అందమైన అనుభవం
చాలారోజుల తరువాత ఇవాళ టి.వి. లో అందమైన అనుభవం సినిమా చూసాను. అప్పట్లో గొప్ప మ్యూజికల్ హిట్ ఈ సినిమా. కమలహాసన్, జయప్రద, రజనీకాంత్ ఇందులో ప్రధాన పాత్రలు. మాములుగానే నాకు అప్పట్లో కమలహాసన్ అంటే పిచ్చ అభిమానం. ఈ సినిమా పాటలు గూడ బాగుండటంతో ఎప్పుడు చూసినా ఈ పాటలే వింటూ వుండేదాన్ని. అన్నీ కంఠతా కూడా వచ్చేవి (అప్పట్లో). 1979లో విడుదలైందనుకుంటా ఈ సినిమా. ఎం.ఎస్ విశ్వనాథన్ సంగీతం. బాలు, సుశీల, జానకి, ఎల్.అర్.ఈశ్వరి పాడారు. ఇందులో "అందమైన అనుభవం" అని ఒక పాట ఉంటుంది. ఈ వాక్యం తప్పితే మిగతా పాట అంతా హమ్మింగే, బాగుంటుంది. ఆ సంవత్సరమే కమలహాసన్ ది సొమ్మొకడిది సోకొకడిది సినిమా కూడ వచ్చింది, అందులో కూడా పాటలు బాగుంటాయి.
ఈ సినిమాలో రజనీకాంత్ ది అంత ప్రాధాన్యత లేని పాత్ర అయినా గుర్తుండిపోతుంది. ఇందులో తన ఊతపదం శివశంభో. జయప్రద మాత్రం ఈ సినిమాలో తను మాములుగా కనిపించేంత అందంగా కనిపించదు. బహుశా హేరుస్టైలు, డ్రెస్సు కారణం కావచ్చు. చివర్లో తన డైలాగు----"చావు కూడా ఒక అందమైన అనుభవమే" అప్పట్లో అర్థం కాలేదు కానీ ఇప్పుడు నిజమే కదా అనిపిస్తుంది. పాటలు మాత్రం అన్నీ ఆణిముత్యాలు అనవచ్చు (నా వరకు).
కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు.. వెర్రెక్కి ఉన్నోళ్ళు....ఈ పాట అప్పట్లో మంచి పాపులర్ పాట. ఇంకా ఇందులో హలో నేస్తం బాగున్నావా, నువ్వే నువ్వమ్మా నవ్వుల పువ్వమ్మా, శంభో శివశంభో, ఆనంద తాండవమే పాటలు కూడా చాలా బాగుంటాయి.
మొన్నీ మద్య హాపీడేసు పాటలు వింటుంటే అందులో సాయోనార అని ఒక పాట వస్తుంది, అది విని ఈ సినిమాలోని సాయొనారా పాటని తలుచుకున్నాను, అంతలోనే ఈ రోజు తేజ వాడు సినిమానే వేసాడు.
అన్నట్లు నిన్ననే చందమామ సినిమాలోని పాటలు శ్రద్దగా విన్నాను, అన్నీ బాగానే అనిపించాయి, పర్వాలేదు. కానీ పంటి కింద రాళ్లలాగా అక్కడక్కడ తెలుగు ఉచ్చారణా దోషాలు. ముఖ్యంగా "నాలో ఊహలకు నాలో ఊసులుకు అడుగులు నేర్పావు" పాట పాడిన గాయనీమణి ఎవరో తెలియదు కానీ నేర్పావు అన్న మాటలో పావుని పావుకిలో లో పావులా ఉచ్చరిస్తుంటే చెవులలో సీసం పోసుకోవాలినిపించింది. మరీ భాషని ఇంతలా చావగొట్టాలా అనిపించింది!!!!!
6 వ్యాఖ్యలు:
నేర్పావు...అని పాడింది అశా భోస్లే, ఇంతకు ముందు లక్కి అలి తో జరిగిన అనుభవం సరిపోలెదనుకుంటా కె.ఎమ. రాధాకృష్ణన్ గారికి....
ఎంతవరకు నిజమో తెలియదు గానీ ఈ పాట[నాలో ఆశలకు] తను పాడకపోయుంటే పాటకొచ్చే నష్టం ఏమీ లేదు గానీ తను మాత్రం చాలా కోల్పోయేదానినని ఆశా అన్నారట.
అందమైన అనుభవం సినిమా నాకు కూడా బాగా నచ్చిన చాలా కొన్ని సినిమాలలో ఒక్కటి. ఇందులో పాటలన్నీ చాలా బాగుంటాయి. అందులో ముఖ్యంగా ఎల్లార్ ఈశ్వరి, బాలు గారు బృందగానం ఒకటి ఉంది. అది - అందమైన లోకముంది అనుభవించ ప్రాయముంది లవ్లీ బర్డ్స్ ... ఇట్లా వస్తుంది. చాల అద్భుతమైన లిరిక్స్. మంచి సినిమా ని గుర్తుచేసినందుకు ధన్యవాదాలు.
చాలా మంచి పాటలు దీనిలో. నాకు, "సింగపూరు సింగారి" పాట కూడా బానే ఉంటుంది. M.S.V గారు అన్ని పాటల్నీ అద్భుతం గా కూర్చారు. ఈ పాటలు ఇంకా గుర్తు పెట్టుకొని వింటోంది నేనే అనుకున్నాను, నాలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారన్న మాట :)
sivasambhO paaTa appaTlO caalaa speed song.
breathless annamaata
bollojubaba
అందమైన అనుభవం, ఎర్ర గులాబీలూ.. ఇవన్నీ లయరాజు ఇళయాజాగరి మాస్టర్ పీసులు కదా. మంచి పాటలు గుర్తు చేసారు. ధన్యవాదాలు. చందమమలో పాటలు బావుంటాయి. నాది కూడా అదే కంప్లైంట్. ఈ వయసులో కూడా ఎలాంటి పాటనైనా అలవోకగా పాడేసే ఆశా ఇలా పాడారేమిటా అనిపించింది,. మిగతా పాటంతా బానె ఉంటుండి ఒక్క 'పావు తప్ప. ఆవిడే పాడితే తప్ప కుదరదు అన్నంత గొప్ప పాటేమీ కాదు, ఊరికే ప్రచారానికి తప్ప పెద్ద ఒరగబెట్టిందేమీ లేదు..
Post a Comment