పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

April 9, 2011

ఒకే ఒక్కడు..ఒకే అడుగు



జయహో అన్నా హజారే!

ఎవరో ఒకరు ఎపుడో అపుడు
నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు
అటో ఇటో ఎటో వైపు అటో ఇటో ఎటో వైపు.....

ఓ నవ వృద్దుడు వేసిన అడుగు
భావి తరాలకు ఆదర్శం అయింది
 మనలాగా నాకెందుకులే అని
 ఆ నవ వృద్దుడు నిర్లిప్తంగా కూర్చోలేదు
తన దీక్షతో కోట్లాదిమందిని కదిలించగలిగాడు
భారత యువకులలో కొత్త ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని రగిలించాడు!

మొదటి వాడు ఎప్పుడూ ఒక్కడే మరి
మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరి
వెనుక వచ్చు వాళ్ళకు బాట అయినది .....

మొదటి అడుగు వేయాలంటే చాలా గుండె ధైర్యం ఉండాలి.
అలాంటి గుండె ధైర్యాన్ని ప్రదర్శించి
లక్షలాది యువకుల గుండెల్లో అగ్నిని రగిల్చాడు హజారే!!

ఇలా దీక్ష చేయటం ఎమోషనల్ బ్లాక్‍మెయిల్ అన్నారు
ఆయనకి వ్యక్తిగత స్వార్థాన్ని అంటగట్టిన వాళ్లూ  ఉన్నారు
అయినా ఆయన వెనకడుగు వేయలేదు.....

కదలరు ఎవ్వరూ వేకువ వచ్చినా అనుకొని
కోడి కూత నిదరపోదుగా.. జగతికి మేలుకొలుపు మానుకోదుగా..
మొదటి చినుకు సూటిగా దూకి రానిదే.. మబ్బు కొంగు చాటుగా ఒదిగి దాగితే..
వాన ధార రాదుగా నేల దారికి... ప్రాణమంటు లేదుగా బ్రతకటానికి..

42 సంవత్సరాలుగా మూలన మూలుగుతున్న
జన లోకపాల్ బిల్లుకి తన సత్యాగ్రహంతో కదలిక తీసుకు వచ్చాడు
అదరక బెదరక సర్కారుని లొంగదీసాడు
యువతీయువకులని మేల్కొలిపాడు!!

చెదరక పోదుగా చిక్కని చీకటి
మిణుగురు రెక్క చాటు చిన్ని కాంతికి
దానికి లెక్క లేదు కాళరాతిరి.....

ఆయన మొదలుపెట్టిన పోరాటానికి
మేము సైతం అంటూ
అఖండ భారతావని అండగా నిలిచింది
కోట్లాది కంఠాలు ముక్త కంఠమై
ఆయనతో గొంతుకలిపాయి

యుగములు సాగినా నింగిని తాకక
ఎగసిన అలల ఆశ అలిసిపోదుగా
ఓటమి ఒప్పుకుంటు ఆగిపోదుగా......

ఈ పోరాటం ఇలానే సాగాలి..ఇది తాత్కాలికం కాకూడదు
ఆయన మొదలుపెట్టిన పోరాటాన్ని
అందరూ కలిసికట్టుగా కొనసాగించాలి
జన లోక్‍పాల్ బిల్లు అమలులోకి రావాలి
అంతే కాదు బిల్లు రాగానే సరికాదు
అది సరిగ్గా అమలయేట్టు చూడాల్సిన బాధ్యత కూడా మనదే
అవినీతి నిర్మూలనలో మనవంతు ప్రయత్నం మనం చేద్దాం!

ఎవరో ఒకరు ఎపుడో అపుడు
నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు
అటో ఇటో ఎటో వైపు అటో ఇటో ఎటో వైపు.....

************************************************************************************

Read more...

April 6, 2011

సుజాత.. .ఫోటోగ్రాఫ్ విత్ ఆటోగ్రాఫ్


పేరుకు తగ్గట్టు మంచి రూపు..సహజత్వం..అన్నిటికి మించి చక్కటి నవ్వు..ముద్దు మద్దు మాటలు..ఆమే సుజాత!

సుజాత..ఆ పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేవి.. గోరింటాకు సినిమాలోని కొమ్మకొమ్మకో సన్నాయి పాట! అలాగే గుప్పెడుమనసు సినిమాలోని నేనా పాడనా పాట!

నేను తొమ్మిదో తరగతిలో ఉండగా అనుకుంటాను గోరింటాకు సినిమా విడుదల అయింది.  అదే సుజాతకి తెలుగులో మొదటి సినిమా.  ఆ సినిమాలో సుజాత నాకెంతగా నచ్చిందంటే అప్పట్లో ఓ పత్రికలో ఆమె ఇంటర్యూతో పాటు ఆమె అడ్రస్సు  కూడా ఇస్తే వెంటనే ఓ ఉత్తరం వ్రాసేసా! నాకు సినిమా యాక్టర్లంటే అంత పిచ్చేమి ఉండేది కాదు కాని ఎందుకో తనకి ఉత్తరం వ్రాయాలనిపించింది.....వ్రాసాను. ఓ వారం రోజులల్లోనే  ఆమె సంతకం చేసిన ఫోటోతో పాటు ఓ ఉత్తరం కూడా తిరుగుటపాలో వచ్చింది.  ఎంత ఆనందం వేసిందో.

 అసలు సినిమా వాళ్ళు ఇలాంటి ఉత్తరాలకి జవాబులిస్తారన్నది అప్పటివరకు నేను నమ్మని విషయం.  గాల్లో తేలిపోయాను. నాకు ఓ సినిమా యాక్టరు నుండి ఉత్తరం వచ్చిందని ఎంతమందికి చూపించానో!  కొద్ది రోజులపాటు స్నేహితుల్లో ఓ ప్రత్యేక గుర్తింపు..సుజాత ఫోటోతో పాటు ఉత్తరం కూడా వ్రాసిందటగా..ఇప్పుడు మేము వ్రాస్తే మాకు కూడా ఫోటొ పంపుతుందా అని అడిగేవాళ్లు.  ఇప్పటికీ ఆ ఫోటో...ఉత్తరం భద్రంగా దాచుకున్నా!  అదే నా జీవితంలో ఓ నటికి గాని నటుడికి గాని నేను వ్రాసిన మొదటి చివరి ఉత్తరం.

అప్పట్లో తన కోసమే గుప్పెడుమనసు సినిమా చూసాను.  ఓ రచయిత్రిగా..ఓ సాధారణ ఆడదానిగా .రెండు స్వభావాల మద్య ఆ పాత్ర పడే ఘర్షణని సుజాత చాలా సహజంగా చేసింది. ఆ సినిమా చూసాక చాలా రోజులు నాకు శరత్‍బాబు అంటే  కోపంగా ఉండేది. తన పేరు మీద వచ్చిన సుజాత సినిమాలో కూడా తనే హీరోయిన్. మొన్నటి శ్రీరామదాసు సినిమాలో కూడా చక్కగా నటించింది.

మరో మంచి నటిని కోల్పోయాం.

వరసపెట్టి అందరూ ఇలా ప్రయాణాలు కట్టేస్త్రున్నారేంటో! వెళ్ళినవాళ్ళు అక్కడకన్నా ఇక్కడే బాగుంది త్వరగా వచ్చేయండి అని తాయిలాలు చూపెడుతున్నారేమో!

Read more...

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP