తెలుగులో పిల్లలు చదవదగ్గ పుస్తకాలు
ఏం చదవాలి?
అదే ఇంగ్లీషులో చూడండి పుంఖానుపుంఖానులుగా పుస్తకాలు వుంటాయి, అక్కడ ఏం తీసుకోవాలో అర్థం కాదు, ఇక్కడ తీసుకోవటానికి ఏమీ దొరకవు అన్నట్టు వుంటుంది పరిస్థితి. మొన్నటి హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో మా పిల్లలని ఈ సారి పుస్తకాలు మీరే వెతుక్కుని కొనుక్కోండి అని వదిలేస్తే అన్నీ ఇంగ్లీషు పుస్తకాలే కొనుక్కొచ్చారు, ఇదేంటర్రా అంటే మరి మాకు తెలుగులో ఏం కనపడలేదు అన్నారు. మేము ఇంగ్లీషు పుస్తకాలు పెద్దగా చదివిందీ లేదు వాళ్లకి చెప్పిందీ లేదు మరి వాళ్లకి ఇంగ్లీషువి దొరికినప్పుడు తెలుగువి ఎందుకు దొరకలేదు? తెలుగులో ఈ వయస్సు పిల్లలని దృష్టిలో పెట్టుకుని అసలు పుస్తకాలు వస్తున్నాయా? రాకపోతే ఎందుకు రావటం లేదు?
ఇక మొన్న ఏం దొరకక యండమూరి వెన్నెల్లో ఆడపిల్ల తీసుకున్నాను. ఇంటికి వచ్చాక మా అమ్మాయి అడిగింది ఏం తెచ్చావు అని, నాకేం కనిపించల అందుకని ఈ పుస్తకం తెచ్చాను అని చూపిస్తే ఇదా అని ఓ చూపు చూసి అవతల పడేసింది. నువ్వు ఆ మధ్య చదివిన చేతన్ భగత్ కంటే చాలా బాగా వ్రాస్తాడు చదువు అన్నా. అసలు మీరు చిన్నప్పుడు ఎలాంటి పుస్తకాలు చదివేవాళ్లు అంది----అవును అప్పుడు ఏం చదివేవాళ్లం?----ఒకసారి గతంలోకి తొంగి చూస్తే......
అప్పుడు కూడా ఈ వయస్సు పిల్లలకంటూ ప్రత్యేకంగా తెలుగు సాహిత్యం ఏమీ వుండేది కాదు. మా ఇంటికి అన్ని వార, మాస పత్రికలు వచ్చేవి. దాదాపు ఆరు ఏడు తరగతుల నుండే ఈ పత్రికలు చదివేవాళ్లం. అందులో వచ్చే సీరియల్సు అన్నీ మా నాన్న చింపి పుస్తకాలు కుట్టేవారు. ఎండాకాలం సెలవులలో అవన్నీ చదవటం మంచి కాలక్షేపంగా వుండేది. అవి కాక మా పక్క ఊరిలో మంచి గ్రంధాలయం వుండేది, అందులో అప్పట్లో వచ్చిన నవలలన్నీ దొరికేవి, మేము హైస్కూలు ఆ ఊరిలొనే చదివాం కాబట్టి స్కూలు నుండి వస్తూ అవి తెచ్చుకునేవాళ్లం. ఇక మా బంధువులకి పుస్తకాలు అద్దెకిచ్చే షాపు ఉండేది, అక్కడ నుండి ప్రముఖుల కొత్త నవలలు, కొమ్మూరి సాంబశివరావు, షాడో మధు బాబుల డిటెక్టివ్ పుస్తకాలు తెచ్చుకుని ఎప్పటివప్పుడు చదివేసి తరువాతి పుస్తకం కోసం ఎదురు చూస్తుండేవాళ్లం. కొమ్మూరి సాంబశివరావుది అయితే నెలకొక పుస్తకం విడుదలవుతుండేదని గుర్తు. గిరిజశ్రీ భగవాన్‌వి కూడా బాగానే చదివేవాళ్లం. అప్పట్లో డిటెక్టివ్ నవలలు పెద్దలు పిన్నలు అందరూ విపరీతంగా చదివేవాళ్లు.
యద్దనపూడి, మాదిరెడ్డి, యండమూరి, మల్లాది, చల్లా సుబ్రమణ్యం, చందు సోంబాబు, యర్రంశెట్టి, కొమ్మనాపల్లి, కోగంటి విజయలక్ష్మి, జొన్నలగడ్డ లలితాదేవి, పోలాప్రగడ, వాసిరెడ్డి, తురగా (మోచర్ల) జయశ్యామల, తురగా జానకీరాణి, అరెకపూడి (కోడూరి) కౌసల్యా దేవి (ఈవిడ నవలల పేర్లలో ఎక్కువగా చక్రం వుంటుండేది!), లల్లాదేవి, తోటకూర ఆశాలత, లత, రంగనాయకమ్మ, డి. కామేశ్వరి, బీనా దేవి, రావినూతల సువర్నాకన్నన్, వడ్డెర చండీదాస్......అబ్బో లెక్కలేనంతమంది......అందరి పుస్తకాలు నమిలేసేవాళ్లం. ఇందులో ఎన్ని గుర్తున్నాయి అని మాత్రం అడగకండి! ఏ పుస్తకం కొని చదివిన పాపాన మాత్రం పోలేదు. ఇక ఇప్పుడు పుస్తకాలు అద్దెకిచ్చే షాపులూ లేవు, మా చుట్టాల కొట్టూ లేదు....ఏం చేస్తాం....ఓ పదేళ్ల నుండి పుస్తకాలు కొనే చదువుతున్నాం లేండి!
కథలు, సీరియళ్లే కాదు అప్పట్లో శ్రీశ్రీ ప్రశ్న-జవాబు(ప్రజ), మాలతీచందూర్ ప్రమదావనం, రామలక్ష్మి ప్రశ్నలు-జవాబులు, పురాణం సీత ఇల్లాలి ముచ్చట్లు ఇత్యాదివి చాలా ఆసక్తికరంగా వుండేవి. అచ్చంగా వీటికోసమే పత్రికలు చదివేవాళ్లు వుండేవారు. వారపత్రికలే కాకుండా వనిత, వనితాజ్యోతి, మహిళ, యువ, జ్యోతి లాంటి మాసపత్రికలు కూడా అందుబాటులో వుండేవి. ఏవో ఒకటీ అరా తప్పితే ఈ పత్రికల స్థాయి కూడా బాగుండేది, వాటిమధ్య ఒక ఆరోగ్యకరమైన పోటీ వుండేది. 70-80లలో తెలుగులో రచయిత్రుల హవా బాగా నడిచిందని చెప్పవచ్చు.అందుకే ఆకాలంలో ఆడపేర్లు పెట్టుకుని వ్రాసే మగవారు ఎక్కువగా వుండేవారు.
ఇక అసలు విషయానికి వస్తే అప్పట్లో దొరికింది ఏదైనా చదివేవాళ్లం కాబట్టి పిల్లలకంటూ ప్రత్యేకంగా పుస్తకాలు లేకపోయినా ఆ లోటు తెలియలేదేమో! అప్పటి ఆ పుస్తకాలు ఇప్పటి పిల్లలకి అంత ఆసక్తికరంగా ఎందుకు వుండటం లేదు? వాళ్ల అభిరుచులకు తగ్గట్టు తెలుగులో పుస్తకాలు ఎందుకు రావటం లేదు? నచ్చకపోవటానికి ముఖ్యమైన కారణాలు ఏమిటి? ఇంగ్లీషు మాధ్యమంలోని చదువుల ప్రభావమా! తెలుగులో పుస్తకాలు చదివే వాళ్లు (పిల్లలు మరియు పెద్దలు) తగ్గిపోవటమా! ఇంగ్లీషు సాహిత్యం ప్రభావమా! టి.వీ.లు, కంప్యూటర్ల మహిమా! తోటి పిల్లల ప్రభావమా! తోటి పిల్లల ప్రభావం అని ఎందుకంటున్నానంటే మేమా పుస్తకం చదివాం ఈ పుస్తకం చదివాం అంటూ పిల్లల మధ్య చర్చలు జరుగుతుంటాయి, అందులో తెలుగు పుస్తకాల గురించి చర్చ వస్తే ఆశ్చర్యపడాల్సిందే. ఒకవేళ ఎవరైనా తెలుగు పుస్తకాలు చదివే పిల్లలు ఉన్నా వాటి గురించి మాట్లాడటం తక్కువతనం అనుకునే రోజులు ఇవి. అసలు ఇప్పుడు ఈ వయస్సు పిల్లలని దృష్టిలో పెట్టుకుని ఎవరైనా రచనలు చేస్తున్నారా?ఒకవేళ రచనలు చేసేవాళ్లు ఉన్నా చదివేవాళ్లు ఉన్నారా? ఏంటో ఈ టపా అంతా ప్రశ్నలమయమే అనుకుంటున్నారా?
చివరిగా ఇంకొక్కటే ఒక్క ప్రశ్న!అసలు ఈ వయస్సు పిల్లలు చదవతగ్గ పుస్తకాలు తెలుగులో ఏం ఉన్నాయి? తెలిసిన పెద్దలు చెప్పగలరు. చదివే అభిరుచి ఉండాలే కాని ఏవైనా చదవ్వొచ్చు అంటారా!