పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

January 27, 2010

అసలు ఆత్మ లేని ఫిర్ మిలే సుర్ మేరా తుమ్హారా!

 మిలే సుర్ మేరా తుమ్హారా ..........తలుచుకోగానే  గుండెలు ఉప్పొంగే గీతం!

రెండు దశాబ్దాల క్రితం 1988 ఆగస్టు 15 న దూరదర్శన్‌లో  వచ్చిన మిలే సుర్ మేరా తుమ్హారా..ఈ గీతం వినని భారతీయుడు.......పరవశించని భారతీయుడు ఉండి ఉండడు.  దేశం మొత్తాన్ని ప్రాంతాలకతీతంగా ఓ ఊపు ఊపిన గీతం.  అప్పట్లో ఆ గీతం వచ్చిన 6 నిమిషాలు అలా కళ్ళప్పగించి చూసేదాన్ని.  భీంసేన్ జోషి స్వరంతో మొదలయ్యి..అలా అలా గాలిలో తేలిపోయి ..చివరిగా పిల్లలు జాతీయ జండా ఆకారంలో నిలబడటంతో పాట అయిపోతుంది...అప్పుడే అయిపోయిందా అన్న ఓ అసంతృప్తితో కిందకి దిగివచ్చేదాన్ని.

దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ ఎప్పటికీ బారతీయుల గుండెల్లో చిరంజీవి ఆ గీతం!  ప్రసిద్ధ సినీ వ్యక్తులు, క్రీడారంగ ప్రముఖులు, నాట్య ప్రముఖులు, సంగీత ప్రముఖులే కాదు..సామాన్య మానవులకు కూడా పెద్ద పీట వేసి తీసిన గీతం అది.  పీయూష్ పాండే వ్రాసిన ఈ గీతం గురించి ఎంత చెప్పినా తక్కువే!  నాకు ఆ పాటలో ఓ కుర్రవాడు ఏనుగు మీద ఎక్కి లయబద్ధంగా ఊగుతూ పాడే బిట్టు చాలా చాలా ఇష్టం. 14 భాషలల్లో భారతదేశం ఆ మూల నుండి ఈ మూల దాకా ప్రాంతీయత ఉట్టిపడేట్టు చక్కని ప్రదేశాలల్లో తీసిన గీతం అది. 

అందులో తెలుగులో వచ్చే వ్యాక్యాలు
"నా స్వరమూ నీ స్వరమూ సంగమమై
 మన స్వరంగా అవతరించే"

ఈ తెలుగు వాక్యాలకు అప్పటి గీతంలో నటించింది పేరున్న వ్యక్తులు కాదు..కానీ చాలా సహజంగా అందంగా ఉంటారు ఆ జంట!

ఇప్పుడు మరలా గణతంత్ర వజ్రోత్సవ వేడుకల సందర్భంగా ఆ గీతాన్ని చేతికొచ్చినట్లు మార్చి వ్రాసి....నోటికొచ్చినట్టు పాడి..దాన్ని ఏ కీలుకా కీలు విరిచేసారు. సినీప్రముఖులతో, జులపాల జుట్టులతో.... ర్యాప్, పాప్‌లతో నింపేసారు..వ్యాక్యాలని ముక్కలుముక్కలుగా విరిచి ఆ పాటని ఎన్ని హింసలు చిత్రవధలు పెట్టొచ్చో అన్నీ పెట్టేసారు. చిత్రీకరణలో నాకెక్కడా సహజత్వం కనిపించలేదు.  దీపికా పడుకొనే వేసుకున్న గౌను చూస్తే.......పాత దాంట్లో వాళ్ల నాన్న ప్రకాష్ పడుకొనే గుర్తొచ్చి తలవంచుకున్నా! లత మువ్వొన్నెల కొంగు ఉన్న చీర భుజాల చుట్టూ కప్పుకుని ఎంత హుందాగా పాడింది!  అలాంటి లతకి దీనిలో చోటు లేదు.  ఉందల్లా చొక్కా విప్పి కండలు చూపించే  సల్మాన్ ఖానుకు, షారుక్, అమీర్, బచ్చన్ కుటుంబ సభ్యులకు.....

ఆరంభం రెహమానుతో బాగానే ఉన్నా ఉన్నకొద్దీ అసహజత్వ పాళ్ళు ఎక్కువయి పోయాయి. అమితాబ్ మాటలు అస్సలు నప్పలేదు.  కొత్తదాంట్లో తెలుగు వ్యాక్యాలను మహేష్ బాబు మీద చిత్రీకరించారు..ఇంకో రెండు లైనులు కూడా కలిపారు..ఏం కలిపినా పాత దాని చార్మ్ దీనిలో లేదు.  దక్షిణాది నుండి మహేషు బాబు, విక్రం, మమ్ముట్టి, శోభన, జేసుదాస్, సూర్యలకి స్థానం కల్పించారు.  మొత్తం మీద వీళ్ల దృష్టిలో మన దేశంలో ప్రముఖ వ్యక్తులంటే సినీ నటులే అన్నట్టుగా ఉంది.  మిగతా రంగాలల్లో ప్రముఖులు పెద్దగా వీళ్ల కళ్లకి ఆనినట్లు లేరు.  ఓ కలాం, ఓ టాటా, ఓ లత, ఆశా, విప్రో ప్రేంజీ, నారాయణమూర్తి, మన బాలసుబ్రమణ్యం....ఇలాంటి వారు ఎవ్వరూ లేరు. 

ఒకందుకు మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది..ఈ రకంగా అన్నా పాత దాన్ని మరలా మనకు స్ఫురణకి తెచ్చి దాని గొప్పతనాన్ని మరోమారు మన కళ్లముందు నిలిపారు.

Read more...

January 21, 2010

ఇక చాలు ఆపండి.......


గత రెండునెలలుగా రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణాప్రాంతంలో జరుగుతున్న బందులపర్వం చూస్తూనే ఉన్నాం.  ఈ రెండునెలల్లో పట్టుమని పదిరోజులన్నా కాలేజిలు జరగలేదు.  విద్యాసంవత్సరం  ఆఖరులో ఈ బందుల వల్ల విద్యార్థులు ఎంతగా నష్టపో్తున్నారో! ముఖ్యంగా ఇంటరు విద్యార్థులు..వాళ్లకి ఈ రెండు..మూడునెలల కాలం చాలా విలువయినది..తిరిగి రానిదీనూ...మరీ ముఖ్యంగా తెలంగాణా ప్రాంత విద్యార్థులే ఎక్కువగా నష్టపోతున్నారు.  తెలంగాణా కన్నా మాకు ఏది ఎక్కువ కాదంటారా? మీకు ఎక్కువ కాకపోవచ్చు...కానీ రెండుసంవత్సరాలు ఆహోరాత్రులు కష్టపడి చదివే పిల్లలకి..వాళ్ల తల్లిదండ్రులకు తెలుస్తుంది ఆ బాధేమిటో! కనీసం జూనియరు కళాశాలలకన్నా ఈ బందులనుండి విముక్తి ప్రసాదించండి. తెలంగాణా ఉద్యమకారులకి నాదో చిన్న ప్రశ్న...అసలు బందే మీకున్న ఆయుధమా........వేరే ప్రత్యాయమార్గాలు లేవా!

ఈ రోజు తెలంగాణా JAC కన్వీనరు కోదండరాం గారు ఇంటరు బోర్డుకి వెళ్ళి పరీక్షలు వాయిదా వేయమని కోరుతున్నారు! చేసిందంతా చేసి ఇప్పుడు వాయిదాకోరటమేమిటండి..అది జరిగే పని కాదని మీకు బాగా తెలుసు.  బందుల పేరుతో విద్యార్థుల జీవితాల్ని ఇలా ఆడించే అధికారం మీకెవరిచ్చారు..ముందు అది చెప్పండి.  ఒక రోజు...... రెండు రోజులు కాదు...వరుసగా రెండు నెలలనుండీ బందులే.  కాలేజి పూర్తి సమయం జరిగిన రోజున అమ్మయ్య ఈ రోజు కాలేజి జరిగింది అని అనుకోవాల్సి వస్తుంది.  ఈ రెండు నెలల్లో అలా అనుకున్న రోజులు వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు.  ఏ రోజు ఎవరు బందు చేస్తారో తెలియదు..ఎందుకు బందు చేస్తారో తెలియదు..కాలేజికెళ్ళి  బందని పిల్లలు వెనక్కి తిరిగి రావటమే ఎక్కువగా ఉంటుంది..రోజూ వెళ్లటం రావటం..ఈ తిప్పలన్నీ ఎందుకు అని అసలు వాళ్లని కాలేజీలకి పంపని తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఈ వరుస బందుల వల్ల పిల్లల్లో చదువుపట్ల ఒక రకమయిన నిర్లిప్తత ప్రవేశించింది కూడాను!

సంక్రాంతి సెలవులు కూడా అయిపోయాయి ఇక కాస్త కాలేజి క్రమబద్ధంగా జరుగుతుంది అనుకునేటప్పటికి మరలా నిన్నా ఈ రోజు బందు. ఈ సమయంలో రెండు రోజుల బందు అవసరమా!  ఇక ఈ  అధికారక బందులతో పాటు అనధికార బందులు ఎన్నో.  నవంబరు 28న మొదలయిన ఈ బందుల పర్వం నిరాటంకంగా సాగు...........తూనే ఉంది.  చంద్రశేఖరరావు నవంబరు 29 న నిరాహార దీక్ష మొదలుపెడతారు అనగా ముందు రోజే అంటే నవంబరు 28న ఆ దీక్షకి మద్దుతుగా అని ఈ బందులు మొదలయ్యాయి.  ఇక అప్పటినుండి ఒక రోజు తెలంగాణా JAC బందు..ఇంకొక రోజు రాజకీయ JAC బందు..మరో రోజు స్టూడెంటు JAC బందు..మరో రోజు మహిళా JAC బందు....ఇంకో రోజు SIF, మరు రోజు ABVP....ఎన్ని రకాల పేరులతో బందులు చెయ్యవచ్చో వీళ్ళదగ్గర నేర్చుకోవచ్చు..ఇకముందు వీళ్ళనెవరూ ఈ విషయంలో అధిగమించలేరు కూడా!

అసలు బందులు చేయటానికి వీళ్ళెంతగా అలవాటు పడిపోయారంటే ....బందు  లేని రోజున వీళ్లకి నిద్రాహారాలు సహించవనుకుంటాను...మరుసటి రోజు ఏదో ఒక కారణం చెప్పి మరలా బందు షురూ...జనవరి 5 న తెలంగాణాపై డిల్లీలొ చర్చ జరిగిందా..దాని ముందు రోజు ఆ చర్చలకు మద్దతుగా ఇక్కడ బందు..ఇక జనవరి 5 నేమో..డిల్లీలో ఇంకా చర్చలు మొదలే అవ్వలేదు..ఇక్కడ ఉదయం పదిగంటలకల్లా కాలేజీలకు వచ్చేసి..బందు అని పిల్లలని వెళ్లగొట్టటం..ఏంటి ఈ బందులు..ఇవా బందులు?..చీ... రోతగా ఉందండి......ఇంకెన్నాళ్లు విద్యార్థుల భవిష్యత్తుని కాలరాచే ఈ బందులు.. నిజంగా మీరు ఆలోచన ఉన్నవాళ్లే అయితే..మీకు విద్యార్థుల పట్ల నిజమైన నిబద్దతతే ఉంటే..మీ రాజకీయ వైకుంఠపాళిలో విద్యార్థులని బలిచేయకండి...ఇక బందులు చాలు........ఆపండి.

కోదండరాం గారు మీరు స్వయానా ఆచార్యులు.......మీకు తెలుసు విద్యార్థులకి ఈ సమయం ఎంత ముఖ్యమో....దయచేసి వాళ్లకి బందులనుండి విముక్తి ప్రసాదించండి.  మీరు ఇంటరు పరీక్షలు వాయిదా వెయ్యాలని కోరుతున్నారు..అవి వాయిదా వెయ్యటానికి కుదరదని మీకు బాగా తెలుసు...తెలిసీ అడగటం మీ రాజకీయంలో భాగమేమో మరి..తద్వారా మరో నాలుగు రోజులు బందు చెయ్యొచ్చన్న దురాలోచన కూడా అందులో ఇమిడి ఉందేమో!

ఇంటరు విద్యార్థులు ఒక్క ఇంటరు పరీక్షలే వ్రాయరు..రకరకాల పోటీ పరీక్షలకెళ్తారు.  అవన్నీ ఏప్రియలు మొదటివారం తరువాత మొదలువుతాయి. IIT:...ఏప్రియల్ 11;   AIEEE:...ఏప్రియలు 25;     VIT:...ఏప్రియల్ 17...ఇవీ ప్రముఖ సంస్థలు నిర్వహించే పరీక్షా తేదీలు.  ఇవి కాక KCET, BITS, GITAM వారి GAT......ఇలా దేశం మొత్తం జరిగే వివిధ రకరకాల పోటీ పరీక్షలు ఏప్రియలు, మే నెలల్లో జరుగుతాయి.  వాటి తేదీలు కూడా ఎప్పుడో నిర్ణయించబడ్డాయి.  వీటిల్లో కొన్ని ఆన్లైను పరీక్షలు.....ఒకసారి విద్యార్థి పరీక్ష తేది నిర్ణయించుకున్నాక మార్చుకునే అవకాశం ఉండదు.  మనం ఇంటరు పరీక్షలు నిర్వహించినా నిర్వహించకపోయినా..ఆరు నూరయినా  ఈ పరీక్షలల్లో ఏ ఒక్కటీ ఆగదు..వెనక్కి జరగదు.  అంటే మార్చి చివరి వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటరు పరీక్షలు అయిపోవాలి.  ఇప్పుడు ఇంటరు పరీక్షలు వాయిదా వేయటం ద్వారా పిల్లల మీద మరింత వత్తిడి పెంచటం తప్పితే ఉపయోగం ఉండదు.  ప్రస్తుతం మీరు విద్యార్థులకి చెయ్యకలిగిన ఉపకారం ఏదయినా ఉంది అంటే అది ఇకనుండయినా ఈ బందుల దుష్టసాంప్రదాయం నుండి కాలేజీలకి మినహాయింపు ఇవ్వటం. JAC కన్వీనరుగా మీకు మా తల్లిదండ్రుల విజ్ఞపి ఇది.

కోదండరాం గారు ఇది విద్యార్థుల..మాలాంటి తల్లిదండ్రుల ఆవేదన మాత్రమే...ఇది అనేకానేక బందు బాధల్లో ఒక పార్శ్వం మాత్రమే!  మీ బందుల వల్ల రోజు గడవటం దుర్భరమవుతున్న సామాన్య జనాలు కూడా ఉన్నారు..ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇకనుండి మీ ఉద్యమాన్ని బందురహితంగా సాగిస్తారని..సాగించాలని ఆశిస్తున్నాం....

Read more...

January 13, 2010

బంతిపూల సంబరాలు

 పల్లెల్లో  సంక్రాంతి ఓ ప్రత్యేక పండగ. సామాన్యంగా ఈ పండగ సమయానికి  ప్రతి ఇల్లు ధాన్య రాసులతో కళకళలాడుతుంటుంది.. ముంగిట ముత్యాల రంగవల్లులు..గొబ్బెమ్మలు..భోగి మంటలు...అరిసెలు.....కొత్త బియ్యపు పొంగళ్ళు.....కొత్త అల్లుళ్లు.......వెరసి  బోలెడన్ని సరదాలు... ఇప్పటికే హరిదాసులు, బుడబుక్కల వాళ్లు కనుమరుగయ్యారు.....ఇక ముందు ముందు ముంగిట ముగ్గులు కూడా కనుమరుగవుతాయేమో....సరే నాకు మాత్రం సంక్రాంతిని తలుచుకోగానే బోలెడన్ని జ్ఞాపకాలు వరదలై పొంగుతుంటాయి.  కొన్ని జ్ఞాపకాలు ముందొకసారి చెప్పాను. ..మరికొన్ని ఇప్పుడు...

సంక్రాంతి అనగానే ముందుగా గుర్తొచ్చేది బంతి పూలు......


మాకు మిరప చేలల్లో..చుట్టూ గట్ల మీద బంతి మొక్కలు పెట్టేవాళ్లు. సంక్రాంతి సమయానికి అవన్నీ విరగబూసేవి. మిరప మొక్కల్లో పచ్చని పచ్చని ఎర్రెర్రని మిరపకాయల మధ్య ఈ బంతిపూలు మహా అందంగా ఉండేవి.  ఈ సంక్రాంతి నెల రోజులూ రోజూ .మా నాయనమ్మ బుట్టలు బుట్టలు బంతి పూలు కోసుకొచ్చి మధ్యలోనే పంచినన్ని పంచి.. కొన్ని ఇంటికి పట్టుకు వచ్చేది.  ఈ ధనుర్మాసం నెలా..వాకిట్లో ముగ్గులు....ముగ్గుల్లో గొబ్బెమ్మలు.  ప్రతి ముగ్గులో మధ్య ఓ పెద్ద గొబ్బెమ్మ..దాని తలపై ఓ చిన్ని పిల్ల గొబ్బెమ్మ..ఇక చుట్టూ చిన్న చిన్న గొబ్బెమ్మలు.....ఒక్కో రోజు 100 గొబ్బెమ్మలు కూడా పెట్టేవాళ్లం..వాటికి బంతి పూలు....ఉమ్మెత్త పూలు.. పెట్టేవాళ్లం..ఈ బంతి పూలలో కూడా ఎన్ని రకాలో..ముద్ద బంతి...నూక బంతి......రెక్క బంతి......కారబ్బంతి...ఇక రంగులు.....లేత పచ్చ నుండి ముదురు కాషాయం దాకా ఉండేవి. నాకు ముద్ద బంతి తరువాత నూకబంతి బాగా నచ్చేది.

ఇంట్లో పూచే పూలకన్నా పొలాల్లో పూచే పూలు బాగా పెద్దవిగా మంచి కాంతివంతంగా ఉండేవి... అక్కడ మరి ఎరువులు, పెంటపోగు వేస్తారు కదా!....వాటిల్లో మంచి రాజాలాంటి పూలని ఏరి దండలు గుచ్చి వాకిటికి తోరణాలు కట్టేవాళ్ళం.  ఈ తోరణాలు ఎండిపోయాక తీసి మరుసటి సంవత్సరం నారుపోయటానికి దాచిపెట్టేవాళ్లం. ఆ దాచిపెట్టిన వాటిని ఎప్పుడో మాకు మమ్మకి తెలియకుండా మా నాయనమ్మ ఎవరికో ఒకళ్లకి దానం చేసేసేది.  తీరా నారుపోసే సమయానికి కనపడేవి కావు..మాకు మా చెడ్డ కోపం వచ్చేది. .ఏమన్నాఅంటే ఏం ఎవరికీ ఈకుండా అవన్నీ కట్ట కట్టుకుపోతారా....బంతి నారు ఎక్కడ పడితే అక్కడ దొరుకుద్ది ఏం నష్టం లేదులే అని దులపరించేసేది..

ఇవాళ బంతిపూలు కొందామని వెళితే కిలో 80 రూపాయలంట!...చెప్పొద్దూ...కళ్ళవెంట నీళ్ళు ఒక్కటే తక్కువ..మా అందమైన పొలాలు..అందులో బంతి మొక్కలు...మా ఊరు..వాకిట్లో ముగ్గులు..అన్నీ గుర్తుకొచ్చాయి..ఇక్కడేముంది?.....గొబ్బెమ్మలు లేవు....భోగిమంటలు లేవు...అరిసెలు లేవు..అందుకే ఈ టపా!

ఇవాళ యాదృచ్చికంగా తవ్వా ఓబుల్‌ రెడ్డి గారి బ్లాగు కనపడింది..అందులో గొబ్బి పాటలు ఉన్నాయి చూడండి.






ఇక ఈ సంక్రాంతికి ఇవాళ మా ఇంటి ముందు వేసిన ముగ్గులు.  ఎదిగొచ్చిన కూతురు ఉంటే తల్లికి కొండంత అండ అంట!  ఇప్పుడు నేను ముగ్గులు వేస్తే మా అమ్మాయి రంగులు దిద్దుతుంది..నాకు సగం పని తగ్గిందన్నమాట! ఇంకా వెయ్యాల్సిన ముగ్గులు ఉన్నాయి.. ..మరి మిగతా కబుర్లు వచ్చేసంక్రాంతికి...

అందరికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు



Read more...

January 1, 2010

వర్తమానం....గతం....తరం తరం.... నిరంతరం

డిసెంబరు 31, 2009.....11:59:01..మరో కొత్త సంవత్సరానికి కౌంటు డౌన్ మొదలవుతుంది.

అప్పుడే మరో సంవత్సరం గతం అయిపోబోతుంది..మరో సంవత్సరం వర్తమానం కాబోతుంది.  కాలం ఎవరికోసం ఆగకుండా ఇలా పరుగులు పెడుతుంది. దానికి ఎవరితోనూ పనిలేదు..ఎవరికోసం ఎదురు చూడదు...ఒకటే పరుగు....పరుగు.... ఇలా సంవత్సరాలు గతించే కొద్దీ మనకూ వత్సరాలు నిండుకుంటున్నట్టేగా! మరి ఎందుకో ఇంతగా ఈ క్షణం కోసం ఎదురు చూస్తుంటాం...సంబరాలు చేసుకుంటాం!...

ఏ బరువూ బాధ్యతలు లేని 16 ఏళ్ల వయస్సులోని కొత్తసంవత్సర సంబరాలకి సంసార చట్రంలో ఇరుక్కున్న ఈ నలభైలలోని సంబరాలకి ఎంత తేడా.  అప్పుడు....కొత్తగా హాస్టలు జీవితం..కొత్త కాలేజి..కొత్త పరిచయాలు..అర్థరాత్రి 12 సమీపిస్తుండగా ఏదో ఆనందం...ఓ  ఉద్వేగం ...గ్రీటింగ్సు..స్వీట్సు..మొదటిసారిగా ఓ కొత్త ప్రపంచం..ఇంజనీరింగు కాలేజి అబ్బాయిలు హటాత్తుగా గేట్లు తోసుకుని అమ్మాయిల హాస్టలు మీద పడటం..మేమంతా భయంతో వణికి పోవటం..వాళ్లు వెళ్తూ వెళ్తూ హాస్టలు గదుల ముందు అలంకరించుకున్న గ్రీటింగు కార్డ్సు అన్నిటిని లాగేసి పోవటం..తలుచుకుంటే అన్నీ నిన్నా మొన్న జరిగినట్లే కళ్ళ ముందు మెదులుతుంటాయి.

పెళ్లయ్యాక...మరో కొత్త లోకం..ఒకే వయస్సు.... కొత్తగా పెళ్లయిన జంటలు....ఓ పది పదిహేను కుటుంబాలు కలిసి ...క్లబ్బులో పార్టీలు ఉన్నా అక్కడ అంత ఎంజాయ్మెంటు ఉండదని ఎవరో ఒకరి ఇంటిలో అందరం కలిసి వేడుకగా వండుకుని తినటం....మెట్లు లేని క్వార్టరు పైకి ఎక్కి  ఆ రాత్రంతా గడపటం..నార్త్ ఇండియన్ జంటల డాన్సులు....సౌత్ ఇండియన్ అమ్మాయిల పాటలు...మగవాళ్ళ పేకాటలు...

ఇంటిముందు వాకిళ్లల్లో కళ్లాపులు..ముగ్గులు...మా లైనులో సగం ఇళ్లముందు నేను వేసిన ముగ్గులు..వాటికి రంగులద్ది....పూలు చల్లి....ఉదయపు మంచుతెరల మధ్య వాటిని చూసుకుని మురిసిపోవటాలు...ఎన్నెన్ని మధుర జ్ఞాపకాల రంగవల్లులు!

దీనికన్నా  ఓ పదిరోజుల ముందు మొదలయ్యే గ్రీటింగు కార్డుల సందడి..నేను స్వయంగా తయారు చేసి పంపుకునే శుభాకాంక్షల పత్రాలు.....మాక్కూడా చేసిపెట్టొచ్చుగా అని ఉడుక్కునే పక్కింటి స్వరాజ్యం గారు..ఏవి సుమా ఇప్పుడు ఆ పత్రాలు? సెల్లులో సంక్షిప్త సందేశాలు..మెయిలులో మూడు ముక్కల శుభాకాంక్షలుగా మిగిలిపోయాయా!..ఓ రెండు మూడు సంవత్సరాల క్రితం వరకు కూడా నేను స్వయంగా చేసిన గ్రీటింగు కార్డ్సు బందుమితృలందరికి పంపించేదాన్ని..అదేంటో ఇప్పుడు ఫోనులో మూడు ముక్కల్లో చెప్పాలన్నా ఏదో మొక్కుబడిగా చెప్పటం అయిపోతుంది.

ఇక ఈ భాగ్యనగరానికి వచ్చాక..మొదట్లో ఓ నాలుగయిదు సంవత్సరాలు హుషారుగా పార్టీలకి వెళ్లాం..శిల్పారామాలు తిరిగాం కానీ..తరువాత తరువాత ఏ సంబరాలు లేకుండా ఇంట్లో టి.వి లకి అంకితం అయిపోతున్నాం. నేనయితే  టి.వి. ముందు పడుకుని హాయిగా ఓ కునుకు తీసి పన్నెండింటికి ఎవరయినా లేపితే  లేచి నిద్రమోహంతోనే అందరికి శుభాకాంక్షలు చెప్పేసి పడుకుంటాను!లేపకపోతే అదీ లేదు.

ఈ రోజు మా అమ్మాయి తన స్నేహితురాలి ఇంటికి కొత్తసంవత్సర వేడుకలకి వెళ్తుంటే తనలో అప్పటి నన్ను చూసుకుని మరో తరం సంబరాలు మొదలయ్యాయి అనుకుంటూ నా  గతంలోకి జారుకున్నాను.

ఇక అందరూ తీర్మానించుకునే కొత్త సంవత్సర తీర్మానాలకి మాత్రం నేను ఆమడ దూరం..డిక్టేటర్సుకి తీర్మానాలు ఉండవు ఫర్మానాలే కాని!

వచ్చు కాలం కన్నా గత కాలం మిన్న అనిపిస్తుంటుంది నాకెప్పుడూ!  కొన్ని సంవత్సరాలు మంచో చెడో మనస్సుల మీద చెరగని ముద్రలు వేసిపోతుంటాయి...అలాంటి వాటిల్లో ఈ 2009 కూడా ఒకటి.  ఒకదాని వెనుక ఒకటి ప్రకృతి వైపరీత్యాలు...విషాద సంఘటనలు....వైషమ్యాలు....ప్రాంతీయ చిచ్చులు..ఆటవిక దాడులు...ప్చ్..వీటికి అంతం ఎక్కడో..అదుపు ఎన్నడో!  రాబోయే సంవత్సరంలో అన్నా వీలయినంత ప్రశాంతంగా అందరి జీవితాలు సాగాలని కోరుకుంటూ!

Read more...

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP