ఇక చాలు ఆపండి.......
ఈ రోజు తెలంగాణా JAC కన్వీనరు కోదండరాం గారు ఇంటరు బోర్డుకి వెళ్ళి పరీక్షలు వాయిదా వేయమని కోరుతున్నారు! చేసిందంతా చేసి ఇప్పుడు వాయిదాకోరటమేమిటండి..అది జరిగే పని కాదని మీకు బాగా తెలుసు. బందుల పేరుతో విద్యార్థుల జీవితాల్ని ఇలా ఆడించే అధికారం మీకెవరిచ్చారు..ముందు అది చెప్పండి. ఒక రోజు...... రెండు రోజులు కాదు...వరుసగా రెండు నెలలనుండీ బందులే. కాలేజి పూర్తి సమయం జరిగిన రోజున అమ్మయ్య ఈ రోజు కాలేజి జరిగింది అని అనుకోవాల్సి వస్తుంది. ఈ రెండు నెలల్లో అలా అనుకున్న రోజులు వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. ఏ రోజు ఎవరు బందు చేస్తారో తెలియదు..ఎందుకు బందు చేస్తారో తెలియదు..కాలేజికెళ్ళి బందని పిల్లలు వెనక్కి తిరిగి రావటమే ఎక్కువగా ఉంటుంది..రోజూ వెళ్లటం రావటం..ఈ తిప్పలన్నీ ఎందుకు అని అసలు వాళ్లని కాలేజీలకి పంపని తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఈ వరుస బందుల వల్ల పిల్లల్లో చదువుపట్ల ఒక రకమయిన నిర్లిప్తత ప్రవేశించింది కూడాను!
సంక్రాంతి సెలవులు కూడా అయిపోయాయి ఇక కాస్త కాలేజి క్రమబద్ధంగా జరుగుతుంది అనుకునేటప్పటికి మరలా నిన్నా ఈ రోజు బందు. ఈ సమయంలో రెండు రోజుల బందు అవసరమా! ఇక ఈ అధికారక బందులతో పాటు అనధికార బందులు ఎన్నో. నవంబరు 28న మొదలయిన ఈ బందుల పర్వం నిరాటంకంగా సాగు...........తూనే ఉంది. చంద్రశేఖరరావు నవంబరు 29 న నిరాహార దీక్ష మొదలుపెడతారు అనగా ముందు రోజే అంటే నవంబరు 28న ఆ దీక్షకి మద్దుతుగా అని ఈ బందులు మొదలయ్యాయి. ఇక అప్పటినుండి ఒక రోజు తెలంగాణా JAC బందు..ఇంకొక రోజు రాజకీయ JAC బందు..మరో రోజు స్టూడెంటు JAC బందు..మరో రోజు మహిళా JAC బందు....ఇంకో రోజు SIF, మరు రోజు ABVP....ఎన్ని రకాల పేరులతో బందులు చెయ్యవచ్చో వీళ్ళదగ్గర నేర్చుకోవచ్చు..ఇకముందు వీళ్ళనెవరూ ఈ విషయంలో అధిగమించలేరు కూడా!
అసలు బందులు చేయటానికి వీళ్ళెంతగా అలవాటు పడిపోయారంటే ....బందు లేని రోజున వీళ్లకి నిద్రాహారాలు సహించవనుకుంటాను...మరుసటి రోజు ఏదో ఒక కారణం చెప్పి మరలా బందు షురూ...జనవరి 5 న తెలంగాణాపై డిల్లీలొ చర్చ జరిగిందా..దాని ముందు రోజు ఆ చర్చలకు మద్దతుగా ఇక్కడ బందు..ఇక జనవరి 5 నేమో..డిల్లీలో ఇంకా చర్చలు మొదలే అవ్వలేదు..ఇక్కడ ఉదయం పదిగంటలకల్లా కాలేజీలకు వచ్చేసి..బందు అని పిల్లలని వెళ్లగొట్టటం..ఏంటి ఈ బందులు..ఇవా బందులు?..చీ... రోతగా ఉందండి......ఇంకెన్నాళ్లు విద్యార్థుల భవిష్యత్తుని కాలరాచే ఈ బందులు.. నిజంగా మీరు ఆలోచన ఉన్నవాళ్లే అయితే..మీకు విద్యార్థుల పట్ల నిజమైన నిబద్దతతే ఉంటే..మీ రాజకీయ వైకుంఠపాళిలో విద్యార్థులని బలిచేయకండి...ఇక బందులు చాలు........ఆపండి.
కోదండరాం గారు మీరు స్వయానా ఆచార్యులు.......మీకు తెలుసు విద్యార్థులకి ఈ సమయం ఎంత ముఖ్యమో....దయచేసి వాళ్లకి బందులనుండి విముక్తి ప్రసాదించండి. మీరు ఇంటరు పరీక్షలు వాయిదా వెయ్యాలని కోరుతున్నారు..అవి వాయిదా వెయ్యటానికి కుదరదని మీకు బాగా తెలుసు...తెలిసీ అడగటం మీ రాజకీయంలో భాగమేమో మరి..తద్వారా మరో నాలుగు రోజులు బందు చెయ్యొచ్చన్న దురాలోచన కూడా అందులో ఇమిడి ఉందేమో!
ఇంటరు విద్యార్థులు ఒక్క ఇంటరు పరీక్షలే వ్రాయరు..రకరకాల పోటీ పరీక్షలకెళ్తారు. అవన్నీ ఏప్రియలు మొదటివారం తరువాత మొదలువుతాయి. IIT:...ఏప్రియల్ 11; AIEEE:...ఏప్రియలు 25; VIT:...ఏప్రియల్ 17...ఇవీ ప్రముఖ సంస్థలు నిర్వహించే పరీక్షా తేదీలు. ఇవి కాక KCET, BITS, GITAM వారి GAT......ఇలా దేశం మొత్తం జరిగే వివిధ రకరకాల పోటీ పరీక్షలు ఏప్రియలు, మే నెలల్లో జరుగుతాయి. వాటి తేదీలు కూడా ఎప్పుడో నిర్ణయించబడ్డాయి. వీటిల్లో కొన్ని ఆన్లైను పరీక్షలు.....ఒకసారి విద్యార్థి పరీక్ష తేది నిర్ణయించుకున్నాక మార్చుకునే అవకాశం ఉండదు. మనం ఇంటరు పరీక్షలు నిర్వహించినా నిర్వహించకపోయినా..ఆరు నూరయినా ఈ పరీక్షలల్లో ఏ ఒక్కటీ ఆగదు..వెనక్కి జరగదు. అంటే మార్చి చివరి వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటరు పరీక్షలు అయిపోవాలి. ఇప్పుడు ఇంటరు పరీక్షలు వాయిదా వేయటం ద్వారా పిల్లల మీద మరింత వత్తిడి పెంచటం తప్పితే ఉపయోగం ఉండదు. ప్రస్తుతం మీరు విద్యార్థులకి చెయ్యకలిగిన ఉపకారం ఏదయినా ఉంది అంటే అది ఇకనుండయినా ఈ బందుల దుష్టసాంప్రదాయం నుండి కాలేజీలకి మినహాయింపు ఇవ్వటం. JAC కన్వీనరుగా మీకు మా తల్లిదండ్రుల విజ్ఞపి ఇది.
కోదండరాం గారు ఇది విద్యార్థుల..మాలాంటి తల్లిదండ్రుల ఆవేదన మాత్రమే...ఇది అనేకానేక బందు బాధల్లో ఒక పార్శ్వం మాత్రమే! మీ బందుల వల్ల రోజు గడవటం దుర్భరమవుతున్న సామాన్య జనాలు కూడా ఉన్నారు..ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇకనుండి మీ ఉద్యమాన్ని బందురహితంగా సాగిస్తారని..సాగించాలని ఆశిస్తున్నాం....
12 వ్యాఖ్యలు:
అసలు "నిరసనలు ఇలా తెలియజేయాలి" అంటూ కొన్ని విధి విధానాలుంటే ఎంతైనా బాగుంటుంది. ఉదాహరణకి...
ఎవరైతే నిరసనలు తెలియజేయానుకుంటున్నారో వాళ్ళందరూ ఒక మైదానంలోచేరి వాళ్ళకారణాలతో, వాళ్ళ భావజాలాలతో మమేకం కాని కానివారికి ఎట్టివిధమైన ఇబ్బందులూ కలగని విధంగా నిరసన తెలియజేయగలిగితే బాగుంటుంది.
బలవంతంగా తమ భావజాలాని ఇతరులపై రుద్ది వాళ్ళని బందులకు బలవంతపెట్టేకన్నా వివరించి మద్దత్తును కూడగట్టుకోవాలి. అదేసమయంలో మన బందులు ఇతరులకు ప్రాణాంతకంగా పరిణమించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఎట్టిపరిస్థితులలోనూ ప్రభుత్వ సేవలకు ఆటంకం కలుగరాదు యెందుకంటే అదసలు ప్రజాస్వామికమే కాదు కాబట్టి.
ఇతరుల మద్దత్తుని వారి మనసులు గెలవడంద్వారా సంపాదించగలమేకానీ వాళ్ళని"బ్బందుల" పాలుచేయడం ద్వారా కాదు అని అందరూ గుర్తెరగాల్సి వుంది.
బాగా చెప్పారు
వీళ్ళకి ఎప్పుడు తెలిసి వస్తుందో
అప్పుడే ఏమైంది? పరీక్ష పేపర్లు పక్షపాతంతో దిద్దుతారట ఇదివరకటిలా వేరే ఏరియాలల్లో దిద్దిస్తే. ఈ మాటన్నది ఓ పెద్ద ప్రొఫెస్సరు గారు మరి. అలానే చేస్తే, మరీ అదే పక్షపాతంతో తమ ప్రాంతం వాడని ఇంకా ఎక్కువ మార్కులు వేస్తే? ఉద్యమం కాదుగానీ వీళ్ళ బుద్ధి పూర్తిగా బూజు పట్టుకుపోయింది.
మావాళ్ళు మావాళ్ళు అనుకునే వీళ్ళవాళ్ళే హాయిగా క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నప్పుడే తెలిసిపోయింది ఈ ఉద్యమాల వీరుల బలమెంతో?
మీరు ఏమైనా అనుకోండి మీరేమి అనుకుంటారు లే కాని అసహ్యం తో ఒళ్ళు గగుర్పొడుస్తోంది. వీళ్ళ గురించి మాట్లాడాలని కామెంటాలని కూడా అనిపించటం లేదు.
మా పిల్లల ఎక్జాంస్ మధ్యలో ఆగిపోయాయి. మళ్ళీ షెడ్యూల్ చేయాల్సి ఒస్తోంది. కాలేజ్ కొచ్చే పిల్లల సంఖ్య పూర్తిగా తగ్గిపోతోంది. తల్లితండృలు తెచ్చి ఒదలాల్సి ఒస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ బాధ వర్ణనా తీతం. మీరన్నట్లు ఏ రోజు కాలేజ్ జరుగుతుందో తెలియదు. మొన్ననే స్టూడెంట్ లీడర్ అజయ్ ఇంటర్వ్యూ టి.వి. లో చూశాను. వాళ్ళని రాజకీయనాయకులు ఈ ఊబిలోకి దింపారని, ముందు నాయకులను ఉరి తీస్తే కాని ఈ ఆత్మహత్య(హత్య) లు ఆగవని అన్నాడు. స్టూడెంట్స్ లో వివిధ పార్టీల మధ్య చాలా విభేధాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు వెనక్కి పోలేరట, ముందుకీ పోలేరట. విద్యార్ధుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న వీళ్ళని నాయకులని ఎలా అనాలి?
@Indian Minerva గారు, అలాంటి రోజు వస్తుందో రాదో తెలియదు కాని ప్రస్తుతం జనం బందులంటేనే అసహ్యించుకుంటున్నారు..పైకి చెప్పుకోలేని పరిస్థితి.
@జయభారత్ గారు, త్వరలోనే తెలిసి వస్తుందని ఆశిద్దాం.
@బ్లాగు వీరుడు గారు, బాగా చెప్పారు. చదువుకున్న వాళ్ళు...విశ్వవిద్యాలయ ప్రొఫెసర్సు కూడా అలా మాట్లాడుతుంటే నిజంగా మనం ఎక్కడున్నామా అనిపిస్తుంది. పిల్లలు ఆవేశపరులు..వాళ్లకి నచ్చచెప్పాల్సిన బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న వీళ్ళే ఇలా మాటలతో వైషమ్యాలు సృష్టిస్తుంటే ఇంకేం చెప్తామండి..
@భావన, నిజం మా బతుకుల మీద మాకే రోత కలుగుతుంది.
@జయ గారు, బందుల మూలాన ముఖ్యంగా నాశనమవుతుంది పిల్లల జీవితాలేనండి. పరిస్థితులు చక్కపడతాయని ఎప్పటికప్పుడు ఆశిస్తూ చూస్తూ కూర్చుందాం..అంతకన్నా మనం ఏమీ చెయ్యలేం!
Its the time to have a RULE to BAN BANDH. Police should arrest these kinda IDIOTS. Who the hell asked to do so called Bandh..? Bloody buggers, They dont have any work to do, on top of that they are spoiling others. These kindaa guys have to go under many punishments. Oh GOD, please punish them.
ఈ బంద్ లు గొడవలు అంటేనే విసుగు చిరాకు వేస్తుంది.
ఆనాడు తొందరపడి ఇతర రాష్ట్రాల్లో కలిపేసిన ఈ తెలుగు ప్రాంతాలు ఇవిః
ఒడిసా – గంజాం,బరంపురం,కోరాపుట్,పర్లాకిమిడి.
కర్నాటక – చిత్రదుర్గ,కోలార్,బళ్ళారి.
మహారాష్ట్ర – చంద్రపూర్,గచ్చిబోల్
చత్తీస్గడ్ – బీజాపూర్,బస్తర్,దంతెవాడ.
తమిళనాడు – హోసూరు,దేవనపల్లి,కృష్ణగిరి,డెంకణికోట.
పాండిచేరి -యానాం
సమైక్య ఆంధ్ర(ఆంధ్రప్రదేశ్)కే బీటలు పడుతుంటే,ఇక పై తెలుగు ప్రాంతాలతో కలిసిన మహా తెలుగునాడు(విశాలాంధ్ర)ఆవిర్భవిస్తుందా?
ఈ ఆవేదన అందరిదీ ....ఒకప్పుడు గర్వంగా చెప్పుకొనే హైదరాబాద్ లో ఇంత అభద్రతతో రోజులు వెళ్ళ దీయాల్సివస్తుందని అనుకోలేదు.
మీరు, మేము మరి కొందరు ఇలా అందరం గొంతు చించుకు అరిచినా వాళ్ళకి చీమ కుట్టదు.
రక్తం బొట్టు బొట్టు ఓడ్చి పిల్లలని చదివించుకుని రేపు వాళ్ళు తమకి ఆసరా అవుతారని ఎదురుచూసే తల్లి దండ్రులు ఎందరో.
అందరు పెట్టి పుట్టిన వాళ్ళు కారు కద.
ఈ ఉద్యమాలు చేసి విద్యార్ధుల వయస్సుని, ఆవేశాన్ని పావులుగా వాడుకునే వారి ఎవరి పిల్లలు ఇందులొ సమిధలు అవ్వటం లేదని నా ఖచ్చిత మైన భావన.
ఈ ఉద్యమకారులంతా ఇక్కడ ఉండి, ఇక్కడే జీవితాలని వెళ్ళదీసుకోవలసిన వారు.ఉద్యమకారుల చేత రెచ్చ గొట్టబడిన విద్యార్ధులు రేపు జీవితం లో ఎక్కడ స్థిరపడతారో, ఏమి అవుతారో తెలియదు. ఈ పోటీ ప్రపంచం లొ వారి అవకాశాలని నాశనం చేసే హక్కు వీళ్ళకి ఎవరు ఇచ్చారు?
చిన్న రాష్ట్రాలే చిదంబర రహస్యం
చిన్న రాష్ట్రాలే పటిష్ఠమైన ఆర్థిక పునాదికి కారణమవుతాయని కేంద్ర హోం మంత్రి చిదంబరం 2003లో వేకప్ టు ద కేస్ ఆఫ్ స్టేట్స్ శీర్షికన తాను రాసిన వ్యాసంలో స్పష్టం చేశారు. దానితోపాటు మరికొన్ని వ్యాసాలను సంకలనంగా చేసి ఏ వ్యూ ఫ్రమ్ ద అవుట్ సైడ్ పేరిట పుస్తకాన్ని ప్రచురించారు.
ఇంతకీ ఆ వ్యాసంలో ఆయన ఏమన్నారంటే.. చిన్న రాష్ట్రాల్లోని ప్రజలు ప్రతి విషయానికి ప్రభుత్వంపై ఆధారపడే అవసరం ఉండదని, మహారాష్ట్ర నుంచి గోవా విడిపోయిన తర్వాత 11 మంది సీఎంలు మారినా అక్కడ అభివృద్ధి ఏ మాత్రం నిలిచిపోలేదని వివరించారు. గతంలోనూ కేంద్ర మంత్రిగా పని చేసిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
సీఎంలు ఎంతమంది మారారన్నది ప్రధానం కాదని.. సక్రమమైన పనితీరుతోనే అభివృద్ధి సాధ్యమైందన్నారు. మహారాష్ట్ర మూడు రాష్ట్రాలుగా విడిపోవడం వల్లనే గుజరాత్, గోవా అభివృద్ధి చెందాయని.. గోవా, ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్, కేరళ, హర్యానా, పంజాబ్ అభివృద్ధిలో పెద్ద రాష్ట్రాలతో సమానంగా పోటీ పడుతున్నాయని చిదంబరం వివరించారు.
రాష్ట్రాల విభజన రాజకీయ నాయకుల ఇష్టారాజ్యంగా ఉండరాదని, విభజన విషయంలో ప్రత్యేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ప్రధానంగా రాష్ట్ర విస్తీర్ణం, జనాభా, భౌగోళిక పరిస్థితుల ఆధారంగానే విభజన ఉండాలని అభిప్రాయపడ్డారు.
అన్ని రాష్ట్రాలను విభజించాల్సిన అవసరం లేదని, జనాభాను ప్రాతిపదికగా తీసుకుని పరిశీలిస్తే.. మహారాష్ట్రలో 9.67 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో 7.57 కోట్ల జనాభా ఉందని, ఈ 2 రాష్ట్రాల నుంచి విదర్భ, తెలంగాణలను విభజించాల్సి ఉందన్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్‌లనూ మరోసారి విభజించాలని అభిప్రాయపడ్డారు.
మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్‌గఢ్, బీహార్ నుంచి జార్ఖండ్ విడిపోయినా.. అక్కడి ప్రభుత్వాల అధ్వాన పాలన కారణంగా సమస్యలు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. దేశంలో ఉన్న పేదల్లో 45 శాతం మంది ఈ మూడు రాష్ట్రాల్లోనే ఉన్నారని, ఇక్కడ వృద్ధిరేటు, తలసరి ఆదాయం తక్కువగా ఉన్నాయని వివరించారు. వెనకబడిన రాష్ట్రాల్లో మానవ వనరులు ఉన్నా ఇతర ప్రాంతాలకు తరలి వెళుతున్నాయని పేర్కొన్నారు. (ఆంధ్ర జ్యోతి౨.౨.౨౦౧౦)
Post a Comment