పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

June 6, 2009

నా ఉపవాస దీక్ష

మన తెలుగు వారికి చాలా మందికి రెండు పూటలా సుష్టుగా భోజనం చేయకపోతే ఏదో వెలితిగా వుంటుంది, అందులో నేను కూడా ఒకదాన్ని (ఇంతకు ముందు ముచ్చటగా మూడుపూటలా భోంచేసేవాళ్లం  లేండి, అది వేరే విషయం). ఈ మధ్య కొంతమంది డైటింగు పేరుతో రాత్రి పూట తినకపోవటమో లేకపోతే ఓ రెండు పుల్కా ముక్కలు తినో లేదా ఓ గ్లాసుడు మజ్జిగ తాగో పడుకోవటం చేస్తున్నారు. కొంతమందికి రాత్రి పూట పుల్కాలు తిన్నా ఓ గుప్పెడన్నా పెరుగన్నం తినకపోతే నిద్ర పట్టదు, అంతగా మన పొట్ట అలవాటు పడిపోయింది అన్నానికి. నాలాంటి కొంతమందికయితే ఎప్పుడైనా ఓ పూట ఏదైనా కారణం చేత అన్నం తినకపోతే ఎంత దిగులుగా ఉంటుందో!

లంఖణం పరమౌషధం అంటారు. ఏదో రోగం వచ్చినప్పుడే కాకుండా మామూలుగా కూడా అప్పుడప్పుడు పొట్టను మాడ్చుకునే వాళ్లు ఉంటారు, దాన్నే ఉపవాసం అంటారు. ఈ ఉపవాసం కొంతమంది దేవుడి పేరుతో చేస్తే మరికొంతమంది డైటింగు పేరుతో చేస్తుంటారు. ఈ డైటింగుల్లో మరలా చాలా రకాలు-అందులో రకరకాల డైటులు, వాటి గురించి ఇంకోసారి చూద్దాం.

నేనయితే ఇప్పటివరకు ఎప్పుడూ దేవుడి పేరుతో కాని డైటింగు పేరుతో కాని ఉపవాసం ఉండలేదు. ఎప్పుడైనా ఆకలి అనిపించకపోతే ఓ పూట తినకుండా వుండటమే తెలుసు. అలాంటిది ఈ మధ్య ఊరికినే కూర్చుంటే ఓ మహత్తరమైన ఆలోచన వచ్చింది. వారంలో ఓ రోజు కఠిక ఉపవాసం చేసి పొట్టకి కాస్తంత విశ్రాంతి ఇద్దామని. కఠిక ఉపవాసం అంటే మరీ పచ్చి మంచినీళ్లు కూడా తాగకుండా అని కాదు కాని రోజంతా ఒట్టి మంచినీళ్లు తాగి ఉందాం అనుకున్నా. ఈ ఉపవాసం ఒంట్లో కొవ్వు తగ్గించుకోవటానికో ఒంటి బరువు తగ్గించుకోవటానికో కాదు ఏదో కాస్త ఆరోగ్యం కోసమే సుమీ!

సరే ఆలోచన వచ్చిందే తడవు ఇక ఆలస్యం ఎందుకని మొన్నో శనివారం ఉపవాసం ఉండాలని నిశ్చయించుకున్నా! శుక్రవారం పడుకునే ముందు ఘాట్టిగా నిర్ణయించుకున్నా రేపు మంచినీళ్లు తప్పితే ఏమీ తాగకూడదు తినకూడదు అని.  శనివారం పొద్దున్నే యధావిధిగా లేచి నా నిర్ణయాన్ని ఒకసారి సమీక్షించుకున్నా. మరీ ఒట్టి మంచినీళ్లు కాదులే మంచినీళ్లతో పాటు పళ్ల రసాలు, మజ్జిగ  (ద్రవపదార్థాలు) తీసుకోవచ్చు అని నా నిర్ణయానికి కాస్తంత వెసులుబాటు ఇచ్చుకున్నా.

లేవగానే కాస్తంత తేనె నిమ్మకాయ నీళ్లు తాగా, ఏడు గంటలకి కూరగాయల రసం తాగా.  ఎనిమిది అయ్యేటప్పటికి ఠంఘున గడియారం గంట కొట్టినట్టు పొట్టలో ఉపాహార గంట మొదలయ్యింది.  అందులోనూ ఆ రోజు ఉపాహారం పావ్ భాజి.  ఇవ్వళ్టికి ఉపవాస దీక్ష విరమించుకుని ఇంకో రోజు ఎప్పుడైనా పెట్టుకుందామా అని ఓ నిమిషం ఊగిసలాడా.  చ ఒక్క రోజు ఆకలికి ఆగలేనా అని మనసుని ఘాట్టిగా రాయి చేసుకుని తొమ్మిందింటి దాకా ఉపాహార గంట వినపడనట్టే ఉన్నా, ఇక ఆ తరువాత నా వల్ల కాలేదు, ఓ అరడజను కమలాలు గబాగబా రసం తీసుకుని తాగేసా!

పనిలో పడితే ఆకలి తెలియదంటారు కాని అంతా ఒట్టిదే-దేని దారి దానిదే. పదకొండింటికి మరలా పొట్టలో పేగుల అలజడి మొదలయ్యింది. ఒక్క రోజుకి మీరింత హడావిడీ చేయాలా అని వాటిని కాస్త కసిరా, అబ్బే నా మాట వింటేగా వాటి గొడవ వాటిదే! నేనేదో వాటికి రోజుల తరబడి తిండి పెట్టకుండా మాడ్చేస్తున్నట్టు ఒకటే గొడవ గొడవ! పొట్టలో ఎలుకలు పరిగెత్తటం అంటే ఏంటో తెలిసివచ్చింది. 12:30 కి కాస్తంత మజ్జిగతో వాటిని శాంతపరిచా. రెండయింది-నా ఆకలి రెట్టింపయ్యింది-మరోసారి నా నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాల్సి వచ్చింది. మంచి నీళ్లు ద్రవ పదార్థాలతో పాటు కాసిన్ని పళ్లు కూడా తీసుకోవచ్చు అని నా కఠోర నిర్ణయానికి ఇంకో సవరణ ఇచ్చుకుని ఓ పెద్ద అరటిపండు లాగించా!

ఇలా లాభం లేదని ఓ పుస్తకం పట్టుకుని కూర్చున్నా అలా అన్నా ఆకలి తెలియకుండా వుంటుందని (పుస్తకం పట్టుకు కూర్చుంటే నీకు నిద్రాహారాలు గుర్తు రావని ఎప్పుడో కాలం నాడు మా అమ్మ అన్న గుర్తు :). ఆ పుస్తకం వట్టికోట ఆళ్వారు స్వామి వ్రాసిన 'ప్రజల మనిషి'.  ఓ ఇరవై పేజీలు చదివా కానీ ఏం చదువుతున్నానో బుర్రకి ఎక్కడంల, అసలు పుస్తకం పేరే మర్చిపోయా!. సరే నిద్ర అన్నా పోదామని ప్రయత్నించా---ఆ నిద్రా రాదే. రోజూ అయితే హాయిగా అన్నం తినగానే ఓ పుస్తకం పట్టుకుని మంచం ఎక్కితే నా ప్రయత్నం లేకుండానే కనురెప్పలు మూతలు పడిపోతాయి, అలాంటిది ఆ రోజు మాత్రం ఎంతకీ మూతపడనన్నాయి. సరే అని లేచి కాసేపు టి.వి. ముందు కూర్చున్నా అలా అన్నా నిద్రపోవచ్చని (మామూలుగా నేను టి.వి. ముందు కూర్చుంటే కూర్చున్నపళంగా నిద్రపోతా అది ఏ సమయం అయినా సరే, అప్పుడే నిద్ర లేచినా సరే!), ఊహు నిద్ర రానంటే రానంది. పొట్ట నిండుగా ఉంటే మత్తుగా నిద్రొస్తుంది కాని ఖాళీగా వుంటే ఆవలింతలు కూడా రావన్నమాట అనుకున్నా!

ఈ లోగా టైం నాలుగయింది. ఆకలి కేకలు వేస్తుంది. సరే ఎటూ పళ్లు తినొచ్చు కదా అని ఓ నాలుగంటే నాలుగు పెద్ద పెద్ద బొప్పాయి ముక్కలు తిన్నా. హమ్మయ్య కాస్త పొట్ట శాంతించింది. ఇక ఇలా అయితే రాత్రికి కూడ  నిద్ర రాదు నిద్ర పోను అనుకుని నా ఉపవాస నిర్ణయాన్ని మరోసారి పునః పునః సమీక్షించుకుని రోజంతా ఉపవాసం కాదు ఒక్క పొద్దు ఉపవాసం ఉంటే చాలు అని గడియారం ఏడు గంటలు కొట్టగానే నాలుగు పుల్కాలు చేసుకుని వేడి వేడిగా తినేసి నా ఉపవాస దీక్షని విజయవంతంగా ముగించా.

ఇదేంటబ్బా ఎప్పుడన్నా శనివారం రాత్రిపూట పుల్కాలు చేయమంటే ఆరు శనివారాలు అడిగించుకుని ఏడో శనివారం కాని చేయని అమ్మ ఇవాళ అడగకుండానే పుల్కాలు చేసింది అని మా పిల్లలు ముక్కు మీద వేలేసుకున్నారులేండి అది వేరే విషయం.

Read more...

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP