పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

January 14, 2008

మకర సంక్రాంతి శుభాకాంక్షలు.


ఒకప్పుడు సంక్రాంతి అంటే (ముఖ్యంగా పల్లెలలో)--------మంచుతెరల మధ్య ముత్యాల ముగ్గులేసే పడుచు పిల్లలు, ముగ్గుల్లో గొబ్బెమ్మలు, తెలతెలవారుతుండగానే వచ్చేసే హరిదాసులు, గంగిరెద్దు వాళ్ళు, బుడబుక్కల వాళ్ళు, పొలాలలో మాసూళ్ళ సందడి, ఇంటినిండా ధాన్యరాసులు, అరిసెలు, కొత్త అల్లుళ్ళు, భోగిమంటలు, భోగి పళ్ళు, కొత్తబియ్యం పొంగళ్ళు, గారెలు, చెరుకు గడలు,......మరి ఇప్పుడు????

నిన్న ఈనాడు ఆదివారం సంచికలో ఈ కధ చదివాక చిన్నప్పటి జ్ఞాపకాలు కళ్ళ ముందు మెదిలాయి. సంక్రాంతి అంటే ఎన్నెన్ని జ్ఞాపకాలో!!!

సంక్రాంతి అంటే పల్లెలలో నెల రోజుల పండగ, పెద్ద పండగ, ముఖ్యంగా రైతుల పండగ. ఆడపిల్లలైతే ఈ నెలంతా ఎంత తీరిక లేకుండా ఉంటారో. నెల పట్టిన దగ్గరినుండి చీకటితో నాలుగు గంటలకి లేచి ఆవు పేడ తెచ్చి గొబ్బెమ్మలు చేయటంతో మొదలయ్యేది మా దినచర్య. ఆ రోజులలో మా తాతయ్య (అమ్మ నాన్న-మా ఊరే) వాళ్ళ దొడ్లో చాలా ఆవులు వుండేవి. జీతగాళ్ళని తెమ్మంటే తెస్తారు కాని స్నేహితులతో వెళ్ళి తెచ్చుకోవటం ఒక సరదా (వాళ్ళు ఎంత తెచ్చుకుంటున్నారో చూసి మనం అంతకన్నా ఎక్కువ తెచ్చి ఎక్కువ గొబ్బెమ్మలు చేయవచ్చు కదా!!!). నేను పేడ తెస్తే మా అక్క నేను కలిసి గొబ్బెమ్మలు చేసి వాటిని పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి ముగ్గుల మీద పెట్టేవాళ్ళం. ముగ్గు సైజుని బట్టి ఎన్ని గొబ్బెమ్మలు చేయాలో ముందే నిర్ణయించుకునేవాళ్ళం. మాకు మూడు వాకిళ్ళు వుండేవి, ఆ మూడు కాక మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు మా ఇంటి ఎదురే, అప్పటికే వాళ్ళ పిల్లలు దూరాలు వెళ్ళిపోవటాన వాళ్ళ వాకిట్లో కూడా మేమే ముగ్గులేసి, గొబ్బెమ్మలు పెట్టేవాళ్ళం. గొబ్బెమ్మలు పెట్టటం మా వంతైతే వాటిని తీసి గోడకు పిడకలు కొట్టటం మా నాయనమ్మ పని. ఆ పిడకలతో రథసప్తమి రోజు పొంగలి చేయటం మమ్మ పని. వాకిట్లో పెద్ద ముగ్గులు వేయకపోతే ఊరుకునేవాళ్ళం కాదు. మా అక్క, మా అమ్మ వేసే వాళ్ళు. కొత్త కొత్త ముగ్గులు వెదికి ఇవ్వటం నా పని. స్కూల్ లో కూడా ఈ నెలంతా ఆడపిల్లలం మహా బిజీగా ఉండేవాళ్ళం-కొత్త ముగ్గులు సంపాదించటం, వాటిని ముగ్గుల పుస్తకాలలోకి ఎక్కించటం, మేమే కొత్త కొత్త ముగ్గులు వేయటానికి ప్రయత్నించటం, అబ్బో చాలా బిజీ బిజీగా వుండేవాళ్ళం. ఆ నెల రోజులు మా ముగ్గుల పుస్తకాలు ఊరంతా తిరిగేవి. మా అక్క ఫ్రీ హాండు ముగ్గులు చాలా బాగా వేసేది.

ఈ పండగకి మగపిల్లల హడావిడి కాస్త తక్కువే. గాలిపటాలు ఎగరేసుకుంటూ ఉండే వాళ్ళు. మా అన్నయ్య గాలిపటాలు తయారు చెయ్యడంలో ప్రవీణుడు. మా డాబా మీదకి ఎక్కి మగపిల్లకాయలంతా గాలిపటాల పందాలు పెట్టుకునేవాళ్ళు.

ఈ రోజులలోనే పొలాల్లో మాసూళ్ళు (ఊడ్పులు) జరిగేవి. మద్యాహ్నం మా నాయనమ్మకి అన్నం, సాయంత్రం టిఫిను, కాఫీలు చేరవేయటం మా పని. పొలంలో మా నాయనమ్మతో కలిసి బాక్సులోని పచ్చడి అన్నం తినటం ఎంత బాగుండేదో!!మేము కూడా తినటానికని మా అమ్మ కాస్త ఎక్కువే పెట్టేది. అది తినేసి కుప్ప నూర్చి వేసిన గడ్డి వాములు ఎక్కి ఆడి ఆడి ఇంటికి చేరేవాళ్ళం. అప్పట్లో కూలీలకి చీకటితో అన్నాలు, తరువాత ఇడ్లీలు, ఉప్మాలు చేసి పంపేవాళ్ళు, పాపం మా అమ్మకి ఒక్క నిమిషం కూడ ఖాళీ ఉండేది కాదు.

ఇక పండగ రేపనగా, అంటే భోగి రోజునే మా హడావిడి మొదలయ్యేది. మూడు వాకిళ్ళలో ఏమేమి ముగ్గులు వేయాలో, ఏమి రంగులు వెయ్యాలో నిర్ణయించుకోవటం, వాటికి కావలిసిన రంగులు కొనటం, వాటిని ఇసుకతో, ఉప్పుతో కలిపి సిద్ధం చేసుకోవటం, మొదలైనవన్నీ చేసేవాళ్ళం. సాయంత్రం ఆరు, ఏడు గంటలకి ముగ్గులు వేయటం మొదలుపెడితే రాత్రి 12 అయ్యేది. అందులోనూ మాది చాలా పెద్ద వాకిలి, ఆ వీధిలో సగం మాదే. ఎక్కడా ఖాళీ లేకుండా ముగ్గులతో నింపేసేవాళ్ళం. ముగ్గుకి ముగ్గుకి మధ్య వుండే ఖాళీ మూలలను కూడ చిన్న చిన్న ముగ్గులతో నింపేసేవాళ్ళం. వీధి వీధి ప్రతి ఇంటి ముందు ముగ్గులేసే అమ్మాయిలు, అమ్మలు, అమ్మమ్మలతో సందడి సందడిగా వుండేది. లాంతర్లు పెట్టుకుని మరీ వేసేవాళ్ళం. మా అమ్మ ముగ్గులు స్పెషల్ గా మూడు వుండేవి-- పాము ముగ్గు, పెట్టెల ముగ్గు, జండాల ముగ్గు. పాము ముగ్గు, పెట్టెల ముగ్గులతో మా సగం వాకిలి నిండి పోయేది--వాటిని ఎంత కావాలంటే అంత పొడిగించుకోవచ్చు. ఇక జండాల ముగ్గైతే మా అమ్మ వేసినంత అందంగా ఇంకెవరు వేయలేరేమో!! అందుకే ఇప్పటికీ జండాల ముగ్గు మా అమ్మ చేతే వేయిస్తాము. బయట వీధే కాదు లోపల దొడ్డి అంతా కూడా ముగ్గులతో నింపేసే వాళ్ళం. ముగ్గులన్నీ వేయటం అయ్యేటప్పటికి నడుములు పైకి లేచేవి కావు. అయినా శ్రమ అనిపించేది కాదు.

ముగ్గులేసి పడుకుంటే ఎప్పుడెప్పుడు వాటికి రంగులు వేద్దామా అన్న తహతహతో నిద్ర పట్టేది కాదు. తెల్లవారుఝామునే లేచి ముగ్గులకి రంగులు వేసి, పసుపు, కుంకుమ, పూలు చల్లి ముగ్గుల్ని ముస్తాబు చేసే వాళ్ళం. ఇలా ముగ్గులకి రంగులు వేయటం అప్పట్లో మా ఊరిలో మేము ఒక్కళ్ళమే చేసేవాళ్ళం. మా ముగ్గుల ముస్తాబు అయ్యాక అందరి ముగ్గులు ఒకసారి చూసి వచ్చేవాళ్ళం. మాకు మావే చాలా బాగుండేవి. ఒక సంక్రాంతికి మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి వాళ్ళ స్నేహితులని తీసుకువచ్చాడు, వాళ్ళు మా ముగ్గులు చూసి ఒకటే మెచ్చుకోవటం, ఫొటోల మీద ఫోటోలు తీసుకున్నారు.

ముగ్గుల అలంకరణలు పూర్తి అయ్యాక మేము స్నానాలు చేసి అలంకరించుకునేవాళ్ళం. మరీ చిన్నప్పుడు అయితే (5వ తరగతి వరకు) మా నాయనమ్మ పట్టు పరికిణీ వేసి నగలన్నీ అలంకరించి వెంట పెట్టుకుని అందరిళ్ళకి తీసుకు వెళ్ళి చూపించేది-అదొక సరదా!!!

ఇప్పుడు కూడ ప్రతి సంక్రాంతికి తప్పకుండా ఇంటికి వెళతాము. ఈ సారే వెళ్ళలేదు. ఏదో ముగ్గుల వరకు వేస్తాము కాని పల్లెటూర్లలో ఇదివరకటి ఉత్సాహం, సందడి ఏమీ ఉండటం లేదు. హరిదాసులు లేరు, గంగిరెద్దులూ లేవు. ఏదో పండగ వచ్చింది వెళ్ళింది అన్నట్లు ఉంటుంది. ఇప్పుడు అక్కడ అంతా వలస బ్రతుకులు అయిపోయి అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతయ్యలు తప్పితే ఎవరూ ఉండటం లేదు. పండక్కి పిల్లలు వస్తేనే కాస్త సందడి, లేదంటే అదీ లేదు. పల్లెటూళ్ళలో ఉన్న కొద్ది మంది ఏదో నిస్తేజంగా బ్రతుకులు గడిపేస్తున్నారు. పొలాలు, కుప్పలు, మాసూళ్ళ హడావిడి కూడ తగ్గిపోయింది. ఎక్కువ మంది పొలం చేయలేక మగతాకి ఇచ్చేస్తే మిగిలిన కొద్ది మంది కాంట్రాక్ట్ పనులు వచ్చాక అంతా నాలుగైదు రోజులలో ముగించేస్తున్నారు.

ఇక వెనకటి రోజులు రమ్మన్నా రావు--ఏదో ఆ జ్ఞాపకాలని నెమరు వేసుకుంటూ బ్రతకటమే, పిల్లలకి కథలుగా చెప్పుకోవటమే మనం చేయగలిగింది.

[ఈ జాబులోని ముగ్గులు ఈ రోజు హైదరాబాదులో మా ఇంటి ముందు వేసినవి.]

18 వ్యాఖ్యలు:

cbrao January 15, 2008 at 1:48 AM  

ఈ రోజులలో కొత్త అళ్లుళ్లకు, సంక్రాంతి అంటే అత్తగారింటికి వెళ్లాలని మాత్రమే అని తెలుసు. పల్లె యువకులు అమెరికాలోను, ఇతర పట్టణాలలో వుంటే, మిగిలిన ముసలి వారితో పల్లెలు నిస్సారంగా వుంటున్నాయి.పట్టణాలలో వుండే కొంతమంది,ఇంట్లో దీపం పెట్టే వారికోసం, పల్లెలోని ఇంటిని తక్కువ అద్దెకు లేక ఉచితంగా ఇస్తున్నారు. కోడి పందాలు కూడా తగ్గాయి.

Rajendra Devarapalli January 15, 2008 at 2:08 AM  

ఉరుము ఉరిమి మంగలం మీద పడటం అంటే ఇదే.మీరు పైకి చెప్పారు,చెప్పలేక అసలు ఏవిధంగా ఈపరిస్తితిని అన్వయించుకోవాలో తెలియక చాలా మంది సతమతమౌతున్నారు.మీరు చెప్పిన సంపన్న గ్రామాల్లోనే పరిస్తితి చెయ్యి దాటి పోయింది ఇక కరువు ప్రాంతాల్లో,పూర్తిగా బస్తీ సోకులు చేసుకున్న పల్లెల్లో మరీ తీసికట్టుగా ఉంది.షాపింగ్ మాల్స్ వారు పాపం ఎంతో కష్ట పడి మరీ మనకు పండగలు గుర్తు చేసే బాధ్యతను భుజాన ఎత్తుకున్నాక మనకు ఇక దిగుల్లేదు,బ్రేవో!!!

తెలుగు'వాడి'ని January 15, 2008 at 9:52 AM  

చాలా విపులంగా, ఓపికతో, కళ్లకు కట్టినట్టుగా చెప్పిన మీ ప్రయత్నం నిజంగా ప్రశంశనీయం ... అభినందనీయం ... మరెందరికో ఆచరణీయం .... అందుకోండి నా హృదయపూర్వక వేనవేల అభినందనలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు..

రావు గారు మరియు రాజేంద్ర గారు ఇప్పటికే చక్కగా చెప్పారు ... నావీ అవే అభిప్రాయాలు..

పిల్లలకి కధలుగా చెప్పుకొవటమేనేమో అన్నారు కానీ ... గొబ్బెమ్మలు, భోగిపళ్లు, హరిదాసు, చలిమంటలు, నూర్పుళ్లు మొదలగు అనేక పదాలు (ఒక్క గాలిపటం తప్పించి..ఇలాంటివి కొన్ని పట్టణాలలో కూడా ఉన్నాయి కాబట్టి) రాగానే దాని గురించి వివరించేటప్పటికి పండుగ అయిపోయినా అయిపోవచ్చు :-) (ఇప్పటికిప్పుడు కాకపోయినా ఆ రోజు ఎంతో దూరంలేదేమో అనిపిస్తుంది)

సూర్యుడు January 15, 2008 at 10:39 AM  

చాలా బాగా వ్రాశారు. నా చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయి. రాజేంద్ర కుమార్ గారు అన్నట్లు, మావి పేద పల్లెలు అయినా ఇంతో కొంతో చేసేవారు. నాకు తెలిసిన ముగ్గుల పేర్లు వేరేగా ఉండేవి, పారిజాతం, మారేడుదళం, తాబేలు, అడ్డాకు మొదలైనవి.

నమస్కారలతో,
సూర్యుడు :-)

కొత్త పాళీ January 15, 2008 at 6:42 PM  

చాన్నాళ్ళ తరవాత బయటికొచ్చారు. సంకురాత్రి అరిసెలంత మధురమైన టపా రాశారు. ఇంత చక్కగా రయగలగిన వాళ్ళు ఇన్నేసి నెల్లు రాయకుండా ఉండటం ఏం బాగులేదు.

సిరిసిరిమువ్వ January 16, 2008 at 7:03 AM  

రావు గారు నిజమేనండి. మా ఊరిలో అయితే ఇల్లు ఊరికే ఇస్తామన్నా ఉండేవాళ్ళే లేరు.

రాజేంద్ర గారు అది షాపింగ్ మాల్స్ వాళ్ళ బిజినెస్ జిమ్మిక్స్, దాని మూలాన మన సాంప్రదాయాలకి ఒరిగేదేమి లేదు.

తెలుగు'వాడి'ని గారు,సూర్యుడు గారు ధన్యవాదములు.

కొత్తపాళీ గారు ధన్యవాదాలు. ఇంకొద్ది రోజులు ఈ షెల్ లైఫ్ తప్పదండి.

జ్యోతి January 16, 2008 at 9:45 AM  

వరూధినిగారు, చాలా రోజుల తర్వాత మంచి టపా రాసారు. ఇంకా ఎప్పుడొస్తారు తరచూ రాయడానికి...

మీ చిన్నప్పటి పల్లెటూరి పండగ విశేషాలు చెప్పారు. కాని ఇది చదివి నా చిన్నప్పటి ముచ్చట్లు గుర్తొచ్చాయి. అవి కామెంట్ కంటే పెద్దవి కాబట్టి టపా రాసాను. థాంక్స్ అండి.

వికటకవి January 16, 2008 at 11:16 PM  

చాలా బాగా చెప్పారు. సంక్రాంతి అంటే మాకు గాలిపటాలే గుర్తుకువస్తాయి, ఎంతైనా హైదరాబాదు సంక్రాంతి కదా :-) వాటినెగరేసి, పట్టుకొనేసరికి కళ్ళు చింతనిప్పులయ్యేవి. ఇప్పుడు ఆ సరదాలు హైదరాబదులో కూడా లేవన్నుకోండి.

రాధిక January 17, 2008 at 3:50 AM  

ఇప్పుడు సంక్రాంతికి పిల్లలకి కొత్త బట్టల సరదాలు లేవు.నెలకొక కొత్త జతయినా మనం కొంటున్నాము కాబట్టి.గాలిపటాల సరదాలు లేవు.దానికన్నా ఇష్టమయిన ఆటలు,వీడియోగేములు ఇప్పుడు అందుబాటులోకొచ్చాయి కాబట్టి.అన్ని రకాల వంటలు చేసే ఓపిక పెద్దలకు లేదు.ఒక వేళ చేసినా తినేవారు లేరు.అన్నేసి గంటలు ముగ్గులు పెట్టే తీరిక చదువుకునే పిల్లలకు లేదు.మనమిచ్చే గుప్పెడు బియ్యం కోసం రొజువారీ పనులు,ఉద్యోగాలు మానుకుని హరిదాసులు,గంగిరెద్దువాళ్ళు ఎందుకువస్తారు?
జీవితం లో సుఖం అనేది అప్పుడప్పుడు దొరికితే ఆనందం గా వుంటుంది.అప్పట్లో పండుగలనేవి రోజువారీ జీవితాన్నుంచి ఒక ఆటవిడుపులా వుండేది.అదే సుఖం అలవాటుగా మారిపోతే......జీవితం ఇలాగే వుంటుంది నిస్సారంగా.ఇక అనుభవించడానికి ఏమీ లేకుండా.
దేవుడా నాకు నువ్వేమన్నా గొప్పగా ఇవ్వాలనుకుంటే నా బాల్యాన్ని నాకు ఇవ్వు.లేదా నన్ను అక్కర్లేని ఇంత సుఖం నుండి బయటకు లాగు.ప్లీజ్ .......

Unknown January 17, 2008 at 11:05 AM  

చాలా అందమైన టపా రాసారు. ధన్యవాదలు.
నేణు అటు చక్కని పండుగ వాతావరణం, ఇటు జరుపుకోనితనం రెండూ చూసినవాడిని.
కాబట్టి నా జీవితంలో ఇవి చూడలేకపోయానే అనే దిగులు లేదు కానీ ఇప్పుడు చూడలేకపోతున్నానే అనే దిగులు మాత్రం ఉంది.

సిరిసిరిమువ్వ January 18, 2008 at 6:42 AM  

జ్యోతి, స్వాతి, వికటకవి, ప్రవీణ్ నెనర్లు.

రాధిక గారు, చాలా బాగా చెప్పారు.
"జీవితం లో సుఖం అనేది అప్పుడప్పుడు దొరికితే ఆనందం గా వుంటుంది".
"దేవుడా నాకు నువ్వేమన్నా గొప్పగా ఇవ్వాలనుకుంటే నా బాల్యాన్ని నాకు ఇవ్వు.లేదా నన్ను అక్కర్లేని ఇంత సుఖం నుండి బయటకు లాగు.ప్లీజ్ ......."
ఎంత బాగా చెప్పారండి!!

ramya January 24, 2008 at 3:30 PM  

సిరిసిరి మువ్వగారు.
చాలా బాగుందండి. పండగంతా అనుభూతి చెందాను.

Unknown July 2, 2008 at 3:22 PM  
This comment has been removed by the author.
Unknown July 2, 2008 at 3:28 PM  

"మగతా" ఈ మాట విని చాన్నాళయిందండి. మేము ఎక్కువగా "కౌలు" అనే మాట వాడేవాళ్ళం. ఇన్నాళ్ళకి మళ్ళీ ఈ మాట వినటం చాలా సంతోషంగా ఉంది.

అన్నట్టు మాది పొన్నూరుకి దగ్గరలో ఉన్న "వల్లభరావుపాలెం".

Rajendra Devarapalli July 2, 2008 at 6:29 PM  

చంద్రశేఖర్ గారూ,మాది మీ వల్లభరావు పాలెం దగ్గర పొన్నూరు అండి,నిడుబ్రోలు.

మాలా కుమార్ January 12, 2010 at 10:05 PM  

మీ సంక్రాంతి కబురులు బాగున్నాయండి . తృష్ణ గారి కి మీరు ఇచ్చిన లింక్ చూసి , అరే మీ పోస్ట్ ఎలా మిస్ అయ్యనా అనుకున్నాను . అందరి బ్లాగ్ లూ సంక్రాంతి కళ కళ లాడి పోతున్నాయి . నేనే వేరుగా రాసినట్లున్నాను .
సంక్రాంతి శుభాకాంక్షలు .

సిరిసిరిమువ్వ January 13, 2010 at 7:17 AM  

@మాలా గారు, ఇది సద్ది టపా అండి..ఎప్పుడో రెండుసంవత్సరాల కిందటిది. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP