పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

March 22, 2011

రమణీయం......ముళ్లపూడివారి ముందుమాటతో

కొన్ని రచనలు వడియాలు పెట్టినట్టుంటాయి.
కొన్ని జంతికలు పోసినట్టుంటాయి.
కొన్ని మాత్రం ముగ్గులు వేసినట్టుంటాయి.
పై రెండూ తింటే కరుసైపోయినట్టే-

"నిన్న" కన్న బిడ్ద "ఇవాళ"
"ఇవాళ"లు రేపటికి పేరెంట్సూ, ఎల్లుండికి తాతలూ అవ్వలూనూ.....

దాలిగుంట మీద పాలదాకలో పాలి నిదానంగా కాది, మరిగి, పొంగి పొంగి, కుంగి స్థిరపడి ఎర్రడాలు మీగడ తేలడం దాంపత్య సౌభాగ్యం!
ఏవిటలా చదవడం ఆపి, కళ్ళు తేలేస్తున్నారు?

సరదానంద వాక్యాలు గంభీరానంద సన్యాసానంద ప్రసంగ పాఠాల్లా కనపడుచున్నాయా?

పైవన్నీ నా మాటలు కాదండోయ్!

సీతారాముళ్లనే బావామరదళ్ల..ధరిమిలా ఆలూ మగళ్ల..ఆ పైన తల్లీతండ్రుళ్ల..ఆ పిమ్మట అవ్వాతాతళ్ల కథకి మన వెంకటరమణ వ్రాసిన  రమణీయమయిన ముందుమాట..

"దాంపత్య ఋతుసంహారం"..ముందుమాటకి పేరు చూడండి..ఎంత చమత్కారంగా పెట్టారో!

కొన్ని పుస్తకాలకి ముందుమాటతో ఓ గుర్తింపు వస్తుంది.  అలాంటి ఓ పుస్తకమే అనామకుడు వ్రాసిన "రమణీయం" పుస్తకం.

నేను ఈ రచయిత పుస్తకం ఇదే మొదలు చదవటం. అసలుకన్నా కొసరు రుచి అని పుస్తకంలో విషయం కన్నా నాకు రమణ గారి ముందుమాట ముందుగా మా బాగా నచ్చేసింది. అసలు రమణ ఎక్కడికీ వెళ్లలేదు..ఇలా ముందుమాటలతో..వెనక మాటలతో....కోతి కొమ్మచ్చి ఆడుతూ మనతోనే ఉన్నాడు..ఉంటాడు..తెలుగు పాఠకులుగా అది మనం చేసుకున్న పుణ్యం!.

అసలు ఈ పుస్తకం ఏంటంటే..నేను చెప్పటం ఎందుకు..రమణగారి మాటల్లోనే చదవండి.

"చిన్న చిన్నా ఉబలాటాల ఆరాటాల పోరాటాల చెలగాటాల పరీమళాల (నీ జుట్టు నిశి..నీ ముఖం శశి; కళ్లు మూస్తే మొగ్గలు-తెరిస్తే పువ్వులు) ఘుమ ఘుమ లతో నోరూరించే-తింటే ’వ-హల్‍వా’ అనిపించే ఆలుమగల ముత్యాలు ఈ ముగ్గులు.  విశేషం ఏమిటంటే సుద్ద ముగ్గుల్లా ఈ ముగ్గులు చెదరవు..చెరగవు"

ఇక అసలు కథకి వస్తే.......

ఇది ఓ జంట కథ..
ఓ సీత... ఓ రాముడు...పుట్టుకతో బావా మరదళ్లు...తరువాత ఆలూమగలు....ఆపై తల్లిదండ్రులు.. అటు పిమ్మట తాతాముత్తవలు....పుస్తకం మొదటినుండి చివరి దాకా వీరిద్దరే..ఇంకో పాత్ర ఉండదు. ఈ ఇద్దరి సంసారం..అందులోని  సరాగాలు..విరహాలు...అలకలు...రుసరుసలు...బుసబుసలు...కోపాల్..తాపాల్..సరదాల జగడాలు ....వెరసి రమణీయం అనబడే ఈ పుస్తకం.  పెద్ద కథేం ఉండదు వివిధ జీవితావస్థల్లో వాళ్ల రోజువారీ జీవితమే...కానీ చదవటానికి ఆహ్లాదంగా ఉంటుంది.  రెండే రెండు పాత్రలతో దాంపత్య కాలచక్రాన్ని సరదాగా చూపేట్టే పుస్తకం.  అక్కడక్కడా ముళ్లపూడి మార్కు సంభాషణలు నవ్విస్తాయి.. రచయిత మీద ముళ్లపూడి ప్రభావం చాలానే ఉందనిపించింది.

ధనుర్మాసంలో మూడంతస్తుల మేడలో ఓ మూలనున్న తమ ఫ్లాట్‍లో భార్య ముగ్గు వేస్తే చూడాలని ముచ్చటపడ్డ భర్త కోరికని ఆ భార్య ఎలా తీర్చిందో ఈ పుస్తకంలో చదవాల్సిందే! 

చివరి దాకా ఒకే మాట మీద జీవించిన ఆ ఇద్దరూ తమ వానప్రస్థంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారన్న దానితో ఈ పుస్తకం ముగుస్తుంది.

భార్యాభర్తల బంధం ఎలా ఉండాలో సున్నితంగా చెప్పే పుస్తకం! ఇలాంటి కథలు చదివినప్పుడు మన భారతీయ వివాహ బంధం ఎంత గొప్పదీ అని అనిపించకమానదు!

సీతకి రామంలా
రామానికి సీతలా
సీతారామంలా ఉండగలిగితే
ఏ దంపతుల జీవితం అయినా "రమణీయం"
అంటారు రచయిత చివరగా

 ఇదే పుస్తకంలో చివర్లో రాముడి ఏకపత్నీవ్రతం గురించి ఓ సరదా అనుబంధ కథ కూడా ఉంది

మొత్తం మీద సరదాగా టపటపా ఓ గంటలో చదివేయదగ్గ పుస్తకం.

రమణీయం
రచన: అనామకుడు
ప్రచురణ: వాహినీ బుక్ ట్రస్ట్
వెల: 50/-

ఈ పుస్తకం కావల్సిన వాళ్ళు ఎక్కడి దాకో వెళ్లక్కరలేదు..అలా కినిగె కి  వెళ్ళి ఓ నొక్కు నొక్కండి చాలు. కింద బొమ్మ మీద నొక్కినా వెళ్ళవచ్చు. రమణి ముందుమాటకి తోడు వయ్యారాల బాపు  బొమ్మ ఈ పుస్తకానికి మరో అదనపు ఆకర్షణ!


రమణీయం On Kinige

Read more...

March 10, 2011

నేలకొరిగిన తెలుగు వైతాళికులు!

అప్పుడెప్పుడో బాబరు రామ మందిరాన్ని కూల్చాడని
ఇప్పటికీ మన గుండెలు మండుతుంటాయి!
మొన్నెప్పుడో ఎక్కడో ఆఫ్ఘనిస్తానులో
తాలిబన్లు బుద్దుడి విగ్రహాలను కూల్చేస్తుంటే
ఇక్కడ మనం విలవిలలాడిపోయాం!

ఈ రోజు మన కళ్ల ముందే
హుస్సేను సాగరు సాక్షిగా
బ్రహ్మనాయుడి పౌరుషం...పటాపంచలు చేస్తుంటే
కృష్ణరాయల కీర్తి........నీటిపాలు చేస్తుంటే
తిక్కయ్య కలాన్ని........అడ్డంగా విరిచేస్తుంటే
త్యాగయ్య గొంతుని....నిర్దాక్షిణ్యంగా నులిపేస్తుంటే
తిమ్మరుసు ధీయుక్తిని....ఎందుకూ కొరకాకుండా చేస్తుంటే
పోతన..వేమన ..ఎర్రాప్రగడల... చేతులు విరిచేస్తుంటే
శ్రీశ్రీ.......జాషువాల....నాలుకలు తెగ్గోస్తుంటే
త్రిపురనేని...కందుకూరి.....సురవరంల...... తలలు పగలగొడుతుంటే
పింగళి వెంకయ్య తలదించుకునేట్టు...మన జండాని అవమానిస్తుంటే
నిలువు గుడ్లేసుకుని.....గుడ్లలో నీరు కుక్కుకుని
నిస్సహాయంగా చూస్తూ కూర్చున్నాం
రుద్రమ్మా..మల్లమ్మా..ఝాన్సమ్మా
ఎక్కడున్నారమ్మా....మీరన్నా క్షేమమేనా!


తెలుగు వైతాళికుల విగ్రహాలని
తెలుగు వారే  ధ్వంసం చేస్తుంటే
ఏడుపో... బాధో.....కసో
ఏమీ చేయలేని అస్సహాయతో..
ఏమీ అర్థం కాని ఓ ఆవేదన!

Read more...

March 9, 2011

నడకలందు ఏ నడక మేలు?

నడక ఓ వ్యాయామం కన్నా ఓ రిలాక్సేషను టెక్నిక్కు గానే నాకు ఎక్కువ ఇష్టం.  నడకకి ఉదయం వెళ్ళాలా..సాయంత్రం వెళ్ళాలా .... ఉదయం వెళితే  ఎన్ని గంటలకి వెళ్ళాలి అనేది మన తీరికని బట్టి ..వీలుని బట్టి ఉంటుంది.  నేను మాత్రం నడకకి వెళితే ఉదయం ఐదు గంటలలోపే బయలుదేరి వెళతా! అప్పుడు వెళితేనే దాన్లో ఉన్న ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించవచ్చు అనిపిస్తుంది నాకు.  ఆ తరువాత నడిచే నడక నాకు నడకలా ఉండదు.  పిల్లలకి కాలేజీల హడావిడీలో కొన్నాళ్ళు ఉదయాన్నే వెళ్ళటం మానివేసి ఏడు గంటలకి వెళ్ళాను కాని నాకు ఆ నడక నచ్చల!

ఈ మధ్య తెల్లవారుఝామున 4:30...4:45 కల్లా నడకకి బయలుదేరుతున్నా.  మా కాలనీ రోడ్లు విశాలంగా నడకకి చాలా అనుకులంగా ఉంటాయి.  కాలనీలో ఉన్న రెండు పార్కులు కూడా నడకకి బాగుంటాయి. కాకపోతే ఈ పార్కులు 5:30 దాటితే  భ్రమరి...భస్త్రిక...ఉజ్జయ్..అనులోమ విలోమాలు....మొదలగు నానారకాల ప్రాణాయామాల  ఉచ్వాస..నిశ్వాసలతో వేడెక్కి పోతాయి. ఓ నాలుగు రోజులు వరుసగా పార్కుకి వెళ్ళామంటే అన్ని రకాల ప్రాణాయామాలు నేర్చేసుకోవచ్చు.

చల్ల చల్లటి గాలులతో పాటు సువాసనభరిత నడక కావాలంటే మా కాలనీ రోడ్డు మీద నడిస్తేనే బాగుంటుంది.  రోడ్డుకి రెండువైపులా  చెట్లు..వాటినుండి వచ్చే చల్ల గాలి..అందులోనూ మాఘ..ఫాల్గుణ మాసాల్లో ఉండీ లేనట్టు ఉండే చిరు..చిరు చలిలో ఉదయపు చల్ల గాలుల మధ్య నడవడం చాలా బాగుంటుంది.  4:30 కి రోడ్డు మీదకి వస్తే ఒక్క నర, వస్తు, వాహన, జంతు సంచారం కూడా ఉండదు.  అంతా అందమైన నిశ్శబ్ధం..నిన్న చూసిన రోడ్డు ఇదేనా అనిపిస్తుంది.  4:45కి అక్కడొక మనిషి..ఇక్కడొక మనిషి కనిపిస్తే...  5 గంటలయ్యేటప్పటికల్లా ఒక్కసారిగా  రోడ్డంతా నడిచే మనుషులతో నిండిపోతుంది. వీళ్లకి తోడు పాలవాళ్ళు..పేపరు వాళ్ళు...రోడ్లు ఊడ్చే వాళ్ళు..అప్పుడే వచ్చే మొదటి బస్సు ...ఉదయం రైల్వే స్టేషనులకి ఎయిరుపోర్టులకి వెళ్ళేవాళ్లని..వచ్చేవాళ్ళని మోస్తూ రయ్యిమంటూ దూసుకొచ్చే కార్లు..ఇక రణగొణ ధ్వనులు మొదలవుతుంటాయి.  శబ్దకాలుష్యానికి తొలి చిరునామాలు అన్నమాట!

అన్నిటికన్నా ఈ సమయంలో నాకు అమితంగా నచ్చేది..చెట్ల నుండి..వాటి పూల నుండి వచ్చే వింత వింత పరిమళాలు.  మా ఇంటిముందు వేప చెట్టుతో మొదలుపెడితే తిరిగి వచ్చేటప్పటికి మధ్యలో ఎన్నెన్ని పరిమళాల సొగసులో.  ఆ సమయంలో నడిస్తే మనిషికి ఇక వేరే ఆరోమా థెరపీలు ..ఫ్లవర్ థెరపీలు అవసరంలేదేమో!
























మా ఇంటి ముందు ఇప్పుడిప్పుడే పూస్తున్న లేలేత వేప పూ వాసనలు... కొంచం రెండడుగులు ముందుకు వేయగానే మత్తెంక్కించే నైట్ క్వీను గుభాళింపులు...ఇంకాస్త ముందుకి వెళితే పారిజాత పరిమళాలు...మరో రెండడుగులు వేస్తే రాజుగారి బాల్కనీ మీది నుండి తొంగిచూసే సన్నజాజి సువాసనలు...అలా మరో నాలుగడుగులు వేయగానే  సీతమ్మ గారి ఇంటి మామిడిపూత వింత పరిమళాలు...రోడ్డుకి ఈ పక్క తురాయి పూలు..ఆ పక్క మోదుగ .. ఆ గేటులో నిద్ర గన్నేరు...ఈ వాకిట్లో మల్లె పాదు....ఓ ఇంటి బాల్కనీలో అపురూపంగా పెంచుకుంటున్న పరిమళాలు వెదజల్లే గులాబీలు.... లిల్లీలు....మద్యలో రోడ్డు మీద రాలిన పున్నాగ పూలు...శివలింగ పూలు..ఇంకా పేరు తెలియని పూలు....అన్నీ కలగలిసి మైమరిపించే మధుర సువాసనలు. వాసనలేని పూలు కూడా  వీటి వాసనలు పీల్చి తాము కూడా వాసనలు వెదజల్లే స్వచ్చమైన సమయం.


ఈ పూల వాసనలకి నేనెంతగా అలవాటు పడ్డానంటే కళ్ళు మూసుకునే వాటి వాసన బట్టి నేను ఎక్కడ ఉన్నానో  చెప్పగలిగేంత.

చెట్లన్నీ హాయిగా ప్రశాంతంగా శ్వాస తీసుకునే వేళ మన అడుగుల శబ్దాలతో వాటి ప్రశాంతతకి భంగం కలిగిస్తున్నామేమో అని ఓ పక్క సంకోచం...ఇన్ని పరిమళాల మధ్య నడిచే అదృష్టానికి మరో పక్క ఆనందం. ఓ గంట పోయాక వెళితే ఆ చెట్లు..పూలు అన్నీ అక్కడే ఉంటాయి..వాటి పరిమళాలు మాత్రం ఉండవు.

 ఆ సమయంలో కాకుల అరుపులు కూడా ఎంత శ్రవాణానందంగా ఉంటాయో! సరిగ్గా 4:45 కి ఓ చెట్టు మీద కాకులు అరిస్తే 5 గంటలకి మరో చెట్టు మీదవి కావు కావుమని మనకి స్వాగతం పలుకుతుంటాయి.  వాటి తొలి అరుపులకి రోజూ ఒకటే సమయం.. ఎంత సమయపాలనో .... భలే ముచ్చటేస్తుంది

మా కాలనీలో కోళ్ళు కూడ ఉన్నాయి.  ఐదు గంటలకల్లా తొలి కోడి కూస్తే 5:30 కి మలి కోడి కూస్తుంది.  నేనయితే టైమెంతయ్యిందో వీటి అరుపులని బట్టే చెప్తా.  చిన్నప్పుడు మా నాయనమ్మ చుక్కని చూసి టైము చెప్పేది.  ఇప్పుడు నేను కోడి అరుపులు..కాకి అరుపులు బట్టి టైము చెప్తున్నా:)

ఇంటికి తిరిగివచ్చాక ప్రాణాయామం చేసుకున్నంతసేపూ ఆ పూల పరిమళాలే నా చుట్టూ పరిభ్రమిస్తుంటాయి..అందుకే ఉదయపు నడకంటే నాకంత ఇష్టం.

నడకలందు ఏ నడక మేలయ్యా అంటే నా ఓటు ఉదయపు నడకకే!

Read more...

March 4, 2011

రాజకీయ చదరంగం---పిల్లల పరీక్షలకి ఎసరు

మార్చి 10 హైదరాబాదు దిగ్భంధనం అని TRS ఏ ఎత్తుగడతో పిలుపునిచ్చిందో కాని అదొక మతిలేని చిత్తశుద్ధి లేని ఎత్తుగడ.  ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలంటే ఇంకా  చాలా మార్గాలున్నాయి...పోయి పోయి అభం శుభం తెలియని పిల్లల మీదా తమ ప్రతాపం.  ఉస్మానియాలో పిల్లలకి తెలంగాణా వచ్చేదాకా తరగతులు... పరీక్షలు అక్కర్లేదని ఇక మిగతావాళ్లకి కూడ అక్కర్లేదు అనటానికి వీళ్లెవరు!

తను స్వయానా ఓ అధ్యాపకుడు అయిన కోదండరాం గారి మాటలు వింటుంటే నవ్వాలో ఏడవాలో కూడా తెలియటంల.  ఈ దిగ్భంధనం మార్చి 10 న అని ఎప్పుడో నిర్ణయం జరిగిపోయింది అందుకని ఇక దానిని మార్చటం కుదరదు ఇంటరు పరీక్షే వాయిదా వేసుకోండి అని బహు తేలికగా సెలవిచ్చారు ఈ ప్రొఫెసరు గారు.  అంతకు ఒక్క రోజు ముందరే ఇంటరు పరీక్షలకి ఆటంకం లేకుండా మార్చి 10 న జరపతలపెట్టిన దిగ్భంధనాన్ని  గురించి ఆలోచిస్తున్నాం అని ఆయనే సెలవిచ్చారు..మరి ఒక్కరోజులో ఏ రాజకీయ సమీకరణలు మారాయో మరి ఈయన మాటలు కూడా మారిపోయాయి.

ఇంటరు పరీక్షల టైం టేబుల్ రెండు నెలలముందే విడుదల చేసారు.  మరి తెలిసి తెలిసీ ఆ రోజే ఈ నిరసన కార్యక్రమం పెట్టటం వెనుక ఉన్న రాజకీయం చిన్న పిల్లలకి కూడా అర్థం అవుతుంది...నిజంగా వీళ్లకి ఉద్యమం పట్ల కాని అభం శుభం తెలియని చదువుకునే విద్యార్థుల పట్ల కాని ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా 10 న ఈ కార్యక్రమం పెట్టి ఉండేవాళ్లే కాదు.  ఒకవేళ పెట్టినా పిల్లలు పరీక్షలకి వెళ్ళటానికి ఎలాంటి ఆటంకం కలిగించం పరీక్ష నిర్వహించుకోండి అని అని ఉండుంటే వాళ్ళ ఉద్యమానికి.... ఈ నిరసనకి  గౌరవం దక్కేది..

ఇంటరు విద్యార్థులు ఇంటరు పరీక్షల తరువాత ఎన్ని పోటీ పరీక్షలు వ్రాస్తారో వీళ్లకి తెలుసు..ఒక్క పరీక్ష అటూ ఇటూ అయినా ఇప్పుడు ఉన్న పోటీ ప్రపంచంలో పిల్లలు ఎంత మానసిక ఆందోళనకి గురవుతారో వీళ్లకి తెలియనిదా? అందులోనూ 10 న ఇంటరు ద్వితీయ సంవత్సరం పిల్లలకి పరీక్ష. అది రద్దుచేసి ఇంకొక రోజు పెట్టటమంటే అంత తేలిక కాదు.   ఎంతోమంది పిల్లలు అహోరాత్రులు కష్టపడి తమ జీవితలక్ష్యంగా చదివే IIT పరీక్ష ఏప్రియల్ 10 నే! ఇప్పటికే ఇంటరు పరీక్షలు అయ్యాక మధ్యలో సమయం తక్కువ ఉంది అనుకుంటుంటే మళ్లీ ఇది ఒకటి!

ఇంకొక తెలంగాణా వాది అయితే అసలు ఎప్పుడూ మార్చి మూడవవారంలో మొదలయ్యే పరీక్షలు ఈ సారి తెలంగాణా ఉద్యమాన్ని దెబ్బ తీయటానికే ముందు పెట్టారు అని గగ్గోలు చేస్తున్నాడు! బట్టతలకి మోకాలుకి ముడిపెట్టటంలో వీరిన మించిన వారు లేరు మరి!  అసలు ఆయన పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారో! చాలామంది తెలంగాణా వారు  బందులతో గొడవలతో గత విద్యా సంవత్సరం తెలంగాణాలో ముఖ్యంగా హైదరాబాదులో కాలేజీలు సరిగ్గా జరగలేదని ఈ సంవత్సరం తమ పిల్లలని విజయవాడ గుంటూర్లలో చేర్చుకున్నారు! మరి అంత ముందుచూపు వాళ్లకి!

సరే మన చేతకాని ప్రభుత్వం వీళ్లకి భయపడి ఆ రోజు పరీక్ష ఇంకొక రోజుకి మారిస్తే మార్చొచ్చు..కానీ అదే రోజు CBSE, ICSE 10..11 తరగుతుల వాళ్లకి కూడా పరీక్షలు ఉన్నాయి..మరి వాటినేం చేస్తారు! ఎవరు వ్రాసినా వ్రాయకపోయినా వాళ్ళ పరీక్షలు అదే రోజు జరుగుతాయి..వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వెయ్యరు మరి!

ఇంటరు పరీక్ష ఉదయం 8 నుండి 11 గంటల వరకు కాబట్టి  ఇప్పటికయినా పరీక్షలు నిర్వహించటానికి ఎలాంటి ఆటంకం కలిగించం అని ఒక్క మాట చెప్తే చాలా గౌరవంగా ఉంటుంది.

Read more...

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP