పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

October 15, 2007

పిల్లలు-సెలవులు-ఇంటి పని

పిల్లలకి దసరా సెలవులు వచ్చేసాయి. అయినా ఇప్పటి పిల్లలకి ఏమి సెలవులులే, ఆ సెలవుల ఆనందం వాళ్ళకి ఉండటం లేదు. ఇచ్చేది వారం రోజులు, అందులో మళ్ళీ మూడు రోజులు ఎక్స్ట్రా క్లాసులు, అది కూడా ఫుల్ టైము, వాటికి తోడు సెలవు ఇంటి పని అదే హాలీడే హోంవర్కు. మొత్తానికి సెలవలకి అర్థాలే మార్చేస్తున్నారు. ఈ సెలవలనే కాదు, ఏ సెలవలైనా పిల్లలకి ఇదే బాధ, ముఖ్యంగా CBSE, ICSE సిలబస్ బళ్లలో. మామూలుగా త్రైమాసిక పరీక్షలు అయ్యాక దసరా సెలవులు, అర్థ సంవత్సర పరీక్షలు అయ్యాక సంక్రాంతి సెలవులు, వార్షిక పరీక్షలు అయ్యాక ఎండాకాలం సెలవులు ఉంటాయి. అసలు అలా పరీక్షలు అవగానే సెలవులు వస్తే ఆ ఆనందమే వేరు, మా పిల్లలు ఆ ఆనందాన్ని మిస్సు అవుతున్నారే అని నా బాధ!!! కానీ ఈ బళ్ళలో ఓ నెల ముందుగానే పరీక్షలు పెట్టేస్తారు, కొన్నాళ్ళు బడి జరిగాక అప్పుడు సెలవులు మొదలవుతాయి. ఇక సెలవు ఇంటి పని అని, ప్రాజెక్టు అని పిల్లల ప్రాణాలు తీస్తారు. పోనీ అవేమన్నా పనికొచ్చేవా అంటే అసలు అవి ఎందుకిచ్చారో వాళ్ళకే తెలియనట్లు ఉంటాయి. పిల్లలు ఏదో కష్టపడి చేసుకెళతారా ఒక్కోసారి వాటిని చూడను కూడా చూడరు. కొన్నిసార్లు సెలవులు అయిపోయి బళ్ళు తీసేటప్పటికి టీచర్సు మారిపోతారు, కొత్తవాళ్ళు వీటిని పట్టించుకోరు.

మా వాడికైతే సెలవులంటేనే విరక్తి వచ్చేసింది. ఏం సెలవులు లేమ్మా వారం రోజుల సెలవలికి పది రోజుల హోంవర్క్ ఇస్తారు అంటాడు. అటు ఆడుకోలేడు, ఇటు చదువుకోలేడు అన్నట్లు ఉంటుంది వాడి పరిస్థితి. సరే ఓ రెండు రోజులు కూర్చుని ఆ పనేదో అవచేసుకో రాదా అంటా, వద్దులే చివరిలో చేసుకుంటా అంటాడు, కానీ మనస్సులో ఈ హోంవర్కు భూతం భయపెడుతూనే ఉంటుంది. మరీ ఎండాకాలం సెలవులలో అయితే ఇంకా పాపం అనిపిస్తుంది. బండెడు పని ఇస్తారు. సెలవులు ఇవ్వగానే ఓ నెల రోజులు మా వూరు వెళ్ళిపోయి పిల్లలందరితో కలిసి హాయి హాయిగా సెలవులు గడిపేస్తారు, ఇక హైదరాబాదు బయలుదేరాలనేటప్పటికి ఈ పని దెయ్యం గుర్తుకొస్తుంది, ఇక వాళ్ళ అనందం అంతా హుష్ కాకి. అందులోనూ మిగాతా పిల్లలు ఎక్కువగా స్టేటు సిలబస్ వాళ్ళు వాళ్ళకి ఇలాంటి బాధలు ఏమీ ఉండవు కదా, ఇక వీళ్ళకి ఇంకా బాధగా ఉంటుంది.

మా వాడు తక్కువ వాడేం కాదు, సరే ఈ బాధంతా ఎందుకు హాయిగా స్టేటు సిలబస్ బడికి వెళ్ళరాదా అంటా!! అమ్మో ఇక్కడ ఒట్టి సెలవు ఇంటిపనితోనే కష్టాలు, అక్కడైతే రోజుకి 16 గంటలు చదవాలి, అది నా వల్ల కాదు అంటాడు.

ఆ మద్య శ్రీకృష్ణదేవరాయలు గారు మీరే మీ జిల్లా కలెక్టరయితే ఏం చేస్తారు అని అడిగారు!!!నేనైతే ముందుగా ఒకటి నుండి పదో తరగతి వరకు పుస్తకాలు, హోంవర్క్, పరీక్షలు లేని విద్యావ్యవస్థ ఏర్పాటు చేయటానికి ప్రయత్నిస్తాను.

4 వ్యాఖ్యలు:

lalithag October 16, 2007 at 12:19 AM  

నిజంగానా?

మరీ పదో తరగతి వరకూ ఇంటి పని, పుస్తకాలు, పరీక్షలు లేకపోతే ఎలాగండీ? సెలవులప్పుడు వద్దంటే సరే. వారు ఎంచుకున్నది చెయ్యొచ్చొంటే ఇంకొంచెం ఓకే. సెలవుల తరవాత టీచర్లు మారుతారు, పట్టించుకోరు అంటే not okay.

నేనేమీ మన education system కి పంఖాను కాను. ఆ పోటీ పరీక్షలలో పోటీ తక్కువ, ఒత్తిడి ఎక్కువ.
కార్పొరేటు బళ్ళుట, నాకు వింటుంటేనే బాధేస్తోంది. చదువు కోసం కన్నా పరువు కోసం చదువుకోవడమూను.

state syllabus కీ, మిగిలిన వాటికీ తేడా కూడా మీ అబ్బాయి బాగా చెప్ప గలిగాడు:-) CBSE / ICSE లో నాకు నచ్చేది geometry, geography. నచ్చనివి physics, chemistry.

(What's the difference between CBSE and ICSE?)

అయితే, నేను ఎదుర్కునే సమస్యను పరీక్షించండి. మా పిల్లలకు text books లేవు. ఉన్న ఒకటో రెండో workbook స్టైలులో ఉంటాయి కాని పాఠ్య పుస్తకం లాగా కాదు. బడిలో ఏం చెప్తున్నారో, వీళ్ళు ఎంత గ్రహిస్తున్నారో అర్థం అవ్వదు. పరీక్షలు మాత్రం వారనికి కనీసం రెండు ఉంటాయి. దానికి చదివించడానికి రోజూ ఇంటికి తెచ్చే కాగితమే దిక్కు. అందులోనూ కొన్ని పదాలు, బహుశ definitions తప్ప ఇంకేమీ ఉండవు. దొరికిందల్లా చదివి generalగా ఏదో నేర్చుకుంటూ ఉంటారు, అది ఇప్పటి వరకూ బానే ఉంది. ముందు ముందు దిశా నిర్దేశం ఎలా జరుగుతుంది అన్నది కొంచెం సమస్యగానే ఉంది. ఇంకా పై తరగతులలో (elementary level వరకే అనుకోండి) పిల్లలున్న తల్లి దండ్రులు ఇంకొంతమంది పరిచయస్థులు ఇదే వ్యక్తం చేస్తున్నారు.

మన దగ్గిర ఉన్న మంచి విషయాలలో నేను miss అయ్యేది text books. అలాగని బస్తాడు పుస్తకాలు రోజూ మోసుకెళ్ళడం మంచిదనను. దానిని సవరించే ఆలోచన ఏదైనా చేస్తే బావుంటుంది. ఏమంటారు?

రాధిక October 16, 2007 at 12:47 AM  

ఏమిటో ఈ చదువుల గురించి వింటుటేనే భయం వేస్తుంది.

సిరిసిరిమువ్వ October 16, 2007 at 6:38 PM  

@లలిత గారూ నాకైతే మీ పిల్లల విద్యావిధానమే నచ్చుతుంది. అక్కడ వాళ్ళంత వాళ్ళు నేర్చుకునేది ఎక్కువుగా ఉంటుంది. ఇక్కడ పిల్లలు బట్టీ పట్టటం తప్పితే విషయ పరిజ్ఞానం ఏమి ఉండదు. చదువు అనేది క్రియేటివ్ గా ఉండి పిల్లలు వాళ్ళ ఆలోచనలని, ఊహలని స్వేచ్చగా వ్యక్తపరచగలిగేటట్లు చేయాలి గానీ ఇవాళ నేర్చుకుంది రేపు మర్చిపోయేటట్లు ఉండే చదువులు ఎందుకండి. మీరే చెప్పారు మీ పిల్లలు దొరికిందల్లా చదివి నేర్చుకుంటూ ఉంటారు అని, అది ఎంత మంచి విషయమో కదా!!

ఇక CBSE కి ICSE కి తేడా అంటే, ICSE లో సిలబస్ ఎక్కువగా ఉంటుంది, ముఖ్యంగా సైన్సు.

@రాధిక గారూ భయమైనా ఎదైనా రోట్లో తల పెట్టి రోకటి పోటుకి వెరవకూడదంటారు చూడండి, అలానే పిల్లలు ఉన్న వాళ్ళకి ఈ బాధలు తప్పవు.

Twisted DNA January 12, 2008 at 8:29 AM  

నిజమే, మా చిన్నప్పుడు ఎదో బడికి ఏదో కంటి తుడుపుకి వెళ్ళేవాళ్ళం. నేను engineering కి వచ్చేదాకా సరిగా బడికి వెళ్ళిందే లేదు. ఈ కాలం లో పిల్లలు పాపం మరీ ఎక్కువ కష్టపడుతున్నారు అనిపిస్తుంది. అలాగని, మాలగా బడి ఎగ్గొట్టి తిరగండి అనలేము. ఇప్పుడు పోటీ బాగా పెరిగిపోయింది.

మావాడు ఉన్నత పాఠశాల కి వచ్చేసరికి పరిస్థితి ఎలా ఉంటుందో!

అన్నట్టు ఏమిటి చాలా కాలం నుంచి blog రాస్తున్నట్టు లేరు?

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP