పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

December 6, 2010

ఇంటినుండి పని-ఎంత సౌఖ్యం

ఇంటినుండి పని (work from home)...ఈ మధ్య బాగా ప్రాచుర్యం పొందిన ఓ ఉద్యోగ అమరిక.  ఓ పదేళ్లముందు ఇలా ఇంటినుండి పని గురించి మనం కనీసం కల కూడా కని ఉండం. ఇంటి దగ్గర చెప్పుకునే ట్యూషన్సు, డాటా ఎంట్రీ వర్కులు..ఇలాంటి వాటి గురించి వదిలెయ్యండి.  ఖచ్చితంగా ఆఫీసుకే వెళ్ళి చెయ్యాల్సిన ఉద్యోగాన్ని మనం ఇప్పుడు ఇంటినుండే చెయ్యగలుగుతున్నాం.  సాంకేతిక అభివృద్ధి అనండి..మరోటి అనండి అసలు కనని కల ఇలా సాకారమై చాలామందికి ఎంతో సౌలభ్యంగా ఉంది.  ఎప్పుడో ఒక రోజు కాదు అస్సలు ఆఫీసు ముఖం చూడకుండా పని చేసెయ్యటం..నెల తిరిగేటప్పటికి మన డబ్బులు మన అకౌంటులో పడిపోవటం...ఎంత సౌలభ్యం!!

కానీ ఈ మధ్య కొంతమంది, ముఖ్యంగా ఆడవారు, ఈ ఇంటినుండి పని పట్ల విముఖత చూపిస్తున్నారని ఓ స్టడీలో వెల్లడయింది.  దానికి వారు చెప్పిన ప్రధాన కారణాలు
1. మేము సోషలు లైఫు మిస్సు అవుతున్నాం. ఇంట్లో నుండి పని చెయ్యటం వల్ల వ్యక్తిగతంగా మాకంటూ ఓ జీవితం లేకుండా అంతా మెకానికల్ అయిపోయింది అనిపిస్తుంది. ఇంట్లో కుటుంబసభ్యులతో చెప్పుకోలేని కొన్ని సమస్యలను ఆఫీసులో స్నేహితులతో చెప్పి ఊరట చెందేవాళ్లం.  ఇప్పుడు ఆ అవకాశం లేదు.  ఆఫీసులో జరిగే బాతాఖానీలు ...పార్టీలు..మనస్సుకి కాస్త రిలాక్సేషను ఇచ్చేవి.  ఇప్పుడు అవేవి లేవు.  ఇలాంటి వాటిని బాగా మిస్సు అవుతున్నాం.

2. పిల్లలతో మిగతా కుటుంబసభ్యులతో సమయం గడపగలుగుతున్నాం కానీ...దాని మూలాన మా మీద మామూలు కన్నా వత్తిడి ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇంట్లోనే ఉంటున్నాం కదా అని అందరూ మా మీద మరీ ఎక్కువగా ఆధారపడుతున్నారేమో అనిపిస్తుంది.  ఇంతకుముందు ఆఫీసుకి వెళ్లేటప్పుడు నాకు పనిలో సహాయం చేసినా చెయ్యకపోయినా ఎవరి పనులు వాళ్లు చేసుకునే వాళ్లు.  కానీ ఇప్పుడు అన్నిటికి నా మీదే ఆధారపడుతున్నారు.  అన్నీ ఎదురెదురు అందివ్వాల్సి వస్తుంది .  ఈ వత్తిడి నా ఉద్యోగ విధుల మీద కూడా ప్రభావం చూపిస్తుంది.

3. ఇక అనుకోకుండా వచ్చే అతిధులతో వచ్చే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.
వీటన్నిటితో  మా పని మేము ఇదివరకటి అంత శ్రద్దగా...అంకితభవంతో చెయ్యలేకపోతున్నాం.  వృత్తి జీవితంలో అనుకున్నంత ముందుకు కూడా వెళ్లలేకపోతున్నాం..కొన్నిటిని వదులుకోవాల్సి వస్తుంది.

ఈ ఇంటినుండి పని తప్పక చెయ్యటమే కానీ మాకు నచ్చి చెయ్యటం కాదు.  కొన్ని సౌలభ్యాలు కూడా ఉన్నాయి కానీ మాకు కలిగే అసంతృప్తితో పోల్చుకుంటే ఆఫీసుకెళ్లి పనిచేసుకోవటమే ఉత్తమం అనిపిస్తుంది.  పిల్లలు పెద్దవ్వగానే మరలా ఆఫీసునుండే పని చేస్తాం.......ఇవీ స్థూలంగా వాళ్లు చెప్పిన కారణాలు.

నేనూ గత ఐదు సంవత్సరాలుగా ఇంటినుండే పని చేస్తున్నా కానీ నాకు ఇలా అనిపించలేదు..కొన్ని అనిపించినా అవి మనం ప్లాన్ చేసుకోవటంలో మిగతా కుటుంబసభ్యులకి అర్థం అయ్యేటట్లు చెప్పుకోవటంలో ఉంటుంది .  కొన్ని అసౌకర్యాలు ఉన్నా నాకు ఇంటినుండి పనే సౌఖ్యంగా ఉంది. దేంట్లో అయినా కొంత మంచి..కొంత చెడూ ఉంటాయి.

ఆఫీసు టైముకి ఓ రెండు మూడు గంటలు ముందు బయలుదేరి మన నగర ట్రాఫిక్కులో ఈదుకుంటూ  ఆఫీసు చేరి..సాయంత్రం ఆఫీసు అయ్యాక ఓ రెండు మూడు గంటలకి ఉసూరుమంటూ ఇల్లు చేరటం..మళ్లీ ఇంట్లో పనులు..బాధ్యతలు.... దీనికన్నా హాయిగా ఇంట్లో ఉండి పనిచేసుకోవటంలో ఎంత ఆనందం ఉందో కదా! ఈ ఆనందం ముందు ఆఫీసుకి వెళ్తే వచ్చే ఎన్ని ఆనందాలయినా దిగదుడుపే!!

మనం పని చేసేది అమెరికా కంపెనీలకి..మరి వాటిల్లో మన పండగలకి పబ్బాలకి సెలవులుండవు...ఆ రోజుల్లో హడావుడిగా ఎనిమిదింటికల్లా అన్ని పనులు (ఆ రోజు పనమ్మాయి రాకపోతే అ పని కూడా) చేసుకుని ఆఫీసుకి
పరిగెత్తిన రోజులు ఎన్నో!! అదీ ఆఫీసు ఇంటికి దగ్గర కాబట్టి ఆఫీసు టైముకి ఇంటి దగ్గర బయలుదేరితే సరిపోయేది..అదే దూరం అయితే..అవన్నీ తలుచుకుంటే నాకయితే బాబోయ్ మళ్లీ ఆఫీసు గడపా తొక్కటమా అనిపిస్తుంది.

పిల్లలకి ఆరోగ్యం బాగోని రోజుల్లో అయితే ఇంకా నరకం.  సెలవు పెట్టినా..ఆఫీసునుండి ఫోన్లు..మేడం ఒక్క గంట వచ్చి వెళ్లండి..మీరు చేసే డాక్టరు ఒకరి డిక్టేషను బాగా ఎక్కువ వచ్చింది మీరు కొన్ని ఫైల్సు అయినా చేసి వెళ్లండి..ఒక్క గంట వచ్చివెళ్లండి ప్లీజ్ అంటూ అభ్యర్థనలు.......కాదనలేం.. వెళ్లాలేం.  ఇప్పుడయితే వాళ్ల పక్కన కూర్చుని వాళ్లని చూసుకుంటూ నా పని నేను చేసుకోవచ్చు.

ఒక్కోరోజు మన పని మనం పూర్తిచేసుకుని ఇక బయలుదేరదామనుకుంటుండగా..మేడం....ఈ ఫైలు ఇప్పుడే లేటుగా  వచ్చింది..TAT ఫైలు.  MT లందరూ వెళ్ళిపోయారు.మీరే ట్రాన్స్క్రిప్షనూ..ప్రూఫింగ్ చేసి అప్లోడ్ చెయ్యండి..ప్లీజ్ 2 నిమిషాల ఫైలే..అంటూ అభ్యర్థనలు..కాదనలేం కదా! ఆ రెండు నిమిషాల ఫైలు ట్రాన్స్క్రైబ్ చేసి.... ప్రూఫింగ్ చేసి అప్లోడ్ చెయ్యాలంటే కనీసం అరగంట పడుతుంది.  అదే ఇంట్లోనుండి అయితే మన పని అవ్వగానే టప్పున లాగ్ అవుట్ అయిపోతే ఇక మనకి వాళ్లకి సంబంధం ఉండదు :)

ఎప్పుడయినా అవసరానికి అర రోజు సెలవు పెడతామా..పేరుకే అర రోజు..పావు రోజు అవ్వగానే ఫోన్లు మొదలవుతాయి..మేడం ఎన్నింటికి వస్తారు..వస్తున్నారు కదా అంటూ..అనవసరంగా అర రోజు సెలవు పెట్టామే అనిపిస్తుంది.  పాపం వాళ్ల తప్పు కూడా ఏమీ లేదులేండి.  మా పనే అలాంటిది.  ఏ రోజు వర్కు ఆ రోజు అయిపోవాలి.  పెండింగు పెట్టటానికి ఉండదు.

ఓ రోజు ఊరెళ్లి వస్తున్నాను.  ట్రెయిను లేటు..ట్రెయిను దిగి ఆటొలో ఇంటికి వస్తుండగా ఆఫీసు నుండు ఫోను..మాడం మీరెక్కడున్నారు అంటూ..దారిలో ఉన్నా ఇంటికెళ్ళి ఓ గంటలో వస్తా అంటూ ఉండగానే..మాడం..మాడం..డైరెక్టుగా ఆఫీసుకు వచ్చేయకూడదూ కొన్ని కెనడీ ఫైల్సు ఉన్నాయి ..TAT ఫైల్సు...నేను మీరు వచ్చేటప్పటికి టిఫిను తెప్పిస్తాను.....వాటి వరకు చేసి ఇంటికెళ్ళి ఫ్రెష్ అయ్యి వద్దురు అంటూ....వ్వావ్వా...ఇలాంటి కష్టాలు చాలా ఉంటాయిలేండి!

అన్ని ఉద్యోగాలకి ఈ సౌలభ్యం ఉండకపోవచ్చు కానీ ఉన్నవాళ్లయినా వినియోగించుకుంటే బాగుంటుంది. కాకపోతే సర్వసన్నద్దమై ఇంటినుండి పని మొదలుపెడితేనే ఉపయోగం.   సిస్టం..దానిలో మన పనికి అవసరమయిన సాఫ్టువేరులు.....బ్రాడుబ్యాండు కనక్షను....పవర్ ప్రాబ్లం లేకుండా బ్యాకప్......ఇలా అవసరమయినవన్నీ సిద్దం చేసుకోవాలి కాబట్టి మొదట్లో కొద్దిగా డబ్బులు పెట్టుబడి కూడా పెట్టాల్సి ఉంటుంది.

ఇక ఇంట్లో నుండి పని చేస్తే ఉండే అసలు లాభం ఏంటో చెప్పనా....
ఆఫీసుకి వెళ్తే కట్టిన చీర కట్టకుండా కట్టుకెళ్లాలా:)  ఆదివారం వచ్చిందంటే వీటన్నిటికీ గంజి....ఇస్త్రీలు..అదో పేద్ద పని!! ఆ చీరలకి మరి మ్యాచింగు బ్యాగులు....చెప్పులు....క్లిప్పులు...పిన్నులు...అబ్బో చాలా మెయెంటెయిను చెయ్యాలి......ఇప్పుడు అవన్నీ మిగులే:)))

ఇక దీనిలో ఉండే కష్టాల గురించి మరోసారి .........

13 వ్యాఖ్యలు:

Anonymous,  December 6, 2010 at 1:28 PM  

మొత్తానికి చాలా సుఖపడిపోతున్నారన్నమాట.
భవిష్యత్తులో పిల్లలు ఇంటినుండే చదువుకొనే రోజులొస్తాయంటారా ! ( రావాలని నా కల )
పొద్దున్నే ఇంత వండి బాక్సుల్లో పడేసి, బస్సుల్లోనూ, రిక్షాల్లోనూ, వాళ్ళను కూరేసి , ఎంతెంత దూరమో తోలేస్తున్నాం కదా పాపం .

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी December 6, 2010 at 3:06 PM  

లలిత గారూ! భలే చెప్పారండి. దేవతలెవరైనా వెంటనే తథాస్తు అనాలి అని నేను కోరుకుంటున్నాను.

జయ December 6, 2010 at 5:49 PM  

ఈ పద్ధతి బాగుంది. కానీ మీరు చెప్పినట్లు కొందరికి మాత్రమే వీలౌతుంది. ఇకపోతే అన్ని రకాల ఉద్యోగాలకు అసలే వీలవదు. ముందు ముందు ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండి పోతే ఎలా ఉంటుందో. చాలా గమ్మత్తుగా ఉంటుంది కదూ. మన బ్లాగుల్లాగానే, ఫ్రెండ్షిప్ ఉంటుంది కాని ఎవరి మొఖాలు ఎవరికీ తెలియవు:)
లలిత గారు పర్లేదులెండి. ఆన్ లైన్ చదువులొచ్చేసాయి.

కొత్త పాళీ December 6, 2010 at 6:31 PM  

సిసిము గారు, చాలా బాగా రాశారు.
ఈ పద్ధతి అందరికీ అన్ని ఉద్యోగాల్లోనూ అనువయ్యే పద్ధతి కానే కాదు. నేను అమెరికాలో చేసిన మొదటి ఉద్యోగంలో నా బాసిణి (లేడిబాస్) ఇంటినించీ పిల్లలనించీ తప్పించుకోడానికే ఆఫీసుకి వస్తున్నా అని మొహమాటం లేకుండా చెప్పేది.
లలిత, ఇంటినించే చదువులు ఆల్రెడీ వచ్చేశాయండి చాలా రంగాల్లో

సిరిసిరిమువ్వ December 6, 2010 at 7:42 PM  

లలిత గారు, ఆ బాగానే సుఖపడుతున్నా. ప్రస్తుతానికి మా పిల్లలు కూడా బాగానే సుఖపడుతున్నారు. వాళ్లు స్కూల్లో ఉండగా మొదటి రెండు సంవత్సరాలు స్కూలు పక్కనే ఇల్లు తీసుకున్నాం..ఎంత పక్కనంటే..స్కూల్లో మొదటి బెల్లు కొట్టినాక ఇంటినుండి బయలుదేరి వెళ్లేంత! తరువాత మా స్వంత ఇంటికి వచ్చాక కూడా ఓ ఐదు నిమిషాల నడక అంతే. ఇక కాలేజి..ఐదు నిమిషాలు బండి మీద..మా అమ్మాయి ప్రస్తుతం ఇంజనీరింగు కాలేజీనే కొంచం దూరం (మా దృష్టిలొ)..ఓ అరగంట బస్సులో. మా అబ్బాయి ప్రస్తుతం ఇంటరు రెండవ సంవత్సరం..లేకపోతే మా అమ్మాయి కాలేజి పక్కనే ఇల్లు తీసుకొనేవాళ్లం:))ఇప్పటి పిల్లల్లా వాళ్ల మీద విపరీతమయిన ఒత్తిడి...మా ఆకాంక్షలు ఆశలు వాళ్ల మీద రుద్దటం అలాంటేవి ఉండవు..వాళ్ళ ఇష్టంతో వాళ్లు చదువుకోవటమే. మా అబ్బాయి ఏడింటికి కాలేజి అంటే పది నిముషాల తక్కువ ఏడింటికి నిద్ర లేస్తాడు:) ఈ పొద్దున్నే లేవటం విషయంలో అప్పుడప్పుడు మా వారికి వినపడకుండా వాడిని చివాట్లేస్తూ ఉంటాను. వినపడితే ఇంకేం లేదు..నాకు అక్కడిక్కడే క్లాస్ అయిపోద్ది..ఏంటి పొద్దున పొద్దున్నే వాడిని సతాయిస్తున్నావు అంటూ! అంత స్వేచ్చ మా పిల్లలకి.

సిరిసిరిమువ్వ December 6, 2010 at 7:52 PM  

మందాకిని గారు, దేవతలు అని ఎప్పుడో తథాస్తు అనేసారండి..మనమే కొంచం టెక్నాలజీని వినియోగించుకోవాలి.

జయ గారు, నిజమేనండి అన్ని ఉద్యోగాలకి ఈ విధానం వీలవదు. నాకు మా ఇప్పటి ఆఫీసులో ముఖాముఖీ ఓ నలుగురయిదుగురు తెలుసు అంతే. బ్లాగుల్లో లాగానే రోజూ అందరితో మాట్లాడుతూ ఉంటాము..వాళ్ల పుట్టిన రోజులకి శుభాకాంక్షలు తెలుపుతుంటాము..కానీ మనుషులు తెలియదు.

కొత్తపాళీ గారు, నిజమేనండి..ఇంటికంటే ఆఫీసు పదిలమనుకునే వాళ్లే ఎక్కువ. అవకాశం ఉండి కూడా నా సహోద్యోగులు చాలా మంది ఆఫీసుకే వెళుతుంటారు.

lalithag December 6, 2010 at 8:23 PM  

చాలా రోజుల తర్వాత రాశారు :)

ముందుగా, పిల్లల విషయంలో బయటికి వెళ్ళి చదువుకోవడానికే నా వోటు.
బడి ఇంటికి దగ్గర ఉండడమే బావుంటుంది, నిజం.
నేను బయటికి వెళ్ళడం కోసమే చిన్న ఉద్యోగంలో చేరాను.
ఇంట్లోనే పని అన్నది కొంతమందికి సరిపడుతుంది, మా వారిలాగా. ఎంచక్కా ఇష్టమున్నంత సేపూ (దీర్ఘం గమనించగలరు) పని చేసుకోవచ్చు :)

వాతావరణ విపరీతాలలో బయటకి వెళ్ళక్కర్లేకపోవడం ఒక వెసులుబాటు.

చిన్న పిల్లల తల్లులు ఇంట్లోంచి పని చెయ్యడం కన్నా మంచి సంరక్షకులతో పిల్లలను ఉంచి బయటకి వెళ్ళి ఉద్యోగం చెయ్యడంలోనే వత్తిడి తక్కువేమో అనిపిస్తుంటుంది నాకైతే.

అది సరే, అంతర్జాలంలోనే ఆత్మీయత ఎక్కువ కనిపిస్తోంది అని వినిపిస్తోంది బ్లాగ్లోకంలో ఈ మధ్య.
ఇక్కడ కలిగిన స్నేహాలకి గౌరవం పెరగడం ఆనంద దాయకమే. కానీ... మనిషిని మొత్తంగా face చెయ్యగలగడం నుంచి తప్పించుకుంటున్నామా?

అక్కర్లేని అనుమానాలు, అదనపు విశ్లేషణలు నా వైపునుంచీ మీ లాంటి వారికి ఈ పాటికే అలవాటైపోయుంటాయి.

అందుకని ఒక మంచి మాటతో ముగిస్తా.
Theodore Roosevelt మాటల్లో, Do what you can, with what you have, where you are.

:)

వేణూశ్రీకాంత్ December 6, 2010 at 9:14 PM  

బాగా రాసారండి. నాకు కూడా ఇంటినుండి పని చాలా ఇష్టం ముఖ్యంగా నాకు నచ్చిన ఆహర్యంలో నచ్చినరీతిగా కూర్చుని మంచి మ్యూజిక్ వింటూ పని చేసుకోవచ్చు అని. కానీ మీరన్నట్లు ఇంటివాతావరణాన్ని బట్టి ఈ సౌలభ్యం ఎంతవరకు ఉపయోగించుకోగలమో అంచనా వేసుకోవాలి.

యశోదకృష్ణ December 7, 2010 at 10:51 AM  

అన్నింటికి న్యాయం చేయాలనే మన ఆడవాళ్ళ ఆరాటం ఎంత technology వచ్హినా సరిపోదు.

మురళి December 8, 2010 at 8:41 PM  

ఎన్నాళ్ళకెన్నాళ్ళకెన్నాళ్ళకు.... బాగుందండీ టపా.. తర్వాతి టపా ఎలా ఉంటుందో అని ఆలోచన చేస్తున్నా :-) :-)

Sravya V December 8, 2010 at 9:03 PM  

బాగా రాసారండి ! కాకాపోతే మొత్తానికి "ఇంటినుండి పని" అనేది మాత్రం కొద్ది గా కష్టమేనోమో :) మరీ ముఖ్యం గా చాలా సెల్ఫ్ డెసిప్లిన్ ఉండాలి . పైగా నలుగురితో కలిసి పనిచేసేటప్పుడు మన నైపుణ్యాన్ని పెంచుకొనే అవకాశం ఎక్కువనుకుంటా

సిరిసిరిమువ్వ December 9, 2010 at 9:32 AM  

లలిత గారు, ఏంటో ఈ మధ్య నాకూ ఓ బ్లాగు ఉందన్న సంగతే మర్చిపోతున్నా:)
మీ విశ్లేషణలు నాకు బాగా నచ్చుతాయి. మీరేమో బ్లాగు మూసేసి మాకు అవి వినే అవకాశం లేకుండా చేసారు..కనీసం ఇలా అన్నా అప్పుడప్పుడు మీ విశ్లేషణలు వినిపిస్తుండండి.
"Do what you can, with what you have, where you are"..yes I totally agree.

సిరిసిరిమువ్వ December 9, 2010 at 9:57 AM  

వేణూ, అమ్మయ్య ఇప్పటికి మీరొక్కరే నాకు మద్దతు పలికింది. "నాకు నచ్చిన ఆహర్యంలో నచ్చినరీతిగా కూర్చుని" నిజమండి ఈ విషయంలో ఎంత హాయో!

గీత యశస్వి గారూ, నిజమేనండి అన్నిటికి అందరికి న్యాయం చెయ్యాలనుకుంటూ మనకు మనం చాలా సార్లు అన్యాయం చేసుకుంటూ ఉంటాం.

మురళి గారు, ధన్యవాదాలు. "తర్వాతి టపా ఎలా ఉంటుందో అని ఆలోచన చేస్తున్నా"..బాబ్బాబు, ఆ ఆలోచన ఏదో తట్టగానే..నా చెవినా వేద్దురూ:))

శ్రావ్య గారు, ధన్యవాదాలు."నలుగురితో కలిసి పనిచేసేటప్పుడు మన నైపుణ్యాన్ని పెంచుకొనే అవకాశం ఎక్కువనుకుంటా"..అవునండి. అంతే కాదు ఇట్లో నుండి చేసేటప్పుడు ఏ చిన్న సందేహం వచ్చినా మనకు మనమే కిందా మీదా పడి దాన్ని పరిష్కరించుకోవాలి..అదే ఆఫీసులో అయితే ఎన్ని చేతులో మనకు సహాయం చెయ్యటానికి. కానీ కొన్ని కావాలంటే కొన్ని కోల్పోక తప్పదు కదండి!

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP