పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

August 31, 2007

వినాయకుడికి పల్లేరు కాయల గారెలు

చిన్నప్పుడు అన్ని పండగలలోకి శ్రీరామనవమి అన్నా వినాయకచవితి అన్నా నాకు చాలా ఇష్టంగా ఉండేవి. శ్రీరామనవమి ఊరివాళ్ళు అందరూ కలిసి చాలా వేడుకగా చేసేవాళ్ళు. రాముల వారి కళ్యాణం అయ్యాక పెట్టే వడపప్పు పానకం ఎంత రుచిగా ఉండేవో. పానకం గ్లాసులు గ్లాసులు తాగేవాళ్ళం. ఇక వినాయకచవితి అయితే చెప్పక్కర్లేదు, అసలైన పిల్లల పండగ. పండగ హడావిడి అంతా పిల్లలదే. పత్రి తెచ్చి పూజ చేయటం దగ్గరినుండి వరసైన వాళ్ళ పక్కల మీద పల్లేరు కాయలు పోయటం, దురదగుండు ఆకు రుద్దటం వరకు అంతా మాదే హడావిడి, ఇక ఆ రోజు అంతా సందడే సందడి.

పండగ ముందు రోజు అన్నయ్య వాళ్ళతో పాటు చెట్ల వెంట పుట్ల వెంట తిరిగి పత్రి సేకరించటం, అన్నయ్య వాళ్ళు చెరువులో కలువ పూవులు, తామర పూవులు కోస్తుంటే ఒడ్డు నుండి అదుగో అక్కడ ఇంకోటి ఉంది, ఇక్కడ ఇంకోటి ఉంది, ఇంకా కావాలి అంటూ ఆజ్ఞలు జారీ చేయటం, పండగ రోజు తెల్లవారుజామునే అన్నయ్య మరలా పత్రికి గుడుల వెంట వెళుతుంటే అన్నాయి వెలగ కాయలు ఎక్కువ తీసుకురా అని చెప్పేదాన్ని, ఎందుకో అవంటే బాగా ఇష్టంగా ఉండేది. పొద్దున్నే లేచి దేవుడిని, పీటల్ని అలంకరించటం చాలా సరదాగా ఉండేది. మట్టి వినాయకుడిని మా ఇంటి పక్క ఆయన చేసిపెట్టే వాళ్ళు. అయన బొమ్మ తెచ్చి ఇస్తే మా అమ్మ ఆయనికి చేట నిండా బియ్యం, కూరగాయలు, డబ్బులు ఇచ్చేది. ఎందుకమ్మా అలా ఇవ్వటం, ఆ బొమ్మేదో మేమే చేస్తాం కదా అంటే అలా ఇస్తే మంచిది అని చెప్పేది.

మా ఇంట్లో ఎప్పుడూ మా అమ్మే కథ చదివేది. ఎప్పుడెప్పుడు కథ అయిపోతుందా అని కాసుకు కూర్చునే వాళ్ళం. పూజ అయ్యే వరకు ఆ రోజు ఏమీ పెట్టేది కాదు. అమ్మ కథ చదువుతుంటే మేము పత్రితో పూజ చేసేవాళ్ళం. అమ్మ చదివే దళాలు (ఆకులు) ఏరి ఏరి మరీ వాటితో పూజ చేసేవాళ్ళం. ఏవైనా లేకపోతే అమ్మా ఈ ఆకులు లేవు ఎలా అనే వాళ్ళం. ఏం పర్లేదు ఉన్నవాటితో పూజ చేయండి చాలు అని చెప్పేది. పూజ అవగానే ఆ పత్రితో చేతులకి తోరణాలు కట్టుకోవటం నాకు భలే ఇష్టంగా ఉండేది. ఎవరైనా పిల్లలకి వాళ్ళ ఇంట్లో పండగ చేసుకోవటం వీలు కాకపోతే వాళ్ళూ కూడా మా ఇంటికే వచ్చేవాళ్ళు, మాతో పాటే భోజనం కూడా చేసే వాళ్ళు. ఎప్పుడెప్పుడు ఈ భోజన కార్యక్రమం అయిపోతుందా ఎప్పుడు మా కార్యక్రమాలకి బయటపడదామా అని చూసేవాళ్ళం.

వినాయకచవితికి వారం ముందు నుండే మా అస్త్రాలన్నీ (పల్లేరు కాయలు, దురదగుండు ఆకు, గట్రా గట్రా) సిద్దం చేసుకునేవాళ్ళం. ఇక భోజనాలు అయ్యాక కనపడ్డ వరసైన వాళ్ళందరికి దురదగుండు ఆకు రుద్దటం, మంచాలమీద పల్లేరుకాయలు పోయటం, నానా అల్లరి చేసేవాళ్ళం. మా ఊరిలో ఒక ఆమె అంటే మా పిల్లలు ఎవరికి పడేది కాదు. వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఎక్కడా పిల్లలిని ఆడుకోనిచ్చేది కాదు ఆవిడ. వాళ్ళ పిల్లలిని మాతో ఆడుకోను కూడా పంపేది కాదు. ఒకసారి వినాయకచవితికి ఎట్లాగైనా ఆమె మీద ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాము. మా ఇంటిలో పూజ అవగానే వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వంటింటి కిటికీలో నుండి తొంగి చూసాము, ఇంకా పూజ అయినట్లు లేదు, కథ వినపడుతుంది. ఎదురుగా కిటికీలో నుండి గ్యాసు పొయ్యి పక్కనే గారెల పిండి గిన్నె కనపడింది. ఇక చకా చకా గుప్పెడు చిన్న చిన్న పల్లేరు కాయలు ఏరి ఆ పిండిలో కలిపేసి ఇక వెనక్కి చూడకుండా ఒకటే పరుగు.

ఇక ఒక గంట తరువాత చూడాలి, ఆమె ఊరంతా వినపడేలా ఊళ్ళో పిల్లలందరిని కలిపి ఒకటే తిట్లు. దేవుడితో పాటు మాకూ (అదే పిల్లలకి) అష్టోత్తర సహస్ర నామావళి చదివేసింది. ఇటు చూస్తే మాకు కడుపు ఉబ్బరం ఆగటం లేదు. ఆ పని మేమే చేసాం అని చెపితే ఇంట్లో బడిత పూజే, చెప్పకపోతే ఆ పని చేసిన గొప్పతనం మాకు దక్కదే? ఎట్లా? మొత్తానికి ఆ పని చేసిన మా నలుగురికి తప్పితే అది మేమే చేసినట్లు చాలా రోజులు ఎవరికి చెప్పలేదు!!!అలా ఆ వినాయకచవితికి లంబోదరుడిచేత కొత్తరకం గారెలు తినిపించాము.

5 వ్యాఖ్యలు:

జ్యోతి August 31, 2007 at 3:32 PM  

ఇంట్లో తెలిసాక మీకు కూడా గారెలు పెట్టుండాలే???

కొత్త పాళీ August 31, 2007 at 3:58 PM  

చిన్నప్పటి జ్ఞాపకాలు బాగా రాశారు. వినాయకచవ్తికి ఇలా open warfare జరుగుతుందని నాకు తెలీదే? మాది చాలా షెల్టర్డ్ లైఫ్ అనుకుంటా. ఊరంతా తిరిగి తొమ్మిది మంది వినాయకుళ్ళని చూడాలని ఒక నియమం ఉండేది.

spandana August 31, 2007 at 7:41 PM  

అయ్యో వినాయక చవితి ఇలానూ చేసుకుంటారని తెలీదే! ప్చ్.

అమ్మో గుర్తుంచుకొని వినాయక చవితికి మాత్రం మీ యింటివైపు రాకుండా చూసుకోవాలి.

--ప్రసాద్
http://blog.charasala.com

రాధిక August 31, 2007 at 9:34 PM  

అచ్చూ మేమూ ఇలాగే చేసేవాళ్లం.9 మంది వినాయకుళ్ళని చూడాలన్న నియమం కూడా వుండేది.పాలవెల్లి అయితే పోటీలు పడి కట్టవాళ్ళం.మళ్ళా అంత ఆత్రం గానే విప్పేవాళ్ళం.మా ఇంట్లో మట్టి వినాయకుడిని మేమే చేసేవాళ్ళం.చవితి కి ముందు రోజు మా ఊర్లో పిల్లలందౌఉ మట్టి వినాయకుడిలాగే వుండేవాళ్ళం ఎందుకంటే బొమ్మను చేయడానికి మట్టిని కలపడం,అచ్చులు పొయ్యడం.అంతా భలె వుండేదిలే.ఇప్పుడు ఇక్కడ ఏమీ లేదు.[మా ఊరిలో కూడా]

lalithag September 1, 2007 at 9:56 PM  

బావున్నాయి మీ పండగ కబుర్లు. శ్రీరామ నవమి, వినాయక చవితి మా చిన్నతనంలో కూడా బలే సరదాగా జరిగేవి. పల్లేరు కాయల గారెలు మాత్రం ఇదే మొదటి సారి వినడం:-) మా ఇంట్లో చాలా సంవత్సరాలు మట్టి వినాయకుడిని కొని మేము రంగులు వేసి అలంకరించే వాళ్ళం. ఇప్పుడు మా పిల్లలు, మా ఆయన కలిసి paldough తో వినాయకుడి బొమ్మ చేస్తారు.

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP