పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

December 12, 2008

వక్క పలుకులు-1

ముంబయి దాడుల నేపధ్యంలో బ్లాగు లోకమంతా అలసిపోయినట్లుంది, కాస్త మద్యమద్యలో ఈ వక్కపలుకులు నోట్లో వేసుకోండి.

ఇవాళ మా మరిది గారబ్బాయికి అ.. ఆ ల పుస్తకం, చార్టు కొనటానికని మా కాలనీలో ఉన్న మూడు పుస్తకాల కొట్లు తిరిగా, ఎక్కడా దొరకలేదు. ఒక కొట్టామె అయితే అబ్బే ఇప్పుడు అవి ఎవరు అడుగుతున్నారండి ఇంగ్లీషు "A for apple" పుస్తకం ఉంది ఇవ్వనా అంది. ఇలా అయిపోయింది మన అ..ఆ ల పరిస్థితి. ఏంటో తెలుక్కి ప్రాచీన హోదా అంటే ఏంటో అనుకున్నా--ఇలా మెల్ల మెల్లగా అంతర్థానం అవటమన్న మాట. అందరికి ఓ సూచన--మీ ఇళ్లలో అ.. ఆ ల పుస్తకాలు కాని చార్టులు కాని ఉంటే భద్రపరుచుకోండి, కొన్నాళ్ల తరువాత వాటిని ఏ పురావస్తు ప్రదర్శనశాలలోనో పెట్టవచ్చు.


"
మనిషి రెండుగా చీలుతున్నప్పుడు కౌగిలించుకొని కొత్త నెత్తురు ఎక్కించేది-కవిత్వమొక్కటే".
ఈ వక్కపలుకు నాది కాదండోయ్. ఇవాళ ఓ పుస్తకంలో చదివిన కవితలోని వ్యాక్యం. దాంట్లోదే ఇంకొక వ్యాక్యం చూడండి.

"కవిత్వం, కాదు స్టేటస్ సింబల్
పోటెత్తిన నెత్తుటి ధారాపాతం".
ఏంటో ఈ కవిత అంతా నెత్తుటి మయం. అసలు నా మట్టి బుర్రకి ఈ కవితలు ఈ జన్మలో ఎక్కవేమో!

ఎక్కువమంది సోదరులున్న మగవారికి కొడుకులు ఎక్కువమంది, ఎక్కువమంది సోదరీమణులు ఉన్నవారికి కూతుళ్లు ఎక్కువమంది పుడతారంట. మరి సరి సమానంగా ఉంటేనో!!అసలు దీనికంతా కారణం ఓ జన్యువు (gene) అట. MM అనే రకం జన్యువుని కలిగి ఉన్న పురుషుల్లో మగ సంతానం ఎక్కువగానూ, MF జన్యువు ఉన్న వారిలో కుమార్తెలు, కుమారులు సమానంగానూ, ఇక FF జన్యువు ఉన్న వారికి కుమార్తెలు ఎక్కువగానూ పుట్టే అవకాశం వుందట.

అన్నట్లు చిన్నప్పుడు బొమ్మరిల్లు కట్టారా? బొమ్మల పెళ్ళిళ్ళు చేసారా? చిన్ని చిన్ని బొమ్మలకి చీర, పంచె కట్టి, లక్క పిడతల్లో ఉత్తుత్తి వంటలు వండి--అబ్బోరాత్రి అయ్యాక కూడా వెన్నెల్లో ఆటలే ఆటలు. పండు వెన్నెల్లో నీడలాట, నేల-బండ ఆటలు ఆడుకున్నారా? అసలు పట్టణాల పిల్లలకి వెన్నెల అందం తెలుసా?

గూగులమ్మ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో ఒక్కో రాష్ట్రంలో ఐదేసి ఉత్తమ పంచాయితీలని ఎంపిక చేసి ఒక్కొక పంచాయితీకి ఐదు లక్షల రూపాయల చొప్పున బహుమతి ఇవ్వనుందట. మంచి పని గూగులమ్మా, కానీ అవి ఆ పంచాయితీల అభివృద్ధికే ఉపయోగపడేట్టు చూడమ్మా.

బరువు తగ్గాలనుకునే వారికి ఓ చిన్ని సలహా. మీ ఇంట్లో టేబులు, పళ్ళాలు, గ్లాసులు, గిన్నెలు అన్నీ నీలిరంగులొ వుండేట్టు కొనుక్కోండి. నీలిరంగులో ఆహారపదార్థాలు చేసుకోండి (ఆహారపదార్థాలు నీలిరంగులో ఉండాలంటే అవి ఉడికేటప్పుడు ఓ రెండు చుక్కలు నీలిమందు వేయండి). నీలిరంగు ఆకలిని తగ్గిస్తుందంట.

ఎం.బి.బి.ఎ‌స్ చేసి డాక్టరు అవ్వాలనుకున్న సానియా మీర్జా తమిళనాడులోని ఎం.జి.ఆర్ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పుచ్చుకుని ఆ కోరిక తీర్చుకుంది. డాక్టరేట్లు రావటం ఇంత తేలికన్నమాట, ఇంకేం నేను కూడా త్వరలో డాక్టరేట్ పుచ్చుకుంటా, సానియాకి ఇవ్వంగా లేంది నాకెందుకివ్వరంట!

ఇక బాక్సింగు ప్రపంచ కప్పులో మన భారత బాక్సర్లు నలుగురు సెమీ ఫైనల్సుకి వెళ్లారు, అంటే నాలుగు పతకాలు ఖాయం అన్నమాట. బీజింగు ఒలంపిక్సులో క్వార్టరు ఫైనల్సుకి చేరిన జితేందర్ గుర్తున్నాడా! తనతోపాటు, అఖిల్, దినేష్, లక్రా సెమీ ఫైనల్సుకి చేరుకున్నారు.

మరిన్ని వక్కపలుకులు మరోసారి.......

0 వ్యాఖ్యలు:

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP