పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

October 3, 2008

అత్త మీది కోపం దుత్త మీద

మనకి అకారణంగా ఎవరి మీదైనా కోపం వస్తుందా? ద్వేషం కలుగుతుందా??

మనకి తెలియని, తెలిసినా వ్యక్తిగత పరిచయం లేని, ఒట్టి ముఖ పరిచయం మాత్రమే ఉన్న వ్యక్తుల మీద అకారణ కోపాలు, ద్వేషాలు మనం చాలా సార్లు చూపిస్తుంటాము. (రాజకీయ నాయుకులు, టెర్రరిస్టులు, ......ఇలాంటి వారి మీద ఉండే లాంటి కోపం ద్వేషం గురించి కాదు నేను చెప్పేది). దీనికి కారణం పలానా అని కూడా చెప్పలేం. కొన్నిసార్లు మనకి సన్నిహితులైన వారి మీద ఉండే కోపాన్ని, అసహనాన్ని, ఉక్రోషాన్ని, వాళ్లని ఏమీ అనలేని అసహాయతని ఇలా వేరే ఎవరి మీదో వెళ్లగక్కుతుంటాం, అత్త మీది కోపాన్ని దుత్త మీద చూపించటం అన్నమాట. అది కూడా చాలా తెలివిగా ఆ చేసింది మనమే అన్న సంగతి వాళ్లకి తెలియకుండా చేస్తుంటాం. ఎక్కువసార్లు ఈ ప్రక్రియ మనకి తెలీకుండానే జరిగిపోతుంది. ఒక్కోసారి మనం అసలు ఈ విషయమే గమనించం. ఒకవేళ గమనించినా వెనక్కి తిరిగి చూసుకుంటే అప్పటికి అది మనకు తప్పుగానే కనిపించదు, మన ప్రవర్తన చాలా సహజంగానే ఉన్నట్లు మనకి కనిపిస్తుంది. మన ఆ ప్రవర్తనకి కారణాలు కూడా మనకి అప్పుడు అర్థం కావు. జీవితంలో అప్పుడప్పుడు వెనుతిరిగి చూసుకుంటాం కదా, అప్పుడు కనిపిస్తాయి ఇలాంటివన్నీ.

నేను ఇంటరులో ఉన్నప్పటి సంగతి. మా నాన్న ఫిజిక్సు లెక్చరరు. నేను అదే కాలేజిలో ఇంటరు చదివా. మాకు ఇంటరు రెండు సంవత్సరాలు ఫిజిక్సుకి మా నాన్నే వచ్చేవాళ్లు. మా నాన్నకి ఇంట్లో పిల్లలకి పాఠాలు చెప్పటం కాని, బయటి పిల్లలకి ట్యూషన్లు చెప్పటం కాని ఇష్టం లేని మరియు కష్టమయిన పని. ఆ రోజులలో కాలేజి లెక్చరర్లు అందులోనూ సైన్సు సబ్జెక్టు వాళ్ళు ట్యూషన్లు చెప్పకపోవటం చాలా అరుదాతి అరుదు. కార్పోరేటు కాలేజిలు వచ్చి వాళ్ల పొట్టలు కొట్టాయి కానీ, ట్యూషన్లంటే ఆ రోజులలో ఇంట్లో కామధేనువు ఉన్నట్లే.

నేను 10 వ తరగతి అయిపోయాక వేసవి సెలవులలో ఇంటరు పుస్తకాలు పట్టుకుని తెగ చదివేసేదాన్ని(10 వరకు తెలుగు మీడియంలో చదివి ఆ పుస్తకాలు పట్టుకుంటే ఏమి అర్థం అయ్యేది కాదులేండి, అది వేరే విషయం :) ). ముఖ్యంగా మా నాన్న ఇంట్లో ఉన్నప్పుడు ఫిజిక్సు తెగ చదివేసేదాన్ని, ఆయన చూడకపోతారా, నాకు పాఠాలు చెప్పకపోతారా అని. అబ్బే, మా నాన్న అదేం చూసేవాళ్లు కాదు. సరే ఇక కాలేజిలో చేరాక మా నాన్నకి బాగా దగ్గరి స్నేహితులైన ఒక ప్రముఖ డాక్టరు గారున్నారు. ఆయన పిల్లలిద్దరు (కవలలు) నాతో పాటే ఇంటరు చదివారు. అందులో ఒకళ్లు M.P.C., ఇంకొకళ్లు Bi.P.C. (అంటే మన సెక్షనే). ఈ Bi.P.C. జీవి ఎప్పుడూ చదువే చదువు అన్నట్లు ఉండేవాడు. పొద్దున లేవటం ట్యూషన్లతో రాత్రి పడుకోవటం ట్యూషన్లతో అన్నట్లుండేది. కాలేజీలో ఎంతమంది లెక్చరర్లు ఉంటే అంతమంది దగ్గరికి ట్యూషన్లకి వెళ్లేవాళ్లు. మరి మా నాన్న ట్యూషను చెప్పరుగా, అందుకని డాక్టరు గారు మా నాన్ననే కాలేజి అయిపోయాక వాళ్లింటికొచ్చి వాళ్ల పిల్లలకి ఓ గంట పాఠాలు చెప్పమని కోరగా ఓ రోజు కాలేజి అయిపోయాక మా నాన్న తనతో పాటు నన్ను కూడా ఆ డాక్టరు గారింటికి తీసుకుపోయారు. నేరుగా పైన మేడ మీద పిల్లల గదిలోకి వెళ్లాం. వెళ్లగానే పనమ్మాయితో కాఫీ, బిస్కట్లు వచ్చాయి. నాకు అర్థం కాలా ఇదంతా ఏంటో. కాసేపటికి సోదరులిద్దరు పుస్తకాలు పట్టుకుని వచ్చారు. మా నాన్న పాఠం మొదలుపెట్టారు. ఇక నా పరిస్థితి చూడండి అసలు మా నాన్న మా ఇంట్లో నాకు చెప్పకుండా వీళ్లింటికొచ్చి, తనొచ్చేదే కాక తనతో పాటు నన్ను కూడా తీసుకొచ్చి, వీళ్లతోపాటు నాకు పాఠాలు చెప్పటం ఏంటి అన్న ఉక్రోషం. మా నాన్నని ఏమీ అనలేను కదా! మరి నా ఉక్రోషం ఎలా తీర్చుకున్నానంటారా? ఆగండి మరి తరువాయి టపాలో చెప్తా.

5 వ్యాఖ్యలు:

చిన్నమయ్య October 3, 2008 at 5:58 PM  

తర్వాతి టపాలో ఏం చెబుతారా అని ఎదురు చూస్తున్నాను.

teresa October 3, 2008 at 6:31 PM  

అర్ధాంతరంగా ఆపడం అన్యాయం :)

Ramani Rao October 3, 2008 at 9:22 PM  

ఆగమని, తరువాత టపా అని ఆటలాడుట తగదే చెలియా! టపా అంతా మాకు నచ్చే కదా! ఈ టపా విరహం తీరెదెలా...(సుందరి, ఓ సుందరి నీవంటి దివ్య స్వరూపం స్టైల్)

చాలా ఏకాగ్రతతో చదువుతుంటే ఇలా మధ్యలో "శారదా" అని అరిచినట్లుగా అలా "ఆగండి" అనడం ప్చ్! ప్చ్! ప్చ్!

అవునూ! ఇంతకీ ఆతరువాత మీ కోపానికి బలైయిన ఆ 'దుత్త ' ఎవరూఉ??

Purnima October 3, 2008 at 11:09 PM  

తెరిస్సా గారిదే నా మాటానూ! అర్ధాంతరం ఆపుట న్యాయమా?

నెక్స్ట్ పోస్ట్ ఎక్కడ? వేయింట్ ఇక్కడ. :-)

మాలతి October 5, 2008 at 5:07 PM  

అవునండీ. పెరటిచెట్టు మందుకి పనికిరాదని. నాన్నలు ఎప్పుడూ ఇంట్లోవాళ్లకి చెప్పరు :)

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP