పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

January 14, 2008

మకర సంక్రాంతి శుభాకాంక్షలు.


ఒకప్పుడు సంక్రాంతి అంటే (ముఖ్యంగా పల్లెలలో)--------మంచుతెరల మధ్య ముత్యాల ముగ్గులేసే పడుచు పిల్లలు, ముగ్గుల్లో గొబ్బెమ్మలు, తెలతెలవారుతుండగానే వచ్చేసే హరిదాసులు, గంగిరెద్దు వాళ్ళు, బుడబుక్కల వాళ్ళు, పొలాలలో మాసూళ్ళ సందడి, ఇంటినిండా ధాన్యరాసులు, అరిసెలు, కొత్త అల్లుళ్ళు, భోగిమంటలు, భోగి పళ్ళు, కొత్తబియ్యం పొంగళ్ళు, గారెలు, చెరుకు గడలు,......మరి ఇప్పుడు????

నిన్న ఈనాడు ఆదివారం సంచికలో ఈ కధ చదివాక చిన్నప్పటి జ్ఞాపకాలు కళ్ళ ముందు మెదిలాయి. సంక్రాంతి అంటే ఎన్నెన్ని జ్ఞాపకాలో!!!

సంక్రాంతి అంటే పల్లెలలో నెల రోజుల పండగ, పెద్ద పండగ, ముఖ్యంగా రైతుల పండగ. ఆడపిల్లలైతే ఈ నెలంతా ఎంత తీరిక లేకుండా ఉంటారో. నెల పట్టిన దగ్గరినుండి చీకటితో నాలుగు గంటలకి లేచి ఆవు పేడ తెచ్చి గొబ్బెమ్మలు చేయటంతో మొదలయ్యేది మా దినచర్య. ఆ రోజులలో మా తాతయ్య (అమ్మ నాన్న-మా ఊరే) వాళ్ళ దొడ్లో చాలా ఆవులు వుండేవి. జీతగాళ్ళని తెమ్మంటే తెస్తారు కాని స్నేహితులతో వెళ్ళి తెచ్చుకోవటం ఒక సరదా (వాళ్ళు ఎంత తెచ్చుకుంటున్నారో చూసి మనం అంతకన్నా ఎక్కువ తెచ్చి ఎక్కువ గొబ్బెమ్మలు చేయవచ్చు కదా!!!). నేను పేడ తెస్తే మా అక్క నేను కలిసి గొబ్బెమ్మలు చేసి వాటిని పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి ముగ్గుల మీద పెట్టేవాళ్ళం. ముగ్గు సైజుని బట్టి ఎన్ని గొబ్బెమ్మలు చేయాలో ముందే నిర్ణయించుకునేవాళ్ళం. మాకు మూడు వాకిళ్ళు వుండేవి, ఆ మూడు కాక మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు మా ఇంటి ఎదురే, అప్పటికే వాళ్ళ పిల్లలు దూరాలు వెళ్ళిపోవటాన వాళ్ళ వాకిట్లో కూడా మేమే ముగ్గులేసి, గొబ్బెమ్మలు పెట్టేవాళ్ళం. గొబ్బెమ్మలు పెట్టటం మా వంతైతే వాటిని తీసి గోడకు పిడకలు కొట్టటం మా నాయనమ్మ పని. ఆ పిడకలతో రథసప్తమి రోజు పొంగలి చేయటం మమ్మ పని. వాకిట్లో పెద్ద ముగ్గులు వేయకపోతే ఊరుకునేవాళ్ళం కాదు. మా అక్క, మా అమ్మ వేసే వాళ్ళు. కొత్త కొత్త ముగ్గులు వెదికి ఇవ్వటం నా పని. స్కూల్ లో కూడా ఈ నెలంతా ఆడపిల్లలం మహా బిజీగా ఉండేవాళ్ళం-కొత్త ముగ్గులు సంపాదించటం, వాటిని ముగ్గుల పుస్తకాలలోకి ఎక్కించటం, మేమే కొత్త కొత్త ముగ్గులు వేయటానికి ప్రయత్నించటం, అబ్బో చాలా బిజీ బిజీగా వుండేవాళ్ళం. ఆ నెల రోజులు మా ముగ్గుల పుస్తకాలు ఊరంతా తిరిగేవి. మా అక్క ఫ్రీ హాండు ముగ్గులు చాలా బాగా వేసేది.

ఈ పండగకి మగపిల్లల హడావిడి కాస్త తక్కువే. గాలిపటాలు ఎగరేసుకుంటూ ఉండే వాళ్ళు. మా అన్నయ్య గాలిపటాలు తయారు చెయ్యడంలో ప్రవీణుడు. మా డాబా మీదకి ఎక్కి మగపిల్లకాయలంతా గాలిపటాల పందాలు పెట్టుకునేవాళ్ళు.

ఈ రోజులలోనే పొలాల్లో మాసూళ్ళు (ఊడ్పులు) జరిగేవి. మద్యాహ్నం మా నాయనమ్మకి అన్నం, సాయంత్రం టిఫిను, కాఫీలు చేరవేయటం మా పని. పొలంలో మా నాయనమ్మతో కలిసి బాక్సులోని పచ్చడి అన్నం తినటం ఎంత బాగుండేదో!!మేము కూడా తినటానికని మా అమ్మ కాస్త ఎక్కువే పెట్టేది. అది తినేసి కుప్ప నూర్చి వేసిన గడ్డి వాములు ఎక్కి ఆడి ఆడి ఇంటికి చేరేవాళ్ళం. అప్పట్లో కూలీలకి చీకటితో అన్నాలు, తరువాత ఇడ్లీలు, ఉప్మాలు చేసి పంపేవాళ్ళు, పాపం మా అమ్మకి ఒక్క నిమిషం కూడ ఖాళీ ఉండేది కాదు.

ఇక పండగ రేపనగా, అంటే భోగి రోజునే మా హడావిడి మొదలయ్యేది. మూడు వాకిళ్ళలో ఏమేమి ముగ్గులు వేయాలో, ఏమి రంగులు వెయ్యాలో నిర్ణయించుకోవటం, వాటికి కావలిసిన రంగులు కొనటం, వాటిని ఇసుకతో, ఉప్పుతో కలిపి సిద్ధం చేసుకోవటం, మొదలైనవన్నీ చేసేవాళ్ళం. సాయంత్రం ఆరు, ఏడు గంటలకి ముగ్గులు వేయటం మొదలుపెడితే రాత్రి 12 అయ్యేది. అందులోనూ మాది చాలా పెద్ద వాకిలి, ఆ వీధిలో సగం మాదే. ఎక్కడా ఖాళీ లేకుండా ముగ్గులతో నింపేసేవాళ్ళం. ముగ్గుకి ముగ్గుకి మధ్య వుండే ఖాళీ మూలలను కూడ చిన్న చిన్న ముగ్గులతో నింపేసేవాళ్ళం. వీధి వీధి ప్రతి ఇంటి ముందు ముగ్గులేసే అమ్మాయిలు, అమ్మలు, అమ్మమ్మలతో సందడి సందడిగా వుండేది. లాంతర్లు పెట్టుకుని మరీ వేసేవాళ్ళం. మా అమ్మ ముగ్గులు స్పెషల్ గా మూడు వుండేవి-- పాము ముగ్గు, పెట్టెల ముగ్గు, జండాల ముగ్గు. పాము ముగ్గు, పెట్టెల ముగ్గులతో మా సగం వాకిలి నిండి పోయేది--వాటిని ఎంత కావాలంటే అంత పొడిగించుకోవచ్చు. ఇక జండాల ముగ్గైతే మా అమ్మ వేసినంత అందంగా ఇంకెవరు వేయలేరేమో!! అందుకే ఇప్పటికీ జండాల ముగ్గు మా అమ్మ చేతే వేయిస్తాము. బయట వీధే కాదు లోపల దొడ్డి అంతా కూడా ముగ్గులతో నింపేసే వాళ్ళం. ముగ్గులన్నీ వేయటం అయ్యేటప్పటికి నడుములు పైకి లేచేవి కావు. అయినా శ్రమ అనిపించేది కాదు.

ముగ్గులేసి పడుకుంటే ఎప్పుడెప్పుడు వాటికి రంగులు వేద్దామా అన్న తహతహతో నిద్ర పట్టేది కాదు. తెల్లవారుఝామునే లేచి ముగ్గులకి రంగులు వేసి, పసుపు, కుంకుమ, పూలు చల్లి ముగ్గుల్ని ముస్తాబు చేసే వాళ్ళం. ఇలా ముగ్గులకి రంగులు వేయటం అప్పట్లో మా ఊరిలో మేము ఒక్కళ్ళమే చేసేవాళ్ళం. మా ముగ్గుల ముస్తాబు అయ్యాక అందరి ముగ్గులు ఒకసారి చూసి వచ్చేవాళ్ళం. మాకు మావే చాలా బాగుండేవి. ఒక సంక్రాంతికి మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి వాళ్ళ స్నేహితులని తీసుకువచ్చాడు, వాళ్ళు మా ముగ్గులు చూసి ఒకటే మెచ్చుకోవటం, ఫొటోల మీద ఫోటోలు తీసుకున్నారు.

ముగ్గుల అలంకరణలు పూర్తి అయ్యాక మేము స్నానాలు చేసి అలంకరించుకునేవాళ్ళం. మరీ చిన్నప్పుడు అయితే (5వ తరగతి వరకు) మా నాయనమ్మ పట్టు పరికిణీ వేసి నగలన్నీ అలంకరించి వెంట పెట్టుకుని అందరిళ్ళకి తీసుకు వెళ్ళి చూపించేది-అదొక సరదా!!!

ఇప్పుడు కూడ ప్రతి సంక్రాంతికి తప్పకుండా ఇంటికి వెళతాము. ఈ సారే వెళ్ళలేదు. ఏదో ముగ్గుల వరకు వేస్తాము కాని పల్లెటూర్లలో ఇదివరకటి ఉత్సాహం, సందడి ఏమీ ఉండటం లేదు. హరిదాసులు లేరు, గంగిరెద్దులూ లేవు. ఏదో పండగ వచ్చింది వెళ్ళింది అన్నట్లు ఉంటుంది. ఇప్పుడు అక్కడ అంతా వలస బ్రతుకులు అయిపోయి అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతయ్యలు తప్పితే ఎవరూ ఉండటం లేదు. పండక్కి పిల్లలు వస్తేనే కాస్త సందడి, లేదంటే అదీ లేదు. పల్లెటూళ్ళలో ఉన్న కొద్ది మంది ఏదో నిస్తేజంగా బ్రతుకులు గడిపేస్తున్నారు. పొలాలు, కుప్పలు, మాసూళ్ళ హడావిడి కూడ తగ్గిపోయింది. ఎక్కువ మంది పొలం చేయలేక మగతాకి ఇచ్చేస్తే మిగిలిన కొద్ది మంది కాంట్రాక్ట్ పనులు వచ్చాక అంతా నాలుగైదు రోజులలో ముగించేస్తున్నారు.

ఇక వెనకటి రోజులు రమ్మన్నా రావు--ఏదో ఆ జ్ఞాపకాలని నెమరు వేసుకుంటూ బ్రతకటమే, పిల్లలకి కథలుగా చెప్పుకోవటమే మనం చేయగలిగింది.

[ఈ జాబులోని ముగ్గులు ఈ రోజు హైదరాబాదులో మా ఇంటి ముందు వేసినవి.]

Read more...

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP