రండి రండి తరలి రండి రజతోత్సవ పుస్తక ప్రదర్శనకి .....
గత సంవత్సరపు తీపి గురుతులు మదిలో అలా అలా ఇంకా నిలిచి ఉండగానే హైదరాబాదు పుస్తక ప్రదర్శన మళ్లీ వచ్చేసింది. ఈ రోజు అంటే డిసెంబరు 16 నుండి డిసెంబరు 26 వరకు ఈ ప్రదర్శన ఉంటుంది. మిగతా పుస్తక ప్రియుల సంగతేమో కాని మన తెలుగు బ్లాగర్లకు మరియు e-తెలుగు సభ్యులకు మాత్రం ఇది నిజంగా ఓ పెద్ద పండగే! ఎప్పుడూ చూడని బ్లాగర్లని చూడవచ్చు....పరిచయం చేసుకోవచ్చు, కబుర్లాడుకోవచ్చు, మిరపకాయ బజ్జీలు తినవచ్చు..కాసేపు e-తెలుగు స్టాలులో నిలబడి ఎంతో మంది ప్రముఖులని కలుసుకోవచ్చు..వారితో మాటామంతీ ఆడవచ్చు..కొండొకచో వారితో బ్లాగులూ మొదలుపెట్టించవచ్చు!!
ఈ సంవత్సరం 250 అంగళ్లట! మరి అందరూ కొనాల్సిన పుస్తకాల చిట్టాతో తయారుగా ఉన్నారా !
అంతే కాదండోయ్ ఇది 25వ పుస్తక ప్రదర్శన. ఈ సందర్భంగా 19వ తేదీ అంటే వచ్చే ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు పుస్తక ప్రియులు చేసే పాదయాత్ర ఉంటుంది. పోయిన సంవత్సరం ఎక్కువగా మన e-తెలుగు సభ్యులు మరియు తెలుగు బ్లాగర్లే ఈ నడక కార్యక్రమంలో పాల్గొన్నారు, మరి ఈ సంవత్సరం కూడా e-తెలుగు సభ్యులు, తెలుగు బ్లాగర్లు మరింత ఉత్సాహంతో మరింతమంది ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుందాం.
అలాగే డిసెంబరు 26 అంటే ఆ పై ఆదివారం అన్ని రంగాలనుండి ఓ 25 మంది ప్రముఖులకు సన్మాన కార్యక్రమం ఉంటుంది.
ఎప్పటిలాగే e-తెలుగు వారు పెట్టే స్టాలుతో పాటు ఈ సారి ఇంకో కొత్త స్టాలు కూడా రాబోతుంది..అదీ మన తెలుగు బ్లాగర్లు పెట్టబోతుందే....మరి అదేంటో దాని కథాకమామిషూ ఏమిటో తెలియాలంటే మరి మీరూ పుస్తక ప్రదర్శనకు రావల్సిందే!
ఇంకొక విషయం అండోయ్.. ప్రముఖ బ్లాగరు మరియూ ప్రముఖ రచయిత్రి నిడదవోలు మాలతి గారు వ్రాసిన "చాతక పక్షులు" సీరియల్ దాదాపు బ్లాగర్లందరూ చదివే ఉంటారు..అది ఇప్పుడు ఎమెస్కో వాళ్ళు పుస్తకంగా తీసుకు వచ్చారు. అది కూడా పుస్తక ప్రదర్శనలో ఎమెస్కో వారి అంగటిలో లభ్యమవుతుంది..వెల 60 రూపాయలు మాత్రమే! మరి మీ కొనాల్సిన పుస్తకాల చిట్టాలో ఇంకో పుస్తకం జత చేసుకోవచ్చన్నమాట!
చివరగా ఓ విన్నపం....ఆసక్తి ఉన్నవాళ్ళు మీ విలువైన సమయాన్ని కొంత e-తెలుగు స్టాలులో వలంటీరుగా ఉండేందుకు వెచ్చించగలరేమో అలోచించండి!
తెలుగు పుస్తకాలు చదవండి, చదివించండి
3 వ్యాఖ్యలు:
అప్పుడే ఏడాది అయిపోయిందా అనిపిస్తుందండీ....ఈసారి రజతోత్సవ సంబరాలన్న మాట !
సిరిసిరిమువ్వ గారూ, నా నవల సూచించినందుకు ధన్యవాదాలు. ెలుగు బ్లాగు స్టాలుకి నా శుభాకాంక్షలు - మాలతి
సిరిసిరిమువ్వ, హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో చాతకపక్షులు పుస్తకం ప్రచురణ కర్తలు : ఎమెస్కొ వారి స్టాల్స్: 103, 228, 229 అని చెప్పేరు అనిల్.
Post a Comment