అమ్మ
మదర్స్ డే అని ఇవాళ ప్రచారసాధనాలు ఊదరగొట్టేస్తున్నాయి. ఈ రోజు తప్పితే అమ్మ విలువ ఇంకెప్పుడు గుర్తురాదు కాబోలు వీళ్ళకు. ఇదంతా మార్కెటింగ్ మహిమ. సృష్టిలో మానవుడికే కాదు ప్రతి ప్రాణికి అమ్మ వుంది. ఎవరికైనా అమ్మ అమ్మే. ప్రతి అమ్మ తన బిడ్డని ఒక వయసు వచ్చేవరకు కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. అది ప్రకృతి సహజం కూడా! ఎవరి మన్ననల కోసమో, బిరుదుల కోసమో, మెప్పుల మేకతోళ్ళ కోసమో అమ్మ తన పిల్లలిని లాలించదు పాలించదు. అది తన ధర్మంగా చేస్తుంది. కాకి పిల్ల కాకికి ముద్దయినట్లు బిడ్డ అవిటిదైనా, కురూపి అయినా తల్లికి ముద్దే. ఎన్ని కష్టాలు పడి అయినా బిడ్డ బ్రతకదని తెలిసినా చివరి నిమిషం వరకు బిడ్డ గురించి తపించే తల్లులెందరో. ఏమి ఆశించి వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు? అలాంటి అమ్మని ఈ ఒక్క రోజే గుర్తు చేసుకోవటం అంత ఆత్మవంచన ఇంకొకటి వుండదేమో.
అమ్మని ఏ అనాధాశ్రమంలోనో పడేసి ఏడాదికొకసారి ఒక గ్రీటింగ్ ముక్కో, ఓ కేకు ముక్కో పడేస్తే సరిపోతుందనుకునేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఇదా మనకు మన చదువులు నేర్పిన సంస్కారం!! ఇదా మనకు మన సంపదలు తెచ్చిన వైభోగం!!!
అమ్మ కోరేది ఈ ఒక్క రోజు ఆర్భాటపు వేడుకలని, బహుమతులిని, ప్రశంసలిని కాదు. రోజూ ఆప్యాయంగా అమ్మా అన్న ఒక పిలుపుని, ముదిమిలో లాలనని పాలనని, నీకు నేనున్నాను నీ జీవితమంతా తోడుంటాను అన్న ఒక భరోసాని . అంతకన్న మననుండి ఆమె ఏ పట్టుపీతాంబరాలని, కాంచన మణిమాణిక్యాదులని ఆశించదు.
అమ్మ గురించి ఎప్పుడో ఎక్కడో చదివిన రెండు వ్యాక్యాలు....
అమ్మ.....
ఆకలివేళ అక్షయ పాత్ర
ఆపద వేళ ధైర్యం మాత్ర.
ఈ రోజు ఒకావిడ "మదర్స్ డే ని ఘనంగా ఆర్భాటంగా జరుపుకోవాలి" అని నొక్కి వక్కాణిస్తుంది. ఇలా వక్కాణించేవాళ్ళు ఎంతమంది తమ అమ్మలిని అత్తలిని ప్రేమగా చూసుకుంటున్నారంటారు?
5 వ్యాఖ్యలు:
చాలా హృద్యంగా ఆలోచింపచేసేలా ఉంది.
మదర్స్ డే, ఫాదర్స్ డే, వాలెంటైన్స్ డే లాంటివన్నీ అర్థరహితంగా అనిపిస్తాయి. ఇవి మనకు అవసరం లేదు. మదర్స్ డే కాని రోజు 365రోజుల్లో ఏదైనా ఉందా? అమ్మానాన్నలపట్ల కృతజ్ఞత, గౌరవము కలిగి వాటితో వచ్చే అభిమానాన్ని వారికి చూపుతూ మసలుకోవడం శతాబ్గాలుగా మనం చేస్తూ వస్తున్నది. అదే మాతృభక్తి. అది లేకుండా వాళ్లను కూర్చోబెట్టి పూజలు చేయడం, కాళ్లకు మొక్కడం జీవహింస అవుతుంది. అది పద్ధతి. అదీ జన్మకు పరమార్థం. అంతకుమించి ఏ 'డే'లూ కొత్తగా అవసరం లేదు మనకు.
భారతీయులకు అవసరం లేని Mothers Day ఇంకెవరికీ వద్దంటే ఎట్లా? 16 సంవత్సరాలకు మన పిల్లలు మన వద్ద వుంటారు. మరి పాశ్చాత్య దేశాలలో అలా కాదుగా? వారి Days వారికి అవసరమైనవే - వారి పరిస్థితులబట్టి. వాటిని మనం గుడ్డిగా అనుకరించవలసిన ఆవశ్యకత లేదు.
కాని మారిన పరిస్థితుల దృష్ట్యా ఆంధ్ర దేశం లో పెక్కు కుటుంబాలలోని పిల్లలు పాశ్చాత్య దేశాలలో ఉండటం వలన Mothers Day ప్రాముఖ్యత పెరుగుతుంది. ఇది కాదనలేని నిజం.
ఆచార్యులు గారూ ధన్యవాదములు.
రానారే బాగా చెప్పారు.
రావు గారు మదర్స్ డే ఇంకెవరికి వద్దని నేననలేదండి. మన పిల్లలు పాశ్చాత్యదేశాలలో ఉంటున్నంత మాత్రాన వాళ్ళ దినాలని మనం అనుసరించాలిసిన అవసరం వుందంటారా? అంటే మీ ఉద్దేశ్యంలో ఆ ఒక్క రోజు కొడుకులు కూతుళ్ళు అమ్మని పలకరిస్తే చాలు మిగతా రోజులు పలకరించకపోయినా పర్వాలేదు అవునా? ఈ నెట్ యుగంలో అమెరికా లో ఉన్నా హైదరాబాదులో ఉన్నా ఒకటేనండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మాట్లాడుకోవచ్చు చూసుకోవచ్చు. దూరాన వుంటున్నామని మనవి కాని వాటిని అనుసరించటం అంత అర్థవంతంకాదేమో!.
సరే మీరన్నట్లు విదేశాలలో ఉంటున్న వాళ్లని వదిలివేయండి మరి ఇక్కడ వాళ్ళ సంగతేమిటి? అసలు ఇప్పుడు ఈ దినాలని అనుసరిస్తుంది ఎక్కువగా ఇక్కడ ఉంటున్న వాళ్ళే. రోజూ చూస్తున్న అమ్మతో ప్రేమగా ఒక్క మాట మాట్లాడటానికి టైము వుండదు కాని ఈ రోజు మాత్రం బహుమతులు మిఠాయిలు నానా హంగామా. ఇదంతా అవసరం అంటారా? అయినా నా అభిప్రాయాలతో ఏకీభవించమని నేను మిమ్ములిని అనటంలేదు. మీ అభిప్రాయాలు మీవి.
( http://japes.wordpress.com/2007/02/14/happy_valentines_day ) పై పోస్ట్ ల చెప్పినట్టు, 'కావేవి మార్కెటింగ్ కి అనర్హం' అన్నట్టు. ఒక 50-10 సంవత్సరాల కింద లేని 'మదర్స్ డే, ఫాదర్స్ డే, వాలెంటైన్స్ డే' వగైరా అన్నీ వచ్చాయి..., ఇంక కొన్ని రోజులు పోతె " cats day, dogs day, pets day, sons day, mothers day, grandparents day " అని ఇట్ల వారానికి ఒక 'DAY' తయారు చేసి, రోజు ఏదో ఒక 'SALE' ని promote చేస్తూ, మన జేబులకు ఉన్న రంధ్రాలను ఇంకా వెడల్పు చేస్తరు.
Post a Comment