పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

March 10, 2011

నేలకొరిగిన తెలుగు వైతాళికులు!

అప్పుడెప్పుడో బాబరు రామ మందిరాన్ని కూల్చాడని
ఇప్పటికీ మన గుండెలు మండుతుంటాయి!
మొన్నెప్పుడో ఎక్కడో ఆఫ్ఘనిస్తానులో
తాలిబన్లు బుద్దుడి విగ్రహాలను కూల్చేస్తుంటే
ఇక్కడ మనం విలవిలలాడిపోయాం!

ఈ రోజు మన కళ్ల ముందే
హుస్సేను సాగరు సాక్షిగా
బ్రహ్మనాయుడి పౌరుషం...పటాపంచలు చేస్తుంటే
కృష్ణరాయల కీర్తి........నీటిపాలు చేస్తుంటే
తిక్కయ్య కలాన్ని........అడ్డంగా విరిచేస్తుంటే
త్యాగయ్య గొంతుని....నిర్దాక్షిణ్యంగా నులిపేస్తుంటే
తిమ్మరుసు ధీయుక్తిని....ఎందుకూ కొరకాకుండా చేస్తుంటే
పోతన..వేమన ..ఎర్రాప్రగడల... చేతులు విరిచేస్తుంటే
శ్రీశ్రీ.......జాషువాల....నాలుకలు తెగ్గోస్తుంటే
త్రిపురనేని...కందుకూరి.....సురవరంల...... తలలు పగలగొడుతుంటే
పింగళి వెంకయ్య తలదించుకునేట్టు...మన జండాని అవమానిస్తుంటే
నిలువు గుడ్లేసుకుని.....గుడ్లలో నీరు కుక్కుకుని
నిస్సహాయంగా చూస్తూ కూర్చున్నాం
రుద్రమ్మా..మల్లమ్మా..ఝాన్సమ్మా
ఎక్కడున్నారమ్మా....మీరన్నా క్షేమమేనా!


తెలుగు వైతాళికుల విగ్రహాలని
తెలుగు వారే  ధ్వంసం చేస్తుంటే
ఏడుపో... బాధో.....కసో
ఏమీ చేయలేని అస్సహాయతో..
ఏమీ అర్థం కాని ఓ ఆవేదన!

4 వ్యాఖ్యలు:

lalithag March 11, 2011 at 12:49 AM  

చిన్నప్పుడు ఒక కథ చదువుకున్నాము.
ఇద్దరు స్త్రీలు ఒక బిడ్డకి తామే తల్లి అంటు గొడవ పడుతున్నారు. రాజు గారు తీర్పు చెపుతూ, ఆ బిడ్డని కోసి సగం సగం ఇద్దరికీ పంచమంటారు.అప్పుడుఒక స్త్రీ ఆ బిడ్డని కొయ్యడమేమిటి, ఇంకో స్త్రీకి ఇచ్చేసినా పరవాలేదంటుంది. రాజు గారు అలా అన్నామే అసలు తల్లనీ, అసలు తల్లి కాబట్టే బిడ్డ క్షేమం ముఖ్యం అనుకుంది, తన ownership కాదని, అని తీర్పు చెప్తారు.

ఈ కథ నాకు కొన్నేళ్ళ క్రితం వరకూ అర్థమయ్యేది కాదు. అసలు ఒకరి బిడ్డని ఇంకొకరు ఎందుకు కావాలనుకుంటారో, ఇంకో స్త్రీ ఎంత స్వంత తల్లి కాకపోతే మాత్రం, బిడ్డను కోసి ఇస్తానంటే ఎలా ఒప్పుకుంటుందో అర్థం అయ్యేది కాదు. మానవత్వం దృష్ట్యా కాకపోయినా, ఆమె ఆ సగం కోసిన బిడ్డని ఏం చేసుకుంటుంది?

ఈ గొడవలు చూస్తుంటే ఆ కథ గుర్తుకు వస్తోంది. ఇప్పుడు ఆ రెండో స్త్రీ పాత్ర గురించి కాస్త అర్థం అవుతోంది.

సరే. విగ్రహాలు ప్రమాద వశాత్తున పడ్డాయో, కావాలని పడేశారో మరి.
అవి పడిపోయాయి. అవి చిహ్నాలు మాత్రమే. గౌరవం ఎప్పుడో మంటకలిసిపోయింది.
వారు మనకి ఇచ్చిన సాహిత్య సంపదనీ, స్ఫూర్తినీ మనసారా ఆనదిస్తూ తర్వాతి తరాలకి తెలియచేసే వాళ్ళు కొందరు ఉంటారు. అదే ఆ మహానుభవులకి సరైన గౌరవం.
ఆ మహానుభావులు వారి జీవిత కాలం లో సాధించిన దానికీ, తర్వాత వారికి అందించిన స్ఫూర్తికీ ఏ నష్టం లేదు. కేవలం చిహ్నాల మీదే ఆధర్రపడి ఉన్న గుర్తింపు పోతే వచ్చే నష్టమూ లేదు.

ఇదంతా ఆవేశాలు ఉసి కొల్పే ప్రయత్నం కాక ఇంకేమైనా అవునా? ఆవేశపడకుండా ఉంటే పోలే?

పిల్లలు అల్లరి చేస్తుంటే వారిని వద్దనే కొద్దీ ఇంకా ఎక్కువ చేస్తారు. అన్ని సందర్భాలలో అందరు తల్లి దండ్రులకీ పిల్లలను manage చెయ్యడం రాదు. మరీ పేట్రేగిపోయినప్పుడు మౌనమే మహత్తర శక్తి గల మంత్రం.
ప్రయత్నిద్దామా?

స్వాతంత్ర్య సమరంలో ఒక వైపున మనలో మౌళికంగా ఉన్న లోపాలను సవరిచుకుంటూ, ప్రజలను తమ పరిస్థితి పట్ల, తమ ఆలోచనల పట్ల, చైతన్య పరుస్తూ సమాజంలో పరాయి వారి ప్రమేయం లేకుండానే పేరుకుని పోయిన చెత్తను తొలగిస్తూ, ఇంకో వైపు స్వరాజ్యం కోసం పోరాటం జరిగింది. అప్పుడే అది సఫలమూ అయ్యింది. ఇప్పుడూ అంతే. విద్యార్థులైనా, రాజకీయ నాయకులైనా, చిత్త శుద్ధితో తమ ప్రాంతం బాగు పడాలని కోరుకునే వారు విడిపోదామని అన్నా, దానికి తగు విధంగా పోరాడతారు. సత్ఫలితాలూ పొందుతారు. కలిసి ఉన్నా బాగు పడతారు.

Mauli March 11, 2011 at 1:32 AM  

lalita గారు,

చక్కగా వివరి౦చారు.ఈ సమయ౦ లో మీ అభిప్రాయ౦ ఒక రిలీఫ్, బస్సులు తగల పెట్టడ౦ కన్నా ఇది పెద్దది కాదు నావరకు (అలా అని కొ౦దరి భావాలు నొప్పి౦చే ఉద్దెస్య౦ లేదు).

తెల౦గాణా కోస౦ పోరాడే వారికి కారణాలు ఉన్నట్లే, సమైక్య౦ కావలనుకొనే వారికీ కారణాలు ఉన్నాయి. ఒకరు మ౦చివారు కాదు.ఇ౦కొకరు చెడ్డవారు కాదు.

కాని వారు విగ్రహాలు పడగొట్టి, అదే పెద్ద వివాదమయ్యేలా చూసి తెల౦గాణా ప్రజల సానుభూతి కూడగట్టు కొ౦టున్నారు. ఈ విషయ౦ పై వివాద౦ చేసే కొద్దీ వారి ఆత్మవిశ్వాస౦ పెరుగుతు౦దే కాని తగ్గదు. బ్లాగుల్లో కూడా.

మీ వ్యాఖ్య ఈ బ్లాగుల్లో నయినా ఇరువర్గాలనీ శా౦తి౦ప చేస్తు౦దని :)

అయ్యా తెల౦గాణా వాదులు, ఇక్కడ విగ్రహాల గురి౦చి జరిగే చర్చలలో మీరు కూడా వెనక్కి తగ్గ౦డి. మన౦ శత్రువులు అవ్వడానికి బ్లాగులు చదవడ౦, వ్రాయడ౦ చెయ్యడ౦ లేదు.మీరు మ౦చి కాని చెడుకాని మీ బ్లాగుల్లో వ్రాయ౦డి. వ్యాఖ్యలతొ చర్చలు పె౦చవద్దు.

ఇది కురుక్షేత్ర౦ అ౦తకన్నా కాదు.

cvrao March 27, 2011 at 10:12 PM  

తెలుగు, ఆంధ్ర అనే పదాలను సైతం ద్వేషించే స్థాయికి వెళ్లి పోయిన వారికి, ఇక తెలుగు బాష గొప్పదనాని, తెలుగు కీర్తిని దశదిశలా వ్యాపింపజేసిన వారిగురించి ఏమి తెలుస్తుంది. ఒక సారి మనస్సులో విష బీజాలు నాటిన తరువాత వేరే మొక్కని మొలవమంటే మొలుస్తుందా? చేసే ప్రతీ తప్పు పనిని కూడా నిర్లజ్జగా సమర్దినుచుకొనే స్థితికి దిగజారిన వారు (తెలంగాణా ప్రజలు కాదు వారి నాయకులు మాత్రామే) విగ్రహాలు కూల్చి ఆంధ్రులను ఓడించామనో ఏదో విజయం సాధించామనో నిర్లజ్జగా చెప్పుకోవచ్చు గాక. గానీ వారు చేసిన పనితో ఒక పవిత్రమైన తెలంగాణా ఉద్యమమాన్నికి తలవంపులు తెచ్చారు. ఇటువంటి నాయకుల చేతిలో తెలంగాణా పడితే ఇక మున్ముందు ఎలా ఉంటుందో యెవరు చెప్పలేరు కూడా.
ముక్యంగా తెలంగాణాకీ అడ్డు పడుతున్నది సీమంధ్ర ప్రజలు మాత్రం కాదు. గానీ, తెలంగాణా వారి దృష్టిలో సేమంద్రులందరు అడ్డుపడుతునరనే భావన ఉంది.ఇక్కడ సీమంధ్ర లో జరిగే సమైక్యాంధ్ర ఉద్యమాలని అందరు వెనకేసుకు రావడం లేదని అక్కడి ప్రజలు తెలుసు కోవాలి.
ఇక, తెలంగాణా రాష్ట్రం ఏర్పడడానికి ఇక్కడ జరిగే సమైక్యాంధ్ర ఉద్యమాలు అడ్డు కాదు. ముసుగులో గుద్దులాటల సాగుత్తున్న హైదరాబాద్ సమస్యే మూలకారణం.ముందు దానికి యెవరు అభ్యంతరం చెప్పుతున్నారో వారితో మాట్లాడుకోవాలి గానీ, విగ్రహాలు కూల్చి ఎవరినో జయిన్చేసామని అనుకోవడం చాలా తప్పు. ఇంతగా విద్వేషాలు పెంచుకోన్నాక రేపటి పరిస్థితి ఏమిటి అనికూడా ఆలోచించాలి అందరు. తెలంగాణా ఎర్పదాక దానిని మన దేశం నుండి ఎక్కడికి పట్టుకు పోరుగదా? కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక అప్పుడు ఇరుగు పొరుగులుగా మెలగాల్సిన మనం ఇండియా పాకిస్థాన్లకు మల్లె జివిన్చాలేము కధా?
ఆలోచిన్చామది అందరు.

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP