పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

July 26, 2011

గూడు చినబోయెరా!

Home is a place you grow up wanting to leave, and grow old wanting to get back to.

ఉదయం ఏడుగంటలకి కాళ్లు అప్రయత్నంగా మంచం దగ్గరికి లాక్కెళతాయి..పెదాలు..ఇక లే నాన్నా టైము ఏడవుతుంది..కాలేజికి టైమవుతుంది అనబోతాయి..ఎదురుగా ఖాళీ మంచం వెక్కిరిస్తూ కనపడుతుంది..కళ్లల్లో అప్రయత్నంగా నీళ్లు..చ.. ఇంత బేలనవుతన్నానేంటి అని నన్ను నేనే మందలించుకుని..నిగ్రహించుకుని....ఇంట్లో ఏ గదిలోకి వెళ్ళినా వాడిది ఏదో ఒక వస్తువు..అలమారలో బట్టలు...PS2, Ipod, హెడ్డుఫోన్సు,  అన్నీ వాడిని అనుక్షణం గుర్తు చేస్తూ ఉంటే  వాస్తవాన్ని మెల్లమెల్లగా జీర్ణించుకుంటున్నా! ఎక్కడో 2500 కి.మీ దూరాన ఉన్నాడనుకుంటే మరీ దిగులుగా ఉంటుంది.

మా అబ్బాయిని IIT గౌహతికి పంపించినప్పటినుండి నా పరిస్థితి ఇది.  వాడు వెళ్ళి వారం కూడా కాలేదు..ఏంటో కొన్ని యుగాలయినట్టుంది. 

నేనూ డిగ్రీనుండి హాస్టలులోనే ఉండి చదువుకున్నా.  అప్పట్లో మా అమ్మ ఇంత బెంగపడలేదే! నాకూ ఇంటి మీద అంత బెంగ ఉండేది కాదు.  మా ఊరినుండి పట్టుమని అరగంట ప్రయాణం కూడా ఉండదు మా కాలేజికి..వారం వారం వచ్చేసేదాన్ని ఇంటికి.  అయినా ఆ రోజుల్లో మా అమ్మకి అంత బెంగపడే సమయం కూడా ఉండేది కాదేమో! ఇంటినిండా మనుషులు..పనివాళ్ళు..పొలం పనులు..ఊర్లోనే అమ్మా. నాన్నా. అక్కాచెల్లెళ్లు. తమ్ముళ్లు ఇంక బెంగెందుకుంటుంది!

ఇప్పుడేమో ఇంట్లో ఉండేదే ముగ్గురమో..నలుగురమో..అందులో ఒకళ్లు దూరంగా వెళితే..ఇల్లంతా ఖాళీ..ఖాళీగా కనపడుతుంది. సెలవల్లో మా పిల్లల్ని ఇంటికి పంపించి రెండో రోజునుండి వాళ్ళ మీద బెంగపెట్టేసుకుని  ఎప్పుడొస్తారా అని ఎదురుచూసేదాన్ని.  ఇప్పుడు నాలుగు సంవత్సరాలంటే..తలుచుకుంటే దిగులు ఇంకా ఎక్కువవుతుంది.

ఈ నాలుగు సంవత్సరాలనేముందిలే పిల్లలు ఎదుగుతున్న కొద్దీ పిల్లలకి మనకీ ఒక్కో అడుగు దూరం పెరిగిపోతూ ఉంటుంది అనిపిస్తుంది నాకు..మగపిల్లలయితే మరీనూ!


మరీ ఒకటో తరగతి నుండో... ఆరో తరగతినుండో పిల్లలని హాస్టలులో ఉంచేవాళ్ళు ఎలా ఉంచుతారా అనిపిస్తుంది!  పెద్ద చదువులకి వచ్చాక ఎటూ తప్పదు కదా!

Read more...

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP