పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

March 9, 2011

నడకలందు ఏ నడక మేలు?

నడక ఓ వ్యాయామం కన్నా ఓ రిలాక్సేషను టెక్నిక్కు గానే నాకు ఎక్కువ ఇష్టం.  నడకకి ఉదయం వెళ్ళాలా..సాయంత్రం వెళ్ళాలా .... ఉదయం వెళితే  ఎన్ని గంటలకి వెళ్ళాలి అనేది మన తీరికని బట్టి ..వీలుని బట్టి ఉంటుంది.  నేను మాత్రం నడకకి వెళితే ఉదయం ఐదు గంటలలోపే బయలుదేరి వెళతా! అప్పుడు వెళితేనే దాన్లో ఉన్న ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించవచ్చు అనిపిస్తుంది నాకు.  ఆ తరువాత నడిచే నడక నాకు నడకలా ఉండదు.  పిల్లలకి కాలేజీల హడావిడీలో కొన్నాళ్ళు ఉదయాన్నే వెళ్ళటం మానివేసి ఏడు గంటలకి వెళ్ళాను కాని నాకు ఆ నడక నచ్చల!

ఈ మధ్య తెల్లవారుఝామున 4:30...4:45 కల్లా నడకకి బయలుదేరుతున్నా.  మా కాలనీ రోడ్లు విశాలంగా నడకకి చాలా అనుకులంగా ఉంటాయి.  కాలనీలో ఉన్న రెండు పార్కులు కూడా నడకకి బాగుంటాయి. కాకపోతే ఈ పార్కులు 5:30 దాటితే  భ్రమరి...భస్త్రిక...ఉజ్జయ్..అనులోమ విలోమాలు....మొదలగు నానారకాల ప్రాణాయామాల  ఉచ్వాస..నిశ్వాసలతో వేడెక్కి పోతాయి. ఓ నాలుగు రోజులు వరుసగా పార్కుకి వెళ్ళామంటే అన్ని రకాల ప్రాణాయామాలు నేర్చేసుకోవచ్చు.

చల్ల చల్లటి గాలులతో పాటు సువాసనభరిత నడక కావాలంటే మా కాలనీ రోడ్డు మీద నడిస్తేనే బాగుంటుంది.  రోడ్డుకి రెండువైపులా  చెట్లు..వాటినుండి వచ్చే చల్ల గాలి..అందులోనూ మాఘ..ఫాల్గుణ మాసాల్లో ఉండీ లేనట్టు ఉండే చిరు..చిరు చలిలో ఉదయపు చల్ల గాలుల మధ్య నడవడం చాలా బాగుంటుంది.  4:30 కి రోడ్డు మీదకి వస్తే ఒక్క నర, వస్తు, వాహన, జంతు సంచారం కూడా ఉండదు.  అంతా అందమైన నిశ్శబ్ధం..నిన్న చూసిన రోడ్డు ఇదేనా అనిపిస్తుంది.  4:45కి అక్కడొక మనిషి..ఇక్కడొక మనిషి కనిపిస్తే...  5 గంటలయ్యేటప్పటికల్లా ఒక్కసారిగా  రోడ్డంతా నడిచే మనుషులతో నిండిపోతుంది. వీళ్లకి తోడు పాలవాళ్ళు..పేపరు వాళ్ళు...రోడ్లు ఊడ్చే వాళ్ళు..అప్పుడే వచ్చే మొదటి బస్సు ...ఉదయం రైల్వే స్టేషనులకి ఎయిరుపోర్టులకి వెళ్ళేవాళ్లని..వచ్చేవాళ్ళని మోస్తూ రయ్యిమంటూ దూసుకొచ్చే కార్లు..ఇక రణగొణ ధ్వనులు మొదలవుతుంటాయి.  శబ్దకాలుష్యానికి తొలి చిరునామాలు అన్నమాట!

అన్నిటికన్నా ఈ సమయంలో నాకు అమితంగా నచ్చేది..చెట్ల నుండి..వాటి పూల నుండి వచ్చే వింత వింత పరిమళాలు.  మా ఇంటిముందు వేప చెట్టుతో మొదలుపెడితే తిరిగి వచ్చేటప్పటికి మధ్యలో ఎన్నెన్ని పరిమళాల సొగసులో.  ఆ సమయంలో నడిస్తే మనిషికి ఇక వేరే ఆరోమా థెరపీలు ..ఫ్లవర్ థెరపీలు అవసరంలేదేమో!
























మా ఇంటి ముందు ఇప్పుడిప్పుడే పూస్తున్న లేలేత వేప పూ వాసనలు... కొంచం రెండడుగులు ముందుకు వేయగానే మత్తెంక్కించే నైట్ క్వీను గుభాళింపులు...ఇంకాస్త ముందుకి వెళితే పారిజాత పరిమళాలు...మరో రెండడుగులు వేస్తే రాజుగారి బాల్కనీ మీది నుండి తొంగిచూసే సన్నజాజి సువాసనలు...అలా మరో నాలుగడుగులు వేయగానే  సీతమ్మ గారి ఇంటి మామిడిపూత వింత పరిమళాలు...రోడ్డుకి ఈ పక్క తురాయి పూలు..ఆ పక్క మోదుగ .. ఆ గేటులో నిద్ర గన్నేరు...ఈ వాకిట్లో మల్లె పాదు....ఓ ఇంటి బాల్కనీలో అపురూపంగా పెంచుకుంటున్న పరిమళాలు వెదజల్లే గులాబీలు.... లిల్లీలు....మద్యలో రోడ్డు మీద రాలిన పున్నాగ పూలు...శివలింగ పూలు..ఇంకా పేరు తెలియని పూలు....అన్నీ కలగలిసి మైమరిపించే మధుర సువాసనలు. వాసనలేని పూలు కూడా  వీటి వాసనలు పీల్చి తాము కూడా వాసనలు వెదజల్లే స్వచ్చమైన సమయం.


ఈ పూల వాసనలకి నేనెంతగా అలవాటు పడ్డానంటే కళ్ళు మూసుకునే వాటి వాసన బట్టి నేను ఎక్కడ ఉన్నానో  చెప్పగలిగేంత.

చెట్లన్నీ హాయిగా ప్రశాంతంగా శ్వాస తీసుకునే వేళ మన అడుగుల శబ్దాలతో వాటి ప్రశాంతతకి భంగం కలిగిస్తున్నామేమో అని ఓ పక్క సంకోచం...ఇన్ని పరిమళాల మధ్య నడిచే అదృష్టానికి మరో పక్క ఆనందం. ఓ గంట పోయాక వెళితే ఆ చెట్లు..పూలు అన్నీ అక్కడే ఉంటాయి..వాటి పరిమళాలు మాత్రం ఉండవు.

 ఆ సమయంలో కాకుల అరుపులు కూడా ఎంత శ్రవాణానందంగా ఉంటాయో! సరిగ్గా 4:45 కి ఓ చెట్టు మీద కాకులు అరిస్తే 5 గంటలకి మరో చెట్టు మీదవి కావు కావుమని మనకి స్వాగతం పలుకుతుంటాయి.  వాటి తొలి అరుపులకి రోజూ ఒకటే సమయం.. ఎంత సమయపాలనో .... భలే ముచ్చటేస్తుంది

మా కాలనీలో కోళ్ళు కూడ ఉన్నాయి.  ఐదు గంటలకల్లా తొలి కోడి కూస్తే 5:30 కి మలి కోడి కూస్తుంది.  నేనయితే టైమెంతయ్యిందో వీటి అరుపులని బట్టే చెప్తా.  చిన్నప్పుడు మా నాయనమ్మ చుక్కని చూసి టైము చెప్పేది.  ఇప్పుడు నేను కోడి అరుపులు..కాకి అరుపులు బట్టి టైము చెప్తున్నా:)

ఇంటికి తిరిగివచ్చాక ప్రాణాయామం చేసుకున్నంతసేపూ ఆ పూల పరిమళాలే నా చుట్టూ పరిభ్రమిస్తుంటాయి..అందుకే ఉదయపు నడకంటే నాకంత ఇష్టం.

నడకలందు ఏ నడక మేలయ్యా అంటే నా ఓటు ఉదయపు నడకకే!

7 వ్యాఖ్యలు:

కొత్త పాళీ March 9, 2011 at 5:27 PM  

తెల్లారుజామునే నాలుగు మైళ్ళు నడిచొచ్చినంత ఆహ్లాదంగా ఉన్నది మీ పోస్టు.

లత March 9, 2011 at 6:07 PM  

అబ్బ ఇన్ని పరిమళాలా, ఎంత అద్రుష్టవంతులో మీరు ,
ఇంతకీ యే కాలనీనో చెప్పారు కాదు

Sravya V March 9, 2011 at 6:19 PM  

మీ పోస్టు చాల inspiring గా చాల బావుంది !
కానీ మరీ ఈ అర్ధరాత్రి నిద్ర లేవటాలు ఏంటండి :) నేను మంచి నిద్ర పోయే టైం 4 AM నుంచి 7 AM :)

sunita March 9, 2011 at 8:49 PM  

మీరు చెప్పిన పూల వాసనలు మా ముక్కుల దాకా కూడా వచ్చాయి.చాలా చాలా బాగుంది ఈ పోస్ట్.

సిరిసిరిమువ్వ March 10, 2011 at 9:00 AM  

కొత్తపాళీ గారు, ధన్యవాదాలు. మళ్లీ వేసవి వస్తే గాని మీ సాయంత్రపు వ్యాహ్యాళీ మొదలవదనుకుంటాను.!

లత గారూ, కుకట్‍పల్లి వివేకానందనగర్.

శ్రావ్యా, ఈ పడుకోవటం..లేవటం ఇదంతా ఓ చెయిను ప్రాసెస్. ఒక్క పదిరోజులు కొంచం కష్టపడి ఉదయం ఐదు గంటలకల్లా లేవండి..పదకొండవ రోజు మీ ప్రయత్నం లేకుండానే లేస్తారు..రాత్రి త్వరగా పడుకోవటం కూడా అలవాటవుతుంది!

సునీత గారు, ధన్యవాదాలు.

Dharanija March 13, 2011 at 11:26 PM  

nijamenandee!maa colony koodaa alaage untundi.okasaari raatri koodaa nadichi choodandi.ave anubhavaalu,poola parimalaalatho,kaakula arupulu thappa........raatri soundaryam telusthundi.

తృష్ణ March 26, 2011 at 6:05 PM  

నేను మిస్సయ్యాను ఈ టపా. నే పీల్చే వాసనలకన్నా మీరు పీల్చే సువాసనలు ఎక్కువగా ఉన్నాయి...:( (ఇది నా చొక్కా కంతే ఈ చొక్కా తెలుపా టైపు
లో చదవాలన్న మాట) బావుందండీ టపా. నిజంగా వాకింగ్ చేస్తున్నంత సేపు నేనెంత ఎంజాయ్ చేస్తానో..మీలానే.

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP