పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

January 13, 2010

బంతిపూల సంబరాలు

 పల్లెల్లో  సంక్రాంతి ఓ ప్రత్యేక పండగ. సామాన్యంగా ఈ పండగ సమయానికి  ప్రతి ఇల్లు ధాన్య రాసులతో కళకళలాడుతుంటుంది.. ముంగిట ముత్యాల రంగవల్లులు..గొబ్బెమ్మలు..భోగి మంటలు...అరిసెలు.....కొత్త బియ్యపు పొంగళ్ళు.....కొత్త అల్లుళ్లు.......వెరసి  బోలెడన్ని సరదాలు... ఇప్పటికే హరిదాసులు, బుడబుక్కల వాళ్లు కనుమరుగయ్యారు.....ఇక ముందు ముందు ముంగిట ముగ్గులు కూడా కనుమరుగవుతాయేమో....సరే నాకు మాత్రం సంక్రాంతిని తలుచుకోగానే బోలెడన్ని జ్ఞాపకాలు వరదలై పొంగుతుంటాయి.  కొన్ని జ్ఞాపకాలు ముందొకసారి చెప్పాను. ..మరికొన్ని ఇప్పుడు...

సంక్రాంతి అనగానే ముందుగా గుర్తొచ్చేది బంతి పూలు......


మాకు మిరప చేలల్లో..చుట్టూ గట్ల మీద బంతి మొక్కలు పెట్టేవాళ్లు. సంక్రాంతి సమయానికి అవన్నీ విరగబూసేవి. మిరప మొక్కల్లో పచ్చని పచ్చని ఎర్రెర్రని మిరపకాయల మధ్య ఈ బంతిపూలు మహా అందంగా ఉండేవి.  ఈ సంక్రాంతి నెల రోజులూ రోజూ .మా నాయనమ్మ బుట్టలు బుట్టలు బంతి పూలు కోసుకొచ్చి మధ్యలోనే పంచినన్ని పంచి.. కొన్ని ఇంటికి పట్టుకు వచ్చేది.  ఈ ధనుర్మాసం నెలా..వాకిట్లో ముగ్గులు....ముగ్గుల్లో గొబ్బెమ్మలు.  ప్రతి ముగ్గులో మధ్య ఓ పెద్ద గొబ్బెమ్మ..దాని తలపై ఓ చిన్ని పిల్ల గొబ్బెమ్మ..ఇక చుట్టూ చిన్న చిన్న గొబ్బెమ్మలు.....ఒక్కో రోజు 100 గొబ్బెమ్మలు కూడా పెట్టేవాళ్లం..వాటికి బంతి పూలు....ఉమ్మెత్త పూలు.. పెట్టేవాళ్లం..ఈ బంతి పూలలో కూడా ఎన్ని రకాలో..ముద్ద బంతి...నూక బంతి......రెక్క బంతి......కారబ్బంతి...ఇక రంగులు.....లేత పచ్చ నుండి ముదురు కాషాయం దాకా ఉండేవి. నాకు ముద్ద బంతి తరువాత నూకబంతి బాగా నచ్చేది.

ఇంట్లో పూచే పూలకన్నా పొలాల్లో పూచే పూలు బాగా పెద్దవిగా మంచి కాంతివంతంగా ఉండేవి... అక్కడ మరి ఎరువులు, పెంటపోగు వేస్తారు కదా!....వాటిల్లో మంచి రాజాలాంటి పూలని ఏరి దండలు గుచ్చి వాకిటికి తోరణాలు కట్టేవాళ్ళం.  ఈ తోరణాలు ఎండిపోయాక తీసి మరుసటి సంవత్సరం నారుపోయటానికి దాచిపెట్టేవాళ్లం. ఆ దాచిపెట్టిన వాటిని ఎప్పుడో మాకు మమ్మకి తెలియకుండా మా నాయనమ్మ ఎవరికో ఒకళ్లకి దానం చేసేసేది.  తీరా నారుపోసే సమయానికి కనపడేవి కావు..మాకు మా చెడ్డ కోపం వచ్చేది. .ఏమన్నాఅంటే ఏం ఎవరికీ ఈకుండా అవన్నీ కట్ట కట్టుకుపోతారా....బంతి నారు ఎక్కడ పడితే అక్కడ దొరుకుద్ది ఏం నష్టం లేదులే అని దులపరించేసేది..

ఇవాళ బంతిపూలు కొందామని వెళితే కిలో 80 రూపాయలంట!...చెప్పొద్దూ...కళ్ళవెంట నీళ్ళు ఒక్కటే తక్కువ..మా అందమైన పొలాలు..అందులో బంతి మొక్కలు...మా ఊరు..వాకిట్లో ముగ్గులు..అన్నీ గుర్తుకొచ్చాయి..ఇక్కడేముంది?.....గొబ్బెమ్మలు లేవు....భోగిమంటలు లేవు...అరిసెలు లేవు..అందుకే ఈ టపా!

ఇవాళ యాదృచ్చికంగా తవ్వా ఓబుల్‌ రెడ్డి గారి బ్లాగు కనపడింది..అందులో గొబ్బి పాటలు ఉన్నాయి చూడండి.






ఇక ఈ సంక్రాంతికి ఇవాళ మా ఇంటి ముందు వేసిన ముగ్గులు.  ఎదిగొచ్చిన కూతురు ఉంటే తల్లికి కొండంత అండ అంట!  ఇప్పుడు నేను ముగ్గులు వేస్తే మా అమ్మాయి రంగులు దిద్దుతుంది..నాకు సగం పని తగ్గిందన్నమాట! ఇంకా వెయ్యాల్సిన ముగ్గులు ఉన్నాయి.. ..మరి మిగతా కబుర్లు వచ్చేసంక్రాంతికి...

అందరికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు



5 వ్యాఖ్యలు:

నిషిగంధ January 14, 2010 at 1:06 AM  

బంతిపూల గురించి బోల్డన్ని విషయాలు జ్ఞాపకం చేశారండి! మీ ముగ్గులన్నీ చక్కగా కళకళలాడిపోతున్నాయి.. నాది ఇప్పటికీ మీ పాప చేసే పనే, రంగులు నింపడం :-)

మీ కుటుంబసభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు :-)

వేణూశ్రీకాంత్ January 14, 2010 at 10:33 AM  

భలే, బంతిపూల ఊసులు బాగున్నాయండీ. ముద్దబంతులు కారబ్బంతులు దేని రంగు దానిదే దేని సొగసు దానిదే. అసలు ఈ చెట్టు ఆకులు కూడా చాలా వైవిధ్యంగా ఉంటాయి అనిపిస్తుంది నాకు.

జయ January 14, 2010 at 3:02 PM  

ఈ ముద్దబంతి పూలల్లోని ముగ్ధమనోహరమే వేరండి. కాని ఒకప్పటి మీ సంతోషాన్ని కోల్పోయినందుకు నాకు చాలా బాధగా ఉంది. ఏం చేస్తాంలెండి. మీ ముగ్గులు కూడా చాలా బాగున్నాయి. మీ అమ్మాయి చాలా బాగా రంగులు అద్దింది. నా శుభాకాంక్షలు అందజేయంది. మీకు కూడా నా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు.

మురళి January 15, 2010 at 11:07 AM  

మా ఇంట్లో బంతి నారు యెంత జాగ్రత్తగా దాచినా ఎలకలు తినేసేవండీ.. భలే బాగున్నాయి మీ జ్ఞాపకాలు.. కొంచం ఆలస్యంగా సంక్రాంతి శుభాకాంక్షలు..

Narendra Chennupati January 15, 2010 at 11:25 AM  

మేము కూడా, మా మిరప చేలో బంతిపులా మొక్కలు చాలా నాటేవాళ్ళం. కూలొల్లు పని చేస్తున్నా, వాళ్ళ కళ్ళన్నీ ఆ పూల మీదే. మా అమ్మ వాటిని ఎప్పుడు కోసుకొమ్మని చెప్తుందా అని ఎదురు చేసేవారు. ఎప్పుడో ఒకరోజు కోసుకోమని చెప్తే వాళ్ళ సంతోషం చూడాలి చెప్తే అర్ధం కాదు.

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP