పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

April 27, 2010

విరామం తరువాత-తల్లులూ మీకు జోహార్లు!

 నా బ్లాగు ముఖం చూసి ఎన్ని రోజులయ్యిందో! ఈ మధ్య వ్యక్తిగత కారణాలవల్ల బ్లాగుల్లోకి రావటం లేదు, గత పదిరోజులుగా అడపాతడపా కొన్ని బ్లాగులు చూస్తున్నా నా బ్లాగుని మాత్రం పలకరించలేదు.  ఎప్పుడైనా నేను వ్రాయటం తక్కువే..ఇప్పుడు అది మరీ అరుదయిపోయింది. ఇంతకు ముందు వ్రాయటం తక్కువయినా అన్ని బ్లాగులు చదివేదాన్ని..ఇప్పుడు చదవటం కూడా అంత ఆసక్తిగా ఉండటం లేదు.  నా ఖాళీ సమయమంతా ఈ బ్లాగులు మింగేస్తున్నాయి అనిపించేది...ఇప్పుడు మనస్సుకి హాయిగా ఉంది.

మనిషికి మరపు అనేది నిజంగా ఓ వరం..లేకపోతే మన జీవితాలల్లో సంభవించే ఆకస్మిక అనూహ్య సంఘటనలకు ఈ పిడికెడు గుండె ఎప్పుడో ఆగిపోయేది..ఏమో నా గుండె కాస్త కఠినమేమో!...

తల్లులూ మీకు జోహార్లు!
ఇక అసలు విషయానికి వస్తే నిన్న ఓ టి.వి చానల్లో పసిపిల్లలచేత చేయించే అసభ్య ఆటల గురించి ఓ చర్చా కార్యక్రమం వచ్చింది.  దానిలో తల్లిదండ్రులు..ఆ కార్యక్రమ మెంటల్ మెంటార్సు చేసిన వ్యాఖ్యలు చూసి జుగుప్ప కలిగింది.  పిల్లలతో అసభ్యకర డాన్సులు చేయించటంలో ఎంతమాత్రం తప్పులేదంట..పిల్లలు ఇష్టంగా చేస్తుంటే మీకేంటి బాధ అంటున్నారు ఆ తల్లులు. ఓ మహాతల్లి అయితే  మీరు ఇలాంటి కార్యక్రమాల పట్ల అభ్యంతరం చెప్తున్నారు కాని స్త్రీల మీద జరిగే లైంగిక వేధింపుల గురించి మాట్లడరే అని సంధ్య గారిని ఫోనులో నిలదీస్తుంది....దానికి తల్లుల చప్పట్లు.  ఓ ఐదు నిమిషాలు చూసేటప్పటికి చీ వీళ్లకి చెప్పటం కన్నా అడవిలో మృగాలకి చెప్పవచ్చు అనిపించింది.

 అభం శుభం తెలియని పిల్లల చేత వెకిలి నృత్యాలు చేయిస్తుంది కాక దానికి సమర్థింపులు....మా పిల్లలకి ఇష్టమయింది చేస్తున్నారు...ఏం చదువు ఒక్కటే ఉంటే సరిపోతుందా..మిగతావి అక్కర్లేదా అని ఎదురుదాడులు...పాపం ఆ పసిమొగ్గలు...ఏది సభ్యత ఏది అసభ్యతో తెలియని వయస్సు...ఆ వయస్సులో పెద్దవాళ్లని అనుకరిస్తూ పాటలు పాడటం డాన్సులు చేయటం సహజం...ఆ ఉత్సాహాన్ని..అభిరుచిని సరయిన దారిలో పెట్టాల్సిన తల్లులే ఇలా మాట్లాడుతుంటే! ఏ డాన్సు కార్యక్రమం అన్నా చూడండి...ఓ పదిమంది న్యాయనిర్ణేతలు....వాళ్ళ వెకిలి చేష్టలు.....అసభ్య వ్యాఖ్యలు.....తిట్లు....ఏడుపులు...ఓడిపోయిన వారి అక్కసు.....నానారకాల భావోద్వేగాలు...ఆ వయస్సులో పిల్లలకి నేర్పించాల్సింది అవేనా!

దీనికంతటికి కారణం....ఎలాగోలా తమ పిల్లలు టి.విల్లో కనపడాలి అనే వెర్రి..  ఒక్క షోతో రాత్రికి రాత్రే పేరు... డబ్బులు వచ్చేయాలన్న దురాశ.  ఈ పోకడలు ఈ డాన్సు షోలలోనే కాదు పాటల కార్యక్రమాల్లో కూడా మొదలయ్యాయి.  బాలసుబ్రమణ్యం చేసే పాడుతా తీయగా కార్యక్రమం ఎంత హుందాగా ఉంటుంది..మిగతా కార్యక్రమాలు ఎలా ఉంటున్నాయి?  ఓ అతిధి..అతనితో కలిసి బాలు పంచుకునే అలనాటి ముచ్చట్లు (అసలు కన్నా ఈ కొసరే ఎంతో బాగుంటుంది).....పాడిన వారికి ఆమూల్యమయిన సలహాలు...వెరసి అందరికి అదొక అందమయిన అనుభూతి.

 అమ్మా తల్లుల్లారా  మీ పిల్లల వ్యక్తిత్వాలతో ఆటలాడే హక్కు....అధికారం మీకు లేవని తెలుసుకోండి.  వాళ్లని స్వేచ్చగా ఎదగనివ్వండి..వాళ్ల బాల్యాన్ని ఫణంగా పెట్టి మీరు పబ్బం గడుపుకోవాలని చూడకండి!

11 వ్యాఖ్యలు:

జయ April 27, 2010 at 1:54 PM  

చాలా రోజుల తరువాత కనిపించిన సిరిసిరిమువ్వ గారికి స్వాగతం. మొత్తానికి ఆట మీచేత వ్రాయించింది. చాలా బాగా వివరించారు. కానీ, ఎంతమంది అర్ధంచేసుకుంటారో, ఏనాటికి మార్పు వస్తుందో! క్రమంగా ఇదే సంప్రదాయమైపోతుందేమొ.

పెదరాయ్డు April 27, 2010 at 2:33 PM  

ఏ౦ట౦డీ అ౦దరూ తల్లుల మీదే పడ్డారు..

ఈ చర్చల్లో తల్లి త౦డ్రి, ఇద్దరినీ కూర్చోపెట్టి మాట్లాడిస్తే సమస్య తీరుతు౦దేమో. మగ మహారాజుల్ని వదిలేస్తే ఎలా?

విశ్వనాథ్ April 27, 2010 at 3:59 PM  

బాగా చెప్పారండి,నేను కూడా ఆ చర్చ చూసాను,అది చర్చ లా లేదు.ఆ మెంటర్స్ దేవి గారు వాళ్ళతో మాట్లాడలేక ఫోన్ క్ట్ చెసినపుడు అదేదో తమ విజయం అన్నట్టు పొంగిపోయిన విధానం చూస్తే వాళ్ళ మీద అసహ్యం వేసింది.

మురళి April 27, 2010 at 5:20 PM  

పునః స్వాగతం అండీ.. నేనా ప్రోగ్రామ్స్ చూడడం చాలా రోజుల క్రితమే మానేశాను.. తల్లుల వాదన పెద్దగా ఆశ్చర్య పరచలేదు.. అలాంటి డేన్సులు చేయిస్తున్నారంటే అలా కాక ఇంకెలా మాట్లాడతారు చెప్పండి??

Ram Krish Reddy Kotla April 27, 2010 at 11:56 PM  

బాగా చెప్పారండి...ఇలాంటి ప్రోగ్రామ్స్ ని ఆడరించినంత కాలం ఈ పోకడలు పోవు...

Rajendra Devarapalli April 28, 2010 at 1:28 AM  

ఇక్కడ ఒక విషయం గమనించాలండి,ఈ తల్లులూ తండ్రులూ నియో-రిచ్ స్థాయి కి వచ్చిన వాళ్ళు,వస్తున్న వాళ్ళు ఎక్కువమంది,ఇవ్వాళ వాళ్లకు నియో-సెలెబ్రిటీ స్థాయి ఇలా వస్తూ ఉంది ఒక దురూహలో ఉన్నారు ఎక్కువమంది

lalithag April 28, 2010 at 1:52 AM  

Oh! My god!"
అసలేమిటి కథ అని కొద్దిగా వెతికి ఒక పాట చూశాను.
చాలా సిగ్గుగా ఉంది.
మీరు రాసేవరకూ నేననంత పట్టించుకోలేదు.
పైగా ఇంకో బ్లాగులో ఈ విషయం రాసిన దానికి అసభ్యంగా వ్యాఖ్య కనిపిస్తే ఇవి బాలేవని చెప్పడంలో కూడా ఇంకోరకమైన ఆనందం పొందుతున్నారనిపించింది.
ఏదో ఈ పేరుతోనూ తల్లుల్ని తెగ తిట్టేసి కసి తీర్చుకుంటున్నట్టనిపించింది.
Whatever ...ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారూ, ప్రోత్సహించిన వారు, చూసి ఆదరించే ప్రేక్షకులు, వద్దని, ఉంచాలని వాదించడాన్ని వినోదాత్మకంగా వ్యాపారం కోసమో ఇంకెందుకో వాడుకునే వారూ అందరూ మన సమాజంలోని ఒక చేదు నిజానికి ప్రత్యక్ష సాక్ష్యాలు.
బలయ్యేది చిన్నారులు, విలువల మీద ఏర్పరుచుకునే నమ్మకాలూ.

సిరిసిరిమువ్వ April 28, 2010 at 12:03 PM  

@జయ గారు, నిజమేనండి ఇదే సాంప్రదాయమైపోతుందేమో అని నాకూ అనిపిస్తుంటుంది...కానీ ఏం చెయ్యగలం!

@పెదరాయుడు గారు, నిజమే ఇద్దరూ బాధ్యులే కాని ఇలాంటివాటిల్లో తల్లుల పాత్రే ఎక్కువగా ఉంటుందనుకుంటాను.

@విశ్వనాథ్ గారు, అవును ఆ చర్చాకార్యక్రమంలో అరుపులు కేకలు తప్ప ఎక్కడా హుందాతనం లేదు.

@మురళి గారు, ధన్యవాదాలు. మీరు చెప్పిందీ నిజమేలేండి. నేను అసలు ఆ కార్యక్రమాలు చూడటమే మొదలుపెట్టలేదు..అప్పుడప్పుడు చానల్సు మార్చేటప్పుడు వీటిబారిన పడుతూ ఉంటామన్నమాట!

@కిషన్ రెడ్డి గారు, ఇలాంటి వాటికే వీక్షకులు ఎక్కువ ఉంటారండి..అదే మన దౌర్భాగ్యం.

@రాజేంద్ర కుమార్ గారు, మీరు చెప్పింది కూడా నిజమే కాని పసిపిల్లల మీద వీటి ప్రభావం గురించి ఆ తల్లిదండ్రులు ఆలోచించరనుకుంటా.

@లలిత గారు, బాగున్నారా? బహుకాల దర్శనం. నిజమే ఇందులో అందరం సూత్రధారులం పాత్రధారులమే...పాపం పసిపిల్లలు!

కొత్త పాళీ April 30, 2010 at 2:29 AM  

welcome back.

పెదరాయుడి గారి పాయింటు కూడా ఆలోచించాల్సిందే!

మాలతి May 8, 2010 at 4:56 PM  

సిరిసిరిమువ్వగారూ, నేను కూడా చాలాకాలంగా బ్లాగులేవీ చూడ్డంలేదు. మీరన్నట్టు కొంతకాలం విరామం తీసుకుంటే బాగుంది. పోతే, మీరు తీసుకున్న వస్తువు ఆలోచనలు రేపేది.పిల్లలు బుద్ధిమంతులు కాలేదని వాళ్లు పెద్దవాళ్లయినతరవాత విచారిస్తే ఏంలాభం. ముందు వాళ్లని అలా తయారు చేసేది తల్లిదండ్రులే కదా. ఇంతకీ పిల్లలచేత అలా డాన్సులు చేయించే తల్లులు - వాళ్లు కూడా చిన్నప్పుడు అలా చేసినవారేనా .. అలా అయితే, మీరన్నట్టు ఇది అరణ్యరోదనే...బహుశా దీనికి జవాబు విశ్వనాథ్ గారి వ్యాఖ్యలో ఉన్నట్టుంది. మీచర్చకి సుముఖంగా ఉన్నవ్యాఖ్యలు చూస్తే సంతోషంగా ఉంది. విజయోస్తు.

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP