పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

February 1, 2010

స్నేహమా---ఇలా మూగవోయావెందుకమ్మా!


ఎందుకో ఈ మధ్య నా ముసాయిదా పత్రాలు తిరగేస్తుంటే ఎప్పుడో 2008 లో రాధిక గారి బ్లాగు గురించి నేను వ్రాసి పెట్టుకున్న ముసాయిదా కనపడింది.  ఇది అప్పుడే నా బ్లాగులో పెట్టవలసింది....కానీ అదే సమయంలో పొద్దులో తన కవితల గురించి మందారమాలతో మరుమల్లె ముచ్చట్లు అని జాన్ హైడు గారి వ్యాసం వచ్చింది. ఇక అంతటి గొప్ప వ్యాసం వచ్చాక నా పరిచయం ఎందుకులే అని నేను ఇక దీన్ని బ్లాగులో పెట్టలేదు. ఇప్పుడు పెట్టటం సబబే అని తన బ్లాగు గురించి కొత్త బ్లాగర్లకి తెలియాలన్న ఉద్దేశ్యంతో  పెడుతున్నాను.

కారణం ఏమయినప్పటికి..రాధిక వాణి ఇప్పుడంతగా వినపడటం లేదు. ఆవిడ తన బ్లాగులో కవిత వ్రాసి ఆరు నెలలవుతుంది. ఇతర బ్లాగుల్లో వ్యాఖ్యలు పెట్టటం కూడా బాగా తగ్గించేసారు. తన ఇంకొక బ్లాగు సంగతులులో మాత్రం తాజాగా జనవరి 26 న ఓ టపా వ్రాసారు.  అసలు సంగతులు..బ్లాగు తనదే అని తెలిసిన వాళ్ళు చాలా తక్కువ అనుకుంటాను.

సామాన్యంగా నేను కవితలు చదవను..మొదటిగా నేను కవితలు చదివింది రాధిక గారి బ్లాగులోనే.  తన గురించి వ్రాయలన్న ఉద్దేశ్యంతోనే నేను ఆవిడ కవితలు చదివాను. చదివాక తెలిసింది ఆవిడ కవితలు ఎంత సరళంగా ఉంటాయో! చిన్ని చిన్ని మాటల్లో తను చెప్పాలనుకుంది అందంగా చెప్పటంలో ఆవిడ నేర్పరి. రాధికా..ఇంకొక రెండు కవితలు వ్రాస్తే మీరు సెంచరీ కొడతారనుకుంటాను..ఆ సెంచరీ కోసమన్నా వ్రాయండి!

తన బ్లాగులోని తాజా కవిత "నా ఊరు". ఈ కవిత చదివి సొంత ఊరు గుర్తుకు రాని వాళ్లు ఎంతమంది ఉంటారు?

"నేనెళ్ళిపోయానన్న బాధేమో
ఊరి మధ్య రావిచెట్టు
ఆకురాల్చేసింది

తన అవసరం లేదనుకుందేమో
రచ్చబండ బీటలేసింది

గుడి మెట్టు,చెరువు గట్టు
నాకోసమే ఎదురుచూస్తున్నట్టున్నాయి

జామచెట్టుకేసిన ఊయల
కిర్రు చప్పుళ్ళ ఊసేలేదు

ఇక రాననుకున్నారో ఏమో
అయినవాళ్ళు కొందరు
చెప్పకుండానే దాటిపోయారు

ఇపుడా ఊరు
నా చరిత్రకి
శిధిల సాక్ష్యంగా మాత్రమే మిగిలింది

తిరిగి వెళ్ళకపోయినా బాగుండును
జ్ఞాపకాల్లో అయినా సజీవంగా వుండేది నా ఊరు"
 
***************************************


కవిత్వం రాయడం నాకు చేతకాదు,భాష మీద పెద్దగా పట్టు కూడా లేదు అంటూనే చక్కని కవితలతో, స్నేహపూర్వక వ్యాఖ్యలతో అందరిని అలరిస్తూ తెలుగు బ్లాగు లోకంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని, అభిమానులిని ఏర్పరుచుకుని "తోచిన భావాలకు తెలిసిన భాషలో మాటలు అల్లుకుని ఆనందించే సాధారణ పల్లెటూరు అమ్మాయిని" అంటూ వినమ్రంగా ఒదిగే ఉండే మన పక్కింటి అమ్మాయి, ఓ అసలు సిసలైన తెలుగింటి అమ్మాయి--- రాధిక.  తెలుగు బ్లాగులలో రాధిక వ్యాఖ్య లేని బ్లాగు ఉండదు అంటే అతిశయోక్తి కాదేమో!!

అక్షర దోషాలుంటే మన్నించండి అంటూ ఆగస్టు 2006 లో తన కవితల ద్వారా బ్లాగ్లోకం లోకి ప్రవేశించిన రాధిక త్వరలోనే అక్షర దోషాలను దిద్దుకోవటమే కాదు తనకంటూ ఒక ప్రత్యేక ఒరవడిని, శైలిని ఏర్పరుచుకున్నారు.

ఓ చల్లని సాయంత్రం తొలకరి జల్లులతో తడిసిన మట్టివాసన పీలుస్తూ, సన్నజాజి చెట్టు దగ్గర పడక కుర్చీలో కూర్చుని, వేడి వేడి పకోడీలు తింటూ, రేడియోలో ఇష్టమైన పాటలు వింటూ, యండమూరి పుస్తకం చదువుతుంటే ఎంత ఆహ్లాదంగా ఉంటుందో రాధిక కవితలు చదువుతున్నా అంత ఆహ్లాదంగా మనసుని సేద తీర్చేవిగా ఉంటాయి. భావుకత, బేలతనం, అమాయకత్వం, ఎడబాటు, ఎడబాటుతో వచ్చే అవేదన అన్నీ కలగలిపి ఉంటాయి తన కవితలలో. అభివ్యక్తీకరించడంలో ఒక కొత్తదనం ఉంటుంది తన కవితలలో. పంటపొలాలమధ్య పాటలా మా స్నేహం అంటూ ఎక్కువగా స్నేహం గురించి రాసే తను "నేస్తాలు సరదాగా ఇచ్చిన గడ్డిపరకలను కుడా అపురూపం గా దాచుకున్నదానిని" అంటూ స్నేహానికి తను ఇచ్చే విలువని చెప్పకనే చెప్పారు.

2006 ఆగస్టు లో మొదలుపెట్టి  ఇప్పటివరకు సుమారు 98 కవితలు రాసారు. ఈ మధ్య కాలంలో రాశి తగ్గినా వాసి ఏ మాత్రం తగ్గలేదు. తన కవితలకు చిత్రాలు ఓ అదనపు ఆకర్షణ. కవితలకు తగ్గ చక్కని ఫోటోలను జతచేస్తుంటారు.  లలిత లలితమైన పదాలతో తను చెప్పదలుచుకుంది క్లుప్తంగా అర్థవంతంగా చెప్పగలగటంలో నేర్పరి రాధిక. తన కవితలలో తాజాదనంతో పాటు వైవిధ్యానికీ ఏమి తక్కువ లేదు. "అలారం మోతలతో ఉలికిపాటు మెలకువలు" అంటూ ప్రస్తుత జీవనశైలిని ప్రతిబింబించే కవితలు కూడా రాసారు. కొన్ని కవితలలో పల్లెటూరి అమాయకత్వం మనల్ని పలకరిస్తే, మరి కొన్నిటిలో ఏదో పోగోట్టుకున్న అవేదన, నిస్పృహ, ఎడబాటు మన మనసులిని కదిలిస్తాయి. మన అనుభవాలని...మన మనస్సులోని భావాలను చెపుతున్నట్లు ఉంటాయి మరికొన్ని.

కవిత గురించి తన అభిప్రాయం తన మాటలలోనే చూడండి.
"మనసులోని భావాలు
మాటలుగా చెప్పలేని వేళ
అవి కలై … అలలై
అనుభూతుల తుఫానులు చెలరేగి
యెద తీరాన్ని తాకినప్పుడు
మది లోతుల్లో పలికేదే కవిత" తన కవితలలో ఎంత వైవిధ్యం ఉంటుందో ఒక్కసారి గమనించండి.

అమెరికాలో ఉన్నా తెలుగుదనాన్ని, చిన్ననాటి నేస్తాలని,సన్నజాజులిని మరిచిపోకుండా తన కవితల ద్వారా స్మరించుకుంటుంటారు.

మారుతున్న మనుషుల గురించి, విలువల గురించి తనదైన శైలిలో వాపోతారు.

మనిషెందుకు మనసు నిండగానే మూగబోతాడు? అంటూ ప్రశిస్తారు.

అరే
...ఇదేమిటి?
ఆకాశంలో కదా మేఘాలున్నాయి
మా కన్నుల్లో వర్షం కురుస్తుందేమిటి?
అంటూ వీడ్కోలుతో మన కళ్ళల్లో కూడా వర్షం కురిపిస్తారు.

ప్రేమ, భావుకతే కాదు పసిపాపల గురించి వారి బోసి నవ్వుల గురించి కూడ అంతే హృద్యంగా వ్రాస్తారు.

జీవితం అనే కవితలో పెళ్ళితో అమ్మాయి ఏం కోల్పోతుందో చెప్పకనే చెపుతారు.

పదహారు ప్రాయం ఎలాఉంటుందో చూడండి అంటారు.

కనికరం లేని కన్నీళ్ళు ఎంత ఆపినా ఆగట్లేదు అంటూ బేల అవుతారు.


కవితలతోపాటు కవితల్లాంటి వచనాలు కూడా రాస్తుంటారు. 

రాధిక కవితల కోసం ఎదురుచూసే పాఠకులు ఎంతమందో!!

రాధిక వ్రాస్తున్న ఇంకొక బ్లాగు సంగతులు.  దీనిలో చాలా తక్కువగా వ్రాస్తుంటారు. 

మా ఊరు-నా బాల్యం లో గోదారమ్మకు గట్టయి మురిసే ఊరేమాది..భూదేవమ్మకు బొట్టయి మెరిసింది" అంటూ తన ఊరి గురించి తన బాల్యం  గురించి ఎన్నో సంగతులు చెప్పారు.

మనిషికి డబ్బు ఎంతవరకు ఆనందాన్నిస్తుంది?ఏ స్తాయి దాటాక డబ్బుకి విలువ తగ్గిపోతుంది? అంటూ అప్పుడప్పుడు మనల్ని ప్రశిస్తూ కూడా ఉంటారు.
  

అన్నట్లు కవితలే కాదు కథలు కూడా వ్రాయగలనని ఒకటి రెండు కథలు కూడా ఈ బ్లాగులో వ్రాసారు.
 

ఇలా చక్కగా వ్రాయగలిగినవాళ్లు వ్రాయకుండా ఉండటం తగని పని. రాధిక గారు మరలా విరివిగా వ్రాయాలని....వ్రాస్తారని ఆశిస్తున్నాను.

Read more...

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP