పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

February 22, 2007

నా మొదటి టపా

అందరికి నమస్కారం

ఇది నా మొదటి టపా. ఏదో మా అయన మీద కోపంతో బ్లాగు మొదలెట్టాను కాని ఏం రాయాలో ఎలా రాయాలో తేల్చుకోవటానికే రెండు రోజులు పట్టింది. మా ఆయన మీద కోపం ఎందుకంటారా? అయనో పెద్ద బ్లాగరు లేండి అందుకు. గంటలు గంటలు కంప్యూటర్ మీద ఏం రాస్తారో అనుకునే దాన్ని. బ్లాగరుల బాధితుల సంఘం పెడదామని కూడా అనుకున్నాను.

సరే బ్లాగులో టపా రాసే ముందు అసలు ఎవరు ఎవరు ఎలా రాస్తారో ఒకసారి చూద్దామని అందరి బ్లాగులు కూడలి లో, తేనెగూడులో ఒకసారి చదివా. అప్పుడు అర్థమయ్యింది బ్లాగులలోని తీయదనం.

కొందరి బ్లాగులు చదువుతుంటే వెనకటి రోజులు గుర్తుకొచ్చాయ్. కళాశాలలో వుండగా ఇంటికి రాసిన ఉత్తరాలు, స్నేహితులకి రాసిన సుదీర్ఘ లేఖలు, పెళ్లి కాక ముందు మా కాబోయే వారికి రాసిన ఉత్తరాలు, పెళ్ళి అయ్యాక ఆషాడమాసంలో శ్రీవారికి రాసిన ఉత్తరాలు అన్నీ గుర్తుకొచ్చాయ్. ఇప్పటికీ మరలా మరలా చదువుకోవాలనిపించే ఆ పాత మధురాలు గుర్తుకొచ్చాయ్.

ఈ ఫోనులు, ఈ-మెయిల్సు, SMS లు వచ్చాక మనం రాయటం ఎంతగా మరిచిపోయామో గుర్తుకొచ్చింది. ఇప్పుడు తెలుగు లో ఒక పేరా రాయాలంటే ఎంత కష్టంగా వుందో. మనం భాష మరిచిపోతున్నామా? భయం వేస్తుంది. అందుకే నేను కూడా బ్లాగు రాయాలని నిర్ణయించుకున్నాను. ఇది చెపితే మా ఆయన ఎంత సంతోషిస్తారో. ఈ బ్లాగులు అన్నీ కలిపి బ్లాగాహారం గా చేసి మన పిల్లలకి కానుకగా ఇస్తే బాగుంటుంది కదూ.

బ్లాగు మొదలుపెట్టటానికి ప్రత్యక్షంగా ప్రేరేపించిన మా వారికి, రాయటానికి పరోక్షంగా ఉత్సాహం ఇచ్చిన చాలా మంది బ్లాగర్లకు నా వందనములు.

మొదటి సారి రాయటం, ఏమయినా తప్పులు వుంటే సరిదిద్దండి.

అప్పుడప్పుడు మిమ్ముల్ని అందర్ని పలకరిస్తూ వుంటాను.

18 వ్యాఖ్యలు:

Satya February 22, 2007 at 11:31 PM  

మన ఆలోచనలను మనలా ఆలోచించే వారితో పంచుకునే ఈ బ్లాగరుల ప్రపంచానికి సుస్వాగతం

cbrao February 22, 2007 at 11:43 PM  

Welcome to blog world. Please write your profile.

Unknown February 22, 2007 at 11:50 PM  

బ్లాగు లోకానికి సుస్వాగతం.
మొదలెట్టాకా ఇక మంచి మంచి టపాలతో కానీండి.

అన్నట్టు మీ వారు తెలుగు బ్లాగరేనా ? కాకపోతే ఆయన్ను కూడా లాగండి ;)

రాధిక February 23, 2007 at 1:45 AM  

స్వాగతం.మొదటి పోస్టే చాలా బాగా రాసారు.బ్లాగరుల బాధితుల సంఘం అని భయపెట్టారు కదండి.ఎక్కడ మా వారికి సపోర్టు పెరిగిపోతుందో అని తెగ భయపడ్డాను.

చదువరి February 23, 2007 at 7:17 AM  

స్వాగతమండి. బ్లాగు బాధితులు కొందరైతే, బ్లాగరుల బాధితులు కొందరు.

రానారె February 23, 2007 at 7:25 AM  

మీ మొదటి బ్లాగుతోనే మీరు చాలా బాగా రాయగలరనిపించారు. సుస్వాగతం. ఆ పేధ్‌ద్ధ బ్లాగరెవరో చెప్పరన్నమాట! :)

Sudhakar February 23, 2007 at 11:38 PM  

సుస్వాగతం. ఇంతకీ ఎవరబ్బా ఆ బ్లాగర్ భ/ఆఫ్ సరిగమలు? :-)

Anonymous,  February 24, 2007 at 6:02 AM  

మంచి ఆరంభం.
ఇక ఆగకండి.
నెల తిరిగేసరికి మీ ఇంట్లో ఎలా వుండాలంటే. ఒక కంప్యూటర్ లో మీరు ఇంకో కంప్యూటర్ లో మీ వారు బ్లాగ్ రామాయణం రాస్తూ వుండాలి. మీరు సమాధానాలు ఇవ్వాల్సిన కామెంట్లు మీ వారికన్నా ఎక్కువ వుండాలి.
తరువాత కొద్ది రోజులకు ఫోను వచ్చినా "అది నీ కాలే నువ్వే వెళ్ళి తీసుకో" అని ఒకరంటే "కాదు నీ కాలే నువ్వే వెళ్ళి తీసుకో" అని ఇంకోరంటూ వుండాలి.
ఇంకొద్ది రోజులకు "బాబోయ్ నీ బ్లాగులాపేయ్.. నా బ్లాగులాపేస్తా" అని మీ వారు అనాలి. అంతగా రాయాలి మీరు.

ఒక సారి బ్లాగుల్లోకి దిగిన తరువాత మీరు మానేసే సమస్యే లేదు. ఎందుకంటే ఇదో పెద్ద "బ్లాగు తేలు". ఇది కుట్టిన తరువాత దాని "సలుపు" ఓ పట్టాన పోదు.


విహారి.
http://vihaari.blogspot.com

Dr.Pen February 24, 2007 at 11:05 AM  

'సరిగమల చెల్లీ',

బాగు..బాగు..ఇలాగే బ్లాగు...బ్లాగు...!(ఇక్కడ 'బ్లాగు' క్రియా రూపంలో వాడబడిందని పెద్దలు చిత్తగించవలెను!)

మరి అదే చేత్తో మా 'బ్లాగు-బావె'వరో కూడా బ్లాగితే సంతసిస్తాం!

బావా...ఎక్కడ బ్లాగితీవు? కాస్త కనికరించి ఇక్కడ ఓ వ్యాఖ్య పడేస్తే మా శంక తీర్చినవాడవుతావు కదా!

సిరిసిరిమువ్వ February 24, 2007 at 11:16 AM  

అందరికి ధన్యవాదములు. నా మొదటి బ్లాగుకే ఇంత స్పందన రావటము చాలా సంతోషముగా వుంది.

సత్యా గారూ, మీ రచ్చబండ కబుర్లు బాగుంటాయండి.

రావు గారూ, profile అంత అవసరం అంటారా?

ప్రవీణ్ గారూ మా వారు తెలుగు బ్లాగరే నండి.

రాధిక గారూ మీరు కవితలు చాలా బాగా రాస్తారండి.

చదువరి గారూ, మీ అభిప్రాయాలు, ఆలోచనలు, ఆలోచింపచేసేవిగా వుంటాయి.

రానారె గారూ, మీ ఎర్రికాలంలో పీర్లపండగ సంబరం నాకు చాలా బాగా నచ్చిందండి.

సుధాకర్ గారూ, మీకు నా హృదయపూర్వక అభినందనలండి. మీ బ్లాగులు బాగా ఆలోచింపచేస్తాయి.

విహారి గారూ, మీ బ్లాగులు బాగుంటాయండి. నిజంగా మీరు చెప్పినట్లు జరిగితే మా ఇంటిలో రోజూ యుద్ధమేనేమో. అన్నట్లు మీ చి.పం, పె.పం. బాగున్నారా?

జ్యోతి February 24, 2007 at 5:59 PM  

వావ్! మిమ్మల్ని ఏమని పిలవాలి మరి?మీ పోస్టే కాదు మీ కామెంట్ కూడా అదిరిందండి.మీ వారు ఎవరో తెలుసుకోడానికి మిగతా మగబ్లాగరులను తల బ్రద్దలు కొట్టుకోనివ్వండి.మీ బ్లాగు ప్రత్యేకంగా ఇలాగే అదిరిపోవాలి.ఆల్ ది బెస్ట్.

Sudhakar February 24, 2007 at 11:29 PM  

మీరస్సలు మొదటి బ్లాగు చేస్తున్నట్లే లేదు, మీ వారి బ్లాగు కూడా మీరే రాసే వారా ఏంటి :-)

మీ అబ్బాయి పేరు వరీష్ కదా?

రాధిక February 24, 2007 at 11:54 PM  

హ హ..మీ రిప్లై చాలా బాగుంది.ప్రొఫైల్ అవసరమా అంటున్నారు.అవసరమే కదండి.ఎందుకంటే ప్రొఫైల్ లో వున్న మేటర్ తక్కువయినా మనగురించి చాలా చెప్పుతుందది.అభిరుచులు,అలవాట్లు...ఇలా అన్నమాట.మనుషులు కనపడకపోయినా వీటిద్వారానే మనిషిని అంచనా వేసి స్నేహాలు కొనసాగుతూ వుంటాయి.మీ పోస్టులు చదివేముందర మీ మీద ఒక అభిప్రాయం ఏర్పడుతుంది.దేనికయినా ముందర కొంత అవగాహన అవసరం కదా.ఇక మీ ఇష్టం.

తెలు'గోడు' unique speck February 25, 2007 at 1:33 PM  

బ్లాగ్ప్రపంచానికి సుస్వాగతం!బ్లాగింగ్ ఒక (మంచి)వ్యసనం అండి.... మీ వారికి వంటావార్పు నేర్పించండి,మీకు ఏ వంట చేసే సమయంలోనో చక్కటి ఆలోచనొచ్చి వెంటనే బ్లాగ్‌లో "సరిగమలు" పలికించాలనుకొన్నారనుకోండి....

Unknown April 3, 2007 at 10:17 AM  

నేరుగా చెప్పకపోయినా మీవారిపేరు కనుక్కోవడానికి మీరు బోలెడన్ని ఆధారాలిచ్చారండీ! (ఇది పొద్దులో గడి ప్రభావం లెండి.)
చూద్దాం:
1. మీ వారొక పేద్ద బ్లాగరే కాకుండా వికీపీడియన్ కూడానన్నమాట.
2. మీకొక అమ్మాయి, ఒక అబ్బాయి.
3. మీ అమ్మాయి ఈ మధ్యే ఇంటర్మీడియెట్ పరీక్షలు రాసింది.
4. మీరుండేది హైదరాబాదులోనే.

5. నా అంచనా సరైనదే ఐతే...సుధాకర్ అనుకున్నట్లు వరీష్ అనేది మీ అబ్బాయి పేరు కాకపోవచ్చు. అది 'అద్వైత' సూచన. (అంటే మీ పేరు సగం, మీవారు సగం). తప్పైతే ఆగ్రహించకండి.

పై ఐదు పాయింట్లు సరిగానే చెప్పానాండీ?

సిరిసిరిమువ్వ April 4, 2007 at 9:21 AM  

సుగాత్రి గారు (ఇది మీ అసలు పేరేనా లేక కలం పేరా)
చాలా పరిశోధనే చేసినట్ట్లున్నారు నేను ఎవరి తాలుకానో కనుక్కొవటానికి. మీ మెదళ్ళకి బాగానే పని పెట్టానన్నమాట.హ్హ హ్హ హ
మా వారు ఎవరో చెప్పకపోవటానికి వేరే కారణం ఏం లేదండి. నాకు నాకుగా ఒక identification వుండాలని చెప్పలేదు. (ఎవరో చెప్పకపొతే నన్ను బ్లాగర్ల సంఘం నుండి వెలి వేస్తారా ఏమిటి కొంపతీసి).కొన్నాళ్ళయ్యాక చెపితే అప్పుడు నన్ను ఆయన భార్యగా కన్నా సిరిసిరిమువ్వగానే గుర్తిస్తారు కదా అని చెప్పలేదు అంతే.

కామేష్ April 15, 2007 at 4:45 PM  

ఆలస్యంగానైనా మీ బ్లాగును ఈ రోజూ చూసే భాగ్యం కలిగింది. చాలా బాగుంది. ఇలాగే బహు బాగుగా బ్లాగుతూ ఉండండి. మీరెవరో చెప్పినా చెప్పకున్నా మీ ఐడెంటిటీకి ఏం ముప్పులేదు. హామీ మా తెలుగు బ్లాగర్లందరిదీ. ఇంక హాయిగా బ్లాగుతూ మమ్మల్ని అలరించండి.

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP