పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

December 31, 2008

వీడ్కోళ్లు.....స్వాగతాలు.

వీడ్కోళ్లు...స్వాగతాలు...కమ్మటి జ్ఞాపకాలు...చేదు అనుభవాలు...

సంవత్సరం తరవాత మరలా మరో సంవత్సరం.....ఇలా పునారావృత్తం అవుతూనే ఉంటాయి. అదే నేను, అదే నీవు, అదే మనం, అదే లోకం, అదే బ్రతుకు....తేడా ఏమీ ఉండదు.

ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా వచ్చింది, వెళ్లిపోతుంది, మరో సంవత్సరం రాబోతుంది. ఇలా సంవత్సరాలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి, మరి ఎప్పుడూ జరిగే దానికి ఇలా వేడుకలు, హడావిడీలు ఎందుకో నాకర్థం కాదు. కొంతమంది అయితే ఈ రోజు గడిచిపోతే మరలా రాదేమో, అనుభవించాల్సింది అంతా ఇప్పుడే ఈ నిమిషమే అనుభవించాలి అన్నట్టు ఉంటారు. దానికోసం ఎంత డబ్బైనా తగలేస్తారు. మళ్లీ రోజు తిరిగిందంటే ఎవరి బ్రతుకు పోరాటం వారిది, అంతా మామూలు అయిపోతుంది.

కొంతమంది ప్రతి కొత్త సంవత్సరం రోజు కొన్ని నిర్దిష్ట ప్రణాళికలు, కొన్ని లక్ష్యాలు, కొన్నిresolutions పెట్టుకుంటుంటారు, మరి ఎంతమంది వాటిని నిర్విఘ్నంగా విజయవంతంగా ఆమలు పరుస్తారో నాకైతే తెలియదు. ఓ పద్దతి ప్రకారం నడిచే వాళ్లకి ఈ కొత్త సంవత్సర లక్ష్యాలు, resolutions అవసరమా అని నాకనిపిస్తుంది. అయినా అవి కొత్త సంవత్సరం రోజే ఎందుకు పెట్టుకోవాలో అన్నది నాకర్థం కాని ఓ కోటి రూపాయల ప్రశ్న!

ఒకప్పుడు కొత్త సంవత్సరం వస్తుందంటే ఓ పది రోజుల ముందు నుండి ఎంత హడావిడి పడిపోయేదాన్నో. గ్రీటింగు కార్డులు చేయటం, పంపించటం, అదే సమయంలో సంక్రాంతి ముగ్గులు--పగలంతా గ్ర్రీటింగ్ కార్డ్సు చేసే పని రాత్రి ముగ్గులు వేసే పని, అబ్బో క్షణం తీరిక ఉండేది కాదు. ఇప్పుడు అసలు ఈ శుభాకాంక్షలు అవీ ఎందుకన్న ఓ నిరాసక్తి. మరో సంవత్సరం వస్తుంది, అది మామూలే కదా, దానికి ఇంత హడావిడి అవసరమా అన్న ఓ నిర్వేదం. వయస్సు ప్రభావం కావచ్చు. ఓ సంవత్సరం గడిచిపోయిందంటే మనకీ ఓ సంవత్సరం దగ్గర పడ్డట్టేగా! దాన్ని ఎలుగెత్తి చెప్పాటానికేనా ఈ ఉత్సవాలు, ఈ సంబరాలు? అయినా ఏం సాధించామని ప్రతి సంవత్సరం ఈ సంబరాలు, ఉత్సవాలు అనిపిస్తుంది.

ఒక్కొకసారి రోజులు ఇంత త్వరగా ఎందుకు గడుస్తాయా అనిపిస్తుంది. నా కళ్లముందే నన్ను మించి (శారీరకంగా, మానసికంగా) నా పిల్లలు పెరిగిపోతుంటే అదొక అబ్బురంగా ఆనిపిస్తుంది. నా పొత్తిళ్లలో ఆడుకున్నది వీరేనా అని అనిపిస్తుంది. చిట్టి చిట్టి చేతులతో అమ్మ పొట్టని తడుముతూ కాస్త ఎడం అయితే ఎక్కడికన్నా వెళ్లిపోతుందేమో అన్నట్టు కాళ్లూ చేతులతో పెనవేసుకుని పడుకున్న పిల్లలు వీళ్లేనా అనిపిస్తుంది. అంత అబ్బురంలో కూడా ఏ మూలో కించిత్తు బాధ----ఇంకొన్నేళ్లు పోతే వాళ్లెక్కడో నేనెక్కడో కదా అని అనిపిస్తుంది.

కాలం ఇలా ఆగిపోనీ.......
కాలం ఇలా ఇక్కడే ఈ నిమిషం ఫ్రీజ్ అయిపోతే....ఎంత బాగుంటుందో కదూ!

ఊగిసలాడకే మనసా నువ్వు ఉబలాట పడకే మనసా ...!

http://etelugu.org/typing-telugu

Read more...

December 30, 2008

వందనం అభివందనం

పదిరోజుల పాటు జరిగిన హైదరాబాదు పుస్తక ప్రదర్శన ముగిసింది. ఇన్నిరోజులు అక్కడ తెలుగు బ్లాగర్ల హడావిడీ, అల్లరీ వేడుకగా చూసిన సాగర తీరం ఒక్కసారిగా మూగవోయింది. ఇప్పుడు అటు వెళ్లినవారికి తన జ్ఞాపకాల ఊసులు కథలు కథలుగా వినిపిస్తుంది. మరి మీరెప్పుడైనా అటు వెళితే సాగరమ్మ ఊసులు ఒకసారి వినండి.

నిజంగా e-తెలుగు స్టాలు ఓ పెళ్లివారింటిని తలపించింది. ఎక్కడెక్కడినుండో వచ్చిన బ్లాగర్లు, ఎవరెవరో తెలుసుకోవాలన్న ఆతృత, తెలిసినాక మీరు ఫలానానా అని ఆశ్చర్యపోవటాలూ, పలకరింపులు, అప్యాయతలు, చలోక్తులు, చర్చలు, ఫోటోలు, వీడ్కోళ్లు, మళ్లెప్పుడొస్తారూ, మళ్లీ రావచ్చు కదా అన్న వేడ్కోళ్లు--------నిజంగా ఓ పెళ్లి వేడుకలానే అనిపించింది. గంటలు నిముషాల లాగా కరిగిపోయాయి.

అక్కడ మన అలుపెరుగని యోధుడిని చూసి ఎంత సంబరమేసిందో! మీకు ఒంట్లో బాగోలేదన్నారు, ఇప్పుడెలా ఉంది అని అడిగితే "నాకా నాకేం లేదమ్మా, అంతా వీళ్లు ఊరికే చెప్తున్నారు" అంటూ ఒక్క మాటతో మాట దాటవేసిన తీరు ఓహ్.. అనిపించింది. అదే మనమైతే "పర్లేదండి, ఇంకా బాగా తగ్గలేదు, కానీ ఇక్కడకి రాకపోతే కుదరదు కదా అని వచ్చాను" అని పెద్ద బిల్డప్ ఇచ్చేవాళ్లం. మాటలు కాదు చేతలు కావల్సింది అని చేసి మరీ చూపించారు ఆయన. ఆయన హుషారు చూస్తే ఎవరమైనా సిగ్గుతో తల దించుకోవలసిందే. ఎదిగిన కొద్దీ ఒదగమని మొక్క నీకు చెపుతుంది--దీనికి సరైన ఉదాహరణ ఆయన అనిపించింది. ముందుగా పద్మనాభం గారికి జేజేలు.

చెప్పుకోవలసిన మరో వ్యక్తి జ్ఞాన ప్రసూన గారు. పూర్ణం బూరెలతో పాటు వాళ్ల నాన్న గారు, తను వ్రాసిన పుస్తకాలు, తను స్వయంగా తయారు చేసిన గిఫ్టు కవర్లు తెచ్చి అందరికి పంచారు. వాహ్....ఈ వయస్సులో ఎంత ఓపిక అనిపించింది.

అక్కడికి వెళ్లొచ్చాక ఫలానా ఫలానా వారు కూడా ఉండి ఉంటే ఇంకెలా ఉండేదో అని వాళ్లందరిని ఒకసారి మనోఫలకంలో తలుచుకున్నాను. అలా నేను వీరు కూడా ఉండి ఉంటే అని తలుచుకున్న వాళ్లు---అబ్బో చాలా మందే ఉన్నారు. మొత్తం తెలుగు బ్లాగర్లు ఉండి ఉంటే!!ఇంకెంత నిండుతనం వచ్చేదో! ఆ రోజు కూడా త్వరలోనే రావాలని వస్తుందని ఆశిద్దాం. ప్రపంచ తెలుగు బ్లాగర్ల మహాసభ అన్నమాట (కూడలిలో కాదండోయ్ నిజంగానే నిజంగా).

ఇంతై ఇంతై వటుండంతై బ్రహ్మాండమంతై అన్నట్లు బ్లాగర్ల సమావేశంలో హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో మనం కూడా ఓ రోజు కార్యక్రమం ఇస్తే బాగుంటుందన్నచిరు ఆలోచన మొగ్గ తొడిగి చివరికి అక్కడ స్టాలు పెట్టటానికి దారి తీసింది. ఉన్న అతి తక్కువ సమయంలోనే యుద్ధ ప్రాతిపదికిన e-తెలుగు స్టాలు పెట్టి, దాన్ని విజయవంతంగా నిర్వహించి, అదే స్పూర్తితో విజయవాడ పుస్తక ప్రదర్శనలో కూడా ఓ రోజు అంతర్జాలంలో తెలుగు గురించి ప్రదర్శన ఇవ్వటానికి కార్యోన్ముఖులు అవుతున్న మన e-తెలుగు సభ్యులకి, మిగతా బ్లాగర్లకి, మరియు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి వేల వేల అభినందనలు.

జీవితంలో మొదటి అడుగు వేయటమే కష్టమైన పని, తరువాత అడుగులు వాటంతట అవే పడి పరుగులవుతాయి. అలానే అంతర్జాలంలో తెలుగు వ్యాప్తికి పడ్డ ఈ అడుగులు పరుగులై పరవళ్లు తొక్కాలని కోరుకుందాం. ఈ విజయ స్ఫూర్తితో e-తెలుగు తరుపున, తెలుగు బ్లాగర్ల తరుపున మరిన్ని కార్యక్రమాలు జరగాలని కోరుకుంటూ మరొక్కసారి హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో e-తెలుగు స్టాలు పెట్టి విజయవంతం చేయటానికి పాటు పడ్డ ప్రతి ఒక్కరికి వందనం అభివందనం.

Read more...

December 24, 2008

వక్కపలుకులు-2

హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో మొదటిసారిగా పెట్టిన e-తెలుగు స్టాలు అంతర్జాలంలో తెలుగు వ్యాప్తికి కృషి చేస్తుంది. కార్యక్రమం చాలా ధూం ధాం గా జరుగుతుంది. మరి అక్కడికి వెళ్లలేని వారు కనీసం అ కబుర్లు అయినా వింటున్నారా?

హైదరాబాదు పబ్లిక్ స్కూల్ 85 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా డిసెంబరు 25 నుండి 27 వరకు మూడురోజుల పాటు ఉత్సవాలు జరుపబోతున్నారు. మన బ్లాగర్లలో HPS పూర్వ విద్యార్థులు ఎవరైనా ఉంటే వారికి అభినందనలు మరియు శుభాకాంక్షలు.

ఒబామా మానియా: ఒబామా కొరికి వదిలివేసిన కేకు ముక్కకి వేలం వేయబోతున్నారు, ప్రారంభ ధర $ 20,000 మాత్రమే. ఏమిటో ఈ పిచ్చి. ఈబేలో ఒబామా వాడిన వస్తువులకి ప్రస్తుతం విపరీతమైన డిమాండు. ఈ సంవత్సరం ఇప్పటివరకు ఈబే సంస్థ ఒబామా వాడిన 1,11,546 వస్తువులని వేలం వేసిందట. అంటే ఆయన వాడిన టూత్ బ్రష్, ఖాళీ అయిన షూ పాలిషు డబ్బా దగ్గరనుండి టిస్యూ పేపర్ల వరకు వేటిని వదలకుండా వేలం వేసుంటారు. ఈయనకి గారాజ్ అమ్మకాలు పెట్టే అలవాటు లేదేమో మరి!

పోయినేడాది అన్నగారు (ముఖేష్ అంబాని) తన భార్యకి పుట్టినరోజు కానుకగా 250 కోట్లు విలువ చేసే జెట్ విమానాన్ని కొనిస్తే, నేడు తమ్ముడు (అనిల్ అంబాని) తన భార్యకి నూతన సంవత్సర కానుకగా 400 కోట్లు ఖర్చు పెట్టి ఓ పడవని కొనేసాడట. వ్యాపారంలోనే కాదు ప్రేమని ప్రదర్శించటంలో కూడా పోటీ అన్నమాట.

లండనులో పెంపుడు కుక్కలని వీధుల్లో వదిలేసేవారి సంఖ్య రాను రాను పెరిగిపోతుందట, దీనితో కుక్కల సంరక్షణ కేంద్రాలకి తలనెప్పి అయిపోయిందట. దానికి యజమానులు చెప్పే కారణాలు- మా తివాచీకి రంగుకి మాచ్ అవ్వటంలేదు, మా సోఫాకి మాచ్ అవ్వటంలేదు, లేకపోతే దాని రంగు మా ఇంటి రంగుతో కలవటంలేదు-ఇలాంటి కారణాలట! హతవిధీ!! ఇది కూడా ఆర్థికమాంద్యం ప్రభావమేనని అభిజ్ఞవర్గాల భోగట్టా!

చందా కొచ్చర్ ICICI బ్యాంకుకి నుతన CEO గా నియమితులయ్యారు. ఓ స్త్రీ ఈ స్థాయికి చేరటం చాలా గొప్ప విషయం.

ఇకనుండి ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలలో 27 నుండి 30మార్కులు వస్తే ఆ విద్యార్థుల జవాబు పత్రాలని మరలా పరిశీలిస్తారట, అవసరం అయితే మళ్లీ పరిక్ష నిర్వహిస్తారట. అసలు ఇంటరు ప్రాక్టికల్సు తూ..తూ మంత్రమే అన్నది జగమెరిగిన సత్యం! ఏంటో రోజుకొక కొత్త వింత రూలు పెడుతుంటారు ఈ ఇంటరు బోర్డు వారు.

2009 మార్చి నాటికి గూగుల్ ఎర్తుకి పోటీగా ధీటుగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వారి భువన్ రాబోతుంది.

అన్నట్లు ఇస్రో వాళ్లు ఈ మధ్య తొలిసారిగా ఓ విదేశీ సంస్థ కోసం వాణిజ్య ఉపగ్రహాన్ని ఒకదాన్ని విజయవంతంగా ప్రయోగించారు అంతే కాదు ఆదిత్య పేరుతో సూర్యుడి మీదకి ఓ ఉపగ్రహాన్ని త్వరలోనే పంపించబోతున్నారు. జయహో ఇస్రో!

మళ్లీ కొత్త సంవత్సరంలో కలుద్దాం, అంతవరకు సెలవు.

Read more...

December 16, 2008

పుస్తకాల విందుకి వేళాయెరా!

23వ హైదరాబాదు పుస్తక ప్రదర్శన విందుకి వేళయింది, మరి ఆ విందు భోజనానికి భాగ్యనగర పుస్తక ప్రియులంతా తయారుగా ఉన్నారా? అక్కడ విందారగించటానికి వెళ్లే ముందు ఇక్కడ ఓ నాలుగు ముక్కలు ఆరగించి వెళ్లండి.

ప్రదర్శన ప్రారంభ తేది: డిసెంబరు 18, 2008.
వేదిక: పీపుల్సు ప్లాజా, నెక్లెసు రోడ్డు.
ప్రదర్శన వేళలు: మధ్యాహ్నం రెండు గంటల నుండి రాత్రి ఎనిమిదన్నర గంటల వరకు, శని ఆదివారాలు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు.
ప్రవేశ రుసుము: ఐదు రూపాయలు మాత్రమే. పిల్లలకి, విద్యార్థులకి, ఉపాధ్యాయులకి, పత్రికా విలేకరులకి ప్రవేశం ఉచితం.
  1. ఈ ప్రదర్శన పది రోజుల పాటు జరుగుతుంది.
  2. అన్ని పుస్తకాల మీద 10 శాతం రాయితీ ఉంటుంది.
  3. ప్రతి రోజు సాయంత్రం పూట చర్చా కార్యక్రమాలు, పరిచయ కార్యక్రమాల లాంటివి జరుగుతాయి.
  4. బుక్ హంట్, ఎక్కడా ఆంగ్ల పదం రాకుండా తెలుగులో మూడు నిమిషాల పాటు ఆపకుండా మాట్లాడటం, లాంటి పోటీలు జరుగుతాయి.
  5. నిర్వాహకులు ఇచ్చిన చిట్టాలో నుండి అభిమాన రచయిత(త్రి) ని ఎన్నుకునే కార్యక్రమం కూడా జరుగుతుంది.
  6. తెలుగు భాషకి, సాహిత్యానికి విశిష్ఠ సేవ చేసిన ఓ 25 మంది తెలుగు వారికి సన్మానం చేస్తారు.
ఈ సారి పుస్తక ప్రదర్శన తెలుగుకి ప్రాచీన హోదా వచ్చిన నేపధ్యంలో జరుగుతుంది కాబట్టి ఈ ప్రదర్శనలో తెలుగు సాహిత్యానికి పెద్ద పీట వేస్తారేమో చూడాలి. ఇక్కడ మొత్తం రెండువందల పైగానే అంగళ్లు ఉంటాయి, అందులో ఓ 50 వరకు తెలుగు పుస్తకాలవి ఉండొచ్చు.

అంతే కాక మొదటి రచన చేస్తున్న లేక ఇప్పటికి ఒక్క రచన మాత్రమే చేసిన రచయిత(త్రి)లకు ఈ ప్రదర్శనలో ప్రత్యేక అంగడి ఒకటి ఉంటుంది. వందరూపాయల నామమాత్రపు రుసుము కట్టి ఇలాంటి రచయత(త్రి)లు ఎవరైనా తమ పుస్తకాలని అక్కడ పెట్టుకోవచ్చు. మన బ్లాగర్లలో మంచి మంచి రచయిత(త్రి)లు ఉన్నారు, వారు ఇక్కడ తమ ప్రదర్శన పెట్టవచ్చేమో....

పుస్తకాలు కొందామని వెళ్లేవారికి ఓ చిన్న సూచన, ముందు మీకు కావలసిన పుస్తకాల చిట్టా వ్రాసుకోండి. వెళ్లిన మొదటిసారే పుస్తకాలు కొనెయ్యకండి, ఓపికగా ఒకటికి రెండు మూడు సార్లు అన్ని అంగళ్లు తిరగండి, తరువాతే కొనండి, అలా ఎందుకు చేయాలో ఒకసారి నెటిజన్ గారి నడగండి చెపుతారు.

ఈ సారి ఇంకొక విశేషమేమంటే విజేత కాంపిటీషన్సు (కంప్యూటర్ ఎరా) వారి అంగడిలో కంప్యూటరులో తెలుగు స్థాపించుకోవడం ఎలా అనే అంశంతో పాటు తెలుగు బ్లాగుల గురించి కరపత్రాలను తయారుచేసి పంచటం మరియు వీలైతే ఓ సాయంత్రం తెలుగు బ్లాగుల గురించి ఓ పరిచయ ఉపన్యాసం లాంటిది ఏర్పాటు చేయటానికి మన బ్లాగర్లు ప్రయత్నిస్తున్నారు. అక్కడ మీ వంతు ఏమైనా సాయం చేయాలని ఉంటే కంప్యూటర్ ఎరా శ్రీధర్ గారిని కాని, చదువరి గారిని కాని, అరుణ గారిని కాని సంప్రదించండి.

తెలుగు పుస్తకాలని కొని, చదివి, చదివించి మీ వంతు సాహిత్య సేవ చేయండి. చదివాక మీ మీ బ్లాగుల్లో వాటి గురించి సమీక్షలో, పరిచయాలో వ్రాయటం మరవకండి.

తెలుగు బ్లాగర్లందరూ కలిసి కట్టుగా ఓ రోజు వెళితే ఎలా ఉంటుందో కూడా ఆలోచించండి.


తెలుగు పుస్తకాలు చదవండి, చదివించండి.

Read more...

December 13, 2008

ఇదా పరిష్కారం!!

"వరంగల్‌లో ఇద్దరు కాలేజి విద్యార్ధినుల మీద యాసిడ్ దాడికి పాల్పడ్డ వాళ్లని పోలీసులు ఎన్‌కౌంటర్‌లో చంపేసారు".

సమస్యకి ఇదే పరిష్కారమా? ఇదే అంతిమ తీర్పా?.

"
నిందితులు నేరప్రవృత్తి కలిగినవారని, పథకం ప్రకారమే వారు అమ్మాయిలపై అమానుషంగా యాసిడ్‌ దాడి చేశారని వరంగల్‌ ఎస్పీ సజ్జనార్‌ అన్నారు". వారు నేరప్రవృత్తి కలిగినవారని ముందే తెలిసినప్పుడు మరియు స్వప్నిక తండ్రి నిందితుడి మీద రిపోర్టు ఇచ్చినప్పుడు ఎందుకు చర్య తీసుకోలేదు, అరెస్టు చేసినవాడిని ఎందుకు వదిలేసినట్లు, తను నేరప్రవృత్తి కలిగినవాడని తెలిసి కూడా వదిలేసాక తన మీద నిఘా ఎందుకు ఏర్పాటు చేయలేదు. ఎన్‌కౌంటరే ఇలాంటివాటికి పరిష్కారమా? నేరం జరిగాక చట్టం తన పని తాను చేయటం కాదు, ముందుగా ఆ నేరం జరగకుండా చేయటం చట్టం విధి. స్వప్నిక పరిస్థితి విషమంగా ఉంది మరి ఆ అమ్మాయికి ఏమైనా అయితే దానికి ఎవరు బాధ్యులు?

యాసిడ్‌తో దాడి అమానుషమే, ఇలాంటి వాటికి కఠిన శిక్షలు పడాల్సిందే. కాని తప్పంతా నిందితుడిదే లాగా కూడా కనిపించటం లేదు. నిందితుడు ఆ అమ్మాయి మీద 25,000 రూపాయల వరకు ఖర్చు చేసాడట, మరి ముందుగా ఆ అమ్మాయి ఇలాంటివి వద్దని ఎందుకు వారించలేదు, తనని ఎందుకు ప్రోత్సహించినట్లు? ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తి నా మీద ఇంత డబ్బులు ఎందుకు ఖర్చు పెడుతున్నాడా అని అమ్మాయిలు ఆలోచించాలి, తల్లిదండ్రులూ ఆలోచించాలి, ఆదిలోనే ఇలాంటి స్నేహాల్ని తెంపివేయాలి.

ఎవరూ పుట్టుకతో నేరస్థులుగా పుట్టరు. పెంపకం, పరిసరాలు, అనుభవాలు వారిని నేరస్థులుగా మారుస్తాయి. అలాంటి వారిని ఎన్‌కౌంటర్‌లో చంపటం మాత్రం సరైన పరిష్కారం కాదు. నేరం చేయటానికి ముందే భయపడేట్టు శిక్షలు ఉండాలి. ఎవరైనా అమ్మాయిల వెంట పడటం, వేధించటం లాంటివి చేస్తున్నప్పుడు హెచ్చరికలతో వదిలివేయకుండా కఠిన శిక్షలు పడేలా చూడాలి. వాళ్లు ఎలాంటి వారైనా, ఎంతటి వారైనా మొదటిసారే గదా అని హెచ్చరికలతో వదిలివేయకుండా ప్రారంభంలోనే ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలి, వారికి సరైన కౌన్సిలింగు ఇప్పించి వారి ప్రవర్తన మార్చుకునేట్లు చేయాలి. అమ్మాయిల వంక కన్నెత్తి చూడటానికి కూడా భయపడే విధంగా చట్టాలు కఠినంగా అమలు చేయాలి, అవసరమైతే అందుకు అనుగుణంగా చట్టాల్ని మార్చాలి.

ఆడపిల్లలు కూడా తమ పరిధుల్లో తాము ఉండాలి. ఎవరితో పడితే వారితో సినిమాలు షికార్లు తిరగటం, కాలేజిలు ఎగ్గొట్టి తిరగటం లాంటివి ఎప్పటికైనా వారికే ప్రమాదం. స్నేహానికి, వ్యామోహానికి తేడా తెలుసుకుని మెలగాలి. ఇది ఇప్పటి సమస్య కాదు. ఇలాంటివి జరిగినప్పుడే మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు మేలుకుంటాయి తప్ప ఇలాంటివి జరగకుండా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టరు ఎందుకని?. కాలేజిలలో ఇలాంటి వాటిపై చక్కటి సెమినార్లు, ఇతర కార్యక్రమాలు చేపట్టి పిల్లలలో అవగాహన, పరివర్తన తీసుకురావాలి. ప్రవర్తనా సమస్యలు ఉన్న పిల్లలకి వర్క్‌షాపులు పెట్టి వాళ్లలో మార్పు తిసుకురావటానికి ప్రయత్నించాలి అంతే కాని ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు రోడ్లెక్కి అరవటం కాదు మనకి కావల్సింది.

ఈ సమస్య ఏ ఒక్కరిదో కాదు. దీనికి పరిష్కారం కూడా ఏ ఒక్కరి చేతుల్లోనో లేదు. ప్రభుత్వంతో పాటు ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి. ఎక్కడైనా ఎవరైనా ఏ ఆడపిల్లనైనా వేధిస్తున్నట్లు మీ దృష్టికి వస్తే చాతనైన సహాయం చేయండి, నాకెందుకులే అని పక్కకు తప్పుకు వెళ్లకండి, రేపు మన పిల్లలే ఆ పరిస్థితిలో వుండవచ్చు.

Read more...

December 12, 2008

వక్క పలుకులు-1

ముంబయి దాడుల నేపధ్యంలో బ్లాగు లోకమంతా అలసిపోయినట్లుంది, కాస్త మద్యమద్యలో ఈ వక్కపలుకులు నోట్లో వేసుకోండి.

ఇవాళ మా మరిది గారబ్బాయికి అ.. ఆ ల పుస్తకం, చార్టు కొనటానికని మా కాలనీలో ఉన్న మూడు పుస్తకాల కొట్లు తిరిగా, ఎక్కడా దొరకలేదు. ఒక కొట్టామె అయితే అబ్బే ఇప్పుడు అవి ఎవరు అడుగుతున్నారండి ఇంగ్లీషు "A for apple" పుస్తకం ఉంది ఇవ్వనా అంది. ఇలా అయిపోయింది మన అ..ఆ ల పరిస్థితి. ఏంటో తెలుక్కి ప్రాచీన హోదా అంటే ఏంటో అనుకున్నా--ఇలా మెల్ల మెల్లగా అంతర్థానం అవటమన్న మాట. అందరికి ఓ సూచన--మీ ఇళ్లలో అ.. ఆ ల పుస్తకాలు కాని చార్టులు కాని ఉంటే భద్రపరుచుకోండి, కొన్నాళ్ల తరువాత వాటిని ఏ పురావస్తు ప్రదర్శనశాలలోనో పెట్టవచ్చు.


"
మనిషి రెండుగా చీలుతున్నప్పుడు కౌగిలించుకొని కొత్త నెత్తురు ఎక్కించేది-కవిత్వమొక్కటే".
ఈ వక్కపలుకు నాది కాదండోయ్. ఇవాళ ఓ పుస్తకంలో చదివిన కవితలోని వ్యాక్యం. దాంట్లోదే ఇంకొక వ్యాక్యం చూడండి.

"కవిత్వం, కాదు స్టేటస్ సింబల్
పోటెత్తిన నెత్తుటి ధారాపాతం".
ఏంటో ఈ కవిత అంతా నెత్తుటి మయం. అసలు నా మట్టి బుర్రకి ఈ కవితలు ఈ జన్మలో ఎక్కవేమో!

ఎక్కువమంది సోదరులున్న మగవారికి కొడుకులు ఎక్కువమంది, ఎక్కువమంది సోదరీమణులు ఉన్నవారికి కూతుళ్లు ఎక్కువమంది పుడతారంట. మరి సరి సమానంగా ఉంటేనో!!అసలు దీనికంతా కారణం ఓ జన్యువు (gene) అట. MM అనే రకం జన్యువుని కలిగి ఉన్న పురుషుల్లో మగ సంతానం ఎక్కువగానూ, MF జన్యువు ఉన్న వారిలో కుమార్తెలు, కుమారులు సమానంగానూ, ఇక FF జన్యువు ఉన్న వారికి కుమార్తెలు ఎక్కువగానూ పుట్టే అవకాశం వుందట.

అన్నట్లు చిన్నప్పుడు బొమ్మరిల్లు కట్టారా? బొమ్మల పెళ్ళిళ్ళు చేసారా? చిన్ని చిన్ని బొమ్మలకి చీర, పంచె కట్టి, లక్క పిడతల్లో ఉత్తుత్తి వంటలు వండి--అబ్బోరాత్రి అయ్యాక కూడా వెన్నెల్లో ఆటలే ఆటలు. పండు వెన్నెల్లో నీడలాట, నేల-బండ ఆటలు ఆడుకున్నారా? అసలు పట్టణాల పిల్లలకి వెన్నెల అందం తెలుసా?

గూగులమ్మ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో ఒక్కో రాష్ట్రంలో ఐదేసి ఉత్తమ పంచాయితీలని ఎంపిక చేసి ఒక్కొక పంచాయితీకి ఐదు లక్షల రూపాయల చొప్పున బహుమతి ఇవ్వనుందట. మంచి పని గూగులమ్మా, కానీ అవి ఆ పంచాయితీల అభివృద్ధికే ఉపయోగపడేట్టు చూడమ్మా.

బరువు తగ్గాలనుకునే వారికి ఓ చిన్ని సలహా. మీ ఇంట్లో టేబులు, పళ్ళాలు, గ్లాసులు, గిన్నెలు అన్నీ నీలిరంగులొ వుండేట్టు కొనుక్కోండి. నీలిరంగులో ఆహారపదార్థాలు చేసుకోండి (ఆహారపదార్థాలు నీలిరంగులో ఉండాలంటే అవి ఉడికేటప్పుడు ఓ రెండు చుక్కలు నీలిమందు వేయండి). నీలిరంగు ఆకలిని తగ్గిస్తుందంట.

ఎం.బి.బి.ఎ‌స్ చేసి డాక్టరు అవ్వాలనుకున్న సానియా మీర్జా తమిళనాడులోని ఎం.జి.ఆర్ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పుచ్చుకుని ఆ కోరిక తీర్చుకుంది. డాక్టరేట్లు రావటం ఇంత తేలికన్నమాట, ఇంకేం నేను కూడా త్వరలో డాక్టరేట్ పుచ్చుకుంటా, సానియాకి ఇవ్వంగా లేంది నాకెందుకివ్వరంట!

ఇక బాక్సింగు ప్రపంచ కప్పులో మన భారత బాక్సర్లు నలుగురు సెమీ ఫైనల్సుకి వెళ్లారు, అంటే నాలుగు పతకాలు ఖాయం అన్నమాట. బీజింగు ఒలంపిక్సులో క్వార్టరు ఫైనల్సుకి చేరిన జితేందర్ గుర్తున్నాడా! తనతోపాటు, అఖిల్, దినేష్, లక్రా సెమీ ఫైనల్సుకి చేరుకున్నారు.

మరిన్ని వక్కపలుకులు మరోసారి.......

Read more...

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP