ఆడ బ్లాగుల్లో సోది ఎక్కువా?? అసలు సోది అంటే???
ఎవరైనా బ్లాగు రాసేది తమ ఆలోచనలు, జ్ఞాపకాలు, అభిరుచులు మొదలైనవి దాచుకోవటానికి, ఇతరులతో పంచుకోవటానికి. మన జ్ఞాపకాలు, ఆలోచనలు, విశేషాలు అంటే అక్కడ మన వ్యక్తిగత జీవితమే ఎక్కువగా ప్రతిభింబిస్తుంది. నిత్య జీవితంలో జరిగే విశేషాలనే కొంతమంది కాస్త హాస్యం కలిపి -జనాలకి నచ్చే విధంగా చెపుతుంటారు. మనసులో మాట సుజాత గారి బ్లాగు కొద్దికాలంలోనే పేరు తెచ్చుకోవటానికి ముఖ్యకారణం ఇదే. అసలు ఓ టపా చదివేటప్పుడు అందులో విషయం గురించే ఆలోచిస్తాం కాని ఆ బ్లాగరు వయస్సు ఎంత? రూపం ఎలా ఉంటుంది అని ఆలోచించి చదువుతామా?
బ్లాగుల్లో వ్యక్తిగత జీవితం గురించిన ఆలోచనలు, అనుభవాలు, జ్ఞాపకాలు--వీటి గురించి చెప్పే బ్లాగులే ఎక్కువ. అసలు వ్యక్తిగత జీవితం గురించి ఏదో ఒక చోట ఏదో ఒక రూపంలో చెప్పని బ్లాగు ఒక్కటి కూడా ఉండదేమో! అవి అందరికి నచ్చాలని కూడా ఏమి లేదు. ఏదైనా చూసే వారి దృష్టిని బట్టి ఉంటుంది. ఒకరికి సోది అనిపించింది ఇంకొకరికి ఆసక్తికరంగా ఉండొచ్చు. లోకోభిన్నరుచి కదా. నాకు కవితలు అంతగా తలకెక్కవు, కొంతమందికి అవంటే ప్రాణం, కొంతమందికి టెక్నికల్ బ్లాగులు ఓ పట్టాన కొరుకుడు పడవు, కొంతమంది రాజకీయాలంటే ఆమడ దూరంలో ఉంటారు--ఏదైనా మన అభిరుచులని బట్టి మన ఇష్టాయిష్టాలనిబట్టి మనం ఎలాంటి టపాలని ఇష్టపడతామో ఉంటుంది కాని అది ఆడవాళ్ళు రాసారా మగవాళ్ళు రాసారా, అమ్మాయిలు రాసారా అమ్మమ్మలు రాసారా అన్నదాన్ని బట్టి కాదు. అవి మనకి నచ్చితే చదువుకోవటం లేకపోతే వదిలేయటమే. మనకోసం మన అభిరుచుల్ని దృష్టిలో పెట్టుకుని ఎవరూ బ్లాగులు రాయరు అన్నది కాస్తంత గుర్తుపెట్టుకుంటే చాలు.
ఈ మద్య తెలుగులో వచ్చిన బ్లాగుల్లో అనతికాలంలోనే ఎక్కువ పేరు తెచ్చుకున్న వాటిల్లో ఆడవారివే ఎక్కువ. ఆ బ్లాగుల్లో ఏం రాస్తున్నారో అవి ఎంత వైవిధ్యంగా ఉంటున్నాయో ఒక్కసారి చూద్దాం.
నిడదవోలు మాలతి గారి తెలుగు తూలిక--సాహిత్యానికి పట్టుగొమ్మ ఈ బ్లాగు. చక్కటి హాస్యంతో మనతో ఎదురుగా నిలబడి చెపుతున్నట్లుండే కబుర్లు, కథలు ఈ బ్లాగరి స్వంతం. అసలు ఈ బ్లాగు లేకపోతే ఆవిడ గురించి మనలో చాలామందికి తెలిసి ఉండేది కాదు.
గేయాలు, పద్యాలు, అనుభవాలు, కవితలు, ఆశీస్సులు, దండకాలు, ఆటలు-ఒక్కటేంటి అన్నిటిని గురించి ఔపాసన పట్టిన ఓ అనుభవజ్ఞురాలు రాస్తున్న మరో ఆణిముత్యం లాంటి బ్లాగు జ్ఞానప్రసూన గారు రాస్తున్న సురుచి--మంచి మంచి రుచులు చూపించే బ్లాగు.
కొత్తపాళీ గారు పెట్టే కథల పోటీ గురించి మీకందరికి తెలిసే ఉంటుంది. అందులో మొదటి రెండు సార్లు బహుమతి కొట్టేసింది ఎవరో మీకు తెలుసా? ఆ ఆ..... మీకు తెలుసని నాకు తెలుసు. తను రాసేది తక్కువే అయినా రమ్యంగా రాస్తారు. కథలు రాయటమే కాదు పుస్తకాల గురించి, సినిమాల గురించి, టి.వి. సీరియల్స్ గురించి చక్కటి సమీక్షలు రాస్తుంటారు. అసలు ఆదివారం సెలవెందుకు? తనని అడగండి ఎందుకో చెపుతారు.
కాళ్ళాగని కాలపు అలలలో మనసు ఊహలు కొట్టుకుపోకుండా, ఈ బ్లాగులో ఊసులుగా పదిలపరచ ప్రయత్నం!! పూర్ణిమ చెప్పే ఈ ఊసుల కోసం ఎదురుచూడని వాళ్లు ఎవరు? టపా టపాకి మంచి పరిణితితో తనదైన శైలిలో వినూత్నంగా సాగుతున్న బ్లాగు ఇది. అందరిని ఆకట్టుకునే పుస్తక సమీక్షలు--- కాదు కాదు విశ్లేషణలు-- ఈ బ్లాగు ప్రత్యేకత.
బుజబుజ రేకుల పిల్లని, బుజ్జా రేకుల పిల్లని, బ్లాగేబ్లాగే పిల్లని అంటూ మీనాక్షి రాసే బ్లాగు ఎంత అల్లరల్లరిగ ఉంటుందంటే తను బ్లాగులోకంలో మరో విహారి అయిపోయింది. ఈ బ్లాగులో ఉండే ప్రాసలు, సెటైర్లు, విరుపులు, యాసలు తనకే ప్రత్యేకం.
నా గురించి..... చెప్పటం సులువు కాదు. అర్థం చేసుకోవటం కష్టం కాదు అంటూ మోహన పేరుతొ విశాల రాసే విశాల ప్రపంచం పేరుకి తగ్గట్లే షాయరీల దగ్గరినిండి వేదాంతం దాకా అన్ని తనలో పొదుపుకుంది. తనగురించి తన మాటలలోనే చదవండి--"ఎలాంటి topic లో అయినా ఇట్టే ఇమిడిపోతాను. Spirituality, Philosophy, Psychology, Mathematics, Physics, Social issues, movies, Arts, Languages, Cricket, ఇంటి పని, వంట పని... ఇలా దేని గురించైనా మాట్లాడేస్తుంటాను".
బ్లాగువనమది అందరిది..ఈ పోస్టులు అందరి కోసములే.....కొన్ని కలలు, కొన్ని ఆశలు, కొంచెం అల్లరి, కొంచెం కోపం, కొంచెం ప్రేమ, కొంచెం బాధ కలిపితే నేను..ఒక మామూలు తెలుగు అమ్మాయిని అంటూ బ్లాగువనం లో పాదుకున్న మరో కొంటె కోణంగి విద్య. అల్లరే కాదు చక్కటి కవితలు అల్లగలదు, అంతే చక్కగా కథలు, సినిమా కబుర్లు చెప్పగలదు. తన భయాలు,బెంచి కష్టాలు, మొదలైన వాటి గురించి చెప్పి మనల్ని హడలగొట్టేయనూ గలదు, కాస్త జాగ్రత్త.
అప్పుడు ఏమి జరిగిందంటే అంటూ కబుర్లు చెప్పే క్రాంతి గురించి తను చెప్పే కబుర్ల గురించి తెలియని వారెవ్వరు! తలనెప్పి నివారణకు మంచి మందు ఈ బ్లాగు చదవటం. మంచి హాస్యంతో అలరాడే బ్లాగులో ఇది ఒకటి.
మనకి తెలియని ఎన్నో ఆరోగ్యసూత్రాలని పరిచయం చేస్తూ
అమరవాణి
రాస్తున్న బ్లాగు. ఆయుర్వేద అభిమానులే కాదు ప్రతి ఒక్కరు చదవవలిసిన బ్లాగు ఇది.
ఇక రాజకీయాలు, సంగీతం, సాహిత్యం, పురాణాలు, సాంకేతికాలు, హైకూలు...ఇలా వైవిధ్యమయిన విషయాల గురించి ఎంతో అలవోకగా మేధ రాసే
నాలో నేను కి ఎంతమంది అభిమానులో!
జాజుల జావళీలతో, అందమైన ప్రేమలేఖలతో , కథలతో మనతో
ఊసులాడే ఒక జాబిలి . కవిత్వం అంటే తెలియని వాళ్ళని కూడా తన అభిమానులుగా చేసుకున్న ఓ night queen.
నాలో మెదిలే కన్నీటి అలలూ.. నాలో కరిగే పన్నీటి కలలూ.. నాలో రగిలే ఆలోచనల జ్వాలలూ.. వీటన్నింటి అక్షర రూపమే....కలలో...కన్నీటి అలలో అంటు తన కలలు, కవితలు, జ్ఞాపకాలు మనతో పంచుకోవటానికి వచ్చిన ఓ సరికొత్త
బ్లాగు, మీరందరూ చూసే ఉంటారు.
ఈ సంవత్సరం వచ్చిన మరొక వైవిధ్యమైన బ్లాగరు గడ్డిపూల సుజాతగా అందరికి పరిచయమయిన సుజాత . తను మూడు బ్లాగులు రాయటం ఓ విశేషమయితే అవి దేనికదే వైవిధ్యంగా ఉండటం మరొక ప్రత్యేకత. --
గడ్డిపూలు లో రాజకీయాలు, సాహిత్యం, సినిమాలు, క్రీడలు, అణుఒప్పందం, తీవ్రవాదం, ఐ.ఈ.డీ లు(Improvised Explosive Devices), స్త్రీవాదం...... ఒక్కటేమిటి తను విశ్లేషించని విషయం అంటూ ఉండదు.
తన ఇంకొక బ్లాగు
శ్రీనివాసం లో ప్రసిద్ధ కీర్తనలు భజనలు భావాలతో సహా ఏర్చి కూర్చి పెడుతున్నారు.
ఇక తన ఇంగ్లీషు బ్లాగు
spice and chocolate.
మా అమ్మ నాకే కాక నా బ్లాగుకి కూడా పేరెట్టింది అంటూ మన ముందుకి వచ్చిన తొలి తెలుగు
బడిబ్లాగరు గుర్తుందా? తెలుగు మాట్లాడటమే తప్పు అనుకునే ఈ కాలంలో చక్కటి తెలుగులో ఓ తొమ్మిదో తరగతి చదివే అమ్మాయి బ్లాగు రాయటం చాలా ఆనందకరమైన విషయం కదూ!
గుండె గొంతుకలోన కొట్టాడుతుంది గొంతు దాటి అది రానంటోంది అంటూ తన మనసులోని మాటని మనకి వినిపించాలని ఆరాటపడే రమణి గారి బ్లాగు---
కందిపచ్చడితో బ్లాగులోకాన్ని ఓ ఊపు ఊపిన బ్లాగు.
ఈ మధ్య బ్లాగు లోకంలో చర్చలు, చలోక్తులు, వాగ్వివాదాలు, సెటైర్లతో సందడి సందడి చేస్తున్న బ్లాగు--అబ్బో ఆ మాత్రం మాకు తెలీదంటారా?? నేను చెప్పేది అదే మరి---
పరిచయం అక్కర్లేని బ్లాగు.ఈ మధ్య మొదలైన మరో చల్ల చల్లని హాట్ హాట్ బ్లాగు ప్రియ, వైష్ణవి కలిసి రాస్తున్న
ప్రియరాగాలు. ఇందులో ప్రియ రాసేవే ఎక్కువ. తను రాముడి మీద రాసిన టపా రేపిన కలకలం అంతా ఇంతా కాదు. తన వాదాన్ని చాలా సాధికారతతో రాసిన టపా ఇది.
కమ్మటి సువాసనల తలపులు మన మనసులలో నింపే జాజి ఈ
విరజాజి. కొంత సాహిత్యభిలాషా, కాస్త తెలుగు భాషపై మమకారమూ, మరి కొంత తెలుగు సంస్కృతి పై గౌరవమూ, కొద్దో గొప్పో తెలుగు జాతి పైన అభిమానమూ కలిగిన అచ్చ తెనుగు ఆడపడుచు రాస్తున్న సరికొత్త బ్లాగు.
అప్పుడప్పుడు అలా కనిపించి
ఊసులు చెప్పే స్వాతి చక్రవర్తి బ్లాగు కూడా ఈ మధ్య వచ్చిన బ్లాగుల్లో ఒకటి.
ఇక స్త్రీవాద రచనలు చేసే
కొండవీటి సత్యవతి,
కొండేపూడి నిర్మల,
కల్పన రెంటాల కూడా బ్లాగులు రాయటం మొదలుపెట్టి మహిళా బ్లాగులకి ఓ పరిపూర్ణత కల్పించారు.
ఎప్పటినుండో రాస్తున్న
రాధిక,
జ్యోతి,
సౌమ్య,
స్వాతికుమారి,
పద్మల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను.
కొంగొత్తగా వచ్చిన మరో నాలుగు బ్లాగుల్ని కూడా చూద్దామా!
కాస్కో నా వాస్కోడిగామా....అమ్మో ఇదేంటి అనుకుంటున్నాలా, అదే మలి మీలే చూడండి. ఈ పిల్లకి ర పలకదంట మలి.
మహార్ణవం పేరుతో కథలు కవితలు రాస్తున్న శ్రీవల్లీ రాధిక గారు బ్లాగరుగా కొత్తే కాని వీరి రచనలు వివిధ తెలుగు పత్రికలలో, ఆకాశవాణిలో, ఈమాట అంతర్జాల పత్రికలో వచ్చాయి. తన కథలు కొన్ని హిందీ, తమిళ్, కన్నడ భాషలలోకి అనువదించబడ్డాయి.
అందరిలాగానే మమూలు మనిషిని, కొంచం అల్లరి, కొంచం కోపం, కొంచం అలోచన, ఇంక నాకే తెలియని ఎన్నో కోణాలతో-- అంటూ మన ముందుకు వచ్చిన మరో బ్లాగరి
నేను-లక్ష్మి.ఓనమాలు లలిత గారిని గుర్తుకు తెస్తూ లలిత లలితంగా మొదలైన ఇంకొక బ్లాగు
నా స్పందన.ఇందుగలరందులేరని సందేహం వలదు, ఎందెందు చూసినా మహిళలే కనిపించు. నాకు తెలియని తెలుగు మహిళా బ్లాగర్లు మరి కొందరు ఉండి ఉండవచ్చు, వారందరికి కూడా నా అభినందనలు మరియు ఆశీస్సులు.
Read more...