పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

March 13, 2007

నా మొదటి దొంగ సినిమా

మొన్న ఒక రోజు టీవి లో స్వాతిముత్యం సినిమా చూస్తుంటే మా కాలేజి రోజులు గుర్తుకొచ్చాయి.
1985 లో అనుకుంటాను, డిగ్రీ లో వుండగా-అవి స్వాతిముత్యం సినిమా విడుదలైన రోజులు. అప్పటికే నేను కమల్ హాసన్ అభిమానిని, అందులోనూ విశ్వనాథ్ గారి సినిమా. ఎలాగైనా ఆ సినిమా చూడాలి, అది కూడా వెంటనే. మరి వుండేదేమో హాస్టలు లో. హాస్టలు అంటే ఆ రోజులలో ఒక జైలే. హాస్టలు నుండి బయటకు వెళ్ళటమంటే ఓ పెద్ద పండగే మాకు. ఎప్పుడో నెలకి ఒకసారే బయటకు వెళ్ళటానికి అనుమతి లభించేది, అది కూడా సాయంత్రం ఒక గంట మాత్రమే. సినిమా సంగతి దేవుడు ఎరుగు ఆ గంట మాకు ఏ మూలకూ సరిపోయేది కాదు. నెలకి ఒకసారి ఇంటికి పంపించే వాళ్ళు కాని ఆ ఒక్క రోజు సినిమా కి వెళ్ళి సమయం వృథాచేసుకోవటం ఇష్టం వుండేది కాదు. ఎలాగైనా ఈ సినిమా చూడాలి అన్న కోరిక తో మేము ముగ్గురం స్నేహితురాళ్ళం కలిసి ధైర్యం చేసి ఓ సాహసం చేసాము. అప్పట్లో అది నిజంగా సాహసమే.

మా కళాశాల, హాస్టలు ఒకే ప్రాంగణం లో వుండేవి- కాకపోతే వేరు వేరు ప్రవేశద్వారాలు వుండేవి. హాస్టలు పిల్లలు కళాశాలకు లోపలినుండే వెళ్ళాలి. హాస్టలు పిల్లలిని కళాశాల గేటు దగ్గరికి కూడా రానిచ్చేవాడు కాదు అక్కడి యమధర్మరాజు (అంటే కాపలా అతను). ఎవరు హాస్టలు పిల్లలో అతనికి బాగా గుర్తు.

ఇక ఒక రోజు ధైర్యం చేసి మేము ముగ్గురం మా డే స్కాలర్స్ సహయంతో కళాశాల గేటు కుండా మెల్లగా ఎలాగోలా బయట పడ్డాము. పడ్డాక ఇక అసలు కష్టాలు మొదలయ్యాయ. కొంచం దూరం వెళ్ళగానే మా వార్డెన్ గారి సుపుత్ర రత్నం ఎదురయ్యాడు . అప్పటికే ఎవరైనా చూస్తారేమో అని బిక్కు బిక్కు మంటూ నడుస్తున్నాము ఇక అతను కనిపించేటప్పిటికి పై ప్రాణాలు పైనే పోయాయి. అమ్మయ్య అతను మమ్ముల్ని గమనించలేదు (అని మేము అనుకున్నాము అంతే). ఇక సినిమా కి బాపట్ల నుండి చీరాలకి వెళ్ళాలి. అప్పట్లో చీరాల లోనే కొత్త సినిమాలు విడుదల అయ్యేవి మరి. ఎలాగోలా ఎవరికంటా పడకుండా సందులు గొందులు తిరిగి బస్టాండ్ చేరి బస్ ఎక్కి చీరాల చేరాము. అక్కడ సినిమా హాలు మా స్నేహితురాలి వాళ్ళ మామయ్యదే (రామానాయుడి గారిది). అమ్మో మా మామయ్య వాళ్ళు ఎవరన్నా కనపడతారేమో అని తన భయం (కనపడితే బాగుండు ఫ్రీగా సినిమా చూడొచ్చు, కూల్డ్రింక్స్ తాగొచ్చు కదా అని మేము). లోపలికి వెళ్ళాక ఎవరైనా తెలిసిన వాళ్ళు, కాలేజి వాళ్ళు కనపడతారేమో అని మరో భయం. మొత్తానికి సినిమా అంతా అలా భయం భయం గానే చుట్టూ చూసుకుంటూ చూసి ఏదో చూసామనిపించి మరలా బాపట్ల చేరాము. ఇక్కడితో అయిపోలేదు కథ. మరల హాస్టలు లోకి ఎలా ప్రవేశించాలి !!!(అప్పటికి కాలేజి గేటు మూసేస్తారు మరి).మా అదృష్టం బాగుండి ఆ రోజు కాలేజి గేటు ఎందుకో తీసే వుంది, ఇక మెల్లగ లోపలికి జారుకున్నాము.

ఇప్పటికి కూడా ఎప్పుడు స్వాతిముత్యం సినిమా గురించి విన్నా, అందులోని పాటలు విన్నా నాకు మా మొదటి దొంగ సినిమానే గుర్తుకొస్తుంది.

పై అనుభవంతో ఇక దొంగ సినిమాలు చూడటం మానేసామనుకుంటున్నారా!!!! ఏంలే, ఆ అనుభవంతో ఇంకా ఎక్కువ చూసాం, పైగా భయం లేకుండా . ఆ కబుర్లు ఇంకొక సారి.

ఉపసంహరణ: ఇంతకీ దొంగతనంగా భయం భయంగా చూట్టం మూలాన (అందులోనూ మొదటిసారిగా చేసిన దొంగ పని) ఆ రోజు సినిమాని అంతగా ఆనందించలేకపోయాము, మరల ఇంకొక సారి చూస్తేకాని చూసినట్లుగా అనిపించలేదు.

12 వ్యాఖ్యలు:

రాధిక March 13, 2007 at 7:03 PM  

హ హ..భలె బాగుంది.అలాంటి క్లిష్ట పరిస్తితులలో ఎంత భయం గా వుంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.ఎందుకంటే ప్రతీ ఒక్కరికీ ఇది అనుభవమే కదా.హ హ.ఇలాంటివి నాకూ చాలానే వున్నాయి.ఈ పోస్ట్ చదివినవాళ్ళందరూ తప్పకుండా ఒక్కసారి రీలు వెనక్కి తిప్పుకుంటారు.

Unknown March 13, 2007 at 7:47 PM  

హహ... ఇలాంటి సన్నివేశాలు హాస్టల్ జీవితంలో ఎన్నో.

Anonymous,  March 13, 2007 at 9:04 PM  

మీ లాంటి వాళ్ళను చూసే "కర్తవ్యం" లాంటి సినిమాలు తీసుంటారు.

నేను కూడా నా చిన్నపటి "గజ దొంగ" సినిమా గురుంచి బ్లాగులో రాద్దామ్మ్...రాద్దాం అనుకుంటూ బలుపెక్కువయ్యి రాయలేదు. దాని ప్రత్యేక ఎంటంటే నేను సెకండ్ క్లాసులో కూర్చుని సినిమా చూడ్డం. మా అమ్మా నాన్న ఫస్టు క్లాసులో కూచుని సినిమా చూడ్డం. ఇంటెర్వెల్ లో నేనూ నాతోడుదొంగ ఇద్దరూ శాలువా కప్పుకుని టీ తాగడానికి బయటికి వెళ్ళి రావడం చూశారు. అది తెలీక సినిమా అయిన తరువాత ఇంటికి వచ్చి దుప్పటి కప్పుకోని గురకలు పెడుతున్నట్టు నటిస్తా వుంటే."ఎన్టీఆర్ యాక్షన్ ఎలా వుందిరా" అని అడగడం బాగా గుర్తుంది. మామూలుగా అయితే విమానం "వీపు రన్ వే" మీద పరుగులు పెట్టేదే ఎందుకో అలా పెట్ట లేదు.

"గజ దొంగ విహారి"

Kommireddi Pavan March 13, 2007 at 11:01 PM  

ఆ తీపి గురుతులు...చాలా బావున్నాయి...మనిషి జన్మ ఎత్తాక ఇవన్నీ తప్పవేమో కదండీ??...అప్పటి పరిస్థితి తలచుకుంటేనే భయం భయం..కానీ అవి తలచుకుంటే ఎంత మధురమో కదా...

జ్యోతి March 14, 2007 at 10:23 AM  

ఇది చదువుతుంటే నాకు కూడా గుర్తొచ్చింది. డిగ్రీ సెకండీయర్‍లో వుండగా ఒక రోజు ఎలక్షన్ గొడవలలో క్లాసులు జరగలేదు. ఇంటికెళ్ళి ఏం చేస్తాం అని ఫ్రెండ్స్ అంటే మొదటిసారి ఇంట్లో చెప్పకుండా భయపడుతూ సినిమాకి వెళ్ళా. ఎదో సుమన్ పూర్ణిమ సినిమా మార్నింగ్ షో. ఎవరన్నా చూస్తారేమో అని సినిమా మీద చూపు ఉన్నా లోపల భయం భయం.ఎలాగో సినిమా అయిందనిపించి ఇంటికెళ్ళగానే అమ్మకు చెప్పేసా. ఎమీ అనలేదు. చెప్పకున్నా తెలిసేది కాదు.అది కాలేజి టైం కాబట్టి.ఇప్పటికి ఆ సినిమా టివిలో వచ్చినప్పుడల్లా ఆ రోజు గుర్తొస్తుంది.

కొత్త పాళీ March 15, 2007 at 11:38 PM  

అమ్మో, సి.సి.ము. గారూ, సామాన్యులు కారు!!
బాపట్ల ఏజీ కాలేజా?
లేడీస్ హాస్టలు గేటు దగ్గర ఒక పచ్చిమిరపకాయ బజ్జీల బండి ఉండేది ఎప్పుడన్నా తిన్నారా?

సిరిసిరిమువ్వ March 16, 2007 at 3:26 PM  

కొత్తపాళీ గారు
అవునండి ఏజి కాలేజినే. ఎప్పుడన్నా తినటం ఏమిటండి, ఆ బజ్జీల బండికి రెగ్యులర్ కస్టమరలం మేము. సాయంత్రం అయ్యేటప్పటికి గేటు దగ్గర బారులు తీరి వుండే వాళ్ళం వాటి కోసం. బజ్జీలంటే ఆ బజ్జీలే, ఆ రుచే వేరు. మాకు తింటానికి కాపలా అతనికి తేవటానికి తెంపు వుండేది కాదు. మీరు కూడా ఆ కాలేజి నుండేనా ఏమిటి?

కొత్త పాళీ March 16, 2007 at 9:17 PM  

ఏబ్బే. బీటెక్కు టెక్కి "బతకలేక బడి పంతులన్నట్టు" ఒక ఏడాది పాటు బాపట్ల ఇంజనీరింగు కాలేజిలో పాఠాలు చెప్పాను. "మాయాబజారు"లో ఒకింట్లో అద్దెకుండే వాళ్ళం నేనూ, నా సహోద్యోగులిద్దరూ. మీరు రెగ్యులర్ కస్టమర్లయితే నేనూ నా రూమ్మేట్లూ వాడికి మహారాజ పోషకులం. బాపట్ల జ్ఞాపకాల గురించి ఇంకొంచెం బ్లాగండి. అక్కడ నేనున్నది ఏడాదే అయినా (తొమ్మిది నెలలే), చెప్పుకునేందుకు చాలా కబుర్లున్నాయి - చెబుతాను ఎప్పుడో. :-)

రానారె March 29, 2007 at 2:46 AM  

నేను గోడదూకి చూసిన సినిమా ఒకే ఒకటి. కాకతాళీయమే అయినా ఆ సినిమా పేరు Mr.NiceGuy (జాకీచాన్ నటించిన గొప్ప కలర్ చిత్రం :)))

ఇక్కడ విహారి గారి కామెంట్‌కి పుష్కలంగా నవ్వొచ్చింది. ఇంతమంది జ్ఞాపకాలను తిరగదోడిన మీకు కృతజ్ఞతలు.

సత్యసాయి కొవ్వలి Satyasai May 9, 2007 at 7:53 PM  

ఇదేంటి, ఇన్నాళ్ళూ గమనించలేదు. మీది ఏజీ కాలేజీయా? నేనక్కడినుండే. 1979-85 పిజీ కూడా అక్కడే- ag.econ. అబ్బ ఎన్నాళ్ళకి మాకాలేజీ వాళ్ళని - అందులో బ్లాగ్ముఖంగా కలిసా. మీ వివరాలు - నా మెయిల్ కి కొట్టగలరా ?

Rajiv Puttagunta April 1, 2008 at 2:57 AM  

yemandi meeru ee tapaa raasina innallaki vacchina message anukunta.

Mee next generation Bapatla sambhandheekunni.

B.Tech 98 batch.

Mee tapaa nacchindhi.

Mee time loney kaadhu..maa time lo kooda kotha cinemalaki chirala, tenali...inka vja vellevallam.

Vichitramgaa nenu Asoka cinema chooddaniki Vja velli, intiki vellakunda vaccha.

Maa nannagaaru aa roju bapatla vacchi nenu kanapadaka thega khangaaru paddaranta.

Yevariki cheppakunda vellam kadhaa. Maa roommate oka educationist. Andhukey vaadiki kooda cheppala.

Okaroju bapatla nundi alaa adrusyam ayyi..chaala mandhiki shocklu icchanu.

Maina August 14, 2011 at 9:53 PM  

Oka subha vaartha bapatla ag college vallaki. APAU alumni ani facebook lo group vundi bapatla kaburlu nemaravesukovacchu. bajji bandi, badam palu, 4 cinema hallu and mukhyam gaa saaga teeram.

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP