వర్తమానం....గతం....తరం తరం.... నిరంతరం
డిసెంబరు 31, 2009.....11:59:01..మరో కొత్త సంవత్సరానికి కౌంటు డౌన్ మొదలవుతుంది.
అప్పుడే మరో సంవత్సరం గతం అయిపోబోతుంది..మరో సంవత్సరం వర్తమానం కాబోతుంది. కాలం ఎవరికోసం ఆగకుండా ఇలా పరుగులు పెడుతుంది. దానికి ఎవరితోనూ పనిలేదు..ఎవరికోసం ఎదురు చూడదు...ఒకటే పరుగు....పరుగు.... ఇలా సంవత్సరాలు గతించే కొద్దీ మనకూ వత్సరాలు నిండుకుంటున్నట్టేగా! మరి ఎందుకో ఇంతగా ఈ క్షణం కోసం ఎదురు చూస్తుంటాం...సంబరాలు చేసుకుంటాం!...
ఏ బరువూ బాధ్యతలు లేని 16 ఏళ్ల వయస్సులోని కొత్తసంవత్సర సంబరాలకి సంసార చట్రంలో ఇరుక్కున్న ఈ నలభైలలోని సంబరాలకి ఎంత తేడా. అప్పుడు....కొత్తగా హాస్టలు జీవితం..కొత్త కాలేజి..కొత్త పరిచయాలు..అర్థరాత్రి 12 సమీపిస్తుండగా ఏదో ఆనందం...ఓ ఉద్వేగం ...గ్రీటింగ్సు..స్వీట్సు..మొ
పెళ్లయ్యాక...మరో కొత్త లోకం..ఒకే వయస్సు.... కొత్తగా పెళ్లయిన జంటలు....ఓ పది పదిహేను కుటుంబాలు కలిసి ...క్లబ్బులో పార్టీలు ఉన్నా అక్కడ అంత ఎంజాయ్మెంటు ఉండదని ఎవరో ఒకరి ఇంటిలో అందరం కలిసి వేడుకగా వండుకుని తినటం....మెట్లు లేని క్వార్టరు పైకి ఎక్కి ఆ రాత్రంతా గడపటం..నార్త్ ఇండియన్ జంటల డాన్సులు....సౌత్ ఇండియన్ అమ్మాయిల పాటలు...మగవాళ్ళ పేకాటలు...
ఇంటిముందు వాకిళ్లల్లో కళ్లాపులు..ముగ్గులు...మా లైనులో సగం ఇళ్లముందు నేను వేసిన ముగ్గులు..వాటికి రంగులద్ది....పూలు చల్లి....ఉదయపు మంచుతెరల మధ్య వాటిని చూసుకుని మురిసిపోవటాలు...ఎన్నెన్ని మధుర జ్ఞాపకాల రంగవల్లులు!
దీనికన్నా ఓ పదిరోజుల ముందు మొదలయ్యే గ్రీటింగు కార్డుల సందడి..నేను స్వయంగా తయారు చేసి పంపుకునే శుభాకాంక్షల పత్రాలు.....మాక్కూడా చేసిపెట్టొచ్చుగా అని ఉడుక్కునే పక్కింటి స్వరాజ్యం గారు..ఏవి సుమా ఇప్పుడు ఆ పత్రాలు? సెల్లులో సంక్షిప్త సందేశాలు..మెయిలులో మూడు ముక్కల శుభాకాంక్షలుగా మిగిలిపోయాయా!..ఓ రెండు మూడు సంవత్సరాల క్రితం వరకు కూడా నేను స్వయంగా చేసిన గ్రీటింగు కార్డ్సు బందుమితృలందరికి పంపించేదాన్ని..అదేంటో ఇప్పుడు ఫోనులో మూడు ముక్కల్లో చెప్పాలన్నా ఏదో మొక్కుబడిగా చెప్పటం అయిపోతుంది.
ఇక ఈ భాగ్యనగరానికి వచ్చాక..మొదట్లో ఓ నాలుగయిదు సంవత్సరాలు హుషారుగా పార్టీలకి వెళ్లాం..శిల్పారామాలు తిరిగాం కానీ..తరువాత తరువాత ఏ సంబరాలు లేకుండా ఇంట్లో టి.వి లకి అంకితం అయిపోతున్నాం. నేనయితే టి.వి. ముందు పడుకుని హాయిగా ఓ కునుకు తీసి పన్నెండింటికి ఎవరయినా లేపితే లేచి నిద్రమోహంతోనే అందరికి శుభాకాంక్షలు చెప్పేసి పడుకుంటాను!లేపకపోతే అదీ లేదు.
ఈ రోజు మా అమ్మాయి తన స్నేహితురాలి ఇంటికి కొత్తసంవత్సర వేడుకలకి వెళ్తుంటే తనలో అప్పటి నన్ను చూసుకుని మరో తరం సంబరాలు మొదలయ్యాయి అనుకుంటూ నా గతంలోకి జారుకున్నాను.
ఇక అందరూ తీర్మానించుకునే కొత్త సంవత్సర తీర్మానాలకి మాత్రం నేను ఆమడ దూరం..డిక్టేటర్సుకి తీర్మానాలు ఉండవు ఫర్మానాలే కాని!
వచ్చు కాలం కన్నా గత కాలం మిన్న అనిపిస్తుంటుంది నాకెప్పుడూ! కొన్ని సంవత్సరాలు మంచో చెడో మనస్సుల మీద చెరగని ముద్రలు వేసిపోతుంటాయి...అలాంటి వాటిల్లో ఈ 2009 కూడా ఒకటి. ఒకదాని వెనుక ఒకటి ప్రకృతి వైపరీత్యాలు...విషాద సంఘటనలు....వైషమ్యాలు....ప్రాంతీయ చిచ్చులు..ఆటవిక దాడులు...ప్చ్..వీటికి అంతం ఎక్కడో..అదుపు ఎన్నడో! రాబోయే సంవత్సరంలో అన్నా వీలయినంత ప్రశాంతంగా అందరి జీవితాలు సాగాలని కోరుకుంటూ!
13 వ్యాఖ్యలు:
మీకు, మీకుటుంబసభ్యులకూ నూతనసంవత్సర శుభాకాంక్షలు.
మీకు మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు!
మీకు కూడా నూతన సంవత్సర శుభాఖాంక్షలు
మీకూ మీ కుటుంబ సభ్యులకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
శుభాకాంక్షలు చివర్లో చెప్తా గానీ మంచి జ్ఞాపకాల టపా రాసినందుకు ముందు అభినందనలు అందుకోండి.రాత్రీ నేనూ అంతే! పన్నెండింటికి వీళ్ళిద్దరూ లేపితే శుభాకాంక్షలు చెప్పి మళ్ళీ నిద్ర పోయా!అసలు ఇంట్లో వాళ్లకి శుభాకాంక్షలు చెప్పడం ఎబ్బెట్టుగా ఉంటుంది నాకైతే! వాళ్ళకది హాపీ న్యూ ఇయరా కాదా అనేది మన చేతిలోనేగా ఉండేది?
తీర్మానాల విషయంలో మీ బాటే నాదీ! (నా టపా లోని వ్యంగ్యం గుర్తించే ఉంటారు).ఒక మంచి పని మొదలెట్టాలంటే జనవరి ఫస్టే కావాలా?
హడావుడీ, గోలా, కోలాహలం..ఇవన్నీ నాకంతగా నచ్చవు.అదీకాక భయంకరమైన అనుభవాల్ని రాష్ట్ర ప్రజలకు మిగిల్చిన 2009 ని తల్చుకుంటూ...దాని వికృత చేష్టలు ఇంకా సశేషంగానే ఉండటం వల్ల కొత్త ఏడాది వచ్చిందనే ఉత్సాహమే లేకుండా పోయింది.
ఎంతైనా గతకాలమే మేలు...నిజమే!
జ్ఞాపకాల చిట్టాని హృద్యంగా ప్రదర్సించటంలో మీకు మీరే సాటి వరూధిని గారు. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు
yup. We're the "been" generation :)
ఇహ ముందుతరం వాళ్ళదే!
మీకూ మీ కుటుంబ సభ్యులకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
మీకు నా నూతన సంవత్సర శుభాకాంక్షలు.
"డిక్టేటర్సుకి తీర్మానాలు ఉండవు ఫర్మానాలే కాని!" ఎంత అందంగా చెప్పారో కదా... అందుకోండి నూతన సంవత్సర శుభాకాంక్షలు..
సిరి సిరి మువ్వ గారూ !
May your New Year ( 2010 ) be full of Happiness and Sunshine
SRRao
sirakadambam
సిరిసిరిమువ్వ గారు, మీ జీవితంలో కాలక్రమేణా చోటు చేసుకున్న విధానాలు వివరంగా చెప్పారు. అవన్నీ కాలానుగుణంగా మార్పులు కదా? ఎప్పటి పోకడ అప్పటిదే. నేను గమనించింది అదే. మనం గడిపినట్లుగా మన అమ్మల టీన్స్ గడవలేదు, వారి వైవాహిక జీవితానుభవాలు, సరదాల కన్నా మనవి వేరు. మన తర్వాత తరం మనకన్నా వేరుగా గడుపుతున్నారు. మనం మన పద్దతిని ఎంజాయ్ చేసినట్లే ఇప్పటి వారు వారి బాణీ వారు. కొన్ని మనకీ వాళ్ళకీ కామన్ అభిరుచులు. ఉదాహరణకి ఈ బ్లాగులు. నేను గతాన్ని తలపోస్తూ, నేటిని గడిపి, రేపటికై చూసే మనిషిని. గత సం. రీకాప్ ఈ రోజు తలిచారు మీరు అలాగే కొందరు, ఈ సం. ఇంకేమి చేయొచ్చు అని తలపోస్తారు. దాని ఎక్స్టెటెష్ననే తీర్మానాలు. ఈరోజే ఎందుకు అంటే మనకి యేడాదికి ఒకరోజు పరీక్షలు పెట్టినట్లే, ఈ రోజు కాలెండర్ మారుతుంది కనుక ఆ క్రొత్త పేజీ తెచ్చే కొత్తందనం ఆ ఆలోచనలు. ప్రతి సం. జీడి మావిడి రాగానే పట్టే జీడావకాయ, మనం ఫ్రిడ్జ్లో దాచుకున్న ముక్కలతో ఎప్పుడంటే అప్పుడే పెట్టకోలేమా, కానీ తాజావి దొరికే వరకు ఆగుతాం. అలాగే ఇదీను. ఎవరితోనూ విబేధించటం కాదు నా అభిమతం - అదో తీరు అని చెప్పటం మాత్రమే. నేను,ఒక్కదాన్నీ పడుకుని పుస్తకం చదవటం నుండి పెద్ద సమూహంలో ఆటల పాటలతో గడపటం వరకు, ఎన్నో విధాలుగా నూతన సం. కి ఆహ్వానాలు పలికాను. అన్నిటినీ ఇష్టంగానే గడిపాను. ఒక విధంగా రీలివింగ్ అన్న పద్దతి నాకు నచ్చుతుంది. ఉత్సాహాన్నీ, ఉత్తేజాన్ని వీడని, స్ఫూర్తిని, సాధననీ విధానం నా పద్దతి.
మీకూ మీ కుటుంబ సభ్యులకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ఈనాటి ఆనందమయ మకర సంక్రాంతి
అందించాలి అందరి జీవితాలకు నవ్య క్రాంతి
*** మీకు, మీ కుటుంబానికి, మీ మిత్రులు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ***
SRRao
శిరాకదంబం
http://sirakadambam.blogspot.com/2010/01/blog-post_13.html
Post a Comment