పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

April 6, 2011

సుజాత.. .ఫోటోగ్రాఫ్ విత్ ఆటోగ్రాఫ్


పేరుకు తగ్గట్టు మంచి రూపు..సహజత్వం..అన్నిటికి మించి చక్కటి నవ్వు..ముద్దు మద్దు మాటలు..ఆమే సుజాత!

సుజాత..ఆ పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేవి.. గోరింటాకు సినిమాలోని కొమ్మకొమ్మకో సన్నాయి పాట! అలాగే గుప్పెడుమనసు సినిమాలోని నేనా పాడనా పాట!

నేను తొమ్మిదో తరగతిలో ఉండగా అనుకుంటాను గోరింటాకు సినిమా విడుదల అయింది.  అదే సుజాతకి తెలుగులో మొదటి సినిమా.  ఆ సినిమాలో సుజాత నాకెంతగా నచ్చిందంటే అప్పట్లో ఓ పత్రికలో ఆమె ఇంటర్యూతో పాటు ఆమె అడ్రస్సు  కూడా ఇస్తే వెంటనే ఓ ఉత్తరం వ్రాసేసా! నాకు సినిమా యాక్టర్లంటే అంత పిచ్చేమి ఉండేది కాదు కాని ఎందుకో తనకి ఉత్తరం వ్రాయాలనిపించింది.....వ్రాసాను. ఓ వారం రోజులల్లోనే  ఆమె సంతకం చేసిన ఫోటోతో పాటు ఓ ఉత్తరం కూడా తిరుగుటపాలో వచ్చింది.  ఎంత ఆనందం వేసిందో.

 అసలు సినిమా వాళ్ళు ఇలాంటి ఉత్తరాలకి జవాబులిస్తారన్నది అప్పటివరకు నేను నమ్మని విషయం.  గాల్లో తేలిపోయాను. నాకు ఓ సినిమా యాక్టరు నుండి ఉత్తరం వచ్చిందని ఎంతమందికి చూపించానో!  కొద్ది రోజులపాటు స్నేహితుల్లో ఓ ప్రత్యేక గుర్తింపు..సుజాత ఫోటోతో పాటు ఉత్తరం కూడా వ్రాసిందటగా..ఇప్పుడు మేము వ్రాస్తే మాకు కూడా ఫోటొ పంపుతుందా అని అడిగేవాళ్లు.  ఇప్పటికీ ఆ ఫోటో...ఉత్తరం భద్రంగా దాచుకున్నా!  అదే నా జీవితంలో ఓ నటికి గాని నటుడికి గాని నేను వ్రాసిన మొదటి చివరి ఉత్తరం.

అప్పట్లో తన కోసమే గుప్పెడుమనసు సినిమా చూసాను.  ఓ రచయిత్రిగా..ఓ సాధారణ ఆడదానిగా .రెండు స్వభావాల మద్య ఆ పాత్ర పడే ఘర్షణని సుజాత చాలా సహజంగా చేసింది. ఆ సినిమా చూసాక చాలా రోజులు నాకు శరత్‍బాబు అంటే  కోపంగా ఉండేది. తన పేరు మీద వచ్చిన సుజాత సినిమాలో కూడా తనే హీరోయిన్. మొన్నటి శ్రీరామదాసు సినిమాలో కూడా చక్కగా నటించింది.

మరో మంచి నటిని కోల్పోయాం.

వరసపెట్టి అందరూ ఇలా ప్రయాణాలు కట్టేస్త్రున్నారేంటో! వెళ్ళినవాళ్ళు అక్కడకన్నా ఇక్కడే బాగుంది త్వరగా వచ్చేయండి అని తాయిలాలు చూపెడుతున్నారేమో!

8 వ్యాఖ్యలు:

తృష్ణ April 6, 2011 at 10:04 PM  

మరి ఆ ఫోటోగ్రాఫ్ ,ఆటోగ్రాఫ్ ఫోటో తీసి పెట్టాల్సింది కదండి..చూసి చాలా ఆనందించేవాళ్ళం. నేనూ ఇందాకే ఒ టపా రాసానండి...ఇంచుమించు ఇలానే. బహుశా ఆమె గురించిన అభిప్రాయాలు ఒకేలా ఉంటాయేమో చాలామందికి అనిపించింది మీ టపా చూడగానే.

తృష్ణ April 6, 2011 at 10:06 PM  

మరి ఆ ఫోటోగ్రాఫ్ , ఆటోగ్రాఫ్ ఫోటో తీసి పెట్టాల్సింది కదండి..చూసి చాలా ఆనందించేవాళ్ళం. నేనూ ఇందాకే ఒ టపా రాసానండి...ఇంచుమించు ఇలానే. బహుశా ఆమె గురించిన అభిప్రాయాలు ఒకేలా ఉంటాయేమో చాలామందికి అనిపించింది మీ టపా చూడగానే.

సిరిసిరిమువ్వ April 6, 2011 at 10:09 PM  

తృష్ణ గారు అవి మా ఊర్లో ఉన్నాయి ఈ సారి తెస్తాను. మీ టపాలు రెండూ చూసాను.

Rajendra Devarapalli April 6, 2011 at 10:18 PM  

నేను పొన్నూరు అన్సార్ థియేటర్ లో చూసానండోయ్ ఆ గోరింటాకు.

సిరిసిరిమువ్వ April 6, 2011 at 10:24 PM  

రాజేంద్ర గారూ, నేనూ ఆ సినిమా పొన్నూరులోనే చూసాను కానీ ఏ హాలో గుర్తులేదు.. అన్సార్ థియేటర్ అప్పటికే ఉందాండీ? అది ఆ తరువాత కట్టిందేమో కదా?

Rajendra Devarapalli April 7, 2011 at 9:06 AM  

గోరింటాకు 1979లో విడుదలయ్యింది.అన్సార్ థియేటర్ అంతకు ఒక యేడాది ముందు మొదలయ్యింది.సీతాపతి సంసారం అనే సినిమా రిలీజుతోనన్నమాట.అప్పట్లో పొన్నూరులో రిలీజంటే పెద్దవార్త కదా! :) పైగా ఆ హాల్లో క్యాంటీన్ మా బజారులోని శివయ్యగారిదే అలా అఫీషియల్ గా వెళ్ళామన్నమాట :)అందుకే గుర్తుందండి.

లత April 7, 2011 at 9:33 AM  

అవునండి సుజాత గుర్తు రాగానే ప్లజెంట్ గా ఉంటుంది ఆవిడ పోయారు అనగానే బాధ వేసింది

సిరిసిరిమువ్వ April 7, 2011 at 10:20 AM  

రాజేంద్ర గారు అవునండి ఇప్పుడు మీరు చెప్తుంటే గుర్తుకొచ్చింది అన్సారులో మొదట సీతాపతి సంసారం సినిమా విడుదలయిందని.ధన్యవాదాలు.

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP