December 31, 2010
ఆదివారం ఆడవాళ్ళకు సెలవు
సరే భోజనానికి ఏం చేస్తున్నారు అని అడిగా. అలోచిద్దాము అని అప్పటికి తప్పించుకుని వెళ్ళి మరలా కంప్యూటర్ మీద కూర్చున్నారు. నేను కూడ ఈనాడు ఆదివారం పుస్తకం పట్టుకుని మంచం ఎక్కా అహా ఏమి నా భాగ్యము అనుకుంటూ.
11 గంటలయ్యక అనుకుంటా మా పాప వెళ్ళి నాన్నా ఈ రోజు మనదే వంట పని అని గుర్తుచేసింది. లేదురా నాన్నా ఈ రోజు నాకు కంప్యూటర్ మీద చాలా పని వుంది (ఇంకేం పని, వికీ పని లేకపొతే బ్లాగుల పని) అందుకని బయటినుండి కూరలు తెచ్చేసుకుందాము,నువ్వు బియ్యం కడిగి పెట్టేయి అని ఒక అల్టిమేటం పడేసారు తనకి. లేచి వంట చేద్ద్దామా అనిపించింది ఒక నిమిషం,అమ్మో చేస్తే అసలకే లోకువవుతాము అని ఆ ప్రయత్నం విరమించా.
భోజనాల టైంకి వెళ్ళి కూరలు తెచ్చేసారు, అది కూడా నాలుగు రకాలు,(ఏం నువ్వు చేయకపొతే మాకేం అన్నట్లు ఒక చూపు విసిరి).
ఒక్క కూర కూడా నోట్లో పెట్టుకోను పనికి రాలా. మా వాడు అయితే పాపం వట్టి పెరుగన్నమే తిని సరిపెట్టుకున్నాడు. ఒకటేమో యమా కారం,ఒక దానిలో ఉప్పు లేదు,గుత్తొంకాయ అంట ఏదో పలచగా రసం లాంటి దానిలో నాలుగు వంకాయలు పడేసినట్లుంది. కొద్దిగా సాంబారే నయం అనిపించింది. పిల్లలిని చూస్తే అయ్యొ అనిపించింది. శుభ్రంగా పప్పు పచ్చడితో తిన్నా బాగుండేది, ఈయనని నమ్ముకుంటే ఇంతే అని మనసులోనే అనుకుని ఏదో తిన్నామనిపించాము. సాయంత్రం మన ముగ్గురం కలిసి ఎంచక్కగా వండేద్దాము అని ముగ్గురు కలిసి ఒక భయంకర తీర్మానం కూడా చేసేసుకున్నారు.
సాయంత్రం అయింది. ఇక వంట మొదలుపెడతారు కాబోలు అని చూస్తున్నాను, ఏమైనా సలహాలు అడిగితే పడేద్దాము అని. ఎబ్బే! ఏం కదలిక లేదు. కంప్యూటర్ మీద కొట్టుకుంటూనే వున్నారు. నాకెందుకని నేను కూడా మెదలకుండా టి.వి లో వచ్చిన ప్రతి సినిమా చూస్తూ పడుకున్నాను. తీరిగ్గా రాత్రి 8 అయ్యాక పదండి బయటికి వెళ్ళి భోంచేసి వద్దాము అని బయలుదేరదీసారు. ఆ హోటలు భోజనం అంతకన్నా దరిద్రంగా వుంది. అన్ని మంట, పైగా ఎ.సి సరిగ్గా లేదు, బిల్లు మాత్రం వాయించాడు. పిల్లలు సూపూ ఐస్క్రీమూ తప్పితే ఏదీ సరిగ్గా తినలేదు. ఇక ఈ హోటలుకి రాకూడదు అనుకుంటూ బయటపడ్డాము. ఇంటికి వచ్చాక నేను మా వాడు కాస్తంత మజ్జిగ తాగి అమ్మయ్యా అనుకున్నాము. మొత్తానికి నిన్న ఆదివారం అంతా మా వారి పుణ్యమా అని సండే స్పెషల్సు సంగతి దేవుడెరుగు అందరం అర్థాకలితోనే పడుకోవాల్సి వచ్చింది. అప్పుడు అర్థమయ్యింది మన పెద్దవాళ్ళు ఆడవాళ్ళకి సెలవు ఎందుకు పెట్టలేదో!!!!! మీక్కూడా అర్థం అయ్యిందనుకుంటాను.
December 16, 2010
రండి రండి తరలి రండి రజతోత్సవ పుస్తక ప్రదర్శనకి .....
గత సంవత్సరపు తీపి గురుతులు మదిలో అలా అలా ఇంకా నిలిచి ఉండగానే హైదరాబాదు పుస్తక ప్రదర్శన మళ్లీ వచ్చేసింది. ఈ రోజు అంటే డిసెంబరు 16 నుండి డిసెంబరు 26 వరకు ఈ ప్రదర్శన ఉంటుంది. మిగతా పుస్తక ప్రియుల సంగతేమో కాని మన తెలుగు బ్లాగర్లకు మరియు e-తెలుగు సభ్యులకు మాత్రం ఇది నిజంగా ఓ పెద్ద పండగే! ఎప్పుడూ చూడని బ్లాగర్లని చూడవచ్చు....పరిచయం చేసుకోవచ్చు, కబుర్లాడుకోవచ్చు, మిరపకాయ బజ్జీలు తినవచ్చు..కాసేపు e-తెలుగు స్టాలులో నిలబడి ఎంతో మంది ప్రముఖులని కలుసుకోవచ్చు..వారితో మాటామంతీ ఆడవచ్చు..కొండొకచో వారితో బ్లాగులూ మొదలుపెట్టించవచ్చు!!
ఈ సంవత్సరం 250 అంగళ్లట! మరి అందరూ కొనాల్సిన పుస్తకాల చిట్టాతో తయారుగా ఉన్నారా !
అంతే కాదండోయ్ ఇది 25వ పుస్తక ప్రదర్శన. ఈ సందర్భంగా 19వ తేదీ అంటే వచ్చే ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు పుస్తక ప్రియులు చేసే పాదయాత్ర ఉంటుంది. పోయిన సంవత్సరం ఎక్కువగా మన e-తెలుగు సభ్యులు మరియు తెలుగు బ్లాగర్లే ఈ నడక కార్యక్రమంలో పాల్గొన్నారు, మరి ఈ సంవత్సరం కూడా e-తెలుగు సభ్యులు, తెలుగు బ్లాగర్లు మరింత ఉత్సాహంతో మరింతమంది ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుందాం.
అలాగే డిసెంబరు 26 అంటే ఆ పై ఆదివారం అన్ని రంగాలనుండి ఓ 25 మంది ప్రముఖులకు సన్మాన కార్యక్రమం ఉంటుంది.
ఎప్పటిలాగే e-తెలుగు వారు పెట్టే స్టాలుతో పాటు ఈ సారి ఇంకో కొత్త స్టాలు కూడా రాబోతుంది..అదీ మన తెలుగు బ్లాగర్లు పెట్టబోతుందే....మరి అదేంటో దాని కథాకమామిషూ ఏమిటో తెలియాలంటే మరి మీరూ పుస్తక ప్రదర్శనకు రావల్సిందే!
ఇంకొక విషయం అండోయ్.. ప్రముఖ బ్లాగరు మరియూ ప్రముఖ రచయిత్రి నిడదవోలు మాలతి గారు వ్రాసిన "చాతక పక్షులు" సీరియల్ దాదాపు బ్లాగర్లందరూ చదివే ఉంటారు..అది ఇప్పుడు ఎమెస్కో వాళ్ళు పుస్తకంగా తీసుకు వచ్చారు. అది కూడా పుస్తక ప్రదర్శనలో ఎమెస్కో వారి అంగటిలో లభ్యమవుతుంది..వెల 60 రూపాయలు మాత్రమే! మరి మీ కొనాల్సిన పుస్తకాల చిట్టాలో ఇంకో పుస్తకం జత చేసుకోవచ్చన్నమాట!
చివరగా ఓ విన్నపం....ఆసక్తి ఉన్నవాళ్ళు మీ విలువైన సమయాన్ని కొంత e-తెలుగు స్టాలులో వలంటీరుగా ఉండేందుకు వెచ్చించగలరేమో అలోచించండి!
తెలుగు పుస్తకాలు చదవండి, చదివించండి
December 6, 2010
ఇంటినుండి పని-ఎంత సౌఖ్యం
కానీ ఈ మధ్య కొంతమంది, ముఖ్యంగా ఆడవారు, ఈ ఇంటినుండి పని పట్ల విముఖత చూపిస్తున్నారని ఓ స్టడీలో వెల్లడయింది. దానికి వారు చెప్పిన ప్రధాన కారణాలు
1. మేము సోషలు లైఫు మిస్సు అవుతున్నాం. ఇంట్లో నుండి పని చెయ్యటం వల్ల వ్యక్తిగతంగా మాకంటూ ఓ జీవితం లేకుండా అంతా మెకానికల్ అయిపోయింది అనిపిస్తుంది. ఇంట్లో కుటుంబసభ్యులతో చెప్పుకోలేని కొన్ని సమస్యలను ఆఫీసులో స్నేహితులతో చెప్పి ఊరట చెందేవాళ్లం. ఇప్పుడు ఆ అవకాశం లేదు. ఆఫీసులో జరిగే బాతాఖానీలు ...పార్టీలు..మనస్సుకి కాస్త రిలాక్సేషను ఇచ్చేవి. ఇప్పుడు అవేవి లేవు. ఇలాంటి వాటిని బాగా మిస్సు అవుతున్నాం.
2. పిల్లలతో మిగతా కుటుంబసభ్యులతో సమయం గడపగలుగుతున్నాం కానీ...దాని మూలాన మా మీద మామూలు కన్నా వత్తిడి ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇంట్లోనే ఉంటున్నాం కదా అని అందరూ మా మీద మరీ ఎక్కువగా ఆధారపడుతున్నారేమో అనిపిస్తుంది. ఇంతకుముందు ఆఫీసుకి వెళ్లేటప్పుడు నాకు పనిలో సహాయం చేసినా చెయ్యకపోయినా ఎవరి పనులు వాళ్లు చేసుకునే వాళ్లు. కానీ ఇప్పుడు అన్నిటికి నా మీదే ఆధారపడుతున్నారు. అన్నీ ఎదురెదురు అందివ్వాల్సి వస్తుంది . ఈ వత్తిడి నా ఉద్యోగ విధుల మీద కూడా ప్రభావం చూపిస్తుంది.
3. ఇక అనుకోకుండా వచ్చే అతిధులతో వచ్చే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.
వీటన్నిటితో మా పని మేము ఇదివరకటి అంత శ్రద్దగా...అంకితభవంతో చెయ్యలేకపోతున్నాం. వృత్తి జీవితంలో అనుకున్నంత ముందుకు కూడా వెళ్లలేకపోతున్నాం..కొన్నిటిని వదులుకోవాల్సి వస్తుంది.
ఈ ఇంటినుండి పని తప్పక చెయ్యటమే కానీ మాకు నచ్చి చెయ్యటం కాదు. కొన్ని సౌలభ్యాలు కూడా ఉన్నాయి కానీ మాకు కలిగే అసంతృప్తితో పోల్చుకుంటే ఆఫీసుకెళ్లి పనిచేసుకోవటమే ఉత్తమం అనిపిస్తుంది. పిల్లలు పెద్దవ్వగానే మరలా ఆఫీసునుండే పని చేస్తాం.......ఇవీ స్థూలంగా వాళ్లు చెప్పిన కారణాలు.
నేనూ గత ఐదు సంవత్సరాలుగా ఇంటినుండే పని చేస్తున్నా కానీ నాకు ఇలా అనిపించలేదు..కొన్ని అనిపించినా అవి మనం ప్లాన్ చేసుకోవటంలో మిగతా కుటుంబసభ్యులకి అర్థం అయ్యేటట్లు చెప్పుకోవటంలో ఉంటుంది . కొన్ని అసౌకర్యాలు ఉన్నా నాకు ఇంటినుండి పనే సౌఖ్యంగా ఉంది. దేంట్లో అయినా కొంత మంచి..కొంత చెడూ ఉంటాయి.
ఆఫీసు టైముకి ఓ రెండు మూడు గంటలు ముందు బయలుదేరి మన నగర ట్రాఫిక్కులో ఈదుకుంటూ ఆఫీసు చేరి..సాయంత్రం ఆఫీసు అయ్యాక ఓ రెండు మూడు గంటలకి ఉసూరుమంటూ ఇల్లు చేరటం..మళ్లీ ఇంట్లో పనులు..బాధ్యతలు.... దీనికన్నా హాయిగా ఇంట్లో ఉండి పనిచేసుకోవటంలో ఎంత ఆనందం ఉందో కదా! ఈ ఆనందం ముందు ఆఫీసుకి వెళ్తే వచ్చే ఎన్ని ఆనందాలయినా దిగదుడుపే!!
మనం పని చేసేది అమెరికా కంపెనీలకి..మరి వాటిల్లో మన పండగలకి పబ్బాలకి సెలవులుండవు...ఆ రోజుల్లో హడావుడిగా ఎనిమిదింటికల్లా అన్ని పనులు (ఆ రోజు పనమ్మాయి రాకపోతే అ పని కూడా) చేసుకుని ఆఫీసుకి
పరిగెత్తిన రోజులు ఎన్నో!! అదీ ఆఫీసు ఇంటికి దగ్గర కాబట్టి ఆఫీసు టైముకి ఇంటి దగ్గర బయలుదేరితే సరిపోయేది..అదే దూరం అయితే..అవన్నీ తలుచుకుంటే నాకయితే బాబోయ్ మళ్లీ ఆఫీసు గడపా తొక్కటమా అనిపిస్తుంది.
పిల్లలకి ఆరోగ్యం బాగోని రోజుల్లో అయితే ఇంకా నరకం. సెలవు పెట్టినా..ఆఫీసునుండి ఫోన్లు..మేడం ఒక్క గంట వచ్చి వెళ్లండి..మీరు చేసే డాక్టరు ఒకరి డిక్టేషను బాగా ఎక్కువ వచ్చింది మీరు కొన్ని ఫైల్సు అయినా చేసి వెళ్లండి..ఒక్క గంట వచ్చివెళ్లండి ప్లీజ్ అంటూ అభ్యర్థనలు.......కాదనలేం.. వెళ్లాలేం. ఇప్పుడయితే వాళ్ల పక్కన కూర్చుని వాళ్లని చూసుకుంటూ నా పని నేను చేసుకోవచ్చు.
ఒక్కోరోజు మన పని మనం పూర్తిచేసుకుని ఇక బయలుదేరదామనుకుంటుండగా..మేడం..
ఎప్పుడయినా అవసరానికి అర రోజు సెలవు పెడతామా..పేరుకే అర రోజు..పావు రోజు అవ్వగానే ఫోన్లు మొదలవుతాయి..మేడం ఎన్నింటికి వస్తారు..వస్తున్నారు కదా అంటూ..అనవసరంగా అర రోజు సెలవు పెట్టామే అనిపిస్తుంది. పాపం వాళ్ల తప్పు కూడా ఏమీ లేదులేండి. మా పనే అలాంటిది. ఏ రోజు వర్కు ఆ రోజు అయిపోవాలి. పెండింగు పెట్టటానికి ఉండదు.
ఓ రోజు ఊరెళ్లి వస్తున్నాను. ట్రెయిను లేటు..ట్రెయిను దిగి ఆటొలో ఇంటికి వస్తుండగా ఆఫీసు నుండు ఫోను..మాడం మీరెక్కడున్నారు అంటూ..దారిలో ఉన్నా ఇంటికెళ్ళి ఓ గంటలో వస్తా అంటూ ఉండగానే..మాడం..మాడం..డైరెక్టు
అన్ని ఉద్యోగాలకి ఈ సౌలభ్యం ఉండకపోవచ్చు కానీ ఉన్నవాళ్లయినా వినియోగించుకుంటే బాగుంటుంది. కాకపోతే సర్వసన్నద్దమై ఇంటినుండి పని మొదలుపెడితేనే ఉపయోగం. సిస్టం..దానిలో మన పనికి అవసరమయిన సాఫ్టువేరులు.....బ్రాడుబ్యాండు కనక్షను....పవర్ ప్రాబ్లం లేకుండా బ్యాకప్......ఇలా అవసరమయినవన్నీ సిద్దం చేసుకోవాలి కాబట్టి మొదట్లో కొద్దిగా డబ్బులు పెట్టుబడి కూడా పెట్టాల్సి ఉంటుంది.
ఇక ఇంట్లో నుండి పని చేస్తే ఉండే అసలు లాభం ఏంటో చెప్పనా....
ఆఫీసుకి వెళ్తే కట్టిన చీర కట్టకుండా కట్టుకెళ్లాలా:) ఆదివారం వచ్చిందంటే వీటన్నిటికీ గంజి....ఇస్త్రీలు..అదో పేద్ద పని!! ఆ చీరలకి మరి మ్యాచింగు బ్యాగులు....చెప్పులు....క్లిప్పులు
ఇక దీనిలో ఉండే కష్టాల గురించి మరోసారి .........
July 6, 2010
సికింద్రాబాదు రైల్వేస్టేషనులో వృద్దులకు వికలాంగులకు ఉచిత వీల్‍చెయిరు సదుపాయం
ఫోను చెయ్యవలసిన నంబర్లు
ఎయిర్ టెల్:--9676707007
బ్యాంకు ఆఫ్ బరోడా:--9652210067
June 18, 2010
చదువులమ్మ ముద్దు బిడ్దలు..వీరికి చేయూతనిద్దాం
తండ్రి దూరమయినా ఆయన మాటే వేదంగా మెకానిక్ మామయ్య అండతో పట్టుదలగా చదివి ఆకాశమే హద్దుగా 159 మార్కులతో ప్రథమస్థానంలో నిలిచిన పల్లవి..
పల్లవితో సమానంగా EAMCET లో మార్కులు సాధించి ఇంటరులో 600 కి 600 మార్కులు సాధించిన ఆటోడ్రైవరు కొడుకు మహ్మద్ గౌస్
తల్లిదండ్రులు నిరక్షరాస్యులయినా మూడోస్థానంలో నిలిచిన కిరణ్.....లక్ష్మీపతి
వీరందరికి ఉన్నదల్లా ఒక్కటే ధ్యేయం..బాగా చదవాలి..ఉన్నతంగా జీవించాలి. ఎన్ని అడ్డంకులు ఎదురయినా కసి.... పట్టుదల...ఉన్నతంగా జీవించాలన్న ఆశ..అవే వారిని విజయపథాన నడిపిస్తున్నాయి. ఇలాంటివారికి అవసరం ఉన్నప్పుడు చేయూత ఇవ్వటం మన బాధ్యత..కర్తవ్యం కూడా! అలాంటి ఓ చదువుల తల్లికి సహాయం చేసే అవకాశం ప్రమదావనానికి లభించింది.
హారిక అన్న అమ్మాయిది కరీంనగర్ జిల్లా ముస్తాబాద్. తండ్రి ఓ చిన్న రైతు..సంవత్సర ఆదాయం 14,000-18,000. ఆ అమ్మాయికి 10వ తరగతిలో 91% వచ్చింది. ఇంటరులో చైతన్య కాలేజి వాళ్లు మొదటిసంవత్సరం ఉచితంగా శిక్షణనిచ్చారు..రెండవ సంవత్సరం నామమాత్రం రుసుము వసూలు చేసారు. ఇంటరులో 93% వచ్చింది. EAMCET లో ర్యాంకు రావటంతో వర్థమాన్ కాలేజి, షంషాబాదులో ఇంజనీరింగు సీటు వచ్చింది. రోజూ ECIL నుండి షంషాబాదు వెళ్ళి చదువుకుంటుంది. ఎలాగో తిప్పలు పడి మొదటి రెండు సంవత్సరాలు ఫీజులు కట్టారు. ఇప్పుడు మూడవ సంవత్సరం ఫీజు కట్టాలి..వాళ్ల నాన్న చేతులెత్తేసారు. మన బ్లాగరు రవిచంద్ర ద్వారా ఈ విషయం తెలిసి ప్రమదావనం తరుపున ఈ రోజు ఆ అమ్మాయికి 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందించటం జరిగింది. ఇంకొక బ్లాగరు పరిమళం గారు వ్యక్తిగతంగా 1000 రూపాయలు సహాయం అందించారు.
ఎవరయినా సహాయం చెయ్యదలిస్తే ఆ అమ్మాయిని సంప్రదించవలిసిన ఫోను నంబరు 9703299899
తన బ్యాంక్ అకౌంట్ వివరాలు.
A/C number: 30903316788
Name of A/C Holder: L. Srinu
Bank: SBI
Branch: Vinukonada
తనకి ఆంధ్రాబ్యాంకులో అకౌంటు ఉంది కాని దాని ATM కార్డు పోయింది కనుక వేరే a/c నంబరు ఇస్తుంది..త్వరలో ATM కార్డు తీసుకోవటమో ఇంకొక a/c ఓపెన్ చేయటమో చేస్తుంది.
June 14, 2010
సపోటాల లక్ష్మి
ఆ పళ్ళేమో మా పిల్లలు కన్నెత్తి అన్నా చూడరు..అది చెప్పినట్టు నేను తిన్నన్ని తిని మిగతావి పనమ్మాయికో...మా వాచుమాన్ వాళ్ల పిల్లలకో..అదీ కాకపోతే మా చెత్తబుట్టకో పెట్టేస్తుంటా! ఆ మధ్య కొన్నాళ్లు వాటితో మిల్కుషేకులు...మిశ్రమ రసాలు చెయ్యటం మొదలుపెట్టా..మా అమ్మాయి పాపం నేనేమి ఇచ్చినా మాట్లాడకుండా తాగుతుంది..మా అబ్బాయి మాత్రం..వాడి రుచిగ్రంధులు చాలా పదును..ఎలా పడతాడో తెలియదు..ఏంటి ఇలా జిగురుజిగురుగా ఉంది..సపోటా పళ్ళు వేసావా..ఇంకెప్పుడూ వెయ్యకు అని ఓ అల్టిమేటం జారీ చేసాడు..ఇక అదీ మానేసా. ఇలా లాభం లేదని గత కొంతకాలంగా మధ్యాహ్నం పూట తలుపు మోగితే తీయటం మానేసా (అది తప్ప ఇంకెవరూ ఆ టైములో తలుపు కొట్టరన్న ధీమా) . కొన్నాళ్ళు చూసి లక్ష్మి కూడా రావటం మానేసింది. మొన్నొక రోజు రోడ్డు మీద కనిపించి ఏందమ్మా ..ఈ మధ్య ఎప్పుడొచ్చినా నిద్రపోతున్నావు..తలుపు తీయటంల అంటు పరామర్శించింది..మరి ఎండాకాలం కదా అని ఏదో సర్దిచెప్పా! నిన్న మాత్రం దానికి అడ్డంగా బుక్ అయిపోయా! అది వచ్చే టైముకి తలుపు తీసే ఉంది. నన్ను చూడగానే బాగున్నామ్మా..ఇయాల పొద్దుటినుండి నువ్వే యాదికొస్తాండావు..అందుకే వచ్చా...అంటూ ముఖమంతా నవ్వుతూ పరామర్శించింది. బాగానే ఉన్నా కాని పాప కూడా లేదు కాయలొద్దు అంటే వినదే! ఇదుగో నువ్వు నా దగ్గర కాయలు కొని ఎన్నాళ్ళవుతుంది..ఏడన్నా ఓ ఏడాది అయి ఉంటది..వద్దంటావేంది ఓ పది రూపాయలవి తీసుకో అంటూ పోట్లాడి మరీ ఓ పాతిక కాయలు పోసి పోయింది..ఇక డబ్బులియ్యక చస్తానా! ఏంటో దానికీ నాకూ మధ్య ఈ బంధం?
May 12, 2010
వెంటాడే కథలు-ప్రళయకావేరి కథలు
“అబయా! మనం మన పేరునన్నా మరిచిపోవచ్చుగాని అమ్మ పేరుని మటుకు మరువగూడదురా”
“మాయమ్మ పేరు నాకు గుర్తుండ్లా తాతా!”
“అమ్మంటే కన్నతల్లి మటుకే కాదురా. అమ్మంటే అమ్మబాస కూడా. అమ్మంటే అమ్మ నేల కూడా”
ఇవి ఓ తాతా మనవడి మధ్య జరిగిన మాటలు. అమ్మ బాసని, అమ్మ నేలనీ మరువకూడదన్న తాత మాటలు ఓ మనవడిని విడువక పట్టి నడుపుతుంటే ఆ తాత మాటల స్ఫూర్తితో ఆ మనవడు వ్రాసిన కథలే ఈ “ప్రళయకావేరి కథలు”. అచ్చమైన నెల్లూరు మాండలికంలో వ్రాసిన కథలు. ఆ మనవడి పేరు బక్కోడు. ఆ బక్కోడు ఎవరో కాదు ప్రవాసాంధ్ర రచయిత స.వెం.రమేష్.
రమేష్ గారు 2009 సంవత్సరానికి గాను తానా వారి గిడుగు రామమూర్తి స్మారక పురస్కారానికి ఎంపిక అయ్యారని తెలిసి ఆయన వ్రాసిన ప్రళయకావేరి కథలు గురించి ఓ నాలుగు మాటలు.
’ప్రళయకావేరి’-అసలు పేరే ఎంత అందంగా వుందో! నిజానికి ఈ కథలు చదివేదాకా ఈ పేరు గురించే నాకు తెలియదు. ఇది పులికాట్ సరస్సు అసలు పేరు. ప్రళయకావేరి…..పులికాట్…..ఒకే సరస్సుకి ఎంత వైవిధ్యమైన పేర్లు. పులికాట్…..పేరులోనూ, ఊరులోనూ తనదనం లేని ఉప్పుకయ్య అంటాడు రచయిత ఒక చోట. ఇప్పుడసలు ప్రళయకావేరి అన్న పేరే లేదు. ఆ సరస్సులో వున్న దీవుల గురించి, అ దీవులలోని పల్లెలు, ఆ పల్లెలోని జనాల గురించి వారి యాసలోనే చెప్పిన కథలు ఈ ప్రళయకావేరి కథలు. నిజానికి ఇవి కథలు కాదు-ఓ వ్యక్తి జ్ఞాపకాలు, అందుకే ఆర్ద్రంగా వుంటాయి, మనస్సుని కదిలిస్తాయి. ఇవన్నీ ఆంధ్రజ్యోతి వారపత్రికలో కథలుగా వచ్చినప్పుడు అడపాదడపా చదువుతుండేదాన్ని. అప్పుడంతగా మనస్సుని కదలించలేదు కాని పుస్తకంగా చదువుతుంటే మాత్రం నాకు తెలియకుండానే నా కళ్లవెంట నీళ్లు వచ్చేవి. ఈ కథలు చదువుతుంటే మరో నామినినో ఖదీర్ బాబునో చదువుతున్నట్టు వుంటుంది. అభివృద్ధి పేరుతో ఎన్ని పల్లె బ్రతుకులు సమాధి అవుతున్నాయో కదా అనిపిస్తుంది. శ్రీహరికోట కూడా ఈ దీవులలో ఒక దీవే.
ఈ కథలను నేనెందుకు రాసానంటే అంటూ ముందుమాటగా రచయిత ఇలా చెప్తాడు.
“ఇది వరకు ఏడాదికొకసారి ఎండే ప్రళయకావేరి ఇప్పుడు ఏడాదికొకసారి ఎప్పుడన్నా అరుదుగా నిండుతోంది. ఇప్పుడు ప్రళయకావేట్లో అప్పటి జానపదాలు లేవు. తమద సంగటి, రొయ్య పులుసు లేవు. ప్రళయకావేరి పుట్టుకను గురించి కథలు చెప్పేవారు లేరు. ఇదంతా, ఇవన్నీ కళ్లముందే ఒక్క బతుకులోనే, తటాలున, చటుక్కున మాయమై పోవడం, అంతరించిపోతున్న ఆ సరస్సు జీవనాన్ని చూస్తూ ఏమీచేయలేక, వూరుకోలేక నరకయాతన పడడం…ఆ భావాల్ని అక్షరాల్లో వ్రాయడం కష్టం. అయినా నా భావాలను నలుగురితో పంచుకోవాలనుకున్నాను, ఆ భావాలకు అక్షర రూపమే నా ప్రళయకావేరి కథలు”.
మొత్తం 21 కథలు. ప్రళయకావేరి, అందులో తాత గారి దీవయిన జల్లల దొరువు, దాని చుట్టూ ఉండే ఇతర దీవులు, అడవులు, అక్కడి ప్రజలు, పిట్టలు…వీటి చుట్టూనే అన్ని కథలు నడుస్తాయి. పల్లెల్లో వేసుకునే పొడుపు కథలు, బోగాతాలు, నాటకాలు, సావాసగాళ్లు, అల్లరి ఆటలు, చిలిపి పనులు, భయాలు, అలకలు, ఉప్పు కయ్యలు, వలస పిట్టలు…ఇవే కథా వస్తువులు. శైలి, శిల్పం, కథనం, పాత్ర చిత్రణ–వీటి గురించే విశ్లేషించే అంత స్థాయి నాకు లేదు కాని ఇవి తప్పక చదవవలిసిన కథలు అని మాత్రం చెప్పగలను. దేనికదే ఓ ప్రత్యేకం.
రచయిత ఓ పిల్లవాడిగా మన ముందు నిలబడి తన స్వగతం చెప్తున్నట్లు వుంటుంది. ఆయన చెప్పే తీరు ఎలా వుంటుందంటే మనల్ని కూడా ఆయనతోపాటు ఆ ప్రళయకావేరి దీవులకి తీసుకెళ్లిపోతారు. అంతా మన కళ్లతో చూస్తున్నట్టే వుంటుంది. స్వచ్చమైన పల్లె జీవితాలు, అందులో వుండే సొగసు, కష్టాలు, అనుభూతులు, ఆప్యాయతలు, బంధాలు, అమాయకత్వం, దైన్యం, వలసలు, అంతరించిపోతున్న పల్లెలు మన కళ్లముందు కదలాడుతుంటాయి. మన వూరి గురించిన, మన బతుకు గురించిన జ్ఞాపకాలని ఇంత అందంగా అక్షరబద్దం చెయ్యొచ్చా అనిపిస్తుంది ఈ కథలు చదువుతుంటే (వింటుంటే)!
అసలు కొన్ని చోట్ల ప్రళయకావేరి గురించిన వర్ణనలు చదువుతుంటే అమ్మ బాసలో వర్ణనలు ఇంత చక్కగా చెయ్యొచ్చా అన్నట్టు వుంటాయి. ఆ వర్ణన కూడా అతి సహజంగా వుంటుంది. ఎక్కడా తెచ్చిపెట్టుకున్న పదగాంభీర్యం వుండదు. మచ్చుకి కొన్ని:
“అబయా, నలగామూల దాటినాక, పెళయకావేరమ్మకు సక్కలగిలెక్కువ, మునేళ్లు అదిమిపెట్టి నడవండి. లేకపోతే గెబ్బిడు ఎంట్రకాయల్ని జవరాల్సి పడతాది”
సరస్సుకి సక్కలగిలి…ప్రకృతితో మమేకం అవటం అంటే ఇదేనేమో.
“ఉల్లంకి పిట్టలు వేలకు వేలు బార్లు కట్టి నిలబడి ఉన్నాయి. వాటి రెక్కల పసిమి చాయ, నీటి నీలి వన్నె, ఎండ బంగరు రంగు కలిసి ప్రళయ కావేరి కొత్త హొయలు పోతుంది”.
ఆ వర్ణాల కలయికని అలా కళ్ల ముందు ఊహించుకుంటే ఎంత బాగుందో కదా!
“సందకాడ సన్నజాజి పూసినట్టు సన్నంగా నవ్వినాడు ఆ పిలగాడు”
“అవ్వ నీలికోక మింద పచ్చపూల మాదిరిగా నాలుగు తట్టులా నీలాపు నీల్లతో నిండిన ప్రళయకావేట్లో పచ్చపచ్చని దీవులు ఉంటాయి”
ఇలాంటి వర్ణనలు ఎన్నెన్నో! చదివితే కాని వాటి రుచి తెలియదు!
దీవుల పేర్లు, అక్కడ దొరికే పండ్ల పేర్లు, వలస పిట్టల పేర్లు, వంటకాల పేర్లు, సావాసగాళ్ల పేర్లు(నేనయితే ఈ పేర్లకోసమే మళ్లీ మళ్లీ చదువుతుంటాను ఈ కథలు), అన్నిటిలో ఒక స్వచ్చత, ఒక లయ కనిపిస్తాయి.
“కాశెవ్వ బోగాతం” కథలో బోగాతం ఆడేటప్పుడు కాశెవ్వ చేసే రచ్చకి పగలపడి నవ్వేస్తాం. అలాగే “పాంచాలి పరాభవం” కథలో మునసామి పాంచాలి వేషంలో చేసే హంగామా చదివి తీరాల్సిందే. ఇక ఓ “ఎచ్చలకారి సుబ్బతాత”-ఇలాంటి వారు మనకి ప్రతి పల్లెలో కనిపిస్తుంటారు. తుమ్మ మొదుల్ని పట్టుకుని దొంగ అనుకుని బాదటం, “కత్తిరిగాలి” కథలో సుబ్బ తాత నారతాతని దొంగనుకుని పట్టుకుని కొట్టటం, దొంగను పట్టుకున్న హుషారులో పంచె ఊడిపోయింది కూడా పట్టించుకోని వైనం ఈ కథలు చదివేటప్పుడు పక్కన ఎవరూ లేకుండా చూసుకోండి మరి.
కాశవ్వ బాగోతాన్ని, సుబ్బయ్య తాత ఎచ్చలకారి తనాన్ని చదువుతుంటే వీళ్లెవరో మనకి తెలిసినవాళ్లలా ఉన్నారే అని అనిపిస్తే అది మన తప్పు కాదు.
“ఆడే వొయిసులో ఆడాల” అంటూ బక్కోడు వాళ్ల ఆటల గురించి, సావాసగాళ్ల గురించి, వాళ్లు తెచ్చుకున్న అప్పచ్చుల గురించి చెపుతుంటే మనకి కూడా ఒక్కసారి మన చిన్ననాటి స్నేహితాలు గుర్తుకొస్తాయి. ఆడుకోవటానికి వెళుతూ అమ్మకి తెలియకుండా ఒళ్లో వేసుకెళ్లిన వేరుశనగ కాయలు, బెల్లం, అటుకులు, జామ కాయల్లోకి ఉప్పూ కారాల పొట్లాలు గుర్తుకొస్తాయి.
మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా బాయిలోకి దూకి ఈత కొట్టారా, కొడితే మరి బాయిలోకి ఎన్ని రకాలుగా దూకగలరో చూయించగలరా! గెడ్డపార దూకుడంట, చిలక దూకుడంట, పిల్లేరిగొంతు దూకుడంట-నాకయితే ఈ దూకుళ్లన్నీ ఎవరైనా దూకి చూపిస్తే చూడాలని ఎంత కోరికగా వుందో!
పల్లెల్లో పిల్లల్ని అసలు పేర్లతో ఎవరూ పిలవరు. అసలు వాళ్ల అమ్మనాన్నలకే వాళ పేర్లు గుర్తుండవు. అన్నీ మారు పేర్లే, అవే అసలు పేర్లయి స్థిరపడిపోతాయి. మరి మన బక్కోడి సావాసగాళ్ల పేర్లు ఏంటో తెలుసా…కత్తోడు, పొండోడు, దిబ్బోడు, పొప్పోడు, కర్రోడు, బర్రోడు, ముద్దలోడు, పెగ్గోడు…
బండి కట్టటం కూడా ఒక కళే అంటూ తన తాత బండి కట్టే విధానం గురించి “కొత్త సావాసగోడు” కథలో మనకి వినిపిస్తాడు. ఈ కథలోనే పల్లెల్లో మనుష్యులకి పశువులకి మద్య వుండే అనుబంధాన్ని స్పృశిస్తాడు.
“పద్దినాల సుట్టం”, “తెప్పతిరనాళ”, “దాపటెద్దు తోడు”, “ఆడపొడుసు సాంగెం”, “వొళ్లెరగని నిదర”…..ఇవి మనల్ని ఏడిపించే కథలు.
“పద్దినాల సుట్టం” కథలో తమకి అనుకోకుండా దొరికి ఓ పది రోజులు తమతో వున్న మిద్దోడు (వీళ్లు పెట్టుకున్న పేరే) అవ్వని కాపాడబోయి ఓ మైసూరు కోడె కొమ్ములకి బలవ్వటం ఆ వూరి వాళ్లందరినే కాదు మనల్నీ కంట తడి పెట్టిస్తుంది.
“తెప్పతిరనాళ” కథలో తన స్నేహితుడు లోలాకు తిరణాలలో తప్పిపోవటం గురించి చదువుతుంటే అది మన కళ్లముందే జరిగినట్టుంటుంది. అసలు లోలాక్కి ఆ పేరుందెకొచ్చిదో తెలుసా!
“మా లోలాక్కి కుడి చెవుకింద, చెంప మింద సొరగింజంత పులిపిర్లు రొండు యాలడతా వుంటాయి-దానికే వోడిని లోలాకని పిలిచేది”.
ఈ కథ చదివాక కొన్నాళ్లు నేను కూడా లోలాకు కోసం వెతికా! ఇప్పటికీ ఎవరికైనా చెంపమీద పులిపిరి వుంటే కాస్తంత ఆసక్తిగా గమనిస్తా, ఏమో లోలాకు కావచ్చేమో అన్న ఆలోచనతో! అంతగా ఈ కథలతో పాటు ఆ కథలలోని మనుషులతో కూడా మనం మమేకం అయిపోతాం, అదీ ఈ కథల గొప్పతనం. ఓ మంచి కథకి ఇంతకన్నా కావలసింది ఏముంది?
నాకు బాగా నచ్చిన కథలలో “ప్రవాళ ప్రయాణం” కథ ఒకటి. ఎక్కడా ఆపకుండా చదివించే కథ ఇది. వాగులు, వంకలు, సెలలు, మింటిని తాకే మానులు, మానుకి మానుకీ నడాన వుయ్యాల మాదిర అల్లిన తీగలు, అడవిపూల వాసనలు, కొత్త పిట్టల పాటలు, మింటకు యెగిరుండే కొండలు, జరులు దూకి దూకి నున్నంగా మారిన బండలు…సిద్దలయ్య కోన…చదువుతుంటే ఎవరో మనల్ని చేయిపట్టి నడిపిస్తూ ఆ ప్రాంతాలని చూపించుతున్నట్టే వుంటుంది.
“చిన్నాయిన పాడిన బిల్లంగోయి పాటకి చిట్టెదురు వనంలోని చెట్టు చెట్టూ తలూపతా తాళం యేసినాయి!”
ఇక్కడ మనకి తెలీకుండానే మనం కూడా తలుపుతూ తాళం వేస్తాం!
తెలుగు పల్లెల్లో పొడుపు కథలు తెలియని వారు ఉండరేమో. “పుబ్బ చినుకుల్లో” కథలో ఈ పొడుపు కథలు మనకి రుచి చూపిస్తాడు.
“అంబాలు, అంబాలి మీద కంబాలు, కంబాలు మింద కుడిత్తొట్టి, కుడిత్తొట్టిమింద ఆసుగోలు, ఆసుగోలు మింద యీసి గుండు, యీసి గుండు మింద అరిక చెత్త, అరిక చెత్తలో రేసుకుక్కలు”
సింగార తోటలో బంగారు పొండు పండె, దాన్ని సింగి తినె, సింగారి తినె, చెల్లో చేప తినె, మందలో పొట్టేలి తినె, యెగిరే పిట్ట తినె, పొదిగే కోడి తినె, చెన్నాపట్నం చిన్నదాని చెంప చెళ్లుమనె”
ఇవే కాదు వరస పొడుపు కథలు కూడా ఉన్నాయి.
ఇదే కథలో “సలికాలం సాయిబొయిన అమ్మ నేతకోక, వానాకాలం చిక్కంగా అల్లిన జమ్ముగూడ, యెండాకాలం సల్లని కానగమాను నీడ, యీటిల్లో ముడుక్కుని, ఒదిగి, వొళ్లిరుసుకోని బతుకు దేనికి? బొట్టికింద కలుగులోని పందికొక్కు బతుకే మేలు” అని అంటాడు…..నిజమే “దేనికి ఈ బతుకు” అనిపిస్తుంది మనకి కూడా.
అందరికీ వుగ తెలీని వొయిసులో దొరికే “అమ్మ పాల కమ్మదనం” నాకు పన్నిండేళ్ల వొయిసులో దొరికింది అని చెప్పుకుంటాడు ఓ కథలో. ఆ కథలోనే ప్రళయకావేరి అందాల గురించి ఆయన మాటలలోనే
“ఎండినప్పుడు సూడాల ప్రళయకావేరిని—ఎర్రటి యెండలో, మంచు పరిసినట్టు తెల్లంగా తళ తళ మెరుస్తుంటాది. రేత్రిళ్లు తెల్లటి యెన్నిల వుప్పు మిందబడి యేడు వన్నెలతో తిరిగి పైకి లేచి పోతుంటాది”.
“అడివి నీడలు ప్రళయకావేరమ్మ కట్టుకున్న తెల్లకోకకి నల్లంచు మాదిరుండాయి”.
ప్రకృతికి మించిన చిత్రకారుడు ఉన్నాడా అనిపిస్తుంది ఈ వర్ణనలు చదువుతుంటే.
తొలకరితో పాటు పొలం గట్లెమ్మట, పుట్లెమ్మట వచ్చే పుట్టకొక్కులు, చిత్తలో వచ్చే చెవుల పిల్లులు, ఇసుళ్లు, మిణకర బూసులు…వీటి గురించి తెలుసుకోవాలంటే “సందమామ యింట్లో సుట్టం” కథ చదవ్వలిసిందే.
“వసంతా చెవుల పిల్లులు యెట్ట బొయినాయి మే?”
“ఎరగం, సందమామ యింట్లో మా సుట్టముండాడు, చూసేసొస్తాము అంటే కట్టు ముళ్లు యిప్పినాము. అమాసకాలం గదా, సందమామని యెతకతా యెట్నో పోయినట్టు వుండాయి”.
ఇక “అటకెక్కిన అలక”, “పరంటీది పెద్దోళ్లు”, “మంట యెలుతుర్లో మంచు”…కథల్లో పల్లెల్లో సహజంగా వుండే అలకలు, కోపాలు, ఉక్రోషాలు, తిట్లు, ఎచ్చులు, ఎత్తులు-పై ఎత్తులు కనిపిస్తాయి…..మంచి సరదాగా వుంటాయి ఈ కథలు.
ప్రళయకావేరి పేరే కాదు దానిలో కలిసే ఏరుల పేర్లు కూడా చాలా అందంగా వుంటాయి. అరుణ, కాళంగి, ప్రవాళం, సువర్ణముఖి…వీటికి సారె పెట్టటం అనే సంప్రదాయాన్ని “ఆడపడుసు సాంగెం” కథలో చెప్పుకొస్తాడు. ప్రళయకావేరి ఉగ్రరూపం దాలిస్తే ఎలా వుంటుందో కూడా చూపిస్తాడు ఈ కథలో. ప్రళయకావేరితో అక్కడి ప్రజల జీవితాలు ఎంతగా ముడిపడి ఉండేవో మనకి ఈ కథ చదివితే అర్థం అవుతుంది.
ఈ కథలన్నీ తాత చుట్టూ అల్లుకున్న కథలే. తాత ప్రస్తావన లేకుండా ఏ కథా లేదు. ప్రళయ కావేరి ఒళ్లోనే చనిపోవాలనుకున్న తాత అందుకోసం తన ప్రాణాలు కళ్లల్లో నిలుపుకొని ఆ ప్రళయ కావేరిలో కనుమూయటంతో ఈ కథలు కూడా ముగుస్తాయి, చదివే మన కళ్లలో కన్నీళ్లు మిగులుతాయి.
ఈ కథలన్నీ చదవటం అయ్యేటప్పటికి ఆ కథలలోని మనుషులు మనకు కూడా ఆత్మీయులయిపోతారు. అయ్యో వీళ్లంతా ఇప్పుడు ఎలా వున్నారో ఏమయిపోయారో అని మనసు భారం అవుతుంది.
మనస్సు ఇష్టపడ్డప్పుడే కాదు మనస్సు కష్టపడ్డప్పుడూ చదువుకోవాలనిపించే కథలు ఈ ప్రళయకావేరి కథలు.
***************************************************************************************************
ప్రళయకావేరి కథలు (Pralaya Kaveri kathalu)
-స.వెం.రమేశ్
ప్రచురణ: మీడియా హవుస్ పబ్లికేషన్సు
పేజీలు: 135
వెల: 50 రూపాయలు
ప్రతులకు:
మీడియా హవుస్ పబ్లికేషన్సు, విద్యానగరు, హైదరాబాదు
విశాలాంధ్ర బుక్ హవుస్
నవోదయ బుక్ హవుస్, కాచిగూడ, హైదరాబాదు
April 27, 2010
విరామం తరువాత-తల్లులూ మీకు జోహార్లు!
మనిషికి మరపు అనేది నిజంగా ఓ వరం..లేకపోతే మన జీవితాలల్లో సంభవించే ఆకస్మిక అనూహ్య సంఘటనలకు ఈ పిడికెడు గుండె ఎప్పుడో ఆగిపోయేది..ఏమో నా గుండె కాస్త కఠినమేమో!...
తల్లులూ మీకు జోహార్లు!
ఇక అసలు విషయానికి వస్తే నిన్న ఓ టి.వి చానల్లో పసిపిల్లలచేత చేయించే అసభ్య ఆటల గురించి ఓ చర్చా కార్యక్రమం వచ్చింది. దానిలో తల్లిదండ్రులు..ఆ కార్యక్రమ మెంటల్ మెంటార్సు చేసిన వ్యాఖ్యలు చూసి జుగుప్ప కలిగింది. పిల్లలతో అసభ్యకర డాన్సులు చేయించటంలో ఎంతమాత్రం తప్పులేదంట..పిల్లలు ఇష్టంగా చేస్తుంటే మీకేంటి బాధ అంటున్నారు ఆ తల్లులు. ఓ మహాతల్లి అయితే మీరు ఇలాంటి కార్యక్రమాల పట్ల అభ్యంతరం చెప్తున్నారు కాని స్త్రీల మీద జరిగే లైంగిక వేధింపుల గురించి మాట్లడరే అని సంధ్య గారిని ఫోనులో నిలదీస్తుంది....దానికి తల్లుల చప్పట్లు. ఓ ఐదు నిమిషాలు చూసేటప్పటికి చీ వీళ్లకి చెప్పటం కన్నా అడవిలో మృగాలకి చెప్పవచ్చు అనిపించింది.
అభం శుభం తెలియని పిల్లల చేత వెకిలి నృత్యాలు చేయిస్తుంది కాక దానికి సమర్థింపులు....మా పిల్లలకి ఇష్టమయింది చేస్తున్నారు...ఏం చదువు ఒక్కటే ఉంటే సరిపోతుందా..మిగతావి అక్కర్లేదా అని ఎదురుదాడులు...పాపం ఆ పసిమొగ్గలు...ఏది సభ్యత ఏది అసభ్యతో తెలియని వయస్సు...ఆ వయస్సులో పెద్దవాళ్లని అనుకరిస్తూ పాటలు పాడటం డాన్సులు చేయటం సహజం...ఆ ఉత్సాహాన్ని..అభిరుచిని సరయిన దారిలో పెట్టాల్సిన తల్లులే ఇలా మాట్లాడుతుంటే! ఏ డాన్సు కార్యక్రమం అన్నా చూడండి...ఓ పదిమంది న్యాయనిర్ణేతలు....వాళ్ళ వెకిలి చేష్టలు.....అసభ్య వ్యాఖ్యలు.....తిట్లు....ఏడుపులు...ఓడిపోయిన వారి అక్కసు.....నానారకాల భావోద్వేగాలు...ఆ వయస్సులో పిల్లలకి నేర్పించాల్సింది అవేనా!
దీనికంతటికి కారణం....ఎలాగోలా తమ పిల్లలు టి.విల్లో కనపడాలి అనే వెర్రి.. ఒక్క షోతో రాత్రికి రాత్రే పేరు... డబ్బులు వచ్చేయాలన్న దురాశ. ఈ పోకడలు ఈ డాన్సు షోలలోనే కాదు పాటల కార్యక్రమాల్లో కూడా మొదలయ్యాయి. బాలసుబ్రమణ్యం చేసే పాడుతా తీయగా కార్యక్రమం ఎంత హుందాగా ఉంటుంది..మిగతా కార్యక్రమాలు ఎలా ఉంటున్నాయి? ఓ అతిధి..అతనితో కలిసి బాలు పంచుకునే అలనాటి ముచ్చట్లు (అసలు కన్నా ఈ కొసరే ఎంతో బాగుంటుంది).....పాడిన వారికి ఆమూల్యమయిన సలహాలు...వెరసి అందరికి అదొక అందమయిన అనుభూతి.
అమ్మా తల్లుల్లారా మీ పిల్లల వ్యక్తిత్వాలతో ఆటలాడే హక్కు....అధికారం మీకు లేవని తెలుసుకోండి. వాళ్లని స్వేచ్చగా ఎదగనివ్వండి..వాళ్ల బాల్యాన్ని ఫణంగా పెట్టి మీరు పబ్బం గడుపుకోవాలని చూడకండి!
February 1, 2010
స్నేహమా---ఇలా మూగవోయావెందుకమ్మా!
సామాన్యంగా నేను కవితలు చదవను..మొదటిగా నేను కవితలు చదివింది రాధిక గారి బ్లాగులోనే. తన గురించి వ్రాయలన్న ఉద్దేశ్యంతోనే నేను ఆవిడ కవితలు చదివాను. చదివాక తెలిసింది ఆవిడ కవితలు ఎంత సరళంగా ఉంటాయో! చిన్ని చిన్ని మాటల్లో తను చెప్పాలనుకుంది అందంగా చెప్పటంలో ఆవిడ నేర్పరి. రాధికా..ఇంకొక రెండు కవితలు వ్రాస్తే మీరు సెంచరీ కొడతారనుకుంటాను..ఆ సెంచరీ కోసమన్నా వ్రాయండి!
తన బ్లాగులోని తాజా కవిత "నా ఊరు". ఈ కవిత చదివి సొంత ఊరు గుర్తుకు రాని వాళ్లు ఎంతమంది ఉంటారు?
"నేనెళ్ళిపోయానన్న బాధేమో
ఊరి మధ్య రావిచెట్టు
ఆకురాల్చేసింది
తన అవసరం లేదనుకుందేమో
రచ్చబండ బీటలేసింది
గుడి మెట్టు,చెరువు గట్టు
నాకోసమే ఎదురుచూస్తున్నట్టున్నాయి
జామచెట్టుకేసిన ఊయల
కిర్రు చప్పుళ్ళ ఊసేలేదు
ఇక రాననుకున్నారో ఏమో
అయినవాళ్ళు కొందరు
చెప్పకుండానే దాటిపోయారు
ఇపుడా ఊరు
నా చరిత్రకి
శిధిల సాక్ష్యంగా మాత్రమే మిగిలింది
తిరిగి వెళ్ళకపోయినా బాగుండును
జ్ఞాపకాల్లో అయినా సజీవంగా వుండేది నా ఊరు"
- ***************************************
- కవిత్వం రాయడం నాకు చేతకాదు,భాష మీద పెద్దగా పట్టు కూడా లేదు అంటూనే చక్కని కవితలతో, స్నేహపూర్వక వ్యాఖ్యలతో అందరిని అలరిస్తూ తెలుగు బ్లాగు లోకంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని, అభిమానులిని ఏర్పరుచుకుని "తోచిన భావాలకు తెలిసిన భాషలో మాటలు అల్లుకుని ఆనందించే సాధారణ పల్లెటూరు అమ్మాయిని" అంటూ వినమ్రంగా ఒదిగే ఉండే మన పక్కింటి అమ్మాయి, ఓ అసలు సిసలైన తెలుగింటి అమ్మాయి--- రాధిక. తెలుగు బ్లాగులలో రాధిక వ్యాఖ్య లేని బ్లాగు ఉండదు అంటే అతిశయోక్తి కాదేమో!!
అక్షర దోషాలుంటే మన్నించండి అంటూ ఆగస్టు 2006 లో తన కవితల ద్వారా బ్లాగ్లోకం లోకి ప్రవేశించిన రాధిక త్వరలోనే అక్షర దోషాలను దిద్దుకోవటమే కాదు తనకంటూ ఒక ప్రత్యేక ఒరవడిని, శైలిని ఏర్పరుచుకున్నారు.
ఓ చల్లని సాయంత్రం తొలకరి జల్లులతో తడిసిన మట్టివాసన పీలుస్తూ, సన్నజాజి చెట్టు దగ్గర పడక కుర్చీలో కూర్చుని, వేడి వేడి పకోడీలు తింటూ, రేడియోలో ఇష్టమైన పాటలు వింటూ, యండమూరి పుస్తకం చదువుతుంటే ఎంత ఆహ్లాదంగా ఉంటుందో రాధిక కవితలు చదువుతున్నా అంత ఆహ్లాదంగా మనసుని సేద తీర్చేవిగా ఉంటాయి. భావుకత, బేలతనం, అమాయకత్వం, ఎడబాటు, ఎడబాటుతో వచ్చే అవేదన అన్నీ కలగలిపి ఉంటాయి తన కవితలలో. అభివ్యక్తీకరించడంలో ఒక కొత్తదనం ఉంటుంది తన కవితలలో. పంటపొలాలమధ్య పాటలా మా స్నేహం అంటూ ఎక్కువగా స్నేహం గురించి రాసే తను "నేస్తాలు సరదాగా ఇచ్చిన గడ్డిపరకలను కుడా అపురూపం గా దాచుకున్నదానిని" అంటూ స్నేహానికి తను ఇచ్చే విలువని చెప్పకనే చెప్పారు.
2006 ఆగస్టు లో మొదలుపెట్టి ఇప్పటివరకు సుమారు 98 కవితలు రాసారు. ఈ మధ్య కాలంలో రాశి తగ్గినా వాసి ఏ మాత్రం తగ్గలేదు. తన కవితలకు చిత్రాలు ఓ అదనపు ఆకర్షణ. కవితలకు తగ్గ చక్కని ఫోటోలను జతచేస్తుంటారు. లలిత లలితమైన పదాలతో తను చెప్పదలుచుకుంది క్లుప్తంగా అర్థవంతంగా చెప్పగలగటంలో నేర్పరి రాధిక. తన కవితలలో తాజాదనంతో పాటు వైవిధ్యానికీ ఏమి తక్కువ లేదు. "అలారం మోతలతో ఉలికిపాటు మెలకువలు" అంటూ ప్రస్తుత జీవనశైలిని ప్రతిబింబించే కవితలు కూడా రాసారు. కొన్ని కవితలలో పల్లెటూరి అమాయకత్వం మనల్ని పలకరిస్తే, మరి కొన్నిటిలో ఏదో పోగోట్టుకున్న అవేదన, నిస్పృహ, ఎడబాటు మన మనసులిని కదిలిస్తాయి. మన అనుభవాలని...మన మనస్సులోని భావాలను చెపుతున్నట్లు ఉంటాయి మరికొన్ని.
కవిత గురించి తన అభిప్రాయం తన మాటలలోనే చూడండి.
"మనసులోని భావాలు
మాటలుగా చెప్పలేని వేళ
అవి కలై … అలలై
అనుభూతుల తుఫానులు చెలరేగి
యెద తీరాన్ని తాకినప్పుడు
మది లోతుల్లో పలికేదే కవిత"
అరే...ఇదేమిటి?
రాధిక వ్రాస్తున్న ఇంకొక బ్లాగు సంగతులు. దీనిలో చాలా తక్కువగా వ్రాస్తుంటారు.
మా ఊరు-నా బాల్యం లో గోదారమ్మకు గట్టయి మురిసే ఊరేమాది..భూదేవమ్మకు బొట్టయి మెరిసింది" అంటూ తన ఊరి గురించి తన బాల్యం గురించి ఎన్నో సంగతులు చెప్పారు.
మనిషికి డబ్బు ఎంతవరకు ఆనందాన్నిస్తుంది?ఏ స్తాయి దాటాక డబ్బుకి విలువ తగ్గిపోతుంది? అంటూ అప్పుడప్పుడు మనల్ని ప్రశిస్తూ కూడా ఉంటారు.
అన్నట్లు కవితలే కాదు కథలు కూడా వ్రాయగలనని ఒకటి రెండు కథలు కూడా ఈ బ్లాగులో వ్రాసారు.
ఇలా చక్కగా వ్రాయగలిగినవాళ్లు వ్రాయకుండా ఉండటం తగని పని. రాధిక గారు మరలా విరివిగా వ్రాయాలని....వ్రాస్తారని ఆశిస్తున్నాను. Read more...
January 27, 2010
అసలు ఆత్మ లేని ఫిర్ మిలే సుర్ మేరా తుమ్హారా!
మిలే సుర్ మేరా తుమ్హారా ..........తలుచుకోగానే గుండెలు ఉప్పొంగే గీతం!
రెండు దశాబ్దాల క్రితం 1988 ఆగస్టు 15 న దూరదర్శన్‌లో వచ్చిన మిలే సుర్ మేరా తుమ్హారా..ఈ గీతం వినని భారతీయుడు.......పరవశించని భారతీయుడు ఉండి ఉండడు. దేశం మొత్తాన్ని ప్రాంతాలకతీతంగా ఓ ఊపు ఊపిన గీతం. అప్పట్లో ఆ గీతం వచ్చిన 6 నిమిషాలు అలా కళ్ళప్పగించి చూసేదాన్ని. భీంసేన్ జోషి స్వరంతో మొదలయ్యి..అలా అలా గాలిలో తేలిపోయి ..చివరిగా పిల్లలు జాతీయ జండా ఆకారంలో నిలబడటంతో పాట అయిపోతుంది...అప్పుడే అయిపోయిందా అన్న ఓ అసంతృప్తితో కిందకి దిగివచ్చేదాన్ని.
దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ ఎప్పటికీ బారతీయుల గుండెల్లో చిరంజీవి ఆ గీతం! ప్రసిద్ధ సినీ వ్యక్తులు, క్రీడారంగ ప్రముఖులు, నాట్య ప్రముఖులు, సంగీత ప్రముఖులే కాదు..సామాన్య మానవులకు కూడా పెద్ద పీట వేసి తీసిన గీతం అది. పీయూష్ పాండే వ్రాసిన ఈ గీతం గురించి ఎంత చెప్పినా తక్కువే! నాకు ఆ పాటలో ఓ కుర్రవాడు ఏనుగు మీద ఎక్కి లయబద్ధంగా ఊగుతూ పాడే బిట్టు చాలా చాలా ఇష్టం. 14 భాషలల్లో భారతదేశం ఆ మూల నుండి ఈ మూల దాకా ప్రాంతీయత ఉట్టిపడేట్టు చక్కని ప్రదేశాలల్లో తీసిన గీతం అది.
అందులో తెలుగులో వచ్చే వ్యాక్యాలు
"నా స్వరమూ నీ స్వరమూ సంగమమై
మన స్వరంగా అవతరించే"
ఈ తెలుగు వాక్యాలకు అప్పటి గీతంలో నటించింది పేరున్న వ్యక్తులు కాదు..కానీ చాలా సహజంగా అందంగా ఉంటారు ఆ జంట!
ఇప్పుడు మరలా గణతంత్ర వజ్రోత్సవ వేడుకల సందర్భంగా ఆ గీతాన్ని చేతికొచ్చినట్లు మార్చి వ్రాసి....నోటికొచ్చినట్టు పాడి..దాన్ని ఏ కీలుకా కీలు విరిచేసారు. సినీప్రముఖులతో, జులపాల జుట్టులతో.... ర్యాప్, పాప్‌లతో నింపేసారు..వ్యాక్యాలని ముక్కలుముక్కలుగా విరిచి ఆ పాటని ఎన్ని హింసలు చిత్రవధలు పెట్టొచ్చో అన్నీ పెట్టేసారు. చిత్రీకరణలో నాకెక్కడా సహజత్వం కనిపించలేదు. దీపికా పడుకొనే వేసుకున్న గౌను చూస్తే.......పాత దాంట్లో వాళ్ల నాన్న ప్రకాష్ పడుకొనే గుర్తొచ్చి తలవంచుకున్నా! లత మువ్వొన్నెల కొంగు ఉన్న చీర భుజాల చుట్టూ కప్పుకుని ఎంత హుందాగా పాడింది! అలాంటి లతకి దీనిలో చోటు లేదు. ఉందల్లా చొక్కా విప్పి కండలు చూపించే సల్మాన్ ఖానుకు, షారుక్, అమీర్, బచ్చన్ కుటుంబ సభ్యులకు.....
ఆరంభం రెహమానుతో బాగానే ఉన్నా ఉన్నకొద్దీ అసహజత్వ పాళ్ళు ఎక్కువయి పోయాయి. అమితాబ్ మాటలు అస్సలు నప్పలేదు. కొత్తదాంట్లో తెలుగు వ్యాక్యాలను మహేష్ బాబు మీద చిత్రీకరించారు..ఇంకో రెండు లైనులు కూడా కలిపారు..ఏం కలిపినా పాత దాని చార్మ్ దీనిలో లేదు. దక్షిణాది నుండి మహేషు బాబు, విక్రం, మమ్ముట్టి, శోభన, జేసుదాస్, సూర్యలకి స్థానం కల్పించారు. మొత్తం మీద వీళ్ల దృష్టిలో మన దేశంలో ప్రముఖ వ్యక్తులంటే సినీ నటులే అన్నట్టుగా ఉంది. మిగతా రంగాలల్లో ప్రముఖులు పెద్దగా వీళ్ల కళ్లకి ఆనినట్లు లేరు. ఓ కలాం, ఓ టాటా, ఓ లత, ఆశా, విప్రో ప్రేంజీ, నారాయణమూర్తి, మన బాలసుబ్రమణ్యం....ఇలాంటి వారు ఎవ్వరూ లేరు.
ఒకందుకు మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది..ఈ రకంగా అన్నా పాత దాన్ని మరలా మనకు స్ఫురణకి తెచ్చి దాని గొప్పతనాన్ని మరోమారు మన కళ్లముందు నిలిపారు.
January 21, 2010
ఇక చాలు ఆపండి.......
ఈ రోజు తెలంగాణా JAC కన్వీనరు కోదండరాం గారు ఇంటరు బోర్డుకి వెళ్ళి పరీక్షలు వాయిదా వేయమని కోరుతున్నారు! చేసిందంతా చేసి ఇప్పుడు వాయిదాకోరటమేమిటండి..అది జరిగే పని కాదని మీకు బాగా తెలుసు. బందుల పేరుతో విద్యార్థుల జీవితాల్ని ఇలా ఆడించే అధికారం మీకెవరిచ్చారు..ముందు అది చెప్పండి. ఒక రోజు...... రెండు రోజులు కాదు...వరుసగా రెండు నెలలనుండీ బందులే. కాలేజి పూర్తి సమయం జరిగిన రోజున అమ్మయ్య ఈ రోజు కాలేజి జరిగింది అని అనుకోవాల్సి వస్తుంది. ఈ రెండు నెలల్లో అలా అనుకున్న రోజులు వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. ఏ రోజు ఎవరు బందు చేస్తారో తెలియదు..ఎందుకు బందు చేస్తారో తెలియదు..కాలేజికెళ్ళి బందని పిల్లలు వెనక్కి తిరిగి రావటమే ఎక్కువగా ఉంటుంది..రోజూ వెళ్లటం రావటం..ఈ తిప్పలన్నీ ఎందుకు అని అసలు వాళ్లని కాలేజీలకి పంపని తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఈ వరుస బందుల వల్ల పిల్లల్లో చదువుపట్ల ఒక రకమయిన నిర్లిప్తత ప్రవేశించింది కూడాను!
సంక్రాంతి సెలవులు కూడా అయిపోయాయి ఇక కాస్త కాలేజి క్రమబద్ధంగా జరుగుతుంది అనుకునేటప్పటికి మరలా నిన్నా ఈ రోజు బందు. ఈ సమయంలో రెండు రోజుల బందు అవసరమా! ఇక ఈ అధికారక బందులతో పాటు అనధికార బందులు ఎన్నో. నవంబరు 28న మొదలయిన ఈ బందుల పర్వం నిరాటంకంగా సాగు...........తూనే ఉంది. చంద్రశేఖరరావు నవంబరు 29 న నిరాహార దీక్ష మొదలుపెడతారు అనగా ముందు రోజే అంటే నవంబరు 28న ఆ దీక్షకి మద్దుతుగా అని ఈ బందులు మొదలయ్యాయి. ఇక అప్పటినుండి ఒక రోజు తెలంగాణా JAC బందు..ఇంకొక రోజు రాజకీయ JAC బందు..మరో రోజు స్టూడెంటు JAC బందు..మరో రోజు మహిళా JAC బందు....ఇంకో రోజు SIF, మరు రోజు ABVP....ఎన్ని రకాల పేరులతో బందులు చెయ్యవచ్చో వీళ్ళదగ్గర నేర్చుకోవచ్చు..ఇకముందు వీళ్ళనెవరూ ఈ విషయంలో అధిగమించలేరు కూడా!
అసలు బందులు చేయటానికి వీళ్ళెంతగా అలవాటు పడిపోయారంటే ....బందు లేని రోజున వీళ్లకి నిద్రాహారాలు సహించవనుకుంటాను...మరుసటి రోజు ఏదో ఒక కారణం చెప్పి మరలా బందు షురూ...జనవరి 5 న తెలంగాణాపై డిల్లీలొ చర్చ జరిగిందా..దాని ముందు రోజు ఆ చర్చలకు మద్దతుగా ఇక్కడ బందు..ఇక జనవరి 5 నేమో..డిల్లీలో ఇంకా చర్చలు మొదలే అవ్వలేదు..ఇక్కడ ఉదయం పదిగంటలకల్లా కాలేజీలకు వచ్చేసి..బందు అని పిల్లలని వెళ్లగొట్టటం..ఏంటి ఈ బందులు..ఇవా బందులు?..చీ... రోతగా ఉందండి......ఇంకెన్నాళ్లు విద్యార్థుల భవిష్యత్తుని కాలరాచే ఈ బందులు.. నిజంగా మీరు ఆలోచన ఉన్నవాళ్లే అయితే..మీకు విద్యార్థుల పట్ల నిజమైన నిబద్దతతే ఉంటే..మీ రాజకీయ వైకుంఠపాళిలో విద్యార్థులని బలిచేయకండి...ఇక బందులు చాలు........ఆపండి.
కోదండరాం గారు మీరు స్వయానా ఆచార్యులు.......మీకు తెలుసు విద్యార్థులకి ఈ సమయం ఎంత ముఖ్యమో....దయచేసి వాళ్లకి బందులనుండి విముక్తి ప్రసాదించండి. మీరు ఇంటరు పరీక్షలు వాయిదా వెయ్యాలని కోరుతున్నారు..అవి వాయిదా వెయ్యటానికి కుదరదని మీకు బాగా తెలుసు...తెలిసీ అడగటం మీ రాజకీయంలో భాగమేమో మరి..తద్వారా మరో నాలుగు రోజులు బందు చెయ్యొచ్చన్న దురాలోచన కూడా అందులో ఇమిడి ఉందేమో!
ఇంటరు విద్యార్థులు ఒక్క ఇంటరు పరీక్షలే వ్రాయరు..రకరకాల పోటీ పరీక్షలకెళ్తారు. అవన్నీ ఏప్రియలు మొదటివారం తరువాత మొదలువుతాయి. IIT:...ఏప్రియల్ 11; AIEEE:...ఏప్రియలు 25; VIT:...ఏప్రియల్ 17...ఇవీ ప్రముఖ సంస్థలు నిర్వహించే పరీక్షా తేదీలు. ఇవి కాక KCET, BITS, GITAM వారి GAT......ఇలా దేశం మొత్తం జరిగే వివిధ రకరకాల పోటీ పరీక్షలు ఏప్రియలు, మే నెలల్లో జరుగుతాయి. వాటి తేదీలు కూడా ఎప్పుడో నిర్ణయించబడ్డాయి. వీటిల్లో కొన్ని ఆన్లైను పరీక్షలు.....ఒకసారి విద్యార్థి పరీక్ష తేది నిర్ణయించుకున్నాక మార్చుకునే అవకాశం ఉండదు. మనం ఇంటరు పరీక్షలు నిర్వహించినా నిర్వహించకపోయినా..ఆరు నూరయినా ఈ పరీక్షలల్లో ఏ ఒక్కటీ ఆగదు..వెనక్కి జరగదు. అంటే మార్చి చివరి వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటరు పరీక్షలు అయిపోవాలి. ఇప్పుడు ఇంటరు పరీక్షలు వాయిదా వేయటం ద్వారా పిల్లల మీద మరింత వత్తిడి పెంచటం తప్పితే ఉపయోగం ఉండదు. ప్రస్తుతం మీరు విద్యార్థులకి చెయ్యకలిగిన ఉపకారం ఏదయినా ఉంది అంటే అది ఇకనుండయినా ఈ బందుల దుష్టసాంప్రదాయం నుండి కాలేజీలకి మినహాయింపు ఇవ్వటం. JAC కన్వీనరుగా మీకు మా తల్లిదండ్రుల విజ్ఞపి ఇది.
కోదండరాం గారు ఇది విద్యార్థుల..మాలాంటి తల్లిదండ్రుల ఆవేదన మాత్రమే...ఇది అనేకానేక బందు బాధల్లో ఒక పార్శ్వం మాత్రమే! మీ బందుల వల్ల రోజు గడవటం దుర్భరమవుతున్న సామాన్య జనాలు కూడా ఉన్నారు..ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇకనుండి మీ ఉద్యమాన్ని బందురహితంగా సాగిస్తారని..సాగించాలని ఆశిస్తున్నాం....
January 13, 2010
బంతిపూల సంబరాలు
సంక్రాంతి అనగానే ముందుగా గుర్తొచ్చేది బంతి పూలు......
ఇంట్లో పూచే పూలకన్నా పొలాల్లో పూచే పూలు బాగా పెద్దవిగా మంచి కాంతివంతంగా ఉండేవి... అక్కడ మరి ఎరువులు, పెంటపోగు వేస్తారు కదా!....వాటిల్లో మంచి రాజాలాంటి పూలని ఏరి దండలు గుచ్చి వాకిటికి తోరణాలు కట్టేవాళ్ళం. ఈ తోరణాలు ఎండిపోయాక తీసి మరుసటి సంవత్సరం నారుపోయటానికి దాచిపెట్టేవాళ్లం. ఆ దాచిపెట్టిన వాటిని ఎప్పుడో మాకు మమ్మకి తెలియకుండా మా నాయనమ్మ ఎవరికో ఒకళ్లకి దానం చేసేసేది. తీరా నారుపోసే సమయానికి కనపడేవి కావు..మాకు మా చెడ్డ కోపం వచ్చేది. .ఏమన్నాఅంటే ఏం ఎవరికీ ఈకుండా అవన్నీ కట్ట కట్టుకుపోతారా....బంతి నారు ఎక్కడ పడితే అక్కడ దొరుకుద్ది ఏం నష్టం లేదులే అని దులపరించేసేది..
ఇవాళ బంతిపూలు కొందామని వెళితే కిలో 80 రూపాయలంట!...చెప్పొద్దూ...కళ్ళవెంట నీళ్ళు ఒక్కటే తక్కువ..మా అందమైన పొలాలు..అందులో బంతి మొక్కలు...మా ఊరు..వాకిట్లో ముగ్గులు..అన్నీ గుర్తుకొచ్చాయి..ఇక్కడేముంది?.....గొబ్బెమ్మలు లేవు....భోగిమంటలు లేవు...అరిసెలు లేవు..అందుకే ఈ టపా!
ఇవాళ యాదృచ్చికంగా తవ్వా ఓబుల్ రెడ్డి గారి బ్లాగు కనపడింది..అందులో గొబ్బి పాటలు ఉన్నాయి చూడండి.
ఇక ఈ సంక్రాంతికి ఇవాళ మా ఇంటి ముందు వేసిన ముగ్గులు. ఎదిగొచ్చిన కూతురు ఉంటే తల్లికి కొండంత అండ అంట! ఇప్పుడు నేను ముగ్గులు వేస్తే మా అమ్మాయి రంగులు దిద్దుతుంది..నాకు సగం పని తగ్గిందన్నమాట! ఇంకా వెయ్యాల్సిన ముగ్గులు ఉన్నాయి.. ..మరి మిగతా కబుర్లు వచ్చేసంక్రాంతికి...
January 1, 2010
వర్తమానం....గతం....తరం తరం.... నిరంతరం
డిసెంబరు 31, 2009.....11:59:01..మరో కొత్త సంవత్సరానికి కౌంటు డౌన్ మొదలవుతుంది.
అప్పుడే మరో సంవత్సరం గతం అయిపోబోతుంది..మరో సంవత్సరం వర్తమానం కాబోతుంది. కాలం ఎవరికోసం ఆగకుండా ఇలా పరుగులు పెడుతుంది. దానికి ఎవరితోనూ పనిలేదు..ఎవరికోసం ఎదురు చూడదు...ఒకటే పరుగు....పరుగు.... ఇలా సంవత్సరాలు గతించే కొద్దీ మనకూ వత్సరాలు నిండుకుంటున్నట్టేగా! మరి ఎందుకో ఇంతగా ఈ క్షణం కోసం ఎదురు చూస్తుంటాం...సంబరాలు చేసుకుంటాం!...
ఏ బరువూ బాధ్యతలు లేని 16 ఏళ్ల వయస్సులోని కొత్తసంవత్సర సంబరాలకి సంసార చట్రంలో ఇరుక్కున్న ఈ నలభైలలోని సంబరాలకి ఎంత తేడా. అప్పుడు....కొత్తగా హాస్టలు జీవితం..కొత్త కాలేజి..కొత్త పరిచయాలు..అర్థరాత్రి 12 సమీపిస్తుండగా ఏదో ఆనందం...ఓ ఉద్వేగం ...గ్రీటింగ్సు..స్వీట్సు..మొ
పెళ్లయ్యాక...మరో కొత్త లోకం..ఒకే వయస్సు.... కొత్తగా పెళ్లయిన జంటలు....ఓ పది పదిహేను కుటుంబాలు కలిసి ...క్లబ్బులో పార్టీలు ఉన్నా అక్కడ అంత ఎంజాయ్మెంటు ఉండదని ఎవరో ఒకరి ఇంటిలో అందరం కలిసి వేడుకగా వండుకుని తినటం....మెట్లు లేని క్వార్టరు పైకి ఎక్కి ఆ రాత్రంతా గడపటం..నార్త్ ఇండియన్ జంటల డాన్సులు....సౌత్ ఇండియన్ అమ్మాయిల పాటలు...మగవాళ్ళ పేకాటలు...
ఇంటిముందు వాకిళ్లల్లో కళ్లాపులు..ముగ్గులు...మా లైనులో సగం ఇళ్లముందు నేను వేసిన ముగ్గులు..వాటికి రంగులద్ది....పూలు చల్లి....ఉదయపు మంచుతెరల మధ్య వాటిని చూసుకుని మురిసిపోవటాలు...ఎన్నెన్ని మధుర జ్ఞాపకాల రంగవల్లులు!
దీనికన్నా ఓ పదిరోజుల ముందు మొదలయ్యే గ్రీటింగు కార్డుల సందడి..నేను స్వయంగా తయారు చేసి పంపుకునే శుభాకాంక్షల పత్రాలు.....మాక్కూడా చేసిపెట్టొచ్చుగా అని ఉడుక్కునే పక్కింటి స్వరాజ్యం గారు..ఏవి సుమా ఇప్పుడు ఆ పత్రాలు? సెల్లులో సంక్షిప్త సందేశాలు..మెయిలులో మూడు ముక్కల శుభాకాంక్షలుగా మిగిలిపోయాయా!..ఓ రెండు మూడు సంవత్సరాల క్రితం వరకు కూడా నేను స్వయంగా చేసిన గ్రీటింగు కార్డ్సు బందుమితృలందరికి పంపించేదాన్ని..అదేంటో ఇప్పుడు ఫోనులో మూడు ముక్కల్లో చెప్పాలన్నా ఏదో మొక్కుబడిగా చెప్పటం అయిపోతుంది.
ఇక ఈ భాగ్యనగరానికి వచ్చాక..మొదట్లో ఓ నాలుగయిదు సంవత్సరాలు హుషారుగా పార్టీలకి వెళ్లాం..శిల్పారామాలు తిరిగాం కానీ..తరువాత తరువాత ఏ సంబరాలు లేకుండా ఇంట్లో టి.వి లకి అంకితం అయిపోతున్నాం. నేనయితే టి.వి. ముందు పడుకుని హాయిగా ఓ కునుకు తీసి పన్నెండింటికి ఎవరయినా లేపితే లేచి నిద్రమోహంతోనే అందరికి శుభాకాంక్షలు చెప్పేసి పడుకుంటాను!లేపకపోతే అదీ లేదు.
ఈ రోజు మా అమ్మాయి తన స్నేహితురాలి ఇంటికి కొత్తసంవత్సర వేడుకలకి వెళ్తుంటే తనలో అప్పటి నన్ను చూసుకుని మరో తరం సంబరాలు మొదలయ్యాయి అనుకుంటూ నా గతంలోకి జారుకున్నాను.
ఇక అందరూ తీర్మానించుకునే కొత్త సంవత్సర తీర్మానాలకి మాత్రం నేను ఆమడ దూరం..డిక్టేటర్సుకి తీర్మానాలు ఉండవు ఫర్మానాలే కాని!
వచ్చు కాలం కన్నా గత కాలం మిన్న అనిపిస్తుంటుంది నాకెప్పుడూ! కొన్ని సంవత్సరాలు మంచో చెడో మనస్సుల మీద చెరగని ముద్రలు వేసిపోతుంటాయి...అలాంటి వాటిల్లో ఈ 2009 కూడా ఒకటి. ఒకదాని వెనుక ఒకటి ప్రకృతి వైపరీత్యాలు...విషాద సంఘటనలు....వైషమ్యాలు....ప్రాంతీయ చిచ్చులు..ఆటవిక దాడులు...ప్చ్..వీటికి అంతం ఎక్కడో..అదుపు ఎన్నడో! రాబోయే సంవత్సరంలో అన్నా వీలయినంత ప్రశాంతంగా అందరి జీవితాలు సాగాలని కోరుకుంటూ!