పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

March 6, 2007

ఎంత కష్టం-ఎంత కష్టం.

ఎంత కష్టం-ఎంత కష్టం-భావి భారత పౌరునికి ఎంత కష్టం.

ఒకరి సెల్‌పోయింది..
ఒకరి పరీక్ష పోయింది
సెల్‌ఫోన్‌ పోయిందంటూ ఓ ప్రయాణికుడు హడావుడి సృష్టించాడు. బస్సులో ఉన్న వారందరినీ తనిఖీ చేయాలని పట్టుబట్టాడు. అప్పటిదాకా బస్సు కదిలించరాదని డిమాండ్‌ చేశాడు. అతను అనుకున్నది సాధించాడు. ప్రయాణికులందరినీ సోదా చేశారు. 20 నిమిషాల తర్వాత బస్సు మళ్లీ బయలుదేరింది. ఈ సంఘటన వల్ల ఓ ఇంటర్‌ విద్యార్థికి కోలుకోలేని నష్టం జరిగింది. బస్సు ఆలస్యం కావడంతో... అతను సరైన సమయానికి పరీక్ష హాలుకు చేరుకోలేకపోయాడు. అధికారులు అతనిని పరీక్ష రాసేందుకు అనుమతించలేదు. సోమవారం మెదక్‌ జిల్లాలో జరిగిన సంఘటన ఇది.. ఇంత జరిగినా పోయిన సెల్‌ఫోన్‌ దొరకలేదు.

ప్రైవేటు కళాశాలల ఉదాసీనత

కొన్ని కార్పొరేట్‌ కళాశాలలు ఉదయం 7.45 గంటల వరకు పరీక్షా కేంద్రాల్లోకి వెళ్లడానికి అనుమతించలేదు. దీంతో విద్యార్థులు రోడ్డుపైనే నిలబడాల్సి వచ్చింది. చివరి 15 నిమిషాల్లో అధ్యాపకులు హాల్‌టికెట్‌ చూసి లోపలికి పంపడం మొదలుపెట్టారు. దీంతో త్వరగా లోపలికి వెళ్లాలనే తొందరలో విద్యార్థుల మధ్య తోపులాట జరిగింది. ప్రధాన రహదారిపై ఉన్న కళాశాలల వద్ద ఒక్కసారిగా విద్యార్థులు గుంపుగా చేరడంతో హిమాయత్‌నగర్‌, నారాయణగూడ, ఎస్‌ఆర్‌నగర్‌ ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఇంటర్మీడియట్‌ అధికారులు పరీక్షకు అరగంట ముందుగా విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించాలని ఆదేశించినా, కొన్ని ప్రైవేటు కళాశాల నిర్వాహకులు సరైన విధంగా వ్యవహరించకపోవడమే ఈ పరిస్థితికి కారణమని తేలింది. ఇలాంటి సమస్యలు మళ్లీ జరగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.


చందానగర్‌ టు షాపూర్‌నగర్‌

షాపూర్‌నగర్‌: ఇంటర్మీడియట్‌బోర్డు అధికారుల నిర్లక్ష్యం ఓ ప్రైవేటు కార్పొరేటు కళాశాలకు చెందిన ఇంటర్మీడియట్‌ విద్యార్థులను అయోమయానికి గురిచేసింది.చందానగర్‌లో ఇదివరకు గౌతమి కళాశాల ఉండేది. అయితే ఈ కళాశాలను కుత్బుల్లాపూర్‌ మున్సిపాలిటీ షాపూర్‌నగర్‌లోని సొంత భవనంలోకి మార్చారు. ఈ తతంగం జరిగి రెండేళ్లయ్యింది. అయినా ఇంటర్మీడియట్‌ బోర్డులో ఆ కళాశాల అడ్రసు మాత్రం మారలేదు. దీంతో బోర్డు అధికారులు ఆ కళాశాల పాత చిరునామాతోనే వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులకు హాల్‌టికెట్లు జారీచేశారు. సోమవారం నుంచి విద్యార్థులకు పరీక్షలు ప్రారంభం కాగా గౌతమి కళాశాల సెంటర్‌ పొందిన శ్రీచైతన్య, నారాయణ, రాయల్‌ కళాశాల విద్యార్థులకు అందజేసిన హాల్‌టికెట్లపై మాత్రం చందానగర్‌ అడ్రస్‌ ఉండటంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర అయోమయానికి గురయ్యారు. రెండు మూడు రోజుల ముందు హాల్‌టికెట్లు తీసుకున్న విద్యార్థులు దానిపై తప్పుడు అడ్రస్‌ వచ్చిందని తెలుసుకుని ముందుగానే షాపూర్‌నగర్‌ సెంటర్‌ అడ్రస్‌ను చూసి వెళ్లారు. ఒకరోజు ముందు హాల్‌టికెట్లు తీసుకున్న విద్యార్థులు ఈ విషయం తెలియక మొదటి రోజు పరీక్షలకు తీవ్ర ఆందోళనతో హాజరయ్యారు.

ఈ కాలేజి అనే కాదు చాలా కాలేజిల విషయం లో ఇలాగే జరిగింది. మా పాపకి కూడా ఇలానే జరిగింది. హాల్ టికెట్ మీద మా కాలనీ అడ్రస్ ఇచ్చారు, కాకపోతే మాకు ఆ అడ్రస్ లో ఆ కాలేజి లేదని తెలుసు కాబట్టి ఇబ్బంది పడలేదు, కానీ చాలా మంది వెతుక్కోవలసి వచ్చింది. (అసలు కాలేజి వుంది అక్కడికి 2 కి.మీ దూరంలో). అసలు విషయం ఏంటంటే, కాలేజిల అడ్రస్ మారి 6-7 సంవత్సరాలు అవుతున్నా మన ఇంటర్ బోర్డు వాళ్ళకి తెలియదండి పాపం.

ఇవండీ మన ఇంటర్ బోర్డు లీలలు.

4 వ్యాఖ్యలు:

రాధిక March 6, 2007 at 8:03 PM  

ఇంటర్ బోర్డ్ వాళ్ళు చేసే తప్పులు ఎన్నడం మొదలు పెడితే అలా లెక్క చెపుతూనే వుండాలిసివస్తుంది.అయినా ఒక్కరోజు ముందు,రెండు రోజులముందు హాల్ టికెట్లు తీసుకోవడం ఏమిటి?చాలా ముందుగానే ఇస్తారు కదా?ఇది మాత్రం విధ్యార్ధుల తప్పే.

రానారె March 6, 2007 at 10:36 PM  

ఫోను జాగ్రత్త చేసుకోవడం అతని బాధ్యత. ప్రయాణీకులకు ఇబ్బందికలిగేలా బస్సును ఆపించడం నిస్సందేహంగా నేరం. ఆ సెల్‌ఫోను మనిషిమీద ఇంటర్ విద్యార్థి న్యాయస్థానంలో దావా వేసి నష్టపరిహారం పొందవచ్చేమో.

కొత్త పాళీ March 8, 2007 at 9:22 PM  

సి.సి.ము గారూ, మీ బ్లాగులు ఇప్పుడే దర్శించాను. బాగున్నాయి. మరిన్ని మంచి బ్లాగులు రాయాలని ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ..

సిరిసిరిమువ్వ March 13, 2007 at 5:46 PM  

కొత్తపాళీ గారికి

మీకు నా బ్లాగులు నచ్చినందుకు ధన్యవాదములు.

మీ అన్ని బ్లాగులు నేను చూస్తూ వుంటాను, బాగుంటాయి. సంగీతం మీద మీకున్న పరిజ్ఞానానికి, పట్టుకి మీకు నా జోహర్లు.

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP