పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

February 26, 2007

పిల్లలు-పుస్తకాలు

"పుస్తకాలను చదివి, మస్తకాలను మథిస్తే జనిస్తుంది జ్ఞానం". ఇవాళ పేపరు చదువుతుంటే నన్ను ఆలోచింపచేసిన వాక్యము ఇది.
ఇప్పటి పిల్లలు తరగతి పుస్తకాలు కాకుండా అదనముగా ఏ పుస్తకాలను చదువుతున్నారు? మనం వాళ్ళకి ఆ అవకాశం ఇస్తున్నామా? వాళ్ళకి చదువుకోను మంచి మంచి తెలుగు పుస్తకాలు కొనిపెడుతున్నామా?
బాగా చిన్నప్పుడు-ఊహ తెలిసీ తెలియని తనములో-సాయంత్రం అయ్యేటప్పటికి-అమ్మ పెట్టిన గోరుముద్దలు తిని నాయనమ్మ పక్కన చేరి కథ చెప్పవా అని గొడవ మొదలెడితే----అనగనగా ఒక రాజు గారు, ఆయనకి ఏడుగురు కొడుకులు-----
రోజూ ఇదే కథా?
అయితే, అనగనగా ఒక రాజకుమారుడు -ఇలా సాగిపోయేవి కథలు. కొన్ని కథలయితే రోజుల తరబడి సాగేవి.
రాజకుమారుడు గుర్రమెక్కి వస్తాడంటే—గుర్రానికి రెక్కలుంటాయి, అలా అలా ఎగిరి వస్తాడు అనుకునేదాన్ని. ఆప్పటికి అసలు గుర్రాన్నే చూడలేదు నేను.
కొంచం పెద్దయ్యాక, అంటే చదవటం కొంచం కొంచం వచ్చాక—చందమామలు, బాలమిత్రలు—ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురు చూసేవాళ్ళం. నేను ముందంటే నేను ముందు అని పోట్లాడుకునేవాళ్ళం. పట్టువదలని విక్రమార్కుడంటే నాకు చిన్నప్పుడు అర్థమయేదికాదు. అంటే ఏంటా అనుకునేదాన్ని-బహుశా పట్టు అనే వస్తువుని వదలడేమో అనుకునేదాన్ని.
ఆ తరువాత—ఇంకొంచం పెద్ద అయ్యాక—అంటే బాగా ఊహ తెలిసాక-తెలుగు వారపత్రికలు—జ్యోతి, ప్రభ చదివేదాన్ని. ఆప్పట్లో, వాటిలో కథలు పిల్లలు కూడ చదివేటట్లు వుండేవి.
ఇంకాస్త పెద్దయ్యాక-మాదిరెడ్డి, యద్దనపూడి, వాసిరెడ్డి, మరియు కనపడ్డ, వినపడ్డ ప్రతి తెలుగు రచయిత, రచయిత్రి పుస్తకాలు చదివెయ్యడమే పని. అప్పటికి ఇంకా లోకజ్ఞానము తక్కువే. యద్దనపూడి నవల్లలో కధానాయకుడు పడవ లాంటి కారులో వచ్చేవాడు. ఓహో పడవనే కారుగా వేసుకొస్తాడు కావాలి అనుకునేదాన్ని.
ఇక కాలేజి కి వచ్చాక- క్లాసు పుస్తకాలలో నవలలు పెట్టుకుని మరీ చదివేవాళ్ళం (అలాగని చదువుని ఎప్పుడూ అశ్రద్ధ చేయలేదు). కొత్త పుస్తకం వెంటనే చదవాలి అదీ అక్కడ సంగతి.
మరి ఇప్పటి పిల్లలు ???????
ఇప్పటి పిల్లలు ఎంతమంది తాతయ్య అమ్మమ్మల దగ్గర చేరి కథలు చెప్పించుకుంటున్నారు?. చందమామ అంటే ఎంత మందికి తెలుసు. తెలుగు కథల పుస్తకాలు ఎంత మంది చదువుతున్నారు? బేతాళుడు, విక్రమార్కుడు అంటే ఎంత మందికి తెలుసు? హారీ పాటర్ అంటే మాత్రం తెలుసు. ఎందుకు ఇలా జరుగుతుంది? విలువలు మారిపోతున్నాయా? లేక మనం మారి పోతున్నామా?
మన పిల్లలకి చిన్నప్పటినుండే చదవటం అలవాటు చేద్దాము. ఏదో ఒకటి, కనీసం నెలకు ఒక్క తెలుగు పుస్తకం చదివిద్దాము. కంప్యూటర్ల ముందు, టివి ల ముందు కూర్చోవడం తగ్గించి చదవటం అలవాటు చేసుకోమందాము. మాతృభాష లో చదవటము లోని తీయదనము వాళ్ళకి రుచి చూపిద్దాము. ఒకసారి మాతృభాష లో చదవటంలో వుండే ఆనందం అర్థమయితే ఆ తీపిదనము రుచి చూస్తే ఇక మనం చెప్పకుండా వాళ్ళే చదువుకుంటారు. ఆ ఆనందం వాళ్ళకి అర్థం అయ్యేలా చేయవలసిన బాధ్యత మనది, మన అందరిది.
ఇక్కడ నాకో Arab proverb గుర్తుకొస్తుంది. "A book is like a garden carried in the pocket". ఆ తోటలోని వివిధ రకాల పరిమళాలు మన పిల్లలు ఆస్వాదించేలా చూద్దాము.

7 వ్యాఖ్యలు:

రాధిక February 26, 2007 at 5:33 AM  

నిజమే ఇప్పుడు చదవడం బాగా తగ్గిపోయింది. చెప్పించుకుని వినడమూ తగ్గిపోయింది.అంతా చూడడమే.ఈ పరిస్తితి మారాలి.మార్చడానికి ప్రయత్నించాలి.

Valluri Sudhakar February 26, 2007 at 10:57 PM  

కాల ప్రవాహ మహిమ. ఇ-పుస్తకాలు తప్ప, అ-పుస్తకాలు (అంటే, అచ్చు పుస్తకాలు) చదివే రోజులా ఇవి ?

రానారె February 28, 2007 at 7:18 AM  

మాతృభాషలో చదవటంలో వుండే ఆనందం అర్థమయితే వాళ్ళే చదువుకుంటారు. ఆ ఆనందం వాళ్ళకి అర్థం అయ్యేలా చేయవలసిన బాధ్యత మనది, మన అందరిది. -- అత్యంత కీలకమైన విషయమిది. సరే ఈ బాధ్యతను ఎలా నిర్వర్తించాలో మీ ఆలోచనలేమిటో తెలియజేయండి. తెలుగును ఆదరించండి, కాపాడండి అని అరిచేవాళ్లందరూ ఆగి ఆలోచించాల్సిన విషయం. తెలుగుభాష తీయనిది. కానీ ఈ సంగతిని పిల్లలు అంగీకరించాలంటే దాని రచిని తల్లిదండ్రులు, గురువులు చూసినవాళ్లై ఉండాలి. తమకే 'తెలుగు నిజంగానే తీయనిదా' అనే సందేహం ఉంటే పిల్లలెలా నమ్ముతారు? చిన్నప్పుడు అవి చదివాం ఇవి చదివాం సరే, మరి తెలుగుభాషలో చదవడం అంత తీయనిదైతే ఇప్పుడెందుకు చదవడం లేదు మనం? ఇప్పడు కాస్త సెలవు దొరికితే సినిమాకెళ్లడమో, టీవీ చూడటమో కాలక్షేపం. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? మనకు లేని అలవాటు పిల్లమీద రుద్దుతామంటే అది వాళ్లు హింస అముకుంటారు కదా.

సిరిసిరిమువ్వ February 28, 2007 at 4:03 PM  

రానారే గారు

గుర్రాన్ని నీళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళగలమే గాని దానిచేత తాగించలేము కదా. ఎవరికి వాళ్ళకి ఆ స్పృహ వుండాలండి.

ఇక మా ఇంటి విషయానికి వస్తే, మా పిల్లలు చక్కగా తెలుగు లోనే మాట్లాడతారు. తెలుగు పుస్తకాలు బాగా చదువుతారు. మేము అంటే మా వారు నేను ఎప్పుడన్నా పొరపాటున కొన్ని ఇంగ్లీష్ మాటలు వాడతామేమో కాని వాళ్ళు మాత్రం శుద్ధ తెలుగు లోనే మాట్లాడతారు. పుస్తకాలు అయితే ప్రతి రోజూ ఏదో ఒక పుస్తకం చదివి కాని పడుకోరు. మా పాప ఇంటర్, బాబు 8వ తరుగతి చదువుతున్నారు. వాళ్ళ పరీక్షలప్పుడు కూడ చదవటం మానరు. మేము కూడ పరీక్షలప్పుడు ఆ పుస్తకాలేంటి అనం.

సెలవలులో తెలుగు లో ఏదో ఒక విషయం మీద ఒక చిన్న వ్యాసం లాగా రాయమంటాము. ఇప్పుడంటే ఉత్తరాలు రాయటం లేదు కాని వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళచేత ఇంటికి తెలుగు లో ఉత్తరాలు రాయించేవాళ్ళం.

హైదరాబాదు లో ప్రతి సంవత్సరము పుస్తక ప్రదర్శన జరుగుతుంది కదా అప్పుడు మేము పిల్లలకి కొనేది తెలుగు పుస్తకాలే. ఊరికే కొనటమే కాదు వాళ్ళు చదువుతారు కూడ. వీలైనంతవరకు తెలుగు మాటలన్నిటికి అర్థాలు చెపుతూ వుంటాము. నిత్య జీవితం లో ఎలా ఆ మాట వాడాలో చెపుతాము.

మా ఇంటిలో ఆచరిస్తుందే నేను రాసాను కాని ఏదో రాజకీయనాయకుల ఉపన్యాసాల కి మల్లే ఎదుటి వాళ్ళు ఆచరించటానికే నీతులు అన్నట్లుగా చెప్పలేదండి.

తెలుగుభాష రుచి మేము చూసాము, మా పిల్లలకి కూడా చూపించాము, చూపిస్తున్నాము.

Naveen Garla February 28, 2007 at 7:27 PM  

సిరిసిరిమువ్వ గారు...మీ అసలుపేరు ఏమిటో తెలియదుకానీ మీరు రాసింది చదివి నా కళ్ళు గిర్రున తిరిగాయి (అతిశయోక్తికాదు...నిజంగానే నా బుర్ర తిరిగిపోయింది). ఈ కాలం పిల్లలకి తెలుగు ఎక్కడ వస్తుంది అని కాకుండా, మీరు వారికి నేర్పి చూపించారు, వేరే వారికి ఆదర్శంగా నిలిచారు. ఈ కాలంలో రోజూ తెలుగు పుస్తకాలు చదివే పిల్లలా..నాకింకా నమ్మశక్యం కాకుండా ఉంది. తలుచుకుంటే తెగ ఆశ్చర్యమేస్తోంది. దయచేసి మీరు ఈ కథని పోస్టుతో ముగించకుండా...తెలుగు మీ పిల్లలకి నేర్పించడంలో మీరు ఆచరించిన ఉత్తమ విధానాలేమిటో మీ బ్లాగులో వివరంగా వ్రాస్తే..మేమందరం చదివి ఆనందిస్తాం.
అభినందనలతో,
నవీన్ గార్ల
(http://gsnaveen.wordpress.com)

రానారె March 1, 2007 at 7:36 AM  

ఆమధ్య, మన బ్లాగావరణంలోని తారలు చిన్ననాడు తాము చదివిన పుస్తకాలగురించి నెమరువేసుకొన్నాయి. అంతటితో ఆగిపోయాయి. తాము ఈ మధ్య చదివిన తెలుగు పుస్తకాలను గురించి మాట్లాడిన వారే లేకపోగా (ఒకరిద్దరు మినహా), ప్రజలకు తెలుగు చదివే అలవాటు తగ్గిపోయిందని వాపోవడం సబబనిపించలేదు. ఆ ప్రభావం నా వ్యాఖ్యలో కనబడింది. తామే తెలుగు పుస్తకాలు చదవకుండా, పిల్లలో మరెవరో చదవలేదంటున్న వారికి - మీ ఈ టపాను వేదికగా చేసుకొని, 'మనం చదువుదాం. అప్పుడే పిల్లలను చదివించగలం' అని గట్టిగా చెబుదామన్న నా ప్రయత్నం బెడిసింది. కారణం - నేను కాస్త ఆవేశానికి లోనవడం. బేషరతుగా మీ నుండి క్షమాపణ కోరుతున్నాను. ఇక, మీ పిల్లల గురించి తెలిసి చాలా సంతోషం కలిగింది. మీలాంటివారు నలుగురుంటే చదివినవి చర్చించుకోవడానికి వీలుంటుంది. ఆసక్తి అదే పెరుగుతుంది. పాఠకుల సంఖ్యకూడా పెరుగుతుంది. అప్పుడు గొప్పగొప్ప రచనలు మళ్లీ వచ్చే అవకాశం ఉంటుంది. మనం ఆసక్తి కనబరిస్తేనే కదా పిల్లలు అటువైపు మొగ్గేది!

"చిన్నప్పుడు అవి చదివాం ఇవి చదివాం సరే, మరి తెలుగుభాషలో చదవడం అంత తీయనిదైతే ఇప్పుడెందుకు చదవడం లేదు మనం?" - ఇది అందరికంటే ముందు నాకు వర్తిస్తుంది. చదవడానికి నేను ఉపక్రమిస్తున్నాను. నా భావాన్ని సరిగా తెలియజేయలేకపోయినందుకు మన్నించండి. :)

Unknown September 17, 2007 at 4:16 AM  

నేటికాలంలో ఎవరైనా ఆలోచించే ప్రయత్నం చేస్తున్నారంటారా?..తెలుగు పుస్తకాలే కాదు. అసలు పుస్తకాలే చదవట్లేదు జనాలు. అసలు ఆలోచించాలి అనే ఆలోచనే తట్టకుండా మిథ్యా ప్రపంచంలో మరమనుషుల్లా తయారు చేసేందుకే ఇప్పుడు మీడియా ప్రజల మెదళ్ళపై ఒక పెద్దయుద్ధం సాగిస్తుందంటే అతిశయోక్తి కాదేమో.
దాదాపు ౯౭% పైగా అక్షరాస్యులైన అమెరికా మొత్తం జనాభాలో ౩% మందికి లైబ్రరీ కార్డులుంటాయని అంచనా. అదే వీడీయో షాపుల్లో సభ్యత్వం మాత్రం ౫౦% పైగా ప్రజలకు ఉన్నాయంటా!!

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP