పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

May 12, 2010

వెంటాడే కథలు-ప్రళయకావేరి కథలు

కొన్ని పుస్తకాలు చదువుతూ ఉండగానే అసలు దాంట్లో కథ ఏంటో మర్చిపోతాం (ఉదాహరణ రంగనాయకమ్మ గారి జానకి విముక్తి..రెండు మూడు భాగాలు).. కొన్ని చదివాక కొన్ని రోజులు గుర్తుంటాయి..ఆ కొన్ని రోజుల తరువాత గుర్తు తెచ్చుకుంటే గుర్తుకొస్తాయి...కొన్ని ఆ పుస్తకం మరలా తెరిచి చూస్తే కాని గుర్తుకు రావు.....మరి కొన్ని ఉంటాయి చదివాక ఎన్ని రోజులయినా అందులో పాత్రలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి.....మన కళ్ళముందు కదలాడుతూ ఉంటాయి....ఇలాంటివి అరుదుగా వస్తుంటాయి..అలాంటి అరుదయిన వాటిలో ఓ అరుదయిన పుస్తకం ప్రళయకావేరి కథలు.  మనసు బాగోనప్పుడూ..బాగున్నప్పుడూ..ఎప్పుడయినా ఎక్కడయినా చదివించే కథలు ఈ ప్రళయ కావేరి కథలు.  ఈ కథల గురించి అల్లప్పుడెప్పుడో పుస్తకంలో వ్రాసాను..అది ఇప్పుడు నా బ్లాగులో పెడ్తున్నాను.

“అబయా! మనం మన పేరునన్నా మరిచిపోవచ్చుగాని అమ్మ పేరుని మటుకు మరువగూడదురా”

“మాయమ్మ పేరు నాకు గుర్తుండ్లా తాతా!”
“అమ్మంటే కన్నతల్లి మటుకే కాదురా. అమ్మంటే అమ్మబాస కూడా. అమ్మంటే అమ్మ నేల కూడా”

ఇవి ఓ తాతా మనవడి మధ్య జరిగిన మాటలు. అమ్మ బాసని, అమ్మ నేలనీ మరువకూడదన్న తాత మాటలు ఓ మనవడిని విడువక పట్టి నడుపుతుంటే ఆ తాత మాటల స్ఫూర్తితో ఆ మనవడు వ్రాసిన కథలే ఈ “ప్రళయకావేరి కథలు”. అచ్చమైన నెల్లూరు మాండలికంలో వ్రాసిన కథలు. ఆ మనవడి పేరు బక్కోడు. ఆ బక్కోడు ఎవరో కాదు ప్రవాసాంధ్ర రచయిత స.వెం.రమేష్‌.

రమేష్ గారు 2009 సంవత్సరానికి గాను తానా వారి గిడుగు రామమూర్తి స్మారక పురస్కారానికి ఎంపిక అయ్యారని తెలిసి ఆయన వ్రాసిన ప్రళయకావేరి కథలు గురించి ఓ నాలుగు మాటలు.

’ప్రళయకావేరి’-అసలు పేరే ఎంత అందంగా వుందో! నిజానికి ఈ కథలు చదివేదాకా ఈ పేరు గురించే నాకు తెలియదు. ఇది పులికాట్ సరస్సు అసలు పేరు.  ప్రళయకావేరి…..పులికాట్…..ఒకే సరస్సుకి ఎంత వైవిధ్యమైన పేర్లు. పులికాట్…..పేరులోనూ, ఊరులోనూ తనదనం లేని ఉప్పుకయ్య అంటాడు రచయిత ఒక చోట. ఇప్పుడసలు ప్రళయకావేరి అన్న పేరే లేదు. ఆ సరస్సులో  వున్న దీవుల గురించి, అ దీవులలోని పల్లెలు, ఆ పల్లెలోని జనాల గురించి వారి యాసలోనే చెప్పిన కథలు ఈ ప్రళయకావేరి కథలు. నిజానికి ఇవి కథలు కాదు-ఓ వ్యక్తి  జ్ఞాపకాలు, అందుకే ఆర్ద్రంగా వుంటాయి, మనస్సుని కదిలిస్తాయి. ఇవన్నీ ఆంధ్రజ్యోతి వారపత్రికలో కథలుగా వచ్చినప్పుడు అడపాదడపా చదువుతుండేదాన్ని. అప్పుడంతగా మనస్సుని కదలించలేదు కాని పుస్తకంగా చదువుతుంటే మాత్రం నాకు తెలియకుండానే నా కళ్లవెంట నీళ్లు వచ్చేవి. ఈ కథలు చదువుతుంటే మరో నామినినో ఖదీర్ బాబునో చదువుతున్నట్టు వుంటుంది. అభివృద్ధి పేరుతో ఎన్ని పల్లె బ్రతుకులు సమాధి అవుతున్నాయో కదా అనిపిస్తుంది. శ్రీహరికోట కూడా ఈ దీవులలో ఒక దీవే.

ఈ కథలను నేనెందుకు రాసానంటే అంటూ ముందుమాటగా రచయిత ఇలా చెప్తాడు.
“ఇది వరకు ఏడాదికొకసారి ఎండే ప్రళయకావేరి ఇప్పుడు ఏడాదికొకసారి ఎప్పుడన్నా అరుదుగా నిండుతోంది. ఇప్పుడు ప్రళయకావేట్లో అప్పటి జానపదాలు లేవు. తమద సంగటి, రొయ్య పులుసు లేవు.  ప్రళయకావేరి పుట్టుకను గురించి కథలు చెప్పేవారు లేరు. ఇదంతా, ఇవన్నీ కళ్లముందే ఒక్క బతుకులోనే, తటాలున, చటుక్కున మాయమై పోవడం, అంతరించిపోతున్న ఆ సరస్సు జీవనాన్ని చూస్తూ ఏమీచేయలేక, వూరుకోలేక నరకయాతన పడడం…ఆ భావాల్ని అక్షరాల్లో వ్రాయడం కష్టం. అయినా నా భావాలను నలుగురితో పంచుకోవాలనుకున్నాను, ఆ భావాలకు అక్షర రూపమే నా ప్రళయకావేరి కథలు”.

మొత్తం 21 కథలు. ప్రళయకావేరి, అందులో తాత గారి దీవయిన జల్లల దొరువు, దాని చుట్టూ ఉండే ఇతర దీవులు, అడవులు, అక్కడి ప్రజలు, పిట్టలు…వీటి చుట్టూనే అన్ని కథలు నడుస్తాయి. పల్లెల్లో వేసుకునే పొడుపు కథలు, బోగాతాలు, నాటకాలు,  సావాసగాళ్లు, అల్లరి ఆటలు, చిలిపి పనులు, భయాలు, అలకలు, ఉప్పు కయ్యలు, వలస పిట్టలు…ఇవే కథా వస్తువులు. శైలి, శిల్పం, కథనం, పాత్ర చిత్రణ–వీటి గురించే విశ్లేషించే అంత స్థాయి నాకు లేదు కాని ఇవి తప్పక చదవవలిసిన కథలు అని మాత్రం చెప్పగలను. దేనికదే ఓ ప్రత్యేకం.

రచయిత ఓ పిల్లవాడిగా మన ముందు నిలబడి తన స్వగతం చెప్తున్నట్లు వుంటుంది. ఆయన చెప్పే తీరు ఎలా వుంటుందంటే మనల్ని కూడా ఆయనతోపాటు ఆ ప్రళయకావేరి దీవులకి తీసుకెళ్లిపోతారు. అంతా మన కళ్లతో చూస్తున్నట్టే వుంటుంది. స్వచ్చమైన పల్లె జీవితాలు, అందులో వుండే సొగసు, కష్టాలు, అనుభూతులు, ఆప్యాయతలు, బంధాలు, అమాయకత్వం, దైన్యం, వలసలు, అంతరించిపోతున్న పల్లెలు మన కళ్లముందు కదలాడుతుంటాయి. మన వూరి గురించిన, మన బతుకు గురించిన జ్ఞాపకాలని ఇంత అందంగా అక్షరబద్దం చెయ్యొచ్చా అనిపిస్తుంది ఈ కథలు చదువుతుంటే (వింటుంటే)!

అసలు కొన్ని చోట్ల ప్రళయకావేరి గురించిన వర్ణనలు చదువుతుంటే అమ్మ బాసలో వర్ణనలు ఇంత  చక్కగా చెయ్యొచ్చా అన్నట్టు వుంటాయి. ఆ వర్ణన కూడా అతి సహజంగా వుంటుంది. ఎక్కడా తెచ్చిపెట్టుకున్న పదగాంభీర్యం వుండదు. మచ్చుకి కొన్ని:

“అబయా, నలగామూల దాటినాక, పెళయకావేరమ్మకు సక్కలగిలెక్కువ, మునేళ్లు అదిమిపెట్టి నడవండి. లేకపోతే గెబ్బిడు ఎంట్రకాయల్ని జవరాల్సి పడతాది”

సరస్సుకి సక్కలగిలి…ప్రకృతితో మమేకం అవటం అంటే ఇదేనేమో.

“ఉల్లంకి పిట్టలు వేలకు వేలు బార్లు కట్టి నిలబడి ఉన్నాయి. వాటి రెక్కల పసిమి చాయ, నీటి నీలి వన్నె, ఎండ బంగరు రంగు కలిసి ప్రళయ కావేరి కొత్త హొయలు పోతుంది”.
ఆ వర్ణాల కలయికని అలా కళ్ల ముందు ఊహించుకుంటే ఎంత బాగుందో కదా!

“సందకాడ సన్నజాజి పూసినట్టు సన్నంగా నవ్వినాడు ఆ పిలగాడు”
“అవ్వ నీలికోక మింద పచ్చపూల మాదిరిగా నాలుగు తట్టులా నీలాపు నీల్లతో నిండిన ప్రళయకావేట్లో పచ్చపచ్చని దీవులు ఉంటాయి”

ఇలాంటి వర్ణనలు ఎన్నెన్నో! చదివితే కాని వాటి రుచి తెలియదు!

దీవుల పేర్లు, అక్కడ దొరికే పండ్ల పేర్లు, వలస పిట్టల పేర్లు, వంటకాల పేర్లు, సావాసగాళ్ల పేర్లు(నేనయితే ఈ పేర్లకోసమే మళ్లీ మళ్లీ చదువుతుంటాను ఈ కథలు), అన్నిటిలో ఒక స్వచ్చత, ఒక లయ కనిపిస్తాయి.

“కాశెవ్వ బోగాతం” కథలో బోగాతం ఆడేటప్పుడు కాశెవ్వ చేసే రచ్చకి పగలపడి నవ్వేస్తాం. అలాగే “పాంచాలి పరాభవం” కథలో మునసామి పాంచాలి వేషంలో చేసే హంగామా చదివి తీరాల్సిందే. ఇక ఓ “ఎచ్చలకారి సుబ్బతాత”-ఇలాంటి వారు మనకి ప్రతి పల్లెలో కనిపిస్తుంటారు. తుమ్మ మొదుల్ని పట్టుకుని దొంగ అనుకుని బాదటం, “కత్తిరిగాలి” కథలో సుబ్బ తాత నారతాతని దొంగనుకుని పట్టుకుని కొట్టటం, దొంగను పట్టుకున్న హుషారులో పంచె ఊడిపోయింది కూడా పట్టించుకోని వైనం ఈ కథలు చదివేటప్పుడు పక్కన ఎవరూ లేకుండా చూసుకోండి మరి.

కాశవ్వ బాగోతాన్ని, సుబ్బయ్య తాత ఎచ్చలకారి తనాన్ని చదువుతుంటే వీళ్లెవరో మనకి తెలిసినవాళ్లలా ఉన్నారే అని అనిపిస్తే అది మన తప్పు కాదు.

“ఆడే వొయిసులో ఆడాల” అంటూ బక్కోడు వాళ్ల ఆటల గురించి, సావాసగాళ్ల గురించి, వాళ్లు తెచ్చుకున్న అప్పచ్చుల గురించి చెపుతుంటే మనకి కూడా ఒక్కసారి మన చిన్ననాటి స్నేహితాలు గుర్తుకొస్తాయి. ఆడుకోవటానికి వెళుతూ అమ్మకి తెలియకుండా ఒళ్లో వేసుకెళ్లిన వేరుశనగ కాయలు, బెల్లం, అటుకులు, జామ కాయల్లోకి ఉప్పూ కారాల పొట్లాలు గుర్తుకొస్తాయి.

మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా బాయిలోకి దూకి ఈత కొట్టారా, కొడితే మరి బాయిలోకి ఎన్ని రకాలుగా దూకగలరో చూయించగలరా! గెడ్డపార దూకుడంట, చిలక దూకుడంట, పిల్లేరిగొంతు దూకుడంట-నాకయితే ఈ దూకుళ్లన్నీ ఎవరైనా దూకి చూపిస్తే చూడాలని ఎంత కోరికగా వుందో!

పల్లెల్లో పిల్లల్ని అసలు పేర్లతో ఎవరూ పిలవరు. అసలు వాళ్ల అమ్మనాన్నలకే వాళ పేర్లు గుర్తుండవు. అన్నీ మారు పేర్లే, అవే అసలు పేర్లయి స్థిరపడిపోతాయి. మరి  మన బక్కోడి సావాసగాళ్ల పేర్లు ఏంటో తెలుసా…కత్తోడు, పొండోడు, దిబ్బోడు, పొప్పోడు, కర్రోడు, బర్రోడు, ముద్దలోడు, పెగ్గోడు…

బండి కట్టటం కూడా ఒక కళే అంటూ తన తాత బండి కట్టే విధానం గురించి “కొత్త సావాసగోడు” కథలో మనకి వినిపిస్తాడు. ఈ కథలోనే పల్లెల్లో మనుష్యులకి పశువులకి మద్య వుండే అనుబంధాన్ని స్పృశిస్తాడు.
“పద్దినాల సుట్టం”, “తెప్పతిరనాళ”, “దాపటెద్దు తోడు”, “ఆడపొడుసు సాంగెం”, “వొళ్లెరగని నిదర”…..ఇవి మనల్ని ఏడిపించే కథలు.

“పద్దినాల సుట్టం” కథలో తమకి అనుకోకుండా దొరికి ఓ పది రోజులు తమతో వున్న మిద్దోడు (వీళ్లు పెట్టుకున్న పేరే) అవ్వని కాపాడబోయి ఓ మైసూరు కోడె కొమ్ములకి బలవ్వటం ఆ వూరి వాళ్లందరినే కాదు మనల్నీ కంట తడి పెట్టిస్తుంది.

“తెప్పతిరనాళ” కథలో తన స్నేహితుడు లోలాకు తిరణాలలో తప్పిపోవటం గురించి చదువుతుంటే అది మన కళ్లముందే జరిగినట్టుంటుంది. అసలు లోలాక్కి ఆ పేరుందెకొచ్చిదో తెలుసా!
“మా లోలాక్కి కుడి చెవుకింద, చెంప మింద సొరగింజంత పులిపిర్లు రొండు యాలడతా వుంటాయి-దానికే వోడిని లోలాకని పిలిచేది”.
ఈ కథ చదివాక కొన్నాళ్లు నేను కూడా లోలాకు కోసం వెతికా! ఇప్పటికీ ఎవరికైనా చెంపమీద పులిపిరి వుంటే కాస్తంత ఆసక్తిగా గమనిస్తా, ఏమో లోలాకు కావచ్చేమో అన్న ఆలోచనతో! అంతగా ఈ కథలతో పాటు ఆ కథలలోని మనుషులతో కూడా మనం మమేకం అయిపోతాం, అదీ ఈ కథల గొప్పతనం. ఓ మంచి కథకి ఇంతకన్నా కావలసింది ఏముంది?

నాకు బాగా నచ్చిన కథలలో “ప్రవాళ ప్రయాణం” కథ ఒకటి. ఎక్కడా ఆపకుండా చదివించే కథ ఇది. వాగులు, వంకలు, సెలలు, మింటిని తాకే మానులు, మానుకి మానుకీ నడాన వుయ్యాల మాదిర అల్లిన తీగలు, అడవిపూల వాసనలు, కొత్త పిట్టల పాటలు, మింటకు యెగిరుండే కొండలు, జరులు దూకి దూకి నున్నంగా మారిన బండలు…సిద్దలయ్య కోన…చదువుతుంటే ఎవరో మనల్ని చేయిపట్టి నడిపిస్తూ ఆ ప్రాంతాలని చూపించుతున్నట్టే వుంటుంది.
“చిన్నాయిన పాడిన బిల్లంగోయి పాటకి చిట్టెదురు వనంలోని చెట్టు చెట్టూ తలూపతా తాళం యేసినాయి!”
ఇక్కడ మనకి తెలీకుండానే మనం కూడా తలుపుతూ తాళం వేస్తాం!
తెలుగు పల్లెల్లో పొడుపు కథలు తెలియని వారు ఉండరేమో. “పుబ్బ చినుకుల్లో” కథలో ఈ పొడుపు కథలు మనకి రుచి చూపిస్తాడు.

“అంబాలు, అంబాలి మీద కంబాలు, కంబాలు మింద కుడిత్తొట్టి, కుడిత్తొట్టిమింద ఆసుగోలు, ఆసుగోలు మింద యీసి గుండు, యీసి గుండు మింద అరిక చెత్త, అరిక చెత్తలో రేసుకుక్కలు”


సింగార తోటలో బంగారు పొండు పండె, దాన్ని సింగి తినె, సింగారి తినె, చెల్లో చేప తినె, మందలో పొట్టేలి తినె, యెగిరే పిట్ట తినె, పొదిగే కోడి తినె, చెన్నాపట్నం చిన్నదాని చెంప చెళ్లుమనె”

ఇవే కాదు వరస పొడుపు కథలు కూడా ఉన్నాయి.

ఇదే కథలో “సలికాలం సాయిబొయిన అమ్మ నేతకోక, వానాకాలం చిక్కంగా అల్లిన జమ్ముగూడ, యెండాకాలం సల్లని కానగమాను నీడ, యీటిల్లో ముడుక్కుని, ఒదిగి, వొళ్లిరుసుకోని బతుకు దేనికి? బొట్టికింద కలుగులోని పందికొక్కు బతుకే మేలు” అని అంటాడు…..నిజమే “దేనికి ఈ బతుకు” అనిపిస్తుంది మనకి కూడా.

అందరికీ వుగ తెలీని వొయిసులో దొరికే “అమ్మ పాల కమ్మదనం” నాకు పన్నిండేళ్ల వొయిసులో దొరికింది అని చెప్పుకుంటాడు ఓ కథలో. ఆ కథలోనే ప్రళయకావేరి అందాల గురించి ఆయన మాటలలోనే
“ఎండినప్పుడు సూడాల ప్రళయకావేరిని—ఎర్రటి యెండలో, మంచు పరిసినట్టు తెల్లంగా తళ తళ మెరుస్తుంటాది.  రేత్రిళ్లు తెల్లటి యెన్నిల వుప్పు మిందబడి యేడు వన్నెలతో తిరిగి పైకి లేచి పోతుంటాది”.
“అడివి నీడలు ప్రళయకావేరమ్మ కట్టుకున్న తెల్లకోకకి నల్లంచు మాదిరుండాయి”.

ప్రకృతికి మించిన చిత్రకారుడు ఉన్నాడా అనిపిస్తుంది ఈ వర్ణనలు చదువుతుంటే.


 తొలకరితో పాటు పొలం గట్లెమ్మట, పుట్లెమ్మట వచ్చే పుట్టకొక్కులు, చిత్తలో వచ్చే చెవుల పిల్లులు, ఇసుళ్లు, మిణకర బూసులు…వీటి గురించి తెలుసుకోవాలంటే “సందమామ యింట్లో సుట్టం” కథ చదవ్వలిసిందే.
“వసంతా చెవుల పిల్లులు యెట్ట బొయినాయి మే?”
“ఎరగం, సందమామ యింట్లో మా సుట్టముండాడు, చూసేసొస్తాము అంటే కట్టు ముళ్లు యిప్పినాము.  అమాసకాలం గదా, సందమామని యెతకతా యెట్నో పోయినట్టు వుండాయి”.

ఇక “అటకెక్కిన అలక”, “పరంటీది పెద్దోళ్లు”, “మంట యెలుతుర్లో మంచు”…కథల్లో పల్లెల్లో సహజంగా వుండే అలకలు, కోపాలు, ఉక్రోషాలు, తిట్లు, ఎచ్చులు, ఎత్తులు-పై ఎత్తులు కనిపిస్తాయి…..మంచి సరదాగా వుంటాయి ఈ కథలు.

ప్రళయకావేరి పేరే కాదు దానిలో కలిసే ఏరుల పేర్లు కూడా చాలా అందంగా వుంటాయి. అరుణ, కాళంగి, ప్రవాళం, సువర్ణముఖి…వీటికి సారె పెట్టటం అనే సంప్రదాయాన్ని “ఆడపడుసు సాంగెం” కథలో చెప్పుకొస్తాడు. ప్రళయకావేరి ఉగ్రరూపం దాలిస్తే ఎలా వుంటుందో కూడా చూపిస్తాడు ఈ కథలో. ప్రళయకావేరితో అక్కడి ప్రజల జీవితాలు ఎంతగా ముడిపడి ఉండేవో మనకి ఈ కథ చదివితే అర్థం అవుతుంది.

ఈ కథలన్నీ తాత చుట్టూ అల్లుకున్న కథలే. తాత ప్రస్తావన లేకుండా ఏ కథా లేదు. ప్రళయ కావేరి ఒళ్లోనే చనిపోవాలనుకున్న తాత అందుకోసం తన ప్రాణాలు కళ్లల్లో నిలుపుకొని ఆ ప్రళయ కావేరిలో కనుమూయటంతో ఈ కథలు కూడా ముగుస్తాయి, చదివే మన కళ్లలో కన్నీళ్లు మిగులుతాయి.

ఈ కథలన్నీ చదవటం అయ్యేటప్పటికి ఆ కథలలోని మనుషులు మనకు కూడా ఆత్మీయులయిపోతారు. అయ్యో వీళ్లంతా ఇప్పుడు ఎలా వున్నారో ఏమయిపోయారో అని మనసు భారం అవుతుంది.

మనస్సు ఇష్టపడ్డప్పుడే కాదు మనస్సు కష్టపడ్డప్పుడూ చదువుకోవాలనిపించే కథలు ఈ ప్రళయకావేరి కథలు.
***************************************************************************************************
ప్రళయకావేరి కథలు (Pralaya Kaveri kathalu)
-స.వెం.రమేశ్
ప్రచురణ: మీడియా హవుస్ పబ్లికేషన్సు
పేజీలు: 135
వెల: 50 రూపాయలు
ప్రతులకు:
మీడియా హవుస్ పబ్లికేషన్సు, విద్యానగరు, హైదరాబాదు
విశాలాంధ్ర బుక్ హవుస్
నవోదయ బుక్ హవుస్, కాచిగూడ, హైదరాబాదు

12 వ్యాఖ్యలు:

Ravi May 12, 2010 at 12:56 PM  

ఈ పుస్తకం ఎక్కడైనా ఆన్లైన్ లో కొనే వీలుందాండీ?

Hima bindu May 12, 2010 at 1:31 PM  

మీరు పరిచయం చేసిన విధం అద్భుతం ..నిజానికి ఈ కథల గురించి ఎంత చెప్పిన తక్కువే .వారం వారం ఆంధ్రజ్యోతి కోసం ఎదురు చూసేదాన్ని.మనవ సంభంధాలు గాని ఆత్మీయత తో పెనవేసుకుపోయిన తన ఊరు గురించి చెప్పడం లో రమేష్ గారికి ఎవరు సాటిరారండి,అంత చిక్కటి ప్రేమ కనిపిస్తుంది .రచయితా పాఠకుల్ని తన తో తీసుకెళ్ళి ప్రళయకావేరి పట్ల మనకి కూడా మక్కువ పెంచేస్తాడు .వాళ్ళ అవ్వ కోసం నేను వెక్కి వెక్కి ఏడ్చాను ,లోలాకు కోసం కనబడిన చోట్ల వెదికేసాను.రచయిత గొప్ప సంస్కర్త .తన భాష కోసం ఒక ఉద్యమం నడుపుతున్నారు ...ఆధునిక యుగం లో తెలుగు వెలుగు కోసం కృషి చేస్తున్న వ్యక్తి .
నాకో బలహీనత వుంది .....ఏదైనా నచ్చితే వారిని అభినందించకుండా ఉండలేను .కస్టపడి నడుస్తున్న చరిత్ర ఎడిటర్ రమేష్ గారి ద్వారా వారి పెర్సనల్ నంబర్ కనుక్కుని మాట్లాడాను ...లోలాకు జాడ ఏమైనా తెలిసిందా అని మొదటి ప్రశ్నగా అడిగాను .కథలన్నీ రచయితాఅనుభవం ,అనుభూతి నుండి వచ్చినవి అన్ని మనసుకి తడుతాయి .మరొక్కసారి మీకు అభినందనలు .

మధురవాణి May 12, 2010 at 5:21 PM  

చాలా బాగా చెప్పారు పుస్తకం గురించి. అయితే, తప్పక కొని చదవాల్సిన పుస్తకమన్నమాట!

@ రవిచంద్ర,
ఈ లింక్ చూడండి. AVKF లో కొనచ్చు.
http://www.avkf.org/BookLink/display_titled_book.php?book_id=945

సిరిసిరిమువ్వ May 12, 2010 at 5:29 PM  

రవిచంద్ర గారు, మదురవాణి గారు ఇచ్చిన లింకు చూడండి. అయినా మీరు ఉండేది హైదరాబాదేగా..ఓ సారి జై విశాలాంధ్ర అనండి.

చిన్ని గారు, ధన్యవాదాలు."లోలాకు కోసం కనబడిన చోట్ల వెదికేసాను"..మీరూ వెతికేసారా..నాలాంటి పిచ్చోళ్లు ఇంకా ఉన్నారన్నమాట!

మధురవాణి ఇవి తప్పక చదవ్వాల్సిన కథలండి..ఏమాత్రం వీలయినా చదవండి..మీ కళ్ళ వెంట నీళ్లు రాకపోతే నన్నడగండి :(

Vasuki May 12, 2010 at 6:30 PM  

ప్రళయకావేరి కథలు నేను చదివాను. ఆ భాష, యాస బాగుంటాయి. ఆ సరస్సు కూడా చూసాను. ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క వైవిధ్యం. అదియే ఆంధ్రదేశం.

శ్రీవాసుకి
srivasuki.wordpress.com

శేఖర్ పెద్దగోపు May 12, 2010 at 7:10 PM  

నాకు వీటి గురించి మొట్ట మొదట పరిచయం చేసింది మన 'హిమబిందువులు' చిన్నిగారు( పల్లేటి టపాలో కమెంట్ ద్వార )..ఆ తర్వాత మీరు పుస్తకం లో రాసిన రివ్యూ చదవమని లింక్ ఇచ్చారు..అలా పరిచయమయ్యింది ఈ పుస్తకం...అదే రివ్యూలో విరజాజి గారు నెట్లో చదవడానికి లింక్ కూడా ఇచ్చారు..మిత్రుల సౌలభ్యం కోసం ఇక్కడ ఇస్తున్నాను..
http://www.telugupeople.com/discussion/content.asp?contentID=22714&uid=20100512082649&Page=1

అయితే ఇవి నేను కొంచెం చదివాను..ఆ మాండలికం అర్ధం చేసుకోడానికి నాకు చాలా సమయం పట్టేది...బొత్తిగా ఆ ప్రాంత యాస తెలీకపోవటం వల్ల కాబోలు..ప్రతీ వాక్యాన్ని కష్టపడి అర్ధం చేసుకునేవాడిని...ఫీల్ రావడానికి నాకు చాలా సమయం పట్టేది...అందుకని మద్యలోనే ఆపేసాను...
అంత మంచి కధల సంపుటి పూర్తిగా చదవలేకపోయానే అన్న భాద మాత్రం ఇప్పటికీ ఉంది..:(

Sravya V May 12, 2010 at 7:36 PM  

పరిచయం చాలా బాగుందండి !

వేణూశ్రీకాంత్ May 14, 2010 at 5:14 PM  

ఇదివరకెపుడో ఒకసారి విన్నాను ఈ పుస్తకం గురించి కానీ కొనే అవకాశం చిక్కలేదు. చాలా బాగా పరిచయం చేశారు.

ప్రణీత స్వాతి May 19, 2010 at 3:14 PM  

అవునండీ..చాలా బాగుందని ఇదివరకెప్పుడో చిన్ని గారు, మురళి గారూ శేఖర్ గారి ఏటి గట్టు లో రాస్తే చదివి వెంటనే కొనుక్కోవాలనుకున్నాను. ఆ సంగతెలా వున్నా మీరు రాసిన పరిచయం మాత్రం అద్భుతమండీ.

Unknown May 27, 2010 at 10:12 AM  

సిరిసిరిమువ్వ గారూ...,

నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.

తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .

మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.

- హారం ప్రచారకులు.

మరువం ఉష June 17, 2010 at 8:30 AM  

ఎంత బాగా రాసారంటే మళ్ళీ చదవాలన్నంత బెమ పుట్టేలా..చిన్నీ మాదిరే నేనూ ఎదురుచూసేదాన్ని..మీర్రాసినట్లే లీనమైపోయి వాళ్ళందరినీ పక్కనే ఊహిస్తూ మరి చదివేదాన్ని.

శశి కళ November 22, 2012 at 7:08 PM  

యెంత చక్కగా వ్రాసారు.రచయితలూ మీలాంటి అభిమానులనే కోరుకుంటారు.కధ ఒక్కరికి గుర్తు ఉన్నా చాలు అనుకుంటారు

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP