పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

June 14, 2010

సపోటాల లక్ష్మి

మధ్యాహ్నం రెండిటప్పుడు మా తలుపు టకటకా మోగిందింటే అది సపోటాల లక్ష్మే అని అర్థం.  వచ్చిందంటే తీసుకునేదాకా ఊరుకోదు. ఒక్క సపోటాలే కాదు ఏ సీజనులో పళ్లు ఆ సీజన్లో తెస్తుంది..ఎక్కువగా మాత్రం సపోటాలే.  అవేమో మరీ గోళీకాయలలాగా ఉంటాయి..అందులో గడ్లు పోతే మనకు తినటానికి ఏమీ మిగలదు! వద్దు అంటే వినదు...ఒక డజనన్నా తీసుకోమ్మా అంటూ బ్రతిమాలుద్ది..నాకొద్దు..పిల్లలు తినటంలేదు..వెళ్ళులే అంటానా..ఊహు..ఊరుకోదు..పిల్లలు తినకపోతే ఏం నువ్వు తిను..చూడు ఎంత బక్కగా ఉన్నావో..మంచిగా పళ్ళు తినాల..అసలే పెద్ద జబ్బుపడి లేచావు (నేను జబ్బు పడి లేచి మూడు సంవత్సరాలు అయిపోతుంది..కాని అది నిన్నా మొన్నా అన్నట్టు మాట్లాడుతుంది).  నాకొద్దు తల్లీ అంటా ..ఇదుగో ఈ పాతిక తీసుకో..ఎంత మంచిగా ఉన్నాయో చూడు..అన్నీ పళ్ళే...ఒక్కటి తిని చూడు..ఇంకో యాభై ఈమంటావు..అంటూ ఓ పాతిక తీసి కింద పెడుతుంది..నాకొద్దన్నానా..తీసుకెళ్ళు అని నేను కాస్త కోపం ప్రదర్శిస్తా..ఊహూ...తీసుకెళ్లటానికేంటి పెట్టింది..నాకు డబ్బులియ్యొద్దులే..తిని చూసి రేపొస్తాగా అప్పుడు ఇద్దువులే అంటూ బుట్ట నెత్తిన పెట్టుకుంటుంది..ఇక డబ్బులు ఇవ్వక చస్తామా..అసలే బక్క ప్రాణం..రెండు అంతస్తులు ఎక్కి వచ్చింది పాపం అని డబ్బులిచ్చి నువ్వు పైకి రాకు..నాకవసరం అయితే నేనే పిలుస్తాగా అని చెప్పి పంపిస్తా..ఊహూ ..మూడోనాడు మళ్ళీ తయారవుద్ది.  ఈ మా అనుబంధం గత ఆరేడు సంవత్సరాలుగా ఇలా సాగుతూనే ఉంది.

 ఆ పళ్ళేమో మా పిల్లలు కన్నెత్తి అన్నా చూడరు..అది చెప్పినట్టు నేను తిన్నన్ని తిని మిగతావి పనమ్మాయికో...మా వాచుమాన్ వాళ్ల పిల్లలకో..అదీ కాకపోతే మా చెత్తబుట్టకో పెట్టేస్తుంటా! ఆ మధ్య కొన్నాళ్లు వాటితో మిల్కుషేకులు...మిశ్రమ రసాలు చెయ్యటం మొదలుపెట్టా..మా అమ్మాయి పాపం నేనేమి ఇచ్చినా మాట్లాడకుండా తాగుతుంది..మా అబ్బాయి మాత్రం..వాడి రుచిగ్రంధులు చాలా పదును..ఎలా పడతాడో తెలియదు..ఏంటి ఇలా జిగురుజిగురుగా ఉంది..సపోటా పళ్ళు వేసావా..ఇంకెప్పుడూ వెయ్యకు అని ఓ అల్టిమేటం జారీ చేసాడు..ఇక అదీ మానేసా. ఇలా లాభం లేదని గత కొంతకాలంగా మధ్యాహ్నం పూట తలుపు మోగితే తీయటం మానేసా (అది తప్ప ఇంకెవరూ ఆ టైములో తలుపు కొట్టరన్న ధీమా) . కొన్నాళ్ళు చూసి లక్ష్మి కూడా రావటం మానేసింది.  మొన్నొక రోజు రోడ్డు మీద కనిపించి ఏందమ్మా ..ఈ మధ్య ఎప్పుడొచ్చినా నిద్రపోతున్నావు..తలుపు తీయటంల  అంటు పరామర్శించింది..మరి ఎండాకాలం కదా అని ఏదో సర్దిచెప్పా!  నిన్న మాత్రం దానికి అడ్డంగా బుక్ అయిపోయా! అది వచ్చే టైముకి తలుపు తీసే ఉంది.  నన్ను చూడగానే బాగున్నామ్మా..ఇయాల పొద్దుటినుండి నువ్వే యాదికొస్తాండావు..అందుకే వచ్చా...అంటూ ముఖమంతా నవ్వుతూ పరామర్శించింది.  బాగానే ఉన్నా కాని పాప కూడా లేదు కాయలొద్దు అంటే వినదే! ఇదుగో నువ్వు నా దగ్గర కాయలు కొని ఎన్నాళ్ళవుతుంది..ఏడన్నా ఓ ఏడాది అయి ఉంటది..వద్దంటావేంది ఓ పది రూపాయలవి తీసుకో అంటూ పోట్లాడి మరీ ఓ పాతిక కాయలు పోసి పోయింది..ఇక డబ్బులియ్యక చస్తానా! ఏంటో దానికీ నాకూ మధ్య ఈ బంధం?

9 వ్యాఖ్యలు:

Ravi June 14, 2010 at 1:09 PM  

కొన్ని బంధాలంతే :-)

విశ్వ ప్రేమికుడు June 14, 2010 at 1:33 PM  

మాకో పాల రెడ్డెమ్మ ఉండేది చిన్నప్పుడు. ఆమె ఇంతే. అక్కడా ఇక్కడా పోసి చివరికి మా ఇంటికి వస్తుండేది. మిగిలనవి అన్నీ వద్దన్నా మాకు పోసి వెళుతుండేది. అప్పుడప్పుడూ అన్నం పెట్ట మనేది. లేదా కాస్త కాపీ పెట్టమ్మా. మీ ఇళ్లల్లో కాపీ బాగుంటదీ అనేది.

పాపం శ్రమ చేస్తోంది అని జాలితో అక్కడున్నన్నాళ్లూ అలాగే సాగించాం ఆ బంధాన్ని.

తృష్ణ June 14, 2010 at 2:52 PM  

మాక్కూడా చిన్నప్పుడు ఆకుకూరలమ్మే ముసలమ్మ ఉండేది. తలుపుకొట్టి "తీసుకో నానా.." అని బలవంతంగా ఇచ్చివెళ్ళేది. పాపం ముసలిది అమ్ముకుంటోంది అని ఆ అమ్మి వచ్చినన్నాళ్ళు అమ్మ కొంటూండేది.

నేస్తం June 14, 2010 at 3:08 PM  

ఏ జన్మలోనో బాకీ ఉండి ఉంటారు లెండి :) తీర్చేసుకుంటుంది :)

Sravya V June 14, 2010 at 5:53 PM  

హ హ బాగుంది మీ అనుభంధం ! సపోటా పళ్ళు తినాలంటే నాకూ అంత ఇష్టం ఉండదు కాని మిల్క్ షేక్ బాగుంటుంది కదా, అంతే జిహ్వ కో రుచి అని ఊరికే అన్నారా :)

పరిమళం June 14, 2010 at 9:49 PM  

ఎప్పుడు ఋణపడ్డారో ఏవిటో :) :)

sunita June 15, 2010 at 8:33 AM  

హ హ బాగుంది మీ అనుభంధం !

మాలా కుమార్ June 15, 2010 at 11:00 AM  

నిజమేకదా చాలా బక్కగా వుంటారు . మీరే మిల్క్ షేక్ చేసుకొని తాగండి . కాస్త కండ పడతారు . చెపితే వినాలి .

మరువం ఉష June 17, 2010 at 8:08 AM  

పిల్లల పెంపకం మీద ఓ లెక్చర్ ఇవ్వొచ్చని.. మా అబ్బాయ్ బంగారుకొండ - కొత్తిమీర జ్యూస్, దానిమ్మ ఆకుల వేపుడు, పొదీనాపొడి ఇలా ఎన్ని రకాల ప్రయోగాలు చేసినా కిమ్మనకుండా తాగే/తినేసే రకం. వాడికి మంత్రం "ఆరోగ్యానికి మంచిది." ఇక పిల్ల రాక్షసికి ఇలా హితోపదేశం పనిచేయదు. మూడు మామిడిపళ్ళ ముక్కలకి నాలుగు సార్లు అడిగించుకుని, తను బేక్ చేసుకున్న కుకీస్ తిననిస్తేనే దారికి వస్తది. కనుక తీవ్రంగా ఆలోచించి ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ మొదలెట్టాను.."నీకోసమె నే జీవించునది.." అని తెగ జీవించటం..అలా అలా తమిళ సినిమాల్లో కమెడియన్ లా అతిగా జీవించి కన్నీరు మున్నీరు అయిపోతే తనే ఓ గ్లాసునీళ్ళూ, టిష్యూ ఇచ్చి పక్కన కూర్చుని నన్ను సముదాయిస్తూ తినో/తాగో పడేస్తుందీ మధ్యన.. ప్రయత్నిమ్చి చూడరాదు మీరు కూడా?
పళ్ళమ్మి, కూరలమ్మి, మరమరాల అబ్బీ, ఇలా అంతా కాక నాకో మల్లెల సాయిబిలాగేనండి..నీ చెయ్ మంచిది.. బోణీ నీదే, మాల మంచిగుండకపొతే కుల్లా పూలు కొనమ్మ అంటూ గుమ్మం వదిలేవాడు కాదు. ఇది పదహారేళ్ళ క్రితం హైదరాబాదు నివాసం నాటి మాట.
నేను, లక్ష్మి, సపోట అని సినిమా తీయింఛేయండిక మరి! :)

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP