పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

March 8, 2012

వెలలేని మా ఖజానా...

హైదరాబాదులోని నౌబత్ పహాడ్ కింద ఖజానా ఉందో లేదో కానీ అంతకన్నా విలువైన ఖజానా మా  ఇనప్పెట్టెలో ఉండిపోయింది ఇన్నాళ్లు. ఈ ఖజానాని వెలికితీయటానికి స్పూర్తినిచ్చిన వంశీ గారికి ధన్యవాదాలు. ఇనప్పెట్టెలో భద్రంగా ఉన్న వీటిని అప్పుడప్పుడు తీసి చూసుకుంటూ ఉంటాం కానీ ఇలా వెలికితీయాలన్న ఆలోచన వంశీ గారి టపా చూసాకే కలిగింది.

చిన్ననాటి వస్తువులు, ఉత్తరాలు, స్నేహితులు, పరిసరాలు, జ్ఞాపకాలు...ఏవైనా మనకి అపురూపమే. కొన్నిటిని తలుచుకుంటూ...కొన్నిటిని చూసుకుంటూ...."గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్" అనుకుంటూ ..

ఎప్పుడో క్లాసులో టీచరు "congratulations" అంటూ చక్కగా అక్షరాలు చెక్కి ఇచ్చిన చాక్ పీసుని ఇప్పటికీ భద్రంగా దాచుకున్న నేను...

ఏంటో నా ఈ పిచ్చి..నాలాంటి పిచ్చోళ్ళు అసలుంటారా అనుకుంటుండే దాన్ని... కానీ బ్లాగుల్లోకి వచ్చాక తెలిసింది నాలాంటోళ్లు చాలామందే ఉన్నారని. ముఖ్యంగా వంశీ గారి ఖజానాలు చూస్తుంటే నాకు నన్ను నేను చూసుకుంటున్నట్టే ఉంటుంది.  ఆయనవి తరగని ఖజానాలనుకోండి!

చిన్నప్పుడు మా నాయనమ్మకి రాత్రి పూట కాళ్ళు వత్తితే నాకూ ..మా అన్నయ్యకి రోజూ చెరొక ఐదు పైసలు ఇచ్చేది..తర్వాత పది పైసలు..పదిహేను పైసలు..మా వయస్సుతో పాటు అలా అలా పెరిగి ఇరవైతో ఆగిపోయింది.  అవన్నీ భధ్రంగా కిడ్డి బ్యాంకుల్లో దాచుకునేవాళ్లం. తిరునాళ్లలో మామిడికాయ ముంతలు..యాపిల్ కాయ ముంతలు అమ్మేవాళ్ళు..మొదట్లో వాటిల్లో దాచుకునే వాళ్ళం..తర్వాత ఈ బొమ్మలు.  
ఇదిగో ఈ అమ్మాయి బొమ్మ నాది..ఇందులో  బయటపడ్డ సంపద..అక్షరాలా అరవై తొమ్మిది రూపాయలు..ఈ ఆంధ్రా బాంకు బుడ్డాడు మా అన్నయ్యది..ఇందులో బయటపడ్డ సంపద అక్షరాలా యాబది రూపాయల పన్నెండు పైసలు!


 ఈ నిధుల వెలికితీతలో  బయటపడ్డ  అపురూపమైన నాణాలు కొన్ని చూడండి..

                 1977 నాటి క్వార్టరు డాలరు..


                   1947 బ్రిటిష్ పాలన నాటి రూపాయి నాణెం..


 
                   1946 బ్రిటిష్ కాలం నాటి అర్థరూపాయి నాణెం....


                గాంధీ స్మారక 20 పైసల నాణెం..


ఇన్నాళ్లు మా ఇనప్పెట్టెలో ఉన్న ఈ సంపదని మొన్న ఇంటికెళ్ళినప్పుడు భధ్రంగా తెచ్చుకున్నా. మా అన్నయ్యది కూడా నేనే తెచ్చేసుకున్నా:)

Read more...

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP