పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

October 15, 2007

పిల్లలు-సెలవులు-ఇంటి పని

పిల్లలకి దసరా సెలవులు వచ్చేసాయి. అయినా ఇప్పటి పిల్లలకి ఏమి సెలవులులే, ఆ సెలవుల ఆనందం వాళ్ళకి ఉండటం లేదు. ఇచ్చేది వారం రోజులు, అందులో మళ్ళీ మూడు రోజులు ఎక్స్ట్రా క్లాసులు, అది కూడా ఫుల్ టైము, వాటికి తోడు సెలవు ఇంటి పని అదే హాలీడే హోంవర్కు. మొత్తానికి సెలవలకి అర్థాలే మార్చేస్తున్నారు. ఈ సెలవలనే కాదు, ఏ సెలవలైనా పిల్లలకి ఇదే బాధ, ముఖ్యంగా CBSE, ICSE సిలబస్ బళ్లలో. మామూలుగా త్రైమాసిక పరీక్షలు అయ్యాక దసరా సెలవులు, అర్థ సంవత్సర పరీక్షలు అయ్యాక సంక్రాంతి సెలవులు, వార్షిక పరీక్షలు అయ్యాక ఎండాకాలం సెలవులు ఉంటాయి. అసలు అలా పరీక్షలు అవగానే సెలవులు వస్తే ఆ ఆనందమే వేరు, మా పిల్లలు ఆ ఆనందాన్ని మిస్సు అవుతున్నారే అని నా బాధ!!! కానీ ఈ బళ్ళలో ఓ నెల ముందుగానే పరీక్షలు పెట్టేస్తారు, కొన్నాళ్ళు బడి జరిగాక అప్పుడు సెలవులు మొదలవుతాయి. ఇక సెలవు ఇంటి పని అని, ప్రాజెక్టు అని పిల్లల ప్రాణాలు తీస్తారు. పోనీ అవేమన్నా పనికొచ్చేవా అంటే అసలు అవి ఎందుకిచ్చారో వాళ్ళకే తెలియనట్లు ఉంటాయి. పిల్లలు ఏదో కష్టపడి చేసుకెళతారా ఒక్కోసారి వాటిని చూడను కూడా చూడరు. కొన్నిసార్లు సెలవులు అయిపోయి బళ్ళు తీసేటప్పటికి టీచర్సు మారిపోతారు, కొత్తవాళ్ళు వీటిని పట్టించుకోరు.

మా వాడికైతే సెలవులంటేనే విరక్తి వచ్చేసింది. ఏం సెలవులు లేమ్మా వారం రోజుల సెలవలికి పది రోజుల హోంవర్క్ ఇస్తారు అంటాడు. అటు ఆడుకోలేడు, ఇటు చదువుకోలేడు అన్నట్లు ఉంటుంది వాడి పరిస్థితి. సరే ఓ రెండు రోజులు కూర్చుని ఆ పనేదో అవచేసుకో రాదా అంటా, వద్దులే చివరిలో చేసుకుంటా అంటాడు, కానీ మనస్సులో ఈ హోంవర్కు భూతం భయపెడుతూనే ఉంటుంది. మరీ ఎండాకాలం సెలవులలో అయితే ఇంకా పాపం అనిపిస్తుంది. బండెడు పని ఇస్తారు. సెలవులు ఇవ్వగానే ఓ నెల రోజులు మా వూరు వెళ్ళిపోయి పిల్లలందరితో కలిసి హాయి హాయిగా సెలవులు గడిపేస్తారు, ఇక హైదరాబాదు బయలుదేరాలనేటప్పటికి ఈ పని దెయ్యం గుర్తుకొస్తుంది, ఇక వాళ్ళ అనందం అంతా హుష్ కాకి. అందులోనూ మిగాతా పిల్లలు ఎక్కువగా స్టేటు సిలబస్ వాళ్ళు వాళ్ళకి ఇలాంటి బాధలు ఏమీ ఉండవు కదా, ఇక వీళ్ళకి ఇంకా బాధగా ఉంటుంది.

మా వాడు తక్కువ వాడేం కాదు, సరే ఈ బాధంతా ఎందుకు హాయిగా స్టేటు సిలబస్ బడికి వెళ్ళరాదా అంటా!! అమ్మో ఇక్కడ ఒట్టి సెలవు ఇంటిపనితోనే కష్టాలు, అక్కడైతే రోజుకి 16 గంటలు చదవాలి, అది నా వల్ల కాదు అంటాడు.

ఆ మద్య శ్రీకృష్ణదేవరాయలు గారు మీరే మీ జిల్లా కలెక్టరయితే ఏం చేస్తారు అని అడిగారు!!!నేనైతే ముందుగా ఒకటి నుండి పదో తరగతి వరకు పుస్తకాలు, హోంవర్క్, పరీక్షలు లేని విద్యావ్యవస్థ ఏర్పాటు చేయటానికి ప్రయత్నిస్తాను.

Read more...

September 26, 2007

అందమైన అనుభవం

చాలారోజుల తరువాత ఇవాళ టి.వి. లో అందమైన అనుభవం సినిమా చూసాను. అప్పట్లో గొప్ప మ్యూజికల్ హిట్ ఈ సినిమా. కమలహాసన్, జయప్రద, రజనీకాంత్ ఇందులో ప్రధాన పాత్రలు. మాములుగానే నాకు అప్పట్లో కమలహాసన్ అంటే పిచ్చ అభిమానం. ఈ సినిమా పాటలు గూడ బాగుండటంతో ఎప్పుడు చూసినా ఈ పాటలే వింటూ వుండేదాన్ని. అన్నీ కంఠతా కూడా వచ్చేవి (అప్పట్లో). 1979లో విడుదలైందనుకుంటా ఈ సినిమా. ఎం.ఎస్ విశ్వనాథన్ సంగీతం. బాలు, సుశీల, జానకి, ఎల్.అర్.ఈశ్వరి పాడారు. ఇందులో "అందమైన అనుభవం" అని ఒక పాట ఉంటుంది. ఈ వాక్యం తప్పితే మిగతా పాట అంతా హమ్మింగే, బాగుంటుంది. ఆ సంవత్సరమే కమలహాసన్ ది సొమ్మొకడిది సోకొకడిది సినిమా కూడ వచ్చింది, అందులో కూడా పాటలు బాగుంటాయి.

ఈ సినిమాలో రజనీకాంత్ ది అంత ప్రాధాన్యత లేని పాత్ర అయినా గుర్తుండిపోతుంది. ఇందులో తన ఊతపదం శివశంభో. జయప్రద మాత్రం ఈ సినిమాలో తను మాములుగా కనిపించేంత అందంగా కనిపించదు. బహుశా హేరుస్టైలు, డ్రెస్సు కారణం కావచ్చు. చివర్లో తన డైలాగు----"చావు కూడా ఒక అందమైన అనుభవమే" అప్పట్లో అర్థం కాలేదు కానీ ఇప్పుడు నిజమే కదా అనిపిస్తుంది. పాటలు మాత్రం అన్నీ ఆణిముత్యాలు అనవచ్చు (నా వరకు).

కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు.. వెర్రెక్కి ఉన్నోళ్ళు....ఈ పాట అప్పట్లో మంచి పాపులర్ పాట. ఇంకా ఇందులో హలో నేస్తం బాగున్నావా, నువ్వే నువ్వమ్మా నవ్వుల పువ్వమ్మా, శంభో శివశంభో, ఆనంద తాండవమే పాటలు కూడా చాలా బాగుంటాయి.

మొన్నీ మద్య హాపీడేసు పాటలు వింటుంటే అందులో సాయోనార అని ఒక పాట వస్తుంది, అది విని ఈ సినిమాలోని సాయొనారా పాటని తలుచుకున్నాను, అంతలోనే ఈ రోజు తేజ వాడు సినిమానే వేసాడు.

అన్నట్లు నిన్ననే చందమామ సినిమాలోని పాటలు శ్రద్దగా విన్నాను, అన్నీ బాగానే అనిపించాయి, పర్వాలేదు. కానీ పంటి కింద రాళ్లలాగా అక్కడక్కడ తెలుగు ఉచ్చారణా దోషాలు. ముఖ్యంగా "నాలో ఊహలకు నాలో ఊసులుకు అడుగులు నేర్పావు" పాట పాడిన గాయనీమణి ఎవరో తెలియదు కానీ నేర్పావు అన్న మాటలో పావుని పావుకిలో లో పావులా ఉచ్చరిస్తుంటే చెవులలో సీసం పోసుకోవాలినిపించింది. మరీ భాషని ఇంతలా చావగొట్టాలా అనిపించింది!!!!!

Read more...

September 3, 2007

మనుష్యులు-మనస్తత్వాలు

ఓ మనిషి ముఖకవళికలు, మాటతీరు, నడక, ఓ గంట పరిశీలిస్తే చాలు ఆ మనిషి స్వభావం ఎలాంటిదో చాలావరకు చెప్పవచ్చు. దీనికి కావలిసింది కాస్తంత పరిశీలనా దృష్టి అంతే. మనం చేసే ప్రతి పని మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. కూర్చునే విధానం, నిలబడే విధానం, నడిచే విధానం, కాళ్ళు చేతులు ఆడించటం, ముఖం చిట్లించటం, ముక్కు చిట్లించటం, తల గోక్కోవటం, నొసలు ముడివేయటం, చేతులమద్య ముఖం పెట్టుకోవటం, గడ్డం కింద చేయి పెట్టుకు కూర్చోవటం, తల ఓ పక్కకో, ముందుకో, వెనక్కో వేలాడేసి కూర్చోవటం, పిడికిళ్ళు బిగించుకుని కూర్చోవటం, బుగ్గమీద చూపుడు వేలు పెట్టుకోవటం, చూపుడు వేలుతో ముక్కు రుద్దుకోవటం, వాలిపోయిన భుజాలు, నిఠారు భుజాలు, ఒక పక్కకి ఒంగిపోయిన భుజాలు, గాలి పీల్చే విధానం, ఇలా మన ప్రతి పని, ప్రతి కదలిక మన వ్యక్తిత్వాన్ని ఎదుటి వాళ్ళకి పట్టిస్తాయి. ఇవి మనం అందరం అసంకల్పితంగా చేసేవే.

నాకు డిగ్రీలో ఉన్నప్పటినుండి సైకాలజీ ఒక అంశంగా చదవటం మూలానగానీ ఎందుకైనా గానీ ఎవరైనా కొత్త వ్యక్తులు తారసపడితే వాళ్ళని పరిశీలించటం ఒక అలవాటు అయిపోయింది. అలవాటు కాదేమో అబ్సెషన్ అనవచ్చేమో!! చాలామందికి ఈ అలవాటు ఉండే ఉంటుంది. రైల్వే స్టేషన్, బస్టాండ్, మార్కెట్, ఆసుపత్రి, ఎక్కడికి వెళ్ళినా, రైలులో ప్రయాణిస్తున్నా, బస్సులో ప్రయాణిస్తున్నా,ఏం చేస్తున్నా అదే పని. ఆ పరిశీలనలో ఎన్ని అనుభవాలో. కొంతమందిని చూడగానే ఒక విధమైన స్నేహభావం కలుగుతుంది, ఇంకొంతమందిని చూస్తే అబ్బ వీళ్ళని వీళ్ళ కుటుంబసభ్యులు ఎలా భరిస్తున్నారా అనిపిస్తుంది. రకరకాల మనుషులు, రకరకాల మనస్తత్వాలు. అందరిలోకి 60 పైబడ్డ వాళ్ళని చూడటం, వాళ్ళు జీవితం ఎలా గడుపుతున్నారో ఒక అంచనా వేయటం నాకు చాలా ఇష్టంగా వుంటుంది. అంతే కాదు వాళ్ళతో నన్ను నేను పోల్చుకుంటూ ఉంటాను. మనం ఆ వయస్సు వచ్చే వరకు ఉంటే ఎలా ఉంటామా అని ఊహించుకుంటూ ఉంటాను. ముఖ్యంగా రైలు ప్రయాణంలో ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. ప్రయాణంలో ఇది ఓ మంచి కాలక్షేపం కూడా. ఎవరైనా కొత్త వ్యక్తితో పరిచయం అయినప్పుడు కూడా ఎక్కువగా వాళ్ళ ప్రవర్తన మీదే దృష్టి పెడతాను. ముఖ్యంగా మొదటసారిగా ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఈ పరిశీలన చాలా ఉపయోగపడుతుంది. నేను చెప్పేది శ్రద్దగా వింటున్నాడా లేదా? నా కళ్ళలోకి కళ్ళు పెట్టి మాట్లాడుతున్నాడా లేదా? నాతో మాట్లేడటప్పుడు ముఖకవళికలు ఎలా ఉంటున్నాయి? ఇవన్నీ గమనిస్తూ వుంటాను---మొదటిసారితోనే అర్థం అయిపోతుంది ఆ డాక్టర్ దగ్గరికి మనం మరలా వెళ్ళవచ్చా లేదా అన్నది.

ఒక్కోసారి ఎదుటి వాళ్ళ ముఖ తీరు, కళ్ళు, నడక, మాట తీరుల్ని బట్టి వాళ్ళని జంతువులతో పోల్చుకుంటూ ఉంటాను. నాకు నేనుగా ఏర్పరుచుకున్న కొన్ని అన్వయాలు.

1. గంభీరమైన ముఖం, బిగుసుకున్న దవడకండరం, తీక్షణమైన చూపు, వేగవంతమైన కదలికలు, అప్రమత్తత, రాజసం ఉట్టిపడే నడక-----పులి.
2. గంభీరమైన ఆకారం, కంచు కంఠం, బద్దకంగా వుండే చూపు, భారమైన నడక, ప్రతిదానికి ఇతరుల మీద అధారపడటం---సింహం.
3. సొగసైన గంభీరమైన ఆకారం, చురుక్కుమనిపించే చూపులు, వేగవంతమైన కదలికలు, బహు అప్రమత్తత----చిరుత.
4. గంభీరమైన భారీ ఆకారం, భీకరమైన కంఠం, మంద్రమైన సొగసైన నడక----ఏనుగు.
5. ఎప్పుడూ మాట్లాడే నోరు, వేగం, విశ్వాసమైన చూపులు, తీక్షణమైన పరిశీలన---కుక్క.
6. అప్రమత్తత, తత్తరపడే అరమోడ్పు కళ్ళు, క్లుప్తమైన మాటలు, నాజూకుతనంతో కూడిన వేగం----లేడి.
7. అతి వినయం, కీచు గొంతు, దొంగచూపులు, డొంకతిరుగుడు మాటలు---నక్క.
8. చిన్న అకారం, ముట్టుకుంటే కందిపోయేటంత నాజూకుతనం, చిన్ని స్వరం---కుందేలు.
9. దొంగచూపులు, పక్క చూపులు, నిలకడ లేని మాట, కీచు గొంతు-----పిల్లి.
10. బక్కచిక్కిన అకారం, నొసలు చిట్లిస్తూ, పళ్ళికిలిస్తూ మాట్లాడటం, అనవసరమైన హావభావాల ప్రదర్శన----కోతి.
11. బుల్లి ఆకారం, అతి నాజుకుతనం, శ్రావ్యమైన గొంతు, సుతిమెత్తని నడక----చిలుక.
12. మొరటు ఆకారం, మొద్దు మాట---మొసలి.
13. లొడలొడా వాగుడు, మాట్లాడేటప్పుడు కళ్ళు మూయటం---కాకి.

ఇది నేను సరదాగా ఓ కాలక్షేపంగా చేసేది. మీరూ ఆలోచిస్తూ ఉంటే మీకూ ఇలాంటివి తడుతుంటాయి కానీ జాగ్రత్త పైకి చెప్పకండి......

Read more...

August 31, 2007

వినాయకుడికి పల్లేరు కాయల గారెలు

చిన్నప్పుడు అన్ని పండగలలోకి శ్రీరామనవమి అన్నా వినాయకచవితి అన్నా నాకు చాలా ఇష్టంగా ఉండేవి. శ్రీరామనవమి ఊరివాళ్ళు అందరూ కలిసి చాలా వేడుకగా చేసేవాళ్ళు. రాముల వారి కళ్యాణం అయ్యాక పెట్టే వడపప్పు పానకం ఎంత రుచిగా ఉండేవో. పానకం గ్లాసులు గ్లాసులు తాగేవాళ్ళం. ఇక వినాయకచవితి అయితే చెప్పక్కర్లేదు, అసలైన పిల్లల పండగ. పండగ హడావిడి అంతా పిల్లలదే. పత్రి తెచ్చి పూజ చేయటం దగ్గరినుండి వరసైన వాళ్ళ పక్కల మీద పల్లేరు కాయలు పోయటం, దురదగుండు ఆకు రుద్దటం వరకు అంతా మాదే హడావిడి, ఇక ఆ రోజు అంతా సందడే సందడి.

పండగ ముందు రోజు అన్నయ్య వాళ్ళతో పాటు చెట్ల వెంట పుట్ల వెంట తిరిగి పత్రి సేకరించటం, అన్నయ్య వాళ్ళు చెరువులో కలువ పూవులు, తామర పూవులు కోస్తుంటే ఒడ్డు నుండి అదుగో అక్కడ ఇంకోటి ఉంది, ఇక్కడ ఇంకోటి ఉంది, ఇంకా కావాలి అంటూ ఆజ్ఞలు జారీ చేయటం, పండగ రోజు తెల్లవారుజామునే అన్నయ్య మరలా పత్రికి గుడుల వెంట వెళుతుంటే అన్నాయి వెలగ కాయలు ఎక్కువ తీసుకురా అని చెప్పేదాన్ని, ఎందుకో అవంటే బాగా ఇష్టంగా ఉండేది. పొద్దున్నే లేచి దేవుడిని, పీటల్ని అలంకరించటం చాలా సరదాగా ఉండేది. మట్టి వినాయకుడిని మా ఇంటి పక్క ఆయన చేసిపెట్టే వాళ్ళు. అయన బొమ్మ తెచ్చి ఇస్తే మా అమ్మ ఆయనికి చేట నిండా బియ్యం, కూరగాయలు, డబ్బులు ఇచ్చేది. ఎందుకమ్మా అలా ఇవ్వటం, ఆ బొమ్మేదో మేమే చేస్తాం కదా అంటే అలా ఇస్తే మంచిది అని చెప్పేది.

మా ఇంట్లో ఎప్పుడూ మా అమ్మే కథ చదివేది. ఎప్పుడెప్పుడు కథ అయిపోతుందా అని కాసుకు కూర్చునే వాళ్ళం. పూజ అయ్యే వరకు ఆ రోజు ఏమీ పెట్టేది కాదు. అమ్మ కథ చదువుతుంటే మేము పత్రితో పూజ చేసేవాళ్ళం. అమ్మ చదివే దళాలు (ఆకులు) ఏరి ఏరి మరీ వాటితో పూజ చేసేవాళ్ళం. ఏవైనా లేకపోతే అమ్మా ఈ ఆకులు లేవు ఎలా అనే వాళ్ళం. ఏం పర్లేదు ఉన్నవాటితో పూజ చేయండి చాలు అని చెప్పేది. పూజ అవగానే ఆ పత్రితో చేతులకి తోరణాలు కట్టుకోవటం నాకు భలే ఇష్టంగా ఉండేది. ఎవరైనా పిల్లలకి వాళ్ళ ఇంట్లో పండగ చేసుకోవటం వీలు కాకపోతే వాళ్ళూ కూడా మా ఇంటికే వచ్చేవాళ్ళు, మాతో పాటే భోజనం కూడా చేసే వాళ్ళు. ఎప్పుడెప్పుడు ఈ భోజన కార్యక్రమం అయిపోతుందా ఎప్పుడు మా కార్యక్రమాలకి బయటపడదామా అని చూసేవాళ్ళం.

వినాయకచవితికి వారం ముందు నుండే మా అస్త్రాలన్నీ (పల్లేరు కాయలు, దురదగుండు ఆకు, గట్రా గట్రా) సిద్దం చేసుకునేవాళ్ళం. ఇక భోజనాలు అయ్యాక కనపడ్డ వరసైన వాళ్ళందరికి దురదగుండు ఆకు రుద్దటం, మంచాలమీద పల్లేరుకాయలు పోయటం, నానా అల్లరి చేసేవాళ్ళం. మా ఊరిలో ఒక ఆమె అంటే మా పిల్లలు ఎవరికి పడేది కాదు. వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఎక్కడా పిల్లలిని ఆడుకోనిచ్చేది కాదు ఆవిడ. వాళ్ళ పిల్లలిని మాతో ఆడుకోను కూడా పంపేది కాదు. ఒకసారి వినాయకచవితికి ఎట్లాగైనా ఆమె మీద ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాము. మా ఇంటిలో పూజ అవగానే వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వంటింటి కిటికీలో నుండి తొంగి చూసాము, ఇంకా పూజ అయినట్లు లేదు, కథ వినపడుతుంది. ఎదురుగా కిటికీలో నుండి గ్యాసు పొయ్యి పక్కనే గారెల పిండి గిన్నె కనపడింది. ఇక చకా చకా గుప్పెడు చిన్న చిన్న పల్లేరు కాయలు ఏరి ఆ పిండిలో కలిపేసి ఇక వెనక్కి చూడకుండా ఒకటే పరుగు.

ఇక ఒక గంట తరువాత చూడాలి, ఆమె ఊరంతా వినపడేలా ఊళ్ళో పిల్లలందరిని కలిపి ఒకటే తిట్లు. దేవుడితో పాటు మాకూ (అదే పిల్లలకి) అష్టోత్తర సహస్ర నామావళి చదివేసింది. ఇటు చూస్తే మాకు కడుపు ఉబ్బరం ఆగటం లేదు. ఆ పని మేమే చేసాం అని చెపితే ఇంట్లో బడిత పూజే, చెప్పకపోతే ఆ పని చేసిన గొప్పతనం మాకు దక్కదే? ఎట్లా? మొత్తానికి ఆ పని చేసిన మా నలుగురికి తప్పితే అది మేమే చేసినట్లు చాలా రోజులు ఎవరికి చెప్పలేదు!!!అలా ఆ వినాయకచవితికి లంబోదరుడిచేత కొత్తరకం గారెలు తినిపించాము.

Read more...

August 20, 2007

స్వగతం---చాలా రోజుల తరువాత

చాలా రోజులయ్యింది బ్లాగులోకంలోకి అడుగుపెట్టి. ఈ మధ్య నా ఆరోగ్యరీత్యా బ్లాగులకు పూర్తిగా దూరంగా ఉంటున్నాను. రాయటానికి అశక్తత, చదవటానికి ఉదాసీనత, వెరసి అసలు కంప్యూటరు ముందుకే రావటం మానేసాను. ఇంకొక మూడు నెలలు పూర్తి విశ్రాంతి, ఆ తరువాత మరలా మామూలు. ఈ మధ్యే మరలా అప్పుడప్పుడు కాస్త బ్లాగులు చదువుతున్నాను. కొత్త బ్లాగులు చాలా వచ్చేసినట్లునాయి, కానీ రాసి పెరిగినంతగా వాసి పెరిగినట్లుగా అనిపించటంలేదు. పాత వాటిని చదవటానికి వుండే ఆతృత వీటిని చదవటానికి ఉండటంలేదు. కొన్ని బ్లాగులు ఉన్నాయి, అవి చదవకపోతె ఏదో మిస్సు అయిన ఫీలింగు కలుగుతుంది.
అవే వీవెనుడు అడిగిన అత్యుత్తమ బ్లాగులకి నా సమాధానం.
అంతరంగం
విహారి
కొత్తపాళీ
సాలభంజికలు (గురువు గారు ఈ మధ్య ఏమి రాస్తున్నట్లు లేరు)
సత్యశోధన
శోధన
రాకేశ్వరరావు
శ్రీరాం-సంగతులూ సందర్భాలూ
రానారే
సౌమ్య
తెలుగునేల
గుండె చప్పుడు
కలగూరగంప
రెండు రెళ్ళు ఆరు
అవీ-ఇవీ
వీవెనుడి టెక్కునిక్కులు
చదువరి
రమ-మనలో మన మాట
శ్రీకృష్ణదేవరాయలు(ఈ మధ్య అసలు కనపడటంలేదు మరి)
తెలుగు జాతీయవాది
వైజా సత్య
ఒరెమూనా
రెండు రెళ్ళు ఆరు
నా మదిలో
ఓనమాలు
పడమటి గోదావరి రాగం.

నాకు బాగా నచ్చినవి ఇక్కడ ఇస్తున్నాను. ఇంకా నచ్చినవి కొన్ని ఉన్నాయి, కానీ సత్యసాయి గారు చెప్పినట్లు పరిమితి లేకపోతే కష్టం.

Read more...

June 15, 2007

ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్స్--ప్రథమ భాగం హైదరాబాదు లో


ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్స్--ప్రథమ భాగం 5 లేక 6 రోజుల కాలంలో మొత్తం 24 గంటల కాల వ్యవధి వుండే కోర్స్. ఇది చాలా తేలికైనది మరియు ఆధ్యాత్మిక లౌకిక విజ్ఞాన్ని అందిస్తూ, ధ్యానం, పరస్పర సంభాషణలతో దివ్యానుభూతుల్ని చేకూరుస్తుంది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్స్ లో ఇది తొలి మెట్టు. ఇందులో శరీరంలోని చెడు పదార్థాలు (toxins), ఎప్పటినుండో పాతుకునిపోయిన శారీరక, మానసిక అవరోధాలు తొలిగిపోతాయి. శ్వాస క్రమబద్ధీకరణ వల్ల శరీరం, మనసు ఏకలయ స్థితిని సాధిస్తాయి.

Art of Living Part 1 Course for HARMONY in HYDERABAD

ఇప్పుడు హైదరాబాదులో మొదటి సారిగా 1000 కి మందికి పైగా పాల్గుంటున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్స్--ప్రథమ భాగం జూన్ 26 నుండి జరగబోతుంది. ఆసక్తి ఉన్నవాళ్ళు కింది ఫోను నంబర్లలో సంప్రదించవచ్చును.

ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్స్--ప్రథమ భాగం
జరుగు తేదీలు: జూన్ 26, 2007 నుండి జులై 1, 2007 వరకు.
వేదిక: గ్రీన్ పార్క్ ఫంక్షన్ హాలు (Green Park Function Hall), జూబ్లీ హిల్స్, మాదాపూర్ రోడ్.
సమయం: మంగళవారం (26/06/07) నుండి శుక్రవారం (29/06/07)వరకు ఉదయం 5:30 నుండి 8:00 వరకు.
శని (30/06/07)మరియు ఆదివారాలలో (01/07/07) ఉదయం 5:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు
సంప్రదించవలసిన ఫోను నంబర్లు:
సెల్: 9848306180, 9849895295
భూమి ఫోను: 040-23400782, 65218418

Read more...

ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్స్--సుదర్శన క్రియ


ఆర్ట్ ఆఫ్ లివింగ్ పౌండేషన్ మరియు ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ హూమన్ వాల్యూస్ (జెనీవా) వ్యవస్థాపకుడు శ్రీ శ్రీ రవిశంకర్ అభివృద్దిపరచిన శ్వాసప్రక్రియ సుదర్శన క్రియ. ఇది ఓ అసమాన శ్వాసక్రియానైపుణ్యం. ఈ క్రియ వల్ల ఆనందం, నిర్విచారం, ప్రశాంత చిత్తం, శారీరక ఆరోగ్యం లభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 106 దేశాలలో రెండు కోట్లకి పైగా వ్యక్తులు ఈ ప్రక్రియ ద్వారా తమ జీవితాలలో నూతనోత్సాహంతో ఉన్నత పరిణామస్థాయిని సాధించారు. శ్వాసక్రియ లోని రహస్యం సాధన ద్వారానే తెలుస్తుంది.

సుదర్శన క్రియా ఫలితాలు:--

* ఒత్తిడిని పెంచే హార్మోనుల తగ్గుదల.
* రక్తంలో లాక్టేట్ స్థాయి తగ్గుదల.
* చెడు కొలస్త్రాల్ (L.D.L) తగ్గుదల, మంచి కొలెస్ట్రాల్ (H.D.L) పెరుగుదల.
* యాంటీ ఆక్సిడెంట్ ఎంజైము స్థాయి పెరుగుదల.
* రోగ నిరోధక శక్తి బలపడుట.
* మానసిక బలహీనత, ఒత్తిడుల నుంచి విముక్తి.

ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురించి జూన్ 10, ఈనాడు ఆదివారం పుస్తకం లో వచ్చిన వ్యాసం ఒక్కసారి ఇక్కడ చూడండి.

Read more...

June 7, 2007

తెలుగు కథకి జేజే 1

"తెలుగు కథకి జేజే" అన్న పుస్తకం 78 కథల సంకలనం. ప్రచురించింది అభినవ ప్రచురణలు, తిరుపతి వారు. వెల 300 రూపాయలు. సంకలనకర్త సాకం నాగరాజు గారు. ఆయన శ్రీకాకుళం డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకులు.
ఇందులో శ్రీ శ్రీ, చలం, దేవులపల్లి నుండి బాపు వరకు తెలుగులో అతిరథమహారథులన్నదగ్గ వారి కథలు ఉన్నాయి. కొందరివి లేవు కూడా!!ఈ పుస్తకం ఏకబిగిన చదవగలిగేది కాదు. ఒక్కొకళ్ళది ఒక్కో శైలి, అందుకే ఆగి ఆగి నిదానంగా ఒక్కో కథ చదువుకోవాలి. నేను కూడా ఇంకా అన్నీ చదవలేదు, కానీ కొన్ని కథలు అంత గొప్పగా లేవు (నాకు). ఎక్కువగా చిన్న కథలే. నేను చదివినవాటిని చదివినట్లు నా వీలువెంబడి సమీక్షిస్తూ ఉంటాను.

అట్లపిండి:- చలం. ఈ కథ చదువుతుంటే అసలు ఇది చలం రాసిందేనా అన్న అనుమానం వస్తుంది. ఆయన సాధారణ శైలికి భిన్నంగా వుంటుంది. కథావస్తువు చాలా చిన్నదే కానీ చెప్పిన విధానం బాగుంటుంది. వాళ్ళ నాయనమ్మ (అట్ల బామ్మ) ఒకావిడ అట్లు చాలా బాగా వండేది. కానీ పిండి recipe ఎవరికి తెలియదు, అడిగినా చెప్పేది కాదు. ఒకసారి ఆయన చెల్లెలు గర్భిణీతో వుండి బామ్మ అట్లు తినాలని ఉందని ఉత్తరం రాస్తుంది. బామ్మ పిండి కలిపి ఒక పెద్ద సత్తెపాళలో (సత్తు తపాళా) పోసి గుడ్డ వాసిన కట్టి ఈయనకు ఇస్తుంది తెసుకెళ్ళమని. నేను మరునాడు వస్తాను నేను వచ్చేవరకు ఆ పిండి మూట విప్పొద్దు అని చెపుతుంది. ఇక ఈయన రాజమండ్రికి రైలులో బయలుదేరతాడు. ఈయన ఎక్కిన దగ్గరనుండి ఆ కంపార్టుమెంటు నుండి ఒక్కొకళ్ళు దిగి వెళ్ళిపోతుంటారు ఈ పిండి వాసనకి. చివరికి ఆ కంపార్టుమెంటులో ఈయన ఒక్కడే మిగులుతాడు. ఆ తరువాత ట్రైను దిగిన తరువాత ఆ పిండి మూట పట్టుకుని ఇంటికి వెళ్ళటానికి రిక్షా వాళ్ళతో పడ్డ పాట్లు మనకు నవ్వు తెప్పిస్తాయి. మరునాడు వస్తానన్న బామ్మ రాదు. నాలుగు రోజులు అయినా రాదు. ఇక ఆ పిండిని వదిలించుకోవటానికి వీళ్ళు పడ్డ పాట్లు, చుట్టుపక్కల వాళ్ళతో తంటాలు , గోదావరిలో వేసినా, శ్మశానంలో పూడ్చి పెట్టినా అది తిరిగి వీళ్ళింటికే రావటం, చివరికి అనంతపురంలో వీళ్ళు బాకీ ఉన్న ఒకాయనకి పిండిని పోస్టులో పంపించటం, ఈ పిండి వాసన దెబ్బకి అక్కడ ప్లేగు వ్యాది మొదలవటం ఇదీ కథ. సునిశితమైన హాస్యం ఉన్న కథ. చలం శైలికి భిన్నంగా ఉండటానేమో నాకు నచ్చింది.

అడల్ట్ స్టోరీ:-కె.ఎన్.వై. పతంజలి. విషయం లేని కథ. క్లుప్తంగా చెప్పాలంటే నిరోద్ వాడటం మీద భార్యా భర్తలకి మద్య జరిగే సంభాషణ ఈ కథ. ఇంతకు మించి దీన్ని గురించి చెప్పటానికి ఏమీ లేదు. పతంజలి స్థాయికి తగ్గట్లుగా లేదు.

అర్రు కడిగిన ఎద్దు:-త్రిపురనేని గోపిచంద్. ఓ మంచి కథ. ఇది ఓ ముసలి ఎద్దు స్వగతం. వయసులో వుండగా తనని యజమాని ఎలా చూసేవాడో, ఇప్పుడు ఎలా చూస్తున్నాడో చెప్పుకునే కథ. ఆ ముసలి ఎద్దునే కాదు, ఆ ఇంటి యజమాని తండ్రి అయిన ముసలతని గురించి కూడా చెప్పే కథ ఇది. ఇద్దరికి పోలికలు చూపిస్తాడు రచయిత. మిగతా పశువులు తినగా మిగిలిపోయిన జనపమోళ్ళు, ఎండుగడ్డి ముసలి ఎద్దుకి పెడితే, ఇంట్లో వాళ్లందరూ తిన్నాక మిగిలిన అడుగు బొడుగు అన్నం ముసలాయనికి పెడుతుంటారు. ఈ ముసలి ఎద్దు, ఆ ముసలాయన అప్పుడప్పుడూ ఒకళ్ళని ఒకళ్ళు ఓదార్చుకుంటుంటారు. ఒకప్పుడు రైతులు పశువులిని ఎంత ప్రేమగా చూసుకునేవాళ్ళు, ఇప్పుడు ఎలా చూస్తున్నారో చెపుతూ అంతర్లీనంగా మానవ సంబంధాలు రోజు రోజుకి ఎలా మార్పు చెందుతున్నాయో చెప్పే కథ ఇది.

ఈ కథ చదువుతుంటే మా బోడెద్దు గుర్తుకొచ్చింది. మా చిన్నప్పుడు మాకు ఓ బోడెద్దు వుండేది. దానికి కొమ్ములు వుండేవి కావు, అందుకని దాన్ని బోడెద్దు అనేవాళ్ళం. అది పుట్టటం కూడ మా దొడ్లోనే పుట్టింది. చాలా సాత్వికంగా వుండేది. ఎవరిని ఏం అనేది కాదు. దానికి జత ఓ కోడెద్దు. మంచి పొగరుగా, హుషారుగా వుండేదని దానిని కోడెద్దు అనేవాళ్ళం. అలవాటు అయిన వాళ్ళని తప్పితే కొత్త వాళ్ళని అసలు దగ్గరికే రానిచ్చేది కాదు. ఈ రెండిటిని కట్టుకొని టైరు బండి మీద పోవటమంటే మాకు చాలా ఇష్టంగా వుండేది. సినిమాలకి కూడా బండి మీదే వెళ్ళేవాళ్ళం. బోడెద్దు బాగా ముసల్ది అయినా ఓపికగానే ఉండేది. ఇక అది బండికి కట్టటానికి పనికిరాదనుకున్నాక ఇంకో ఎద్దుని కొన్నా దీనిని అలానే ఉంచుకున్నాము. మా అందరికి అదంటే చాలా ఇష్టంగా వుండేది. మా నాయనమ్మకి మరీ. జీతగాళ్ళు దానికి కుడితి అదీ సరిగ్గా పెట్టరేమోనని ఆవిడే పెట్టేది. అది చనిపోయినాక బండి మీద తీసుకు వెళ్ళి మా పొలంలో మా తాతమ్మ సమాధి పక్కనే దాన్ని కూడా పాతి పెట్టారు. మా నాయనమ్మ అయితే దాన్ని తీసుకువెళ్ళేటప్పుడు ఏడ్చేసింది కూడా. తరువాత తరువాత ఎడ్లూ, గొడ్లూ అన్నీ పోయి ఇప్పుడు బోడి చావిళ్ళు మిగిలాయి. ఈ కథ చదివాక అవన్నీ గుర్తుకొచ్చి కళ్ళ వెంట నీళ్ళు తిరిగాయి.

అవ్వ తిరునాళ్లలో తప్పిపోయింది:-దేవులపల్లి కృష్ణశాస్త్రి. భావకవి కృష్ణశాస్త్రి గారి కథ ఇది. భావకవిలో హాస్యపాలు కూడా ఎక్కువే అనిపించిన కథ. చదవవలిసిన కథ.
ఓ సుబ్బమ్మవ్వ గురించి ఈ కథ. మన తెలుగు నాట ప్రతి ఊళ్ళో చూసే అవ్వే ఈ సుబ్బమ్మవ్వ. ఈ కథలో ప్రతి పదంలో హాస్యం తొంగి చూస్తూ వుంటుంది. కొన్ని పద ప్రయోగాలు గమ్మత్తుగా వుంటాయి. ఉదాహరణకి-"మా నాన్న మేనత్తంటే డెబ్భై పైమాట గదా. అయితేం నడుం నిటాగ్గ కదురులా నిలబెడుతుంది. యిష్టం లేనప్పుడు మాత్రం తెలుగులో ఐ అక్షరం లేదూ ఐ దానిలాగా వొంగిపోతుంది" ఇలాంటివి ఎన్నో!!
కొన్ని వ్యాక్యాలు చదువుతుంటే పడి పడి నవ్వుతాము. ఈ కథ చదువుతుంటే ముళ్ళపూడి వారిలో కాస్త దేవులపల్లి వారి శైలి ఉందేమో అనిపిస్తుంది. ఈ సుబ్బమ్మవ్వ గారు ఒకసారి మనవడితో తిరునాళ్లకి వెళ్ళి తప్పిపోతుంది. ఆ తరువాత ఆమె ఇంటికి ఎలా చేరింది, ఆమె గురించి ఇంట్లో వాళ్ళు ఎంత అదుర్దా పడింది మంచి హ్యాస్యభరితంగా చెప్పారు దేవులపల్లి వారు.
సమీక్ష కన్నా కథ చదివితేనే మీరు కూడా పడి పడి నవ్వగలరు.

Read more...

June 1, 2007

శవాల మీద రాబందులు


మన హైదరాబాదులో ఆరోగ్యవంతుల నుండి దొంగతనంగా మూత్రపిండాలు తీసి అమ్ముకునే దళారుల గురించి, ఆసుపత్రుల గురించి విన్నాము! అమ్మో ఇంత దారుణమా అనుకున్నాము!! మరి అమెరికాలో అయితే ఇంకా దారుణంగా చచ్చిన శవాలతో కూడ వ్యాపారం చేసుకుంటున్నారు. చనిపోయిన వాళ్ళనుండి ఎముకలు (bones), నరాలు (tendons, ligaments), కణజాలం (tissue), రక్తనాళాలు (blood vessels) కాదేది దోచుకోవటానికనర్హం అన్నట్లు అన్నీ దోచేసుకుంటున్నారంట. ఓ శ్మశానవాటిక సాక్షిగా ఇదంతా జరిగేదంట. పూర్తి వివరాలకి ఇక్కడ చూడండి.

శరీరంలోని ప్రతి ఎముకకి, రక్తనాళానికి ఓ ధర ఉందంట. ఒకసారి ఆ ధరవరలు చూడండి. (యువకుల ఎముకలకి ఎక్కువ ధరలంట!)
Femur bone (తొడ ఎముక)
65 సంవత్సరాల లోపు వాళ్ళది అయితే------$970 అంటే సుమారుగా 38000 రూపాయలు.
65 సంవత్సరాల పై బడ్డ వాళ్ళది అయితే----$550 అంటే సుమారుగా 22000 రూపాయలు.
Tibia (మోకాలి కింది ఎముక)-----------$385 to $600 అంటే సుమారుగా 15400 నుండి 24000 రూపాయల వరకు.
రక్తనాళాలు (పరిమాణాన్ని బట్టి)------------$350 to $1000 అంటే సుమారుగా 14000 నుండి 40000 రూపాయల వరకు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ కణాలు కాని ఎముకలు కాని ఎవరైనా కాన్సర్ రోగి నుండి కాని లేక ఏదైనా ప్రమాదకర రోగం బారిన పడి చనిపోయిన వారినుండి కాని సేకరిస్తే ఇవి transplant చేయించుకున్న వ్యక్తికి కూడా ప్రమాదమే.

నిజంగా ఎటు పోతున్నాం మనం? పురోగమనం వైపా, తిరోగమనం వైపా!!!

Read more...

May 14, 2007

స్త్రీ-స్వేచ్చ-స్వాతంత్రం

స్త్రీ-స్వేచ్చ-స్వాతంత్రం గురించి మాట్లాడినట్లు పురుషుడు-స్వేచ్చ-స్వాతంత్రం గురించి మాట్లాడరెందుకని???

స్త్రీ వాద సాహిత్యం వుంది కాని పురుషవాద సాహిత్యం లేదెందుకని???

స్త్రీ వాద రచయిత్రులున్నారే కాని పురుషవాద రచయితలు లేరెందుకని???

స్త్రీల హక్కుల పరిరక్షణ గురించే కాని పురుషుల హక్కులు గురించి మాట్లాడరెందుకని???

ఎక్కడా చూసినా మహిళా సంఘాలే కాని పురుష సంఘాలు ఉండవెందుకని???

అంటే పురుషుడికి సంపూర్ణ స్వాతంత్రం ఉన్నట్లా? అతనికి ఎలుగెత్తి చాటుకోతగ్గ బాధలు కష్టాలు ఏమీ లేనట్లా? ఉన్నాకాని ఎలుగెత్తి చాటుకుంటే ఎక్కడ అలుసైపోతామో అన్న భయమా? లేక చెప్పుకోవటానికి అడ్డొచ్చే అభిజాత్యమా?

ఇవన్నీ నా దగ్గర జవాబు లేని ప్రశ్నలు.

ఇది నేను రాయబోయే విషయానికి ఓ చిన్న ముందు మాట లాంటిది. మీ మీ జవాబులు విన్నాక (చూసాక) అది మొదలుపెడతాను.

గమనిక: ఇక్కడ జవాబులు రాయటానికి స్త్రీ పురుష భేదం లేదు. ఎవరైనా రాయవచ్చు.

Read more...

May 13, 2007

అమ్మ


మదర్స్ డే అని ఇవాళ ప్రచారసాధనాలు ఊదరగొట్టేస్తున్నాయి. ఈ రోజు తప్పితే అమ్మ విలువ ఇంకెప్పుడు గుర్తురాదు కాబోలు వీళ్ళకు. ఇదంతా మార్కెటింగ్ మహిమ. సృష్టిలో మానవుడికే కాదు ప్రతి ప్రాణికి అమ్మ వుంది. ఎవరికైనా అమ్మ అమ్మే. ప్రతి అమ్మ తన బిడ్డని ఒక వయసు వచ్చేవరకు కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. అది ప్రకృతి సహజం కూడా! ఎవరి మన్ననల కోసమో, బిరుదుల కోసమో, మెప్పుల మేకతోళ్ళ కోసమో అమ్మ తన పిల్లలిని లాలించదు పాలించదు. అది తన ధర్మంగా చేస్తుంది. కాకి పిల్ల కాకికి ముద్దయినట్లు బిడ్డ అవిటిదైనా, కురూపి అయినా తల్లికి ముద్దే. ఎన్ని కష్టాలు పడి అయినా బిడ్డ బ్రతకదని తెలిసినా చివరి నిమిషం వరకు బిడ్డ గురించి తపించే తల్లులెందరో. ఏమి ఆశించి వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు? అలాంటి అమ్మని ఈ ఒక్క రోజే గుర్తు చేసుకోవటం అంత ఆత్మవంచన ఇంకొకటి వుండదేమో.

అమ్మని ఏ అనాధాశ్రమంలోనో పడేసి ఏడాదికొకసారి ఒక గ్రీటింగ్ ముక్కో, ఓ కేకు ముక్కో పడేస్తే సరిపోతుందనుకునేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఇదా మనకు మన చదువులు నేర్పిన సంస్కారం!! ఇదా మనకు మన సంపదలు తెచ్చిన వైభోగం!!!

అమ్మ కోరేది ఈ ఒక్క రోజు ఆర్భాటపు వేడుకలని, బహుమతులిని, ప్రశంసలిని కాదు. రోజూ ఆప్యాయంగా అమ్మా అన్న ఒక పిలుపుని, ముదిమిలో లాలనని పాలనని, నీకు నేనున్నాను నీ జీవితమంతా తోడుంటాను అన్న ఒక భరోసాని . అంతకన్న మననుండి ఆమె ఏ పట్టుపీతాంబరాలని, కాంచన మణిమాణిక్యాదులని ఆశించదు.

అమ్మ గురించి ఎప్పుడో ఎక్కడో చదివిన రెండు వ్యాక్యాలు....
అమ్మ.....
ఆకలివేళ అక్షయ పాత్ర
ఆపద వేళ ధైర్యం మాత్ర.

ఈ రోజు ఒకావిడ "మదర్స్ డే ని ఘనంగా ఆర్భాటంగా జరుపుకోవాలి" అని నొక్కి వక్కాణిస్తుంది. ఇలా వక్కాణించేవాళ్ళు ఎంతమంది తమ అమ్మలిని అత్తలిని ప్రేమగా చూసుకుంటున్నారంటారు?

Read more...

April 23, 2007

ప్రపంచ పుస్తక దినోత్సవం

ఏప్రిల్ 23 UNESCO ప్రపంచ పుస్తక దినోత్సవం. మదర్స్ డే, ఫాదర్స్ డే, వాలెంటైన్స్ డే అంటూ రకరకాల రోజులని జరుపుకునే మనకి ఈ పుస్తక దినోత్సవం మాత్రం గుర్తుండదు. మొన్నటికి మొన్న అక్షయ తదియ కి చూడండి ఎంత ప్రచారం చేసామో!! ఈ రోజు ఎక్కడా ఏ ప్రచార సాధనాలలో కూడా ఈ పుస్తక దినోత్సవం గురించి ఒక్క మాట కూడా వినపడలేదు.

ఓ మంచి పుస్తకం చదవటంలో వుండే ఆనందం అనుభవించేవాళ్ళకే తెలుస్తుంది. ఆస్వాదించగలిగితే అది విందు భోజనం కంటే ఎక్కువ తృప్తినిస్తుంది. పుస్తకం ఓ ప్రియసఖి లంటిది. అమ్మలా లాలిస్తుంది, గురువులా హితబోధ చేస్తుంది, తండ్రిలా ఆజ్ఞాపిస్తుంది, స్నేహితుడిలా అక్కున చేర్చుకుంటుంది. ఒంటరి మనసుకి నేనున్నాను అని స్వాంతననిస్తుంది. బాధపడితే ఓదార్చుతుంది. అలసిన మనసుని సేద తీరుస్తుంది.

నేటి మన జీవన విధానం మనల్ని ఈ పుస్తక పఠనానికి దూరం చేస్తుంది. టి.వి లకి , నెట్లకి అంకతమయిపోయి మన సృజనాత్మకత అడుగంటుతుంది. మన పిల్లలిని కూడ అలాగే తయారుచేస్తున్నాము. శరీరానికి వ్యాయామము ఎంత అవససరమో మనస్సుకి పుస్తక పఠనం కూడా అంతే అవసరం. కనీసం నెలకి ఒక కొత్త పుస్తకం కొని చదువుదాము. పిల్లల చేత చదివిద్దాము. వారి భావనా ప్రపంచ పరిధిని పెంచుదాము.

పుస్తకాలు చదవటం ద్వారా కేవలం మానసిక వికాసమే కాదు, భావ వికాసము, మేధో వికాసం కూడ కలుగుతాయి. పుస్తకాలు చదవటం ద్వారా మానసిక వత్తిడిని తగ్గించుకోవచ్చు. వెనకటి రోజులలో గ్రంధాలయాలకి చాలా ప్రాముఖ్యత వుండేది. సంచార గ్రంధాలయాలు కూడా వుండేవి. నెలకి ఇంతని కడితే వారపత్రికలు, నవలలు ఇంటికి తెచ్చిచ్చేవాళ్ళు. అది చాలామందికి జీవనోపాధిగా కూడా వుండేది. ఇప్పుడు ఎక్కడ చూసినా సి.డిలు డి.వి.డిలు అద్దెకిచ్చే షాపులే కాని ఇలాంటివి మచ్చుకి కూడ కానరావు. మనిషి జీవితం ఎలా పరిణామం చెందింది తెలుసుకోవటానికి పుస్తకాలని మించిన గొప్ప సాధనాలు వున్నాయా? పుస్తకాల ద్వారానే భాష బ్రతుకుతుంది. ఒక భాష మరుగునపడి పోతే, దానితో పాటు ఆ భాషలోని సాహిత్యం, ఆ సాహిత్యంతో పాటు ఆ జాతి మేధాసంపత్తి పోయినట్టే. మన భాషని కాపాడుకోవటం మన చేతులలొనే వుంది. అందుకే ముందుగా ఈ రోజు ప్రాముఖ్యత గురించి ఒక్క సారి తెలుసుకుందాము.

అన్నట్లు ఈ మధ్య పాత బ్లాగులు చదువుతుంటే మన బ్లాగర్లని కుట్టిన పుస్తకాల పురుగు కనపడింది. ఆ కుట్టేదేదో కొద్దిమందినే కుట్టినట్లుంది!!!! అది కూడా కాస్త అసంపూర్తిగానే. దీనిమీదేననుకుంటా మన రానారే గారు ఆ మద్య నా బ్లాగులో కాస్త ఆవేశపడ్డారు.

మరలా ఆ పురుగేదో ఇంకొకసారి గట్టిగా కుడితే కాని మనవాళ్ళలో చలనం రాదేమో..

Read more...

April 17, 2007

ప్రయాణంలో పదనిసలు

రైలులో ప్రయాణం చేసేటప్పుడు ఒక్కోసారి వింతైన అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. మచ్చుకి ఒకటి రెండు.

ఒకసారి నేను విశాఖపట్టణం నుండి ఈస్ట్ కోస్ట్ ఎక్సుప్రెస్ కి హైదరాబాదు వస్తున్నాను. రైలు ఎక్కి అంతా సర్దుకుని కూర్చున్నాక ఒకతను వచ్చి క్షమించాలి ఇది నా సీటండి అన్నాడు. నేను బిత్తరపోయి నా టికెట్ తీసి చూసాను, అదే పెట్టె అదే సీటు నంబరు, నేను సరిగ్గానే కూర్చున్నానే అనుకుంటూ అతని టిక్కెట్ చూపించమన్నాను, అతనిది కూడా అదే పెట్టె అదే నంబరు. ఒక్క నిమిషం ఏమీ అర్థం కాలా. రైల్వే వాళ్ళు కూడా సినిమహాళ్ళ వాళ్ళ లాగా ఒక సీటే ఇద్దరు ముగ్గురికి రిజర్వు చేస్తున్నారా ఏంటి అనుకున్నాను. ఎక్కడ పొరపాటు జరిగి వుంటుందా అని ఇంకొక సారి అతని టిక్కెట్ నా టిక్కెట్ పరీక్షగా చూసాను. అసలు సంగతి ఏమిటంటే అతనిది ముందురోజుకి రిజర్వేషన్. పాపం ఆ సంగతి చెప్పాక అతను సారీ సారీ అనుకుంటూ దిగిపోయాడు. రైల్వే టైము అర్థరాత్రి 12 గంటల తరువాత మరుసటి రోజుకి మారిపోతుంది. దానితో వచ్చిన తిప్పలు ఇవన్నీ. కొత్తవారికి కొంచం తికమకగానే వుంటుంది. మనకేమో తెల్లావారితే కాని మరుసటి రోజు అయినట్లు లెక్క కాదు కదా.

ఈ మధ్య తిరుపతి వెళ్ళుతున్నప్పుడు కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. నారాయణాద్రి రైలు తెనాలి వెళ్ళేటప్పటికి సరిగా 12:02 నిమిషాలు అయ్యింది. అక్కడ ఇద్దరు వ్యక్తులు మా పెట్టె లోకి ఎక్కి సీటు నంబర్లు వెతుక్కుంటూ వచ్చారు. ఓ సీటు దగ్గిర ఆగి అక్కడ వాళ్ళని లేపటం మొదలుపెట్టారు. వాళ్ళేమో మంచి నిద్రలో వున్నారు. ఎలాగో చివరికి విసుక్కుంటూ లేచారు. తెనాలిలో ఎక్కిన వాళ్ళు ఇవి మా సీటులండి అని వాళ్ళ సామాను పెట్టేసుకుంటున్నారు. అప్పటికే ఆ సీట్లలో కూర్చున్నవాళ్ళకి ఒక్క నిమిషం ఏమి అర్థం కాలా. అసలే మంచి నిద్రలో లేచారేమో ఒక్కసారిగా తెనాలిలో ఎక్కిన వాళ్ళ మీద పడిపోయారు, మీవేంటండి, మేము హైదరాబాదు నుండి వస్తుంటే, ఏం తమాషాగా వుందా అని. ఇద్దరు కాసేపు వాదులాడుకున్నాక టికెట్స్ తీసి చూసుకున్నారు, ఇద్దరివి ఓకే పెట్టె, ఒకే సీటు నంబర్లు. అంతలోకి టిసి వచ్చాడు, ఏమిటి గొడవ అంటూ. అతను వచ్చి చూసి, తెనాలిలో ఎక్కిన వాళ్ళని మీరు తరువాత స్టేషనులో దిగిపోండి, ఇవి నిన్నటికి రిజర్వేషను చేయించుకున్నవి అని చల్లగా చెప్పాడు. అప్పుడు చూడాలి వాళ్ళ ముఖాలు!!!

Read more...

March 28, 2007

ఆణి ముత్యాలు-మాయాబజార్

మాయాబజార్ విడుదలయ్యి నిన్నటికి 50 సంవత్సరాలు. ఇప్పటికి చాలా సార్లు చూసినా, నిన్న మరలా చూసాము పిల్లలతొ కలిసి. నిజంగా ఓ మరుపురాని ఇంద్రజాల మహేంద్రజాల ప్రదర్శన అని చెప్పవచ్చు ఈ సినిమాని.

ప్రతి సన్నివేశం ఒక మాయాజాలమే, ఒక మహాద్భుతమే. పిల్లలు కూడా బాగా ఆనందించారు. అది ఎలా తీసారు, ఇది ఎలా తీసారు అని అడగటమే. ఇప్పటి గ్రాఫిక్స్ ఎందుకు పనికి రావేమో వాటి ముందు. తల్పం లాంటి గిల్పం మీదకు చెప్పులు క్రమశిక్షణ కలిగిన సైనికులలా నడిచివెళ్ళటం నాకు బాగా నచ్చిన సన్నివేశం. ఇది అది అని లేదు, ప్రతి సన్నివేశం ఒక మహాద్భుతమే..

సావిత్రి నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదమో. అహ నా పెళ్లంట పాటలో ఆమె నటన simply superb. ఘటోత్కచుడుగా ఆమె హావభావాలు అమె తప్ప ఎవరు చేయలేరేమో అన్నట్లుగా వుంటాయి. ఇక ఘటోత్కచుడుగా రంగారావు నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. నటీనటులందరు ఒకళ్ళని మించి ఒకళ్ళు పోటాపోటీగా నటించిన సినిమా ఇది.అందరూ హేమాహేమీలే. ఈ సినిమా గురించి ఎంత రాసినా తక్కువే. తెలుగు సినిమాలకే మకుటం లాంటిది. సంగీతపరంగా, సాహిత్యపరంగా గానే కాదు technical గా కూడా ఒక అపురూప కళాఖండం. ప్రతి తెలుగు వాడు చూడవలిసిన సినిమా.

Read more...

March 13, 2007

మళ్ళీ మారిన తేదీలు

ప్రభుత్వం పుణ్యమా అని ముచ్చటగా రెండోసారి ఇంటర్ పరీక్షల తేదీలు మారాయి. ఇంతకు ముందు శాసన మండలి ఎన్నికల సందర్భంగా, ఇప్పుడేమో మన ఉగాది సందర్భంగా.ఉగాది మార్చి 20న కాదు,19నని ప్రభుత్వం ప్రకటించింది.దానికి తగ్గట్లుగా ఇంటర్ రెండో సంవత్సరం రసాయనశాస్త్రం పరీక్ష 20కి మార్చారు.ఉగాది 20న కాదు 19నే అని మన ఆస్థాన పండితులకి ఆపై మన ప్రభుత్వానికి తెలిసింది ఇప్పుడే. మద్యలో పిల్లలు వాళ్ళ పరీక్షలు ఎలా పోతే ఎవరికి పట్టింది.

ఇలా పండగల తేదీల మీద రచ్చ జరగటం ఇదే మొదటిసారి కాదు. మరి మన పండితులంతా ముందు ఏం చేస్తారో తెలియదు.

Read more...

నా మొదటి దొంగ సినిమా

మొన్న ఒక రోజు టీవి లో స్వాతిముత్యం సినిమా చూస్తుంటే మా కాలేజి రోజులు గుర్తుకొచ్చాయి.
1985 లో అనుకుంటాను, డిగ్రీ లో వుండగా-అవి స్వాతిముత్యం సినిమా విడుదలైన రోజులు. అప్పటికే నేను కమల్ హాసన్ అభిమానిని, అందులోనూ విశ్వనాథ్ గారి సినిమా. ఎలాగైనా ఆ సినిమా చూడాలి, అది కూడా వెంటనే. మరి వుండేదేమో హాస్టలు లో. హాస్టలు అంటే ఆ రోజులలో ఒక జైలే. హాస్టలు నుండి బయటకు వెళ్ళటమంటే ఓ పెద్ద పండగే మాకు. ఎప్పుడో నెలకి ఒకసారే బయటకు వెళ్ళటానికి అనుమతి లభించేది, అది కూడా సాయంత్రం ఒక గంట మాత్రమే. సినిమా సంగతి దేవుడు ఎరుగు ఆ గంట మాకు ఏ మూలకూ సరిపోయేది కాదు. నెలకి ఒకసారి ఇంటికి పంపించే వాళ్ళు కాని ఆ ఒక్క రోజు సినిమా కి వెళ్ళి సమయం వృథాచేసుకోవటం ఇష్టం వుండేది కాదు. ఎలాగైనా ఈ సినిమా చూడాలి అన్న కోరిక తో మేము ముగ్గురం స్నేహితురాళ్ళం కలిసి ధైర్యం చేసి ఓ సాహసం చేసాము. అప్పట్లో అది నిజంగా సాహసమే.

మా కళాశాల, హాస్టలు ఒకే ప్రాంగణం లో వుండేవి- కాకపోతే వేరు వేరు ప్రవేశద్వారాలు వుండేవి. హాస్టలు పిల్లలు కళాశాలకు లోపలినుండే వెళ్ళాలి. హాస్టలు పిల్లలిని కళాశాల గేటు దగ్గరికి కూడా రానిచ్చేవాడు కాదు అక్కడి యమధర్మరాజు (అంటే కాపలా అతను). ఎవరు హాస్టలు పిల్లలో అతనికి బాగా గుర్తు.

ఇక ఒక రోజు ధైర్యం చేసి మేము ముగ్గురం మా డే స్కాలర్స్ సహయంతో కళాశాల గేటు కుండా మెల్లగా ఎలాగోలా బయట పడ్డాము. పడ్డాక ఇక అసలు కష్టాలు మొదలయ్యాయ. కొంచం దూరం వెళ్ళగానే మా వార్డెన్ గారి సుపుత్ర రత్నం ఎదురయ్యాడు . అప్పటికే ఎవరైనా చూస్తారేమో అని బిక్కు బిక్కు మంటూ నడుస్తున్నాము ఇక అతను కనిపించేటప్పిటికి పై ప్రాణాలు పైనే పోయాయి. అమ్మయ్య అతను మమ్ముల్ని గమనించలేదు (అని మేము అనుకున్నాము అంతే). ఇక సినిమా కి బాపట్ల నుండి చీరాలకి వెళ్ళాలి. అప్పట్లో చీరాల లోనే కొత్త సినిమాలు విడుదల అయ్యేవి మరి. ఎలాగోలా ఎవరికంటా పడకుండా సందులు గొందులు తిరిగి బస్టాండ్ చేరి బస్ ఎక్కి చీరాల చేరాము. అక్కడ సినిమా హాలు మా స్నేహితురాలి వాళ్ళ మామయ్యదే (రామానాయుడి గారిది). అమ్మో మా మామయ్య వాళ్ళు ఎవరన్నా కనపడతారేమో అని తన భయం (కనపడితే బాగుండు ఫ్రీగా సినిమా చూడొచ్చు, కూల్డ్రింక్స్ తాగొచ్చు కదా అని మేము). లోపలికి వెళ్ళాక ఎవరైనా తెలిసిన వాళ్ళు, కాలేజి వాళ్ళు కనపడతారేమో అని మరో భయం. మొత్తానికి సినిమా అంతా అలా భయం భయం గానే చుట్టూ చూసుకుంటూ చూసి ఏదో చూసామనిపించి మరలా బాపట్ల చేరాము. ఇక్కడితో అయిపోలేదు కథ. మరల హాస్టలు లోకి ఎలా ప్రవేశించాలి !!!(అప్పటికి కాలేజి గేటు మూసేస్తారు మరి).మా అదృష్టం బాగుండి ఆ రోజు కాలేజి గేటు ఎందుకో తీసే వుంది, ఇక మెల్లగ లోపలికి జారుకున్నాము.

ఇప్పటికి కూడా ఎప్పుడు స్వాతిముత్యం సినిమా గురించి విన్నా, అందులోని పాటలు విన్నా నాకు మా మొదటి దొంగ సినిమానే గుర్తుకొస్తుంది.

పై అనుభవంతో ఇక దొంగ సినిమాలు చూడటం మానేసామనుకుంటున్నారా!!!! ఏంలే, ఆ అనుభవంతో ఇంకా ఎక్కువ చూసాం, పైగా భయం లేకుండా . ఆ కబుర్లు ఇంకొక సారి.

ఉపసంహరణ: ఇంతకీ దొంగతనంగా భయం భయంగా చూట్టం మూలాన (అందులోనూ మొదటిసారిగా చేసిన దొంగ పని) ఆ రోజు సినిమాని అంతగా ఆనందించలేకపోయాము, మరల ఇంకొక సారి చూస్తేకాని చూసినట్లుగా అనిపించలేదు.

Read more...

March 6, 2007

ఎంత కష్టం-ఎంత కష్టం.

ఎంత కష్టం-ఎంత కష్టం-భావి భారత పౌరునికి ఎంత కష్టం.

ఒకరి సెల్‌పోయింది..
ఒకరి పరీక్ష పోయింది
సెల్‌ఫోన్‌ పోయిందంటూ ఓ ప్రయాణికుడు హడావుడి సృష్టించాడు. బస్సులో ఉన్న వారందరినీ తనిఖీ చేయాలని పట్టుబట్టాడు. అప్పటిదాకా బస్సు కదిలించరాదని డిమాండ్‌ చేశాడు. అతను అనుకున్నది సాధించాడు. ప్రయాణికులందరినీ సోదా చేశారు. 20 నిమిషాల తర్వాత బస్సు మళ్లీ బయలుదేరింది. ఈ సంఘటన వల్ల ఓ ఇంటర్‌ విద్యార్థికి కోలుకోలేని నష్టం జరిగింది. బస్సు ఆలస్యం కావడంతో... అతను సరైన సమయానికి పరీక్ష హాలుకు చేరుకోలేకపోయాడు. అధికారులు అతనిని పరీక్ష రాసేందుకు అనుమతించలేదు. సోమవారం మెదక్‌ జిల్లాలో జరిగిన సంఘటన ఇది.. ఇంత జరిగినా పోయిన సెల్‌ఫోన్‌ దొరకలేదు.

ప్రైవేటు కళాశాలల ఉదాసీనత

కొన్ని కార్పొరేట్‌ కళాశాలలు ఉదయం 7.45 గంటల వరకు పరీక్షా కేంద్రాల్లోకి వెళ్లడానికి అనుమతించలేదు. దీంతో విద్యార్థులు రోడ్డుపైనే నిలబడాల్సి వచ్చింది. చివరి 15 నిమిషాల్లో అధ్యాపకులు హాల్‌టికెట్‌ చూసి లోపలికి పంపడం మొదలుపెట్టారు. దీంతో త్వరగా లోపలికి వెళ్లాలనే తొందరలో విద్యార్థుల మధ్య తోపులాట జరిగింది. ప్రధాన రహదారిపై ఉన్న కళాశాలల వద్ద ఒక్కసారిగా విద్యార్థులు గుంపుగా చేరడంతో హిమాయత్‌నగర్‌, నారాయణగూడ, ఎస్‌ఆర్‌నగర్‌ ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఇంటర్మీడియట్‌ అధికారులు పరీక్షకు అరగంట ముందుగా విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించాలని ఆదేశించినా, కొన్ని ప్రైవేటు కళాశాల నిర్వాహకులు సరైన విధంగా వ్యవహరించకపోవడమే ఈ పరిస్థితికి కారణమని తేలింది. ఇలాంటి సమస్యలు మళ్లీ జరగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.


చందానగర్‌ టు షాపూర్‌నగర్‌

షాపూర్‌నగర్‌: ఇంటర్మీడియట్‌బోర్డు అధికారుల నిర్లక్ష్యం ఓ ప్రైవేటు కార్పొరేటు కళాశాలకు చెందిన ఇంటర్మీడియట్‌ విద్యార్థులను అయోమయానికి గురిచేసింది.చందానగర్‌లో ఇదివరకు గౌతమి కళాశాల ఉండేది. అయితే ఈ కళాశాలను కుత్బుల్లాపూర్‌ మున్సిపాలిటీ షాపూర్‌నగర్‌లోని సొంత భవనంలోకి మార్చారు. ఈ తతంగం జరిగి రెండేళ్లయ్యింది. అయినా ఇంటర్మీడియట్‌ బోర్డులో ఆ కళాశాల అడ్రసు మాత్రం మారలేదు. దీంతో బోర్డు అధికారులు ఆ కళాశాల పాత చిరునామాతోనే వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులకు హాల్‌టికెట్లు జారీచేశారు. సోమవారం నుంచి విద్యార్థులకు పరీక్షలు ప్రారంభం కాగా గౌతమి కళాశాల సెంటర్‌ పొందిన శ్రీచైతన్య, నారాయణ, రాయల్‌ కళాశాల విద్యార్థులకు అందజేసిన హాల్‌టికెట్లపై మాత్రం చందానగర్‌ అడ్రస్‌ ఉండటంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర అయోమయానికి గురయ్యారు. రెండు మూడు రోజుల ముందు హాల్‌టికెట్లు తీసుకున్న విద్యార్థులు దానిపై తప్పుడు అడ్రస్‌ వచ్చిందని తెలుసుకుని ముందుగానే షాపూర్‌నగర్‌ సెంటర్‌ అడ్రస్‌ను చూసి వెళ్లారు. ఒకరోజు ముందు హాల్‌టికెట్లు తీసుకున్న విద్యార్థులు ఈ విషయం తెలియక మొదటి రోజు పరీక్షలకు తీవ్ర ఆందోళనతో హాజరయ్యారు.

ఈ కాలేజి అనే కాదు చాలా కాలేజిల విషయం లో ఇలాగే జరిగింది. మా పాపకి కూడా ఇలానే జరిగింది. హాల్ టికెట్ మీద మా కాలనీ అడ్రస్ ఇచ్చారు, కాకపోతే మాకు ఆ అడ్రస్ లో ఆ కాలేజి లేదని తెలుసు కాబట్టి ఇబ్బంది పడలేదు, కానీ చాలా మంది వెతుక్కోవలసి వచ్చింది. (అసలు కాలేజి వుంది అక్కడికి 2 కి.మీ దూరంలో). అసలు విషయం ఏంటంటే, కాలేజిల అడ్రస్ మారి 6-7 సంవత్సరాలు అవుతున్నా మన ఇంటర్ బోర్డు వాళ్ళకి తెలియదండి పాపం.

ఇవండీ మన ఇంటర్ బోర్డు లీలలు.

Read more...

February 26, 2007

పిల్లలు-పుస్తకాలు

"పుస్తకాలను చదివి, మస్తకాలను మథిస్తే జనిస్తుంది జ్ఞానం". ఇవాళ పేపరు చదువుతుంటే నన్ను ఆలోచింపచేసిన వాక్యము ఇది.
ఇప్పటి పిల్లలు తరగతి పుస్తకాలు కాకుండా అదనముగా ఏ పుస్తకాలను చదువుతున్నారు? మనం వాళ్ళకి ఆ అవకాశం ఇస్తున్నామా? వాళ్ళకి చదువుకోను మంచి మంచి తెలుగు పుస్తకాలు కొనిపెడుతున్నామా?
బాగా చిన్నప్పుడు-ఊహ తెలిసీ తెలియని తనములో-సాయంత్రం అయ్యేటప్పటికి-అమ్మ పెట్టిన గోరుముద్దలు తిని నాయనమ్మ పక్కన చేరి కథ చెప్పవా అని గొడవ మొదలెడితే----అనగనగా ఒక రాజు గారు, ఆయనకి ఏడుగురు కొడుకులు-----
రోజూ ఇదే కథా?
అయితే, అనగనగా ఒక రాజకుమారుడు -ఇలా సాగిపోయేవి కథలు. కొన్ని కథలయితే రోజుల తరబడి సాగేవి.
రాజకుమారుడు గుర్రమెక్కి వస్తాడంటే—గుర్రానికి రెక్కలుంటాయి, అలా అలా ఎగిరి వస్తాడు అనుకునేదాన్ని. ఆప్పటికి అసలు గుర్రాన్నే చూడలేదు నేను.
కొంచం పెద్దయ్యాక, అంటే చదవటం కొంచం కొంచం వచ్చాక—చందమామలు, బాలమిత్రలు—ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురు చూసేవాళ్ళం. నేను ముందంటే నేను ముందు అని పోట్లాడుకునేవాళ్ళం. పట్టువదలని విక్రమార్కుడంటే నాకు చిన్నప్పుడు అర్థమయేదికాదు. అంటే ఏంటా అనుకునేదాన్ని-బహుశా పట్టు అనే వస్తువుని వదలడేమో అనుకునేదాన్ని.
ఆ తరువాత—ఇంకొంచం పెద్ద అయ్యాక—అంటే బాగా ఊహ తెలిసాక-తెలుగు వారపత్రికలు—జ్యోతి, ప్రభ చదివేదాన్ని. ఆప్పట్లో, వాటిలో కథలు పిల్లలు కూడ చదివేటట్లు వుండేవి.
ఇంకాస్త పెద్దయ్యాక-మాదిరెడ్డి, యద్దనపూడి, వాసిరెడ్డి, మరియు కనపడ్డ, వినపడ్డ ప్రతి తెలుగు రచయిత, రచయిత్రి పుస్తకాలు చదివెయ్యడమే పని. అప్పటికి ఇంకా లోకజ్ఞానము తక్కువే. యద్దనపూడి నవల్లలో కధానాయకుడు పడవ లాంటి కారులో వచ్చేవాడు. ఓహో పడవనే కారుగా వేసుకొస్తాడు కావాలి అనుకునేదాన్ని.
ఇక కాలేజి కి వచ్చాక- క్లాసు పుస్తకాలలో నవలలు పెట్టుకుని మరీ చదివేవాళ్ళం (అలాగని చదువుని ఎప్పుడూ అశ్రద్ధ చేయలేదు). కొత్త పుస్తకం వెంటనే చదవాలి అదీ అక్కడ సంగతి.
మరి ఇప్పటి పిల్లలు ???????
ఇప్పటి పిల్లలు ఎంతమంది తాతయ్య అమ్మమ్మల దగ్గర చేరి కథలు చెప్పించుకుంటున్నారు?. చందమామ అంటే ఎంత మందికి తెలుసు. తెలుగు కథల పుస్తకాలు ఎంత మంది చదువుతున్నారు? బేతాళుడు, విక్రమార్కుడు అంటే ఎంత మందికి తెలుసు? హారీ పాటర్ అంటే మాత్రం తెలుసు. ఎందుకు ఇలా జరుగుతుంది? విలువలు మారిపోతున్నాయా? లేక మనం మారి పోతున్నామా?
మన పిల్లలకి చిన్నప్పటినుండే చదవటం అలవాటు చేద్దాము. ఏదో ఒకటి, కనీసం నెలకు ఒక్క తెలుగు పుస్తకం చదివిద్దాము. కంప్యూటర్ల ముందు, టివి ల ముందు కూర్చోవడం తగ్గించి చదవటం అలవాటు చేసుకోమందాము. మాతృభాష లో చదవటము లోని తీయదనము వాళ్ళకి రుచి చూపిద్దాము. ఒకసారి మాతృభాష లో చదవటంలో వుండే ఆనందం అర్థమయితే ఆ తీపిదనము రుచి చూస్తే ఇక మనం చెప్పకుండా వాళ్ళే చదువుకుంటారు. ఆ ఆనందం వాళ్ళకి అర్థం అయ్యేలా చేయవలసిన బాధ్యత మనది, మన అందరిది.
ఇక్కడ నాకో Arab proverb గుర్తుకొస్తుంది. "A book is like a garden carried in the pocket". ఆ తోటలోని వివిధ రకాల పరిమళాలు మన పిల్లలు ఆస్వాదించేలా చూద్దాము.

Read more...

February 22, 2007

నా మొదటి టపా

అందరికి నమస్కారం

ఇది నా మొదటి టపా. ఏదో మా అయన మీద కోపంతో బ్లాగు మొదలెట్టాను కాని ఏం రాయాలో ఎలా రాయాలో తేల్చుకోవటానికే రెండు రోజులు పట్టింది. మా ఆయన మీద కోపం ఎందుకంటారా? అయనో పెద్ద బ్లాగరు లేండి అందుకు. గంటలు గంటలు కంప్యూటర్ మీద ఏం రాస్తారో అనుకునే దాన్ని. బ్లాగరుల బాధితుల సంఘం పెడదామని కూడా అనుకున్నాను.

సరే బ్లాగులో టపా రాసే ముందు అసలు ఎవరు ఎవరు ఎలా రాస్తారో ఒకసారి చూద్దామని అందరి బ్లాగులు కూడలి లో, తేనెగూడులో ఒకసారి చదివా. అప్పుడు అర్థమయ్యింది బ్లాగులలోని తీయదనం.

కొందరి బ్లాగులు చదువుతుంటే వెనకటి రోజులు గుర్తుకొచ్చాయ్. కళాశాలలో వుండగా ఇంటికి రాసిన ఉత్తరాలు, స్నేహితులకి రాసిన సుదీర్ఘ లేఖలు, పెళ్లి కాక ముందు మా కాబోయే వారికి రాసిన ఉత్తరాలు, పెళ్ళి అయ్యాక ఆషాడమాసంలో శ్రీవారికి రాసిన ఉత్తరాలు అన్నీ గుర్తుకొచ్చాయ్. ఇప్పటికీ మరలా మరలా చదువుకోవాలనిపించే ఆ పాత మధురాలు గుర్తుకొచ్చాయ్.

ఈ ఫోనులు, ఈ-మెయిల్సు, SMS లు వచ్చాక మనం రాయటం ఎంతగా మరిచిపోయామో గుర్తుకొచ్చింది. ఇప్పుడు తెలుగు లో ఒక పేరా రాయాలంటే ఎంత కష్టంగా వుందో. మనం భాష మరిచిపోతున్నామా? భయం వేస్తుంది. అందుకే నేను కూడా బ్లాగు రాయాలని నిర్ణయించుకున్నాను. ఇది చెపితే మా ఆయన ఎంత సంతోషిస్తారో. ఈ బ్లాగులు అన్నీ కలిపి బ్లాగాహారం గా చేసి మన పిల్లలకి కానుకగా ఇస్తే బాగుంటుంది కదూ.

బ్లాగు మొదలుపెట్టటానికి ప్రత్యక్షంగా ప్రేరేపించిన మా వారికి, రాయటానికి పరోక్షంగా ఉత్సాహం ఇచ్చిన చాలా మంది బ్లాగర్లకు నా వందనములు.

మొదటి సారి రాయటం, ఏమయినా తప్పులు వుంటే సరిదిద్దండి.

అప్పుడప్పుడు మిమ్ముల్ని అందర్ని పలకరిస్తూ వుంటాను.

Read more...

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP