పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

June 1, 2007

శవాల మీద రాబందులు


మన హైదరాబాదులో ఆరోగ్యవంతుల నుండి దొంగతనంగా మూత్రపిండాలు తీసి అమ్ముకునే దళారుల గురించి, ఆసుపత్రుల గురించి విన్నాము! అమ్మో ఇంత దారుణమా అనుకున్నాము!! మరి అమెరికాలో అయితే ఇంకా దారుణంగా చచ్చిన శవాలతో కూడ వ్యాపారం చేసుకుంటున్నారు. చనిపోయిన వాళ్ళనుండి ఎముకలు (bones), నరాలు (tendons, ligaments), కణజాలం (tissue), రక్తనాళాలు (blood vessels) కాదేది దోచుకోవటానికనర్హం అన్నట్లు అన్నీ దోచేసుకుంటున్నారంట. ఓ శ్మశానవాటిక సాక్షిగా ఇదంతా జరిగేదంట. పూర్తి వివరాలకి ఇక్కడ చూడండి.

శరీరంలోని ప్రతి ఎముకకి, రక్తనాళానికి ఓ ధర ఉందంట. ఒకసారి ఆ ధరవరలు చూడండి. (యువకుల ఎముకలకి ఎక్కువ ధరలంట!)
Femur bone (తొడ ఎముక)
65 సంవత్సరాల లోపు వాళ్ళది అయితే------$970 అంటే సుమారుగా 38000 రూపాయలు.
65 సంవత్సరాల పై బడ్డ వాళ్ళది అయితే----$550 అంటే సుమారుగా 22000 రూపాయలు.
Tibia (మోకాలి కింది ఎముక)-----------$385 to $600 అంటే సుమారుగా 15400 నుండి 24000 రూపాయల వరకు.
రక్తనాళాలు (పరిమాణాన్ని బట్టి)------------$350 to $1000 అంటే సుమారుగా 14000 నుండి 40000 రూపాయల వరకు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ కణాలు కాని ఎముకలు కాని ఎవరైనా కాన్సర్ రోగి నుండి కాని లేక ఏదైనా ప్రమాదకర రోగం బారిన పడి చనిపోయిన వారినుండి కాని సేకరిస్తే ఇవి transplant చేయించుకున్న వ్యక్తికి కూడా ప్రమాదమే.

నిజంగా ఎటు పోతున్నాం మనం? పురోగమనం వైపా, తిరోగమనం వైపా!!!

4 వ్యాఖ్యలు:

రానారె June 2, 2007 at 1:58 AM  

అవయవాలను అమ్ముకోవడానికి మనుషులను చంపడం దారుణమా, చచ్చినవారి అవయవాలను తీసి అమ్ముకోవడం దారుణమా మీ దృష్టిలో?

రాధిక June 2, 2007 at 3:20 AM  

చచ్చాకా ఎటూ పనికిరాకుండా పోతాము అనుకున్నాను.ఇలా కూడా బ్రతకొచ్చన్నమాట.

సిరిసిరిమువ్వ June 2, 2007 at 12:11 PM  

రానారే గారూ
అవయవాలను అమ్ముకోవడానికి మనుషులను చంపడం గురించి నేనసలు ఇక్కడ ప్రస్తావించలేదు, అది ముమ్మాటికి ముమ్మాటికి దారుణమే. మీరు బహుశా ఈ మధ్య Noida (UP)లో జరిగిన దాన్ని దృష్టిలో పెట్టుకుని అడిగారనుకుంటాను. బ్రతికున్న వాళ్ళనుండి వాళ్లకి తెలియకుండానే వాళ్ళ అవయవాలు తీసి అమ్ముకోవటం ఇక్కడ (హైదరాబాదులో) చాలా పరిపాటి అయిపోయింది. ఒక్కోసారి ఆర్థిక అవసరాల దృష్ట్యా వాళ్ళకి తెలిసే జరుగుతుంది కూడా. కాని ఇక్కడ జరుగుతుంది వేరు. అంతిమ సంస్కారాల కోసం శ్మశానానికి వచ్చిన శవాలనుండి వాళ్ళ కుటుంబసభ్యుల అనుమతి లేకుండా వాళ్ళకి తెలియకుండా అవయవాలు తీసి అమ్ముకోవటం. మీరనవచ్చు, ఎలాగైతే ఏం చివరికి అవి మనుష్యులకేగా ఉపయోగపడుతుంది అని. అది కూడా చనిపోయిన వారినుండేగా తీసుకుంటుంది అని. కానీ తీసుకోవటంలో తేడా వుంది కదా! చనిపోయిన వారి ముందస్తు అనుమతితోనో లేక వాళ్ళ కుటుంబసభ్యుల అనుమతితోనో తీసుకోవటం వేరు, ఇది వేరు. ఆ చనిపోయిన వాళ్ళు ఏ వ్యాధితో చనిపోయారో తెలియదు, ఆ రోగాలు వాళ్ళ శరీరంలో ఎంత వరకు వ్యాపించాయో తెలియదు. ఇక్కడ వాళ్ళు దోచుకుంటుంది ఎముకలు, కణాలు, నరాలు. దానికోసం ఆ శరీరాన్ని ఎంత చిత్రవధకి గురి చేస్తారో ఒక్కసారి ఊహించుకోండి (పార్థీవ శరీరమేగా అంటారా?). ఒకవేళ ఆ రోగి ఏ కాన్సరుతోనో చనిపోతే transplant చేయించుకున్న వాళ్ళు కూడా కాన్సర్ బారిన పడతారు కదా!! వీళ్ళు రెండు వైపులా దోచుకుటమే కాదు భయంకరమైన రోగాల్ని కూడా వ్యాప్తి చేస్తున్నారు.
దీనికి ఒక్కటే పరిష్కారం---Organ donation గురించి ప్రజలలో అవగాహన పెరగాలి. ప్రతివాళ్ళు అవయవదానానికి(చనిపోయాక)సంసిద్దులై ఉండాలి.

సిరిసిరిమువ్వ June 2, 2007 at 12:18 PM  

రాధిక గారూ
చనిపోయాక మనకి తెలియకుండానే మన అవయవాలు బయటికి వెళ్ళిపోతాయండి ఇక మనకేం పనికొస్తాయి. అందుకే ముందుగా అందరం విల్లులు రాసిపెట్టుకోవాలి ఈ విషయంలో, నేను చనిపోయాక పలాన అవయవం పలానా వాళ్ళు నా వారసత్వ సంపదగా తీసుకోండి అని. అప్పుడైనా పోనీలే చనిపోయాకైనా మనకి ఉపయోగపడ్డారు అని సంతోషిస్తారు.

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP