పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

June 11, 2012

అమెరికాలో వైద్యం..ఎంత కష్టం..ఎంత కష్టం

అమెరికాలో వైద్యం చాలా ఖరీదైనది..మామూలు జ్వరానికి  కూడా ఇన్స్యూరెన్సు లేందే అక్కడి వైద్య ఖర్చులు భరించలేము..ఇది మాములుగా ప్రవాస భారతీయుల నుండి మనం వినేది.

అమెరికాలో ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చి అత్యవసరంగా డాక్టరు దగ్గరికి వెళ్ళాలంటే వెళ్ళలేని పరిస్థితి.  ముందుగా అపాయింటుమెంటు లేందే డాక్టరుని కలవలేం. ఇప్పుడిప్పుడే advanced or open-access scheduling, direct-pay practices, telehealth services లాంటివి అందుబాటులోకి వస్తున్నాయి కానీ ఇవి అన్నిటికీ పనికి రావు.

ప్రతిదీ ప్రొసీజర్ ప్రకారం అంటూ నెలలు నెలలు చేస్తారు.  కాన్సరు లాంటి ప్రాణాంతక వ్యాధుల్లో కూడా వ్యాధి నిర్థారణ అవటానికి ఆరు నెలలు..ఆ తర్వాత అసలు ట్రీట్‍మెంటు మొదలవటానికి మరో రెండు మూడు నెలలు...ఈ లోపు ఇవతల పేషెంట్సు..వాళ్లతో పాటు వాళ్ళ కుటుంబసభ్యులకి ఎంత నరకయాతనో!

అంతే కాదు ఎవరైనా సెషలిస్టు డాక్టరు దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడ లాగా డైరెక్టుగా వెళ్ళలేం..ముందుగా ఫామిలీ ఫిజిషియన్ దగ్గరకి వెళ్ళాలి..వాళ్ళు రిఫర్ చేస్తేనే స్పెషలిస్టుల దగ్గరకి వెళ్ళాలి.. మరీ అవసరం అయితే ఎమర్జన్సీ రూమ్సుకి వెళ్ళాలి..ఇవి చాలా కాస్ట్లీ కాబట్టి మరీ అత్యవసరం అయితే తప్ప అంత తొందరగా ఎవరూ వెళ్ళరు.

ఫామిలీ ఫిజిషియన్సు దగ్గర అయినా ఓ మూడు నాలుగు వారాల ముందే అపాయింట్‍మెంటు తీసుకోవాలి..ఆ తీసుకున్న రోజుకి ఎందుకైనా వెళ్ళలేకపోతే మళ్ళీ అపాయింట్‍మెంటు తీసుకోవాల్సిందే! అది మళ్ళీ ఎప్పుడు దొరుకుతుందో తెలియదు.

ఏవైనా డయాగ్నోస్టిక్ టెస్టులు చేయించుకోవాలంటే ఇక్కడ లాగా అదే హాస్పిటల్ లో ఉండవు..బయట సెంటర్సుకి వెళ్ళాలి..వాటికి కూడా అపాయింటుమెంటే! ఆ టైములో ఏదైనా సమస్య వచ్చి ఆ టెస్టు ఆ రోజు జరక్కపోతే మళ్ళీ అపాయింటుమెంటు దొరికేదాకా ఆగాల్సిందే!

నా స్నేహితురాలు ఒకామెకి ఆరు నెలల బట్టి ఆహారం మింగేటప్పుడు గొంతులో ఇబ్బంది గా ఉంటుంటే డాక్టరు దగ్గరికి వెళ్తే అసిడిటీ అయి ఉంటుంది అని మందులు ఇచ్చి పంపించారు..తనకి రోజు రోజుకి సమస్య ఎక్కువై అసలు ఘన పదార్థాలు తినలేని స్థితికి వచ్చింది.  దాదాపు నాలుగు నెలల నుండి ద్రవపదార్థాల మీదే బ్రతుకుతుంది..అవి కూడా ఒక్కోసారి లోపలకి వెళ్ళకుండా బయటికి వచ్చేసేవి. బాగా బరువు తగ్గిపోయింది..మరి డైటు సరిగ్గా పోవటం లేదు కదా! ప్రతి నెలా డాక్టరు దగ్గరికి వెళ్తూనే ఉంది..చివరికి తనే ఒకసారి ఎండోస్కోపీ చేయించుకుంటానంటే అప్పుడు వ్రాసారట!

ఇన్ని నెలలు తను బాధపడుతుంటే అసలు లోపల సమస్య ఏమైనా ఉందేమో ..టెస్టులు చేయిద్దాం అన్న ఆలోచనే రాలా వాళ్లకి. డాక్టర్లు ఎక్కడైనా ఇంతేనా అనిపించింది!

ఎండోస్కోపీలో esophageal cancer అని వచ్చింది. కాన్సరు అని తెలిసాక అది ఏ స్టేజులో ఉందో తెలుసుకోవటానికి మరో రెండు వారాలు పట్టింది. సెకండు స్టేజ్ అని తెలిసింది..తెలిసి కూడా దాదాపు రెండు నెలలవుతుంది కానీ ఇంకా ట్రీట్మెంటు మొదలవ్వలేదు! ఏదో ఒక టెస్టులు..వాటికి అపాయింటుమెంటులు..ఇలానే రోజులు గడిచిపోతున్నాయి.

మొన్నటికి మొన్న ఏదో టెస్టు చెయ్యటానికి లోపలకి తీసుకెళ్ళాక పొటాషియం లెవల్సు చాలా తక్కువ ఉన్నాయని ఆ టెస్టు చెయ్యటం కుదరక ఆపేసారు..పొటాషియం ఎక్కిస్తున్నారు..మళ్ళీ అపాయింటుమెంటు ఎప్పుడు దొరికితే అప్పుడే ఆ టెస్టు!

అక్కడ ఇన్స్యూరెన్సు ఫార్మాలిటీసు ఎక్కువ కాబట్టి ఇంత ప్రొసీజరల్ డిలే అంటుంటారు..ఎంత ఇన్స్యూరెన్సు ప్రొసీజర్ అయినా అది వేగంగా జరగటానికి ఏదో ఒకటి చెయ్యాలి కాని.. ఓ వ్యాధి నిర్థారణకి..దానికి తగిన చికిత్స ఇవ్వటానికి ఇలా రోజుల తరబడి చేస్తుంటే ఇవతల పేషెంట్సు పరిస్థితి ఏమిటి! అందులోనూ కాన్సరు లాంటి ప్రాణాంతక వ్యాధుల్లో కొంత వెసులుబాటు ఉండాలి కదా!

ఇప్పుడు తన పరిస్థితి ఎలా ఆయిందంటే పూర్తిగా మంచం మీదే..లిక్విడ్ డైటు..అదీ ట్యూబుల ద్వారా! మొన్నటి వరకు ఎవరైనా పట్టుకుంటే నాలుగు అడుగులు వెయ్యగలిగేది..ప్రస్తుతం అంతా మంచం మీదే!  మాట్లాడలేని పరిస్థితి!

ఇక్కడి నుండి వాళ్ల అమ్మా నాన్న వెళ్లారు..వాళ్ళకి విషయం అంతా చెప్పకుండా..చిన్న సర్జరీ చెయ్యాలి అని చెప్పారు.  అక్కడికి వెళ్ళాక తన పరిస్థితి చూసి వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్నారు. అక్కడి పద్దతులు చూసి వాళ్ళింకా బెంబేలెత్తుతున్నారు..ఇండియా తీసుకెళ్ళిపోదాం అక్కడే సర్జరీ చేయిద్దాం అని వాళ్ళ గొడవ. ఇక్కడయితే ఈ పాటికి సగం ట్రీట్మెంటు కూడా అయిపోయేది.

అమెరికా వాసులారా..తనకి త్వరగా ట్రీట్మెంటు మొదలవ్వాలంటే ఏం చెయ్యాలో ఎవరైనా చెప్పగలరా!

Read more...

June 8, 2012

ఈ ప్రపంచం చాలా చిన్నది! అమెరికా టు ఆంధ్రప్రదేశ్ వయా ఫేస్ బుక్

యార్లగడ్డ కిమీర..1970-80 ల్లో ఓ తెలుగు రచయిత్రి..
తుమ్మల కిమీర--మా అమ్మాయి..
ఈ ఇద్దరి మధ్య సంబంధం ఏంటీ అంటారా....

ఆ యార్లగడ్డ కిమీర అన్న ఆవిడ పేరే నేను మా అమ్మాయికి పెట్టుకున్నాను.

చిన్నప్పుడు ఆవిడ పేరు ఎప్పుడు విన్నానో నాకు గుర్తులేదు కానీ ఆ పేరు మాత్రం నాకు బాగా గుర్తుండిపోయింది. ఆ పేరంటే ఓ రకమైన ఇష్టం ఏర్పడింది. ఆవిడ రచనలు కూడా కొన్ని చదివాను కానీ నాకు వాటి పేర్లు కానీ కథాంశం కానీ ఏమీ గుర్తు లేవు.  నాకు గుర్తుందల్లా ఆవిడ పేరే! ఆ పేరంటే నాకు నాకే తెలియని ఓ పాషన్.

నాకు అమ్మాయి పుట్టగానే వెంటనే ఆ పేరే పెట్టుకున్నా. మా అమ్మాయి పేరు చెప్పగానే చాలా మంది ఆ పేరుకి అర్థం అడిగేవాళ్ళు.

కిమీర అన్న పదానికి ఎక్కడా అర్థం దొరకలేదు.

కిమ్మీరం  అంటే చిత్రవర్ణం, నారింజ.

మా అమ్మాయికి కొంచం ఊహ వచ్చాక నా పేరుకి అర్థం ఏంటమ్మా అంటే ఇదే చెప్పేదాన్ని..కానీ తనకి అంత తృప్తిగా ఉండేది కాదు. ఇప్పటికీ వెతుకుతూ ఉంటుంది తన పేరుకి సరైన అర్థం కోసం:)

అయినా పేరు పిలుచుకోవటానికి బాగుంటే చాలు కదా ఈ అర్థాలూ అవీ ఎందుకట!

మన తెలుగు పేర్లలో చాలా ఎక్కువగా వినపడే అప్పారావు..సుబ్బారావు..లాంటి పేర్లకి అర్థం ఏంటి!

సరే ఇక అసలు విషయంలోకి వస్తే నేను ఎవరి పేరు అయితే నచ్చి మా అమ్మాయికి పెట్టుకున్నానో ఆ యార్లగడ్డ కిమీర గారు ఈ మధ్య ఫేసు బుక్ లో మా అమ్మాయికి ఓ మెసేజ్ పెట్టారు (ఫేసు బుక్కు లో ఆవిడ పేరు కిమీర రావు).

దాని సారాంశం..

కిమీర రావు: హాయ్..నా పేరు కూడా కిమీర నే, ఇది అరుదుగా వినపడే పేరు--నా పేరుతో మరొకరు ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది.

తుమ్మల కిమీర: నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఇలా నా పేరు ఉన్నవాళ్లని కలుసుకోవటం..ఇంతకీ మీకు ఆ పేరుకి అర్థం తెలుసా?

కిమీర రావు: తెలీదు ...మా నాన్న యూరప్ లో ఉండగా నేను పుట్టాను..అక్కడే ఆ పేరు పెట్టారు. ఆ పేరుకి అర్థం అడగాలన్న ఆలోచన నాకు వచ్చేటప్పటికి మా నాన్న గారు లేరు.

తుమ్మల కిమీర: నాకు ఈ పేరు మా అమ్మ పెట్టింది.  యార్లగడ్డ కిమీర అని ఓ రచయిత్రి ఉండేవారట..ఆ పేరు నచ్చి మా అమ్మ నాకీ పేరు పెట్టింది.

కిమీర రావు: అవునా..నా పేరు యార్లగడ్డ కిమీర..నేనూ రచయిత్రినే!

తుమ్మల కిమీర: నిజమా..భలే ఉంది మిమ్ముల్ని ఇలా కలుసుకోవటం.

చూసారా ప్రపంచం ఎంత చిన్నదో.  ఎప్పుడో చిన్నప్పుడు విన్న ఓ రచయిత్రి పేరు నేను మా అమ్మాయికి పెట్టుకోవటం..ఆమే స్వయంగా  మా అమ్మాయితో మాట్లాడటం..ఎంత విచిత్రం...నాకయితే మహా ఆనందం కలిగింది ఆవిడ్ని ఇలా కలవగలగటం...మహేష్ బాబు స్టైలు లో చెప్పాలంటే ఫంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, అన్ బిలీవబుల్, అమేజింగ్!

ప్రస్తుతం ఆవిడ వయస్సు 63 సంవత్సరాలు.. అమెరికాలో ఉంటున్నారు. ఇంకా రచనలు చేస్తున్నారో లేదో తెలియదు.

Read more...

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP