పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

December 31, 2008

వీడ్కోళ్లు.....స్వాగతాలు.

వీడ్కోళ్లు...స్వాగతాలు...కమ్మటి జ్ఞాపకాలు...చేదు అనుభవాలు...

సంవత్సరం తరవాత మరలా మరో సంవత్సరం.....ఇలా పునారావృత్తం అవుతూనే ఉంటాయి. అదే నేను, అదే నీవు, అదే మనం, అదే లోకం, అదే బ్రతుకు....తేడా ఏమీ ఉండదు.

ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా వచ్చింది, వెళ్లిపోతుంది, మరో సంవత్సరం రాబోతుంది. ఇలా సంవత్సరాలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి, మరి ఎప్పుడూ జరిగే దానికి ఇలా వేడుకలు, హడావిడీలు ఎందుకో నాకర్థం కాదు. కొంతమంది అయితే ఈ రోజు గడిచిపోతే మరలా రాదేమో, అనుభవించాల్సింది అంతా ఇప్పుడే ఈ నిమిషమే అనుభవించాలి అన్నట్టు ఉంటారు. దానికోసం ఎంత డబ్బైనా తగలేస్తారు. మళ్లీ రోజు తిరిగిందంటే ఎవరి బ్రతుకు పోరాటం వారిది, అంతా మామూలు అయిపోతుంది.

కొంతమంది ప్రతి కొత్త సంవత్సరం రోజు కొన్ని నిర్దిష్ట ప్రణాళికలు, కొన్ని లక్ష్యాలు, కొన్నిresolutions పెట్టుకుంటుంటారు, మరి ఎంతమంది వాటిని నిర్విఘ్నంగా విజయవంతంగా ఆమలు పరుస్తారో నాకైతే తెలియదు. ఓ పద్దతి ప్రకారం నడిచే వాళ్లకి ఈ కొత్త సంవత్సర లక్ష్యాలు, resolutions అవసరమా అని నాకనిపిస్తుంది. అయినా అవి కొత్త సంవత్సరం రోజే ఎందుకు పెట్టుకోవాలో అన్నది నాకర్థం కాని ఓ కోటి రూపాయల ప్రశ్న!

ఒకప్పుడు కొత్త సంవత్సరం వస్తుందంటే ఓ పది రోజుల ముందు నుండి ఎంత హడావిడి పడిపోయేదాన్నో. గ్రీటింగు కార్డులు చేయటం, పంపించటం, అదే సమయంలో సంక్రాంతి ముగ్గులు--పగలంతా గ్ర్రీటింగ్ కార్డ్సు చేసే పని రాత్రి ముగ్గులు వేసే పని, అబ్బో క్షణం తీరిక ఉండేది కాదు. ఇప్పుడు అసలు ఈ శుభాకాంక్షలు అవీ ఎందుకన్న ఓ నిరాసక్తి. మరో సంవత్సరం వస్తుంది, అది మామూలే కదా, దానికి ఇంత హడావిడి అవసరమా అన్న ఓ నిర్వేదం. వయస్సు ప్రభావం కావచ్చు. ఓ సంవత్సరం గడిచిపోయిందంటే మనకీ ఓ సంవత్సరం దగ్గర పడ్డట్టేగా! దాన్ని ఎలుగెత్తి చెప్పాటానికేనా ఈ ఉత్సవాలు, ఈ సంబరాలు? అయినా ఏం సాధించామని ప్రతి సంవత్సరం ఈ సంబరాలు, ఉత్సవాలు అనిపిస్తుంది.

ఒక్కొకసారి రోజులు ఇంత త్వరగా ఎందుకు గడుస్తాయా అనిపిస్తుంది. నా కళ్లముందే నన్ను మించి (శారీరకంగా, మానసికంగా) నా పిల్లలు పెరిగిపోతుంటే అదొక అబ్బురంగా ఆనిపిస్తుంది. నా పొత్తిళ్లలో ఆడుకున్నది వీరేనా అని అనిపిస్తుంది. చిట్టి చిట్టి చేతులతో అమ్మ పొట్టని తడుముతూ కాస్త ఎడం అయితే ఎక్కడికన్నా వెళ్లిపోతుందేమో అన్నట్టు కాళ్లూ చేతులతో పెనవేసుకుని పడుకున్న పిల్లలు వీళ్లేనా అనిపిస్తుంది. అంత అబ్బురంలో కూడా ఏ మూలో కించిత్తు బాధ----ఇంకొన్నేళ్లు పోతే వాళ్లెక్కడో నేనెక్కడో కదా అని అనిపిస్తుంది.

కాలం ఇలా ఆగిపోనీ.......
కాలం ఇలా ఇక్కడే ఈ నిమిషం ఫ్రీజ్ అయిపోతే....ఎంత బాగుంటుందో కదూ!

ఊగిసలాడకే మనసా నువ్వు ఉబలాట పడకే మనసా ...!

http://etelugu.org/typing-telugu

7 వ్యాఖ్యలు:

చిలమకూరు విజయమోహన్ December 31, 2008 at 3:21 PM  

మీకు నా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు

మేధ December 31, 2008 at 5:23 PM  

నూతన సంవత్సర శుభాకాంక్షలు.. ఈ సంవత్సరమంతా శుభం చేకూరాలని కోరుకుంటూ...

Kolluri Soma Sankar December 31, 2008 at 5:24 PM  

మా పాపకి మొన్న 24వ తేదీతో మూడు వెళ్ళి నాలుగేళ్ళు వచ్చాయి. నా దగ్గరకి ఎక్కువగా రావడమే లేదు. ఎంత సేపూ ఆటలు, లేకపోతే వాళ్ళమ్మతో కబుర్లు....
నాకు మా పాప తొందరగా పెద్దదయిపోయిందేమోనని అనిపిస్తోంది. మీ పిల్లల పట్ల మీకు కలిగిన భావమే ఇప్పుడు నాక్కూడా మా శుభద పట్ల కలుగుతోంది.
మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

Bolloju Baba December 31, 2008 at 9:28 PM  

పిల్లలకోసం ఎంతో హడావిడిగా ఉంటున్నా, (గ్రీటింగుకార్డులు కొనటం, టీచర్లకు బొకెలు, ఫ్రూట్స్, రాత్రికి కేక్, హొటల్ నుంచి ఫామిలీ పాక్, కూల్డ్రింక్లూ)
ఎందుకో లోపల మీరు చెప్పిన భావాలు పీకుతూనే ఉన్నాయి.
hope we are all social beings and respond irrespective of our feelings sometimes. isnt it so?

వేణూశ్రీకాంత్ January 1, 2009 at 6:38 AM  

ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు..
మీరన్న ఆ అదే బ్రతుకు నుండి కాసింత ఆట విడుపు కోసం ఓ రోజు కేటాయిస్తే తప్పేముందండీ..
సంవత్సరమంతా మనసులో మాట్లాడలని ఉన్నా ఏవో పనుల వత్తిడి వల్ల కుదరని ఓ నేస్తానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పటమనే కారణం తో కాల్ చేసి ఓ అయిదు నిముషాలు కబుర్లు చెప్పుకోడం ఎంత హాయి !!
ఇక మీరన్నట్లు రోజులు త్వరగా గడవడం మాత్రం నిజం కళ్ళు మూసి తెరిచే లోగా మరో ఏడాది ఆవిరైపోతుంది.

Anonymous,  January 1, 2009 at 1:18 PM  

సిరి.మువ్వ గారూ అచ్చంగా మీలాగే అలోచించి నా అంతట నేనుగా ఎవరికీ ఫోన్ చేసి శుభాకంక్షలు చెప్పలేక పోయాను .

నేస్తం January 4, 2009 at 9:19 PM  

నూతన సంవత్సర శుభాకాంక్షలు..
muvva gaaru..

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP