పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

March 11, 2008

స్కూటీ నేర్పగలవా!!!!

హైదరాబాద్ వచ్చిన ఓ రెండు సంవత్సరాలకి ఇంట్లో పొద్దు పోక నేనూ ఉద్యోగం చేస్తానని బయలుదేరాను, మెడికల్ ట్రాన్స్క్రిప్షినిస్టుగా చేరాను. ఆఫీసు ఇంటికి బాగా దగ్గరే, బండి మీద వెళితే 5 నిమిషాలు, నడిచి వెళితే 15 నిమిషాలు. నడిచి వెళ్ళొచ్చులే అనుకున్నా కానీ ఉదయం ఆఫీసుకి లేటు అవుతుందని, సాయంత్రం అయ్యో పిల్లలు స్కూలు నుండి వచ్చే టైము అవుతుందని ఆటోలనే ఆశ్రయించేదాన్ని. ఆ కాస్త దూరానికి ఆటో వాళ్ళు 20 రూపాయలు తీసుకునేవాళ్ళు, అంటే రోజుకి 40 విచ్చు రూపాయలు. సాయిబు సంపాదన బూబు కుట్టుపోగులకి సరిపోదు లాగా అయిపోయింది నా పని. అసలు మనమే స్కూటీ ఒకటి కొనుక్కుంటే పోలా అనిపించి మా వారిని స్కూటీ నేర్పమని పోరటం మొదలెట్టాను. నిజానికి తనకి నేను స్కూటీ నేర్చుకోవటం కానీ, నడపటం కానీ అస్సలు ఇష్టం లేదు, కాకపోతే నా పోరు పడలేక ఆదివారం నేర్పుతాలే అంటూ ఓ రెండు నెలలు కాలహరణం చేసారు. ఇక ఇలా లాభం లేదని ఒక రోజు సత్యాగ్రహం చేస్తే ఓ ఆదివారం సాయంత్రం సరే పద నేర్పుతాను అని బయలుదేరారు.

అవి స్కూటీ పెప్ కొత్తగా మార్కెట్టులోకి వచ్చిన రోజులు. మా కజిను వాళ్ళ అమ్మాయి అప్పటికి ఓ నెల క్రితమే పెప్ కొనుక్కుంది. ఆ బండి తీసుకుని బయలుదేరాం. మా కాలనీకి కాస్త దగ్గర్లో మనుష్య సంచారం ఎక్కువగా లేని రోడ్ల మీదకి వెళ్ళాం సవారికి. అక్కడికి వెళ్ళాక బండి నడపటానికి ఆచరించవలిసిన ప్రాథమిక సూత్రాలు ఏమీ చెప్పకుండానే నన్ను ముందు కూర్చోమని తను వెనక కూర్చుని నీవేమి చేయక్కర్లేదు, ఊరికే హ్యాండిలు పట్టుకో, నేను వెనకనుండి బాలెన్సు చేస్తూ నడుపుతాను అన్నారు. సరే హ్యాండిలు పట్టుకోవటమే కదా మనం చేయవలసింది అని దర్జాగా హ్యాండిలు పట్టుకుని కూర్చున్నాను, నేనే స్కూటీ నడిపేస్తున్నాను అనే ఫీలింగుతో!!!. అలా ఓ ఐదు నిమిషాలు పోయాక తను వెనకనుండి బ్రేక్ వెయ్యి బ్రేక్ వెయ్యి అని అరుస్తున్నారు (నాకసలు అప్పటికి బండికి బ్రేకు ఎక్కడుంటుందో ఏమైనా తెలిస్తే గదా!!!). తను ఏమంటుంది నాకు అర్థం అయ్యేలోపే బండి పక్కకి ఒరగటం, మేమిద్దరం పక్కన మురుగు గుంట ఉంటే దానిలోకి పడిపోవటం జరిగిపోయాయి. (నేనెట్లా బండిని బాలెన్సు చేస్తానో చూద్దామని ఈయన 5 నిమిషాలకే చేతులు వదిలేసారంట , అది కూడా నేను గమనించలేదు) అసలే కొత్త బండి, దానికెక్కడ దెబ్బ తగులుతుందో అని ఈయన తన చేతిని బండికి అడ్డం పెట్టేటప్పటికి బండికేమి దెబ్బలు తగల్లేదు కాని, బండి బరువుకి తన చేయి మణికట్టు దగ్గర కొద్దిగా విరిగింది. అది తగ్గటానికి ఓ రెండు నెలలు పట్టింది.

రెండు నెలల తరువాత మరలా నేర్చుకునే ప్రహసనం మొదలుపెట్టాను, కాకపోతే ఈ సారి కాస్త దారి మార్చాను. ముందు సైకిలు నేర్చుకుంటే స్కూటీ నేర్చుకోవటం తేలికగా ఉంటుందని మా వారు మరియు మా పిల్లలిద్దరి సాయంతో సైకిలు నేర్చుకున్నాను. చిన్నప్పుడెప్పుడో సైకిలు నేర్చుకుందామని రెండు మూడుసార్లు ప్రయత్నించి, కిందపడి, భంగపడి, ఇక ఈ విద్య మనవల్ల కాదని చేతులెత్తేసాను. ఇప్పుడు మాత్రం పట్టు పట్టి బాగానే నేర్చుకున్నాను. సైకిలు తొక్కటం వచ్చింది కాని సైకిలు పైకి ఎక్కటం మాత్రం రాలేదు. అయినా మనం నడపబోయేది స్కూటీ కాని సైకిలు కాదు కదా అని స్కూటీ కొనుక్కుని నేర్చేసుకున్నాను. (మళ్ళీ మా కజిను వాళ్ళ అమ్మాయిని స్కూటీ అప్పు అడిగే ధైర్యం చేయలేదు)

ఈ సారి మా వారిని వెనుక కూర్చోనీయలేదు. నేనే బండిని మెల్లగా బాలెన్సు చేసుకుంటూ పడతాననుకున్నప్పుడు కాలితో ఆపుకుంటూ నేర్చేసుకున్నాను. ఆ ప్రక్రియలో ఒకసారి కాలి బొటనవేలు విరగ్గొట్టుకున్నాను కూడా. మొత్తానికి ఓ నాలుగు రోజులు కష్టపడి ఎలాగైతేనేం స్కూటీ నడపటం నేర్చేసుకున్నాను. అక్కడనుండి ఎప్పుడెప్పుడు ఆఫీసుకి స్కూటీ మీద వెళదామా అని నాకు ఒకటే ఆతృత, తనేమో ఇంకొంచం బాగా వచ్చాక వేసుకెళుదెవులే అని ఒక రోజు, ఇంకొక రోజేమో నన్ను వెనక కూర్చోబెట్టుకుని నడుపు ముందు తరువాత వేసుకెళుదువు అని ఇలా ఏవేవో సాకులతో చాలా రోజులు వేసుకెళ్ళనివ్వలేదు. మొత్తానికి ఒక శుభముహూర్తాన ఆఫీసుకి వేసుకెళ్ళా, వెనుక బాడీగార్డులా తను కారులో వెంబడిస్తుంటే. ఇక అక్కడనుండి ఆంక్షలు మొదలు. నువ్వు 10 కి.మీ కంటే ఎక్కువ వేగంతో వెళ్ళవద్దు, కాలనీ లోపలే వెళ్ళు, మెయిను రోడ్డు మీదకి వెళ్ళవద్దు, రాత్రి పూట బండి నడపవద్దు, వెనక ఎవరిని ఎక్కించుకోవద్దు (ముఖ్యంగా మా పిల్లలిని), ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి, అబ్బో తల బొప్పి గట్టేది. దీనికన్నా ఆటోలోనో నడిచో వెళ్ళటమే సుఖం అనిపించేది. ఎప్పుడైనా ఆఫీసులో బాగా ఆలస్యం అయి చీకటి పడితే తను నడుచుకుంటూ ఆఫీసుకు వచ్చేసేవాళ్ళు నన్ను తీసుకురావటానికి. ఇక ఇప్పుడయితే నా ఆరోగ్యం బాగాలేదు అన్న వంకతో అసలు స్కూటీనే తీయనివ్వటంలేదు :(

Read more...

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP