరిగ్గా చూసుకోకపోతే దారి తప్పేస్తాం. మళ్ళా సరైన దారిలోకి రావాలంటే ఎంత ఇబ్బందో..సరైన అప్రోచ్ రోడ్లు..లింకు రోడ్లు లేవు.

ఈ రోడ్డు వేసిన అసలు ముఖ్యోద్దేశం..సిటీలో ట్రాఫిక్కు తగ్గించటం..మరి అది నెరవేరిందా అంటే లేదనే చెప్పవచ్చు.లారీలు ట్రక్కులు..సిటిలోకి రాకుండా అవుటర్ రింగు రోడ్డు ద్వారా వెళ్ళాలని..కానీ ఆ రోడ్డ మీద ప్రస్తుతానికయితే అంతగా లారీల..ట్రక్కుల ట్రాఫిక్కు కనిపించదు.  ఎక్కవగా ఎయిర్ పోర్టుకి వెళ్ళే వాహనాలే కనపడతాయి. సిటీలో ట్రాఫిక్కు సమస్య అలానే ఉంది.  సమయం కాని సమయంలో సిటీలో లారీలు విచ్చలవిడిగా తిరుగుతానే ఉన్నాయి.ఈ అవుటర్ రింగు రోడ్డు మీద ఎక్కడా ఎలాంటి చెకింగు ఉండదు. ట్రాహిక్కు రూల్సు ఉండవు..రోడ్డు ఖాళీగా ఉండటాన శని ఆదివారాల్లో సంపన్నుల పిల్లలకి ఈ రోడ్డు పెద్ద రేసింగ్ పాయింటు అయిపోయింది.  ఇప్పటికి ఈ రేసుల్లో ఎంత మంది ప్రాణాలు పోయాయో..ఎంత మంది గాయాల పాల పడ్డారో..అయినా ఇప్పటికీ అక్కడ సరైన నియంత్రణ లేదు.

బాబూ మోహన్ కొడుకు..కోట శ్రీనివాస రావు కొడుకు..ఇప్పుడు అజారుద్దీన్ మేనల్లుడు ప్రాణాలు కోల్పోతే అతని కొడుకు ఇంకా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఇక మనకు తెలీని వాళ్ళు ఎందరో!

పిల్లల సరదాలు ప్రాణాలు తీసేవిగా  ఉండకూడదు. అజారుద్దీన్ కొడుకు వేసుకెళ్ళిన బైకుకి ఇంక రిజిస్ట్రేషన్ కూడా లేదట..కొత్తదయి ఉంటుంది. ముక్కుపచ్చలారని పిల్లలు ఇలా ప్రాణాలు కోల్పోవటం..గాయాల బారిన పడటం..వింటుంటేనే బాధగా ఉంటుంది. తల్లిదండ్రులకి ఎంత కడుపు కోత!

Read more...

September 5, 2011

శ్రావ్స్! ఓ మంచి వ్యాఖ్యాత! తెలుగు బ్లాగుల్లో వ్యాఖ్యల ద్వారా ప్రసిద్ధి చెందిన వాళ్లు కొందరున్నారు.  ఇక్కడ నేను అజ్ఞాతల గురించి చెప్పటం లేదు!  అప్పట్లో తెలుగు బ్లాగుల్లో నేస్తమా రాధిక గారి వ్యాఖ్య లేని బ్లాగు ఉండేది కాదంటే అతిశయోక్తి కాదు..కానీ ఆవిడ కూడా ముందు బ్లాగు ద్వారానే పరిచయం అయ్యారు..తర్వాత వ్యాఖ్యల ద్వారా అందరికీ దగ్గరయ్యారు.

 అసలు బ్లాగు లేకుండా వ్యాఖ్యల ద్వారానే ప్రసిద్ధికెక్కిన వారు మరి కొందరున్నారు.  వాళ్ళల్లో కుమార్ గారు ఒకరు. ఆయనకి ఇప్పటికీ బ్లాగు లేదనుకుంటాను.

ముందు వ్యాఖ్యల ద్వారానే పరిచయం అయ్యి ప్రసిద్ధికెక్కి ఆ తరువాత బ్లాగు మొదలుపెట్టి,  అడప తడపా టపాలు వ్రాస్తూ..కొన్నాళ్లకు మరో బ్లాగు మొదలుపెట్టినా..బ్లాగరుగా కన్నా వ్యాఖ్యాత గానే ఎక్కువ ఖ్యాతి గడించిన ఓ అమ్మాయి గురించి ఈ టపా!

ఈ అమ్మాయి చాలా సాదా సీదా తెలుగు అమ్మాయి!

ఆ అమ్మాయి వ్రాసే వ్యాఖ్యలు చూస్తే కొంతమందికి ముచ్చట అయితే మరి కొంతమందికి భయం..దడ..వణుకు అన్నీ ఏకకాలంలో!

పొద్దుట పొద్దుటే మంచి కాఫీ లాంటి వ్యాఖ్యలు అన్నమాట!

ఏ విషయం మీదయినా సాధికారకంగా మాట్లాడే తనని చూస్తే నాకు మహా ముచ్చటగా ఉంటుంది.

తను చెప్పాలనుకుంది నిర్భీతితో చెప్పగలదు.

నచ్చితే మెచ్చుకోవటం..నచ్చకపోతే ఖండించటం

ఎదుటి వాళ్ళు ఎవరైనా ఒకటే పంధా!

మొహమాటాల మెచ్చుకోళ్ళు...స్కోతర్షలు ఉండవు.

ఊరికే మెచ్చుకోవటం కోసం మెచ్చుకోవటం

ఖండించటం కోసం ఖండించటంలా కాకుండా

అర్థవంతమైన వ్యాఖ్యలు వ్రాసే వాళ్లలో తను ఒకరు!

మొదట్లో ఈ అమ్మాయి వ్యాఖ్యలు నేను అప్పడప్పుడు కొన్ని బ్లాగుల్లో చూసినా అంతగా పట్టించుకోలేదు.  ఓ రోజు నా బ్లాగులోనే ఇదా పరిష్కారం టపాకి నాతో విభేదిస్తూ ఓ వ్యాఖ్య పెట్టింది. కొండొకచో అపార్థమూ చేసుకుంది. అమ్మో ఫైర్ బ్రాండు అనుకున్నా!

ఈ విషయం మీదే చదువరి గారు వ్రాసిన బ్లాగులో కూడా తను వ్యాఖ్య పెట్టింది. ఆ పిల్ల క్యూరియాసిటికి ముచ్చటేసింది.

అప్పుడే తన గురించి మొదటిసారి కొంచం ఆసక్తిగా  గమనించాను. అప్పటినుండి బ్లాగుల్లో తన వ్యాఖ్యలు గమనిస్తుండేదాన్ని. చదువరి, తెలుగోడు..ఇలా కొన్ని బ్లాగుల్లో తన వ్యాఖ్యలు ఎక్కువగా కనపడుతుండేవి. తన బ్లాగుల ద్వారా ..వ్యాఖ్యల ద్వారా ..తను చాలా చిన్న అమ్మాయని ..ఇంకా పెళ్ళి కాలేదని తెలిసి మరింత ఆశ్చర్యపోయా! వయస్సుకి మించిన పరిపక్వత కనిపిస్తుంది తన వ్యాఖ్యల్లో!

తను ఎప్పుడు బ్లాగు మొదలుపెట్టిందో కూడా నేను గమనించలేదు.  నేను మొదటగా చదివిన తన టపా.. ఇందులో తన మల్టీ టాస్కింగ్ మీద తనే చెణుకులు విసురుకుంది. ఓహో టపాలు కూడా బాగానే వ్రాస్తుందే అనుకున్నా!

ఆ టపాలోనే తమరింకొంచెం తరచుగా రాయొచ్చు...అన్నదానికి తన సమాధానం

"నాకు వ్రాయటం కన్నా చదవటం ఇష్టం అందుకని ఇలా సేవ్ చేసిన టైములో ఏ బ్లాగు విడిచిపెట్టకుండా కామెంట్లతో సహా చదివేస్తున్నా :) "

ఇప్పటికీ అదే సూత్రం పాటిస్తున్నట్లుంది..అందుకే అప్పుడొకటి..ఇప్పుడొకటి తప్ప తన బ్లాగులో టపాలు జల జలా రాలవు.  అందులోనూ ఇప్పుడు బజ్జు వచ్చాక మామూలుగా తరుచుగా వ్రాసే జనాలు కూడా బజ్జుల్లో కూర్చుని బ్లాగు టపాలని నిర్లక్ష్యం చేస్తున్నారాయే!

వివాహం విద్యా నాశాయ అన్నట్టు
బజ్జు  బ్లాగు నాశాయా!

కాకపోతే బజ్జు ద్వారానే తనతో కొంచం పరిచయం పెరిగింది.  ఇలాంటి విషయాలల్లో మాత్రం బజ్జుని మెచ్చుకోవాలండోయ్!

వ్రాసిన టపాలు తక్కువే అయినా అన్నీ మంచి విషయం ఉన్న టపాలే.

స్నేహమంటే అని అమాయకంగా ప్రశ్నించినా..
కామెన్వెల్త్ క్రీడల  గురించి వ్రాసినా
నాకు లక్కుందా అంటూ అడిగినా
ఇలా జరిగింది అని చెప్పినా ..
శ్రమైకజీవన సౌందర్యం అంటూ రాంబాబు డైరీ మనకు చదివి వినిపించినా
...

కొంచం హాస్యం రంగరించి తను వ్రాసే టపాలు ఆలోచింపచేసివిగా ఉంటాయి.

మీరు అర్జంటుగా గొప్ప వాళ్ళం అయిపోదామనుకుంటున్నారా..అయితే ఈ టపా తప్పక చదవాల్సిందే..ఆ పై మీరు గొప్పవాళ్ళు కాకపోతే ఆ అమ్మాయినే అడిగేద్దాం..ఆపై కడిగేద్దాం.

తనని ఊరికే ఎవరైనా ఏమైనా అంటే ఊరుకోని తన తత్వం కూడా నాకు బాగా నచ్చింది. అందులో మన తెలుగు బ్లాగుల్లో ఆడవారిలో ఆ ధైర్యం  ఉన్న వాళ్లు బహు తక్కువ..ఎందుకొచ్చిన తలనెప్పి మనకి అని బ్లాగులు మూసుకున్న వాళ్లూ ఉన్నారు. ఇలా ఫేసు టు ఫేసు జవాబులు చెప్పే ఈ అమ్మాయంటే ఇదిగో ఈ టపా చదివాక మరి కొంత అభిమానం పెరిగింది.  అమ్మో గట్సు ఉన్న పిల్లే అనుకున్నా! ఆ గొడవ పూర్వాపరాలు నాకు తెలియదు కానీ ఆ అమ్మాయి ధైర్యానికి మెచ్చుకోకుండా ఉండలేకపోయాను.

తను వ్రాసిన టపాలల్లో నాకు బాగా నచ్చిన టపా..అన్నీ వృత్తులు సమానం కాదా ? ఎందుకు ?. మంచి చర్చ కూడా జరిగింది ఈ టపాలో.

ఇక చివరగా తను వ్రాసిన సింగపూరు గురించిన టపాలల్లో అయితే సింగపూరు గురించి అక్కడి టూరిజం గురించి ఆ దేశం వాళ్ళు  కూడా చెప్పలేనంత బాగా చెప్పింది.

అన్నట్టు ఈ అమ్మాయికి పాటలన్నా..కాఫీ అన్నా మహా ఇష్టం.  పాటల కోసమే ఓ బ్లాగు మొదలుపెట్టింది. 

ఈ రోజు తన పుట్టిన రోజని ఇప్పుడే తెలిసింది నాకు..ఎప్పుడో ఓ రెండు మూడు వారాల క్రితం వ్రాసి ప్రచురించకుండా అట్టి పెట్టిన ఈ టపాని తన జన్మదినం సందర్భంగా ప్రచురిస్తే సమయోచితంగా ఉంటుందని ప్రచురిస్తున్నా.

తను జీవితంలో ఇలానే స్థిర చిత్తంతో పైకెదగాలని ..తన ఆశలు..ఆకాంక్షలు అన్నీ నెరవేరాలని..

అభినందనలతో..ఆశీస్సులతో..

Read more...

August 30, 2011

హైదరాబాదు నుండి శ్రీశైలం దారిలో ఓ అద్భుతం..ఫరాహాబాద్

నిన్నటినుండి అలానే ట్యూన్ అయి ఉన్నారా! వేచి ఉన్నందుకు ధన్యవాదాలు.  రండి రండి... ఇప్పుడు మీకో అద్భుత ప్రదేశం చూపిస్తా. అదే ఫరాహాబాద్.ఫరాహాబాద్.... హైదారాబాదు నుండి శ్రీశైలం వెళ్ళే దారిలో  హైదరాబాదు నుండి 150 కి్.మీ దూరంలో ఉంది.  హైదారాబాదు నుండి వెళ్ళేటప్పుడు కుడివైపున వస్తుంది.  ఓ పెద్ద పులి బొమ్మ ఉంటుంది అదే గుర్తు. పక్కన బోర్డు కూడా ఉంటుంది.  రోడ్డు బాగుంది కదా అని రయ్ రయ్‍న  పోతే మిస్సు అవుతాం..కాస్త మెల్లగా వెళ్ళండి.


పులి బొమ్మ కనిపించిందా?...కనిపించింది కదా!..పక్కనే ఓ పెద్ద ద్వారం కూడా ఉంటుంది చూడండి.  .పులి బొమ్మ పక్కనే ఓ గది ఉంది కదా..అక్కడకి పదండి..అక్కడ వాళ్ళు మీకు అన్ని వివరాలు చెప్తారు. లేకపోతే కింద చదవండి!!

ఫరాహాబాద్...ఇది నల్లమల అడవుల్లో ఓ చూడ చక్కని ప్రదేశం.  ఫరహాబాద్ అంటే అందమైన ప్రదేశం అని అర్థం అట! నల్లమలలో దేశంలోనే అతి పెద్ద పులుల సంరక్షణా కేంద్రం ఉంది. ఈ ఫరహాబాద్ దగ్గర టైగర్ సఫారీ ఉంది.  దీని గురించి ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కాని నాకు ఈ మధ్యే తెలిసింది.

గేటు దగ్గరనుండి లోపలికి వెళ్లటానికి ఫారెస్టు డిపార్టుమెంటు వాళ్ల జీపులు ఉంటాయి..మన వెహికిల్సు లోపలికి వెళ్ళటానికి లేదు.  జీపుకి 500 రూపాయలు టిక్కెట్టు..ఇద్దరికయినా ఆరుగురికయినా అంతే. జీపు లెక్క అన్నమాట  జీపు డ్రైవరే గైడ్ కూడా.ఓ జీపు తీసుకుని బయలుదేరాం.  జీపు డైవరు చాలా జంతువులు కనిపిస్తాయి అని చెప్పాడు మరి చూద్దాం ఏమేమి కనిపిస్తాయో!. మేము జీపు ఎక్కి బయలుదేరుతుండగా ఇంకో కుటుంబం వచ్చింది..వాళ్లూ ముగ్గురే..మాతో కలిసి వస్తామంటే సరే అన్నాం.

 లోపలికి 11 కి.మి తీసుకెళ్ళి తీసుకొస్తారు.  రోడ్డు బాగానే ఉంది.  లోపల చెంచుల ఇళ్ళు ఉన్నాయి అందుకని  అక్కడక్కడా మనుషులు కనిపిస్తుంటారు.  ఇక మనుషులుండే దగ్గర జంతువులేం ఉంటాయి అనిపించింది..

కొంచం దూరం లోపలికి వెళ్ళగానే ఓ నాలుగు జింకలు రోడ్డుకి అడ్డంగా పరుగెడుతూ కనిపించాయి..పర్లేదు మన అదృష్టం బాగుంటే పులులు కూడా కనిపించవచ్చు అనుకున్నాం.మధ్య మధ్యలో జంతువులు నీళ్లు తాగటానికి సిమెంటు తొట్లలాంటివి ఉన్నాయి. ఎండాకాలం వాటిల్లో నీళ్లు పోస్తారట.ఇంకొంచం ముందుకి వెళ్ళాక పెద్ద చెరువు కనపడింది..చాలా పెద్దది.  వర్షపు నీళ్లన్ని ఆ చెరువులోకి వచ్చి కలుస్తాయి అట!  జీపు  చెరువు దాకా వెళ్లలేదు కాబట్టి దూరం నుండే చూసాం.

దార్లో ఎక్కువగా వెదురు చెట్లు,  అడ్డ తీగ (విస్తరాకులు) , టేకు చెట్లు కనిపించాయి.  ఆదీవాసీలు అడ్డాకులు ఏరుకెళ్ళి అమ్ముకుంటారట! ఓ చెట్టు కింద పెద్ద ఆకుల మూట కనపడింది.
 ఇంకేమైనా జంతువులు కనిపిస్తాయేమో అని ఉత్కంఠతతో చూస్తుంటే మరలా జింకలే కనిపించాయి. ఓ బుల్లి జింక పిల్ల చెంగు చెంగున గెంతుతూ పరుగులు తీస్తుంది. దాన్ని చూడగానే ....    ఫెలిక్సు జల్తేన్ రచనకి మహీధర నళినీ మోహన్ గారి అనువాదం "వనసీమలలో" పుస్తకంలోని బేంబీ గుర్తుకొచ్చింది.అలా కొంచం ముందుకు వెళ్ళగానే ఓ పాడుపడ్డ భవంతి కనపడింది..అది అప్పట్లో నిజాం ప్రభువు కట్టించిందట! ఆయన అక్కడికి విహారానికి..వేటకి వెళ్ళినప్పుడు ఉండేవారట! దాన్ని షికార్‍గర్ అనేవారట! దారి పొడుగునా జింకలే కనపడ్డాయి.  ఏంటి రాజూ నాయక్ (డ్రైవర్ పేరు) జింకలు తప్పితే ఇంకేమీ లేనట్టున్నాయే అంటే.. ఎందుకు లేవండి..ఎలుగులు..అడవి పిల్లులు, నెమళ్ళు , నక్కలు ఉన్నాయి కానీ అలికిడికి అవి బయటకు రావు అని ఓ నవ్వు నవ్వాడు. ఎప్పుడయినా పులిని చూసావా అంటే చాలాసార్లు చూసానండి..రాత్రిపూట పెట్రోలింగ్‍కి వెళ్ళినప్పుడు కనపడతాయి అని చెప్పాడు.  ఇప్పుడొకటి కనపడితే బాగుండు అనుకున్నాం.


అలా ముందుకు వెళుతుంటే మరి కొన్ని జింకలు..దుప్పులు కనపడ్డాయి.  వాటికీ మనుషుల..వాహనాల అలికిడి అలవాటైపోయినట్లుంది..బెదరకుండా అలానే చూస్తూ ఉన్నాయి.

చివరికి ఓ ప్రదేశానికి తీసుకెళ్ళి జీపు ఆపేసి ఇక ట్రిప్పు చివరికి వచ్చేసింది..ఇక ఇదే లాస్టు పాయింటండీ అన్నాడు రాజూ నాయక్.  పక్కన ఓ కూలిపోయిన కట్డడం కనిపించింది.  ఇదేంటి అంటే ఇక్కడ అంతకుముందు రెస్టారెంటు ఉండేది..నక్సల్సు పేల్చేసారు అని చెప్పాడు.  హాంగింగు రెస్టారెంటు కూడా ఉండేదట..మొత్తం 12 కాటేజెస్ ఉండేవి..2006-2007 లో అన్నీ పేల్చేసారు అని చెప్పాడు. అసలు అవి కట్టిందే 2004 నట..ప్చ్!!
దిగి చుట్టూ చూసా..కూర్చోవటానికి రెండు బెంచీలు కనిపించాయి..ఇక ఏమీ లేదు అక్కడ...ఇక ఇంతే కాబోలు ఇక సఫారీ అయిపోయింది  అని కాస్త నిరాశ చెందా.

ఇంతలో రాజూ నాయక్ ముందుకి వెళుతూ ఇటురండి మీకొక వ్యూ పాయింటు చూపిస్తా అని కాస్త ముందుకు కొండ అంచుకి వెళ్ళాడు..

కొండ  చివరికి వెళితే ఓ పెద్ద లోయ..కాస్త ముందుకి వెళ్ళి చూస్తే మహాద్భుతం..కింద దట్టమైన లోయ..చాలా లోతులో ఉంది..కాస్త దూరంలో  ఓ చెరువు...ఆ దృశ్యం మహాద్భుతంగా ఉంది..వర్ణించటానికి మాటలు రావంతే. ఫోటోలు చూడండి..అవే మాట్లాడతాయి.హోరు గాలి..నాలాంటి వాళ్లమయితే జాగ్రత్తగా ఉండకపోతే ఆ గాలికి పడిపోతాం కూడా.  అక్కడ ఎప్పుడూ గాలి అలానే ఉంటుందట. ఎంత బాగుందో!
అసలు ఈ వ్యూ పాయింటు చూడటానికి కొండ అంచున చెక్కతో చక్కగా ఓ ఫ్లాట్‍ఫారం లాంటిది కూడా ఉండేదట! నక్సలైట్లు అది కూడా పేల్చేసారట!
అడవిలో పెద్దగా జంతువులు కనిపించకపోయినా ఆ వ్యూ చూడటానికి అయినా వెళ్లొచ్చు అక్కడికి అనిపించింది నాకు. ఎంతసేపటికీ అక్కడినుండి రాబుద్ది కాలేదు.

మొత్తం ఈ ప్రయాణానికి గంటా పదిహేను నిమిషాలు పట్టింది.

ఆసక్తి ఉన్నవాళ్ళు హైదరాబాదు నుండి వచ్చేటప్పుడు ఫరాహాబాద్ గేటుకి ఓ ఐదారు  కి.మీ ల ముందే గుండం గేటు అని మరో గేటు వస్తుంది..అక్కడనుండి ట్రెక్కింగుకి వెళ్ళవచ్చట!  ఇంకా బాగా లోపలికి వెళితే సలేశ్వరం అనే వాటర్ ఫాల్సు ఉన్నాయట!

ఫరాహాబాద్ నుండి 11 గంటలకి బయలుదేరాం.  అక్కడి నుండి హైదరాబాదు వైపు మరో 40 కి.మీ వస్తే దిండి రిజర్వాయర్..దిండి నది మీద ఈ రిజర్వాయర్ కట్టారు. ఇది కూడా చూడటానికి బాగుంటుంది. రిజర్వాయర్ పైకి ఎక్కటానికి చక్కగా మెట్లు ఉన్నాయి..అలా సక్రమంగా ఎక్కితే ఎలా....ఇదుగో ఇలా అడ్డంగా పడి ఎక్కేసాం.అక్కడ కాసేపు గడిపి హైదరాబాదు బయలుదేరాం.  మధ్యలో కడ్తాల్ దగ్గర సీతాఫలాలు కొనుక్కున్నాం! నాకు దారిలో అక్కడ ఒక్కచోటే సీతాఫలాలు కనిపించాయి.  బాగున్నాయి కూడా!

Read more...

August 29, 2011

హైదరాబాదు నుండి శ్రీశైలం దారిలో..ఓ అద్భుతంఈ శని ఆదివారాలు శ్రీశైలం వెళ్ళి వచ్చాం. మామూలుగా ఎప్పుడూ ఉదయాన్నే బయలుదేరి వెళ్లి సాయంత్రానికి వచ్చేసేవాళ్లం. ఈ సారి శనివారం సాయంత్రం బయలుదేరి వెళ్ళి ఆ రాత్రికి అక్కడ ఉండి ఆదివారం తిరిగి వచ్చాం.
శనివారం బయలుదేరే ముందు జోరున వాన. ఓ నిమిషం మానేద్దామా అనుకున్నాం..బయలుదేరాక మానుకోవటం ఎందుకులే అని 3:30 కి బయలుదేరాం.  అప్పటికి వర్షం కొంచం తగ్గింది. హైదరాబాదు దాటాక పెద్దగా వర్షం లేదు.

 బాగా మబ్బులు పట్టి వాతావరణం చాలా బాగుంది. మధ్య మధ్య సన్నటి తుప్పర. ఘాట్ ఎక్కేటప్పటికి చీకటి పడింది. మన్ననూరు దాటాక చిమ్మ చీకటి..ముందు రోడ్డు ఏమీ కనపడటం లేదు.  అలానే  రేడియం ఇండికేటర్ల  వెలుతురులో ప్రయాణం సాగించాం.
ఆ చిమ్మ చీకటిలో రోడ్దు మీద అక్కడక్కడా వరసగా రేడియం ఇండికేటర్ల ఎర్రటి కాంతి చూడటానికి ఎంత బాగుందో!

మధ్యలో ఒకచోట అయితే మేఘాలు ఎంత కిందగా ఉన్నాయంటే..మన ముందే తేలిపోతున్నాయి. అప్పుడే సన్నటి జల్లు.. అ జల్లులో ఈ మేఘాలు..మంచు జల్లు పడుతున్నటే ఉంది చూడటానికి..కాసేపు కాశ్మీరులో ఉన్నామా అనిపించింది.ఎక్కడ మలుపు ఉందో..ఎక్కడ రోడ్డు వంపు ఉందో తెలియనంత దట్టమైన చీకటి..కారు చాలా జాగ్రత్తగా  నడపాల్సి వచ్చింది.
కొంచం రిస్కు ప్రయాణం అయినా బాగుంది. మధ్యలో్ జంతువులు ఏమైనా కనిపిస్తాయేమో అని చూసాం కాని ఏమీ కనపడలేదు.

రాత్రి పూట లైట్ల వెలుతురులో డామ్ వ్యూ కూడా బాగుంది.  బాగా వర్షాలు పడుతున్నాయి కదా గేట్లు ఎత్తుతారేమో అని ఆశపడ్డాం కానీ ఎత్తలేదు.
శ్రీశైలం చేరేటప్పటికి 8:30 అయింది.  బోలెడన్ని సత్రాలున్నాయి కదా రూము దొరుకుతుందిలే అని ముందుగా రూము బుక్కు చేసుకోకుండా ధీమాగా వెళ్లాం....సత్రంలో రూము దొరకలేదు. దేవస్థానం వాళ్ల రూము దొరికింది..ఛండీశ్వర సదనంలో.  A/C రూము కానీ A/C పనిచేయటం లేదు..(పని చేయటం లేదని చెప్పే ఇచ్చారు లేండి కానీ చార్జీలు మాత్రం  A/C  చార్జీలే:).  రూము బాగానే ఉంది. వేడి నీళ్లు కూడా ఉన్నాయి.

రూముకి వెళ్లేటప్పటికి 10 అయింది. ఉదయానికి అభిషేకం టిక్కేట్లు దొరుకుతాయేమో అని ప్రయత్నించాం..దొరకలేదు..కొంతమందేమో శ్రావణ మాసం సంధర్భంగా అభిషేకాల టిక్కెట్లు ఇవ్వటం లేదు....సామూహిక అభిషేకాలే జరుగుతున్నాయి అని చెప్పారు.

ఉదయం ఐదు గంటలకల్లా గుడికి వెళ్ళాం. వంద రూపాయల టిక్కెట్టు తో దర్శనం త్వరగానే అయిపోయింది. అమ్మవారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని అక్కడినుండి బయటపడ్డాం.

దర్శనం అవగానే రోప్ వే దగ్గరకి వెళ్ళాం. ఉదయాన్నే కావటాన ఎక్కువమంది జనం లేరు. టిక్కెట్టు 50 రూపాయలు. అక్క మాహాదేవి గుహలు చూడాలంటే రెంటికీ కలిపి ఒకే టిక్కెట్టు తీసుకోవచ్చు..రెండిటికి కలిపి అయితే టిక్కెట్టు 230 రూపాయలు.  ఆ అక్క మహాదేవి గుహలు చూద్దాం అనుకున్నాం కాని అక్కడికి  పదకొండు గంటలకి కానీ తీసుకు పోరంట (అక్కడికి బోటులో వెళ్ళాలి).  పాతాళగంగ నుండి పది కిలోమీటర్ల దూరం అట!  అందుకని ఒక్క రోప్ వే కే వెళ్ళాం.

రోప్ వే నుండి కృష్ణమ్మ అందాలు

కృష్ణమ్మ మిలమిలలు

కృష్ణమ్మ ఒంపుసొంపులురోప్ వే   మరీ ఎక్కువ లేదు...కొంచం దూరమే కాని వ్యూ బాగుంది.  రోప్ వే నుండి వచ్చాక  అక్కడే గంగా హోటల్ అని ఉంటే అందులో టిఫిన్లు చేసి 8:30 కల్లా శ్రీ శైలం నుండి బయలుదేరాం.

మధ్యలో డామ్ వ్యూ పాయింటు దగ్గర  కాసేపు ఆగాం. అక్కడ  శ్రీశైలం కట్టినప్పుడు తీసిన కొన్ని ఫోటోలతో  ఓ గదిలో ప్రదర్శనలా పెట్టారు..ఆ గది ఇప్పుడు తెరుస్తున్నట్టు లేరు..అంతా దుమ్ము కొట్టుకుని పోయి ఉంది.
డాం వ్యూ పాయింటు దగ్గర కొన్ని ఫోటోలు తీసుకుని 8:30 కల్లా హైదరాబాదు బయలుదేరాం.
మధ్యలో లింగాల గట్టు దగ్గర బోలెడన్ని నున్నటి రాళ్లు (లింగాలు) ..ఓ చోట గుట్టగా ఉంటే పడి ఉంటే ఓ ఐదు రాళ్ళు తెచ్చేసుకున్నా!

ఇక అసలు ప్రయాణం మొదలయింది.  అలా చూడకండి..శ్రీ శైలం ప్రయాణం అనుకున్న దగ్గరనుండి నేను చూడాలనుకుంటున్న ఓ ప్రదేశం హైదరాబాదు ..శ్రీశైలం మధ్యలో వస్తుంది. ఆ ప్రదేశం ఎక్కడ మిస్సు అవుతామో అని కళ్లు పత్తికాయల్లా చేసుకుని చూస్తున్నా....అదే ఫరాహాబాద్..

దాని గురించి తరువాతి టపాలో వివరంగా..

అలానే ట్యూన్ అయి ఉండండి....


.

Read more...

August 26, 2011

జీవితంలో మొదటి ఆనందాలు!


జీవితంలో మొదటిది ఏదయినా అత్యంత అద్భుతంగా ఉంటుంది...
చిన్నప్పుడు..
మొదటగా వెళ్ళిన స్కూలు...
మొదటగా కొనుక్కున్న కలం..
మొదటగా కొనుక్కున్న గడియారం...
మొదటగా వేసిన చిత్రం..
మొదటగా చదివిన కథ..
మొదటిసారి రైలు ఎక్కటం..
మొదటిసారి స్నేహితులతో కలిసి చూసిన సినిమా...
మొదటగా వెళ్ళిన కాలేజి..

కుర్రకారుకి అయితే మొదటి ప్రేమ..
మొదటి ప్రేమలేఖ..
ఆ ప్రేమ సఫలమైనా...విఫలమైనా
చచ్చేదాకా గుండెల్లో గుడికట్టుకుని దాచుకుంటారు..

ఏదయినా మొదటిది అపురూపమే!
ఈ మొదటికి ఉన్న విలువ ఎనలేనిది!!
వాటిని తలుచుకోగానే
ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతాం..
వాటితో అల్లుకుని వేవేల జ్ఞాపకాలు..

ఇక మొదటి ఇంటర్యూ...
మొదటి ఉద్యోగం..
మొదటి జీతం..
ఇవి ఎవరికయినా మరీ అపురూపం..

నా మొదటి ఉద్యోగం
ఓ కాలేజీలో
నా మొదటి జీతం అక్షరాలా 3500...
ఓ పది రోజులు పాఠాలు చెప్పినందుకు కాలేజీ వాళ్ళు ఇచ్చిన జీతం..
ఆ మొదటి జీతం తీసుకున్న రోజు ఎంత ఆనందం వేసిందో..
ఇప్పటి పిల్లలకి అది చిన్న మొత్తమేనేమో!
కానీ నాకు అది వెల కట్టలేని మొత్తం..

ఇక ఇప్పుడు మా అమ్మాయి వంతు...
సరిగ్గా తన పుట్టిన రోజు నాడే (ఇంగ్లీషు తేదీల ప్రకారం)
తనకి మొదటి ఉద్యోగం ఇంటర్యూ..
కాంపస్ ఇంటర్యూలో ఎంపికయ్యింది..
ఉద్యోగం చేసే ఉద్దేశ్యం లేకపోయినా
మొదటి ఉద్యోగం తన పుట్టినరోజు నాడే రావటం...
తనకి ఇంకా మహదానందం కదా!!

Read more...

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP