పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

June 7, 2007

తెలుగు కథకి జేజే 1

"తెలుగు కథకి జేజే" అన్న పుస్తకం 78 కథల సంకలనం. ప్రచురించింది అభినవ ప్రచురణలు, తిరుపతి వారు. వెల 300 రూపాయలు. సంకలనకర్త సాకం నాగరాజు గారు. ఆయన శ్రీకాకుళం డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకులు.
ఇందులో శ్రీ శ్రీ, చలం, దేవులపల్లి నుండి బాపు వరకు తెలుగులో అతిరథమహారథులన్నదగ్గ వారి కథలు ఉన్నాయి. కొందరివి లేవు కూడా!!ఈ పుస్తకం ఏకబిగిన చదవగలిగేది కాదు. ఒక్కొకళ్ళది ఒక్కో శైలి, అందుకే ఆగి ఆగి నిదానంగా ఒక్కో కథ చదువుకోవాలి. నేను కూడా ఇంకా అన్నీ చదవలేదు, కానీ కొన్ని కథలు అంత గొప్పగా లేవు (నాకు). ఎక్కువగా చిన్న కథలే. నేను చదివినవాటిని చదివినట్లు నా వీలువెంబడి సమీక్షిస్తూ ఉంటాను.

అట్లపిండి:- చలం. ఈ కథ చదువుతుంటే అసలు ఇది చలం రాసిందేనా అన్న అనుమానం వస్తుంది. ఆయన సాధారణ శైలికి భిన్నంగా వుంటుంది. కథావస్తువు చాలా చిన్నదే కానీ చెప్పిన విధానం బాగుంటుంది. వాళ్ళ నాయనమ్మ (అట్ల బామ్మ) ఒకావిడ అట్లు చాలా బాగా వండేది. కానీ పిండి recipe ఎవరికి తెలియదు, అడిగినా చెప్పేది కాదు. ఒకసారి ఆయన చెల్లెలు గర్భిణీతో వుండి బామ్మ అట్లు తినాలని ఉందని ఉత్తరం రాస్తుంది. బామ్మ పిండి కలిపి ఒక పెద్ద సత్తెపాళలో (సత్తు తపాళా) పోసి గుడ్డ వాసిన కట్టి ఈయనకు ఇస్తుంది తెసుకెళ్ళమని. నేను మరునాడు వస్తాను నేను వచ్చేవరకు ఆ పిండి మూట విప్పొద్దు అని చెపుతుంది. ఇక ఈయన రాజమండ్రికి రైలులో బయలుదేరతాడు. ఈయన ఎక్కిన దగ్గరనుండి ఆ కంపార్టుమెంటు నుండి ఒక్కొకళ్ళు దిగి వెళ్ళిపోతుంటారు ఈ పిండి వాసనకి. చివరికి ఆ కంపార్టుమెంటులో ఈయన ఒక్కడే మిగులుతాడు. ఆ తరువాత ట్రైను దిగిన తరువాత ఆ పిండి మూట పట్టుకుని ఇంటికి వెళ్ళటానికి రిక్షా వాళ్ళతో పడ్డ పాట్లు మనకు నవ్వు తెప్పిస్తాయి. మరునాడు వస్తానన్న బామ్మ రాదు. నాలుగు రోజులు అయినా రాదు. ఇక ఆ పిండిని వదిలించుకోవటానికి వీళ్ళు పడ్డ పాట్లు, చుట్టుపక్కల వాళ్ళతో తంటాలు , గోదావరిలో వేసినా, శ్మశానంలో పూడ్చి పెట్టినా అది తిరిగి వీళ్ళింటికే రావటం, చివరికి అనంతపురంలో వీళ్ళు బాకీ ఉన్న ఒకాయనకి పిండిని పోస్టులో పంపించటం, ఈ పిండి వాసన దెబ్బకి అక్కడ ప్లేగు వ్యాది మొదలవటం ఇదీ కథ. సునిశితమైన హాస్యం ఉన్న కథ. చలం శైలికి భిన్నంగా ఉండటానేమో నాకు నచ్చింది.

అడల్ట్ స్టోరీ:-కె.ఎన్.వై. పతంజలి. విషయం లేని కథ. క్లుప్తంగా చెప్పాలంటే నిరోద్ వాడటం మీద భార్యా భర్తలకి మద్య జరిగే సంభాషణ ఈ కథ. ఇంతకు మించి దీన్ని గురించి చెప్పటానికి ఏమీ లేదు. పతంజలి స్థాయికి తగ్గట్లుగా లేదు.

అర్రు కడిగిన ఎద్దు:-త్రిపురనేని గోపిచంద్. ఓ మంచి కథ. ఇది ఓ ముసలి ఎద్దు స్వగతం. వయసులో వుండగా తనని యజమాని ఎలా చూసేవాడో, ఇప్పుడు ఎలా చూస్తున్నాడో చెప్పుకునే కథ. ఆ ముసలి ఎద్దునే కాదు, ఆ ఇంటి యజమాని తండ్రి అయిన ముసలతని గురించి కూడా చెప్పే కథ ఇది. ఇద్దరికి పోలికలు చూపిస్తాడు రచయిత. మిగతా పశువులు తినగా మిగిలిపోయిన జనపమోళ్ళు, ఎండుగడ్డి ముసలి ఎద్దుకి పెడితే, ఇంట్లో వాళ్లందరూ తిన్నాక మిగిలిన అడుగు బొడుగు అన్నం ముసలాయనికి పెడుతుంటారు. ఈ ముసలి ఎద్దు, ఆ ముసలాయన అప్పుడప్పుడూ ఒకళ్ళని ఒకళ్ళు ఓదార్చుకుంటుంటారు. ఒకప్పుడు రైతులు పశువులిని ఎంత ప్రేమగా చూసుకునేవాళ్ళు, ఇప్పుడు ఎలా చూస్తున్నారో చెపుతూ అంతర్లీనంగా మానవ సంబంధాలు రోజు రోజుకి ఎలా మార్పు చెందుతున్నాయో చెప్పే కథ ఇది.

ఈ కథ చదువుతుంటే మా బోడెద్దు గుర్తుకొచ్చింది. మా చిన్నప్పుడు మాకు ఓ బోడెద్దు వుండేది. దానికి కొమ్ములు వుండేవి కావు, అందుకని దాన్ని బోడెద్దు అనేవాళ్ళం. అది పుట్టటం కూడ మా దొడ్లోనే పుట్టింది. చాలా సాత్వికంగా వుండేది. ఎవరిని ఏం అనేది కాదు. దానికి జత ఓ కోడెద్దు. మంచి పొగరుగా, హుషారుగా వుండేదని దానిని కోడెద్దు అనేవాళ్ళం. అలవాటు అయిన వాళ్ళని తప్పితే కొత్త వాళ్ళని అసలు దగ్గరికే రానిచ్చేది కాదు. ఈ రెండిటిని కట్టుకొని టైరు బండి మీద పోవటమంటే మాకు చాలా ఇష్టంగా వుండేది. సినిమాలకి కూడా బండి మీదే వెళ్ళేవాళ్ళం. బోడెద్దు బాగా ముసల్ది అయినా ఓపికగానే ఉండేది. ఇక అది బండికి కట్టటానికి పనికిరాదనుకున్నాక ఇంకో ఎద్దుని కొన్నా దీనిని అలానే ఉంచుకున్నాము. మా అందరికి అదంటే చాలా ఇష్టంగా వుండేది. మా నాయనమ్మకి మరీ. జీతగాళ్ళు దానికి కుడితి అదీ సరిగ్గా పెట్టరేమోనని ఆవిడే పెట్టేది. అది చనిపోయినాక బండి మీద తీసుకు వెళ్ళి మా పొలంలో మా తాతమ్మ సమాధి పక్కనే దాన్ని కూడా పాతి పెట్టారు. మా నాయనమ్మ అయితే దాన్ని తీసుకువెళ్ళేటప్పుడు ఏడ్చేసింది కూడా. తరువాత తరువాత ఎడ్లూ, గొడ్లూ అన్నీ పోయి ఇప్పుడు బోడి చావిళ్ళు మిగిలాయి. ఈ కథ చదివాక అవన్నీ గుర్తుకొచ్చి కళ్ళ వెంట నీళ్ళు తిరిగాయి.

అవ్వ తిరునాళ్లలో తప్పిపోయింది:-దేవులపల్లి కృష్ణశాస్త్రి. భావకవి కృష్ణశాస్త్రి గారి కథ ఇది. భావకవిలో హాస్యపాలు కూడా ఎక్కువే అనిపించిన కథ. చదవవలిసిన కథ.
ఓ సుబ్బమ్మవ్వ గురించి ఈ కథ. మన తెలుగు నాట ప్రతి ఊళ్ళో చూసే అవ్వే ఈ సుబ్బమ్మవ్వ. ఈ కథలో ప్రతి పదంలో హాస్యం తొంగి చూస్తూ వుంటుంది. కొన్ని పద ప్రయోగాలు గమ్మత్తుగా వుంటాయి. ఉదాహరణకి-"మా నాన్న మేనత్తంటే డెబ్భై పైమాట గదా. అయితేం నడుం నిటాగ్గ కదురులా నిలబెడుతుంది. యిష్టం లేనప్పుడు మాత్రం తెలుగులో ఐ అక్షరం లేదూ ఐ దానిలాగా వొంగిపోతుంది" ఇలాంటివి ఎన్నో!!
కొన్ని వ్యాక్యాలు చదువుతుంటే పడి పడి నవ్వుతాము. ఈ కథ చదువుతుంటే ముళ్ళపూడి వారిలో కాస్త దేవులపల్లి వారి శైలి ఉందేమో అనిపిస్తుంది. ఈ సుబ్బమ్మవ్వ గారు ఒకసారి మనవడితో తిరునాళ్లకి వెళ్ళి తప్పిపోతుంది. ఆ తరువాత ఆమె ఇంటికి ఎలా చేరింది, ఆమె గురించి ఇంట్లో వాళ్ళు ఎంత అదుర్దా పడింది మంచి హ్యాస్యభరితంగా చెప్పారు దేవులపల్లి వారు.
సమీక్ష కన్నా కథ చదివితేనే మీరు కూడా పడి పడి నవ్వగలరు.

4 వ్యాఖ్యలు:

కొత్త పాళీ June 7, 2007 at 6:11 PM  

ఈ పుస్తకం వల్లంపాటి స్మృతిలో విడుదలైనదా?

సిరిసిరిమువ్వ June 8, 2007 at 11:20 AM  

కొత్తపాళీ గారూ కాదండి. సాకం నాగరాజు గారు కథల మీద తనకున్న అభిమానంతో తను స్వయంగా ప్రచురించింది.

S June 8, 2007 at 7:25 PM  

I can't hide my happiness seeing so many blogposts about books today..... konnaallaku oka manchi repository tayaaru autundi emo telugu pustakaala pai.

Whenever I search for any English book, I get lot of reviews.... Perhaps, Someday, we can hope to find the same in Telugu too,.

Hima bindu December 28, 2009 at 2:07 PM  

ఓహ్!చాల బాగా రివ్యు చేసారండీ .మిగిలినవి కూడా పరిచయం చేయండీ .

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP