పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

September 10, 2012

ఇల్లాలి పనికి ఖరీదు కట్టే షరాబు లేడండోయ్! రాడండోయ్!


"ఇంటెడు చాకిరీని ఓపిగ్గా చేసుకుంటూ, ఇంటిని చక్కబెట్టే గృహిణుల శ్రమకు తగిన ప్రతిఫలం కల్పించాలని కేంద్రం యోచిస్తోంది. భార్యలకు భర్తలు తమ ఆదాయంలో కొంత భాగాన్ని చెల్లించడం తప్పనిసరి చేసే ప్రతిపాదనను పరిశీలిస్తోంది..."

"ఇంట్లో వారి పని విలువను లెక్కగట్టేందుకు ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. దీనివల్ల వారికి మరింత సామాజిక సాధికారతా గుర్తింపు లభిస్తుంది. భర్త ఆదాయంలోంచి భార్యకు కొంత కేటాయిస్తే... ఆ సొమ్మును పిల్లల పౌష్టికాహారానికి, చదువుకు, మొత్తంగా ఆ ఇంటి బాగోగులకు వినియోగించవచ్చు".

ఇల్లాలి పనికి ఖరీదు....ఇది ఈ మధ్య భారత ప్రభుత్వం చేస్తున్న ఆలోచన!

అసలు ఈ ఆలోచనే హాస్యాస్పదంగా లేదూ! ఇల్లాలి పనికి ఎలా ఖరీదు కడతారు?  గంటల లెక్కనా..రోజుకి ఇంతనా..పనికి ఇంతనా! మరి పనివాళ్ళతో చేయించుకునే వాళ్ళకో! వాళ్ళకి ఎలా లెక్క కడతారు!

ఆడవాళ్ళు చేసే ఇంటిపని విలువని గుర్తించాలి..కానీ దాన్ని డబ్బుతో విలువకట్టడం అన్నది నాకయితే మింగుడుపడని విషయం!  ఆడదానికి ఆర్థిక స్వావలంభన ఉండాలి..కానీ ఇలా ఖరీదులు కట్టటాలు కాదు!

నెల జీతం మొత్తం తెచ్చి భార్య చేతుల్లోనే పోసే పతి దేవుళ్ళు ఉన్నారు...భార్య చేతిలో చిల్లి గవ్వ కూడా పెట్టని ప్రబుద్దులూ ఉన్నారు! మారాల్సింది మనిషి నైజం..ఉండాల్సింది భార్య మీద గౌరవం.

మరి మగవాళ్ళ పనికి కూడా లెక్కలు కట్టాలిగా!

ఇలా ఇంట్లో నీ పనికి ఇంత..నా పనికి ఇంత అని లెక్కలు కట్టుకుంటూ ..కూడికలు..తీసివేతలు వేసుకుంటూ కాపురాలు చేస్తే ఆ సంసారంలో చివరికి మిగిలేది శూన్యమే!

నెల నెలా జీతం తెచ్చుకునే కొంతమంది  స్త్రీలకి కూడా ఆర్థిక స్వేచ్చ ఉండదు..అంతా తెచ్చి భర్త చేతిలోనే పోయాలి.

పోనీ ఆడదాని ఆర్దిక భద్రత కోసమే ఈ ఆలోచన అనుకుందాం..అసలు భర్త నుండి ఏమాత్రం భద్రత లేని ఆడదానికి బ్యాంకులో డబ్బులు వేసినా ఆ డబ్బులు ఖర్చుపెట్టుకునే స్వేచ్చమాత్రం ఉంటుందా!  ప్రభుత్వానికి భయపడో..తప్పదు కాబట్టొ డబ్బులు వేసినా..అవి చివరికి మళ్ళీ చేరేది భర్త చేతిలోకే!

మరి అలాంటప్పుడు ఇలా ఇల్లాలి పనికి ఖరీదు కట్టటం ఉపయోగమేనా!

ఇల్లాలి పనికి ఖరీదు కట్టే షరాబు లేడండోయ్! రాడండోయ్!

Read more...

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP