December 31, 2010
ఆదివారం ఆడవాళ్ళకు సెలవు
సరే భోజనానికి ఏం చేస్తున్నారు అని అడిగా. అలోచిద్దాము అని అప్పటికి తప్పించుకుని వెళ్ళి మరలా కంప్యూటర్ మీద కూర్చున్నారు. నేను కూడ ఈనాడు ఆదివారం పుస్తకం పట్టుకుని మంచం ఎక్కా అహా ఏమి నా భాగ్యము అనుకుంటూ.
11 గంటలయ్యక అనుకుంటా మా పాప వెళ్ళి నాన్నా ఈ రోజు మనదే వంట పని అని గుర్తుచేసింది. లేదురా నాన్నా ఈ రోజు నాకు కంప్యూటర్ మీద చాలా పని వుంది (ఇంకేం పని, వికీ పని లేకపొతే బ్లాగుల పని) అందుకని బయటినుండి కూరలు తెచ్చేసుకుందాము,నువ్వు బియ్యం కడిగి పెట్టేయి అని ఒక అల్టిమేటం పడేసారు తనకి. లేచి వంట చేద్ద్దామా అనిపించింది ఒక నిమిషం,అమ్మో చేస్తే అసలకే లోకువవుతాము అని ఆ ప్రయత్నం విరమించా.
భోజనాల టైంకి వెళ్ళి కూరలు తెచ్చేసారు, అది కూడా నాలుగు రకాలు,(ఏం నువ్వు చేయకపొతే మాకేం అన్నట్లు ఒక చూపు విసిరి).
ఒక్క కూర కూడా నోట్లో పెట్టుకోను పనికి రాలా. మా వాడు అయితే పాపం వట్టి పెరుగన్నమే తిని సరిపెట్టుకున్నాడు. ఒకటేమో యమా కారం,ఒక దానిలో ఉప్పు లేదు,గుత్తొంకాయ అంట ఏదో పలచగా రసం లాంటి దానిలో నాలుగు వంకాయలు పడేసినట్లుంది. కొద్దిగా సాంబారే నయం అనిపించింది. పిల్లలిని చూస్తే అయ్యొ అనిపించింది. శుభ్రంగా పప్పు పచ్చడితో తిన్నా బాగుండేది, ఈయనని నమ్ముకుంటే ఇంతే అని మనసులోనే అనుకుని ఏదో తిన్నామనిపించాము. సాయంత్రం మన ముగ్గురం కలిసి ఎంచక్కగా వండేద్దాము అని ముగ్గురు కలిసి ఒక భయంకర తీర్మానం కూడా చేసేసుకున్నారు.
సాయంత్రం అయింది. ఇక వంట మొదలుపెడతారు కాబోలు అని చూస్తున్నాను, ఏమైనా సలహాలు అడిగితే పడేద్దాము అని. ఎబ్బే! ఏం కదలిక లేదు. కంప్యూటర్ మీద కొట్టుకుంటూనే వున్నారు. నాకెందుకని నేను కూడా మెదలకుండా టి.వి లో వచ్చిన ప్రతి సినిమా చూస్తూ పడుకున్నాను. తీరిగ్గా రాత్రి 8 అయ్యాక పదండి బయటికి వెళ్ళి భోంచేసి వద్దాము అని బయలుదేరదీసారు. ఆ హోటలు భోజనం అంతకన్నా దరిద్రంగా వుంది. అన్ని మంట, పైగా ఎ.సి సరిగ్గా లేదు, బిల్లు మాత్రం వాయించాడు. పిల్లలు సూపూ ఐస్క్రీమూ తప్పితే ఏదీ సరిగ్గా తినలేదు. ఇక ఈ హోటలుకి రాకూడదు అనుకుంటూ బయటపడ్డాము. ఇంటికి వచ్చాక నేను మా వాడు కాస్తంత మజ్జిగ తాగి అమ్మయ్యా అనుకున్నాము. మొత్తానికి నిన్న ఆదివారం అంతా మా వారి పుణ్యమా అని సండే స్పెషల్సు సంగతి దేవుడెరుగు అందరం అర్థాకలితోనే పడుకోవాల్సి వచ్చింది. అప్పుడు అర్థమయ్యింది మన పెద్దవాళ్ళు ఆడవాళ్ళకి సెలవు ఎందుకు పెట్టలేదో!!!!! మీక్కూడా అర్థం అయ్యిందనుకుంటాను.
December 16, 2010
రండి రండి తరలి రండి రజతోత్సవ పుస్తక ప్రదర్శనకి .....
గత సంవత్సరపు తీపి గురుతులు మదిలో అలా అలా ఇంకా నిలిచి ఉండగానే హైదరాబాదు పుస్తక ప్రదర్శన మళ్లీ వచ్చేసింది. ఈ రోజు అంటే డిసెంబరు 16 నుండి డిసెంబరు 26 వరకు ఈ ప్రదర్శన ఉంటుంది. మిగతా పుస్తక ప్రియుల సంగతేమో కాని మన తెలుగు బ్లాగర్లకు మరియు e-తెలుగు సభ్యులకు మాత్రం ఇది నిజంగా ఓ పెద్ద పండగే! ఎప్పుడూ చూడని బ్లాగర్లని చూడవచ్చు....పరిచయం చేసుకోవచ్చు, కబుర్లాడుకోవచ్చు, మిరపకాయ బజ్జీలు తినవచ్చు..కాసేపు e-తెలుగు స్టాలులో నిలబడి ఎంతో మంది ప్రముఖులని కలుసుకోవచ్చు..వారితో మాటామంతీ ఆడవచ్చు..కొండొకచో వారితో బ్లాగులూ మొదలుపెట్టించవచ్చు!!
ఈ సంవత్సరం 250 అంగళ్లట! మరి అందరూ కొనాల్సిన పుస్తకాల చిట్టాతో తయారుగా ఉన్నారా !
అంతే కాదండోయ్ ఇది 25వ పుస్తక ప్రదర్శన. ఈ సందర్భంగా 19వ తేదీ అంటే వచ్చే ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు పుస్తక ప్రియులు చేసే పాదయాత్ర ఉంటుంది. పోయిన సంవత్సరం ఎక్కువగా మన e-తెలుగు సభ్యులు మరియు తెలుగు బ్లాగర్లే ఈ నడక కార్యక్రమంలో పాల్గొన్నారు, మరి ఈ సంవత్సరం కూడా e-తెలుగు సభ్యులు, తెలుగు బ్లాగర్లు మరింత ఉత్సాహంతో మరింతమంది ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుందాం.
అలాగే డిసెంబరు 26 అంటే ఆ పై ఆదివారం అన్ని రంగాలనుండి ఓ 25 మంది ప్రముఖులకు సన్మాన కార్యక్రమం ఉంటుంది.
ఎప్పటిలాగే e-తెలుగు వారు పెట్టే స్టాలుతో పాటు ఈ సారి ఇంకో కొత్త స్టాలు కూడా రాబోతుంది..అదీ మన తెలుగు బ్లాగర్లు పెట్టబోతుందే....మరి అదేంటో దాని కథాకమామిషూ ఏమిటో తెలియాలంటే మరి మీరూ పుస్తక ప్రదర్శనకు రావల్సిందే!
ఇంకొక విషయం అండోయ్.. ప్రముఖ బ్లాగరు మరియూ ప్రముఖ రచయిత్రి నిడదవోలు మాలతి గారు వ్రాసిన "చాతక పక్షులు" సీరియల్ దాదాపు బ్లాగర్లందరూ చదివే ఉంటారు..అది ఇప్పుడు ఎమెస్కో వాళ్ళు పుస్తకంగా తీసుకు వచ్చారు. అది కూడా పుస్తక ప్రదర్శనలో ఎమెస్కో వారి అంగటిలో లభ్యమవుతుంది..వెల 60 రూపాయలు మాత్రమే! మరి మీ కొనాల్సిన పుస్తకాల చిట్టాలో ఇంకో పుస్తకం జత చేసుకోవచ్చన్నమాట!
చివరగా ఓ విన్నపం....ఆసక్తి ఉన్నవాళ్ళు మీ విలువైన సమయాన్ని కొంత e-తెలుగు స్టాలులో వలంటీరుగా ఉండేందుకు వెచ్చించగలరేమో అలోచించండి!
తెలుగు పుస్తకాలు చదవండి, చదివించండి
December 6, 2010
ఇంటినుండి పని-ఎంత సౌఖ్యం
కానీ ఈ మధ్య కొంతమంది, ముఖ్యంగా ఆడవారు, ఈ ఇంటినుండి పని పట్ల విముఖత చూపిస్తున్నారని ఓ స్టడీలో వెల్లడయింది. దానికి వారు చెప్పిన ప్రధాన కారణాలు
1. మేము సోషలు లైఫు మిస్సు అవుతున్నాం. ఇంట్లో నుండి పని చెయ్యటం వల్ల వ్యక్తిగతంగా మాకంటూ ఓ జీవితం లేకుండా అంతా మెకానికల్ అయిపోయింది అనిపిస్తుంది. ఇంట్లో కుటుంబసభ్యులతో చెప్పుకోలేని కొన్ని సమస్యలను ఆఫీసులో స్నేహితులతో చెప్పి ఊరట చెందేవాళ్లం. ఇప్పుడు ఆ అవకాశం లేదు. ఆఫీసులో జరిగే బాతాఖానీలు ...పార్టీలు..మనస్సుకి కాస్త రిలాక్సేషను ఇచ్చేవి. ఇప్పుడు అవేవి లేవు. ఇలాంటి వాటిని బాగా మిస్సు అవుతున్నాం.
2. పిల్లలతో మిగతా కుటుంబసభ్యులతో సమయం గడపగలుగుతున్నాం కానీ...దాని మూలాన మా మీద మామూలు కన్నా వత్తిడి ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇంట్లోనే ఉంటున్నాం కదా అని అందరూ మా మీద మరీ ఎక్కువగా ఆధారపడుతున్నారేమో అనిపిస్తుంది. ఇంతకుముందు ఆఫీసుకి వెళ్లేటప్పుడు నాకు పనిలో సహాయం చేసినా చెయ్యకపోయినా ఎవరి పనులు వాళ్లు చేసుకునే వాళ్లు. కానీ ఇప్పుడు అన్నిటికి నా మీదే ఆధారపడుతున్నారు. అన్నీ ఎదురెదురు అందివ్వాల్సి వస్తుంది . ఈ వత్తిడి నా ఉద్యోగ విధుల మీద కూడా ప్రభావం చూపిస్తుంది.
3. ఇక అనుకోకుండా వచ్చే అతిధులతో వచ్చే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.
వీటన్నిటితో మా పని మేము ఇదివరకటి అంత శ్రద్దగా...అంకితభవంతో చెయ్యలేకపోతున్నాం. వృత్తి జీవితంలో అనుకున్నంత ముందుకు కూడా వెళ్లలేకపోతున్నాం..కొన్నిటిని వదులుకోవాల్సి వస్తుంది.
ఈ ఇంటినుండి పని తప్పక చెయ్యటమే కానీ మాకు నచ్చి చెయ్యటం కాదు. కొన్ని సౌలభ్యాలు కూడా ఉన్నాయి కానీ మాకు కలిగే అసంతృప్తితో పోల్చుకుంటే ఆఫీసుకెళ్లి పనిచేసుకోవటమే ఉత్తమం అనిపిస్తుంది. పిల్లలు పెద్దవ్వగానే మరలా ఆఫీసునుండే పని చేస్తాం.......ఇవీ స్థూలంగా వాళ్లు చెప్పిన కారణాలు.
నేనూ గత ఐదు సంవత్సరాలుగా ఇంటినుండే పని చేస్తున్నా కానీ నాకు ఇలా అనిపించలేదు..కొన్ని అనిపించినా అవి మనం ప్లాన్ చేసుకోవటంలో మిగతా కుటుంబసభ్యులకి అర్థం అయ్యేటట్లు చెప్పుకోవటంలో ఉంటుంది . కొన్ని అసౌకర్యాలు ఉన్నా నాకు ఇంటినుండి పనే సౌఖ్యంగా ఉంది. దేంట్లో అయినా కొంత మంచి..కొంత చెడూ ఉంటాయి.
ఆఫీసు టైముకి ఓ రెండు మూడు గంటలు ముందు బయలుదేరి మన నగర ట్రాఫిక్కులో ఈదుకుంటూ ఆఫీసు చేరి..సాయంత్రం ఆఫీసు అయ్యాక ఓ రెండు మూడు గంటలకి ఉసూరుమంటూ ఇల్లు చేరటం..మళ్లీ ఇంట్లో పనులు..బాధ్యతలు.... దీనికన్నా హాయిగా ఇంట్లో ఉండి పనిచేసుకోవటంలో ఎంత ఆనందం ఉందో కదా! ఈ ఆనందం ముందు ఆఫీసుకి వెళ్తే వచ్చే ఎన్ని ఆనందాలయినా దిగదుడుపే!!
మనం పని చేసేది అమెరికా కంపెనీలకి..మరి వాటిల్లో మన పండగలకి పబ్బాలకి సెలవులుండవు...ఆ రోజుల్లో హడావుడిగా ఎనిమిదింటికల్లా అన్ని పనులు (ఆ రోజు పనమ్మాయి రాకపోతే అ పని కూడా) చేసుకుని ఆఫీసుకి
పరిగెత్తిన రోజులు ఎన్నో!! అదీ ఆఫీసు ఇంటికి దగ్గర కాబట్టి ఆఫీసు టైముకి ఇంటి దగ్గర బయలుదేరితే సరిపోయేది..అదే దూరం అయితే..అవన్నీ తలుచుకుంటే నాకయితే బాబోయ్ మళ్లీ ఆఫీసు గడపా తొక్కటమా అనిపిస్తుంది.
పిల్లలకి ఆరోగ్యం బాగోని రోజుల్లో అయితే ఇంకా నరకం. సెలవు పెట్టినా..ఆఫీసునుండి ఫోన్లు..మేడం ఒక్క గంట వచ్చి వెళ్లండి..మీరు చేసే డాక్టరు ఒకరి డిక్టేషను బాగా ఎక్కువ వచ్చింది మీరు కొన్ని ఫైల్సు అయినా చేసి వెళ్లండి..ఒక్క గంట వచ్చివెళ్లండి ప్లీజ్ అంటూ అభ్యర్థనలు.......కాదనలేం.. వెళ్లాలేం. ఇప్పుడయితే వాళ్ల పక్కన కూర్చుని వాళ్లని చూసుకుంటూ నా పని నేను చేసుకోవచ్చు.
ఒక్కోరోజు మన పని మనం పూర్తిచేసుకుని ఇక బయలుదేరదామనుకుంటుండగా..మేడం..
ఎప్పుడయినా అవసరానికి అర రోజు సెలవు పెడతామా..పేరుకే అర రోజు..పావు రోజు అవ్వగానే ఫోన్లు మొదలవుతాయి..మేడం ఎన్నింటికి వస్తారు..వస్తున్నారు కదా అంటూ..అనవసరంగా అర రోజు సెలవు పెట్టామే అనిపిస్తుంది. పాపం వాళ్ల తప్పు కూడా ఏమీ లేదులేండి. మా పనే అలాంటిది. ఏ రోజు వర్కు ఆ రోజు అయిపోవాలి. పెండింగు పెట్టటానికి ఉండదు.
ఓ రోజు ఊరెళ్లి వస్తున్నాను. ట్రెయిను లేటు..ట్రెయిను దిగి ఆటొలో ఇంటికి వస్తుండగా ఆఫీసు నుండు ఫోను..మాడం మీరెక్కడున్నారు అంటూ..దారిలో ఉన్నా ఇంటికెళ్ళి ఓ గంటలో వస్తా అంటూ ఉండగానే..మాడం..మాడం..డైరెక్టు
అన్ని ఉద్యోగాలకి ఈ సౌలభ్యం ఉండకపోవచ్చు కానీ ఉన్నవాళ్లయినా వినియోగించుకుంటే బాగుంటుంది. కాకపోతే సర్వసన్నద్దమై ఇంటినుండి పని మొదలుపెడితేనే ఉపయోగం. సిస్టం..దానిలో మన పనికి అవసరమయిన సాఫ్టువేరులు.....బ్రాడుబ్యాండు కనక్షను....పవర్ ప్రాబ్లం లేకుండా బ్యాకప్......ఇలా అవసరమయినవన్నీ సిద్దం చేసుకోవాలి కాబట్టి మొదట్లో కొద్దిగా డబ్బులు పెట్టుబడి కూడా పెట్టాల్సి ఉంటుంది.
ఇక ఇంట్లో నుండి పని చేస్తే ఉండే అసలు లాభం ఏంటో చెప్పనా....
ఆఫీసుకి వెళ్తే కట్టిన చీర కట్టకుండా కట్టుకెళ్లాలా:) ఆదివారం వచ్చిందంటే వీటన్నిటికీ గంజి....ఇస్త్రీలు..అదో పేద్ద పని!! ఆ చీరలకి మరి మ్యాచింగు బ్యాగులు....చెప్పులు....క్లిప్పులు
ఇక దీనిలో ఉండే కష్టాల గురించి మరోసారి .........