పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

January 27, 2009

వక్కపలుకులు-6

"ప్రళయకావేరి కథలు" గురించి నేను వ్రాసిన పరిచయం పుస్తకంలో.

స్లండాగ్ మిలియనీర్ సినిమాకి పురస్కారాల మీద పురస్కారాలు లభిస్తున్నాయి. కానీ మానేజ్‌మెంట్ గురు అరిందం చౌదరి ఈ సినిమా గురించి ఏమంటున్నాడో చూసారా? టపాతో పాటు వ్యాఖ్యలు కూడా చదవండి.

మొన్నొక రోజు నాకు చంద్రబాబు నుండి ఓ చిన్న సందేశం వచ్చింది. మీరు సరిగ్గానే చదివారు తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు దగ్గరనుండే! చంద్రబాబు నాకు SMS పంపటం ఏంటి-ఎవడో తుంటరి పంపించి వుంటాడు అనుకున్నా. తరువాత తెలిసింది ఈ మధ్య మన రాజకీయ పార్టీలు సెల్ ఫోను వినియగదారులకి ఇలా SMS లు పంపటం మొదలుపెట్టాయని. ఎయిర్‌టెల్ ఖాతాదారులకి TDP వాళ్లు, ఐడియా ఖాతాదారులకి BJP, ప్రజారాజ్యం పార్టీ వాళ్లు సందేశాలు పంపుతున్నారట. ఎన్నికల టైమా మజాకానా!

60వ గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశమంతటా ఘనంగా జరిగాయి.

నిన్న (జనవరి 26) సూర్యగ్రహణం. ఇండియాలో పాక్షికంగానే కనిపించింది. హైదరాబాదులో అతి స్వల్పంగా కనిపించింది. మా ఏరియాలో అయితే ఏం కనిపించలేదు. ఇండోనేషియాలో ఎంత బాగా కనిపించిందో  చూడండి.

నిన్న చైనా వాళ్ల  కొత్త సంవత్సరం కూడా మొదలయ్యింది. వాళ్లకి ఈ సంవత్సరం వృషభ (ఎద్దు) నామ సంవత్సరం అట.

భారత మాజీ రాష్ట్రపతి వెంకటరామన్ గారు ఈ రోజు కన్నుమూసారు. ఆయన వయస్సు 98 సంవత్సరాలు. భారత దేశానికి ఎనిమిదవ రాష్ట్రపతిగా ఆయన 1987 నుండి 1992 వరకు పనిచేసారు. అంతకుముందు ఉపరాష్ట్రపతిగా కూడా చేసారు. నేను గౌరవించే రాష్ట్రపతులలో ఆయన ఒకరు.

ఫైనాన్షియల్ టైమ్సు సంస్థ ప్రతి ఏడాది ప్రకటించే ప్రపంచంలోని అత్యున్నత ప్రమాణాలు కలిగిన విద్యాసంస్థల జాబితాలో  హైదరాబాదులోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఈ సంవత్సరం 15వ స్థానం దక్కించుకుంది

వరంగల్‌లో ఇద్దరు విద్యార్థినులపై యాసిడ్ దాడి ఆపై నిందితుల ఎన్‌కౌంటరు ఉదంతం మర్చిపోకముందే తన సహవిద్యార్థిని గొంతు కోసాడు మరో ప్రేమోన్మాది.

Read more...

January 20, 2009

వక్కపలుకులు-5

అమెరికా....ఒబామా....అమెరికా... ఒబామా....అమెరికా....ఇవాళ ప్రపంచం చూపంతా అమెరికా వైపే.  ఈ రోజే (జనవరి 20) అమెరికా అధ్యక్షునిగా ఒబామా పదవీస్వీకారమహోత్సవం.  అమెరికా వాళ్ల ఆశలన్నీ ఆయనమీదే!  చూద్దాం ఎంతవరకు అమెరికాని తద్వారా ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం నుండి బయటపడేస్తాడో! ఎంతవరకు వాళ్ల ఆశల్ని సఫలం చేయటంలో సఫలం అవుతాడో!!

ఈ సారి మన దేశ రాజధానిలో జరిగే గణతంత్ర వేడుకలలో మొదటిసారిగా కవిత అబరాలా అనే మహిళా పైలట్  రాష్ట్రపతికి వందనం సమర్పించబోతున్నారు.

జనవరి 16 వ తేదీ US Airways వారి  విమానం ఒకటి న్యూయార్క్ హడ్సన్ నది మీద దిగిన వైనం చూసారా.   పక్షులు డీకొన్న విమానాన్ని పైలట్ సమయస్ఫూర్తితో హడ్సన్ నది మీద దింపి అందులో ఉన్న మొత్తం 155 మంది ప్రయాణీకుల ప్రాణాలని కాపాడాడు. ఇలాంటి అనుకోకుండా జరిగే సంఘటనలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకునేంత సమయం వుండదు.  లిప్తపాటులో నిర్ణయం తీసుకోవటం, అమలు చేయటం అన్నీ జరిగి పోవాలి.  Hats off to pilot and other crew members. విమానం రెక్కల మీద ప్రయాణీకులని చూస్తుంటే మాత్రం ఎంత ముచ్చటేసిందో.

విమానాల్ని ఇలా పక్షులు ఢీకొనటం విమానాల ఆవిర్భావ కాలం నుండీ ఉన్న సమస్యేనట.  విమానాన్ని కనిపెట్టిన రైట్ బ్రదర్స్‌కి కూడా వీటి బాధ తప్పలేదట.

గెలీలియో టెలిస్కోప్ ని ఆవిష్కరించి 400 సంవత్సరాలు అయిన సందర్భంగా ఐక్యరాజ్యసమితి 2009 సంవత్సరాన్ని అంతర్జాతీయ ఖగోళ సంవత్సరంగా ప్రకటించింది

కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం 800 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.  ఈ యూనివర్సిటీ 1209 లో స్థాపించబడిందట. మన ప్రధాన మంత్రి మన్మోహన్ సింగు ఈ విశ్వవిద్యాలయం విద్యార్థే.  ఈ సందర్భంగా ఈ సంవత్సరం మన్మోహన్ సింగు పేరు మీద కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం వాళ్లు ఓ స్కాలర్‌షిప్ కూడా ప్రవేశపెట్టారు. అమర్త్య సేన్, న్యూటన్, డార్విన్, స్టీఫెన్ హాకింగు కూడా ఈ విశ్వవిద్యాలయం విద్యార్థులే. ఈ విశ్వవిద్యాలయం నుండి వచ్చిన వారిలో 60 మందికి పైగా నోబుల్ బహుమతి విజేతలు ఉన్నారట.

రైలు పెట్టెలో నాటకం చూడాలని వుందా అయితే పదండి ముంబయ్.1993 ముంబయి కాల్పుల తరువాత  రాజన్ వర్మ అనే వ్యక్తికి వచ్చిన ఆలోచనే ఈ థియేటర్. ఇది గిన్నెస్ బుక్‌లోకి కూడా ఎక్కింది. ప్రతి ఆదివారం మధ్యాహ్నం ఇద్దరు ముగ్గురు ఓ జట్టుగా ఓ 10 జట్టులు లోకల్ ట్రెయిన్సులోకి ఎక్కి తరువాతి స్టేషను వచ్చే లోపు ప్రస్తుత సామాజిక సమస్యల మీద 2-3 నిమిషాలు లేక 7-8 నిమిషాల నిడివి కలిగిన చిన్న చిన్న నాటికలని ప్రదర్శించి దిగిపోతుంటారు.  అలా ఓ నాలుగు గంటలలో 75,000 నుండి 1,00,000 మంది ప్రేక్షకులకి తమ ప్రదర్శనలు చూపిస్తారు.

అరుంధతి సినిమా బాగుందంటున్నారు మన నెటిజనులు, ఇది తప్పక  థియేటర్లోనే చూడవలిసిన సినిమా అట.

Read more...

January 16, 2009

మా వూరుతాడేపల్లి గారి బ్లాగులో "బ్లాగుటపాలో స్లైడ్ షో" చూసి ఇది చేసాను.

Read more...

January 12, 2009

వక్కపలుకులు-4

రైతులకి పెద్ద పండగ అయిన సంక్రాంతి రాబోతుంది. పల్లెల్లో ఇంతకన్నా పెద్ద పండగ ఇంకొకటి వుండదు. ఒకప్పుడు సంక్రాంతి అంటే ధనుర్మాసం చలిగాలులు, బంతులు, చామంతులు, చిలకముక్కు పూలతో కళకళలాడుతుండే లోగిళ్లు, ఇంటినిండా కొత్త ధాన్యం, వాకిటినిండా ముగ్గులు, ముగ్గుల నిండా గొబ్బెమ్మలు, గొబ్బెమ్మలు ముందు హరిదాసులు, గంగిరెద్దువాళ్లు,  భోగిమంటలు, కోడిపందాలు, .....ఇప్పుడు ఏదీ పల్లె నుదిటిన ఆ పండగ కళ?  ఎక్కడో కొన్నిచోట్లే కనపడుతుంది.

పల్లెల్లో పండగ ఎలా జరుపుకున్నా ఆ ఆనందమే వేరు. అమ్మ నేలని, అమ్మ భాసని మించినవి ఉండవు కదా! ఈ పండగకి మన ఊర్లు కళకళలాడుతుంటే హైదరాబాదు బోసిపోతుంది.  హైదరాబాదు రోడ్లన్నీ ఖాళీ ఖాళీ!  ఊరికెళ్లేవాళ్లతో రైల్వే స్టేషను, బస్టాండు కిటకిటలాడుతున్నాయి.  వెళ్లేవాళ్లకి ఆనందమయితే వెళ్లలేకపోతున్న వాళ్లకి ఏదో కోల్పోతున్నామన్న బాధ.

నిన్న హైదరాబాదులో పండిట్ రవిశంకర్ ఆయన కుమార్తె అనౌష్కతో కలిసి ఓ కార్యక్రమం చేసారు.  వెళదామంటే పాసులు దొరకలేదు:).  20 ఏళ్ల తరువాత ఆయన హైదరాబాదు రావటం, అంతే కాక తన కుమార్తెతో కలిసి హైదరాబాదులో మొదటిసారిగా ప్రదర్శన ఇచ్చారు.  ఇక జీవితంలో ఆయన ప్రదర్శన ప్రత్యక్షంగా చూసే అవకాశం రాదేమో!

ప్రముఖ సంగీత దర్శకుడు రెహమాన్‌ సినీ సంగీత ప్రపంచంలో అత్యున్నతంగా భావించే గోల్డెన్‌ గ్లోబ్‌ పురస్కారానికి ఎంపికయ్యారు.  రెహమాన్‌ ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా రికార్డులకెక్కాడు.

2007 సంవత్సరానికి గాను ఈ రోజు నంది అవార్డులు ప్రకటించారు. ఉత్తమ నటుడిగా వెంకటేష్‌ (ఆడవారి మాటలకు అర్థాలే వేరులే), ఉత్తమ నటిగా చార్మి (మంత్ర) ఎంపికయ్యారు. ఉత్తమ చిత్రంగా మీ శ్రేయోభిలాషి, ఉత్తమ ద్వితీయ చిత్రంగా హ్యాపీడేస్‌, ఉత్తమ తృతీయ చిత్రంగా లక్ష్యం ఎంపికయ్యాయి.

మొన్నో రోజు అంతర్జాలంలో ఏదో వెదుకుతుంటే ఇది కనపడింది.  ఉన్నవి ఓ 15 కథలే అయినా బాగున్నాయి, చూడండి.

మనదేశంలో మొట్టమొదటిసారిగా ఓ పార్టీ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలలో లోకసత్తా అధ్యక్షునిగా జయప్రకాశ్‌నారాయణ ఎన్నికయ్యారు.

పిల్లలకి స్కూళ్లకి అన్నం, టిఫిన్ పెట్టే లంచు బాక్సులు వీలయినంతవరకు ప్లాస్టిక్కువి కాకుండా చూడండి, లేదా అల్యూమినియం ఫాయిల్‌లో చుట్టి పెట్టండి. ప్లాస్టిక్కు (PVC) బాక్సుల్లో లెడ్ పరిమాణం ఉండాల్సిన దానికంటే చాలా ఎక్కువగా వుంటుందట, జాగ్రత్త మరి.  అల్యూమినియం ఫాయిల్‌ మూలాన పర్యావరణానికి ప్రమాదం అంటారా, ఏం చేస్తాం మరి గుడ్డి  కన్నా మెల్ల నయం కదా!

అందరికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు.

Read more...

January 9, 2009

నిగ్గదీసి అడుగు......

సత్యంలో అంతా అసత్యమేనట.  మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు అసలే కష్టాలలో వున్న సాఫ్టువేర్ పరిశ్రమకి మరో దెబ్బ. ఇక్కడ నాకు అర్థం కాని విషయం--ఇలాంటివి బయటపడ్డప్పుడే మన పత్రికల వాళ్లు అంతకుముందు వున్న లోట్లు, లొసుగులు, జరిగిన మోసాలు, ఇత్యాది గురించి పేజీలకి పేజీలు కథనాలు ప్రచురిస్తుంటారు ఎందుకని?(investigative journalism అంటే ఇదే అంటారా!)  ఇవన్నీ ముందే బయటపెడితే  సామాన్య మానవుడు కాస్త జాగ్రత్తపడతాడుగా. అయినా ఇక్కడ సామన్యుడిని పట్టించుకునేది ఎవరంటారా? అదీ నిజమే.

ఆటోవాడు మీటరు వేయను నేను అడిగినంత ఇవ్వాల్సిందే అన్నప్పుడూ, తప్పుడు మీటరుతో ఎక్కువ డబ్బులు తీసుకున్నప్పుడూ, అరటిపళ్ల బండి వాడు డజను కాయలకి 10 కాయలే వేసి నన్ను మోసం చేయాలని చూసినప్పుడూ, పేపరు వాడు సరిగ్గా  పేపరు వేయకుండానే పేపరు బిల్లుకి వచ్చినప్పుడూ, పాలవాడు నిలవ వున్న (ముందు రోజువి) పాల పాకెట్లు వేసినప్పుడూ---చ లోకంలో అంతా మనల్ని మోసం చేయాలని చూసేవాళ్లే అని బాధపడిపోతుంటాను, వాళ్లని ఏదో చేయాలన్ని కసి, ఏమీ చేయలేని ఉక్రోషం, అస్సహాయత-కానీ ఇప్పుడు జరిగిన మోసం చూస్తుంటే ఇవన్నీ అసలు మోసాలే కాదు అనిపిస్తుంది.  వాళ్లు బ్రతకటానికి చేస్తుంటే వీళ్లు బ్రతక నేర్చి చేస్తున్న మోసం.

ఒకటి కాదు రెండు కాదు అక్షరాలా ఏడువేల కోట్ల రూపాయలకి దొంగ లెక్కలు. మరి ఇలాంటి మోసగాళ్లని ఏం చేయాలో! నే చేసింది తప్పే, అంతా నేనే చేసాను అని తప్పు ఒప్పేసుకుంటే సరిపోతుందా? అసలు ఇంత జరుగుతున్నా మూడోకంటికి తెలియకపోవటం ఏమిటి? మనింట్లో జమాఖర్చుల్లో ఓ పది రూపాయలు తేడా వస్తేనే మనకి నిద్ర పట్టదు  మరి అలాంటిది ఇన్ని కోట్లకి దొంగ లెక్కలు వేస్తుంటే అంత పెద్ద కంపెనీలో ఎవరికీ తెలియలేదా? మళ్లీ ఓ ప్రసిద్ధ విదేశీ కంపెనీ దాని లెక్కలు చూసేది.  వాళ్ల లెక్కలు వాళ్లే రాసుకునేప్పుడు దానికి ఇంకో కంపెనీ ఎందుకో? ఏంటో మనలాంటి వాళ్లకి అన్నీ ప్రశ్నలే! ఏది సత్యమో ఏది అసత్యమో అంతా అయోమయమే! అయినా మన ప్రశ్నలకి జవాబిచ్చేదెవరు?

సత్యం వాళ్లకున్న ఆస్తులు అన్నీ అమ్మితే ఈ కష్టాలనుండి బయటపడరంటారా? కానీ అమ్మరు! వాళ్ల కోట్లు వాళ్ల కోట్లలోనే వుండాలిగా మరి!! ఇవాళ సత్యం షేరు ధర ప్రారంభంలో ఆరు రూపాయలకు పడిపోయిందట! నిన్న మొన్నటి దాకా ఎవరైనా కలగన్నారా ఆ షేరు ఆ ధరలో లభిస్తుందని.  అదేంటో జనాలేమో రాజు గారు సత్యాన్ని గట్టెక్కించటానికి తన షేర్లు కూడా అమ్ముకున్నారు అని బాధపడిపోతున్నారు !  అప్పుడు కొనుక్కొన్న వాళ్ల గతి ఇప్పుడేంటి? ఇందులో లాభపడిందెవరు?నష్టపడిందెవరు? ఎంతమంది మదుపుదార్ల గుండెలు పగిలి వుంటాయి? మన ప్రశ్నలకి జవాబిచ్చేదెవరు?

సత్యం CFO వడ్లమాని శ్రీనివాస్ ఆత్మహత్యా ప్రయత్నం చేసారని మీడియా ప్రచారం చేస్తుంది, మరి అది ఎంతవరకు నిజమో తెలియదు. ఇది కూడా  ఇంకో నాటకమా? మన ప్రశ్నలకి జవాబిచ్చేదెవరు?

ఇక్కడ నాకు గాయం సినిమాలో  సిరివెన్నెల పాట ఒకటి గుర్తుకొస్తుంది....

 నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని
మారదు లోకం..మారదు కాలం
దేవుడు దిగిరానీ ఎవ్వరు ఏమై పోనీ
మారదు లోకం..మారదు కాలం..||నిగ్గదీసి||

గాలివాటు గమనానికి కాలిబాట దేనికి
గొర్రెదాటు మందకి నీ జ్ఞానబోధ దేనికి
ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం
ఏ క్షణాన మార్చుకుంది చిచ్చుల మార్గం
రామబాణమార్పిందా రావణ కాష్టం
కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం ..||నిగ్గదీసి||

పాత రాతి గుహలు పాల రాతి గృహాలైనా
అడవి నీతి మారిందా ఎన్ని యుగాలైనా
వేట అదే వేటు అదే నాటి కథే అంతా
నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింతా
బలవంతులే బ్రతకాలని సూక్తి మరవకుండా
శతాబ్దాలు చదవలేదా ఈ అరణ్య కాండ..||నిగ్గదీసి ||

Read more...

January 5, 2009

తెలుగులో మహిళా బ్లాగుల ప్రస్థానం


మనసు భావాలని పంచుకోవటానికి బ్లాగు ఓ చక్కని వేదిక, ఇది మహిళల విషయంలో మరింత నిజం కూడా. ఇప్పుడు తెలుగు బ్లాగుల్లో మహిళల బ్లాగులు ఓ విశిష్ట స్థానాన్ని ఆక్రమించుకున్నాయి.  కథలు, కవితలు, సమీక్షలు, పుస్తకాలు, సినిమాలు, పాటలు, గేయాలు, రాజకీయాలు, అంతరంగాలు, స్వగతాలు, చలోక్తులు, విశ్లేషణలు, విమర్శలు, ముగ్గులు, వంటలు, కొండకచో ముఖాముఖీలు----ఒక్కటేమిటి..... పొడుపు కథలనుండి......అన్నమయ్య పదాల వరకు బ్లాగుల్లో మహిళలు స్పృశించని అంశం లేదు, అందరి గురించి అన్నిటి గురించి వ్రాసేస్తున్నారు.

తెలుగులో మహిళా బ్లాగులు 2005 లో మొదలయ్యాయి.  మొదటగా వచ్చింది ఇందు భార్గవి ది అని చెప్పవచ్చు.  ఈమెను ఆది బ్లాగరిత అనవచ్చేమో.  ఇందు భార్గవి ఇంగ్లీషులో 2004లోనే మొదలుపెట్టినా తెలుగులో 2005 ఏప్రియల్‌లో వ్రాయటం మొదలుపెట్టారు.  తను తెలుగులో వ్రాసింది చాలా తక్కువే, ఇప్పుడు పూర్తిగా ఇంగ్లీషులోనే వ్రాస్తున్నట్లున్నారు.  తరువాత అభిసారిక . అభిసారిక కూడా మధ్యలో చాలా రోజులు కనపడలేదు, మరల తాజాగా 2008 నవంబరు నుండి వ్రాయటం మొదలుపెట్టారు.  ఈమె పాత టపాలయితే ఏవీ ఇప్పుడు లేవు. తరువాత శైలజ అంగర స్వాతికుమారిసౌమ్య, రాధిక, లలిత, అమూల్య  లాంటి వాళ్లు మొదలుపెట్టారు. వీరిని తొలితరం తెలుగు మహిళా బ్లాగర్లగా చెప్పుకోవచ్చు. వీరిలో ప్రస్తుతం సౌమ్య, రాధిక మాత్రమే తరుచుగా వ్రాస్తున్నారు. శైలజ అంగర మొదలుపెట్టటం ఐదు బ్లాగులు మొదలుపెట్టినా ఎక్కువగా వ్రాయటం లేదు.  లలిత గారయితే తన బ్లాగుని పూర్తిగా మూసివేసారు.  తను ప్రస్తుతం తెలుగు పిల్లల కోసం ఓ వెబ్ సైటుని నడుపుతున్నారు.  అమూల్య కూడా ప్రస్తుతం వ్రాయటం లేదు.  స్వాతికుమారి గారు తన బ్లాగుకి కొద్ది రోజులు విరామమిచ్చినట్లున్నారు. 

2007 వరకు కాస్త నత్త నడక నడిచిన మహిళా బ్లాగులు 2007....2008 వచ్చేటప్పటికి పరుగు అందుకున్నాయి.  విభిన్న రంగాల నుండి వచ్చిన వారు--గృహిణులు, రచయిత్రులు, కవయిత్రులు, ఉద్యోగినులు, స్త్రీవాదులు, ఎందరెందరో బ్లాగులు మొదలుపెట్టారు.

నిడదవోలు మాలతి, స్వాతి శ్రీపాద, శ్రీవల్లీ రాధిక, రమ్య లాంటి రచయిత్రులు, సత్యవతి, కల్పన రెంటాల, కొండేపూడి  నిర్మల లాంటి స్త్రీవాదులు బ్లాగులు మొదలుపెట్టిన వారిలో ఉన్నారు.

అందరిలోకి చెప్పుకోవలసింది ఒంటిచేత్తో అవలీలగా ఏడు బ్లాగులు వ్రాస్తున్న జ్యోతి గారినే.  ఒక సామాన్య గృహిణి అసామాన్య బ్లాగరుగా మారి  సాధించిన విజయం ఇది.  తనని స్ఫూర్తిగా తీసుకుని బ్లాగులు మొదలుపెట్టిన వారు ఎందరో. తన ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే బ్లాగులు వ్రాయమని ప్రోత్సహించటమే కాదు, దానికి కావలసిన సాంకేతిక సహాయం కూడా అందిస్తుంటారు. ఎక్కడో పల్లెటూరు నుండి  తమ భావాలని పంచుకుంటున్న మహిళా బ్లాగర్లు కూడా వున్నారు

కొన్ని మహిళా బ్లాగుల గురించిన పరిచయం కింది టపాలలో చూడవచ్చు.
http://vareesh.blogspot.com/2008/09/blog-post_10.html
http://vareesh.blogspot.com/2008/09/blog-post_21.html

తెలుగులో తొలి మహిళా బ్లాగుల గురించి వివరాలు అందించిన తాడేపల్లి గారికి, సి.బి.రావు గారికి ధన్యవాదాలు.

Read more...

వక్కపలుకులు-3................గుఱ్ఱం ఎగరావచ్చు!

మరో సంవత్సరం వచ్చేసింది.  విజయవాడలో  పుస్తక ప్రదర్శన మొదలయ్యింది.  e-తెలుగు సభ్యులు నిన్న, అంటే జనవరి 4వ తేదీ, అక్కడ కూడా ఓ ప్రదర్శన ఇచ్చారు, మంచి ప్రతిస్పందన వచ్చింది.

 టైం మాగజైన్ "మాన్ ఆప్ ది ఇయర్" గా ఒబామ వచ్చాడట. అంతా ఒబామా మయం జగమంతా ఒబామా మయం లాగా ఉంది ఇప్పుడు. ఒబామా పదవీస్వీకరణ ఉత్సవానికి హైదరాబాదు నుండి చైతన్య అన్న ఇంజినీరింగు చదివే అమ్మాయి వెళుతుంది.

మన రానారెకి పెళ్లంట.  అయ్యా రానారె, మీ బ్లాగు ముఖంగా ఒక్కసారి అమ్మాయి బొమ్మ మాకు చూపించకూడదూ? మీ బ్లాగులో అమ్మాయితో ముఖాముఖీ కూడా పెట్టొచ్చు వెరైటీగా, మేము కూడా కొన్ని ప్రశ్నలు అడుగుతాం (సరదాకే సుమా).  మా రామయ్య పెళ్లికొడుకాయెనే అని మనమంతా ఇప్పుడు పాడాలన్నమాట. ఇంతకీ పెళ్లెప్పుడు రామనాథా! ఇంత శుభవార్త అందించిన మన వేగులకి ధన్యవాదాలు.

రాజకీయాల్లో మార్పు అవసరమని నినదిస్తున్న లోక్‌సత్తా పార్టీ దాన్ని ఆచరించి చూపిస్తుంది.  పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతున్నాయి. అధ్యక్ష పదవికి ముగ్గురు పోటీ పడుతున్నారు.  మన మిగతా పార్టీలు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవటంలో పోటీ పడుతున్నాయి. అందుకే రాబోయే ఎన్నికలలో ఆలోచించి ఓటు వేద్దాం, ఓటు హక్కుకున్న బలమేమిటో నిరూపిద్దాం.

పుస్తకల ప్రియులకి మరో మంచి నేస్తం దొరికింది చూసారా? ఇక ఎంచక్కా అక్కడ పుస్తక పరిచయాలు, సమీక్షలు, అభిప్రాయాలు చదివి మనం పుస్తకాలు కొనుక్కోవచ్చు. ఇది ఇంకా పసిమొగ్గే మరి దానికి మనకు చేతనైన ప్రోత్సాహం ఇద్దాం .

లండనులో ఓ పుస్తకాల కొట్టు ఉంది.  పుస్తకాల కొట్టు ప్రతి చోటా ఉంటుంది కదా అదో విశేషమా అంటారా! విశేషమే మరి ! అక్కడ అన్ని వంటల పుస్తకాలే ఉంటాయి  అ కొట్టు పేరే "Books for cooks" . అక్కడ ఉన్న పుస్తకాల నుండి రోజుకొక మూడు పుస్తకాలు ఎంచుకుని ఒక్కొక పుస్తకం నుండి ఒక్కో వంటకం వండి వడ్డిస్తారట. అక్కడ వంటలు కూడా నేర్పిస్తారట. అదేంటో చూడాలని ఉందా మరెందుకు ఆలస్యం లండను విమానం ఎక్కేసేయండి.

వంటలు, విమానం అంటే గుర్తుకొచ్చింది.  జనవరి ఒకటిన మా చెల్లెలు అమెరికా నుండి ఫోను చేసింది.  మా ఇద్దరి సంభాషణ ఇలా జరిగింది.

చెల్లి: ఏం చేస్తున్నావు?....

నేను: కాశ్మీరీ పలావు చేస్తున్నా......

చెల్లి: అబ్బ! ఇప్పటికిప్పుడు అక్కడికొచ్చేయాలనిపిస్తుంది నాకు....

నేను: వచ్చేసేయి మరి.....

చెల్లి: ఓ విమానం కొనేసుకుంటా ఎప్పుడంటే అప్పుడు రావచ్చు.....

నేను: అవును  ఆ పని చెయ్యి, నెలకొక సారన్నా రావచ్చు.....

చెల్లి: నెలకొకసారేంటి, వారానికి ఒకసారి వచ్చేస్తా....

నేను: అసలు ఎప్పుడంటే అప్పుడు ఎక్కడికంటే అక్కడికి ఎగురుకుంటూ వెళ్లే ఉపాయం వుంటే ఎంత బాగుండో కదా... 

చెల్లి:  అవును....

నేను: సరేలే, ప్రస్తుతానికి పలావు ఫోటో పెడతా చూసి ఆనందించు......

చెల్లి: ఆ ఫోటొ చూడగానే అందులోని పదార్థం మా కళ్లముందు ప్రత్యక్షమైతే ఎంత బాగుంటుందో కదా! మీరు రోజుకొక ఐటం చేసి పంపుతుండొచ్చు......


 నేను: అవును గుఱ్ఱం ఎగరావచ్చు, ఆ రోజూ రానూ వచ్చు.  ప్రస్తుతానికి ఇది చూసి ఆనందించు. ఎట్లా ఉందో చెప్పు!

Read more...

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP