పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

March 22, 2011

రమణీయం......ముళ్లపూడివారి ముందుమాటతో

కొన్ని రచనలు వడియాలు పెట్టినట్టుంటాయి.
కొన్ని జంతికలు పోసినట్టుంటాయి.
కొన్ని మాత్రం ముగ్గులు వేసినట్టుంటాయి.
పై రెండూ తింటే కరుసైపోయినట్టే-

"నిన్న" కన్న బిడ్ద "ఇవాళ"
"ఇవాళ"లు రేపటికి పేరెంట్సూ, ఎల్లుండికి తాతలూ అవ్వలూనూ.....

దాలిగుంట మీద పాలదాకలో పాలి నిదానంగా కాది, మరిగి, పొంగి పొంగి, కుంగి స్థిరపడి ఎర్రడాలు మీగడ తేలడం దాంపత్య సౌభాగ్యం!
ఏవిటలా చదవడం ఆపి, కళ్ళు తేలేస్తున్నారు?

సరదానంద వాక్యాలు గంభీరానంద సన్యాసానంద ప్రసంగ పాఠాల్లా కనపడుచున్నాయా?

పైవన్నీ నా మాటలు కాదండోయ్!

సీతారాముళ్లనే బావామరదళ్ల..ధరిమిలా ఆలూ మగళ్ల..ఆ పైన తల్లీతండ్రుళ్ల..ఆ పిమ్మట అవ్వాతాతళ్ల కథకి మన వెంకటరమణ వ్రాసిన  రమణీయమయిన ముందుమాట..

"దాంపత్య ఋతుసంహారం"..ముందుమాటకి పేరు చూడండి..ఎంత చమత్కారంగా పెట్టారో!

కొన్ని పుస్తకాలకి ముందుమాటతో ఓ గుర్తింపు వస్తుంది.  అలాంటి ఓ పుస్తకమే అనామకుడు వ్రాసిన "రమణీయం" పుస్తకం.

నేను ఈ రచయిత పుస్తకం ఇదే మొదలు చదవటం. అసలుకన్నా కొసరు రుచి అని పుస్తకంలో విషయం కన్నా నాకు రమణ గారి ముందుమాట ముందుగా మా బాగా నచ్చేసింది. అసలు రమణ ఎక్కడికీ వెళ్లలేదు..ఇలా ముందుమాటలతో..వెనక మాటలతో....కోతి కొమ్మచ్చి ఆడుతూ మనతోనే ఉన్నాడు..ఉంటాడు..తెలుగు పాఠకులుగా అది మనం చేసుకున్న పుణ్యం!.

అసలు ఈ పుస్తకం ఏంటంటే..నేను చెప్పటం ఎందుకు..రమణగారి మాటల్లోనే చదవండి.

"చిన్న చిన్నా ఉబలాటాల ఆరాటాల పోరాటాల చెలగాటాల పరీమళాల (నీ జుట్టు నిశి..నీ ముఖం శశి; కళ్లు మూస్తే మొగ్గలు-తెరిస్తే పువ్వులు) ఘుమ ఘుమ లతో నోరూరించే-తింటే ’వ-హల్‍వా’ అనిపించే ఆలుమగల ముత్యాలు ఈ ముగ్గులు.  విశేషం ఏమిటంటే సుద్ద ముగ్గుల్లా ఈ ముగ్గులు చెదరవు..చెరగవు"

ఇక అసలు కథకి వస్తే.......

ఇది ఓ జంట కథ..
ఓ సీత... ఓ రాముడు...పుట్టుకతో బావా మరదళ్లు...తరువాత ఆలూమగలు....ఆపై తల్లిదండ్రులు.. అటు పిమ్మట తాతాముత్తవలు....పుస్తకం మొదటినుండి చివరి దాకా వీరిద్దరే..ఇంకో పాత్ర ఉండదు. ఈ ఇద్దరి సంసారం..అందులోని  సరాగాలు..విరహాలు...అలకలు...రుసరుసలు...బుసబుసలు...కోపాల్..తాపాల్..సరదాల జగడాలు ....వెరసి రమణీయం అనబడే ఈ పుస్తకం.  పెద్ద కథేం ఉండదు వివిధ జీవితావస్థల్లో వాళ్ల రోజువారీ జీవితమే...కానీ చదవటానికి ఆహ్లాదంగా ఉంటుంది.  రెండే రెండు పాత్రలతో దాంపత్య కాలచక్రాన్ని సరదాగా చూపేట్టే పుస్తకం.  అక్కడక్కడా ముళ్లపూడి మార్కు సంభాషణలు నవ్విస్తాయి.. రచయిత మీద ముళ్లపూడి ప్రభావం చాలానే ఉందనిపించింది.

ధనుర్మాసంలో మూడంతస్తుల మేడలో ఓ మూలనున్న తమ ఫ్లాట్‍లో భార్య ముగ్గు వేస్తే చూడాలని ముచ్చటపడ్డ భర్త కోరికని ఆ భార్య ఎలా తీర్చిందో ఈ పుస్తకంలో చదవాల్సిందే! 

చివరి దాకా ఒకే మాట మీద జీవించిన ఆ ఇద్దరూ తమ వానప్రస్థంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారన్న దానితో ఈ పుస్తకం ముగుస్తుంది.

భార్యాభర్తల బంధం ఎలా ఉండాలో సున్నితంగా చెప్పే పుస్తకం! ఇలాంటి కథలు చదివినప్పుడు మన భారతీయ వివాహ బంధం ఎంత గొప్పదీ అని అనిపించకమానదు!

సీతకి రామంలా
రామానికి సీతలా
సీతారామంలా ఉండగలిగితే
ఏ దంపతుల జీవితం అయినా "రమణీయం"
అంటారు రచయిత చివరగా

 ఇదే పుస్తకంలో చివర్లో రాముడి ఏకపత్నీవ్రతం గురించి ఓ సరదా అనుబంధ కథ కూడా ఉంది

మొత్తం మీద సరదాగా టపటపా ఓ గంటలో చదివేయదగ్గ పుస్తకం.

రమణీయం
రచన: అనామకుడు
ప్రచురణ: వాహినీ బుక్ ట్రస్ట్
వెల: 50/-

ఈ పుస్తకం కావల్సిన వాళ్ళు ఎక్కడి దాకో వెళ్లక్కరలేదు..అలా కినిగె కి  వెళ్ళి ఓ నొక్కు నొక్కండి చాలు. కింద బొమ్మ మీద నొక్కినా వెళ్ళవచ్చు. రమణి ముందుమాటకి తోడు వయ్యారాల బాపు  బొమ్మ ఈ పుస్తకానికి మరో అదనపు ఆకర్షణ!


రమణీయం On Kinige

7 వ్యాఖ్యలు:

SRRao March 23, 2011 at 12:30 AM  

సిరిసిరిమువ్వ గారూ !

మంచి పుస్తకాన్ని పరిచయం చేసారు. ధన్యవాదాలు.

సిరిసిరిమువ్వ March 23, 2011 at 10:25 AM  

SRRao గారూ ధన్యవాదాలు.

Anonymous,  March 23, 2011 at 3:37 PM  

నాకయితే వెంటనే చదివెయ్యాలని వుంది. కానీ మీరు చెప్పినట్టూ అక్కడో ఇక్కడో నొక్కి కాదు చక్కగా పుస్తకం చేతబూని రాధాగోపాళం లో రాధలా అలా అలా.......ఇలాంటి పుస్తకాన్ని అలానే చదువుకోవాలి ఏవంటారు!

సిరిసిరిమువ్వ March 23, 2011 at 3:54 PM  

లలిత గారూ, నిజమే చేతిలో పుస్తకం పట్టుకుని..అలా పడకకుర్చీలో పడుకుని ...పక్కన ఏ వేరుశనగ కాయలో పకోడీలో పెట్టుకుని తింటూ చదవటంలో ఉండే మజాయే వేరు..కానీ పుస్తకం దొరకని వాళ్లకి... ఎలాగోలా వెంటనే చదవాలి అనుకునే వాళ్లకి ఇదన్నమాట! నేనూ పుస్తకం చేతబూనే చదివాలేండి!

మురళి March 23, 2011 at 10:03 PM  

కవర్ పేజీ బ్రహ్మాండం. మీరు పరిచయం మరింత బ్రహ్మాండం.. ఉదయాన్నే చూసి ఉంటే తెచ్చేసుకునే వాడినే.. ఈసారి తప్పదండీ..

సిరిసిరిమువ్వ March 25, 2011 at 8:45 PM  

మురళి గారు ఈ పుస్తకం మీరింకా చదివి ఉండకపోవటం ఆశ్చర్యమే! ఇది 2006 లోనే వచ్చిందండి. ఈ రచయత వ్రాసినదే శీలమా? అది యేమి?..మరో 20 కథలు ..అన్న పుస్తకం మీరు చదివారా?

తృష్ణ March 26, 2011 at 5:58 PM  

ఈ రచయిత ఇంతకు ముందు కథలు ,నాటికలు కూడా రాసారండి. మాకు ఆయన బాగా పరిచయం...:)

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP