పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ
Showing posts with label ఆలోచనలు. Show all posts
Showing posts with label ఆలోచనలు. Show all posts

December 30, 2011

మేమిందుకిలా???



 పెళ్ళి ఆడపిల్ల జీవితంలో ఎన్ని మార్పులు తీసుకొస్తుందో!

 నేను చెప్పేది ఇప్పటి ఆడపిల్లల గురించి కాదు! మా తరం గురించి!

అప్పటి వరకు హాయిగా స్వేచ్చగా సీతాకోక చిలుకల్లా ఎగిరిన మేము ఒక్కసారిగా ప్యూపా దశలోకి వెళ్ళిపోతాం.

ఇల్లు..భర్త..పిల్లలు..ఇదే లోకం...అదే సర్వస్వం...

ఇల్లే కదా స్వర్గ సీమ అని పాడేసుకుంటూ  ఆ ప్యూపా దశలోనే ఉండిపోతాం.

అందులోనుండి బయట పడాలని కూడా అనుకోము!

ఇల్లు విడిచి ఒక్క రోజు ..ఒక్క గంట బయటకి వెళ్ళాలన్నా ఎన్ని ప్రతిబంధకాలో!

అమ్మాయి కాలేజీ నుండి వచ్చే టైము..అబ్బాయి ఆటలకి వెళ్లే టైము..అయ్య గారు ఆఫీసు నుండి వచ్చే టైము..మామ గారికి ఒంట్లో బాగోకపోవటమో..చుట్టాలు రావటమో..ఇలా ఏదో ఒకటి అడ్డం పడుతూనే ఉంటుంది.

ఇలా అడ్డాలు లేకుండా తిరిగే వాళ్ళు ఉన్నారనుకోండి..కానీ తక్కువ.

ఓ రెండు రోజులు ఊరెళ్ళాలంటే ఎన్ని ముందస్తు ఏర్పాట్లు చేసి వెళ్లాలో..

ఓ వారం ముందు నుండే ఏర్పాట్లు మొదలుపెట్టాలి..

మంచినీళ్ల దగ్గరనుండి. పెరుగు దాకా.అన్నీ రెడీగా పెట్టి వెళ్లాలి.

వెళ్ళాక అయ్యో ఏం ఇబ్బంది పడుతున్నారో అని మనసులో పీకులాటే...

పాలబ్బాయి వచ్చే టైం కి లేచారో లేదో...పనమ్మాయి టైం కి వచ్చిందో లేదో..

టిఫిన్ తిన్నారో ..తినకుండా పరిగెత్తారో..తలుపులు సరిగ్గా వేసారో లేదో...

పనమ్మాయిని బతిమాలుకోవాలి..నేను లేని రెండు రోజులు మానకుండా రా తల్లీ అని..

అదేంటో ఇంత చెప్పినా మనం ఊరెళ్ళిన టైం లోనే ఆ పనిపిల్లకీ ఏవో అర్జంటు పనులో.. జలుబో..జ్వరమో వచ్చేడుస్తాయి!

మనుషులం అక్కడే కాని మనస్సంతా ఇక్కడే ఉంటుంది..

ఇప్పుడంటే ఫోన్లు వచ్చాక అడుగడుక్కి మానిటరింగ్ చేస్తున్నాం కానీ మా పెళ్లయిన కొత్తలో ఫోన్లు అంతగా లేని రోజుల్లో ఉత్తరాలే ఆధారం..

ఇక ఆ ఉత్తరాల నిండా జాగ్రత్తలు..హెచ్చరికలు..ఉపదేశాలు..మాత్రమే ఉండేవి:)

ఇంతా చేసి వెళ్ళిన దగ్గరన్నా ప్రశాంతంగా ఉంటామా అంటే అదీ లేదు!

మంచాల మీద విడిచిన బట్టల కుప్పలు..సింకులో కడగని గిన్నెలు....పొయ్యి మీద మాడిన దోసెలు కళ్ల ముందు నాట్యం చేస్తుంటే ఇంకెక్కడి ప్రశాంతత!

అదే మగాళ్లకి చూడండి ఈ జంజాటాలు ఏమీ ఉండవు..ఎక్కడికంటే అక్కడికి ఝామ్మంటూ వెళ్ళిపోతారు.

ఎవరి అనుమతులూ అక్కర్లేదు..ఏ ముందస్తు ఏర్పాట్లూ చెయ్యక్కర్లేదు!

ఇంటి గురించి ఏ బెంగా..ఆలోచనలూ..ఆందోళనలూ..ఉండవు!

ఇప్పటి వాళ్లయితే మరీనూ..ఆఫీసు నుండి అటు నుండి అటే ఫ్లైట్ ఎక్కేస్తారు!

మరి నిజంగానే మేము లేకపోతే ఇళ్లల్లో జరగదా అంటే శుభ్రంగా జరిగిపోతుంది, మాకే లేనిపోని ఆరాటం.

అందరూ నా మీదే అధారపడ్డారు..నేను లేకపోతే వీళ్లకిక జీవితమే లేదు అన్న ఓ అందమైన భ్రమలో బ్రతుకుతున్నాం!

ఇప్పుడీ సోదంతా ఎందుకంటే....

మా డిగ్రీ. మరియు.పి.జి కాలేజీల వాళ్లం జనవరి ఒకటిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేసుకుందామనుకుని మొదలెట్టాం(ను).

ఆలోచన ఇంకో ఫ్రెండుది..నాది..కానీ తను ఉండేది అమెరికాలో కాబట్టి ఆ బాధ్యతంతా నేనే తలకెత్తుకున్నాను..

అందరి అడ్రస్సులు సంపాదించటం ఓ ఎత్తయితే మా జనాల్ని ఒప్పించటం ఇంకో ఎత్తయింది..

దాదాపు పాతిక సంవత్సరాల తర్వాత కలుస్తున్నాం కదా అని అందరూ ఉత్సాహంగా ఎగురుకుంటూ వస్తారనుకుని మొదలెట్టా!

మొదలెట్టాక కాని తెలియలేదు మా వాళ్ల కుటుంబ భక్తి..పతి భక్తి..పిల్లల భక్తి..

జనవరి ఒకటినా అంటూ సాగదీసిన వాళ్లే ఎక్కువ..

జనవరి ఒకటిన నేను మా ఆయనతోనే ఉండాలమ్మా అని ఒయ్యారాలొలకపోసిన వాళ్లూ...

జనవరి ఒకటిన మా అమ్మాయి దగ్గరికి వెళ్ళకపోతే ఇంకేం లేదే బాబూ..నన్ను చంపి పాతరేస్తుంది అని భయపడి పోయిన వాళ్లూ....

జనవరి ఒకటికి మా ఫామిలీస్ అన్నీ కలిసి రిసార్ట్సు కి వెళతాం..కుదరదబ్బా అన్న వాళ్లూ..(వీళ్లు కలుసుకునేది సంవత్సరానికి ఒక్కసారి జనవరి ఒకటిన మాత్రమే అట..అందరూ మళ్ళీ ఉండేది హైదరాబాదులోనే)!

హైదరాబాదులోనా..మాకు దూరం కదా.వచ్చి వెళ్ళాటానికి కనీసం మూడు రోజులన్నా కావాలి..నేను లేకపోతే మా ఇంట్లో మూడు నిమిషాలు కూడా జరగదమ్మా అని దీర్ఘాలు తీసిన వాళ్లూ..

జనవరి ఒకటి... ప్రోటోకోల్ ప్రకారం మంత్రుల్ని..కలక్టర్లని..ఎమ్మేలేలని కలవాలి కుదరదు అని ఖరాఖండిగా చెప్పిన ప్రభుత్వంలోని పెద్ద ఉద్యోగులు..

మా ఆయన జనవరి ఒకటికి ఎక్కడికన్నా వెళదామంటున్నారు... ఇప్పుడు నేను రానంటే ఆయన చిన్నబుచ్చుకుంటారు ..రానులే అన్నవాళ్ళూ..

మా అత్త గారికి ఆరోగ్యం అంత బాగుండటం లేదు..నీకు తెలుసుగా ఆవిడ్ని మేమే చూసుకోవాలి---ఈ సారికి కుదరుదులే ఏమీ అనుకోకు (ఇదేదో మా ఇంట్లో ఫంక్షన్ అయినట్టు) అని దీర్ఘాలు తీసిన వాళ్లూ..

మా ఆడపడుచు గారమ్మాయి పెళ్ళి కుదిరిందిరా..ఆ షాపింగు పనులతో బిజీగా ఉన్నా..ఇంకో సారి పెట్టినప్పుడు వస్తాలే అన్నవాళ్లూ..

అయ్యో అదే సమయానికి మా ఆయన వాళ్ల స్కూలు వంద సంవత్సరాల వేడుక..తను ఇండియా వస్తున్నారు కాబట్టి నేను రాలేను అన్నవాళ్లు..

చచ్చీ చెడీ..దేశాలన్నీ గాలించి..నెట్టులో జల్లెడ పట్టి...వాళ్లనీ వీళ్లనీ అడుక్కుని...ఓ అరవై మందివి అడ్రస్సులు  ఫోను నంబర్లు సంపాదించి అందరిని కాంటాక్టు చేసి ఎంతో ఉత్సాహంగా మొదలుపెడితే ...

ఈ కారణాలు విని  దిమ్మ తిరిగి...నా ఉత్సాహమంతా చప్పగా నీరు కారిపోయింది..

ఈ కారణాలన్నీ చూడండి..అన్నీ కుటుంబం చుట్టూ తిరిగేవే!

ఎందుకు ఇంతలా మమ్ముల్ని మేము ఈ కుటుంబ బంధాల్లో కట్టి పడేసుకుంటున్నాం?

నచ్చిన సినిమాకి తీసుకెళ్లలేదనో..తను కోరుకున్నంత మోడ్రన్ గా భర్త లేడనో..

అత్త గారితో ఓ రెండు నిమిషాలు ఎక్కువ మాట్లాడరనో..అమెరికా వెళ్ళొద్దంటున్నారనో..

ఎడాపెడా విడాకులిచ్చేస్తున్న ఈ రోజుల్లో మేమిందుకిలా ఉన్నాం?

మాకంటూ కాస్త సమయాన్ని ఎందుకు కల్పించుకోలేక పోతున్నాం?

నిజంగా పైన చెప్పినవన్నీ రాలేనంత కారణాలా?

నిజానికి కుటుంబంలో ఇలాంటి వాటికి వెళ్తామంటే వద్దనే వాళ్లు కూడా ఎవరూ ఉండరు..

మేమే అలా అలవాటు పడిపోయాం...మా చుట్టూ మేమే ఓ గిరి గీసుకున్నాం..

అది దాటి బయటకు రావటానికి ఇష్టపడం..రావటానికి ప్రయత్నమూ చెయ్యం..

ఈ ప్యూపా బతుకులే మాకిష్టం!

***********************************************************************************

సరే జనవరి ఒకటని అభ్యంతరాలు చెప్తున్నారు కదా అని కార్యక్రమం జనవరి రెండుకి మార్చినా మరలా ఏవో కారణాలు రాలేకపోతున్నందుకు..

చివరికి ఓ పాతిక మంది తేలారు వచ్చేవాళ్లు..

మేమెందుకిలా???

ఈ ప్యూపా దశ నుండి బయటపడి మళ్లీ సీతాకోక చిలుకల్లా హాయిగా ..స్వేచ్చగా ఎప్పుడు ఎగురుతామో!

Read more...

December 6, 2010

ఇంటినుండి పని-ఎంత సౌఖ్యం

ఇంటినుండి పని (work from home)...ఈ మధ్య బాగా ప్రాచుర్యం పొందిన ఓ ఉద్యోగ అమరిక.  ఓ పదేళ్లముందు ఇలా ఇంటినుండి పని గురించి మనం కనీసం కల కూడా కని ఉండం. ఇంటి దగ్గర చెప్పుకునే ట్యూషన్సు, డాటా ఎంట్రీ వర్కులు..ఇలాంటి వాటి గురించి వదిలెయ్యండి.  ఖచ్చితంగా ఆఫీసుకే వెళ్ళి చెయ్యాల్సిన ఉద్యోగాన్ని మనం ఇప్పుడు ఇంటినుండే చెయ్యగలుగుతున్నాం.  సాంకేతిక అభివృద్ధి అనండి..మరోటి అనండి అసలు కనని కల ఇలా సాకారమై చాలామందికి ఎంతో సౌలభ్యంగా ఉంది.  ఎప్పుడో ఒక రోజు కాదు అస్సలు ఆఫీసు ముఖం చూడకుండా పని చేసెయ్యటం..నెల తిరిగేటప్పటికి మన డబ్బులు మన అకౌంటులో పడిపోవటం...ఎంత సౌలభ్యం!!

కానీ ఈ మధ్య కొంతమంది, ముఖ్యంగా ఆడవారు, ఈ ఇంటినుండి పని పట్ల విముఖత చూపిస్తున్నారని ఓ స్టడీలో వెల్లడయింది.  దానికి వారు చెప్పిన ప్రధాన కారణాలు
1. మేము సోషలు లైఫు మిస్సు అవుతున్నాం. ఇంట్లో నుండి పని చెయ్యటం వల్ల వ్యక్తిగతంగా మాకంటూ ఓ జీవితం లేకుండా అంతా మెకానికల్ అయిపోయింది అనిపిస్తుంది. ఇంట్లో కుటుంబసభ్యులతో చెప్పుకోలేని కొన్ని సమస్యలను ఆఫీసులో స్నేహితులతో చెప్పి ఊరట చెందేవాళ్లం.  ఇప్పుడు ఆ అవకాశం లేదు.  ఆఫీసులో జరిగే బాతాఖానీలు ...పార్టీలు..మనస్సుకి కాస్త రిలాక్సేషను ఇచ్చేవి.  ఇప్పుడు అవేవి లేవు.  ఇలాంటి వాటిని బాగా మిస్సు అవుతున్నాం.

2. పిల్లలతో మిగతా కుటుంబసభ్యులతో సమయం గడపగలుగుతున్నాం కానీ...దాని మూలాన మా మీద మామూలు కన్నా వత్తిడి ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇంట్లోనే ఉంటున్నాం కదా అని అందరూ మా మీద మరీ ఎక్కువగా ఆధారపడుతున్నారేమో అనిపిస్తుంది.  ఇంతకుముందు ఆఫీసుకి వెళ్లేటప్పుడు నాకు పనిలో సహాయం చేసినా చెయ్యకపోయినా ఎవరి పనులు వాళ్లు చేసుకునే వాళ్లు.  కానీ ఇప్పుడు అన్నిటికి నా మీదే ఆధారపడుతున్నారు.  అన్నీ ఎదురెదురు అందివ్వాల్సి వస్తుంది .  ఈ వత్తిడి నా ఉద్యోగ విధుల మీద కూడా ప్రభావం చూపిస్తుంది.

3. ఇక అనుకోకుండా వచ్చే అతిధులతో వచ్చే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.
వీటన్నిటితో  మా పని మేము ఇదివరకటి అంత శ్రద్దగా...అంకితభవంతో చెయ్యలేకపోతున్నాం.  వృత్తి జీవితంలో అనుకున్నంత ముందుకు కూడా వెళ్లలేకపోతున్నాం..కొన్నిటిని వదులుకోవాల్సి వస్తుంది.

ఈ ఇంటినుండి పని తప్పక చెయ్యటమే కానీ మాకు నచ్చి చెయ్యటం కాదు.  కొన్ని సౌలభ్యాలు కూడా ఉన్నాయి కానీ మాకు కలిగే అసంతృప్తితో పోల్చుకుంటే ఆఫీసుకెళ్లి పనిచేసుకోవటమే ఉత్తమం అనిపిస్తుంది.  పిల్లలు పెద్దవ్వగానే మరలా ఆఫీసునుండే పని చేస్తాం.......ఇవీ స్థూలంగా వాళ్లు చెప్పిన కారణాలు.

నేనూ గత ఐదు సంవత్సరాలుగా ఇంటినుండే పని చేస్తున్నా కానీ నాకు ఇలా అనిపించలేదు..కొన్ని అనిపించినా అవి మనం ప్లాన్ చేసుకోవటంలో మిగతా కుటుంబసభ్యులకి అర్థం అయ్యేటట్లు చెప్పుకోవటంలో ఉంటుంది .  కొన్ని అసౌకర్యాలు ఉన్నా నాకు ఇంటినుండి పనే సౌఖ్యంగా ఉంది. దేంట్లో అయినా కొంత మంచి..కొంత చెడూ ఉంటాయి.

ఆఫీసు టైముకి ఓ రెండు మూడు గంటలు ముందు బయలుదేరి మన నగర ట్రాఫిక్కులో ఈదుకుంటూ  ఆఫీసు చేరి..సాయంత్రం ఆఫీసు అయ్యాక ఓ రెండు మూడు గంటలకి ఉసూరుమంటూ ఇల్లు చేరటం..మళ్లీ ఇంట్లో పనులు..బాధ్యతలు.... దీనికన్నా హాయిగా ఇంట్లో ఉండి పనిచేసుకోవటంలో ఎంత ఆనందం ఉందో కదా! ఈ ఆనందం ముందు ఆఫీసుకి వెళ్తే వచ్చే ఎన్ని ఆనందాలయినా దిగదుడుపే!!

మనం పని చేసేది అమెరికా కంపెనీలకి..మరి వాటిల్లో మన పండగలకి పబ్బాలకి సెలవులుండవు...ఆ రోజుల్లో హడావుడిగా ఎనిమిదింటికల్లా అన్ని పనులు (ఆ రోజు పనమ్మాయి రాకపోతే అ పని కూడా) చేసుకుని ఆఫీసుకి
పరిగెత్తిన రోజులు ఎన్నో!! అదీ ఆఫీసు ఇంటికి దగ్గర కాబట్టి ఆఫీసు టైముకి ఇంటి దగ్గర బయలుదేరితే సరిపోయేది..అదే దూరం అయితే..అవన్నీ తలుచుకుంటే నాకయితే బాబోయ్ మళ్లీ ఆఫీసు గడపా తొక్కటమా అనిపిస్తుంది.

పిల్లలకి ఆరోగ్యం బాగోని రోజుల్లో అయితే ఇంకా నరకం.  సెలవు పెట్టినా..ఆఫీసునుండి ఫోన్లు..మేడం ఒక్క గంట వచ్చి వెళ్లండి..మీరు చేసే డాక్టరు ఒకరి డిక్టేషను బాగా ఎక్కువ వచ్చింది మీరు కొన్ని ఫైల్సు అయినా చేసి వెళ్లండి..ఒక్క గంట వచ్చివెళ్లండి ప్లీజ్ అంటూ అభ్యర్థనలు.......కాదనలేం.. వెళ్లాలేం.  ఇప్పుడయితే వాళ్ల పక్కన కూర్చుని వాళ్లని చూసుకుంటూ నా పని నేను చేసుకోవచ్చు.

ఒక్కోరోజు మన పని మనం పూర్తిచేసుకుని ఇక బయలుదేరదామనుకుంటుండగా..మేడం....ఈ ఫైలు ఇప్పుడే లేటుగా  వచ్చింది..TAT ఫైలు.  MT లందరూ వెళ్ళిపోయారు.మీరే ట్రాన్స్క్రిప్షనూ..ప్రూఫింగ్ చేసి అప్లోడ్ చెయ్యండి..ప్లీజ్ 2 నిమిషాల ఫైలే..అంటూ అభ్యర్థనలు..కాదనలేం కదా! ఆ రెండు నిమిషాల ఫైలు ట్రాన్స్క్రైబ్ చేసి.... ప్రూఫింగ్ చేసి అప్లోడ్ చెయ్యాలంటే కనీసం అరగంట పడుతుంది.  అదే ఇంట్లోనుండి అయితే మన పని అవ్వగానే టప్పున లాగ్ అవుట్ అయిపోతే ఇక మనకి వాళ్లకి సంబంధం ఉండదు :)

ఎప్పుడయినా అవసరానికి అర రోజు సెలవు పెడతామా..పేరుకే అర రోజు..పావు రోజు అవ్వగానే ఫోన్లు మొదలవుతాయి..మేడం ఎన్నింటికి వస్తారు..వస్తున్నారు కదా అంటూ..అనవసరంగా అర రోజు సెలవు పెట్టామే అనిపిస్తుంది.  పాపం వాళ్ల తప్పు కూడా ఏమీ లేదులేండి.  మా పనే అలాంటిది.  ఏ రోజు వర్కు ఆ రోజు అయిపోవాలి.  పెండింగు పెట్టటానికి ఉండదు.

ఓ రోజు ఊరెళ్లి వస్తున్నాను.  ట్రెయిను లేటు..ట్రెయిను దిగి ఆటొలో ఇంటికి వస్తుండగా ఆఫీసు నుండు ఫోను..మాడం మీరెక్కడున్నారు అంటూ..దారిలో ఉన్నా ఇంటికెళ్ళి ఓ గంటలో వస్తా అంటూ ఉండగానే..మాడం..మాడం..డైరెక్టుగా ఆఫీసుకు వచ్చేయకూడదూ కొన్ని కెనడీ ఫైల్సు ఉన్నాయి ..TAT ఫైల్సు...నేను మీరు వచ్చేటప్పటికి టిఫిను తెప్పిస్తాను.....వాటి వరకు చేసి ఇంటికెళ్ళి ఫ్రెష్ అయ్యి వద్దురు అంటూ....వ్వావ్వా...ఇలాంటి కష్టాలు చాలా ఉంటాయిలేండి!

అన్ని ఉద్యోగాలకి ఈ సౌలభ్యం ఉండకపోవచ్చు కానీ ఉన్నవాళ్లయినా వినియోగించుకుంటే బాగుంటుంది. కాకపోతే సర్వసన్నద్దమై ఇంటినుండి పని మొదలుపెడితేనే ఉపయోగం.   సిస్టం..దానిలో మన పనికి అవసరమయిన సాఫ్టువేరులు.....బ్రాడుబ్యాండు కనక్షను....పవర్ ప్రాబ్లం లేకుండా బ్యాకప్......ఇలా అవసరమయినవన్నీ సిద్దం చేసుకోవాలి కాబట్టి మొదట్లో కొద్దిగా డబ్బులు పెట్టుబడి కూడా పెట్టాల్సి ఉంటుంది.

ఇక ఇంట్లో నుండి పని చేస్తే ఉండే అసలు లాభం ఏంటో చెప్పనా....
ఆఫీసుకి వెళ్తే కట్టిన చీర కట్టకుండా కట్టుకెళ్లాలా:)  ఆదివారం వచ్చిందంటే వీటన్నిటికీ గంజి....ఇస్త్రీలు..అదో పేద్ద పని!! ఆ చీరలకి మరి మ్యాచింగు బ్యాగులు....చెప్పులు....క్లిప్పులు...పిన్నులు...అబ్బో చాలా మెయెంటెయిను చెయ్యాలి......ఇప్పుడు అవన్నీ మిగులే:)))

ఇక దీనిలో ఉండే కష్టాల గురించి మరోసారి .........

Read more...

October 28, 2009

తప్పెవరిది?

గత రెండురోజులుగా ప్రసారమాధ్యమాలలో మైదుకూరు స్కూలులో తెలుగు మాట్లాడినందుకు ఇద్దరు పిల్లలకు ఉపాధ్యాయులు వేసిన శిక్ష  ఓ పెద్ద చర్చాంశనీయమయింది.  మన టి.వి చానళ్లకి మరో పండగ.  ఈ రోజు ఉదయం నుండి ఏ చానలు తిప్పినా  దీనిమీదే చర్చ.  వీళ్లు ఇప్పుడే కళ్లు తెరిచారో లేక వేరే సంచలనాత్మక వార్తలు ఏమీ లేక దీనిమీద పడ్డారో అర్థం కావటం లేదు. అసలు పిల్లలు ఎలాంటి తప్పు చేసినా ఇలా మెడలో బోర్డులు వేలాడదీయటం తప్పు.....మనం స్పందించాల్సింది దానికి...మనం ముందుగా ఖండించాల్సింది ఇలాంటి శిక్షలని.  ఆ పంతుళ్ల మెడలకి "ఇక ఇలాంటి పని చేయను" అన్న బోర్డు తగిలించి ఊరంతా తిప్పాలి.....అదే వారికి సరయిన శిక్ష..

నిజానికి స్కూలులో ఇంగ్లీషులోనే మాట్లాడాలని పిల్లలని నిర్భందించటం, మాట్లాడకపోతే శిక్షలు వేయటం కొత్త విషయం ఏం కాదు.  గత  10-15 ఏళ్ల నుండీ  హైదరాబాదులో ఇలాంటి ఆంక్షలు చాలా స్కూళ్లల్లో ఉన్నాయి.  లేని స్కూళ్లని వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. అది ఇప్పుడు చిన్న చిన్న ఊర్లకి కూడా పాకింది.  మేము చదువుకునే రోజులలో అంటే 30 ఏళ్ల క్రితం కూడా మిషనరీ స్కూల్సులో తెలుగులో మాట్లాడితే ఫైన్ ఉండేది. ఎండలో నిలబెట్టటం. బెంచీలు ఎక్కించటం, మోకాళ్లమీద కూర్చోపెట్టటం, కొండకచో కొట్టటం కూడా చేస్తుంటారు.  తమ పిల్లలు తెలుగులో మాట్లడటం తక్కువతనమనుకునే తల్లిదండ్రులున్నంత కాలం మన తెలుగుకి....మన పిల్లలకి ఇలాంటి దుర్గతి తప్పదు. స్కూలులో తెలుగు ఎక్కువగా మాట్లాడుతున్నారని స్కూలులు మార్చే తల్లిదండ్రులున్నప్పుడు వాళ్ల దగ్గర డబ్బులు దండుకుంటున్న స్కూళ్ల  యాజమాన్యాలు ఇలా చేయక మరి ఎలా చేస్తాయి? మార్పు రావల్సింది తల్లిదండ్రుల్లో.....ఇంగ్లీషు రాకపోతే తమ పిల్లలు జీవితంలో పైకి రాలేరు..వాళ్లకి భవిష్యత్తు లేదు అన్న భావన నుండి మనం బయటకు వచ్చినప్పుడే ఈ ఝాడ్యం వదిలేది. 

మొన్న బజారులో ఓ తెలిసినామె కనపడితే కుశల ప్రశ్నలు అయ్యాక మీ బాబు ఇదివరకటి స్కూలేగా అన్నా! లేదండి పోయిన సంవత్సరం మార్చాం అంది.  అదేంటండి ఆ స్కూలు బాగుంటుందన్నారు కదా, బాగా ఆటలు అవీ ఆడిస్తారు, పిల్లల మీద ఒత్తిడి ఉండదు కదండీ అంటే........ఆవిడ ప్రతిస్పందన........అన్నీ బాగానే ఉన్నాయి కానీండి.... అక్కడ క్లాసు బయట పిల్లలు తెలుగులో ఎక్కువగా మాట్లాడతారండి అందుకని మార్చాం అంది. అదీ ప్రస్తుత పరిస్థితి.  మామూలుగా మన తెలుగువారం ఏదైనా బాధ కలిగినప్పుడో, దెబ్బ తగిలినపుడో అమ్మా అనో అబ్బా అనో అంటాం..అది అసంకల్పిత చర్య......కానీ  ఇంగ్లీషు పిచ్చి ఉన్న మన ఆధునిక తల్లిదండ్రులు ఉన్నారే ......వాళ్లు పిల్లలు బాధ కూడా తెలుగులో పడకూడదనుకుంటారు..పడ్డప్పుడు అమ్మ బదులు మమ్మీ అనాలనుకుంటారు....అలా అంటేనే తమ పిల్లలకి ఇంగ్లీషు బాగా వచ్చినట్లన్నమాట!  అమ్మలు బ్రతికున్న శవాలు అయిపోయారన్నమాట!

ఇంగ్లీషులో మాట్లాడితేనే పిల్లలు జీవితంలో పైకి వస్తారు అనుకునే మనస్తత్వం మనకున్నంత కాలం ఇలాంటివి మామూలే. ఓ రెండు రోజులు గోల చేస్తాం..చర్చలు..వాదనలు..ప్రతివాదనలు..ఆవేశాలు..రక్తం ఉడికిపోవటాలు ....మరిగిపోవటాలు....ఊకదంపుడు ఉపన్యాసాలు..అన్నీ మామూలే.......మూడో నాడు షరా మళ్లీ ఇంగ్లీషు మామూలే.. మళ్లీ ఈ ఊసే ఎవరూ ఎత్తరు.  భాషా శాస్త్రవేత్తలు ఎప్పడో మొత్తుకున్నారు.....ముందు మాతృభాష సరిగ్గా వస్తే మిగతా భాషలు నేర్చుకోవటం చాలా సులువు అని......కానీ మనం ఇపుడు తెలుగు రాకపోతే మాత్రం ఏం ఇంగ్లీషు వస్తే చాలనుకుంటున్నాము. నర్సరీలో ఉన్న మన పిల్లకాయ..ముద్దుముద్దుగా ఏ ఫర్ ఆపిల్ అంటుంటే ...అబ్బో ఇంగ్లీషు ఎంత చక్కగా మాట్లాడుతుందో అని మురిసిపోతాం. చందమామ రావే ..జాబిల్లి రావే.. స్థానంలో ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టారు వచ్చేసింది....చిట్టి చిలకమ్మని.... జానీ జానీ మింగేసాడు..మన అమ్మ భాష మనకి పరాయి అయిపోయింది!

టపటపా నాలుగు ఇంగ్లీషు ముక్కలు మాట్లాడనివాడు మన దృష్టిలో మనిషే కాదు..అలాంటి పిల్లలకు భవిష్యత్తే లేదు అని జాలిపడిపోతుంటాం.  మన పిల్లలు ఇంగ్లీషు మీడియంలో చదవాలనుకోవటం తప్పు కాదు, మంచి ఇంగ్లీషు మాట్లాడాలనుకోవటం తప్పు కాదు...కానీ ఇంగ్లీషే తాగాలి, ఇంగ్లీషే తినాలి, ఇంగ్లీషుతోనే బ్రతుకంతా ఉంది అనుకోవటమే తప్పు! తెలుగెందుకు ఇంగ్లీషులోనే అభివృద్ధి అంతా ఉంది అనుకోవటమే తప్పు. మన పక్కనున్న చైనా వాళ్లు ఏ ఇంగ్లీషు నేర్చుకుని ఇంతగా అభివృద్ధి చెందారు? 

ఇక్కడ అసలు నవ్వొచ్చే (ఏడవలేకే లేండి) విషయమేమిటంటే ఈ ఇంగ్లీషు స్కూళ్లలో చదివే అధిక శాతం పిల్లలు మాట్లాడే ఇంగ్లీషు వింటే ఇంగ్లీషు సరిగ్గా రాని నేనే చాలా నయం అనిపిస్తుంది. ఓ గ్రామరు ఉండదు, ఓ వ్యాక్య నిర్మాణం సరిగ్గా ఉండదు..ఓ..యా..లే తప్ప అందులో భాషే ఉండదు.  ఇలాంటి ఇంగ్లీషు వస్తే ఎంత రాకపోతే ఎంత? ఓ విషయం ఇచ్చి ఓ పది వ్యాక్యాలలో చిన్న వ్యాసం వ్రాయమనండి. స్పెల్లింగు తప్పులు లేకుండా ఒక్క వ్యాక్యం కూడా ఉండదు. అందరూ ఇంతే అనను కాని చాలావరకు ఇంతే.  ఈ ఇంగ్లీషు మీద మరోసారి మాట్లాడుకుందాం.

మైదుకూరులో స్కూలు మూసేయించుతారంట..ఎన్ని స్కూళ్ళని అలా మూసేయించుతారు..తల్లిడండ్రులు ఇష్టపడే కదా తమ పిల్లలని ఇంగ్లీషు మీడియం స్కూళ్లకి పంపుతుంది. మన ఇళ్లల్లో ఎంతమందిమి పిల్లలకి చక్కటి తెలుగు నేర్పుతున్నామో, ఎంతమందిమి పిల్లలతో పూర్తిగా తెలుగులోనే మాట్లాడుతున్నామో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుందాం.  మన పిల్లలు ఎంతమంది తెలుగు అక్షరాలు అన్నీ గుర్తుపట్టగలరు?..తప్పులు లేకుండా ఎన్ని గుణింతాలు వ్రాయగలరు? ఎన్ని అంకెలు చెప్పగలరు?..వారాలేంటో అవి ఎన్నో ఎంతమందికి తెలుసు?  అసలు జనవరి.......ఫిబ్రవరే కాదు తెలుగు సంవత్సరాలు కూడా ఉన్నాయని ఎంతమంది పిల్లలకి తెలుసు??మారాల్సింది మనం.

తల్లిదండ్రులూ ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి--తప్పెవరిది??


Read more...

November 27, 2008

మృత్యుక్రీడ

ఇవాళ పొద్దుట పొద్దుటే తలుపు తీసి వాకిట్లో పేపరు తీసుకోబోతూ మెయిను పేజీ హెడ్డింగు "మృత్యుక్రీడ" అని చూసి ఒక్క క్షణం ఉలిక్కిపడ్డా, మళ్లీ ఎక్కడో ఉగ్రవాదం పంజా విప్పిందన్నమాట--మరో మారణహోమం, ఆర్తనాదాలు, చావు కేకలు, పేపరు చేతిలోకి తీసుకోవాలంటేనే భయం వేసింది. ఎలాంటి వార్తలు వినాలో, ఎన్ని చావు కబుర్లు వినాలో అని-- వరసపెట్టి మారణహోమాలు. కాస్త ఓ నెల రెండు నెలలు అమ్మయ్య అని కాస్త ఊపిరి తీసుకునేలోపు మళ్లీ మరో దాడి, మరో దారుణం, మరో మారణహోమం. వార్తా చానళ్లకి, పేపర్లకి మరో పండగ రోజు.

పేపరు చదవాలంటే భయం,టి.వి.చూడాలంటే భయం,కాలు తీసి బయట పెట్టాలంటే భయం,గుడికెళ్లాలంటే భయం, బడికెళ్లాలంటే భయం,దుకాణానికి వెళ్లాలంటే భయం,సినిమాకి వెళ్లాలంటే భయం, రైలు ఎక్కాలంటే భయం,బస్సు ఎక్కాలంటే భయం,ఎక్కడికైనా వెళ్లాలంటేనే భయం.. భయం..భయం..బతుకే భయం. నా ప్రాణానికి ఏం అవుతుందో అన్న భయం కాదు, మన కళ్ల ముందు ఎలాంటి దారుణాలు చూడాలో అన్న భయం. ఆఫీసుకి వెళ్లిన భర్త ఇంటికి క్షేమంగా వస్తాడా అన్న ఓ ఇల్లాలి భయం, కాలేజికి వెళ్లిన కూతురు క్షేమంగా ఇల్లు చేరుతుందా అన్న ఓ తండ్రి భయం, సినిమాకి వెళ్లిన కొడుకు ఎప్పుడు ఇంటికి వస్తాడా అని ఎదురుచూసే ఓ తల్లి ఎదురుచూపులలో ఉండే భయం. మన కుటుంబ సభ్యులకి ఎవరికైనా ఏదైనా చిన్నపాటి అనారోగ్యం కలిగితే ఎంతగా ఆందోళన చెందుతాం..అలాంటిది ఓ కుటుంబంలోని వ్యక్తి హఠాత్తుగా ఓ దారుణ మారణకాండలో బలి అయితే ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. ఆ బాధ ఎవరు తీర్చగలరు?

ఎప్పుడో ఓ కేంద్ర మంత్రి కూతుర్ని అపహరిస్తే ఆఘమేఘాల మీద మన ప్రభుత్వం, మన నాయకులు స్పందించి కరుడుగట్టిన ఉగ్రవాదుల్ని వదిలిపెట్టిన దాని ఫలితం ఇప్పుడు అమాయకులు అనుభవిస్తున్నారు. ఏదీ ఇప్పుడేది అలాంటి స్పందన కానరాదే. సామాన్యుల ప్రాణాలకి ఇదేనా మన ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యత. ఇంతమంది అమాయకులు బలవుతుంటే సూటుల్లో వచ్చి ప్రెస్సు కాన్ఫరెన్సులు పెట్టే మన నాయకులు, ప్రతి దాన్ని ఓ పండగ లాగా ఆనందంగా ప్రత్యక్ష ప్రసారం చేసే మన వార్తా చానళ్లు....ఈ మారణకాండలో బలవుతున్న సామాన్యుల గురించి పట్టదా వీళ్లకి.

ఇలాంటి వార్తలు విన్నప్పుడల్లా మనసులో ఒకలాంటి ఆందోళన...కాదు కాదు భయం...కాదు కాదు అభద్రతాభావం...కాదు కాదు మన నేతల మీద అపనమ్మకం...వీటన్నిటినీ చూస్తూ ఏమీ చేయలేని నిస్సహాయత ...ఈ భావాలన్నిటికి కలిపి ఏదైనా పేరు ఉంటే అది... అదే అలాంటి భావం పొద్దున్నిండి నాలో. ఇదా మన నేతలు కోరుకున్న స్వేచ్చా భారతం? ఇదా గాంధీ కలలు గన్న స్వరాజ్యం? ఎప్పుడైతే ఓ స్త్రీ అర్థరాత్రి ఒంటరిగా క్షేమంగా ఇల్లు చేరుకుంటుందో అప్పుడే మన దేశానికి స్వతంత్రం వచ్చినట్లు అని గాంధీ అనేవారట. అర్థరాత్రి కాదు ఏ పూట కా పూట ఆడదే కాదు మగాడు కూడా బిక్కు బిక్కు మంటూ భయం భయంగా ఇల్లు చేరుకుంటున్న నేటి భారతాన్ని చూసి అయన ఏం అనేవారో!

ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడల్లా మనం కూడా ఆవేశంగా ఈ రాజకీయ నాయకుల్ని ఉరి తీయాలి, తన్ని తరమాలి అని అవేశపడిపోతుంటాం. మన నాయకులేమో నిందితుల్ని పట్టుకుంటాం (పట్టుకున్న నిందితుల్ని వదిలి వేస్తాం), ఉగ్రవాదాన్ని అణచివేస్తాం, చనిపోయిన వారికి మా ప్రగాడ సానుభూతి అంటూ నాలుగు చిలక పలుకులు వల్లెవేస్తారు, ఎప్పుడు చూడండి అవే మాటలు. ఏ మాటంటే ఎవరి మనోభావాలు దెబ్బతింటాయో అని జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే వాళ్లకి ఇంతకన్నా ఎక్కువ మాటలు ఎలా వస్తాయిలే. రెండు రోజుల తర్వాత మనమూ మర్చిపోతాం, నాయకులూ మర్చిపోతారు, కానీ మర్చిపోంది ఉగ్రవాదులు, మరలా ఎప్పుడు పంజా విసరాలా అని ఆకలిగొన్న పులిలా ఎదురు చూస్తుంటారు. వీటన్నిటికి అంతం ఎప్పుడు?ఎప్పుడు? ఎప్పుడు? అసలు ఇదే ఆరంభమా???

Read more...

May 14, 2007

స్త్రీ-స్వేచ్చ-స్వాతంత్రం

స్త్రీ-స్వేచ్చ-స్వాతంత్రం గురించి మాట్లాడినట్లు పురుషుడు-స్వేచ్చ-స్వాతంత్రం గురించి మాట్లాడరెందుకని???

స్త్రీ వాద సాహిత్యం వుంది కాని పురుషవాద సాహిత్యం లేదెందుకని???

స్త్రీ వాద రచయిత్రులున్నారే కాని పురుషవాద రచయితలు లేరెందుకని???

స్త్రీల హక్కుల పరిరక్షణ గురించే కాని పురుషుల హక్కులు గురించి మాట్లాడరెందుకని???

ఎక్కడా చూసినా మహిళా సంఘాలే కాని పురుష సంఘాలు ఉండవెందుకని???

అంటే పురుషుడికి సంపూర్ణ స్వాతంత్రం ఉన్నట్లా? అతనికి ఎలుగెత్తి చాటుకోతగ్గ బాధలు కష్టాలు ఏమీ లేనట్లా? ఉన్నాకాని ఎలుగెత్తి చాటుకుంటే ఎక్కడ అలుసైపోతామో అన్న భయమా? లేక చెప్పుకోవటానికి అడ్డొచ్చే అభిజాత్యమా?

ఇవన్నీ నా దగ్గర జవాబు లేని ప్రశ్నలు.

ఇది నేను రాయబోయే విషయానికి ఓ చిన్న ముందు మాట లాంటిది. మీ మీ జవాబులు విన్నాక (చూసాక) అది మొదలుపెడతాను.

గమనిక: ఇక్కడ జవాబులు రాయటానికి స్త్రీ పురుష భేదం లేదు. ఎవరైనా రాయవచ్చు.

Read more...

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP